శనివారం రాత్రి, సైటు ఆఫీసులో నలుగురు మిత్రులూ ,మూసి వేసిన తలుపుల వెనక మందు పార్టీ చెసుకొన్నారు.సంభాషణ హఠాత్తుగా బండశీను మీదకి మరలింది.
“ ఈ బండశీను గాడు మన ఆడ వాళ్లని బాగా ఇంప్రెస్సు చేసేసాడురా ! ప్రజాపతి కంపెనీలో వాది పొజిషను ఏమిటో గాని, ‘ ఆల్ ఇన్ వన్ లాగు’ ఉన్నాడురా !”
ఊరుకోరా రవీ ! అలా కావడానికి వాడికున్న క్వాలిఫికేషను ఏముందిరా ?”
“ నేనన్నది ఆల్ ఇన్ వన్ మేనేజుమెంటు సైడు నుంచి కాదురా, ‘ కూలీ,కుక్కు, క్లీనరు, పసర్లు గోలీలు ఇచ్చే వైద్యుడు, డ్రైవరు, గైడు ఇవేనురా !”
“ ఇవన్నీ వాడు ఒక్కడే చేస్తున్నాడా ?
“ అవున్రా ! ‘చెట్టు లేని చీట ఆముదపు చెట్టే మహా వృక్షం అన్న’ సామెత ఉండనే ఉందిగా !”
అదొక జోకులాగ అందరూ నవ్వారు. “ వాడు మనని రెపు టూరుకి తీసుకెళ్టాడట ! ఏదో పురాతన కోటలు గోడలు చూపిస్తాడట !”
“ చరిత్ర సరిగా చెప్తాడంటావా ?”
“ అందుకే కదా , హిస్టారికల్ ప్లేసు చూపించ మన్నది. ఈ టూరుతో వాడి చరిత్రకి ది ఎండు చెప్పాలి.”
“నిజమేన్రా తెగ నీలుగుతున్నాడు ! మింగడానికి మెతుకు లేదు మిసాలకి సంపెంగి నూనె అన్నట్లు వాడి బ్రతుకుకీ, ఖరీదయిన బహుమతు లివ్వడం ఒకటి !”
“అది వాడి సొమ్ము కాదురా, వాడు ఎవరినో కుంటి, ముసలి, రిచ్ విడోని పెళ్లి చేసుకొన్నాడట ! ఇదంతా దాని సొమ్ము !”
“ ఆ కుంటి, ముసలి రిచ్ విడో, ‘యూజ్ & త్రో బాపతు కాదు గద !”
ఆ మాటలతో వాళ్లు గది దద్దరిల్లేలా నవ్వుకొన్నారు.
ప్రజాపతి ట్రేవల్సు వారి బస్సు ‘ ‘చంపానేర్ పావ్ గఢ్ ’ యునెస్కో వరల్డ్ ఆర్కియజికల్ హెరిటేజ్ పార్కు’ వచ్చి చేరింది.అందరి కన్నా ముందుగా ,కిలకిలా నవ్వుతూ దిగారు శ్రీకర్, సృష్టి, శ్రేయలు.
చంపానేర్ పావ్ గడ్ పేరు గాని,అది విశ్వ పురాతత్వ సాంస్కతీ సంపద (వరల్డు హెరిటేజు పార్కు )అనే సంగతి గాని,ఆ నలుగురి మిత్రులకి తెలియదు ! బస్సులో ఎవరూ మాట్లాడుకో లేదు.కునికి పాట్లతోనే కాలం గడిపారు.ముందు రోజు రాత్రి, హేంగోవరు కూడా ఉండడం వల్ల.బస్సు ఆగగానే దర్పంగా ఠీవిగా, దిగారు వాళ్లు.
“ ఇదేం సైటురా శీనూ ?” అడిగాడు విరించి. నాలుగు ప్రక్కలా ,ఎరుపు పసుపు కలిసిన జేగురు రంగుతో మెరిసి పోతున్న పరిసరాలని చూస్తూ. దూరంగా ఒక కొండ, దాని మీద ఒక కోట, మరొక కోట మీద ఏదో దేవాలయం, మొండి గోడల మధ్య ఏవేవో కట్టడాలు అన్నీ జేగురురంగు లేపనం చేసుకొన్నట్లు ఉన్నాయి.
శ్రీనివాసు వాటి గురించి చెప్పసాగాడు.
‘వనరాజ్ చావడ ’అనే రాజు,తన భార్య ‘చంపా’ పేరు మీద,పావ్ గడ్ కొండ దిగువ భాగంలో చంపానేరు కోటనీ ,జనపదాన్నీనిర్మింఛాడు. అది క్రీ.శ. పధ్నాలుగు పదహారు శతాబ్దాల మధ్య జరిగింది.
