Skip to main content

అళియ అరాళీయము--౪



దృశ్యము 4

( రాయచూరు దుర్గం లోని దుర్గాధీశుని మహలు)

( తెల్లని తెర వెనక మహలు ఛాయా రూపం కనిపిస్తుంది )

(లైట్లు వెలగగానే  రామరాజు , అరాళ కుంతల కనిపిస్తారు):

రామరాజు:

    భద్రముఖీ ! నీ నాట్య ప్రదర్శన జరిగే వరకు నీవు లకుమాంబ శిష్యురాలవని చెప్పనే లేదే !?
అరాళ కుంతల:
    నా నాట్యంలో ఏదైనా కౌశలం కనిపిస్తే అది లకుమాంబ శిక్షణ వలనేనని తెలుసుకోండి. ఇంకా ఆమె దగ్గర నేర్వ వలసినది చాలా ఉంది. నేను ఇంత త్వరగా రంగ
 ప్రవేశం చేయడం , ఆమెకి ఇష్టం లేదు.

రామరాజు:
    అటులనా, అయిన అంత త్వరపడనేల ?

అరాళ కుంతల:
    మీ దర్శన భాగ్యం కోసమే ! ముందుగా కాలికి గజ్జె కట్టవలసి వచ్చింది. తీరా వచ్చి చూస్తే  మీరు సామాన్యులు కారు, దుర్గాధీశులని తెలిసింది. ( ముఖం ముడుచుకొంటుంది)

రామరాజు:
    అలిగి, ముఖాన్ని మలినం చేయకు భద్రముఖీ ! నేను నిజాన్ని దాచడాం నేరమే ! దానిని వింటే నీవెక్కడ నాకు దూరమవుతావో నన్న సందేహం వలన అలా ప్రవర్తించాను.ఇంతకీ నన్ను కలిసేందుకు అంత తొందరపాటేల సఖీ ?

అరాళ కుంతల:
    కారణం శృంగారం కాదు, అత్యంత గంభీరమైన రాజకీయం ఆర్యపుత్రా !

రామరాజు:
    రాజకీయ కారణమా ?

అరాళ కుంతల:
    అవును, నిన్నటి దినం, మీరు శంఖ నాదం విని మరలిన పిమ్మట,నాకు ఒక అసాధారణ వ్యక్తితో పరిచయమయింది.
రామరాజు:
    ఎవరా విశిష్ట వ్యక్తి ప్రియా ?

అరాళ కుంతల:
    విజయనగర మహామంత్రి అప్పాజీ మహాశయులు.

రామరాజు:
    అప్పాజీ మహాశయులా !? ఊరక రారు కదా మహాత్ములు ! మా దుర్గము దరిదాపులలో అతని కదలికలు గుప్త చర్యలకు ద్యోతకమేమో కదా ?

అరాళ కుంతల:
    మీ అనుమానము ఆర్యపుత్రా ! మీరు చాళుక్య వంశ క్షత్రియులని, మీ పూర్వీకులు కళింగ యుధ్ధమున విజయనగర రాజుల కొరకు పోరు సలిపి అసువులు బాసినారని , మీరు యీ దుర్గాధీశులయి ఉండనోపునని నాకు తెలియ జేసినది అప్పాజీ మహాశయులే !

రామరాజు:
    అటులనా దేవీ ! వివరములన్నియు ఆ మంత్రివర్యులు సేకరించెనని తెలిసినది. దేవీ ! నీతో పరిచయము అతనికెట్లు కలిగినది ?

అరాళ కుంతల:
    నా తల్లి తండ్రులతో అప్పాజీకి బంధుత్వము కలదు ఆర్యపుత్రా ! మీతో పరిణయమునకు రాజకీయ కారణములు, బంధనములు కాగలవని , అతను నన్ను హెచ్చరించినందు వలననే, నేనిట్లు వచ్చితిని.

రామరాజు:
    దేవీ ఏవి ఆ రాజకీయ కారణములు ?

అరాళ కుంతల:
    ఆర్యపుత్రా ! ఈ దుర్గము ఇదివరకు, విజయనగర ప్రభువుల అధీనములో ఉండేదట ! సుల్తాన్ కులీ దీనిని జయించి, తన అధీనం లోకి తీసుకొని, ఎంతో ముందు చూపుతో  మిమ్ములను అధిపతిగా చేసెనట !

రామరాజు:
    సుల్తాను కులీ ఉద్దేశ్యమేమగునో అప్పాజీ మహాశయులు తెల్పినారా దేవీ ?
అరాళ కుంతల:

    చెప్పినారు స్వామీ ! మీకు విజయనగర ప్రభువుల పట్ల గల రోషము,మీ ధైర్య, శౌర్య, సాహస  ప్రవృత్తి ఈ దుర్గమును శతృవుల నుండి రక్షింప గలవని సుల్తాను వారి ఆలోచనట !

రామరాజు:
    కానోపును ! సుల్తాను వారికి నా మీద గల అభిమానము అట్టిది ! అప్పాజీ అంచనాలు సత్యదూరములు కానేరవు, మరి ఏమియు విశేషములు లేవా ?

అరాళ కుంతల:
    ఆర్యపుత్రా , సావధానులై వినుడు ! మీకును, విజయనగర  ప్రభువులకును మధ్య ఘోర సంగ్రామము జరుగనున్నదట ! విజయనగర ప్రభువు తన చతురంగ బలములతో కోట ముట్టడికి ప్రస్థానము చేసినారట !!

రామరాజు:
    (ఆశ్చర్యంతో) నిజమా చెలీ ! విజయనగర ప్రభువులు పూర్వ సంకేతము లేవియు తెలుపక, సరాసరి కోట  ముట్టడికి పాల్పడినారా ?

అరాళ కుంతల:
    సంకేతముల విషయములు నాకు తెలియవు. మీరు అతి త్వరలో వారి దాడిని ఎదుర్కొనక తప్పదు !
రామరాజు::
    (ఆలోచనలో పడతాడు)

అరాళ కుంతల:
    బల పరాక్రమములు, పౌరుషము ఉన్నంత మాత్రమున సమరమునకు సంసిధ్ధమగుట రణనీతి, రాజనీతి కానేరవు. తమ బలిమి, పగతుర బలములను , సాధ్యాసాధ్య విచారము చేయగల నేర్పు , ఉచితమైన తీర్పును తేగలదు ఇందువలన ధన, సైన్య, ప్రజా నాశనము అనివార్యమే అగును.

రామరాజు:
    లెస్స పలికితివి దేవీ ! మంత్రాంగమున నీవు పురుషులకు ఎంత మాత్రము తీసిపోవు ! సాధ్యా సాధ్య విచారణ , అన్న నీ మాటల మర్మము, మరింత విశదముగా తెలియ జేయుము

అరాళ కుంతల:
    (సంతోషముతో) స్వామీ ! నా ఆలోచన అడిగి నన్ను ధన్యురాలిని చేసితిరి. ఈ అరాళ కుంతల మీకు ఋణపడి పోయినది!సాధ్యా సాధ్య విచారణ అనగ, ‘పోరు నష్టము,పొందు లాభము’ గురించి, నిష్పక్షపాతముగా అంచనా వేయుట ! విజయనగర ప్రభువులు చతురంగ బల సమేతులు. వారికి అంగ బలము, అర్థబలము ఎక్కువ కాదందురా స్వామీ ?

రామరాజు:
    నిజమే దేవీ ! నా దగ్గరనున్న సైన్యము, కేవలము దుర్గ రక్షణకు పరిమితము. సమరము వంటి పెద్ద నిర్ణయము తీసుకొనుటకు,  నేను అస్వతంత్రుడను. సుల్తాను వారి ఆనతి  పొంది  సైన్యములను రప్పించవలెను విజయనగర ప్రభువులు దానికి అవకాశమివ్వరని, నీ మాటల వలన తేటతెల్లమయినది.

