Skip to main content

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౨ – ఆంభృణి.


 { కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ ఆంధ్ర ప్రభ వార పత్రిక ౮.౮.౧౯౬౨ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.}


భయంకరమైన అరణ్యం !

కండ్లు పొడుచుకొన్నా, ఏమీ కనబడని చీకటి !

ఎండుటాకుల గల గల శబ్దం, ఎడతెగని నక్కల ఊళలు, క్రూర మృగాల గాండ్రింపు ధ్వనులు, చీరండల ర్గీంకార శబ్దం, -- ప్రకృతి భయంకర రూపం దాల్చింది !

దడ దడమని అడుగుల చప్పుళ్లు !

కొన్ని వందల గజాలకు అవతల కాగడాల వెలుతురు, చెట్ల మధ్యనుండి ఆ వెలుతురు  ‘నిప్పుకణాల్లాగ’ కన్పిస్తోంది !

 అడుగుల చప్పుడు ఆగింది !

ఒక స్వరం—“ శతద్రూ! శత్రువులు సమీపిస్తున్నారు. నీవు పాపని జాగ్రత్తగా వీపుకి దుప్పటి మడతలలో కట్టుకొని, ధృవతారని చూసుకొంటూ, పరుగెత్తి వెళ్లి పో ! సహస్ర పద దూరంలో కౌశికాశ్రమం ఉంది. ఆ ఎల్లని చేరావంటే , ఈ వేట కుక్కలు నెన్నేమీ చేయలేవు.”

మరొక స్వరం –“ నాథా ! మిమ్మల్ని వదలి నేను వెళ్లలేను. మిమ్మల్ని విడచి జీవించడం కంటె, నాకు మరణమే శ్రేయస్కరం.”

“ శతద్రూ ! పిచ్చిమాట లాడకు. పరంతపుని చేతిలో గాని నీవు దొరికితే దాని పరిణామాన్ని ఊహించావా ? ఏ మానాన్ని నీవు ప్రాణ ప్రదంగా చూసుకొంటున్నావో, ఆ మానం బలి  ఐపోతుంది ! పాప ప్రాణాలతో ఉండదు, జాగు చేయకు. కాగడాల వెలుతురు దగ్గర పడుతూంది !”

భయంకర ఛీత్కారంతో  యువకుని ఖడ్గం ఒరలోంచి బయటకి వచ్చింది !

ఇద్దరూ , ఒకరినొకరు గాడంగా కౌగలించుకొన్నారు !

యువతి బెక్కుతూ ఏడుస్తూంది !

ఆమె కన్నీటిని పెదవులతో తుడుస్తూ, ముద్దులు కురిపించాడు యువకుడు.

“ శతద్రూ ! నా ప్రాణమా ! కదలి వెళ్లి పో ! పాప జాగ్రత్త ! నీవు కౌశికాశ్రమ ప్రాంతం చేరే వరకు నా కృపాణంతో నేను శత్రువులని ఆపు చేయగలను.”

“ అయ్యో, అయ్యో , నాథా !”

మరల ఆ యువతీ యువకులు గాఢంగా కౌగలించుకొన్నారు. కాగడా వెలుతురు మరింత దగ్గర పడింది.

“ నాథా ! వెళ్తున్నా.”

పాప తల్లి వీపు మీద దుప్పటి మడతలో నిశ్చింతగా నిద్రిస్తూంది. కత్తుల రాపిడి శబ్దం శతద్రూకి విన్పిస్తూంది.

**************

“ ఆంభ్రూ ,ఆంభ్రూ .”

“బిడ్డా ! ఆకలి వేస్తూందా ? వెర్రి కూనా ! నీ తండ్రి ఏమయ్యాడో నీకు తెలియదు కదా ? ఇందా, కడుపు నిండా పాలు త్రాగు.”

శిశువు తల్లి చన్ను కుడుస్తూ నవ్వింది.
“ నా వెర్రి తల్లీ ! నవ్వుతున్నావా ? నీ తల్లి అవస్థ నీకేం తెలుసు ? భగవంతుడు నాకు గొప్ప రూపం ఇచ్చాడు, నా కొంప తీసాడు. నా రూపం నాకే శత్రువయి పోయింది ! పాడు రూపం, అదే నా ప్రాణ నాధుని పొట్టన పెట్టుకొంది ! బిడ్డా ! నీకూ భగవంతుడు రూపాన్ని ఇచ్చాడు ! నీవూ నాలాగే బాధపడతావేమో !?”

“ ఆంభ్రూ !”

“ ఆంభ్రూ ఏమిటే, కన్నా ! పిల్లలు ,‘ అమ్మా; అని పిలుస్తారు, నీవు ఆంభ్రూ అని పిలుస్తావు ! నీదంతా కొత్తరకం ! బిడ్డా, ఈ చన్ను లోని పాలు అయిపోయిందా ? ఇందా, ఈ ప్రక్క త్రాగు.”

సర సరమని శబ్దం !

“ అయ్యో ! పాము ! కృష్ణ సర్పం కూడాను !”

ఒక గజం దూరంలో భయంకరమైన కాల సర్పం ! దాని పడగేమో పెద్దదేమీ కాదు, దాని శరీరం ధగ ధగమని ఉషః కాంతిలో మెరిసి పోతోంది ! పడగను రెండడుగులు పైకి ఎత్తింది.
 దాని నాలుకలు అగ్ని కీలల్లాగు ఉన్నాయి ! కండ్లలో మిరుమిట్లు కొల్పే కాంతి !

“ సర్ప రాజా ! కాటేస్తావా ? తండ్రీ ! నన్నే కాటేయి, నా పాపని రక్షించు !”

“ ఆంభ్రూ, ఆంభ్రూ !” పాప బిగ్గరగా ఏడ్చింది.

సర్పం అటూ ఇటు చూసింది. పడగను మరికొంత మీదికి ఎత్తింది !

“ అయ్యో !” శతద్రు కళ్లు మూసుకొంది.

“ ఆంభ్రూ !---” శిశువు రోదన !

*****************

“ వత్సా ! పాము వెళ్లిపోయింది. భయం లేదు. ఎవరవమ్మా నీవు ?” అని ఒక గంభీర స్వరం వినిపించింది.

శతద్రు కళ్లు విప్పింది.

సగం నెరసిన నిడుపాటి గడ్డం, భుజంపై వ్రేలాడుతున్న ఉంగరాల జుత్తు, జ్యోతిర్మయములైన కండ్లు, మొనతేలి నిడుపైన నాసిక,విశాలమైన విభూతి రేఖలతో కూడిన ఫాలం,కావి తేరిన వస్త్రాలు, చంకలో దర్భాసనపు చుట్ట, చేతిలో కమండలం ! ఇట్టి వేషంతో ప్రత్యక్షమయ్యాడు ఒక ముని.

“ మహాత్మా ! నేనొక అనాథ ఆర్య స్త్రీని ! ఇక్కడకి పది క్రోసుల దూరంలో ఉంది మా గ్రామం !”

“ వత్సా ! నీవు ఒంటరిగానా వస్తున్నావు ?”

“ మహాత్మా ! లేదు, నాతో నా భర్త కూడా వచ్చారు. శత్రువులు మమ్మల్ని పసిగట్టి వెంటబడ్డారు. నా నాథుడు---- ”

“ సరే ! నాకు అర్థమయింది. నీ నాథుడు నిన్ను పారిపొమ్మని చెప్పి, శత్రువులని ఎదిరించి నిలబడ్డాడు, అంతేనా ?”

“ మహాత్మా ! అవును, అయ్యో , నా నాథుడు – ” అంటూ బిగ్గరగా ఏడ్వనారంభించింది శతద్రు.

“ బిడ్డా ! ఏడవకు, ఏడ్చిన వారిని భగవంతుడు కరుణించడు. ఏదీ మన చేతులలో లేదమ్మా ! అలాగని నిస్పృహ చెందకూడదు.బాగా విచారిస్తే అన్నీ మన చేతిలోనే ఉన్నాయి ! ఈ సత్యం మానవుడు గుర్తించ లేదు, కాబట్టే సుఖ దుఃఖాలకు అతడు లొంగి పోతున్నాడు. అమ్మా ! కష్టాలని  సహించడం లోనే ఉంది మనశ్శక్తి ! లే, నాతో రా ! నా ఆశ్రమంలో నీకు ఆశ్రయం లభిస్తుంది.అనాథల్ని ఆదరించడమే మా బోటి వారల పరమ కర్తవ్యం !”

ముని ఉపదేశ వాక్యాలు శతద్రు హృదయానికి అమృత సేచనం లాగయింది ! ముని కదిలాడు. శతద్రు పాపని చంకన వేసుకొని వెనక నడిచింది.

“ ఆంభ్రూ !” అని పాప నవ్వుతూ కేక వేసింది.

“ ఈ ఆంభ్రూ ఏమిటమ్మా ?” ముని ప్రశ్నించాడు.

“ మహాత్మా ! ఈ పిల్ల నేల పడింది ఈ శబ్దంతోనే !

“ పాప పేరేమి ?”

“ ఇంకా పేరు పెట్టలేదు. సంవత్సరం నిండింది ఎప్పుడూ ఏవో అవాంతరాలే !”

“ సరే ! ఈ పిల్లకి ,‘ ఆంభృణి’ అని నామకరణం చేస్తున్నాను.”

“ మహాత్మా ! మహాప్రసాదం !”

******************

  “ ఆంభ్రూ !”

“ ఏమే?”

ఆంభృణి తల్లి చన్ను కుడుస్తూంది.

“ బాబ !” అని ఆంభృణి తల్లితో చెప్పింది.

కుశీద ముని కుమారుడు ,‘దివోదాసు’ మెల్లగా అడుగులు వేసుకొంటూ వస్తున్నాడు.

వాడు శతద్రు ప్రక్కగా ని;లబడి, ఆంభృణిని అపేక్షతో చూస్తున్నాడు.“ దివా , ఏమమ్మా ! ఏం కావాలి ?” అని అడిగింది శతద్రు. దివోదాసు ఏమీ బదులివ్వ లేదు. మౌనంగా నిలబడ్డాడు. వాని దృష్టి శతద్రు చనుమొనల పైననే ఉంది !

“ దివా ! పాలా కావాలి ?” అని నవ్వింది శతద్రు.

“ అమ్మా ! పాప, పాలు—” అని వేలు పెట్టి చూపించాడు దివోదాసు.

దివోదాసు రెండేండ్ల బాలకుడు. కుశీద ముని పత్ని, దివోదాసుకు తల్లి మరణించి సంవత్సరమయింది ! అప్పటి నుంచి వానికి గోక్షీరమే శరణ్యమయింది.

“ రా, బాబూ !” ఈ ప్రక్క నీవు కూడ పాలు త్రాగు, ఏం?” అని శతద్రు వాణ్ని అక్కున చేర్చుకొంది.

దివోదాసు ముఖం ఆనందంతో తామరపువ్వులా వికసించింది. శతద్రు కుచ కుంభాన్ని రెండు చేతుల తోనూ పట్టుకొని పాలు త్రాగడం ప్రారంభించాడు.

ఆంభృణికి అసూయ పుట్టింది.తన హక్కు భుక్తమయి ఫోతోంది మరి ! ఆంభృణి దివోదాసు బుగ్గను గిల్లింది.

దివోదాసు చలించ లేదు, క్షీర పానంలో తన్మయుడై పోయాడు !

పాలను నోట్లో ఉంచుకొనే, ఆంభృణి “ బాబ – పాలు—” అని తల్లితో ఫిర్యాదు చేసింది.

“ ఆంభ్రుణీ ! మన బాబ కాదూ ? వాడూ పాలు త్రాగుతాడు, ఏం?”  అని పిల్లను సమాధాన పరచింది తల్లి.

నోట్లో పాలు ఉంచుకొనే ఆంభృణి తన అంగీకారాన్ని తెలిపింది. అది మొదలు ఆంభృణీ  దివోదాసులు స్తన్య దాయాదులు అయిపోయారు !

శతద్రు పాలను ఇద్దరూ సమంగా పంచుకొన్నారు.

దివోదాసు రానిదే ఆంభృణి పాలు త్రాగదు !

ఆంభృణి లేనిదే దివోదాసు పాలు ముట్టుకోడు !

ఈ క్షీర సఖుల చేష్టలచే శతద్రు తన దుఃఖాన్ని మరచింది ! ఆ పిల్లల తొక్కు పల్కులు ఆమెకు ఉపనిషత్ గ్రంథం విలువని ఇచ్చాయి !

ఆ పిల్లల నవ్వు పువ్వుల్లో  ఆ తల్లి హృదయం నందనవన మయింది ! ఆ మాత ఉన్నత స్తన మండలంలో ఆ శిశువులు అమృత ధారలు గ్రోలారు !

ఆ పిల్లలు రెండు వైపులా క్షీర పానం చేస్తూంటే ఆ తల్లి హృదయంలో ప్రేమ సముద్రం కెరటలు వేసుకొంటూ పొంగుతుంది !

ఆ ప్రేమ క్షీరామృత పానంచే ఆ బాల బాలికలు ప్రేమ డోలికల్లో ఊగులాడారు !

ఆ తల్లి నిర్మల క్షీరధారలు, వారి శరీరాల్లో లావణ్యాన్ని, ముఖాల్లో తేజస్సును , కనుకొలకుల్లో రాగాన్ని పుట్టించినవి !

వారిద్దరూ ఏపుగా పెరిగారు !

దివోదాసు మిసమిసమని పెద్దావు కోడె దూడలా పెరిగాడు !

ఆంభృణి పంచకళ్యాణి గుర్రం పిల్లలాగు పెరిగింది.

వాళ్లిద్దరినీ చూసి, కుశీద ముని – “ తల్లీ ! నీ స్తన్యం చాలా గొప్ప విలువైనది ! దానిలోని క్షీరం ప్రతిభావంతమైనది ! ఆంభృణీ దివోదాసులు ఇద్దరూ విచిత్ర రూప సంపదచే మెరిసిపోతున్నారు !” అని తన సంతోషాన్ని వెల్లడించాడు.

శతద్రు సిగ్గో లేక అవ్యక్తమైన ఆనందమో గాని, తల ద్రించుకొంది !

****************

 కుశీద ముని ఆంభృణీ దివోదాసులు ఇద్దరికీ ‘ ఉపనయన సంస్కారం ’ కావించాడు.( వేద కాలంలో ఆడ పిల్లలకు కూడా ఉపనయన సంస్కారం ఆచారమై ఉండేది )ఇద్దరూ , ఆ
 మహాత్ముని చరణ సన్నిధానంలోనే సంస్కృత భాషాధ్యయనం కావించారు. వారిద్దరూ ‘వేద వేదాంగాల’ పారం చూడ సాగారు !

ఆంభృణి రూపంలో ‘శచీదేవి’ ! చదువులో సినీవాలి (సరస్వతి )! ఆమె వేద గానంలో విశ్వమే శయనిస్తుంది ! కాలం శర వేగంతో పరుగు పెట్టింది.

ఆంభృణి యందు పదహారు వసంతాలు ఉజ్వలంగా వెళ్లాయి.

దివోదాసు పధ్ధెనిమిది శరత్తులను దాటాడు !

శతద్రు తన కుమార్తె విద్యా సంపత్తిని చూసి ఆనందించింది ! ఆమె అమర సన్నిభమైన రూపాన్ని చూసి గడ గడా వణకి పోయింది !

ఆంభృణీ దివోదాసులు  తమ బాల్యాన్ని, కౌశికీ నదీ తీరాల్లోనూ, విశాలమైన అరణ్య మధ్యంలోనూ గడిపారు !

వారిద్దరిలోనూ అనురాగం పొంగి పొరలింది !

వారిద్దరి హృదాయాల లోనూ ప్రేమ భానూదయం కలిగింది.

*****************

మామిళ్లు పుష్పించాయి.

కౌశికీ  నదీజలాలు నిర్మల భావాల్ని పొందాయి! పగటి పూట తాపం, రాత్రి కమ్మదనం మానవ జన్మలోని సుఖ దుఃఖాల జత వలె భాసించాయి !

కోకిల వసంత గీతాల్ని ఆలాపించింది !

వసంతం ప్రవేశించింది !

ఆంభృణి యౌవనం పరిమళించింది ! దివోదాసుని హృదయంలో కోర్కెల తరంగాలు దొర్లాయి.

ఒకే చన్ను కుడిచిన ఆ బాల్య మిత్రులు తమ ప్రేమలో భిన్నత్వాన్ని  చూడలేక పోయారు !

అది సాయం సమయం !

కౌశికీ నది మధ్యన ఒక బండ రాతిపై , ఆంభ్రుణీ దివోదాసులు ఇద్దరూ కూర్చొని ఉన్నారు.

ఆంభృణి తన పాదాలతో నీటిని ఎగజిమ్ముతూంది.

అప్పుడామె పాదాలు తామర మొగ్గల భాంతిని కలిగిస్తున్నాయి. దివోదాసు తాను ఏరి తెచ్చిన దర్భలు సమంగా అమర్చి సరి చేస్తున్నాడు.

పడమర సూర్యకిరణం ఎర్రని రాగి తాంబాలం లాగు మెరుస్తూంది !

పక్షు;లు బారులు కట్టి, మేఘ శకలాల్లాగు నింగిని ప్రయాణిస్తున్నాయి !

మందమారుతుడు సౌరభ వాహియై కమ్మగా వీస్తున్నాడు !

ఆ నిర్మల వాతావరణం ఆ  ప్రేమిక మిథునంలో మధురమైన  భావాలని పుట్టిస్తూంది !

వారిద్దరూ ఒకరినొకరు అపేక్షగా చూసుకొన్నారు.

“ ఆంభృణీ ! నీతో ఏమేమో మాట్లాడాలని నా మనస్సు తొందర పెడుతూంది.మాట్లాడడం చేత కాకుండా ఉంది !”

“ ఉపోద్ఘాతం చక్కగానే ఉంది . మాట్లాడదలచుకొన్న దాన్ని కాస్తా బిగ్గరగా చెప్పు.”

“ నీ హృదయంలో ఎలాగుంది ?”

“ నా హృదయం లోనా ? ఏముంది ? గురువులన్నట్లు ‘హిరణ్మయ పురుషుడు’ ఉండవచ్చు ! వాణ్ని చూడాలని తలంచి లోపలికి దృష్టిని దింపుతే--- (సిగ్గు)—నీ ముఖం కన్పిస్తూంది,” అని ఆంభృణి కలకలమని నవ్వింది.

దివోదాసు శరీరం పులకించింది.

“ ఆంభ్రూ ! నీ మూర్తి కూడా నా హృదయంలో ప్రతిష్టితమై పోయింది !”

“ ఓహో ! అలాగా ? అయితే మనమిద్దరం ఒకే అవస్థలో పడిపోయామన్న మాట ?”

“ ఆంభృణీ ! నీ నవ్వులో అపారమైన శక్తి ఉంది. అది నా హృదయంలోని చీకటిని పోగొట్టింది కాని చాల వేడిగా ఉంది !”

“ఏమో బాబూ ! ఈ విషయంలో నీకున్న పాండిత్యం నాకు లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, నీకు సంతోషం పుట్టించే పని ఏదైనా సరే , నేను చేయడానికి సిధ్ధం !”

``ఆంభృణీ ! నే నీ రోజు చాల ధన్యుణ్ని,  నా హృదయ రాణి నా పట్ల దయ జూపింది.”

ఆంభృణి సిగ్గుచే తల వాల్చింది.ఆమె  నును బుగ్గలపై  సింధూర  కాంతి ప్రసరించింది.

దివోదాసు ఉద్రేకంతో ఆమెను దగ్గరకు తీసుకొన్నాడు.

ఆంభృణి లతలాగ కంపించింది. వారిద్దరూ అన్యోన్యం కౌగిలిలో ఇమిడి పోయారు.

వారు విశ్వాన్నే మరచిపోయారు.

“ ఆంభృణీ ! నీ తల్లి నిన్ను పిలుస్తోంది. దివా ! నాతో ఆశ్రమానికి రా !” అని ఒక భీకర మైన శబ్దం వారి ఆనందాన్ని పటా పటాపంచలు చేస్తూ వినిపించింది.ఇద్దరూ లేచి నిలబడి చూసారు !

కుశీద ముని వారి దృష్టికి గోచరించాడు.

***************

ఈ వైనం జరిగిన మరునాడు –

అరుణోదయమైంది. నిత్యోపస్థానం కావచ్చింది. అగ్ని ముఖం కావింప బడింది.

కుశీద ముని ప్రథానాసనాన్ని అలంకరించాడు.ఆశ్రమ విద్యార్థులందరూ వారి వారి స్థానాల్లో కూర్చొని ఉన్నారు.

ఆంభృణి చుట్టూ చూసింది.

దివోదాసు అక్కడ లేడు ! హోమక్రియ నెరవేరింది. విద్యార్థులు వారి వారి పనులు చేసుకొనే నిమిత్తం వెళ్లిపోతున్నారు.

ఆంభృణి లేచింది.

“ వత్సా, ఆంభృణీ ! నీతో మాట్లాడాలి. అక్కడే కూర్చో !” అని ఆదేశించాడు కుశీద ముని.

అందరూ వెళ్లిపోయారు, ఆంభృణి  మునికి ఎదురుగా కూర్చొంది. ఆమె హృదయం కొట్టుకొంటోంది.

“ ఆంభృణీ ! నీవు దివోదాసును కామ వాంఛతో ప్రేమిస్తున్నావా ?”

ఆ ప్రశ్న పిడుగు పాటులా వినిపించింది ఆంభృణికి.

“ గురుదేవా ! వాంఛా స్వరూపం నాకు తెలియదు ! నేను దివోదాసుని ప్రేమిస్తున్నాను.”

“ వాణ్ని నీవు వివాహం చేసుకోవడానికి కోరుతున్నావా ?”

“ అవును.” అని శబ్దం గద్గదంగా వెలువడింది !

“ బిడ్డా ! నీ వాంఛ చాల నిందనీయమైనది ! నీ హృదయం నుంచి దానిని పారద్రోలు ! దివోదాసు నీకు అన్న ! నీ తల్లి పాలు త్రాగి నీతో సమంగా పెరిగాడు. మీ ఇద్దరూ ధర్మ విరుధ్ధంగా నడుస్తున్నారు !”

ఆంభృణి మౌనంగా ఉండిపోయింది.

“ వత్సా ! విను, ఆశ్రమానికి గురు స్థానంలో ఉన్న నేను ఈ విషయంలో కఠినంగా ప్రవర్తించక తప్పింది కాదు, లేనప్పుడు ఆశ్రమం తారుమారు అవుతుంది ! అది అవాంఛనీయం. దివోదాసు నా కుమారుడే ! అయినా వానికి కఠిన శిక్ష విధించక తప్పలేదు. వాణ్ని పండ్రెండు సంవత్సరాలు హిమాచలంలో చాంద్రాయణాది నియమాలతో తపస్సు చేసుకోవలసిందిగా ఆఙ్ఞ ఇచ్చాను ! నీవు వాణ్ని మరచి పో ! నీ సర్వ విధుల్ని సక్రమంగా నెరవేర్చుకో !” అన్నాడు కుశీద ముని.

ఆంభృణి పిడుగు పడిన లతలాగ నిర్జీవమయింది ! కండ్ల వెంబడి కన్నీటి ధారలు ప్రవహించాయి.

“ గురుదేవా ! నాకు—నాకు కూడా -- శిక్ష విధి—చండి ” అని మాట తడబడుతూ మెల్లగా చెప్పింది.

“ బిడ్డా ! నీవు నిరపరాధివి ! స్త్రీ సర్వకాల సర్వావస్థలందును నిరపరాధిని. పురుషుడే స్త్రీ చేసిన అపరాధానికి భాధ్యుడు ! దివోదాసే అపరాధానికి భాద్యుడు,శిక్షార్హుడు !నీవు
 కాజాలవు , అదే ధర్మ రహస్యం ! కాబట్టి నీ వేమీ చింతించకు డి నీకు.అనుకూలుడైన వరుని చూసి నీ వివాహం జరిపిస్తాను. నాకు నిష్టాకాలం సమీపించింది. ఇక నీవు వెళ్లు.’’ అని ముని తన ఆసనం నుండి లేచాడు. .

************

ఆంభృణి కుశీద ముని వద్ద వేదాధ్యయనం చేయడానికి వెళ్లడం లేదు !

ఆమె ఎల్లప్పుడూ ఏకాంతాన్ని కోరుకొంటోంది.

ఆమె అరణ్య మధ్యంలో వెళ్లి చెట్ల క్రింద కూర్చొంటుంది.అప్పుడామె దృష్టి  అంతర్ముఖమై పోతుంది ! ఆ స్థితిలో ఆమె స్వాత్మ ప్రకాశంలో లయాన్ని పొంది పోతుంది ! విశ్వమంతా తనలోనే ఇమిడి ఉందన్న భావం ఆమెలో భాసించింది ! విశ్వ ప్రేమలోనే ఆనందం ఉందనే సత్యం ఆమెకు గోచరించింది !

తానిప్పుడు ప్రత్యేకమైన వ్యక్తి పైన ప్రేమను చూపడం సరి కాదని  ఆంభృణి  తలచింది.

‘ ప్రేమ-- తద్వారా కలిగే క్షణికానందం – ఈ రెండింటినీ విడదీయలేని పరిస్థితినే సంసారం అని చెప్పారు, మునులు. ప్రతీ వస్తువునీ అనుభవించాలనే భావం ఎట్టిది ? ఆలోచిస్తే అదే కామం ! కామం పుట్టినంత మాత్రం చేత – వస్తువు అనుభవానికి లొంగదు.అప్పుడు రంగం లోకి వచ్చి పనిచేయ తగ్గది ఏది ? అదే ప్రేమ ! కామాన్ని పోషించి వస్తువుని నీ
 అధీనం కావించే శక్తి ప్రేమకే ఉంది !’

ఈ విధంగా ఆంభృణి తనలో తానే తర్కించుకొంది.

విశ్వ ప్రేమలోనే పరమాత్మ శక్తి భాసిస్తుందనే సత్యం ఆంభృణికి వ్యక్తమయింది.

“ సమస్త ప్రకృతినీ, తదదిష్టాన శక్తినీ, నిను---- అనగా నీ లోని అహం శక్తిని ప్రేమించు” అని ఒక దైవీకమైన బోధ ఆమెలో ఉదయించింది.

“ అయ్యో ! నాకెందుకు ఈ దృష్టి ? ఈ దృష్టి వల్ల మనస్సు చలించి పోతుంది ! ఇదే సర్వ కామ ప్రేమశక్తి కలది. భగవన్ ! పురుహూత ! నా కీ దృష్టిని తొలగించు ! నీ కొక మాసం గడువు ఇస్తున్నాను. ఈ మాసాంతంలో – భగవన్ ! వజ్రపాణీ ! – నీవు అనుగ్రహించి నా దృష్టిని నాశనం చెసితివా సరే , లేదా ఇతర బాహ్యోపాయాలచే నా దృష్టిని నేనే నాశనం చేసుకొంటాను. ” అని గట్టిగా అరణ్యం మారు మ్రోగేటట్లు భగవంతునితో సవాలు చేసింది ఆంభృణి !

*********************

శతద్రు తన కుమార్తె జీవితం లోని మార్పుని గ్రమనించింది. ఆంభృణిని ఉద్దేశించే ఆమె జీవించగలుగుతూంది. తన కూతురు ఒకింటి వెలుగై, దాని గర్భం పండితే, తానెంతో ఆనందిస్తుంది. ఇప్పుడు ఆంభృణి పరిస్థితి తన ఆశలను పటాపంచలు చేసేలా ఉంది !

“ ఆంభ్రూ ! ఏదో తప్పు జరిగి పోయింది ! పెద్దల తీర్మానం పాటించడం మన విధి. నీ వింకా దివోదాసునే ప్రేమిస్తున్నావా ? నీ ముఖాన్ని చూచి నేను జీవిస్తున్నాను. నీ తల్లిని కష్టంలో దింపకమ్మా ! ” అని దీనంగా కుమార్తెను చూసి చెప్పింది.

“ అమ్మా ! గురుదేవుల ఆఙ్ఞను పాటించకుండా నీకు దుఃఖాన్ని కలగ జేస్తానా ? నీవేమీ సందేహించకు, దివోదాసుని నేను సోదరునిగానే భావిస్తున్నాను” అనిసమాధానం ఇచ్చింది.

“ అలాంటప్పుడు నీవు సర్వం త్యజించిన దానిలాగున్నావు. ఎందుకు? నీ కంటిలో చెప్పవీలుకాని  కాంతి కన్పిస్తోంది ! నాకేమో భయంగా ఉంది .”

“ అమ్మా ! నా కంటిలో విపరీతమైన వెల్గుని చూస్తున్నావా ? భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడల్లే ఉంది !”

“ బిడ్డా ! నీవు చెప్పేది నాకు అర్థం కాలేదమ్మా !”

  “ అమ్మా ! నా కంటి దృష్టిని  నాశనం చేయమని భగవంతుని కోరాను.”

“ అయ్యో, అదేం తల్లీ ?”

“ నేను దివోదాసుని ప్రేమించాను. అది నింద్యమని గురుదేవులు చెప్పారు. ఇక ఈ దృష్టి ఉండి లాభం లేదు, అందుకే నాకు నేనే శిక్ష విధించుకొన్నాను.”

******************

 శతద్రు కుశీద మునికి  ఆంభృణి భయంకర నిర్ణయాన్ని చెప్పింది. ముని కొన్ని నిముషాలు ధ్యానంలో మునిగి ఇలా అన్నారు. “ వత్సా, శతద్రూ ! నీ గర్భం ఒక వెలలేని ముక్తాఫలాన్ని ఆర్య లోకానికి ప్రసాదించింది ! ఆంభృణి విషయంలో మన మానవ బుధ్ధులు జోక్యం చేసుకో కూడదు ! కాల గర్భంలో ఆంభృణి  భావి చాల తేజోవంతమై ఉంది, దానిని నేను చూచాయగా చూడగలుగుతున్నాను.”

శతద్రు గురుదేవుని మాట విని మౌనం వహించింది.

ఒక రోజు సాయంకాలం. ఆ రోజే ఆంభృణి పెట్టుకొన్న గడువు మాసం లోని ఆఖరి రోజు కూడ !

సూర్యదేవుడు ప్రకృతిపై ఆగ్రహం వహించాడు కాబోలు, ఎర్రగా మెరిసిపోతున్నాడు ! అతని సింధూరారుణ కిరణాలు అచేతనమైన వస్తు జాలానికి చైతన్యాన్ని కలిగిస్తున్నాయి.
ఆకాశం నిర్మలంగా ఉంది.

చల్లని గాలి వీస్తోంది.

ఆంభృణి నది మధ్య బండరాతిపై కూర్చొని ఉంది.

నదీ జలం మర్మర ధ్వనితో పయనిస్తోంది.

ఆంభృణి హృదయ గుహ తెరచుకొంది ! ఆమె దృష్టులు లోలోకి దిగజారి పోతున్నాయి !

 ఆమె ఇట్లు ఎలుగెత్తి భగవంతుని ప్రార్థించింది. “ భగవన్ ! ఇంద్రా ! గడువు పూర్తి కావచ్చింది. నీ బిడ్డ ప్రతిఙ్ఞను పాలించవా ? నీ వజ్ర ధారని నాకు చూపవా ?”
తూర్పు మెరసింది ! వృక్షాలను ఊగులాడిస్తూ ప్రచండ వాతం వీచింది ! నల్లని మేఘ శకలం తూర్పు దిసలోనుంచి పడమరగా పయనించింది ! అది నిముష నిముషానికీ విశ్వ రూపం దాలుస్తూంది ! దాని వేగాన్ని అరికట్టడానికి వాయుదేవుడు అట్టహాసం చేస్తున్నాడు ! వాత వేగాన్ని మేఘుడు సహించలేక పోయాడు ! క్రోధంతో మరింత నలుపెక్కాడు ! అతని సహచర మేఘాలు, తమ నాయకునికి బలాన్ని చేకూర్చే నెపంతో నాలుగు ప్రక్కల నుండి దూసుకొని వస్తున్నాయి ! మేఘమండలం అంతా ఒకటే కల్లోలం !
విశ్వాన్ని కంపింపజేసే ఉరుములు దొర్లాయి !

ఆంభృణి జడ ప్రాయంగా ఉండిపోయింది.

దడదడ మనే శబ్దంతో కుండ పోతతో  వర్షం ప్రారంభించింది.

ఆంభృణి పూర్తిగా తడిసిపోయింది !

ఉరుములు, మెరుపులు తమలో తాము మాట్లాడుకొంటున్నాయి !

ఆంభృణి కదలలేదు ! ఆమె ఈ లోకానికే  స్వస్తి చెప్పిందా ? లేదు, ఆమె తన హృదయ గుహలో విహరిస్తూంది !

“ ఆంభృణీ ! కండ్లు తెరచి నాకు అప్పగించు” అని ఒక నాదం బయలుదేరింది !

ఆంభృణి కండ్లు తెరచింది. !

దిగ్గన ఒక జ్యోతిష్కిరణం సూటిగా ఆమె కండ్ల లోనికి చొచ్చుకొని పోయింది ,అంతే !

ఆంభృణి ముఖం భాను బింబంలాగు మెరిసింది !!

 ఆంభ్రుణి అంధురాలై పోయింది !!

****************

ఆంభృణితో పాటు శతద్రు కూడ తపో వ్యసనంలో పడింది !

ఇద్దరూ ఇంద్ర ధ్యానంలో తమ శరీరాల్ని మరచి పోయారు !

ఆంభృణి మనో నేత్రం తెరచుకొంది !

ఆమె వాణి  తేజోమయమయింది !

ఆమెకు పరావాక్కు సిధ్ధించింది !

ఆమె నోట్లోంచి మంత్రాలు నిర్గమించాయి !

కుశీద ముని తన శిష్య గణంతో వచ్చి , ఆంభ్రుణి ముఖ నిర్గతమైన  ఋక్కుల్ని గ్రంధస్థం చేసాడు !

ఆ ఋక్కులే ‘ వైదిక  దేవీసూక్తంగా’ నేటికీ వెలుగుతున్నాయి !!

*****************
పండ్రెండు సంవత్సరాలు దొర్లిపోయాయి.

దివోదాసు తపస్సు ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు.

ఆంభృణి వృత్తాంతాన్ని విన్నాడు దివోదాసు. అతడు ఆంభృణి సన్నిధానంలో వచ్చి నిల్చొన్నాడు. బ్రహ్మ తేజస్సుతో భానుబింబం లాగ ప్రకాశిస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలిని చూసాడు.

అక్కడ ఉన్న వారంతా మౌనంగా ఉన్నారు.

“ దివా ! సోదరా ! వచ్చావా ?” అని ఆంభృణి పలకరించింది. అందరూ ఆశ్చర్యపోయారు ! అంధురాలు ఆంభృణికి దివోదాసు మూర్తి ఎలా గోచరించింది !?

“ సోదరా ! నేను అంధురాల్ని. అయినా నా హృదయంలో నిన్ను చూడగలుగుతున్నాను ! నిన్నే కాదు, సమస్త విశ్వాన్నీ నేను చూస్తున్నాను ! నేనే సర్వంగాను, సర్వం నేనుగాను,-- ఉన్నాయి !! వింత ఏమీ లేదు ! ఇదే సత్యం. ఈ సత్యాన్ని నేను ప్రపంచానికి వెల్లడి చేసాను. ” అని చెప్పింది ఆంభృణి.

“ సోదరీ ! ఆంభృణీ ! నేను ధన్యుణ్ని. నీవు నాకు ఉపదేశించిన సత్యాన్ని పూర్తిగా మననం చేయడానికి నాకు ఇంకా కొంత కాలం పడుతుంది ! నిన్ను కన్న తల్లి శతద్రు, మాతృలోకంలో అత్యుత్తమ స్థానాన్ని అలంకరించింది ! ఇంద్రుణ్నే
పతిగా వరించి ,‘ అపాల’ భరత నారీ మణుల కీర్తిని పోషించి ఉత్తమ స్త్రీగా వెలిసింది ! నీవు ఇంద్రత్వాన్నే పొంది స్త్రీలోకానికి మహత్తరమైన కీర్తిని తెచ్చిపెట్టావు ! భగవన్  ‘విశ్వామిత్ర మహర్షి’  నీ దర్శనార్థం రేపటి దినం ఈ ఆశ్రమానికి వస్తున్నారంటే నీవు ఎంత విశిష్టమైన స్థానాన్ని పొంది ఉన్నావో నేను చెప్పనవసరం లేదు !” అని చెప్పాడు దివోదాసు.

అందరూ---

“భగవతి, ఋషీక, బ్రహ్మవాదిని ఆంభృణికి జై, జై, జై, ” అని జయగానం కావించారు.

*******************
  *****************



    

Comments

  1. ఈ క్షీర గంగా ప్రవాహం చాలా బాగుందండీ.


    ఇంతకీ ఈ కథ ఏ వేదం లోని దండీ?

    జిలేబి.

    ReplyDelete
  2. చాలా బావుంది మీ ఈ క్షీర గంగా ప్రవాహం శ్రీధర్ గారు .

    మణి వడ్లమాని(హైదరాబాద్)

    ReplyDelete
    Replies
    1. గౌరవనీయులు జిలేబీ గారికి,
      క్షీర గంగకి స్వాగతం ! వేదంలో కథల పైన మీ స్పందనకి సంతోషం ! ఆంభ్రుణి ప్రవచించిన ,‘వైదిక దేవీ సూక్తం’ ఋగ్వేదం లోనిదండి. ఋక్కులన్నీ ఋగ్వేదం లోనే ఉంటాయి. ---ఎ.శ్రీధర్


      గౌరవనీయులైన పూర్వ ఫల్గుణి గారికి ,
      క్షీర గంగకి స్వాగతం ! వేదంలో కథల పైన మీ స్పందనకి సంతోషం ! ఈ ప్రవాహంలో ఇంకా లోతుకి వెళ్లండి. ఒక టి.వి సీరియల్, ఓక మినీ నవల, రెండు నవలికలు, ఒక పౌరాణిక నాటకం, ఒక చారిత్రిక నాటకం, మూడు సాంఘిక నాటికలు, ఒక రేడియో నాటిక, వివిధ విషయాల పైన దరిదాపు ముఫ్పై కథలు ఈ గంగా ప్రవాహంలో అభిస్తాయి. వాటిలో వాశిష్ఠ కథలు స్వర్గీయ మా నాన్నగారు వ్రాసినవి. తక్కినవన్నీ నావి. > ఎ.శ్రీధర్

      Delete
  3. శ్రీధర్ గారు,

    ఋగ్వేదం లో ఏ మండలం లో వస్తుందో చెప్పగలరా ?



    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. గౌరవనీయులైన ‘జిలేబీ’ గారికి,
      ఆంభృణి ఋక్కులు ఏ మండలంలో ఉన్నాయో నేను చెప్పలేను, కాని ఈ కథల యొక్క మూలాలు, అంటే ఆ ఋక్కులు ప్రవచించినది ఎవరో, ఆ యా ఋషుల వివరాలేమిటో , ‘ ఐతరేయ బ్రాహ్మణంలో’ ఉంటాయి ! వాశిష్ట కీర్తి శేషులయ్యారు ! ఋక్కుల లోని అర్థాలను బట్టి కథలను వారు ఊహించి, కొన్ని బ్రాహ్మణాల లోని కొన్ని ఆధారాల బట్టి, అతను స్వతంత్రంగా వ్రాసారు. ఆ కథలలో ముఖ్యమయినవి, అపాల ( ఉ. సోమరసం) ఆంభృణి, ఛిన్న మస్త, వృషాకపి, వీటిలో వృషాకపి ఆ కాలంలో అంటే రచనా కాలంలో గొప్ప గాలి దుమారాన్ని రేపింది, దాని గురించి ఆంధ్ర ప్రభలో ఒక ఏడాది కాలం చర్చలు, ప్రతి చర్చలు జరిగాయి ! వాశిష్ట మా నాన్నగారే కాబట్టి నాకు ఈ విషయాలు కొద్దిగా తెలుసు. వృషాకపిని నేను ప్రచురించ దలచుకోలేదు ! ఎందుకంటే ఆ కథ మా నాన్నగారి పైన కువిమర్శలకి దారి తీసి, మనస్తాపాన్ని మిగిల్చింది. ఇంకొక్క కథని ( దైవరాతుడు ) పరిచయం చేసి, ఈ కథలని ముగిస్తాను. మీ సకారాత్మక స్పందనకు సంతోషం !---ఎ.శ్రీధర్.

      Delete
  4. శ్రీధర్ గారు,

    ధన్యవాదాలు మీ సుదీర్ఘమైన సవివిరణ లకు!

    కొంత గూగిలించి కనిబెట్టాను పదవ మండలం, నూట ఇరవై ఐదవ సూక్తం 'వాక్' ఆంభృణి అన్న ఋషి వాచకం గా ఉన్నది. ధన్యవాదాలు. చదివిన తరువాయి మిగిలిన విషయాలను అడుగుతాను. మీకు తెలిస్తే చెప్ప గలరు.

    రెండు, వృషా కపి కూడా ప్రచురించండి. కాల గతి మారింది. కాబట్టి వాటి తో బాటు మన చదువరుల జ్ఞానం కూడా విస్తరీకరించి ఉండవచ్చు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. చక్కటి విషయం చెప్పేరు. వేదం లో నాకు దొరకలేదు. వెతుకుతున్నా.

    ReplyDelete
  6. శ్రీ ధర్ గారు,
    ఈ కధ కోసం వెతుకుతోంటే మంచిది ఊర్వశి- పురూరవుల కధ దొరికింది ఋగ్వేదంలో.మిగిలినవి కూడా చూస్తా. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. గౌరవనీయులైన జిలేబీ గారికి
      నమస్సులు. మరియు ధన్యవాదాలు. --ఎ.శ్రీధర్.


      గౌరవనీయులైన కష్టే ఫలే గారికి
      నమస్సులు, క్షీరగంగకి స్వాగతం ! వేదంలో కథలకి మీ స్పందనకి సంతోషం. ఇంకా ఈ బ్లాగులో చాల ఆసక్తికరమైన విషయాలు , క్థలు ఉన్నాయి. ఉదాహరణకి , ‘పరిభూత సురత్రాణం’ అనే చారిత్రిక కథ, నీల గ్రహ నిదానము అనే పౌరాణిక నాటకము ఉన్నాయి. పరిశీలించండి.
      ఎ.శ్రీధర్

      Delete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...