పావా గడ్ కొండ చాలా పావనమైనదట ! చాలా దిర్గమమైన శిలలతో, అరణ్యంతో, లోయలతో, నిండిన ఈ కొండ ప్రాంతంలో, విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసాడట ! అతని కమండలు ధారనుండి పుట్టిన నది పేరు ‘విశ్వామైత్రి’’అని పిలువ బడేది.
దక్షయఙ్ఞంలో సతీ వియోగానికి గురి అయిన శివుడు, ఆమె శరీరాన్ని మోసుకొని తిరుగుతూ ఉండగా అతనిని ఆ వ్యామోహం నుంచి తప్పించడానికి, మహా విష్ణువు సతీ దేవి శరీరాన్ని చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా కత్తిరించినప్పుడు, ఆమె శరీర భాగాలు చాలా ప్రదేశాలలో పడ్డాయని, అవి అన్నీ శక్తి పీఠాలుగా మారాయని చెపుతారు. పావ గడ్ కొండ మీద ఆమె స్తనాలు పడ్డయట ! అక్కడ మహాకాళి శక్తిపీఠం ఉంది.కొండ మీద మహాకాళి మందిరం నిత్యమూ భక్తులతో కళ కళ లాడుతూ ఉంటుంది.
కాలక్రమాన చంపానేరు ప్రాంతం, ముస్లిం పాలకుడైన మహమూడ్ బెగ్డా అదీనం లోకి వచ్చింది. మహమూద్ బెగ్డా , ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చెసాడు. అంతే కాదు, తన రాజధానిని ,అహమదా బాదు నుండి, అక్కడకి మార్చాడు. ఆ విధంగా అది గుజరాతు పురాతన రాజధాని అయింది. అక్కడ దర్శనీయ స్థలాలు,పురాతనమైన కోట, మహాకాళి మందిరం,కీర్తి స్తంభం,వగైరా ప్రముఖమైనవి. పురాతత్వ శాఖ అక్కడి ఎరుపు పసుపు కలిసిన రాతి కట్టడాల్ని పరిరక్షింది. ఎందుకంటే వాటి సౌందర్యం వర్ణనాతీతం.
శ్రీనివాసు చెప్పినదంతా విన్నాక అందులో ఖండించ వలసినది గాని ఆక్షేపించ వలసింది ఏమీ లేదని, గ్రహించారు వాళ్లు.బండశీను బాగానే ప్రిపేరు అయ్యాడు’ అనుకొన్నారు.
ముందుగా కోటనీ , చుట్టుపట్ల పరిసరాలనీ చూసాక ,మహాకాళి మందిరం చూడాలని తొందర పడ్డారు ఆడ వాళ్లు. బస్సుని కోండ మీదికి వెళ్ల గలిగినంత దూరం వరకు తీసుకెళ్లాక, అక్కడ కేబుల్ కార్లు ఎక్కి ఆలయం దిగువ భాగం వరకు వెళ్లవచ్చనీ చెప్పాడు శ్రీను.
రోప వే అనగానే పిల్లలు సరదా పడ్డారు.. అందరూ నలుగురెసి చొప్పున సర్దుకొని కూర్చొన్నారు.
రోప్ వే కారు నుంచి దిగాక , దాదాపు రెండు వందల యాభై మెట్లు ఎక్కి మందిరం చేరుకొన్నారు వాళ్లు. అక్కడ దేవీ దర్శనం చేసుకొన్నాక , శ్రీను వారి నందరినీ మందిరానికి వెనక కాస్త చదునైన ప్రదేశంలో తను ఏర్పాటు చేసిన రెండు టెంట్లు దగ్గరకి తిసుకెళ్లాడు. వాటిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. టాయిలెట్లు, బెడ్ రూములు, డైనింగు రూము, కుర్చీలు సోఫాలు అన్నీ ఉన్నాయి. అక్కడే కేటరింగు సిబ్బంది కూడా ఉన్నారు. లంచి సిద్ధం చెసి ఉన్నారు, పులిహోర బూరెలతో సహా !
మిత్రులు నలుగురూ ఆ ఏర్పాట్లని చూసి అబ్బుర పడ్డారు. “ఒరేయ్ శీనూ ! ఇక్కడ టెంట్లు దేనికి రా ?రాత్రి ఇక్కడే గడపాలా ఏం ?” అని అడిగాడు విరించి.
“ అవును, రాత్రి ఇక్కడే గడిపి, ప్రాతః కాలంలో సూర్యోదయ సమయంలో ఈ ప్రాంతాలని చూడాలి. అలా చూస్తే కనిపించే సుందర దృశ్యం, వెన్నెల రాత్రి ‘తాజ మహలుని’ చూసిన , అనుభూతి కలుగుతుంది”
“ ఏమిట్రా ఆ వింత ?”
“ సూర్యుని అరుణ కిరణాలు పడిన వెంటనే,ఎరుపు పసుపు కలసిన రంగుతో నిండి ఉన్నపరిసరాలు మెరిసిపోతూ కనిపిస్తాయి. ఆ దృశ్యం వర్ణనాతీతం” అని చెప్పాడు
ఇప్పటికి దొరికింది వాళ్లకి అవకాశం ! “ ఒరేయ్ ! ఆ రెండో టెంటు ఎవరికిరా ?” అని అడిగారు.
“ అది కూడా మనకే ! ఆడవాళ్లు ఒక చోట , మగ వాళ్లు ఒక చోట ఉండవచ్చు.”
“ అలాగా ! ఆ టెంటులోకి పద,మాట్లాడుకొందాం” అని శీనుని తీసుకొని వెళ్లారు వాళ్లు.
“నువ్వెక్కడ ఉంటావురా, ఆడ వాళ్ల దగ్గరా ? అయినా అక్కడే ఉంటావులే ! మా దగ్గర ఉండడానికి నీకు ధైర్యం ఎక్కడిది.”
“ అది కాదురా, మన ఆడవాళ్ల మీద వాడు మోజు పడుతున్నాడేమోరా ! అందుకే ఏవేవో చీరలు సారెలు కూడా ఇచ్చాడు.”
“ అవన్నీఇవ్వడానికి డబ్బులెక్కడ నుంచి తెచ్చావురా ! నీ కుంటి, ముసలి, రిచ్ విడో దగ్గరా ?”
“అవును నాకు తెలియక అడుగుతున్నాను,అది అదేరా,ఆ రిచ్ విడో నీలో ఏం చూసి ముచ్చట పడిందిరా?”
“ నల్లగా నీగ్రోలాగ ఉన్నాడు కదా, వాడి సైజు కూడా పెద్దదే అయి ఉంటుందని అనుకొన్నాదేమోరా !”
శ్రీనివాసు జవాబివ్వ లేదు, అతని అంచనా తప్పయింది. వాళ్లు నలుగురూ ఏమీ మార లేదు. ఉన్నత విద్య,మహోన్నత పదవులు వారిని మరింత కుంచించాయి గాని, మానవత్వాన్నీ,మంచితనాన్నీ, సంస్కారాన్నీ, పెంపొందించ లేక పోయాయి.కర్ర చివర నుండే నిప్పు, అన్నిటికన్నా ముందు ఆ కర్రనే కాలుస్తుందన్న నిజాన్ని తెలుసుకో లేని మూర్ఖులు వీళ్లు ! నేను వీరి స్నేహ హస్తాన్ని అందుకోవాలని ఆశ పడ్డాను. అది అడియాస అయింది. ఇక్కడనుండి తప్పుకోవడమే మంచిది. అనుకొని మౌనంగానే వెళ్లి పోయాడు.
అతనలా వెళ్లి పోవడం తమ మొదటి విజయంగా భావించినా, అంత చిన్న గెలుపు వారికి తృప్తి నివ్వ లేదు.కానీ రేపు సూర్యోదయ సమయంలో మన ఆడవాళ్ల దగ్గర వాడిని అవమానిద్దాం, అని తలంచి తృప్తి పడ్డారు. రాత్రికి కావలసిన సరంజామా తెచ్చుకొన్నారు వాళ్లు.ఆడవాళ్ళకి దూరంగా వసతి దొరికింది. మరేమి కావాలి ! నలుగురూ పేకాటకి కూర్చొన్నారు.
ఆ రాత్రి వారు నిద్ర పోలేదు, పేకాటనీ, మందునీ తోడుంచుకొని, తింటూ, త్రాగుతూ, నంజుకొంటూ, గడిపారు. వాళ్ల కళ్ల ముందు వారి ఎంగిలి మెతుకులు ఏరుకొని తిన్న బండ శీను నేడు, వాళ్ల ఆడవాళ్లనే ఎలా ఆకట్టుకో గలిగాడు. వాడికా రిచ్ విడో ఎక్కడ దొరికింది ! వాడికి ఎలా బుద్ధి చెప్పాలి !
రాత్రంతా మీటింగు పెట్టుకొని, వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత తమ కార్య క్రమాన్ని అమలు పరచడానికి తెల్లవారి నాలుగు గంటలకే అలారాలు పెట్టుకొని నిద్ర పోయారు. కాని కలత నిద్రే పట్టింది వారికి.
Comments
Post a Comment