Skip to main content

పడగ మీద మణి--- ౧౧

   
మరునాడు  ఉదయం నాలుగు గంటలకి లేచారు వాళ్లు.

    ఆడ వాళ్ల టెంటు లోకి తొంగి చూసారు. వారు ఇంకా  నిద్రలోనే  ఉన్నారు. పశ్చిమ  కోస్తాలో  సూర్యోదయం  ఆలస్యం అవుతుందని, తెల్లవారి ఆరు గంటలకి  లేస్తే  చాలని , శీనివాసుడు రాత్రే వారికి చెప్పాడు. అందుకే  వాళ్లందరూ ఉదయ సంధ్య లోని సుఖ నిద్రని అనుభవిస్తున్నారు !

    వాళ్లు కాస్త దూరంగా ఉన్న మందిరం వంక చూసారు.మందిర ప్రాంగణంలో శీను సూర్య నమస్కారాలు చేస్తూ  కనబడ్డాడు. అతను కూడా వాళ్లని చూసాడు. తన పనిని వేగంగా ముగించి  వాళ్ల దగ్గ్గరకు వచ్చాడు.

    “ ఏరా ! సూర్యోదయం  చూపిస్తానని చెప్పావు. ఇంకెప్పుడు చూపిస్తావు ?”

    “ సూర్యోదయానికి ఇంకా సమయంఉంది.పదండి ఆ స్పాటు చూపిస్తాను.” అంటూ  శ్రీనివాసుడు ముందు దారి తీసాడు.వాళ్లు అతనిని అనుసరించారు.డాల్ఫిన్సుముక్కులా ఉన్న ఒక కొండచరియ దగ్గరగా తీసుకొని వెళ్లాడు శ్రీను.వాళ్లు ఆ స్థలాన్నిచూసి తమ ప్లాను అమలు జరపడానికి బాగుందని అనుకొన్నారు.శ్రీను వాళ్లకా స్థలం చూపించి, వెను తిరిగాడు, అంతే !

    వెను తిరిగిన శ్రీనివాసున్ని,వాళ్లు నలుగురూ  తమ చేతులు చాచి ,అడ్డగించారు, ‘ఏరా, తొత్తు కొడకా ! మాతో  పెట్టుకొంటావురా ?” అంటూ నలుగురూ ,అతనిని కొండ క్రిందకి తోసేసారు.

    సూర్యోదయం  అయింది  వినత, అపాల, ధరణి, ప్రాంజలి, పిల్లలు ముగ్గురూ లేచారు. శ్రీనివాసునికి బదులు వాళ్లని ,వాళ్ల భర్తలే ఆ కొండ చరియ దగ్గరకి తీసుకెళ్లారు అక్కడ నుంచి ఆ ప్రాంతాన్నిచూసిన స్త్రీలందరూ ఆనందంతో పులకించారు.నలుగురు మిత్రులూ వాళ్ల కోసం నవ్వు పులుముకొన్నారు.

    “శ్రీనివాసుగారు  ఎక్కడ ?” ఆ ప్రశ్నని వినత అడిగింది,అందరూ చెవులు రిక్కించారు.

    “ ఆయన వెళ్లి పోయారు” ఆ నలుగురూ సమాధానం చెప్పారు.

    “ ఏదో పని ముఖ్యమయిన  పని ఉందట ! బహుశా వారి ఇంటి నుండి ఏదైనా సమాచారం అంది ఉండ వచ్చు మనల్ని వెళ్లిపోమని చెప్పారు..పదండి .కేబులు కారు వచ్చే వేళయింది ” అంటూ నలుగురు మిత్రులూ చురుకుగా  పేకింగులు చేసారు.

    ఆడవాళ్లకి నమ్మకం కలగ లేదు. అయినా వాళ్లు మౌనంగా అనుసరించారు. అందరి మనసుల లోనూ ఒకే ప్రశ్న ‘ శ్రీనివాసు గారికి ఏమయింది, ప్రణీతకి గాని ప్రజాపతి గారికి గాని ఏమయినా అయిందా ? అందుకే వెళ్ళి పోయారా ? తామేమీ  మొద్దు నిద్రలు పోలేదే , కాస్త తమకి కూడా చెప్పి పోవచ్చు కదా ! అయినా ఈ మగాళ్లు అంతా ఇంతే ! ఏ విషయమూ అడిగి తెలుసుకోరు !

