ఆదిరాజు భాస్కర మూర్తి ,మంచం పట్టి, శల్యావశిష్టుడయ్యాడు.అతనికి శ్రీనివాసున్ని చూడాలని అనిపించింది.కాని కావాలని దూరం చేసుకొన్నఆ కుర్రవానిని,ఎలా పిలిచి రప్పించ గలడు. చిత్రమేమో గాని అతని మందులు అతనికే పని చెయ్యడం లేదు.మందులు కూడా గ్రహ గతుల ననుసరించే పని చేస్తాయమో !
అతని మనసులో ఆలోచనలని చదివాడేమో అన్నట్లు, శ్రీనివాసుడు వచ్చి, మంచం పట్టిన గురువు గారిని చూసి, కృంగి పోయాడు.ఇంత జరిగినా తనని పిలువ నంపక పోవడాన్ని తప్పు పట్టాడు.
“ శ్రీనివాసా ! కాల గతిని అనుసరించి జరిగే మార్పులకి, వ్యక్తులని దోషులుగా చేయకు.నువ్వు ప్రయోజకుడువి అయ్యావని తెలిసి, అలా చెయ్యాలనే నా తపనని, ప్రక్కకు నెట్టి, నా స్వార్థం కోసం నిన్ను వెనకకి పిలిపిస్తానని ఎలా అనుకొన్నావు ?”
“ గురువు గారూ ! మీ మందులు మీకు పని చెయ్యక పోవడ మేమిటి ?” రోదించాడు అతను.
“ మందులు వాటి పని అవి చేసుకొని పోతున్నాయి శ్రీనివాసా ! శరీరమే వాటికి సహకరింఛడం లేదు. కాయానికి జరావస్థ సోకింది మరి ! తరువాతి గమ్యాన్ని ధైర్యంతో ఎదుర్కోవడమే ఇప్పుడు చేయాల్సిన పని !”
శ్రీనివాసుడు వెక్కి వెక్కి ఏడ్చాడు,గురువు అతనిని అడ్దుకోలేదు.దుఃఖ భారం తీరాక విషయాన్ని ప్రక్క దారి మళ్లించడానికి ప్రజాపతి గారి గురించి అడిగాడు.అన్ని సంగతులూ వివరంగా అడిగి తెలుసు కొన్నాడు.
మరునాటి నుంచి శ్రీనివాసుని వైద్యం మొదలు అయింది. గురువుకి అదేదీ లాభం లేదని తెలిసినా శిష్యుని తృప్తి కోసం వాటిని తీసుకొన్నాడు. జరావస్థ లోని శరీరం, కడుపులో పడ్డ మందులని అరిగించుకో లేక పోయింది. ఫలితం శూన్య మయింది..
అతని అవసాన దశ ఆసన్న మయింది. తన ఋణపత్రాలని .శ్రీనివాసునికి అందించారు అతను. శ్రీనివాసుడు వాటిని తీర్మానం చేసేసాడు. దాంతో అతని మనస్సు ప్రశాంత మయింది. నిండు మనస్సుతో శిష్యున్ని దీవించారు అతను. “ బాబూ ,శ్రీనివాసా ! నేను చెప్పే మాటలని శ్రద్ధతో విను, నాకు ఒక భాద్యత, ఇంకొక కోరిక ఉండి పోయాయి ”
“ చెప్పండి గురువుగారూ ! నేను వాటిని నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను !”
“ ముందుగా నా భాద్యత గురించి చెప్తాను విను. నాకు ఒక మేన కోడలు ఉంది. అందాల బొమ్మ లాంటి ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.ఆమె పేరు సీతాలక్ష్మి ! కాని మేనరికాలు ఇష్ట పడని మా బావ గారి కఠినమైన నిర్ణయం వల్ల పెళ్లి చేసుకో లేక పోయాను. ఇప్పుడామె ఎక్కడుందో తెలియదు, కాని ఏకాకిగా వితంతు జీవితం గడుపుతోందని తెలిసింది. ఆమె భర్త పేరు, వగైరా వివరాలు తెలిపే ఉత్తరం నా పెట్టెలో ఉంది. నువ్వు ఆమెను వెతికి , ఆమెకి అవసరమైన సహాయాన్ని అందించాలి.”
