Skip to main content

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౪—దైవరాతుడు.

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ జాగృతి మాసపత్రిక ౧౯౬౨ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించారు. అంతే కాదు ఈ కథకి ఉత్తమ పౌరాణిక కథగా బహుమతి కూడా వచ్చింది ! ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.}

“ అదేమో ! సువ్రతా ! ఇంత పెందరాళే నదికి వచ్చావేం ? ఇంకా భూమి పాటారలేదు ! నా కంటే, ఈ రోజు మా ఇంట్లో ‘ఇష్టి’ ఎంతపనో చెప్పలేను ! అందుకే ఇంత త్వరగా వచ్చేశాను” అంది గోదా.

“ చెప్పితే సిగ్గో వదినా ! చూచావా నాచీరెని ? ఒక వంద  చిరుగులుంటాయి. నగుబాటు –శరీర మంతా కన్పడుతుంది ! అందుకే తొలికోడి కూతకి ముందే గబగబా వచ్చేసాను.”

 సువ్రత యొక్క చీరని ఆ మసక చీకటిలో పరీక్షించి చూసింది గోదా.ఆమె మనస్సు చివుక్కుమంది.

“వదినా ! ఈ విషయంగా అన్నగారు కులపతుల వారిని కలుసుకొంటే బాగుణ్ను! వారేదా వృత్తిని చూపెట్టక పోతారా, మొన్ననే మావారు ఒక గోవుని సంతలో మార్చి, అర్థ సంవత్సర  గ్రాసం ఇంట్లో పోసారు. నాలుగు చీరెలు పట్టుకొచ్చారు. ( కొంచెం సువ్రతకు దగ్గరగా జరిగి ) చూడు వదినా ! ఏమీ అనుకోకు, కాల వశం వల్ల సంసారంలో చిక్కులు రావడం సహజం ! పిడికిలి మూసి ఉన్నంత కాలం అందరూ ఓహో అంటారు. అదే పిడికిలి పడితే చాలు, “ హీ ,హీ” అంటారమ్మా ! ఇంతేనమ్మా సంసారం లోని కిటుకు. నీకు నా పాత చీరెలు రండు ఇస్తాను. పట్టుకెళ్లు,ఏం ! మరేం మనస్సులో బాధపడకు.”

గోదా బాధపడవద్దని చెప్పినా, సువ్రత బాధే పడింది ! ఆమె కండ్లు జలపూరితాలు అయ్యాయి. ఆ మసక చీకటిలో గోదా ఆమె మనోక్లేశాన్ని గమనించ లేదు.

గోదా కలిగిన వారి కోడలు. ఆమె భర్త ‘ఆంగీరస సుమేధస్సు’ మంచి పరపతి గల కుటుంబీకుడు. అతనికి విస్తారమైన గోసంపద ఉంది.

సువ్రత పేదవారింటి పడుచు, ఆమె పేదవారింట్లోనే అడుగు పెట్టింది. ఆమె భర్త ‘అజీగర్తుడు’ గోసంపద లేనివాడు. పిత్రార్జితమైన కొద్దిపాటి భూమి ఉన్నందున కష్టపడి కృషి చేసుకొని భార్యా పిల్లలతో నెట్టుకొస్తున్నాడు అజీగర్తుడు !

“ అక్కర్లేదో ! ఈ సంవత్సరం మా పొలం ఇంద్రుని కృపచే పుష్కలంగా పండిందమ్మా ! ఏదో కొద్ది రోజులు గుంభనగా కాలం నెట్టేస్తే ఇల్లు సర్దుకొంటుంది.”

గోదా సువ్రత పరిస్థితికి మనస్సులో నొచ్చుకొంది.

“ వదినా ! మీ పెద్దవాడు ఆశ్రమం లోంచి వచ్చేసాడట కదా?”

“ అవునో వదినా ! వ్యవసాయపు పనుల్లో సహాయం అవసరమయింది. మధ్యవాడు వ్య్వసాయానికి పనికి రాడు, అర్భకుడు ! మూడోవాడు ఇంకా చంటి పిల్లడు.”

ఆ ఇద్దరు యువతులు స్నానాదికం ముగించుకొని నీటి కడవలతో ఇంటి ముఖం పట్టారు.

