Skip to main content

అళియ అరాళీయము--- ౭

దృశ్యము ౭

(అత్తరు వ్యాపారి కుల్’సుంబీ టెంటు)

( తెల్లని తెర్ మీద ఒక టెంటు కనిపిస్తుంది)

( లైట్లు వెలగగానే  కుల్’సుంబీ నిండా బురఖాలో కూచొని ఉంటుంది. ఆమె కి ఎదురుగా రామరాజు కూర్చొని ఉంటాడు)

రామరాజు:
    కుల్’సుంబీ బేగం ! మీరు అత్తరు వ్యాపారి అని విన్నాను. ఎంతో ధనాన్ని వెచ్చించి నన్ను విడిపించారని తెలిసింది. కాని నామీద దేశ బహిష్కార శిక్ష పడింది. నేను మీకు ఏ విధంగా సహాయపడ గలను.?

కుల్’సుంబీ:
    మీరు నాకు సహాయపడడ మేమిటి  ఆర్యపుత్రా ! నేను బ్రతికేదే మీ కోసం !

( అంటూ ముఖం పైన పరదా తీస్తుంది .ఆశ్చర్యం ఆమె అరాళ కుంతల)

రామరాజు:
    భద్రముఖీ ! నీవా, ఆశ్చర్యంగా ఉందా ?

అరాళ కుంతల:
    ఆర్యపుత్రా ! మిమ్ములను ఈ ఆపదలోకి  నెట్టినది నేనే కదా ! సుల్తాను మీ మాటలు విశ్వసించక పోతే మిమ్ములను  కాపాడు కొంటానని మాట ఇచ్చాను, మరచిపోయారా ?

రామరాజు:
    లేదు ప్రియా ! కాని నన్నెలా కాపాడగలవు ? రేపు సూర్యోదయమునకు ఇంక చాల తక్కువ వ్యవధి ఉంది.

అరాళ కుంతల:
    ఆ వ్యవధి చాలు ఆర్యపుత్రా ! మీరు అత్తరు వ్యాపారి, ‘రహమతుల్లాగా’ అవతారమెత్తాలి ! సూది గడ్డం , కోర మీసాలు, కుచ్చు టోపీ పెట్టుకొని షరాబు వేషం వేయండి. నేను మీ నవోఢ అయిన బేగం కుల్’సుంబీని ! ఈ బురఖాలోనే ఉంటాను. మనం మరి కొన్ని క్షణాల్లో బయలుదేరి, తెల్లవారే లోపల ,‘బీదరు’ రాజ్యానికి వెళదాం.

రామరాజు:
    బీదరు వైపు సూర్యోదయానికి ముందు చేరుకోగలమా దేవీ ?

అరాళ కుంతల:.
    చేరుకోలేక పోయినను ప్రమాద ముండదు. ఆర్యపుత్రా ! రహీంఖాన్ మిమ్ములను ఒంటరిగా, విజయనగర సరిహద్దుల వైపు అన్వేషిస్తాడు. మీరు జంటగా బీదరు వైపు ప్రయాణము చేయగలరని ఊహించలేడు.

రామరాజు:
    భద్రముఖీ ! నీ ఆలోచన బహు బాగున్నది !

అరాళ కుంతల:
    సమయము చాల తక్కువగా నున్నది ఆర్యపుత్రా ! పదండి గుడారం లోకి వెళ్దాం.

( ఇద్దరూ వెళ్లిపోతారు)

(లైట్లు ఆరిపోతాయి)

దృశ్యము ౮

( విజయనగర ప్రభువు శ్రీ కృష్ణ దేవరాయల ఆంతరంగిక శాల)

(తెల్ల తెర మీద కోట అంతఃపురం కనిపిస్తాయి)

(లైట్లు వెలగగానే అప్పాజీ కనిపిస్తాడు)

 (అరాళ కుంతల, రామరాజు ప్రవేశిస్తారు)

అప్పాజీ:
    రామరాజ ప్రభూ ! (లేచి నిలబడి) విజయనగర రాజ ప్రాసాదానికి మీకిదే ఘన స్వాగతం !

రామరాజు:
    అప్పాజీ మహాశయా ! నేను ఇప్పుడు సర్వమూ పోగొట్టుకొన్న సన్యాసిని. ప్రభు శబ్స వాచ్యమునకు తగిన వాడను కాను !

అరాళ కుంతల:
    స్వామీ, మీరిట్లనుట తగదు. మీరు నాకు ఎల్లప్పుడు ప్రభువులే !

రామరాజు:
    అది నీ సహృదయము భద్రముఖీ ! నీకీ రాజ్యమున ఇంతటి విశిష్ట వ్యక్తి సమ్ముఖమునకు ప్రవేశమెట్లు దొరికినది ?

అప్పాజీ:
    (నవ్వుతూ) రామరాజ ప్రభూ ! ఆమె వేరెవరో కాదు, మా ‘భర్తృదారిక’ , కుమారి అరాళ కుంతలా దేవి ! శ్రీ కృష్ణ దేవ రాయ సార్వభౌముల వారి పుత్రిక !

రామరాజు:
    (ఆశ్చర్యముతో) నిజమా, అరాళ కుంతలా ! నమ్మ శక్యము గాకున్నది !!?

( ప్రవేశం శ్రీ కృష్ణదేవ రాయలు)

శ్రీకృష్ణ దేవ :
    రామరాజ ప్రభూ, ఇది ముమ్మాటికీ నిజము ! ఇంతటి సాహస కార్యము సాధించిన , అరాళ కుంతల నా పుత్రిక అను పరిచయము కన్న, నేనే ఆమెకు జనకుడనని చెప్పుకొనుట మాకెంతయు ముదావహము !

రామరాజు:
    (నమస్కరించి) విజయనగర సార్వభౌములకు జయమగు గాక !

శ్రీకృష్ణ దేవ :
    ( రామరాజుని కౌగలించుకొని) రామరాజ ప్రభూ, మా గారాల పట్టికకు ప్రభువులైన మీరు మాకును ప్రభువులే!! మిమ్ములను ,‘అళియ’ శబ్దముతో సత్కరించి , విశేషాధికారములను ఇచ్చుటకు  ఆతుర పడుచున్నాను.

అప్పాజీ:
    రామరాజ ప్రభూ ! ‘అళియ’ శబ్దమునకు , కర్ణాటక భాషలో , ‘ అల్లుడు’ అని అర్థము ! సార్వభౌములు మిమ్ములను జామాతగా చేసుకొన గోరుతున్నారు.

రామరాజు:
    ధన్యుడను మహాశయా, ధన్యుడను ! అరాల కుంతలా దేవిని ఇల్లాలుగా బడయగల భాగ్యము కన్న నాకు
 కావలసినది ఏమున్నది ?

( అప్పాజీ చప్పట్లు కొడతాడు)

(ఇద్దరు భటులు చేత పూల మాలలతో ప్రవేశిస్తారు.అప్పాజీ ఒక భటుని చేతిలోని మాలను తీసుకొని, అరాళ కుంతలకు ఇస్తాడు)

శ్రీకృష్ణ దేవ :
    నీ మనోహరునికి వరమాల వేసి స్వాగతము చెప్పుము పుత్రీ !

( అరాళ కుంతల , సిగ్గుతో తల దించుకొని రామరాజుకి అభిముఖంగా తడబడుతూ వెళ్లి, అతని మెడలో వరమాల వేస్తుంది. రామరాజు మరొక భటుని చేతిలోని మాలను అందుకొని ఆమె మెడలో అలంకరిస్తాడు)

( వధూ వరులను మధ్యలో పెట్టుకొని శ్రీ కృష్ణ దేవ రాయలు, అప్పాజీలు చెరొక ప్రక్క నిలబడతారు)

(తెర పడుతుంది)

****************
(సమాప్తం)
****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద