దృశ్యము 2
( తెల్లతెర వెనుక లైటు వెలుగులో ఒక దుర్గం కనిపిస్తుంది )
( రాయచూరు దుర్గానికి బహి: ప్రాంగణం )
( రంగ స్థలం మీద లైట్లు వెలిగేసరికి నాయికా నాయకులిద్దరూ ఉంటారు )
రామరాజు:
భద్రముఖీ ! అరాళ కుంతలా ! నీ ముంగురులు నిజంగానే తుమ్మెద రెక్కలు ! నీకీ పేరుని శైశవం లోనే ఊహించి పెట్టిన నీ తల్లి తండ్రులు ధన్యులు ! ( అంటూ ఆమె నుదుటి మీద ముంగురులని సవరిస్తాడు)
అరాళ కుంతల:
ఆర్యపుత్రా ! నా తండ్రి గొప్ప సాహిత్యాభిమాని ! నంది తిమ్మన మహాకవి వ్రాసిన ,‘ పారిజాతాపహరణం’ అనే ప్రబంధం లోని ఒక ప్రముఖ సన్నివేశంలో, కథానాయిక ‘సత్యభామా దేవిని’ వేడుకొంటూ నాయకుడైన శ్రీ కృష్ణుడు పలికిన మాటలని పద్యంగా విని, ఆ పేరుని , నా పేరుగా పెట్టారు.
రామరాజు:
అటులనా దేవీ ! ఆ పద్యము బహు రసవత్తరమైనది ! నా కది కంఠోపాఠమే సుమా !
అరాళ కుంతల:
విశ్వసించమంటారా ? (కొంటెగా)
రామరాజు:
అవిశ్వాసమునకు తావెక్కడిది చెలీ , అవధరింపుము.
“నను భవదీయ దాసుని , మనంబున నెయ్యపు గిన్క,
బూని దాచిన యది నాకు మన్ననయె, చెల్వగు నీ పదపల్లవంబు,మ
త్కనుకులకాగ్ర కంటక వితానము దాకిన నొచ్చునంచునంచు నే,
ననియెద ,నల్క మానవు కదా, ఇకనైన నరాళ కుంతలా !!
ఇదియా నీ నామము వెనుకనున్న రహస్యము ? బహు రమ్యముగా నున్నది.
అరాళ కుంతల:
(సిగ్గు పడుతుంది) ఆర్యపుత్రా ! నా పేరు లోని మధురిమ, మీ నోట విన్నంత అది ద్విగుణీకృతమయినది !
రామరాజు:
నిజమా దేవీ ! అటులయిన నిన్ను పూర్ణ నామదేయము తోనే పిలిచెదను గాక ! ఇంత విశేష సాహిత్యాభి మానము గల నీ తల్లి తండ్రులు సామాన్యులనుట కడు ఆశ్చర్యముగా నున్నది ?
అరాళ కుంతల:
నేను అసామాన్యనే అయిన, మీ సన్నిధికి చేరుకొనగలనా స్వామీ ? సామాన్యులకు సామాన్యులతోనే పొత్తు కుదురును గదా ?
రామరాజు:
( తనలో) నేను ఈ రాయచూరు దుర్గాధీశుడనని చెప్పక పోవుటయే మంచిదైనది ! చెప్పినచో ఈమె నా చెంత చేరెడిది కాదేమో ! ( ప్రకాశముగా) లెస్స పలికితివి దేవీ ! సామాన్యులకు సామాన్యులతోనే పొత్తు కుదురును
అరాళ కుంతల:
(తనలో) నేను రాకుమార్తెనన్న ఈయనకు తెలియక పోవుటయే మంఛిది. తెలిసిన యెడల ఇతని పొందును పొందజాలను. (ప్రకాశంగా) దుర్గమున మీ కొలువు ఎట్టిది స్వామీ , అధిపతులకు మీరు సన్నిహితులేనా ?
రామరాజు:
అవును భద్రముఖీ ! వారు నాకు అత్యంత సన్నిహితులు, వారి మాట ఎట్లున్నను నా అంతరంగమున --- భద్రముఖీ ! ( ఆమె చిబుకమును ఎత్తి పట్టుకొని ముఖం లోకి చూస్తూ) నా అంతరంగమున స్థానము నీకు గాక వేరెవరకూ లేదు.
అరాళ కుంతల:
(అతని చేతులు విడిపించుకొని,గోముగా) మీ మనసు మాట నిజమేనా స్వామీ ?
రామరాజు:
అవశ్యము, ఇంకను వినుము
పాట నీ నామము మధురము, రూపమెంతో రమణీయము.
అవధరింపవే చెలీ ! నా మనసు నీకె అంకితము.
అరాళ :
మీ నామము ఉదాత్తము, రూపము ధీరోదాత్తాము,
అవధరింపుడీ సఖా ! నా మనసు మీకె అంకితము
రామరాజు:
నిజమా, నిజమేనా, మరులొలికే నీ పలుకులు,
మాయచేయు ముంగురుల వోలె, వట్ర సుడులు కావు గదా?
అరాళ:
నుదుటి పైన ముంగురులు, తుమ్మెద రెక్కలనుట నిజమగునా,
మీ మాటల గారడిలో, నన్ను పడవేయుట పాడి యగునా ?
రామరాజు:
గారడీలు నేర్వనె చెలి, గాంధర్వ విధిన వరింపవే,
నీ విరహము తాళలేనె, పరిహాసము చేయకే !
అరాళ:
కోరి వచ్చిన ప్రియురాలికి, తగు సమయము కావలెను కదా,
గాంధర్వ రీతి నేల ప్రియా, సమ్మతితో సరియగును కదా !
రామరాజు:
నీ నామము మధురము, రూపము రమణీయము,
అవధరింపవే చెలీ, నా మనసు నీకె అంకితము.
అరాళ:
మీ నామము ఉదాత్తము, రూపము ధీరో దాత్తము,
అవధరింపుడీ సఖా ! నా మనసు మీకె అంకితము.
( ఇద్దరూ పాటకి అనుగుణంగా అభినయిస్తారు )
(తెరలో నుండి శంఖ నాదం వినిపిస్తుంది )
రామరాజు:
ప్రియా , అరాల కుంతలా ! దుర్గము నుండి శంఖ నాదము విన్పించుచున్నది. నేను, ‘స్వామి’ కొలువుకి చేరవలెను. సెలవా మరి !
అరాళ కుంతల:
పునర్దర్శనము రేపు కాగలదు కదా ప్రభూ !
రామరాజు:
అవశ్యము కాగలదు దేవీ ! (అంటూ వెళ్లిపోతాడు)
( రెండవ ప్రవేశ ద్వారం నుండి అప్పాజీ ప్రవేశం)
( అప్పాజీ వెళ్తున్న రామరాజు వంక తదేకంగా చూస్తాడు)
అప్పాజీ:
భర్తృదారికా ! మీరీ యువకుని ప్రేమించిన మాట విదితమైనది, అతనెవరో_____
అరాళ కుంతల:
అతను రాయచూరు దుర్గాధీశుని ఆంతరంగిక సలహాదారుడు, పేరు రామరాజు.
అప్పాజీ:
కుమారీ ! మీకు తెలిసినది నిజము కాదు, అతడే ఆ దుర్గాధీశుడు ! చాళుక్య వంశ క్షత్రియుడైన బుక్కరాజు రామరాజు మనుమడు. శ్రీ రంగరాజు పుత్రుడు. మీ తండ్రిగారు కళింగులతో చేసిన యుధ్ధములో అతని తాత, తండ్రులు స్వర్గస్థులైనారు.
అరాళ కుంతల:
( ఆశ్చర్యంతో) నిజమా, అప్పాజీ !?
అప్పాజీ:
తనని రాజకీయ సేనలో దశపతిగా నియమించినందుకు అలిగి, అతడు శతృవుల శరణు జొచ్చాడు.సుల్తాను కులీకి ,సముద్ర దొంగ సంబువ రాయుని సంపదని హస్తగతం చేసి, అతని దయకు పాత్రుడై, ఈ దుర్గాధీశునిగా నియమింప బడినాడు. సుల్తాను కులీ ఎంతో ముందు చూపుతో, విజయనగర సరిహద్దుల లోని ఈ దుర్గమునకు అతనిని అధిపతినిగా చేసినాడు.
అరాళ కుంతల:
దశపతిగా నియామకము పైన అతని రోషము సమంజసమే అప్పాజీ! మన విజయ నగరము అతనిని పోగొట్టుకొన్నట్లే కదా ?
అప్పాజీ:
విధి బలీయము కుమారీ ! దశపతి పదవిని కాదని వెడలి, సుల్తాను కులీ దగ్గర సామాన్య కాపలా సిపాయిగా చేరాడు. ఈ చర్యను ఎట్లు సమర్థించ గలవు?
అరాళ కుంతల:
సమర్థించుటకేమున్నది అప్పాజీ, మీరన్నదే, విధి బలీయము!
అప్పాజీ:
రామరాజు మీ తండ్రికి శత్రువు రాకుమారీ ! మీరు అతనిని పరిణయమాడుట, అసమ్మతికి కారణమగునేమో ! ఆలోచించండి కుమారీ !
అరాళ కుంతల:
ప్రేమకు ఉచితానుచిత న్యాయమెక్కడ కలదు అప్పాజీ ? నా మనసును ఏనాడో కొల్లగొట్టాడు. నా ప్రేమతో అతనిని నా దారి వైపు మరలించుకోగలననే నా నమ్మకం.
అప్పాజీ:
కుమారీ మీ ఆలోచన ప్రశంసనీయము ! కాని సమయము చాల స్వల్పము ____
అరాళ కుంతల:
అర్థమయేటట్లు చెప్పండి అప్పాజీ !
అప్పాజీ:
రాకుమారీ ! ఆంధ్ర కర్ణాటక రాజ్యములను ఏకఛ్ఛత్రము క్రింద తెచ్చిన మీ తండ్రి శ్రీ కృష్ణదేవరాయల వారు, ఈ రాయచూరు దుర్గమును తిరిగి కైవసము చేసుకొనుటకు, దండయాత్రకు సంకల్పించినారు.చతురంగ బలములు ఇటకు అతి త్వరలో మొహరింపనున్నవి. నేను ముందుగా ఇఛ్చటి పరిస్ఠితిని అంచనా వేయుటకు వచ్చిన వాడను.
అరాళ కుంతల:
అప్పాజీ ! నేనీ రాజ్యమున ప్రసిధ్ధ నర్తకీమణి అయిన లకుమాంబా దేవి కడ, నృత్య రీతులను అభ్యసించుటకై వచ్చితిని. ఆమె రాకుమార్తెలకు నాట్యము నేర్పదు గనుక , నేను సామాన్యురాలివలె ___
అప్పాజీ:
సామాన్యురాలివలె ఛద్మవేషముతో , అభినయ కేళితో పాటు, ప్రణయ కేళిని కూడ నేర్చుకొన్నారు, అంతేనా రాకుమారీ?
అరాళ కుంతల:
అవును అప్పాజీ!
అప్పాజీ:
మీ తండ్రికి , మీ ప్రియునకు ఘోర సంగ్రామము జరుగనున్నది కుమారి అరాళ కుంతలా దేవీ ! మీ భవితవ్యమును మీకు మీరే వివేకముతో నిర్ణయించుకోవలసినదిగా ఈ అప్పాజీ సలహా !
అరాళ కుంతల:
(అప్పాజీ వంక తదేకంగా చూస్తూ) అటులనే అప్పాజీ ! నేను శాంటి కాముకురాలినన్న విషయము మీకు తెలియనిది కాదు. నన్ను దీవించి పంపండి. ( అంటూ నమస్కరిస్తుంది)
అప్పాజీ:
తథాస్తు, ఇష్ట కామ్యార్థ సిధ్ధిరస్తు ! (దీవిస్తాడు)
( లైట్లు ఆరుతాయి )
Comments
Post a Comment