*****************

“ వత్సా శునఃశేఫా !”” అని పిలిచాడు కులపతి మధుచ్ఛాందస్, శునఃశేఫుడు గురు సన్నిధానంలో చేతులు కట్టుకొని
నిలబడ్డాడు. వానికి పదహారు సంవత్సరాలుంటాయి. పొడవుగా ఉన్నా కృశించి ఉన్నాడు. ,ముఖంలో బ్రహ్మచర్య తేజస్సు ఉట్టిపడుతూంది ! చిన్నవైనా కండ్లు తేజోపూరితాలు, ఫలం విశాలమై ఆ బాలకుని హృదయ వైశాల్యాన్ని ఎత్తి చూపుతోంది !

“ భగవన్ ! ఆఙ్ఞ ఇవ్వండి.”

“ నాయనా ! నీ విద్యకు  భంగం కలిగింది. ఇంత కాలం నీవు ఆశ్రమంలో చాలా నెమ్మదిగాను, బుధ్ధిగాను విద్యాభ్యాసం చేసావు. నీ విఙ్ఞానం వయస్సుకి మించి శోభిస్తోంది ! అయినా గత్యంతరం లేదు, నీ తండ్రి వ్యాధి పీడితుడై ఉన్నాడట ! ఇంట్లో దక్షత లేదు.నిన్ను వెంటనే పంప వలసిందిగా నీ తండ్రి కబురు చేసాడు” అన్నాడు కులపతి అనుతాపంగా.

శునఃశేఫుడు ఏమీ బదులు చెప్పలేదు, నెమ్మదిగా కులపతికి అభివాదన చేసాడు.

ఆ సాయంకాలమే అతడు ఆశ్రమం వదిలి వెళ్లాడు.

*****************

 శునఃశేఫుడు ఇల్లు చేరుకొన్నాడు. సువ్రత కుమారుని కౌగలించుకొని కన్నీటితో రాబట్టుకొంది !

మూడవ వాడు సుపర్ణుడు అన్న తెచ్చ్న మూటను విప్పాడు. వెదురు బియ్యం, మూడు ఆఢకాలు, పుట్ట తేనె, గోఘ్రుతం, కంద మూలాలు ఆ మూటలో ఉన్నాయి !
సుపర్ణుడు ఎగిరి గంతేసి ఒక కందమూలాన్ని కొరుక్కొని తినసాగాడు.

“ అమ్మా ! నాన్న గారికి ఎలా ఉంది ?” అన ప్రశ్నించాడు శునఃశేఫుడు.

“ బాబూ ! ఏం చెప్పమంటావ్ ? పొలం విరగబడి పండింది . దాన్ని కోయించే దిక్కు లేదు. నిన్న మీ అన్న పెద్ద మోపు కోసి తెచ్చాడు. ధాన్యం దులిపి బియ్యం చేసాను. మిగతా పొలం నేల ఒరగబడి  పోయింది ! పశువులు యదేఛ్ఛగా చేనిలో పడి ధ్వంసం చేస్తున్నాయి. మీ నాన్నకి మామూలుగా ‘ కాశ రోగం’ ప్రవేశించింది ! ఊపిరి అందదు, నడుం వంచి పని చేయలేరు. సుపర్ణుడు సరైన ఆహారం లేక రోజు రోజుకీ ఎండుకొస్తున్నాడు ! చలి బాధ మిక్కుటంగా ఉంది, ఏం చేయడమో తెలియడం లేదు.” అని కంట తడి పెట్టుకొంది సువ్రత.

“ అమ్మా ! దుఃఖించకు, కష్టాలు కలకాలం కాపురం చేయవు. ఏదో ఉపాయం ఇంద్రుడు చూపక పోడు.నేను వచ్చానుగా ! ఏదో ఒకటి చేసి ఇంటిని గడుపుతాను. ఓర్మి ప్రధానం, తల్లీ ! పెద్దదానవు, నీకా నేను చెప్పేవాణ్ని,” అని ఓదార్చాడు .

“ బాబూ ! మీ నాన్న గదిలో ఉన్నారు, నిన్నటి నుండి నిన్నే పలవరిస్తున్నారు.”

శునఃశేఫుడు తండ్రి దగ్గరకు వెళ్లాడు.

అజీగర్తి కూర్చొని దగ్గుతున్నాడు. ఎముకల పోగైన అతడి శరీరం పూర్తిగా శుష్కించి  ఉన్నది.

“నాన్నగారూ ! శునఃశేఫుడు నమస్కరిస్తున్నాడు.”

“ రా, నాయనా, రా !” అని దగ్గుల మధ్య అతి ప్రయాసంతో అన్నాడు తండ్రి.

శునఃశేఫుడు తండ్రి ప్రక్కన కూర్చొన్నాడు.సువ్రత కూడ గదిలోనికి వచ్చింది.

ఆమె వేడి నీళ్లలో తేనె వేసి, తన భర్తకి అందించింది.

దాన్ని చప్పరిస్తూ, అజీగర్తుడు, “ బాబూ ! సుమేధస్సు --- ” మరి మాట్లాడ లేక దగ్గాడు !

“నాన్నగారూ !మీరేం మాట్లాడ వద్దు, విశ్రాంతి తీసుకోండి. కులపతుల వారు కాశ రోగానికి మంచిదని ఒక మూలిక ఇచ్చారు. దాన్ని నూరి తేనె కలిపి ఇస్తాను. తత్కాల శాంతిని ఇస్తుంది. రోగం పూర్తిగా పోవడానికి కొన్ని మూలికలు చెప్పారు. వాటిని రేపే సేకరిస్తాను, మరేం భయం లేదు. ఆర్య సుమేధస్సుని వెళ్లి కలసుకొంటాను, సరేనా ?” అన్నాడు.

తల ఆడించాడు అజీగర్తి.

****************

శునఃశేఫుడు సుమేధస్సు యొక్క  గోశాలలో పనికి కుదుర్కొన్నాడు. ప్రతిదినం ఉషఃకాలంలో గోవుల్ని మెరకలకి తోలి, సాయంకాలానికి తీసుకొని రావడం వాని పని. ఆ పనిలో
 వానితో పాటు నలుగురు సేవకులు ఉన్నారు.

చదువు వెనక పడింది. బ్రహ్మచర్య  వ్రతానుష్టానం, నిత్య  సమిధా దానం అడుగంటాయి. శునఃశేఫుడు బలాత్కారంగా విఙ్ఞానాభివృధ్ధి మార్గాల్ని వెనక్కు నెట్టి కుటుంబ పోషణ కార్యంలో పడ్డాడు. కాని తన ప్రస్తుత దురవస్థకి శోకించ లేదు. శోకం, విరక్తి, ఇవి అనార్య లక్షణాలని తలంచాడు .

ఏ విధంగా తన జననీ జనకులకు తన శరీరం ఉపయోగ పడుతుందా అని రాత్రింబవళ్లు ఆలోచించాడు ఆ ధీరబాలకుడు !

ఆత్మ, శరీరం, ఈ రెండూ మానవునికి ముఖ్యమైనవే ! ఆత్మ వికాసం చేత ఒక శరీరమే కాదు, విశ్వమే తేజోవంతమవుతుంది ! శరీర వికాసం సంస్మృతిలో ఆనందాన్ని ఇచ్చినా, ఆత్మ వికాసానికి దోహదం కానేరదు ! ఇదే రహస్యం !

ఈ రహస్యాన్ని తెలుసుకొన్న వాడే యోగి !

దారిద్ర్యం శరీర వికాసానికి గొడ్డలి పెట్టు !

అది ఆత్మ వికాసానికి కూడా శతృవేనా ?

బాగా ఆలోచించాడు శునఃశేఫుడు.

ఆత్మకి మందిరం వంటిది శరీరం. ఆ మందిరం దారిద్ర్య వాతంచే శిథిలమైందంటే , ఆత్మ వికాసానికి ప్రతిబంధకమని తలంచాడు ! అలాంటప్పుడు యోగులు దారిద్ర్యాన్ని కోరుతారెందుకు ?

ఈ పెద్ద సమస్యని ఆబాలుడు తీవ్రంగా చర్చించుకొన్నాడు.

‘ ఈ రెండునూ దక్షిణోత్తర ధృవాలలాంటివి. శరీర పోషణ వేరు, ఆత్మ పోషణ వేరు ! ఆత్మ పోషణ చేయాలంటే  శరీరాన్ని ఉపేక్ష  వహించాలి ! బాగుంది వరస, ‘ వెర్రి కుదిరుతే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని వెర్రి కుదరదు,’ అన్నట్లుంది ! నవ్వుకొన్నాడు తనలో తాను.

‘ శరీరాన్ని పూర్తిగా ఉపేక్షిస్తే ఆత్మ పోషణ సాధన కుంటు పడుతుంది, వృత్తులే శరీరాత్మల సంబంధానికి మూలాధారం ! వృత్తాధిక్యం శరీరాన్ని పోషిస్తుంది, వృత్తి  నాశనం ఆత్మని పోషిస్తుంది ! ఈ పరస్పర విరోధాలైన ద్వంద్వ క్రియని సాధించడం లోనే ఉంది యోగి యొక్క సాధన ! ”

బాలకుని విఙ్ఞానం కండ్లని విప్పింది !

ఈ సమస్య  ఆ చిన్ని మెదడులో పరిష్కారానికి వచ్చింది !

“ దీన్నే అధిపిండంలో శరీరాంతర హోమక్రియ అని అన్నారు పెద్దలు ! దీనిచేతనే శరీరాత్మలు రెండూ సమంగా వికసిస్తాయి !”

శునఃశేఫుని హృదయం తేలిక పడింది !

“ భగవన్ ! పురుహూత ! ఈ మోహజన్యాలైన  వృత్తుల్ని నాలో శబ్దిస్తున్న నీకే అర్పిస్తాను. వాటిని జీర్ణించుకొనే శక్తి నీకే ఉంది ! ఈ నిత్య హోమక్రియ నాలో జరగనీ ! ఈ నశ్వరమైన శరీరాన్ని దీనికి సంబంధించిన వృత్తుల్నీ , నీకే అర్పణ చేస్తున్నాను. ఈ నా త్యాగంలో , ‘ భగవన్’  నీవు ప్రతిభాసించు !” ఇట్లని ఆ బాలకుడు తన్ను పరివేష్టించి ఉన్న గోమాతలు కూడవినేలా బిగ్గరగా  ఉఛ్ఛరించాడు !

అక్కడ ఉన్న గోపాలకులు పకపకమని నవ్వారు

వారి దృష్టిలో శునఃశేఫుడు వేదాంతోన్మాది !

*****************

కోసల దేశమంతా రాజ ప్రకటనచే మారు మ్రోగుతోంది !

రాజ పురుషులు, నగరాల్లోనూ, గ్రామాల్లోనూ రాజ ప్రకటనను ఘోషణ చేస్తున్నారు !

ప్రజలందరూ ఆశ్చర్యంతో వింటున్నారు !

“ నర బలి ! ఆర్య సంఘం కలలో కూడ తలంచరాని కార్యం ! రాజ పురోహితుడు వసిష్ట మహర్షి యొక్క మతిగాని చలించిందా ? ప్రజల్ని తన గర్భంలో పెట్టుకొని పోషిస్తున్న మహాత్ముడు, సత్యసంధుడు, ధర్మ శాసకుడు, అయిన  మహారాజు హరిశ్చంద్రునికి ఇట్టి భయంకర సంకల్పం ఎలా కలిగింది ! సంతానం కోసం ఇంత అకార్యకరణమా ?!” అని జన సందోహంలో అలజడి చెలరేగింది.

కౌశికీ నదీ తీరస్థమైన కౌశికాశ్రమంలో గొప్ప సభ జరిగింది. ఆ సభకు ధర్మ శాస్త్ర దక్షులైన మహర్షులు వచ్చారు.

బ్రహ్మర్షి భగవాన్ విశ్వామిత్రుడు ఆ సభకు అధ్యక్షత వహించాడు. “ నర బలి అనార్య సంఘంలో కూడా గర్హ్యంగా భావింప బడుతూంది ! అలాగుండ మన ఆర్య సంఘంలో ఇట్టి విప్లవాత్మకమైన చర్య నడుస్తూంటే మనమందరం మౌనంగా ఉండడం మహాపరాధం ! ఏ కొద్ది మందో ఇట్టి రాక్షస కృత్యాల్ని రహస్యంగా చేస్తున్నారు. అలాంటి ఘోర కృత్యాల్ని అరికట్టడమే దేశాధ్యక్షుని ముఖ్య ధర్మం !  కెంచే చేను మేసినట్లే మహారాజే నర బలికి పూనుకొన్నాడంటే చెప్పడనికి ఏముంది ? మనం ఈ పనిని అరికట్టాలి.  ఈ పనిని విరమించమని మహారాజుని ప్రార్తంచాలి ! ప్రార్థనను వినని నాడు మహారాజుని శిక్షించాలి ! ” అని మేఘ గంభీర స్వరంలో విశ్వామిత్రుడు ఉద్ఘాటించాడు !

విశ్వామిత్రునికి ఎదురగా నిలబడి ఈ విషయంగా చర్చ సాగించడానికి అక్కడ సమావేశమైన వారందరికీ భయమే పుట్టింది !

వైశ్వామిత్ర మధుఛ్ఛంధస్సు సాహసించి ఇలాగన్నాడు.

