Skip to main content

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౫—ద్రప్స నందిని—౧



{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ ఆంధ్ర ప్రభ వార పత్రికలో ౩౦.౧౨.౧౯౬౪ నుండి ధారా వాహికంగా ౨౦.౦౧.౧౯౬౫ వరకు ప్రచురింప బడింది. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.}

“ ఓహ్ ! సువర్చలా ! అరే, ఎంత ఎదిగి పోయావ్ ? ఇంకా నీకు నా ఙ్ఞాపకం ఉందా ? మానవుల కంటే నీవే నయం ! రా ! వత్సా ! రా ! నీ మెత్తని శరీరాన్ని కట్టుకొని ఎన్ని రోజులయింది !”

సువర్చల తన ముఖాన్ని ఎత్తి చూచింది. అతి విశాలములైన దాని కాటుక కండ్లు తళతళమని మెరిసాయి. నాసా పుటాలు సంతోషాధిక్యంతో  ఎగిరెగిరి పడుతున్నాయి. ముందరి కాళ్లను మీదికెత్తింది. దాని నల్లని చిన్నారి డెక్కలను రెండు చేతులతోను పట్టుకొని ---

“ సువర్చలా ! అమ్మా, నాన్నా సుఖంగా ఉన్నారా, రేవతి సుఖంగా ఉందా ?” అని ఆప్యాయంగా పలకరించాడు కర్ణుడు.

సువర్చల తన అందమైన చిన్న తోకను ఆడించింది. దాని గొంతు లోంచి గురగుర మని శబ్దం వచ్చింది ! దాని కంద్లు చెమ్మగిల్లి , కొలకుల లోంచి కన్నీరు కారింది.

“ అరే, ఏడుస్తున్నావా , ఏమయింది ? రేవతి గాని నిన్ను అవమానించిందా ? నే చెప్తాలే ” అని కర్ణుడు ‘ కృష్ణ మృగాన్ని ఎత్తుకొని గుండెలకు అదుముకొన్నాడు.

సువర్చల తన ముఖాన్ని కర్ణుని చెక్కిలిపై రాచి, తన ప్రేమని వెల్లడించుకొంది.

“ అమ్మ దగ్గరకి వెళ్దాం పద !” అని కర్ణుడు సువర్చలను క్రిందకు దింపాడు.

సువర్చల చెంగు చెంగుమని గెంతుతూ ముందుగా దారి తీసింది. కర్ణుడు దాని వెనుక నడుస్తున్నాడు.

అప్పుడు సాయం సంధ్యా సమయం. సంజ కెంజాయలచే  ప్రకృతి  రాగ రంజితమై ఎర్రబడింది. పక్షులు చెట్లపై బారులు తీరి, తమ గూళ్లలోనికి వెళ్లడానికి ఆలోచిస్తున్నాయి, కిచ కిచా రావాలు కావిస్తున్నాయి. ఇండ్లకి మరలి వస్తున్న గోవులు తమ దూడలను కలసుకొనడానికి ఆత్రంతో ధూళిని ఎగజిమ్ముతూ నడుస్తున్నాయి. గోధూళి సంజ కెంజాయతో మిళితమై సొంపైన మేఘ మాలిక వలె నింగిని పయనిస్తూంది. చుట్టు ప్రక్కల సాయం సంధ్యోపాసన మంత్ర గీతాలు శ్రోత్రపేయంగా వినవస్తున్నాయి. కర్ణుడు తన ఆశ్రమాన్ని సమీపించాడు. తపో యాత్రకై ఆశ్రమాన్ని వదలి వెళ్లిన కర్ణుడు , మూడు సంవత్సరాల తరువాత ఇప్పుడే వస్తున్నాడు. తాను బాల్యంలో గడపిన ఆశ్రమోప్రాంత భూములు చాల మారాయి. తన చేతితో నాటిన మొక్కలు ,గున్నలై కన్పించాయి. ఆశ్రమంలో సందడి లేదు. నిశ్శబ్దం కాపరం చేస్తూంది. లోపల ఆముదపు దీపం దీనంగా వెలుగుతూంది.

