దృశ్యం ౬
( గోల్కొండ కోట లోని రాచబాట)
( తెల్లని తెర మీద పురవీధిని ప్రదర్శించాలి)
( రామరాజు ఉదాశీనంగా అడుగులు వేస్తూ ఉంటాడు. నలుగురు సిపాయిలు చేత ఆయిధాలతో అతని వెనకగా వస్తారు. అతని మీద నల్లని ముసుగు వేసి కప్పి, అతనిని క్రింద పడవేసి, గుండేల పైన బల్లేలు గురి పెడతారు వారిలో ఇద్దరు)
( తక్కిన ఇద్దరు ఒక తాడుతో ఆ ముసుగుతోనే అతనిని బంధించి ఈడ్చుకొంటూ వెళ్తారు)
( లైట్లు ఆరిపోతాయి)
దృశ్యం ౭
( రహీంఖాన్ ఇంట్లోని చెరసాల)
( తెల్ల తెర పైన చెరసాలని చూపించాలి)
(రామరాజు బందీగా ఉంటాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉంటాయి. నోట గుడ్డ కుక్కబడి ఉంటుంది. కళ్లకి గంతలు కట్టి ఉంటాయి)
(ప్రవేశం ఇద్దరు కొజ్జాలు)
౧.కొజ్జా
అక్కాయా ! కాపలా దారులు ఇద్దరూ మంచి పోటుగాళ్లలా ఉన్నారు. నాకైతే మనసయి పోయిందనుకో !
౨..కొజ్జా
మనసు పారేసుకోకే చెల్లాయా ! పని మీద వచ్చి ఇలాంటి వాటికి పడిపోతే , ఫలితం దక్కదే ‘బేవార్సు పింజా ’!
౧.కొజ్జా
బేవార్సు పింజ అంటే ఏంటే అక్కాయా ?
౨.కొజ్జా
కరుకు కాయ కాదు, పండు కాయా కాదు, ఏ మాత్రం ఎదగని ముదర పింజనే,‘ బేవార్సు పింజ’ అంటారే
చెల్లాయా !
౧.కొజ్జా
అక్కాయా ! నేను అన్నానని అనుకోకు, నువ్వూ, నేనూ , ‘బేవార్సు పింజలమే’ కదా అక్కాయా ?
౨.కొజ్జా
ఛీ పో ! పళ్లు రాలగొడతాను. ఖైదీని విడిపించు ముందు .
(ఇద్దరూ రామరాజు దగ్గరకి వెళ్లి , అతని కట్లు విప్పుతారు. కళ్లకి ఉన్న గంతలు, నోట్లో కుక్కిన్ గుడ్డ తీస్తారు)
రామరాజు:
ఎవరు మీరు?
౧. కొజ్జా
తెలియడం లేదా పోటుగాడా ! మేము ` బేవార్సు పింజలం'
రామరాజు:
అంటే?
౨.కొజ్జా
దాని మాటలకేం గాని అందగాడా , రహీంఖాన్ బంధించి ఉంచిన నిన్ను విడిపించడానికి వచ్చాం. కాపలా కాసే సిపాయిఅలకి మా హొయలు. వగలు చూపించి, మత్తు మందు ఇచ్చి వచ్చాం.
రామరాజు:
అలాగా ! కృతఙ్ఞుణ్ని, నన్ను విడిపించడానికి ఇంత ప్రయత్నం చేసిన మీరెవ్వరు ?
౨.కొజ్జా
మా మలికిన్ ‘కుల్’సుంబీ’ బేగం హుకుం మీద వచ్చాం.
౧.కొజ్జా
పోటుగాడా ! నువ్వు ఆవిడా మనసు గెలుచుకొన్నావ్ !నిన్ను ‘ నికా’ చేసుకొంటుందట !
రామరాజు:
ఎవరు, ‘కుల్’సుంబీ’వా, ఆవిడ ఎవరు ?
౨.కొజ్జా
ఇతరు, అత్తరు, అగరొత్తులు, చందనాలు అమ్మే వ్యాపారి మా మాలికిన్ ! నిన్ను తప్పించి తెస్తే బోలెడి డబ్బులిస్తానంది !
౧.కొజ్జా
కాని నిన్ను చూస్తుంటే ( అతని చెయ్యి పట్టుకుంటూ) తప్పించాలని లేదు పోటుగాడా ! నిన్ను వాటేసుకొని పోట్లాడాలని ఉంది !
౨.కొజ్జా
అదుగో చెల్లాయా ! మళ్లీ పని మరిచిపోయి మనసు మాటలాడుతున్నావ్ ! ముందు అతనిని తీసుకొని పదవే బేవార్సు పింజా !.
౧.కొజ్జా
అలాగే అక్కాయా ! ( రామరాజు చెయ్యి పట్టుకొంటుంది )
౨.కొజ్జా
నీ చేతికి కత్తినిస్తే వందమందినైనా ఎదిరించ గలవని చెప్పింది మా మాలికిన్ బీబీ ! కాని మా దగ్గర కత్తి లేదు.
౧.కొజ్జా
( అక్కడ ఉన్న ఒక లాఠీని తీసి ) ఇదుగో ఈ లాఠీని తీసుకొని రా, ఎవరైనా ఎదిరిస్తే బుర్రలు బద్దలు కొట్టేయి, అంతే కదా అక్కాయా ?
౨. కొజ్జా
అంతే పోటుగాడా ! బుర్రల మీదే కొట్టు.
౧.కొజ్జా
తొడల మీద కొట్టమాకు అందమైన పోటుగాడా ! మా లాంటి బతుకులు అయిపోతాయి.
౨.కొజ్జా
అంటే బేవార్సు పింజలు అయిపోతారు పద అందగాడా , మాతో రా !
( ఇద్దరూ రామరాజు చేతులు పట్టుకొని బయటికి తీసుకెళ్తారు)
( లైట్లు ఆరుతాయి )
Comments
Post a Comment