“ అలాగే బాబుగారూ ! తప్పకుండా చేస్తాను.”
“ బాబూ ! ఒక ఆయుర్వేద వైద్యునిగా, నాకు,,‘విద్యుల్లతా లేపనం’తయారు చేయాలనే చిరకాల వాంఛగా ఉండేది ! దానికి కావలసిన ‘విద్యుల్లత’ నా జీవిత కాల మంతా, ‘నాగావళీ, వంశధారా’ నదీ తీరాలలో వెతికాను. ఎంత ప్రయత్నించినా అది లభించ లేదు. చివరికా విద్యుల్లత ఈ ప్రాంతాలలో దొరకదనే నిర్ణయానికి వచ్చాను. నా పెట్టెలో మరొక చిన్న చెక్కపెట్టె ఉంది. దానిలో దానిని తయారు చేసే విధానం, దాని ప్రయోజనం వ్రాసి ఉంచాను. ఆ లేపన తయారీకి కావలసిన ,‘ సువర్ణ భస్మం, రజత భస్మం, పాదరస భస్మం దాచి పెట్టాను.నువ్వు భారత దేశంలో అది ఎక్కడ లభించినా,సేకరించి దానిని తయారు చేయాలి ! ”
“ అలాగే గురువు గారూ !”
“ శ్రీనివాసా ! ఇప్పుడు నాకు తృప్తి కలిగింది, యీ ప్రయత్నాలలో నీకు విజయం లభించాలని మన్స్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. బాబూ, నాకు సెలవియ్యి.” అంటూ ఆ ధన్వంతరి అంశావతారమైన ఆయుర్వేద వైద్యుడు ఆఖరి శ్వాస విడిచాడు.
శ్రీనివాసుడు అతని గుండెల మీద పడి, హృదయ విదారకంగా రోదించాడు.
అతని అంతిమ యాత్రని చూసేందుకు ఎంతో మంది గుమి కూడారు. వారందరూ శ్రీనివాసుడు అతని పెంపుడు కొడుకనే అనుకొన్నారు. అందుకని అంతిమ సంస్కారాన్ని చేసేందుకు ఎవరూ అభ్యతరం పెట్టలేదు. ఆ విధంగా గురు ఋణం తీర్చుకొని, అతని కోరిక ప్రకారం చెక్కపెట్టె లోని ఉత్తరాన్ని , మరో చిన్న చెక్కపెట్టెని తీసుకొని , తిరిగి అహ్మదాబాదు చేరాడు శ్రీనివాసుడు.
ఆదిరాజు భాస్కర మూర్తి దత్తాత్రేయ దక్ష ప్రజాపతి, ఇద్దరూ ఒకే మూసలో తయారయిన వ్యక్తులు కావడం వల్లనో ఏమో, ‘పార్వతీ పురం పెంకుటింటి ’ మీద, ఆవరించిన ‘పుష్కలావర్త మేఘాలు ’ అహ్మదా బాదు లోని ప్రజాపతి పార్కు’ మీద కూడా. విస్తరించాయి.
శ్రీనివాసుడు అహ్మదా బాదు చేరగానే, ప్రజాపతి గారి సిబ్బంది అంతా, విషణ్న వదనాలతో, ముభావంగా ఉండడం గమనించాడు. “ ఏమయింది ?” అని అడిగాడు,ఒక సహ కర్మచారిని.
“ మీకు ఇంకా తెలియదా, శ్రీనివాసు గారూ ! మన ఎం డి,గారు విమాన ప్రమాదంలో మృతిచెందారు .”
“ ఎం. డి.గారా ! అంటే అల్లుడు గారేనా ?”
“ అవును సార్ ! అల్లుల్లు కాక ,ఎం.డి. లు ఇంకెవరు అవుతారు ?” అతని మాటలలో వెటకారం కూడా మిళితమై ఉంది..
‘అయ్యో పాపం ! ప్రజాపతి గారికి ఎంత కష్టం వచ్చింది , ప్రణీత ఎలా తట్టుకొంటోందో , ఏమో ! వెల్లి సానుభూతి చెప్పాలి.’ అనుకొంటూ వాళ్ల భవనానికి వెళ్లాడు శ్రీనివాసుడు.
ప్రజాపతి గారు లంకంత ఆ భవనంలో,క్రింది అంతస్తులోని ఒక విశాలమైన గదిలో, దిళ్లని ఆనుకొని, దిగులతో ముడుచుకొని,కూర్చొని ఉన్నారు. శ్రీనివాసుని చూసి కను రెప్ప లార్పి, కూర్చోమని, సంఙ్ఞ చేసాడు.శ్రీనివాసుడు ఎం.డి గారి మరణ వార్త పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేసాడు. తరువాత తన గురువు గారి మరణ వార్తని తెలిపాడు. ఆ వార్త విన్న ప్రజాపతి గారిలో అంత వరకు అణిచి పెట్టుకొన్న దుఃఖం పెల్లుబికింది. “ శ్రీనూ ! ఈ విషయం అతనికి రెండేళ్ల క్రిందటే, నిన్ను నా దగ్గరకు పంపినప్పుడే తెలుసు. ఆయన సిద్ధ పురుషుడు, మహానుభావుడు, పోయేటప్పుడు నీకు ఏమైనా చెప్పారా ?” అని అడిగాడు.
“ చెప్పారండీ ! వితంతువుగా, ఏకాకిగా మిగిలిన తన మేనకోడలిని వెతికి,ఆమెకి ఆశ్రయం ఇయ్యమని చెప్పారు. ఆ పైన తాను తయారు చేయదలచుకొన్న ఒక మహా ఔషధిని పూర్తి చేసి, వితరణ చేయమన్నారు.”
“ మంచిది శ్రీనూ ! అలాగే చెయ్యి నా వల్ల కావలసిన సహాయమేదైనా ఉంటే చెప్పు.”
“ అలాగే అయ్యగారూ ! ప్రణీత గారు ,ఆంటీ ఎక్కడ ఉన్నారు ?”
“ లోపల ఉన్నారు శ్రీనూ, ఆంటీ గదిలోనే ఉన్నారు, వెళ్ళి కలిసి రా !”
“ అలాగే నండీ ! ” అంటూ మేడ మీదకి దారి తీసాడు శ్రీనివాసుడు..
మేడ మెట్లెక్కి, తన గదివైపు వస్తున్న శ్రీనివాసుని చూసింది, ప్రజాపతి గారి భార్య ఆమె మనసులో తప్పు చేసానన్న గ్లాని , అతనిని చూస్తూనే కలిగింది. `ప్రణీతను యీ శ్రీనివాసునికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు ఆయన. తనే అడ్డు పడింది..ఆ పెళ్లేగాని జరిగి ఉంటే, తన కూతురు సుఖ పడి ఉండేదేమో !’
“ అమ్మగారూ ! అల్లుడి గారి మరణ వార్త నాకు శరాఘాతంలాగ తగిలింది.కలకాలం నిలవ వలసిన వారి దాంపత్యం , ముంగిట కట్టిన మామిడి తోరణాలు కూడ వసి వాడక ముందే ,ఎడబాటు కలగడం చాల దురదృష్టకరం.”
“నిజమే , బాబూ ! దాని దురదృష్టాన్ని చెప్పడం మాటలలో చాలవు. అదిగో మంచం మీద పడుకొని ఉంది, కాస్త ధైర్యం చెప్పు.” అంది ఆమె.
శ్రీనివాసు మంచం ప్రక్కగా వెళ్లి నిల్చొన్నాడు.
ప్రణీత అతనిని చూసింది.ఆమెకి పాత రోజులు గుర్తుకి వచ్చాయి.అతను తన పాదానికి కట్టు కట్టిన తరువాత, తనని ఎత్తుకొని, మంచం మిద పడుకోబెట్టడం, బైకు మీద కూర్చో బెట్టదం , వంట చేసి పథ్యం తినిపించడం అన్నీ ఙ్ఞాపకానికి వచ్చాయి. ఇంతటి స్నేహ శీలి అయిన వ్యక్తిని భర్తగా పొందలేక పోయిన తానెంత దౌర్భాగ్యురాలు ! ’అనుకొంది, వెంటనే వెక్కి వెక్కి ఏడ్చింది.
శ్రీనివాసునికి ఆమెను ఎలా ఓదార్చాలో తెలియ లేదు.మంచం క్రింద కూర్చొని మెల్లగా అన్నాడు. “ప్రణీతా! దుఃఖించకు, ఢైర్యం తెచ్చుకో ! వైధవ్యం శాపమే కావచ్చు,కాని జీవితం అంతటితో ఆగిపోదు కదా ! ఆగిపోకూడదు కూడా ! ” అని.
ప్రణీత లేచి కూర్చొని,ముఖాన్ని రెండుచేతుల లోనూ దాచుకొంది.“నా దౌర్భాగ్యానికి అంతు అనేది లేకుండా పోయింది ,నేను ‘విష కన్యని ’శ్రీనూ !నా దగ్గరకు రాకు, పో, దూరంగా పారిపో !” అంది.
“ విష కన్యా ! అదేమిటది ? ఎవరన్నారు ఆ మాటలని ?” ఆశ్చర్యంతో అడిగాదు శ్రీనివాసుడు.
“ వాళ్ల అత్తవారంట్లో అందరూ అలాగే ఆడి పోసుకొన్నారు,భర్తనే కాక,ఆరువారాల పసి గుడ్డుని కూడా పొట్టన బెట్టుకుందని,తిట్టారు. ఆ మాటలు భరించ లేక అది పిచ్చిదయి పోతుందేమో, అన్న భయం వేస్తోంది నాకు అంది ప్రజాపతి గారి భార్య.
“ ప్రణీతకి గర్భ స్రావం జరిగిందా ?”
“ అవును బాబూ !గర్భం కలిగిందని మేమంతా సంతోషించే లోగానే అది నష్ట పోవడం, ఆ పైన ఐదవ తనాన్ని కోలు పోవడం జరిగాయి,”
“ ప్రణీతకి ‘ థెరాయిడ్ గ్రంధి ’ సమస్య ఉంది అమ్మగారూ ! చికిత్స జరిగాకనే గర్బం నిలుస్తుంది. ఈ సంగతి నేనుఎప్పటి కప్పుడు చెబుదామని అనుకొన్నాను గాని, దానికి తగిన సమయం,సందర్భం దొరక లేదు.పెళ్లి అయిపోయిన వెంటనే నేను పార్వతీ పురం వెళ్లి పోవడం, అక్కడ మా గురువు గారు చని పోవడం జరిగి పోయాయి, తిరిగి వచ్చే లోగానే ఇవన్నీ జరిగి పోయాయి.”
“ నాకు ధెరాయిడ్ సమస్య ఉందా ?” అంది ప్రణీత మంచం మీద నిటరుగా కూర్చొంటూ
“ అవును, దానికి చికిత్స జరిగాక నువ్వుపిల్లలని కన గలవు,” యథాలాపంగా అన్నాడు శ్రీనివాసు.
“ ఇంకెలా కన గలను , ఎవరికి కనమంటావు శ్రీనూ?”.ఆమె ప్రశ్న అతనిని అవహేళన చేస్తున్నట్లు ధ్వనించింది.
శ్రీనివాసుడు ఏ సమాధానమూ ఇవ్వలేక పోయాడు. అయినా సర్దుకోవడానికి ప్రయత్నించాడు. ఒకటి, రెండు విషాద సంఘటనల తోనే, జీవితం ముగిసి పోదు ప్రణీతా ! నువ్వు మళ్లీ వివాహం చేసుకో కూడదా ఏం ?” అని , తాను అధిక ప్రసంగం చేసానేమోనని లోలోపల నొచ్చుకొన్నాడు.