అప్పుడు  సూర్యుడు అస్తమించాడు.సంధ్య చీకటి, ప్రకృతిని ఆవరించింది. కర్ణుడు ఆందోళనాపూరిత హృదయంతో లోపల అడుగు పెట్టాడు. వని ఎడమ కన్ను టపటపమని కొట్టుకొంది. ‘ అమంగళం ప్రతిహతమగు గాక !’ అని తనలో అనుకొన్నాడు కర్ణుడు.

ఆశ్రమం లోపల ఒక స్త్రీ మూర్తి తెల్లని వస్త్రాలని ధరించి చిత్రాసనంపై ఒడ్డింపుగా పడుకొని ఉంది. ఇంట్లో వేరెట్టి అలికిడి లేదు. సువర్చల ఆమె దగ్గరగా మోకరిల్లి ఉంది. “ సంధ్య వేళ పడకేమి ?” అని తలంచాడు కర్ణుడు. “ అమ్మా !” అని బిగ్గరగా పిలిచాడు కర్ణుడు.

స్త్రీ లేచింది .ఆమె కండ్లు వాచి ఎరుపెక్కి ఉన్నాయి ! ఆమె కచభరం చెల్లాచెదురుగా ఉంది. ముఖ మండలం దుఃఖ భారంచే వడలి ఉంది. ఆమె కంద్ల నుండి కన్నీరు ధారకట్టి ఉంది.ఆమె కండ్లను తుడుచుకొని చూచింది. సాల వృక్షం వలె ఉన్నతమైన శరీరం , వజ్ర ధృడాలైన సువిభక్త అంగాలు కలవాడు, సూర్యకాంతిని వెదజిమ్ముతున్న దుర్నిరీక్ష్య ముఖ వర్ఛస్సు కలవాడు, శరీర నిర్గత భాస్వర తేజో పూరితుడు, అతిరథ శ్రేష్ఠుడైన కర్ణుని మూర్తి ఆమెకు గోచరమయింది.

ఆమె దిగ్గన లేచింది. కర్ణుని గుండెలపై పడి బిగువుగా కౌగలించుకొంది. “ నాయనా ! కర్ణా ! వచ్చావా, నా తండ్రీ ! కొండంత నా దుఃఖంలో కొంత భాగం శిథిలమయింది నాయనా !” అని బావురుమని రోదన కావించింది ! మహేంద్రుని వజ్రాఘాతానికి కూడా చలించని ఆ మహావీరుని వక్షస్థలం ఒకమారు కంపించింది. అక్షౌహిణి సంఖ్య గల మహాసైన్యం ముట్టడించినా కదలని వాని శరీరం చలించింది.

దుఃఖమంటే  ఏమిటటో ఎరుగని కర్ణుడు కంట నీరు పెట్టుకొన్నాడు ! మాతృమూర్తిని హస్త తలంతో మృదువుగా నిమిరి బుజ్జగించే ధోరణిలో  “ అమ్మా ! సర్వకాల సర్వావస్థల లోను నవ్వే నీ ముఖ మండలం కన్నీటి వెల్లువతో తడిసి పోవడానికి కారణం ఏమి ? నాన్నగారు కనబడరేమి ? కర్ణమాతను దుఃఖ పెట్టిన ఆ దౌర్భాగ్యుడెవడు ? సువర్చల తన మూగ భాషలో దుఃఖాన్ని  వెల్లడించింది. నేను అర్థం చేసుకోలేక  పోయాను. నేనొచ్చాగా ఏం జరిగిందో చెప్పమ్మా !” అన్నాడు

“ నాయనా , కర్ణా, రా ! ఆకలితో ఉన్నావు, నీకు ప్రియమైన కంద మూలాలను బెల్లంలో ఉడికించి ఉంచాడు. మొదట నీ ఆకలి తీర్చుకో, రా !” అని చెప్పింది తల్లి.
ఆహా ! మాతృప్రేమ ! దానికొక జోహారు ! ఎలాంటి పరిస్థితిలోనూ తల్లి కుమారుని ఆకలి గమనిస్తుంది ! ఎలాంటి పరిస్థితుల లోనూ తల్లి తన కుమారుని ఆకలి గమనిస్తుంది ! ఆ గమనికలో తన దుఃఖాన్ని మరచి పోతుంది. మాతృ హృదయం మహదాకాశం వంటిది. దానిలో నిండుగా ప్రతిబింబించే ప్రేమ బింబం చంద్రుడు . చంద్తునిలో మాలిన్యం ఉంది . కాని మాతృ ప్రేమ సుధాకరునిలో కళంకం ఉండదు !

కర్ణుడు సువర్చలతో సహా గృహాంతర్భాగానికి వెళ్లాడు. గుడ పక్వమైన కందమూలం పెట్టింది కర్ణుని పాలిత మాత . కర్ణుడు మఠం వేసుకొని కూర్చొన్నాడు. భూక్తికి ముందర చమనం ఆర్య సాంప్రదాయం ! కర్ణుడు త్రివారం ఆచమనం చేసాడు. సువర్చలకు మధ్య మద్య కంద మూళాన్ని అందిస్తూ, ఫలహారం పూర్తి చేసాడు.

“ అమ్మా ! ఇక చెప్పు, భుక్తి ముగిసింది” అన్నాడు కర్ణుడు.

తల్లి తన పైట చెఅరగుతో కండ్లు తుడుచుకొని ఈ విధంగా చెప్పింది. “ నాయనా ! ద్రప్సుడు (జరాసంధుడు) నీకు తెలుసు కాదూ ?”

“ ఆ ! తెలుసు, బాహుబలంచే క్రొవ్విన అడవి పంది వాడు . మన కుటుంబ శతృవు. నాయన గారి అంగ రాష్ట్రాన్ని . మహారాజ ‘ధృగునితో’( ధృతరాష్ట్రుడు) సమంగా పంచుకొన్న దురాశాపరుడు, వింటున్నా చెప్పు.”

“ వాడు కొన్ని మాసాల క్రిందట ఈ ప్రాంతాలకి వచ్చాడు.”

“ఆ , తరువాత ?”

“ వాడేదో దైవమట ! దాన్ని ఆరాధిస్తాడట---”

“ తెలిసిందమ్మా , వాడు భైరవారాధకుడు ! నరబలుల మీద విశ్వాసం కల రాక్షసుడమ్మా వాడు, ఆ తరువాత ?”

“ వాడు మన రేవతిని చూసాడు.”

“ అయ్యో , కొంప మునిగింది. ఆ సౌందర్య రాశి వాని కంట పడడం దురదృష్టమే ,ఆ తరువాత ఏం జరిగిందో చెప్పి ముగించమ్మా!”

“ ఒకనాడు --- చెప్పలేకున్నాను రా – రేవతి ఒకే పరుగుతో వచ్చి, మీ నాన్నగారి కాళ్లపై పడి పోయింది.--- ఆ వెంటనే దడదడమని గుర్రాలడెక్కల చప్పుళ్లు---”

కర్ణుడు లేచి నిలబడి పోయాడు. మధ్యందిన మార్తాండుని వలె, వాని ముఖ బింబం ఎర్రబడింది.

“ తెలిసిందమ్మా, నాయన గారు రేవతిని సంరక్షించడానికి, ద్రప్సునితో యుధ్ధం చేసారు ---”

“ అవును నాయనా ! ఆ యుద్ధంలో నీ తండ్రి బంధింపబడి పోయారు. రేవతిని కూడ బంధించాడు ఆ పాపాత్ముడు. ఇద్దరినీ తీసుకొని వెళ్లిపోయాడు.”
తల్లి దుఃఖం కట్లు తెగి పారింది. ఆమె పెద్ద పెట్టున రోదన చేసింది. కర్ణుడు నిశ్శబ్దంగా నిలబడి పోయాడు . సువర్చల బిక్క చొచ్చుకొని పోయింది. దుఃఖ ప్రవాహం పొంగు కొంత అణగారింది, కర్ణుడన్నాడు.

