దృశ్యము 3
( రాయచూరు దుర్గంలోని ఏకాంత నర్తన శాల )
( తెల్లని తెర మీద నాట్యశాలని తలపించేలాంటి ఛాయారూపం కనిపిస్తుంది )
( నర్తన శాలలో కూర్చొని నలుగురు పౌరులు కబుర్లు చెప్పుకొంటూ ఉంటారు)
1.పౌరుడు
ఈ రోజు ఈ నర్తన శాలలో లకుమాంబ కొత్త శిష్యురాలు గజ్జె కట్టి చేసిన దృశ్యం అద్భుతంగా ఉంది కదూ ?
2. పౌరుడు
ఆ నర్తకి పేరు అరాళ కుంతల అట ! రూపం పేరు అన్నీ ప్రబంధ నాయికలాగ ఉన్నాయనుకో !
3. పౌరుడు
శకుంతలగా, రతీ దేవిగా, పార్వతిగా, మోహినిగా ,కుమారి అరాళ కుంతల రంగంలో ప్రవేశించి చేసిన నృత్యం మైమరిపించిందనుకో !
4. పౌరుడు
శకుంతలగా ఆమె కాళిదాసు శకుంతలనే మరిపించిందయ్యా ! అడవిలో విచ్చలవిడిగా ప్రకాశించే వెన్నెల లాంటి తేజస్సు, ముగ్ధ మనసుతో దుష్యంతుని లాంటి రాజశేఖరుణ్ని వశం చేసుకొన్న హావ భావ విలాసం , ఆహా , శకుంతల దిగి వచ్చిందనుకో !
1. పౌరుడు
రతీ దేవిగా, అరాళ కుంతల రంగ ప్రవేశం చేసినప్పుడు, నాలో కోర్కెలు బుసలు కొట్టాయనుకో ! హృదయంలో పొంగు లేచింది. శరీరంలో చైతన్యం కట్లు తెగి పారింది, గగుర్పాటు పుట్టించే ఆ తీరుకి , ఆ పరువం, ఆ కులుకుకి మన్మథుడే దిగివచ్చాడనుకో !
2. పౌరుడు
ఆ కేశ పాశాల విస్తృతి, ఆ స్తన యుగళం యొక్క సౌభాగ్యం, ఆ పిరుదుల కదలిక లోని గంభీరత, ఆ లేత నడుము వంపుల్లోని విద్యుత్’వేగం, ఆ కంటి చూపుల ధాళధళ్యం ,ఆ పద ఘట్టన లోని భావుకత, అచ్చు త్రిలోక సుందరి పార్వతీ దేవియే నాకు ప్రత్యక్షమయిందనుకో !
3. పౌరుడు
మోహినిగా తస్సాదియ్యా ! అరాళ కుంతల అబ్బ , నన్ను మత్తులో పడేసిందనుకో !అది అమృతం పంచిందని అనుకొన్నావేంటి ? నవ్వుల వెన్నెలని కంటి చూపులల లోని కోర్కెని, వంటి ఊపుల లోని తీపిని, వయ్యారం లోని విన్యాసాలని పంచి పెట్టింది.
4. పౌరుడు
ఆ నర్తకి అరాళ కుంతల స్వయంగా దుర్గాధీశుల వారి మనసు హరించి ఉంటుంది. ! నాట్యము ముగిసిన వెనక , ఆమెని తన సన్నిధికి రమ్మని కబురు పంపారట !
1. పౌరుడు
మహలుకి పిలిపించి సన్మానం చేస్తారంటావా ?
2. పౌరుడు
ఏమో మరి ప్రత్యేక ఏకాంత ప్రదర్శన కోరుతారేమో ?
3. పౌరుడు
ఆమె ఏకాంత ప్రదర్శన ఎలా ఉంటుందో తలచుకొంటేనే నాకు అబ్బ ! మనసు మురిసిపోతోంది.
4. పౌరుడు
ఆపండి ఊహాగానాలు ! మనబోటి సామాన్య పౌరులకు, అంతటి మహిమాన్విత కళాకారిణి ఏకాంత ప్రదర్శన తిలకించే భాగ్యమెక్కడిది ? ఇప్పుటికి తిలకించినదే బహు బాగు !
1. పౌరుడు
నిజమే, పరాకు మాటలలో పడి పని మరచి పోయాను.
2. పౌరుడు
పద పోదాం.
(అందరూ ఒకరి వెనకగా మరొకరు నిష్క్రమిస్తారు)
( లైట్లు ఆరుతాయి)
Comments
Post a Comment