అరాళ కుంతల:
    పరిమిత సైన్యముతో పోరు సలుపుట, ఆత్మహత్యా సదృశమని  నా తలపు. మీరేమందురు స్వామీ ?

రామరాజు:
    నిజమే చెప్పితివి దేవీ ! నీవు అనిన సాధ్యాసాధ్య విచారణ అదియే అయి ఉండ నోపును. ఇప్పుడు కర్తవ్యమేమున్నది ?
అరాళ కుంతల:

    స్వామీ, మీకు కర్తవ్యమును ఉపదేశింపగల సామర్థ్యము నాకెక్కడిది ?అయినను ___
రామరాజు:
    ( ఆమెను తదేకంగా చూసి) చెప్పుటకు సందేహమేల చెలీ ?

అరాళ కుంతల:
    అటులయిన నా మాట వినుడు. దాడికి ఇంకను సమయమున్నది. మీ దుర్గమున నున్న ధనరాశిని, మీ పరిమిత సైన్యముతో, సుల్తాను వారి కడకు సురక్షితముగా పంపి, నిర్ధన, నిష్ప్రాణ దుర్గమును , ఎటువంటి ప్రతిఘటన లేకుండ, శతృవుల వశము చేయుడు..

రామరాజు:
    (దిగ్భ్రాంతుడై ఆమె వంక చూస్తాడు) ఏమంటివి దేవీ !?

అరాళ కుంతల:
    సమయమునకు తగిన, అముచితోపాయము చెప్పినాను ఆర్యపుత్రా ! దీని వలన మీ కీర్తి ప్రతిష్టలకు కళంక మగును గాని, సుల్తాను వారికి ఎటువంటి నష్టము వాటిల్లదు. ఇక దుర్గమును జయించిన వారికి, ఎట్టి లాభము కలుగదు. మీరు  సుల్తాను వారికి, సమర్థవంతముగా  చెప్పి, అంగీకరింప జేసి, తిరిగి చతురంగ బలములతో ,కోటను ముట్టడి చేసి, శతృ విజయము పొందవచ్చును.

రామరాజు:
    దేవీ ! విపరీత పరిస్థితుల యందు చేయు కార్యమునే నీవు వక్కాణించితివి. కాని ____

అరాళ కుంతల:
    నిజముగనే అట్టి విపరీత పరిస్థితి దాపురించినది ఆర్యపుత్రా ! నా మాటలు విశ్వసింపుడు. కాలాతీతము చేసిన, కోటలోని సంపదను శతృవులు కొల్లగొట్ట గలరు.

రామరాజు:
    (దీర్ఘంగా నిట్టూర్పువిడిచి) దేవీ, సమయోచిత ప్రసంగము చేసి, నన్నుసంతోషపరచితివి.నీవు కూడ నా వెంట-

అరాళ కుంతల:
    తప్పక వచ్చెదను ఆర్యపుత్రా ! సుల్తాను దగ్గర మీకు ఏదైన ఆపద సంభవించిన, మిమ్ములను కాపాడుకొన వలసిన భాద్యత నాది కాదా ?

రామరాజు:
    దేవీ ఏమంటివి, సుల్తాను వారి దగ్గర ఆపదా ?

అరాళ కుంతల:
    అవును ఆర్యపుత్రా ! మీ తిరోగమన చర్య వారికి నచ్చనిచో, ఆపదయే కదా ?

రామరాజు:
    సుల్తాను వారు నా పట్ల కఠిన నిర్ణయము తీసుకొనలేరనే నాకు తోచుచున్నది.

అరాళ కుంతల:
    మన ప్రయత్నము మనము చేయవలెను. విధి మనకు అనుకూలము కాకపోదు.రాజేంద్రా !


రామరాజు
    నీ నోట వచ్చిన  రాజేంద్ర శబ్దము, భవిష్య సూచకము కాగలదు గాక !

( అంటూ ఆమెను కౌగిలిలోకి తీసుకొంటాడు)    ( లైట్లు ఆరిపోతాయి )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద