Skip to main content

పడగ మీద మణి--౯

  
   
    మరుచటి   రోజు ప్రజాపతి  ట్రేవల్సు వారి నుండి, ఇంకొక  ‘మినీ బస్సు’ వచ్చింది. ఈ సారి అందులో  పూజారి  లేడు. కేటరింగు, డ్రైవింగు సిబ్బందితో పాటు, నలుగురు సెక్యూరిటీ గార్డులు  ఉన్నారు.

    “ శ్రీనివాసు గారూ ! సెక్యూరిటీ  దేనికండీ ?” అడిగింది వినత

    “ మనం  ‘ససాన్ గిర్’  ఆశియాటిక్  లయిన్  సఫారీ  కి వెళ్తున్నాం. అందుకే  సెక్యూరిటీని తెచ్చాను.” జవాబిచ్చాడు శ్రీనివాస్.

    పిల్లలు ముగ్గురూ  ఆ  మాట విని ఎగిరి గెంతేసారు.సింహాలు కనపడతాయా అంకుల్ ! అవి బోనులలో కూర్చొని పడుకోవు కదా ?” అని అడిగాడు  శ్రీకర్.

    గిర్  అభయా  రణ్యాలలో, మూడు వందల సింహాలు ఉన్నాయి.అక్కడ చిత్రమేమిటంటే  ఆ సింహాలని బోనుల్లో పెట్టరు.అవి స్వేచ్ఛగా తిరుగుతాయి.మనమే బోనుల లాంటి  జీపులలో వాటి మధ్యకి వెళ్లి, వాటితో  పాటు  తిరుగుతూ చూడాలి.” అన్నాడు శ్రీనివాస్.

    “ అమ్మో ! అవి మన మీదకి దాడి చెయ్యవా ?” అడిగింది శ్రేయ

    “అంకుల్ అందుకే సెక్యూరిటీ గార్డులని తెచ్చారు, తెలుసా ?” అన్నాడు శ్రీకర్.

    “ అవునా,అంకుల్ !అవి మన మీదకి దాడి చేస్తే ఈ సెక్యూరిటీ వాళ్లు వాటిని  కాల్చేస్తారా?” శ్రేయ ప్రశ్న

    “ లేదమ్మా ! వాటిని చంప కూడదు.కేవలం బెదిరించాలి. మనం వాటి జోలికి వెళ్లక పోతే  అవి కూడా మన జోలికి రావు.”

    “ హేయ్ !అంటూ అరిచారు పిల్లలు, వడి వడిగా బస్సులో ఎక్కి కూర్చొన్నారు. బయట స్వేచ్ఛగా తిరిగే  సింహాలని చూడడానికి  వాళ్లకి సరదాగా  ఉంది.

    పిల్లలే  కాక స్త్రీలు నలుగురూ బస్సులోకి , సరదాగా ఎక్కి కూర్చొన్నారు, “శ్రీనివాసు గారూ ! ససాన్ గిర్  చేరడానికి  ఎంత సమయం  పడుతుంది?”అడిగింది వినత.

    “ మనం రాత్రి తొమ్మిది  గంటల కల్లా, గిర్ చేరుకొంటాం. అక్కడ  కాటేజిలో  రాత్రి విశ్రాంతి తీసుకొని, ఉదయం టిఫిన్లు చేసాక ‘ లయన్ సఫారీ  జీపులలో  వాటిని చూస్తాం, మధ్యలో  లంచికి వచ్చి, మళ్లీ  మిగతా జంతువులని చూసి, రాత్రి బయలు దేరుతాం”, అన్నాడు శ్రీనివాసుడు.

    “ గిర్ ఒకటేనా, ఇంకేవైనా  ప్రదేశాలు చూపిస్తారా ?” అడిగింది అపాల.

    “ మనం రేపు రాత్రి  గిర్ నుండి పనిటాల వెళ్లి అక్కడ హోటల్లో విశ్రాంతి తీసుకొంటాం. ఆ తరువాత  ఉదయానికి ‘శతృంజయ నది’ దగ్గరకి వెళ్తాం.”

     “శతృంజయ నది  పేరు బాగుంది. నదిలో  ఏం చేస్తాం ?” అడిగింది ధరణి.

    “ ధరణి గారూ ! మీకు ఇష్టమైన బోటు షికారు చేద్దాం. శతృంజయ నది, పేరే కాదు, ఆ నది నీరు కూడా చాలా  శ్రేష్టమైనది. గంగోత్రిలోని గంగా నది నీరంత స్వచ్ఛమూ,పవిత్రమూ  అయినది. ఈ నది ఉద్గమ  స్థలమైన  కొండ దగ్గర, రాత్రి  పూట  ఎవరూ  వెళ్లరు, సాయంత్రం  ఆరు దాటితే  చాలు, నిర్మానుష్యమై  పోతుంది. ”

    “ ఎందుకని ?” అడిగింది  ధరణి.,

    “ శతృంజయ  నదిలో  స్నానమాడేందుకు  దేవతలు  వస్తారట ! మనుష్యులు కంట బడితే  రాళ్లుగా  మార్చేస్తారట !”

    “ అలాగా  అయితే  మన జగదేక వీరుడు  దేవ కన్యలని చూసింది  ఇక్కడేనేమో !” అంది ప్రాంజలి.

    “ అయితే  ఈ టూరు చాలా ఎగ్జైయిటింగుగా  ఉంటుంది.” అంది ధరణి. ఆమె  ప్రణీత  ఇచ్చిన  చీరెనే  కట్టుకుంది. ఆ చీరెలో  ఆమె దేవ కన్యలా మెరిసి పోతోంది.

    “ మా ధరణిని చూస్తే,ఆ దేవతలు అలా చెయ్యరు లెండి ”అందిఅపాల నర్మగర్భంగా.

    “ నిజమే  అపాల గారూ ! ఆమె  దేవ కన్యలాగే  ఉన్నారు” అన్నాడు  శ్రీనివాస్.

    ధరణి అందంగా  సిగ్గు పడింది. అపాల  ఆమె  బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకొంది. దానిని  చూసి, ప్రాంజలి, వినతలు  కూడా  ఆ బుగ్గలను  ముద్దాడడానికి  ఎగబడ్డారు. దాంతో  వాతావరణం ఆహ్లాద  కరంగా  మారింది.

    ఉదయం పదికల్లా టిఫిను రెడీ చేసారు వంటవాళ్లు..పిల్లలకి  ఇష్టమైన  నూడుల్సు, సేండ్విచ్చులు చేసారు. పెద్దల కోసం  ఇడ్లీలు, నవరత్న పెరుగన్నం చేసారు. దాని మీద పిల్లలూ, పెద్దలూ  కలిసి దాడి చేసి, క్షణాలలో ఊదేసారు. వంటవానికి కాంప్లిమెంట్సు మాత్రమే మిగిలాయి. పొట్టలు బాగా నిండాయి కాబట్టి సాయంత్రం నాలుగు దాకా తిరిగినా పరవాలేదు అని, అందరూ  బయలు దేరారు.

    స్పెషల్ గా, బోనుల  లాగ, తయారు చేసిన రెండు కస్టమైజ్డ్  వాహనాలు వచ్చాయి. వాళ్లని తీసుకొని ,వెళ్ళడానికి  అపాల, వినత, ముగ్గురు పిల్లలూ, ఇద్దరు సెక్యూరిటీ  గార్డులు ఒక జీపులో  ఎక్కారు. ధరణి, ప్రాంజలి, శ్రీనివాసు, మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు  మరో  జీపులో ఎక్కారు.

    ఆ జీపులలో బోనులా తయారు చేసినవెనక భాగంలో,పెద్ద పెద్ద గాజు అద్దాల కిటికీలు అమర్చి ఉన్నాయి. ఆ కిటికీల దగ్గరే, నైటు విజన్ బైనాక్యులర్లు, తగిలించి ఉన్నాయి.

    సఫారీ బయలు దేరింది. మధ్యాహ్నం ఒంటి గంటకు . వాళ్లకి  ‘వాకీ  టాకీ’ ద్వారా  వేరే   యాత్రీకుల  జీపు నుండి వర్తమానం  వచ్చింది. సింహాలు కనిపించాయని ! అలా  ఎప్పటి కప్పుడు  యాత్రీకుల వాహనాలు ఒకరి కొకరు వార్తలు చెప్పుకొంటూనే  ఉంటారు. వచ్చిన వార్తని బట్టి, వాళ్ల జీపులు, ఆ ప్రదేశానికి  వెళ్లాయి.

    అక్కడికి వెళ్లాక  కనిపించాయి, ఆరు సింహాలు !  రెందు పెద్ద సింహాలు. ఒక సివంగి, మరో మూడు పిల్లలు, మధ్యాహ్నం  లంచి చేసి,  ఎండలో  బధ్దకం  తీర్చుకొంటున్నాయి అవి ! అన్నీఅర్థ నిమీలిత నేత్రాలతో పచ్చగడ్డి మీద పడుకొని మోరలెత్తి అప్పుడప్పుడు ,యాత్రీకుల కోసమా అన్నట్లు చూస్తున్నాయి.కడుపు నిండా ఆరగించాయి కాబట్టి  అవి ఎవరికీ ఇబ్బంది కలిగించవు ! వాటి జోలికి వెళ్లనంత కాలం నిశ్శబ్దంగా, పొందికగా, పోజులిస్తూ చూసే వారికి దర్శన మిస్తాయి. వాటిని అల్లరి పెట్టాలని తల  పెడితే  దాడి చేస్తాయి. అవి ఎంత  నిశ్శబ్దంగా  ఉంటాయో,యాత్రీకులు కూడా,వాటిని అంతే నిశ్శబ్దంగా చూసి వెళ్లి పోవాలి.అదే ఆ మృగ రాజుల న్యాయం ! పిల్లలు ముగ్గురూ  వాటిని చూసి సంతోషంతో  అరవ బోయారు,వినత, అపాల వాళ్ల  నోటిని అదుపులో  పెట్టారు. వాటిని ఇంకా  దగ్గరగా  చూడడానికి  బైనాక్యులర్లు వాడమని చెప్పారు.పిల్లలు  కూడా ప్రశాంతంగా వాటిని చూసి ఆనందించారు.

    జీపులు నెమ్మదిగా, ఆ  సింహ పరివారం చుట్టూ, తిరుగితూ, వాటిని అన్ని కోణాల నుండి  చూడడానికి వీలుగా  పరిక్రమ చేసాయి. దరణి  ప్రాంజలి వాటిని వీడియో  తీసారు. అక్కడనుండి, జీపులు,సింహాల పరిధిని దాటి,నీల గాయి,నెమలి, కొమ్ముల దుప్పి, వగైరా జంతువులు ఉండే స్థావరాలకి  వెళ్లాయి.

    ఎంతో చక్కని నెమళ్లు,నృత్యం చేస్తూ కనిపించాయి.నీలగాయిలు  హుందాగా, గంభీరంగా, నడుస్తూ  కనిపించాయి. కొమ్ముల దుప్పులు బుల్లెట్ వేగంతో పరుగెడుతూ కనిపించాయి.అలా సాయంత్రం  నాలుగు గంటల వరకు  తిరిగి ,కాటేజీకి వెళ్లారు వాళ్లు. అప్పుడు లంచి చేసారు.ఆ తరువాత అందరూ  తమ మిని బస్సులో , గిర్  లోని సింహలకీ, తదితర జంతువులకీ  బైబై చెప్పి, పానిటానా  వైపు ప్రయాణం  సాగించారు.

    ఉదయాన్నే నది దగ్గరకు వెళ్లారు.అక్కడ బోటు  సిద్ధంగా  ఉంది, బోటు ఎక్కి నది నీళ్లలోకి చూసారు. ఆ నది నీరు ఎంత స్వచ్ఛంగా ఉందంటే  నీటి అడుగున ఉన్న రంగు రంగుల గులక రాళ్లు, ఇసుక రేణువులు కూడా కనిపింఛేయి.ఆ నదిలో బోటు షికారు చేస్తూంటే  సమయం  తెలియనే లేదు .మధ్యాహ్నం దాకా  తిరిగి లాడ్జికి వెళ్లి, భోజనాలు చేసారు. తరువాత కొండ మీదకి ఎక్కి నది పుట్టిన  స్థలాన్ని చూసారు.సాయంత్రం నాలుగు గంటలకి  మరల ‘పిరోటాన్’ ద్వీపానికి  యాత్రా ప్రస్థానం మొదలయింది.

    “ శ్రీనివాసు గారూ! పిరోటాన ద్వీపంలో చూసేందుకు ఏమున్నాయి ?”అడిగింది వినత.

    “ పిరోటాన ద్వీపంలో రక రకాల సముద్ర జంతువులని చూడవచ్చు ‘రిచ్ మెరైన్ లైఫ్ ’ ఎంజాయ్ చేయవచ్చు,” అన్నాడు  శ్రీనివాసుడు.

    “ అంకుల్ ! సముద్ర జంతువులంటే  చేపలు,తిమింగాలాలు వగైరాయేనా ?”

    “ ఎండ్రకాయలలో  రకాలన్నీ  చూడవచ్చు. కింగు ఎండ్రకాయలు, హెర్మిట్ ఎండ్ర కాయలు, ఘోస్టు ఎండ్రకాయలు  అని  ఇంకా చాలా  ఉన్నాయి.

    “ బలే, బలే ! ” చప్పట్లు  కొట్టింది శ్రేయ .“ కింగు  ఎండ్రకాయల్కి కిరీటాలు, హెర్మిట్ ఎండ్రకాయల్కి  గడ్డాలు, ఘోస్టు ఎండ్రకాయలకి  కోరలు ఉంటాయా ?” అని అడిగింది.

    “ అలాంటివేమీ కాదు గాని వాటిని పోలినవి ఉంటాయి.అవి పేరుకి తగ్గట్లే  ఉంటాయి. ఇంకా  స్కిడ్, ఆక్టోపసు, సీ హార్సు  చూడవచ్చు.”

    “ అక్కడ ఆక్టోపసు జ్యోతిషం చెబుతుందా ?” శ్రేయ అడిగిన ప్రశ్నకి అందరూ పక పకా నవ్వుకొన్నారు.

    “ ఆ సముద్ర తీరం మీద నడుస్తూ వాటిని చూడవచ్చు,అక్కడకి  వెళ్లడానికి ఫారెస్టు ఆఫీసరు  పర్మిషను తీసుకోవాలి. ఇంకా  తెల్లగా  మెరిసి పోయే  తెల్లని పగడాల చెట్లు చూడవచ్చు.మన దేశంలోని ఒకే ఒక  జాతీయ మెరైన్ పార్కు  అది ! ”

    మెరైన్ నేషనల్ పార్కు అయిన  పిరొటాన్ ద్వీపాన్ని చూసాక అహ్మదాబాదు బయలు దేరారు వాళ్లు.

    “ అంకుల్ ! అహ్మదాబాదులో ఎక్కడక వెళ్దాం మీ ఇంటికా?” అడిగాడు  శ్రీకర్.

    “ లేదు బాబూ ! మా మామయ్య  గారి, ఇంటికి వెళ్దాం. మా ఇల్లు చిన్నది కదా !

    “ రాత్రి అక్కడ పడుకొన్న తరువాత  ఉదయాన్నే ఎక్కడికి వెళ్దాం.?”

    “ ఉదయాన్నేగాలి పటాలు ఉత్సవం ( కైట్సు ఫీస్టివల్ )రేపటి నుండే మొదలవుతోంది, మనం  మంచి సమయానికి  వేళ్తున్నాం ”

    “కైట్సు ఫీస్టివలా ! దాని గురించి చాలా విన్నాం.” ఉత్సాహంతో అంది ప్రాంజలి.

    “అవును  మంచి మంచి గాలి పటాలు  రక రకాల రంగులలో, ఆకారాలలో, గగన విన్యాసం చేస్తూ ఉంటే  చూడడానికి రెండు కళ్లూ చాలవనిపింఛే విధంగా ఉంటుందా ఉత్సవం ! విదేశాల  నుంచి  కూడా పోటీ  చేయడానికి వస్తారు కదా ?” అడిగింది వినత.

    రాత్రి తొమ్మిది కల్లా ప్రజాపతి గారి భవనానికి చేర్చింది ఆ బస్సు ప్రజాపతి గారు ,అతని భార్య, ప్రణీత  వారిని సాదరంగా ఆహ్వానించారు.రాత్రి విందు భోజనాలు అయ్యాక, ప్రముఖ  ‘ బంధానీ ’ చీరల వ్యాపారి  అయిన ,‘ షా  బ్రదర్సు ’వారి ఏజెంటు  వారింటికి వచ్చాడు.

    బంధానీ  చీరలు గుజరాతు, రాజస్థాను రాష్ట్రాలలో  ప్రఖ్యాతి గాంచిన చేనేత సిల్కు చీరెలు.వచ్చిన వ్యాపారి వాటి విస్తృతమైన రకాలు తెచ్చాడు. స్త్రీల ముందు చీరల ప్రదర్శన ! మరా హడావుడి వేరే చెప్పాలా !వినత,అపాల,ధరణి,ప్రాంజలి తమకి నచ్చిన వాటిని, ఎంచు కొన్నారు.ప్రజాపతి గారు భార్య చీరల వ్యాపారిని పేమెంటు తరువాత ఇస్తామని పంపించేసి, కుంకుమ భరిణె తెచ్చేందుకు లోపలికి వెళ్లింది.దాంతో స్త్రీలందరికీ విషయం అర్థమయింది

    ఇప్పుడు మాకీ  చీరలెందుకు,మేము తీసుకోం అంటే మేము తీసుకోం అంటూ పట్టు బట్టారు. ప్రజాపతి గారి భార్య , నిస్సహాయంగా, భర్త వంక చూసింది. దాంతో  ప్రజాపతి  గారు కలుగ జేసుకోక తప్పలేదు.

    ఆయన స్వఛ్ఛమైన తెలుగులో మాట్లాడారు. “అమ్మా ! ఈ చీరలని దానంగా గాని, కానుకగా గాని ఇస్తున్నానని  అనుకోకండి. మీరు చేసిన సహాయానికి  కేవలం కృతఙ్ఞతతో  ఇస్తున్నామని  తెలుసుకోండి.” అన్నారతను.

    ఆ మాటలకి నలుగురూ ఆశ్చర్య పోయారు “ ఏమిటి మీరంటున్నది ? మేము మీకు చేసిన సహాయం ఏమిటి ” అంటూ అడిగారు. ప్రజాపతి గారు చెప్పారు.

    ‘‘పుణ్యభూమి అయిన బదరీ క్షేత్రంలో బదరీ నారాయణుని సమక్షంలో చిన్న ఉసిరి కాయని దానంచేసినా ఆ దాన ఫలితం తరువాతి జన్మలలో ఇబ్బడి ముబ్బడిగా ప్రాప్తిస్తుందని  విశ్వాసం ! అపాలమ్మా ! మీ తండ్రిగారైన కీ. శే. చలమయ్య గారు, గొప్ప దాన వీరుడు. కుడి చేతితో  ఇచ్చిన దానాన్ని , ఎడమ చేతికి తెలియ  నివ్వని  ఉదార హృదయుడు. మా సంస్థకి  బదరీ  క్షేత్రంలో, మూడంతస్తుల  సత్రం ఉంది. ఒక్కొక్క  అంతస్తు లోనూ  ఆరు విశాలమైన గదులు  ఉన్నాయి.ఆ భవనాన్నిమేము దానం పట్టిన ధనంతో  కట్టాం.క్రింద అంతస్తు మొత్తం ఆరు గదులూ, కీ. శే. చలమయ్య గారు దానమిచ్చిన ధనంతోనే కట్టామమ్మా ! ఆ ఫ్లోరుకి  చలమయ్య  గారి పేరే పెట్టాం ! అలాంటి మహోదారుడయిన  వ్యక్తి వంశాంకురం మీరు , మా భాగ్య వశాన మా ఇంటికి విచ్చేసారు.మిమ్మల్నిసత్కరించడం మా అదృష్టం ! ”

    “ బాబాయి గారూ ! అపాల విషయం  సరే ! మరి మాకు కూడా ఎందుకని—”

    “ వినతమ్మా ! నువ్వు చేసిన  సహాయం కూడా  తక్కువది  కాదమ్మా ! చెప్తాను విను. మా  అల్లుడు  గారైన శ్రీనివాసునికి  వారి గురువు గారు, చనిపోయే ముందు ఒక భాద్యతని  అప్పజెప్పారు. ఆ భాద్యతని నెరవేర్చేందుకే మేము  వితంతు శరణాలయం పెట్టాం. కాని మాకు కావలసిన వ్యక్తి, మేము ఎదురు చూస్తున్న పరమ పావని అయిన  సీతాలక్ష్మి గారు మాకు  ఎక్కడా లభించ లేదు. మూడు రోజుల క్రితం  మీరు ఇచ్చిన ఈ మెయిల్  ద్వారా, మాకు ఆమె  చిరునామా  లభించింది. ఆమెను మా శరణాలయానికి  తెచ్చి, ఆమెకి వార్డెను పదవి ఇచ్చాం. అదంతా మీరు చేసిన  ఉపకారమే కదా !”

    “ అయ్యో  బాబాయి గారూ ! ఆ సీతాలక్ష్మమ్మ  గారు  మా  అపాలకి స్వయంగా  పిన్ని గారు. అంటే అపాల పినతండ్రి గారైన జగన్నాధం గారి  వితంతువు ! అపాలే  ఆ నిజాన్ని నాకు చెప్తే , నేను ఈమెయిలు మాత్రమే  ఇచ్చాను, అంతే ! దానికే, --”

    “ వినతమ్మా! స్నేహితురాలు చెప్పిన వార్తకి అంతగా స్పందించి,చేయ గలిగిన సహాయం చేయడానికి కూడా సహృదయం ఉండాలమ్మా!దానిని గౌరవింఛడం మా కర్తవ్యం కాదంటవా ?”

    వినత మరేమీ  మాట్లాడాలేక పోయింది.అంత గొప్ప వ్యక్తి మాటల్ని ఎలా ఖండించ గలుగుతుంది ! ధరణి , ప్రాంజలి  ఏదో చెప్ప బోయారు. ప్రజాపతి గారు వారు అడగక ముందే, ఇలా చెప్పారు.

    “ ప్రాంజలమ్మా ! మీ  నాన్న గారు గవర్నమెంటు ఉద్యోగిగా రిటైరు అయ్యాక, జరుగు బాటు కష్టంగా ఉందని మా  బ్రాంచి ఆపీసులో  ఏదైనా ఉద్యోగం ఇవ్వమని  అపీలు చేసు కొన్నారు.వారిని మేము ఆ ఏరియా యాత్రా కన్సల్టెంటుగా నియమించాము.ఆ విధంగా నువ్వు  మా  ప్రజాపతి  కంపెనీ ఫేమిలీ  మెంబరువి ! నువ్వు కాదనడానికి వీలు లేదమ్మా !”

    “ ధరణమ్మా ! నీ సందేహానికి కూడా  సమాధానం చెప్తాను విను. మీ  మామయ్య గారు , అదేనమ్మా, ద్యుతిదర్  నాన్నగారు  ఒకసారి మా యాత్రలో  పాల్గొన్నారు. అప్పట్లో  యాత్రలు నేనే  నిర్వహించే వాడిని, చాలా కష్ట నష్టాలకి  ఓర్చి యాత్రలని ఒంటి చేతితో నడిపే వాడిని. అలాంటి  ఒక యాత్రలో  అతను , నాకు ధన  సహాయం చేసారు. అది ఎప్పటి మాటో అయినా ఇంకా నేను మరచి పోలేనమ్మా ! అందు వలన నిన్ను కూడా సత్కరింఛే  భాగ్యం నాకు కలిగింది. కాదనకమ్మా !” అన్నారు ప్రజాపతి గారు.

    అపాల, వినత, ధరణి, ప్రాంజలి అతని వాక్చాతుర్యానికి, సహృదయతకీ  జోహార్లు అర్పించకుండా ఉండ లేక పోయారు. అపాల ,పిన్ని గురించి, ప్రాంజలి నాన్న గురించి కొంగొత్త సంగతులు విని కళ్ల నీళ్ల పర్యంతం అయ్యారు. వెంటనే అతని పాదాలకి నమస్కరించారు.

    మొత్తం మీద బంధానీ చేరలని వారు స్వీకరించకుండా ఉండలేక పోయారు.

    గాలి పటాల ఉత్సవం కన్నుల పండువుగా జరిగింది. పిల్లలూ ,పెద్దలూ ఒకే  రకంగా ఆనందాన్ని అనుభవించారు.అక్కడ నుంచి తిరుగు దారిలో, షాపింగు చేయాలని, ఏదైనా  జ్యూయలరీ  షాపుకి తీసుకొని వెళ్ళమని అడిగారు అపాల బృందం. అలాగేనని తనకి బాగా పరిచయమున్న ఒక షాపుకి తీసుకెళ్లాడు.

    ఆ నలుగురూ  కూడ బలుక్కొని  కేవలం  అర గంటలోనే షాపింగు చేసేసారు. వస్తువుని పేక్ చెయించి  ఈ కేష్  కౌంటరు దగ్గరకి వచ్చారు. షాపు యజమాని శ్రీనివాసునికి  తెలిసిన వాడు కావడం వల్ల , లాభార్జన చేయకుండా అతను సరి అయిన ధరకే ఇచ్చాడు. అంతే కాదు వారందరికీ హాండు బేగులు కానుకగా ఇచ్చాడు., ఇంటికి తిరిగి వచ్చాక , వినత , ప్రణీత చేతుల లోంచి, ఆరు నెలల బాబుని చేతుల్లోకి తీసుకొంది.తాము తెచ్చిన బంగారు గొలుసునీ, చేతిమురుగులనీ తొడిగింది. ఆ తరువాత వారు, శ్రీనివాసుని ,పిలిచి అతని చేతులకి రక్షాబంధం కట్టారు.“అన్నయ్య గారూ !బాబుకి మేమిచ్చిన కానుకని కాదనకండి. అదే విధంగా,సమయం కాక పోయినా మా  పీలింగ్సుని అర్థం చేసుకొని,ఈ రాఖీని స్వీకరింఛండి ” అన్నారు.

    ప్రణీత, శ్రీనివాసులు కాదని ఎలా అనగలరు !

    ఆ రోజు రాత్రి మినీ బస్సు  సైటు ఆఫీసుకి  బయలు దేరింది.. ఈ సారి శ్రీనివాసువారితో రాలేదు.మరో రెండు రోజులతరువాత వచ్చేఆదివారం పెద్ద బస్సుని తెస్తానని,అందులో  వారినీ  వారందరి శ్రీవార్లనీ  తీసుకొని, చారిత్రక స్థలానికి టూరు ఏర్పాటు చేస్తానని అన్నాడు.

    తిరుగు ప్రయాణంలో శ్రీనివాసుడు లేక పోవడం వల్ల, స్నేహితురాళ్లందరూ మన్సు విప్పి మాట్లాడుకొన్నారు.

    “ మా నాన్నగారి దాతృత్వం గురించి తెలిసి నా మన్సు ఎంతో ఉప్పొంగి పోయిందే  వినతా ! అదే విధంగా  పిన్నికి మంచి ఆశ్రయం లభించడం  కూడ ఆనంద దాయకంగా ఉంది. శ్రీ సోమనాధుని అభిషేక ఫలం ఇంత సంతృప్తి కరంగా ఉంటుందనుకో లేదు.” అంది అపాల.