    కేబులు కారు దిగాక చూస్తే  ప్రభుత్వ బస్సు ఉంది. దాంట్లో ఎక్కారు నలుగురు మిత్రులూ, చేసేది లేక వారితో  పాటే ఆ బస్సును ఎక్కారు వాళ్లు. అది వారిని దింపిన చోట రెండు కార్లు ఉన్నాయి. ఆ కార్లు వాళ్లవే !

    ఒక కారులో  విష్ణుమాధవ్, రవికాంతు ఎక్కారు. వెనకనే వినత, శ్రీకరు,సృష్టి , ప్రాంజలి ఎక్కారు. రెండవ కారులో విరించి, ద్యుతిధర్ ఎక్కారు వారి వెనుకనే అపాల, ధరణి శ్రేయ ఎక్కారు. కార్లు రెండూ బరోడా  వైపు బయలు దేరాయి.

    “మనం ఎక్కడికి వెళ్తున్నాం ?” వినత అడిగింది.

    “ బరోడాకి. అక్కడ మాకొక మీటింగు ఉంది. అది ముగిసాక తిరిగి మన గెస్టు హౌసు వెళ్లవచ్చు.”

    అంతే ! ఇంకెవ్వరూ మాట్లాడుకో లేదు. కారు దగ్గరలోనే  ఉన్న  డాభా దగ్గర ఆగింది. “ వినతా ! బ్రెక్ ఫాస్టు చేదాం పద !” అని కారు దిగాడు విష్ణు మాధవ్ అందరూ దిగారు.డాబాలో  ఆడవాళ్లు పిల్లలూ  ఒక చోట కూర్చొన్నారు. నలుగురు మిత్రులూ  మరొక టేబులు దగ్గర  కూర్చొన్నారు.

    ఆడవాళ్లు నలుగురూ మాట్లాడుకొన్నారు. వాళ్లకి ఏదో సందెహం వచ్చింది. ‘ శ్రీనివాసు ఎంత ముఖ్యమైన పని అయినా తమకి చెప్పకుండా వెళ్లడు ! రాత్రి తమతో ఎంతో సరదాగా మాట్లాడిన శ్రీనివాసు అంత  ఉదయాన్నే, ఎలా  మాయమయి పోయాడు, ఏదైనా ప్రమాదానికి గురి కాలేదు కదా !

    అదే సమయంలో ఒక టూరిస్టు కారు అతి వేగంగా ,డాబా దగ్గరకి వచ్చిఆగింది.

     అది ప్రజాపతి గారి ట్రేవల్  కారే ! దాంట్లోంచి డ్రైవరు మాత్రమే దిగాడు. ఫ్లాస్కు తీసుకొని వచ్చాడు, టీ పోయించు కోవడానికి.అపాల ఆ డ్రైవరు దగ్గరకి వెళ్లింది ,శ్రీనివాసు గారి గురించి అడిగింది.అతను చెప్పిన జవాబు విని స్తభ్ధురాలు అయింది. పరుగు పరుగున వచ్చి వినతతో చెప్పింది.

    నలుగురు మిత్రులూ దానిని చూసారు.అపాల దగ్గరకి వచ్చారు.“ ఏమయింది ?” అని అడిగారు.

    “ శ్రీనివాసు గారికి ఏక్సిడెంటు అయింది. కొండ మీద నుంచి క్రింద పడ్డారట ! ”

    టూరిస్టు కారు వెళ్ళిపోయింది. ఆడవాళ్లు ముందుకి పోవడానికి ఒప్పుకో లేదు. వెనక్కి మరలి శ్రీనివాసు గారిని చూడాల్సిందేనని పట్టు పట్టారు. మగ వాళ్లు మీటింగు సాకు చెప్పారు.చివరికి వినత  సమస్యని తేల్చెసింది. ఆమెకి కారు నడపడం  వచ్చు. మగవాళ్లు నలుగురూ మీటింగుకీ, స్త్రీలు పిల్లలూ  శ్రీనివాసు గారిని చూసేందుకూ తీర్మానించు కొన్నారు. వినత కారుని రివర్సు చేసింది. వాళ్ల కారు చంపానేరు వైపు వెళ్ళింది.

    ఇంతలో కార్ల కాన్వాయి  అన్నీ ప్రజాపతీ ట్రేవల్సు వారివే చంపానేర్  వెళ్తూ కనిపించేయి.! నలుగురు మిత్రులకీ విషయం  అర్థం కాలేదు.ఒక  సామాన్య  గైడు కోసం ఇంత  పటాటోపమా !  టీ  కోసం వచ్చిన ఒక డ్రైవరుని  అడిగారు వాళ్లు. శ్రీను ఎవరని ? సమాధానం విని ఖంగు తిన్నారు. వెంటనే తమ కారును కూడా వెనకకి మరల్చారు.

    చంపానేర్  లోని ప్రభుత్వ ఆస్పత్రి  ముందు జనారణ్యం గిమి కూడింది. అందరి నోటా ఒకటే  మాట !  శ్రీనివాసు గారు త్వరలో కోలుకోవాలి. అతను ఎలా పడి పోయారో  ఎవరికీ అంతు చిక్క లేదు.

    అపాల బృందం తమ వంట వాడిని వెతికి పట్టుకొన్నారు. వంట వాడు ఈ విధంగా చెప్పాడు  శ్రీనివాసు గారు, ఒక  ఆయుర్వేద వైద్యడనీ,ఏవేవో మూలికలు  సేకరించడానికి కొండ చరియల్లోకి ప్రవేశించి ఉంటారనీ  అక్కడే ప్రమాదం జరిగి ఉంటుందని అన్నాడు, అతనితో పాటు, టూరుకి వచ్చిన కేటరింగు పనివారు. అతను ఆ కొండ మీద ఏదో ఒక ఆయుర్వేద మూలిక కోసం, చాలా రోజుల నుండి వెతుకుతూ ఉండే వాడనీ, ఆ పని కోసం కొంత మంది స్థానీయ యువకులని నియమింఛాడనీ, వారిలో ఒకరు, అతను పడిపోతూ ఉండగా చూసాడనీ, సహాయం కోసం మనుష్యులని పిలిచి, అతను పడి పోయిన వెంటనే కాపాడాడనీ చెప్పాడు.

    ఆరు గంటల తరువాత ప్రణీత నుంచి  అపాలకి మెసేజు వచ్చింది. ఆస్పత్రి  లౌంజులో తాను ఉన్నాననీ, వచ్చికలియమనీ  ఉంది ఆ మెసేజులో.! వెంటనే  అక్కడికి  వెళ్లారు వాళ్లు.

    శ్రీనివాసుకి దవడ ఎముక మీద,కుడిచేతి మణికట్టు మీద,ఎడమ కాలి మీద, బలమైన దెబ్బలు తగిలాయి.వాటికి బేండేజీ కట్టి ఉంది. అతనిని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తోసుకొంటూ వచ్చింది.,అతను మాట్లాడే పరిస్థితిలో లేడు.అతనిని ఆ స్థితిలో చూసిన  వినత, అపాల, ధరణి, ప్రాంజలుల కళ్లల్లో  కన్నీళ్లు  గిర్రున  తిరిగాయి. నలుగురు మిత్రుల కళ్లల్లో భయం తొంగి చూసింది. వాళ్ల భయానికి కారణం , శ్రీనివాసుకి ఉన్న ప్రజాదరణ, ధన బలం, అర్థ బలం.! అతను ఒక్క  రిపోర్టు ఇస్తే చాలు, వాళ్లు కట కటాల వెనక ఉండక తప్పదు.

    శ్రీనివాసు తరఫున  ప్రణీతే  మాట్లాడింది. “అపాల వదినా ! మీరు వినత ,ధరణి , ప్రాంజలి రెండు రోజుల  క్రిందట  కట్టిన, ‘రాఖీ’కి అతను కట్టుబడి పోయారు. ప్రమాదం ఎలా జరిగిందీ అతనెవరికీ చెప్పరు ! ఆ మాటలతో నలుగురు మిత్రులూ తేలికగా ఊపిరి పీల్చుకొన్నారు.

     అతను లోయలో పడి పోవడానికి  కారణాలు  ఏవయినా  దాని వల్ల  అతనికి ,ఒక లాభం కూడా జరిగింది. అతను అన్వేషిస్తున్న ‘విద్యుల్లత’ మూలిక అతని చేతికి చిక్కింది. దానితో అతను వారి గురువు భాస్కర మూర్తి గారు చెప్పిన మందు తయారు చేస్తారు.అది ‘సొరియాసిస్’ వ్యాధికి  రామబాణం లాగ పని చేస్తుందట !

