వినత కూడా భర్త దగ్గర బండశీను ప్రస్తావన తెచ్చింది.
విష్ణుమాదవ్ ఆశ్చర్య పోయాడు. “ బండశీను ఇక్కడ మీకు కనిపించాడా ? తమాషాగా ఉందే ! ఇంట్లోంచి పారిపోయిన వాడు , దేశ దేశాలు తిరిగి చివరకి
టూరు కంపెనీలో పనికి కుదిరాడా ?” అని.
“బండశీను మీకు బాల్య స్నేహితుడా ?”
“స్నేహమా ! అలా చెప్పాడా ,వాడి ముఖం,వాడితో మాకు అదే నాకు స్నేహమేమిటి ?
“స్నేహం చేసేందుకు ఏ ఏ అర్హతలు ఉండాలంటారు ?”
“మంచి ప్రశ్నే వేసావు, చిన్నప్పుడే తల్లి తండ్రులు చెప్తారు, అలగా జనంతో స్నేహాలు చేయవద్దని.నీకు చెప్పలేదా ?”
“చెప్పారనుకోండి, అయినా నేను ఆడ పిల్లని కదండీ ! బయట తిరుగుళ్లు తిరిగే దాన్ని కాను, అందుకని నా విషయంలో అలాంటి ఆంక్షలు పెట్టలేదు.”
“స్నేహం ముఖ్యంగా, సమాన స్థితిగతులు గల వ్యక్తుల మధ్యనే జరుగుతుంది. నువ్వు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లివి అయ్యావు. పిల్లలకి మంచి స్నేహాలు
చెయ్యడం నేర్పు.అర్థమయిందా ?”
“ అర్థమయిందండీ ! “
“ బండశీనుకి నమ్మకంగా పని చేసే గుణం ఉంది,వాడి చేత చాకిరీ చేయించు కోండి.”
“ మీరు అలాగే చేసేవారా ?”
“ అవును,అంతే కాదు,వాడిని రక రకాలుగా ఏడిపించే వాళ్లం.వాడి చేతనే ఇంటి నుండి, జంతికలు, చెగోడీలు,అప్పచ్చులు తెప్పించుకొని, వాడికి ఏ ఒక్కటీ
ఇవ్వకుండా వాడికి ఎదురుగానే తినే వాళ్లం.వాడు క్రింద పడిన దానిని పొరపాటున ఏరుకొని తింటే వాడిని ముప్పతిప్పలు పెట్టి,గుంజీలు తీయించే వాళ్లం.”
“అలా చేస్తే మీకు ఏం లాభం కలిగేది ?”
“ లాభం ఏమిటి ? రేగింగు అంతే ! అందులో సరదా ఉండేది.”
“ అతను ఉద్యోగస్థుడయ్యాడు, ఇప్పటి కయినా అతనితో మాట్లాడుతారా ?”
“ అదేమంత పెద్ద ఉద్యోగం ! అయినా కలుస్తాము కదా, చూద్దాం.”
వినత మరేమీ మాట్లాడ లేదు. శ్రీనివాసుని గురించి నిజాలు చెప్పకుండా , విష్ణు అన్నట్లు సరదా చూద్దామనే అనుకొంది.
ద్యుతిధర్, బండశీను పేరు విని, ఎలాంటి స్పందనా వెలిబుచ్చలేదు. వాడా, వాడు ఇక్కడ చేరాడా ? మంచి వాడే, చాల ఒబీడియంట్ ఫెలో !”అన్నాడు.
ప్రాంజలి భర్త రవికాంత్ ,ఆ విషయం విని, ఏమిటీ, బండశీను మీ దగ్గరకు వచ్చాడా, చిన్నప్పుడు నేను విడిచిన బట్టలు కట్టుకొనే వాడు. వాడి చేత చాలా సేవలు
చేయించుకో, ఆఙ్ఞలు ఇవ్వడానికి ఏ మాత్రం మొహమాట పడకు.” అన్నాడు.
ఆ నలుగురు బిజీ బిజినెస్ మిత్రుల దృష్టిలో బండశీను విషయంలో ఎలాంటి చర్చ జరగ లేదు. అతని గురించి తెలుసుకోవాలని గాని, అడగడానికి గాని వారికి
ఎలాంటి కుతూహలమూ కలగ లేదు.
శ్రీనివాసు తెచ్చిన మినీ వేనులో, నలుగురు స్త్రీలు, ముగ్గురు పిల్లలూ, పూజారి గారు, కేటరింగు మనుష్యులు, డ్రైవరు , అతని సహాయకుడు, ఎక్కారు. శ్రీనివాసు
కూడా గైడు రూపంలో ఎక్కి, శ్రీ సోమనాధ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొనేందుకు బయలు దేరారు.అక్కడ శ్రీ సోమనాధుని దర్శనం చేసుకొని, నలుగురు ఆడవాళ్లూ, అభిషేక
కార్యక్రమం ముగించి, వచ్చేసరికి,యధారీతిగా బూర్లు పులిహోరలతో భోజనం సిద్ధం అయింది. దానిని ఆప్యాయంగా ఆరగించి, అక్కడ గెస్టుహౌసులో ఒక గంట విశ్రాంతి తీసుకొని,
మధ్యాహ్నం ఒంటి గంటకల్లా వేనులో ద్వారకకి బయలు దేరారు.
ద్వారక వెళ్లే దారిలో అపాల అడిగింది. “ శ్రీనివాసు గారూ ! మీరు బండశీను నుండి, ఎలా ఎదిగారు ? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, అని.
“నాకేమీ అభ్యంతరం లేదు. అపాల గారూ! మీరు నా కధని వినాలని కోరడం నిజంగా నేను చేసుకొన్నఅదృష్టం! ” అంటూ, తన గృహ పలాయనాన్నీ, ఆదిరాజు భాస్కర మూర్తి గారి, గురు కులం లోని శిక్షణనీ, ఆ తరువాత ప్రజాపతి గారితో పరిచయాన్నీ, కంప్యూటరు ఇంజనీరుగా సాధారణ మధ్య తరగతి యువతిగా , వికలాంగు రాలిగా పరిచయ మయి, విషకన్యగా పేరుబడి ,తనతో పరిణయ బంధాన్ని, పెట్టుకొని తన, అదృష్ట దేవతగా, తనని అలరించిన ప్రణీత కధనీ, ఆమెతో తనకి బిడ్డ కలిగిన వైనాన్నీ చెప్పాడు..
“ మీ భార్యని ఒకమారు మాకు చూపిస్తారా ?” అడిగింది అపాల.
“ అలాగే, అపాల గారూ ! మనం అహమదాబాదు మీదుగానే తిరిగి వస్తాం కదా, అప్పుడు తీసుకొని వెళ్తాను.” అన్నాడు శ్రీనివాసుడు.
ద్వారక, బేట్ ద్వారక దర్శించుకొని, రాత్రికి, ఒక హోటలులో విశ్రాంతి తీసుకొని, మళ్లీ తెల్లవారి ఝామున బయలు దేరి , శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకొన్న తరువాత రాత్రి వేళకి అహ్మదాబాదు వెళ్లారు. నేరుగా తన ఇంటికి తీసుకొని వెళ్లాడు శ్రీనివాసుడు.
శ్రీనివాసుని ఇల్లు ఏదో పెద్ద భవంతి అయి ఉంటుందని భావించిన వారికి,ఒక రెండు గదుల అపార్టు మెంటు దర్శనమిచ్చి,దిగ్భ్రాంతిని కలిగించింది.
ప్రణీత వారికి సాదరంగా స్వాగతం చెప్పింది. చక్కని గుజరాతీ విందును కొసరి కొసరి తినిపించింది. భోజనాలు అయ్యాక, ధరణి ఇక ఉండబట్ట లేక అడిగింది.“ ప్రణీత గారూ ! మీ ఇల్లు ఇదేనా ?”అని.
“ అవునండి. శ్రీనివాసుతో పరిచయానికి ముందు నేను ఈ ఇంట్లో అద్దెకు ఉండేదాన్ని. అతను ఈ ఇంట్లోనే నా కాలుకి, ట్రీటుమెంటు ఇచ్చారు.అందుకని ఈ ఇంటిని మేము కొనేసు కొన్నాం.ఇదే అత్తవారిల్లు అయింది ” అంది ప్రణీత. ఆ తరువాత, ఆల్బం తీసి,భవ్యమైన భవనం లాంటి తన పుట్టిల్లుని చూపించింది. అంత డబ్బు, అంత విశాలమైన బంగళా, ఉన్నా, చిన్న ఇంట్లో కాపరం చేస్తున్న ఆ జంటని చూసి, అబ్బుర పడ్డారు వాళ్లు. ప్రణీత ఆ ముత్తైదువలందరికీ గుజరాతీ స్పెషలు వర్క్ చీర, సారె పెట్టి, వీడ్కోలు ఇచ్చింది. రాత్రికి వేనులో బయలు దేరి, సైటు ఆఫీసులోని గెస్టు హౌసుకు చేరుకొన్నారు వాళ్లు.
శ్రీనివాసు మరో రెండు రోజులలో వస్తాననీ, ఇంకొక టూరుకి తీసుకొని వెళ్తాననీ చెప్పి,వెళ్లిపోయాడు.
“ అపాలా ! ఏమిటే ఆలోచిస్తున్నావు ?” అడిగింది వినత.
“ శ్రీనివాసు గారి ఇంటికి వెళ్లినప్పుడు ప్రణీత,వాళ్ల కంపెనీ కార్డు ఒకటి ఇచ్చిందే ! అందులో వాళ్ల వెబ్సైటు యూ.ఆర్.ఎల్ .ఉంది.మధ్యాహ్నం బోజనాల తరువాత ఆ సైటు ఛూసాను. అది చూసిన దగ్గర నుంచి, నా మనసు మనసులో లేదు. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయే !”
“ ఏముందే ఆ వెబ్బులో ?”
“ ప్రజాపతి గారి కంపెనీ కొన్ని ఛేరిటీ కార్యక్రమాలు చేస్తోందే ! వాటిలో ఆధారం లేని వితంతువుల శరణాలయం కూడా ఉంది.”
“ బాగుందే ! వితంతు స్త్రీ శరణాలయానికి,నీ సమస్యకీ ఏమిటే ఆ సంబంధం ?”
“ నా సమస్య అదే కదా వినతా ! మా పిన్ని ‘ సీతాలక్ష్మి’ ఏ ఆధారమూ లేని ఏకాకి అయి పోయిందే !ఈ శరణాలయం గురించి చూసాక,నాకు ఆమె మనసులో మెదుల్తోంది.”
అపాల మాటలు అప్పుడే గదిలోకి వచ్చిన ధరణి, ప్రాంజలులు కూడా విన్నారు. “అపాల వదినా ! ఎవరా సీతాలక్ష్మి, ఏ మా కధ ?” అని నాటక ఫక్కీలో అడిగింది ధరణి. అపాల చెప్ప సాగింది.
సీతాలక్ష్మి చాల ధైర్యవంతురాలైన వనిత.పామన్నా,పురుగన్నా,చీకటన్నా, భూత మన్నా,పోలీసులన్నా, రౌడీలన్నా,ఎవరినీ చూసి భయ పడేది కాదు.ఆమె సాహస గాధలు ఆ పల్లెలో చాలా ఉన్నాయి. చెరువులో మునిగి పోయి ప్రాణాపాయంలో పడిన పసి పిల్లలని కాపాడింది.ఎప్పుడు ఎవరి ఇంట్లో పాము దూరినా,ఆమెని పిలుస్తే చాలు, చిన్నకర్ర సాయంతో పాము దృష్టిని తన మీద నుండి మరలించి,దాని తోక ఒడిసి పట్టుకొని గిరగిరా త్రిప్పి కొట్టేది.
అపాల తండ్రి చలమయ్య,ఆమె సాహస చర్యలని విని, ఆ గ్రామం వచ్చాడు.ఆమెను చూసీ చూడగానే తన తమ్ముడు , జగన్నాధానికి ధైర్యలక్ష్మి లాంటి, ఆ అమ్మాయే తగిన భార్య కాగలదని తలచి, సంబంధం మాట్లాడాడు. ధనవంతుల ఇంటి సంబంధమని ఆమె తండ్రి దానికి ఒప్పుకొన్నాడు. ఫలితంగా జగన్నాధానికీ, సీతాలక్ష్మికీ పెళ్లి అయి పోయింది.