ప్రణీత ఆమె తల్లి ఇద్దరూ అతని వంక ఆశ్చర్యంతో చూసారు.గడచిన ఇన్నిరోజులుగా ఇలా మాట్లాడి ధైర్యం చెప్పిన వ్యక్తి అతనొక్కడే ! అతని మాటలు విన్న తల్లి మనసులో చిన్న ఆశా కిరణం తళుక్కు మంది.
‘‘ ప్రణీతని పునర్వివాహం ఎవరు చేసుకొంటారు బాబూ ! విష కన్య అని పేరు పడి పోయింది కదా ?”
“ ప్రణీత విష కన్య కాదు అమ్మగారూ ! ” శ్రీనివాసునిలో ఆవేశం కట్టలు తెగింది.“ అలా అన్నవారు చెంపలు వాయించుకొనేలా చేస్తాను,ఆమెకు మరో వివాహం చేయండి.”
తన మొదటి ప్రశ్ననే ఈ సారి సూటిగా అడిగింది ఆమె,“ నువ్వు పెళ్లి చేసుకొంటావా శ్రీనూ.?”అని.
శ్రీనివాసుడు బిత్తర పోయాడు, ప్రణీత స్తభ్దురాలయింది.
ఆమె తన ప్రశ్నని రెట్టించింది, “ చెప్పు శ్రీనూ, నువ్వు ప్రణీతని పెళ్లి చేసుకొంటావా ?”
శ్రీనివాసుడు మనసుని దిట్టం చేసుకొన్నాడు,సూటిగా అడిగిన ఆమె ప్రశ్నకి, సూటిగానే జవాబు చెప్పాడు, “ అమ్మగారూ ! మీ ప్రశ్నకి సమాధానం చెప్ప వలసినది నేను కాదు, ప్రణీత ! ఆమె అంగీకరిస్తే చాలు, నేనామె సమస్యలన్నీ తీర్చేస్తాను.” అని.
అతని మాటలు అప్పటికే ఆ గదిలోకి ప్రవేశించిన ప్రజాపతి గారు విన్నారు. పిపాసార్తునికి , మంచి నీటి తీర్థం ఎదురైనట్లు, అతని ఎద ఉప్పొంగి పోయింది. “ శ్రీనివాసా ! ప్రణీత సమాధానం ఇచ్చే స్థితిలో గాని, నిర్ణయం తీసుకో గలిగిన మానసిక స్థైర్యాన్ని గాని కలిగి లేదు.దానికి తల్లి తండ్రుల మైన మేము అడుగుతున్నాం. ఆమెను పునర్వివాహం చేసుకోవడం నీకు అంగీకారమా, కాదా ?”
శ్రీనివాసుడు తన సమాధానాన్ని, నోటితో చెప్పలేదు, తల దించుకొని ప్రజాపతి దంపతులకి పాదాలకి నమస్కరించి నిలబడ్డాడు. అతనిని ఆ భంగిమలో చుసిన ప్రణీత , కఠినమైన ప్రశ్నలకి, ఎలా జవాబు చెప్పవచ్చో తెలుసుకొంది, ఫలితంగా, ఆమె కూడా లేచి వచ్చి, అతని ప్రక్కనే నిలబడి, తల్లి తండ్రుల పాదాలకి నమస్కరించి నిలబడింది.
ప్రజాపతి దంపతుల ఆనంద భాష్పాలే వారికి ఆశీర్వాదాలయ్యాయి.
అంతే ! ప్రజాపతి గారు, మరి ఏ కట్టుబాట్లకీ, కట్టుబడక ప్రణీతా శ్రీనివాసుల కళ్యాణం ఆర్య సమాజ పద్ధతిలో మరునాడే నిర్వర్తించి, వారిద్దరినీ ప్రణయ బంధంలో బంధించాడు.
శ్రీనివాసునికి, ఆరాధ్య దేవత సన్నిధి ఆ విధంగా దొరికింది. ప్రణీతకి తన ఆదర్శ పౌరుషేయ పెన్నిధి అతని రూపంలో లభించింది.
Comments
Post a Comment