     మిమ్మల్ని తిరిగి వెళ్లి పొమ్మన్నారు. విద్యుల్లత  దొరికిన ఆనందం వల్ల అతను, మీ దగ్గర ఎలాంటి  ఫీజు తీసుకోనని చెప్పారు.

    అతని  చిన్ననాటి యజమాను లైన , మీ మీ భర్తలు శాసక వర్గానికి చెందిన వారు, అతను శ్రామిక వర్గానికి చెందిన  వారు. ఈ రెండు వర్గాలకీ మధ్య  మైత్రీ సంబంధాలు  కుదరవని తెలిసినా, అతను  దానిని సుసాధ్యం చేసేందుకు  ప్రయత్నించారు. దానికి  కారణం ఏమిటంటే, చిన్నప్పుడు అతని గురువుగారు చెప్పిన శ్రీ కృష్ణ కుచేలుల స్నేహం కథ ! కాని అది విపరీత పరిణామాలని ఇచ్చింది, దృపద ద్రోణుల కథలాగ అయింది. అందుకని అతను విచారించడం లేదు. అతను ఆశించిన స్నేహ హస్తం అతనికి లభించ లేదు.

    ఆ మాటలు చెప్పి, ప్రణీత , శ్రీనివాసు కూర్చొన్న చక్రాల కుర్చీని  ఆస్పత్రి లోపలికి తీసుకొని వెళ్ల బోయింది. అప్పుడే  ఒక విచిత్రం జరిగింది. వినత చేతిలోని , తన చేతిని విడిపించుకొని, ‘ సృష్టి’ , శ్రీనివాసు దగ్గరకి పరుగెత్తింది. “ అంకుల్ ! బెస్ట్ ఆఫ్ లక్  అంకుల్ ! గెట్ వెల్ సూన్ !” అంది, అతని మెడలో తన  చిన్నారి చేతులని హారంగా  వేసింది. శ్రీనివాసుని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

    ప్రళయం వచ్చి ప్రకృతిని నాశనం చేస్తుంది, అయినా సృష్టి  తన స్నేహ హస్తాన్ని చాపి, ప్రకృతిని  చిగురింప జేస్తుంది. ఈ చిన్నారి బాలిక భవిష్యత్తుకి  ప్రతీక ! పేరు కూడా చిత్రంగా సృష్టే ! తన స్నేహ హస్తాన్ని  చాచి  తనని పులకరింప జేసింది. అది చాలు తనకి !  .శ్రీనివాసుడు ఆ బాలిక వంక స్నేహ పూర్వకంగా చూసాడు. అపాల బృందానికి విషయం అర్థమయింది. తమ భర్తలు అతని పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించినా , సృష్టి తమ  సంవేదనని తెలియ జేయడం వారికి ఆనందాన్ని ఇచ్చింది.

    స్నేహం అపురూపమైన వరం. అమూల్యమైన  బంధం !. దానిని కుల మతాలు, సిరి సంపదలు ,సామాజిక  ఆర్థిక  అసమానతలతనే  ఆంక్షలు  పెట్టి ,అడ్డుకో కూడదు. అలా చేస్తే ఆ స్నేహం ‘ స్నేహంగా మిగలదు అది ‘పడగ మీద మణి’  అవుతుంది.

    వాళ్లు మౌనంగా వెను తిరిగారు. ఆడవాళ్లు తిరిగి ఒకే కారులో కూర్చొన్నారు. విష్ణు మాధవ్ అడిగాడు. “వినతా ఇంకెక్కడికైనా వెళ్తున్నారా ?”

    “ అవునండీ మీతో బరోడా వరకు వస్తాం. అక్కడ నుంచి  శ్రీ సోమనాధ మందిరానికి వెళ్తాం. మీరు మీ మీటింగు పని చూసుకోండి.”

    “ మందిరానికి ఇప్పుడెందుకు ?”

    “ ఇప్పుడు కాక ఇంకెప్పుడు ? ఆ సోమనాధుని కృప వల్ల మా మాంగల్యం నిలబడింది అక్కడ ఎన్ని అభిషేకాలు చేయించినా తప్పు లేదు.” అంది.

    “ మా  మీటింగు అయి పోయాక మేము కూడా వస్తాం. అందరం కలిసి వెళ్లి, శ్రీ సోమనాధునికి అభిషేకం చేయిద్దాం ! శ్రీనివాసు గారి  ఆరోగ్యం కోసం !” అన్నాడు విష్ణు మాధవ్

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...