    “ నా విషయంలో కూడ శ్రీ సోమనాధుని  అభిషేక ఫలం  మంచి ఫలితాలని ఇచ్చింది. అపాల వదినా ! మా  నాన్నగారికి, ప్రజాపతి గారి కంపెనీలో ఉద్యోగం దొరికిందని తెలిసాక చాల సంతోషం కలిగింది.” అంది ప్రాంజలి.

    “ అవునే ! రెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొన్నాక, రెందు చీరలు లభించాయి, బంధనీ  చీర ఎంత ఉంటుందంటావు వినతా , పాతిక వేలు ఉంటుందా ?” అంది ధరణి.

    “ తప్పక ఉంటుంది. ధర మాటకేం గాని అది, ట్రేడిషనల్ శారీ అవడం దాని ప్రత్యేకత !’

    “ ఏమోనే , ఆ విషయం ప్రక్కన పెట్టి, మన ముందున్న సమస్య  గురించి  చెప్పు.” అంది ధరణి.

    “ ఏ సమస్య గురించే ?”

     “ అదేనే ! ప్రజాపతి  గారు ఇచ్చిన చీరల గురించి  మన వాళ్లకి  అవి తీసుకొన్నందుకు  ఏమని సర్దిచెప్తాం ” అంది ప్రాంజలి. “ ఆరు వేల రూపాయల చీర తీసుకొన్నందుకే మా ఆయన  సొడ్డు చెప్పారు. ఇప్పుడేం చెప్పాలి ?”

    “ ప్రజాపతి గారు చెప్పిన  విషయమే చెప్పు. నువ్వు ఆయన కంపెనీలో పని చేసే సిబ్బంది కూతురువి కదా ? ఆ విధంగా వాళ్ల ఫేమిలీ గర్లువి అయ్యావని అతను అన్నారుగా ! ఆ విషయమే దాచకుండా చెప్పు.”.

      “అంటే శ్రీనివాసు గారి గురించి కూడా నిజం చెప్పెయ్యాలా ? ” అడిగింది ప్రాంజలి.

    “ వద్దు,” అపాల  కాసేపు ఆలోచించి అంది. “శ్రీనివాసు గారి గురించి వివరాలు ఇప్పుడే చెప్పడం మంచి పని కాదు. అతని  పేరు అదే బండశీను అనే పేరు ఎత్తితేనే  మన వాళ్లు చాల  అసహ్యంగా మాట్లాడు తున్నారు. ఇప్పుడు నిజం తెలిస్తే, మనతో టూరుకు రారే ! ఏదో సాకులు చెప్పి తప్పించు కొంటారు.”

      “నిజమేనే అపాలా ! వాల్లు మనతో చివరి మజిలీకి రావాలి. వచ్చిన తరువాతనే అన్ని విషయాలు తెలుసుకోవాలి.” అంది వినత.

    “ మరి యీ చీరల సంగతి ?”

    “ సమస్య ఏముంది,” అంది వినత. “ వారు మనకి  ఇచ్చిన దానికి  బదులుగా మనం వారి మనమడికి  కానుక  ఇచ్చేసాము అని చెప్తే  మా  ఆయన ఏమీ అనరు.”

    “ నాకు కూడా ప్రాబ్లం లేదు.” అంది అపాల,“ మా నాన్న గారి గురించి, తెలిసిన విషయంతొ  పాటు ఇది కూడా చెప్తే సరి పోతుంది.”

    “ నాకు కూడా ప్రాబ్లం లేదు.ద్యుతిధర్ నాన్న గారు ,ప్రజాపతి గారికి చేసిన సహాయం గురించి చెప్తే  చాలు.” అంది ధరణి.

    “ మరయితే ప్రోబ్లం ఎక్కడుంది ?” అంది వినత.

    అందరూ  కిల కిలా నవ్వారు

Comments

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...