వధువు సీతాలక్ష్మికి జగన్నాధం వ్యసన పరుడన్న విషయం తెలియదు. ఆ విధంగా సీతాలక్ష్మి , తల్లి లేని అపాలకి పినతల్లి స్థానంలో వచ్చింది. వారం రోజుల లోనే ఆ ఇంటి పరిస్థితి కూలంకషంగా తెలుసుకొంది., జగన్నాధం చలమయ్యల ఉమ్మడి ఆస్థి ఇరవై ఎకరాల మాగాణి భూమి, నాలుగెకరాల మెట్ట భూమి, ఒక మామిడి తోట అని తెలుసుకొంది. చలమయ్య తమ్ముని పంతం వల్ల భూమిని చెరి సగం పంచి ఇచ్చాడు.మామడి తోట ఉమ్మడి ఆస్థి గానే ఉంచి, ఫల సాయాన్ని, పంచుకోవలసిందిగా తీర్మానించాడు.
చలమయ్య చేతికి ఎముక లేని దాత ! ఎన్నోశరణాలయాలకీ,సత్రాలకీ గుప్త దానాలు చేసేవాడు. దానికి విపరీతంగా జగన్నాధం తన విలాసాలకీ, త్రాగుడు వ్యసనాలకీ ఆస్థిని ఖర్చు చేసేవాడు. ఈ లోగా అపాలకి పెళ్లి సంబంధం కుదిరింది. భారీగా కట్న కానుకలిచ్చి, ఊరు ఊరంతా సంతర్పణ చెసి, చలమయ్య తన ఆస్థిని పూర్తిగా వెచ్చించాడు. ఆ తరువాత తీర్థ యాత్రలకి వెళ్లి పోయాడు.
జగన్నాధం తన వ్యసనానికి ఉన్నదంతా ఊడ్చి పెట్టి, మామిడి తోటని బేరానికి పెట్టాడు. సీతాలక్ష్మి అడ్డుపడింది, పలితంగా దెబ్బలు కూడా తింది. అయినా లెక్క చేయక గ్రామ పెద్దల్ని తోటకి పిలిచి తీసుకెళ్లి, తోట ఉమ్మడి ఆస్థి అని, అమ్మకం చెల్లదని చెప్పి, వచ్చిన బేరగాళ్లని తిరిగి వెళ్లి పోయేలా చేసింది.
జగన్నాధానికి భార్య ప్రవర్తన అవమాన కరంగా తోచింది. అతను ఆమె నగలనీ, ఇంట్లో దాచిన ధనాన్నీ, తీసుకొని గృహ త్యాగం చేసాడు. సీతాలక్ష్మి ఒంటరిదయింది, ఆ పైన వితంతువు కూడా అయింది. తమ్ముడి అస్థికా నిమజ్జనానికి వచ్చిన చలమయ్య, ఆమెకి ధైర్యం చెప్పి, మామిడి తోటని అమ్మి పూర్తి సొమ్ముని ఆమెకే ఇచ్చి,తిరిగి బదరీ యాత్రకి వెళ్లి పోయాడు.
సీతాలక్ష్మి పాల వ్యాపారం చేసి పొట్ట పోసుకొనేది.కాని పసరాలు చచ్చిపోయి ఏకాకిగా మిగిలింది చివరికి కామందుల ఇళ్లల్లో పనులు కాయకష్టం చేసుకొంటూ బ్రతుకు తెరువును వెతుక్కొంది అపాల స్వతంత్రంగా కాపరం పెట్టాక, పిన్నిని తీసుకు రావాలని, ప్రయత్నించింది.కాని విరించి ససెమిరా వీలు పడదని ఆంక్ష పెట్టాడు. దారిన పోయే దరిద్రాన్ని తలకెక్కించు కోవడం మంచిది కాదని అన్నాడు.అపాల ఏం చేస్తుంది ! నిస్సహాయంగా మూగ ప్రేక్షకు రాలయింది.
మళ్లీ ఈ రోజు వెబ్ సైటులో వితంతు శరణాలయం గురించి చూసాక, ఆమెకి పిన్ని ఙ్ఞాపకం వచ్చింది. సీతాలక్ష్మి కధ విన్న వారందరూ భారంగా నిట్టూర్చారు. సీతాలక్ష్మి పేరు మీద శరణాలయానికి అభ్యర్థన పత్రం పంపమని సలహా ఇచ్చారు.