“భగవన్ ! దీంట్లో ఏదో దైవరహస్యం ఇమిడి ఉంది ! యదార్థం తెలియనిదే పూజ్యుడైన మహారాజుని విమర్శించడం సరి కాదు ! అలాగని నేను నరబలిని ప్రోత్సహిస్తున్నానని, పూజ్యపాదులైన తమరు తలంచ రాదు. రాజ పురోహితులు బ్రహ్మర్షి వసిష్ఠుల వారు సర్వశాస్త్ర వేత్త ! వారి అనుమతి లేనిదే ఈ ప్రకటన జరగదు.”

విశ్వామిత్రుని ముఖం ఎర్రబడింది. అతడు కొన్ని లిప్తలు ధ్యానంలో మునిగి, ఇలాగన్నాడు.

“ వత్సా ! మధుఛ్ఛంధస్ ! నేనీ రోజునే బ్రహ్మర్షి  వసిష్ఠుల వారిని సందర్శించడానికి వెళ్తాను. అంతా వివరంగా తెలుసుకొన్న తరువాత కర్తవ్యాన్ని నిర్ణయించుకోవచ్చును.”

సభ ముగిసింది.

*****************

కోసల దేశాన్ని పాలిస్తున్నాడు మహారాజు హరిశ్చంద్రుడు.

అతడు సత్యవ్రతుడు కాబట్టి అతణ్ని అందరూ సత్య హరిశ్చంద్రుడని కీర్తించి గౌరవిస్తున్నారు !

అతని ఏలుబడిలో దర్మం నాలుగు పాదాలలో సంచరిస్తూంది !

ఏక ఛత్రం క్రింద ఆర్య సామ్రాజ్యాన్ని  పరిపాలిస్తున్న హరిశ్చంద్రుడు సంతాన లోపంచే పరిపూర్ణ శాంతిని పొందలేక పోయాడు !

రాజపత్ని చంద్రమతి యొక్క శోకం వర్ణనాతీతంగా ఉంది !

వారిద్దరూ కలసి భగవంతుడైన , వరుణుని గురించి ఘోరమైన తపస్సు చేసారు !

వారి ప్రార్థనని విన్నాడు వరుణ దేవుడు !

అతని అశరీర వాక్యం రాజదంపతులకి వినిపించింది !

“ హే ! రాజా ! నేను తృప్తుణ్ని అయ్యాను. నా కోరికను నెరవేర్చినట్లయితే మీకు మత్సమానుడగు పుత్రుడు కల్గుతాడు !”

దైవవాణిని విన్నాడు మహారాజు ! వాని శరీరం ఆనందంతో పులకరించింది !

ముందు వెనకలు ఆలోచించకుండా ----

“ భగవన్ ! ఇదిగో ప్రతిఙ్ఞ చేస్తున్నాను. మీ అభీష్టముని తప్పక నెరవేర్చ గలను.”

మరల దేవవాణి వినిపించింది.

“ రాజా ! నీవు నాకు ప్రియంగా ‘నరమేధమును’  జరిగించాలి !”

మహారాజు తన తప్పిదాన్ని గ్రహించి దుఃఖించాడు !

అతడు వెంటనే తన పురోహితుడైన వసిష్ఠ మహర్షిని సందర్శించి జరిగిన విషయాన్ని చెప్పి ఇలాగన్నాడు, “ భగవన్ ! అనపత్య దుఃఖంతో యుక్తా యుక్త విచారణ  చెడి,నేను ఘోరమైన తప్పిదాన్ని చేశాను, దీనికి నిష్కృతి లేదు ! ఆర్య దూషితమైన నరబలిని నేను ఇవ్వజాలను. దానికి ప్రతిగా నేనే స్వయంగా బలి కావడానికి తీర్మానించాను ! మీరు యఙ్ఞానికి కావలసిన సామగ్రిని జతకూర్చి, నా తరఫున యఙ్ఞాన్ని నెరవేర్చండి. ఈ సామ్రాజ్యాన్ని ప్రజల వశం చేస్తాను. వారు సరియైన పాలకుని ఎన్నుకొందురు గాక !”

మహర్షి మహారాజు యొక్క తీర్మానాన్ని విన్నాడు. కొంతకాలం మౌనంగా ఆలోచించి ఇలా అన్నాడు !

“ మహారాజా ! తమరు కావించిన నిర్ణయం తమకే కాక దేశానికే ప్రమాదకరమై ఉంది ! నిన్ను బలిగా వరుణ దేవుడు అంగీకరించక పోవచ్చును ! ప్రక్కనే బల్లెం లాగ ఉన్నాడు అనార్య రాజు , దాస రాజు ! నీ పరాక్రమానికి వెరచి వాడింత వరకు మౌనంగా ఉన్నాడు ! ఆర్యధర్మాలు నాశనం చేయడం ఉచితం కాదు. గొప్ప దుష్పలితాల నివరణ కొరకు, మరొక తప్పు చేయడం తప్పు కాదని ,నీతి శాస్త్రం చెప్తోంది !”

“ భగవన్ ! అయితే నన్నిప్పుడు ఏం చెయ్యమంటారు ?”

“ నీవు ఒక ప్రకటన కావించు. నీ భటులు దానిని రాష్ట్రమంతా ఘోషించాలి ! ‘ఇరవై ఏళ్ల బ్రహ్మచారి, తల్లి తండ్రుల అనుమతి తీసుకొని మనః పూర్వకంగా వరుణదేవునికి బలి అవడానికి కావాలి !’ ఆ కుటుంబానికి ‘ సువర్ణ ఖురములు, సువర్ణ శృంగములు కల పదివేల గోవులున్నూ, వాటి పోషణకి అనువైన గ్రామం.’ దాన పూర్వకంగా ఇవ్వ బడుతుంది’. ఇట్లుండాలి ఘోషణ ! నేను నరమేధాన్ని నడిపిస్తాను.”

“ భగవన్ ! ఇట్టి త్యాగాన్ని ఎవడు చేయగలడు ? నా కేమో ఇది సాధ్యం కాదనే అనొపిస్తోంది !”

“ మహారాజా ! నరమేధానికి మనిషి దొరకక పోతే , నీకు అసత్య దోష కలుగదు ! భగవంటుడైనన వరుణుడు నిన్ను క్షమిస్తాడే గాని ఆగ్రహించడు ! ఇంకొక అహస్యం ఉంది.”

“ అదేమిటో సెలవియ్యండి మహర్షీ ?”

“ మహర్షి విశ్వామిత్రుడు అమేయ ప్రతిభాశాలి ! అతడు తప్పకుండా నరమేధానికి అడ్డుగా వస్తాడు. అతని మూలంగా సమస్తం సుఖాంతంగానే ముగిస్తుందని నా అంచనా !”

వసిష్ఠ మహర్షి యొక్క ఉపాయాన్ని విని మహారాజు హరిశ్చంద్రుడు హృదయ భారం తగ్గి దీర్ఘంగా నిశ్వసించాడు.

******************

మహారాజ హరిశ్చంద్రుని ప్రకటన రాష్ట్రమంతా ప్రసారితం కాబడింది.

అందరూ  విన్నారు !

ఎవరూ కూడ ముందుకు రాలేక పోయారు.

ఈ ప్రకటనను విన్నాడు శునఃశేఫుడు.

వాని హృదయంలో ఉత్సాహం పుట్టింది.

“ నా శరీరం ధన్యమయింది ! దీన్ని త్యాగం చేయడం వల్ల దైవ కార్యం, సమాజ కార్యం, కుటుంబ సేవనం సిధ్ధిస్తాయి ! నా కుటుంబం సమృధ్ధితో సుఖంగా ఉంటుంది. దేశ పాలనకు మంచి వారసుడు లభిస్తాడు.భగవంతుడైన వరుణునికి నా శరీరం అర్పితమై ధన్యతమమవుతుంది !” అని తలంచాడు శునఃశేఫుడు.

వెంటనే తల్లి తండ్రుల దగ్గరకి వెళ్లి తన నిశ్చయాన్ని వెళ్లడించాడు ఆ ధీ-బాలకుడు !

తల్లి తండ్రులు కుమారుని నిర్ణయాన్ని విని కంటికి మంటికి ఏకధారగా శోకించారు.

 “ నాయనా ! ఇదేం ఘోరం ! ఒకరి కోసం నీవు బలి అవడమేమిటి ? దారిద్ర్యాన్ని తృప్తిగా అనుభవిస్తాం, తండ్రీ ! నిన్ను వదిలి మేము బ్రతక లేము !” అని ఏడ్చారు ఆ పేద దంపతులు.

“ అమ్మా , నాయనా ! పుత్ర వ్యామోహం చేత మీరు చేయదగిన పనిని విస్మరిస్తున్నారు ! మీకు నేనొక్కడినే పుత్రుడిని కాను, పెద్దవాడు ఉన్నాడు, మూడావ వాడు ఉన్నాడు. వీరిద్దరూ కుటుంబాభివృధ్ధికి సరిపోతారు. బాగా ఆలోచించండి. ఆ ఆలోచనలో శోకాన్ని పరిత్యజించి విమర్శించండి. నశ్వరమైన నా శరీర త్యాగంచే మన కుటుంబ సంపద, మహారాజు యొక్క అభిలాష, దేవతా ప్రీతి, ఇన్ని ఒక్కమారుగా సిధ్ధిస్తాయి.”

ఈ విధంగా శునఃశేఫుడు వారికి బోధించి సమ్మతింప చేసాడు.

********************

. సరయూనది తీరంపై విశాలమైన సమ ప్రదేశంలో యఙ్ఞవాటిక నిర్మింపబడింది.

ఈ విచిత్రమైన నర మేధానికి తండోప తండాలుగా వచ్చారు ప్రజలు. మహర్షులు, ధర్మవేత్తలు, పండితులు, విశేషంగా దూర దూర దేశాల నుండి వచ్చారు.

వసిష్ఠ మహర్షి  ప్రధాన హోతృత్వ స్థానాన్ని అలంకరించాడు. యూప స్థంభానికి కుశ రజ్జువులచే కట్టుబడి ఉన్నాడు శునఃశేఫుడు !

వాని ముఖంలో శోకానికి బదులు ఆనందం తాండవిస్తోంది !

వాని ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూంది.

మహారాజ హరిశ్చంద్రుడు పత్నీ సమేతంగా త్రేతాగ్నుల యొక్క వేదిక దగ్గర ఆశీనుడై ఉన్నాడు !

ఋత్విగ్’వరణ ముగిసింది !

ఇంతలో సభలో కలకలం చెలరేగింది !

శిష్య గణంతో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు యఙ్ఞవాటికలో ప్రవేశించాడు !

సభలోని కోలాహలం శాంతించిన మీదట విశ్వామిత్రుడు రాజుని ఉద్దేశించి ఇలాగన్నాడు.

“ రాజన్ ! ఆర్య దూషితమైన ఈ నరమేధాన్ని ఆపుచేయాలి ! ఏ శాస్త్రాధారాల పైన దీన్ని మీరు ఆచరిస్తున్నారు ? ఈ నింద్యమైన చర్యని మీరు ఆపుచేయ నప్పుడు జరిగే విపరీత పరిణామానికి నేను భాధ్యుణ్ని కానని మనవి చేసు కొంటున్నాను.”

మహారాజు తల వంచుకొని మౌనం వహించాడు.

వసిష్ఠ మహర్షి లేచి గంభిర స్వరంతో ఇలాగన్నాడు.

“ గాధేయ మహర్షీ ! ఆపధ్ధర్మమే మాకు ప్రమాణం ! నేను మహారాజు పక్షమున ఈ యఙ్ఞం  శాస్త్రీయమైనదనే చెప్పగలను. యఙ్ఞం ఆపు చేయడానికి వీలు లేదు ! అదిగో, యూప స్తంభానికి కట్టబడిన బాలుడు మనఃపూర్తిగా ఆత్మార్పణ కావించుకొన్నాడు. అరుగో  వాని తల్లి తండ్రులు ! వారు గోధనం పుచ్చుకొని తమ కుమారుణ్ని రాజునకు ఇచ్చి వేసారు ! ఈ కారణాల వల్ల నరమేధం దోష రహితమైంది ! కాబట్టి యఙ్ఞం ఆపుచేయబడదు ! మీరు పశు బలంతో దానికి విఘ్నం ఆచరింఛేటప్పుడు, దానికి తగిన ప్రతిక్రియా లోపం మా వల్ల జరగదని మనవి చేసుకొంటున్నాను. మీరు సరళమైన మార్గంలో దీనిని ఆపు చేయ గలిగితే మాకు ఎట్టి ఆక్షేపణ లేదు ! బహుముఖ ప్రతిభావంతులైన మీకు అధికంగా చెప్పనవసరం ఉండదనే నా భావం !”

సభలో గుసగుసలు లేచాయి !

“ మహర్షీ ! మైత్రావరుణీ ! యఙ్ఞం యొక్క శాస్త్రీయాధారాన్ని మీరు నేర్పుగా ఆపధ్ధర్మ క్రింద  సూక్ష్మీకరించారు , మొండి పట్టుదలతో ఉన్న మీతో నేను శాస్త్ర చర్చ చేయడంలో ప్రయోజనముండదు ! నాకు సరళ మార్గాన్ని ఉపదేశించారు, సరే కానీండి ! ఇక్కడ యఙ్ఞ పశువుగా బంధింప బడ్డ పేద బాలకునితో నేను కొన్ని విఘడియలు మాట్లాడుకోవడానికి నాకు అవకాశం కల్పించండి !’’

“ మహర్షీ ! సంతోష పూర్వకంగా నేను మహారాజు పక్షంగా మీకు అవకాశం కల్పిస్తున్నాను.. మీరు బాలకునితో మాట్లాడు కోవచ్చు” అన్నాడు వసిష్ఠుడు.

సభలో వారందరూ ఊపిరి బిగపెట్టుకొని ఆతురతతో ఎదురు చూస్తున్నారు !

మహారాజ హరిశ్చంద్రుడు సంతోషం తాండవించగా వసిష్ఠ మహర్షిని చూసాడు.

వసిష్ఠ మహర్షి మందహాసం చేసాడు !

విశ్వామిత్రుడు సింహ గమనంతో బాలకుని దగ్గరకి వెళ్లాడు .“బాలకా ! నిశ్చలంగా నన్ను చూడు !” అని ఆదేశించాడు.

శునఃశేఫుడు దీక్షగా మహర్షిని చూసాడు.

ఇద్దరి చూపులూ కొన్ని లిప్తలు కలుసుకొన్నాయి !

“ శునఃశేఫా ! భగవంతుడైన వరుణదేవునికి ప్రీతిగా ఉపస్థానం కావించు.” అన్నాడు విశ్వామిత్రుడు.

 బాలకుడు కళ్లు మూసుకొన్నాడు, చేతులు ముకిళించాడు.

అద్భుతం !

బాలకుని ఙ్ఞాన నేత్రం విప్పారింది. వాని హృదయ కుహరం  మందుండి వేదవాణి  !!

“ ఇమం మే వరుణ శ్రుదీపహ మద్యాద మృడయ ------ యచ్చిధ్ధితే నిశోయథా ప్రదేవ వరుణ వ్రతం, మినీ మసి ద్యవిద్యవి ---- ”

( ఓ పరమాత్మా ! వరుణ దేవా ! నా యొక్క ఈ ప్రార్థనను ఆలించుము. పిమ్మటనే సౌఖ్యవంతునిగా చేయుము. ---- బాలుని తప్పులను క్షమించునట్లు, అను దినముననూ ధర్మ మార్గమును , అఙ్ఞానముతో దాటి యుందుమో, ఆ తప్పులను క్షమించుము.)

ఈ విదంగా ఇరవై ఒక్క ఋక్కులు ప్రవాహ రూపంతో సభలో మారుమ్రోగుతూ ప్రతిధ్వనించాయి !

శాంతంగా ఉన్న సదస్సు తటి త్ప్రభలతో  జేగీయమైనమై శోభించింది ! మేఘాలు లేనిదే ఉరుములు ధ్వనించాయి !

భూమి కించిత్తు కంపించింది !

“ కుమారా ! నేను తృప్తిని పొందాను ! నీవు చిరకాలం మహర్షివై, లోకంలో వర్థిల్లు ! ” అని ఆకాశ వాణి వినబడింది !

అందరూ చేతులు జోడించి బాలకునికి నమస్కరించారు.మహారాజు సాష్టాంగంగా మహర్షి విశ్వామిత్రునికి నమస్కరించాడు.

శునఃశేఫుని తల్లి తండ్రులు పరమానందభరితులయ్యారు !

ఆ వెంటనే శునఃశేఫుడు ఎవరికి చెందుతాడన్న సమస్య లేచింది !

వసిష్ఠ మహర్షి తన నిర్ణయాన్ని ఇలాగున చెప్పాడు !

శునఃశేఫుడు ‘దైవరాతుడు’! తల్లి తండ్రులు గోధనం తీసుకొని , మహారాజునకు వీనిని ఇచ్చి వేసారు. కాబట్టి ఇతను వారికి కుమారుడు కాజాలడు ! మహారాజు వీనిని దేవతకు అర్పించాడు, కావున అతని హక్కు భుక్తమయి పోయింది ! మహర్షి వీనికి పునర్జన్మను ఇచ్చాడు, కాబట్టి, ఇతడు ‘ దైవరాతుడు’  విశ్వామిత్రుని కృత్రిమ పుత్రుడు !”

“ తథాస్తు !” అన్నాడు విశ్వామిత్రుడు.


( ఇది ‘ఐతరేయ బ్రాహ్మణమునకు సంభందించిన కథ ! అయితే అసలు కథను సంస్కరించి కొన్ని కొత్త మూల్యాలతో రచింపబడిన కథానిక మాత్రమే ఇది ! అస్లు కథను ఐతరేయ బ్రాహ్మణమునందే చదువనగును --- వాశిష్ఠ )
*******************
  *****************

Comments

  1. ఆనందో బ్రహ్మ. పరమానందం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