వినత అయితే వెంటనే ఇంటర్నెట్లో అభ్యర్థన ఫారం నింపింది. సీతాలక్ష్మి దీన గాధని చాల తక్కువ శబ్దాలతో వ్రాసి, పోస్టు చేసింది.అలా పోస్టు చేసిన అయిదు నిమిషాల లోనే, అభ్యర్థన అందిందనీ, కేసుని వెరిఫై చేసి, తగిన చర్య తీసుకొంటామని జవాబు వచ్చింది.
ఆ జవాబు చూసిన అపాల కళ్లు ఆనందంతో మెరిసాయి.
ఆ రోజు రాత్రి, అపాల, విరించితో ప్రజాపతి ట్రేవల్సు వెబ్ సైటు గురించి, దానికి తను పంపిన అభ్యర్థన గురించి చెప్పింది.
విరించి అంతా విన్నాడు.“ అలాగా ఇప్పుడు తెలిసింది,ప్రజాపతి కంపెనీలో బండశీను లాంటి వాళ్లకి ఎలా ఆశ్రయం దొరికిందో ! ” అంటూ అదేదో గొప్ప స్టేటుమెంటులా నవ్వేసాడు.
అపాల మనసు మొదటి సారిగా అతని మీద నిరసన తెలిపింది.
ప్రాంజలి ,రవి కాంత్ కి టీ అందిస్తూ చెప్పింది “మాతొలి విడత టూరులో,దేవాల యాలన్నీ చూసి వచ్చేసామండీ ! తిరుగు దారిలో నా కొక ‘గిఫ్టు’ కూడా దొరికింది. ” అని.
“ గిఫ్టా ! ఏమిటది ?” అడిగాడు రవికాంత్.
ప్రాంజలి ,ప్రణీత ఇచ్చిన చీర తీసుకొని వచ్చి,చూపించింది. “ ఈ చీర చూసి దీని ధర ఎంత ఉంటుందో చెప్పండి,”అంది
రవికాంత్ ఆ చీరని చూసాడు. లేత పింకు రంగు లోని జార్జెట్ చీర అది. చాలా రిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది దాని మీద.పువ్వులు,లతలే కాక, నెమళ్లు కూడా ఉన్నాయి “అమ్మో !చాలా వర్కు ఉంది దీని మీద. దీని ఖరీదు అయిదారు వేల రూపాయలు ఉంటుంది”
“ అవునండీ ! ఆరువేల రూపాయలు.”
“ ఎవరిచ్చారు ఈ గిఫ్టు ?”
“ అహ్మదాబాదులో శ్రీనివాసు గారి ఇంటికి వెళ్లామండీ ! అక్కడ ఇచ్చారు.”
“ బండశీనా ! వాడికి ఇల్లు వాకిలి కూడా ఉన్నాయా ? ఇంత ఖరీదయిన గిఫ్టు ఇచ్చాడంటే ఆశ్చర్యంగా ఉంది.అయినా ఖరీదయిన బహుమతి పుచ్చుకొనే ముందు నాతో ఒకసారి చెప్పాల్సింది. ప్రాంజలీ ! ” అన్నాడు రవికాంత్.‘బండశీను’ ఇచ్చాడని తెలియగానే, అతని మనసులో ఏ మూలనో ఉన్నఅసూయ, మాటలలో తొంగి చూసింది.
ప్రాంజలి అది గమనించ లేనంత అమాయకురాలు కాదు. “ గిఫ్టు తీసుకొనే ముందు, మిమ్మల్ని అడిగి తీసుకోవాలా ? ఎలాగండీ ! నాకా చీర ఒక ముత్తైదువ ప్రణీత గారు,బొట్టు పెట్టి ఇచ్చారు.బొట్టు పెట్టి ఇచ్చే దానిని ఎలా తిరస్కరించ గలనండీ !”
“ అలాగా ! అయితే తీసుకోవలసినదే ! ఇందాకల బండశీను ఇచ్చాడన్నావు ?”
“ అతని భార్య పేరే ప్రణితండీ !”
“ చిన్నప్పుడు నేను తొడిగి పారేసిన లాగూలు, చొక్కాలు, తొడుక్కొనే వాడు. ఈ విధంగా ఋణం తీర్చుకొన్నాడన్న మాట ! ఈ సారికి అయింది, అతనిచ్చినది ఇంకేదీ పుచ్చుకోకు”
ప్రాంజలికి అతను ఉడుక్కున్నాడని అర్థమయింది. అంత ఖరీదయిన చీర అత్తగారు గాని, అతను గాని ఇంత వరకు ఇవ్వనే లేదు. అందుకే కాబోలు, ఓర్వలేని తనం ! పైగా ఋణం తీర్చుకొన్నాడని సమర్థన ఒకటి !‘ చీరని తీసుకొని మౌనంగా వెళ్లింది ప్రాంజలి
. ముగ్గురు వదినెల సాహచర్యంలో ఆమె కొంత సంయమనం నేర్చుకొంది.
ఇదే పరిస్థితి ధరణికి కూడాఎదురయింది.
ద్యుతిధర్ ఆమె చీరని చూసి, “ బండశీను పెళ్ళాం ఎలాగుంటుంది దరణీ ! నీ కన్నా అందంగా ఉంటుందా ?” అని అడిగాడు.
తన అందం పైన అతని ప్రశంస ధరణికి నచ్చింది. నిజానికి ‘ ప్రణీత’ తన కన్నా అందంగా ఉంటుంది. అయినా బాహాటంగా మెచ్చుకోవడానికి, ధరణి మనస్సు అంగీకరించ లేదు. “ బాగానే ఉంటుందండీ ! కాని, ఒక్కటే లోపం ” అంది.
“ ఏమిటా లోపం ?” కుతూహలంగా ఆడిగాడు ద్యుతిధర్ .
“ ఆమెకి ఎడమ కాలు సొట్ట !ఆ కాలుని ఆపరేషను చేయించి, జయపూరు కాలు తగిలించుకొంది.”
“ అదా సంగతి ! అందుకే కాబోలు, బండశీనుతో పెళ్లి అయింది. నీకు ఇచ్చిన చీర చూస్తూంటే బాగా డబ్బున్నదని అనిపిస్తోంది.”
“ఆమె ధనవంతుల అమ్మాయండీ ! పాపం, పెళ్లవగానే ఆమె తొలి భర్త విమాన ప్రమాదంలో మరణించాడట ! శ్రీనివాసు గారు ఆమెని రెండో పెళ్లి చెసుకొన్నారట !”
“ ఓహో ! అందమైన కుంటి కాలి రిచ్ విడో అన్నమాట ! బాగానే ఉందిలే, గంతకు తగిన బొంత !” అన్నాడు.
ధరణి జవాబివ్వ లేదు,కుంటికాలు రిచ్ విడోని ,చేసుకో గలిగిన సంస్కారం బండశీను లాంటి వాళ్లకే ఉంటుందని చెప్పాలనుకొంది..కాని అతనికి కోపం వస్తుందని మౌనం వహించింది.
విరించి ,అపాలకి ఇచ్చిన చీర చూసాడు.అతని మనసులో ఈర్ష్య కలిగింది.బండశీను ఒకప్పుడు తన ఇంట్లో నౌకరు. తన భార్యకే ఖరీదయిన చీర బహుమతిగా ఇచ్చి, తనని కించ పరచడానికి ప్రయత్నింఛాడని తీర్మానించాడు.అదే మాట అపాలతో అన్నాడు.
అపాల కూడ జవాబివ్వ లేదు. మనసు లోనే నవ్వుకొంది. శ్రీనివాసుని పూర్తి వివరాలు తెలిస్తే, ఈయన ఎలా రియాక్టు అవుతారో చూడాలి అనుకొంది.
వినత తన వంతు వచ్చిన చీరని విష్ణు మాదవ్ కి చూపించింది. అతనా చీరని చూసి బాగుందని మెచ్చుకొన్నాడు. “బండశీను అనవసర ఆడంబరాలకి పోతున్నాడని అనిపిస్తోంది. పాపం ఇలా ఖర్చు పెడితే ‘పాపర్’ అయి పోతాడు. మీ టూరుకి ఇచ్చే ఫీజుని కాస్త లిబరల్ గా ఇవ్వండి.” అన్నాడు.
“ అలాగేనండి” అంది వినత.
Comments
Post a Comment