“ అమ్మా ! నీవు ధైర్యంగా ఉండు. ఇప్పుడే నేను వెళ్లుతున్నాను. ద్రప్సుని మదాన్ని అణుస్తాను. నాన్నగారిని, రేవతిని  తీసుకొని వస్తాను.”

కర్ణ మాతకు భయం కలిగింది. ఆమెకు ద్రప్సుని భీకర మూర్తి గోచరించింది. ఆర్యావర్తం లోనే ఎదురులేని పరాక్రమం గల ద్రప్సునితో తన కుమారుడు నిస్సహాయుడై ఎట్లు పోరగలడు ? భర్తతో పాటు బిడ్డడు కూడ తనకు దూరమయి పోతాడేమో అని భయ పడి, ఇలాగంది.

“ నాయనా ! నీకు ఎవరునూ సహాయం చేసేవారు లేరు. ఒంటరిగా ఆ రాక్షసునితో  యుధ్దం చేయగలవా ? మన రోజులు బాగుండలేదు. దైవం పైన భారం వేసి, మనం మౌనంగా దుఃఖాన్ని దిగ మ్రింగుకొని శాంతించడమే మంచిది.”

కర్ణుడు మందహాసం చేస్తూ ఇలాగన్నాడు. “ అమ్మా ! స్త్రీ సహజమైన భయాన్ని నీవు చూపెట్టడంలో నాకు ఆశ్చర్యం వేయలేదు. కాని, నన్ను పెంచి పెద్ద చేసిన నీవు నా పరాక్రమాన్ని శంకించడం లోనే నాకు ఆశ్చర్యం వేస్తుందమ్మా ! నాకు సహాయం లేదన్నావు ! ఆ విషయంలో నీవు పొరబడ్డావు ! కుమారాస్త్ర విద్య ప్రదర్శన హసినాపురిలో జరిగినప్పుడు, ‘ మహా వీరుడైన ‘ఋజ్రాశ్వుని’ ( అర్జునుడు) వంటి వాడే నా పరాక్రమానికి జోహారు చేసాడు ! యువరాజు దుర్యోణుడు
(దుర్యోధనుడు).ఆ నాడు చంపానగర ప్రాంతస్థమైన అంగ రాజ్యయాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చేసి నాకు మిత్రుడయ్యాడు ! ఈ సమయంలో  అతడు నేనర్థించే పక్షంలో నాకు సహాయం చేయగలడు ! నీవు భయాన్ని వర్జించి నెమ్మదిగా ఉండు. నన్ను ఆశిర్వదించి పంపు.”

దుర్యోణ సహాయాన్ని  విన్న కర్ణ మాత మనస్సు నెమ్మది వహించింది !  “ సరే, నాయనా ! భగవాన్ ఇంద్రుని వజ్రధార నీ శస్త్రంలో ప్రవహించుగాక ! ఈ ఒక్క రాత్రి ఇక్కడ విశ్రమించి రేపు గోధూళికా సమయంలో బయలుదేరి వెళ్లి రా !” అంది .

***************

“ బాబూ ! తపో యాత్రలో  మహత్తర  ప్రభావాన్ని సాధించి వచ్చిన నిన్ను ఆనంద ప్రఫుల్ల నయనాలతో రాబట్టుకోవలసిన రేవతి. ద్రప్సునిచే బంధితురాలై పోయింది . ఈ విషాద సంభవం జరిగినప్పుడు నేను గ్రామాంతరం వెళ్లాను. పాపం ! రేవతి వేరే దిక్కు లేక నీ తండ్రిని ఆశ్రయించింది. నీ తండ్రి తన చేత శస్త్రం ఉన్నంత కాలం ద్రప్సుని ఎదిరించాడు, లాభించ లేదు. నీవు మహావీరుడవు, తపోనుభవ సంపన్నుడవు !ద్రప్సుడు నీకు కావించిన పరాభవానికి తీవ్ర ప్రతీకారం కావించాలని అభిలాష  నీక పుట్టడం సహజమే ! నీవ స్వభావంచే సదా ఘృణివి . ఆ కారణం చేత నీకు ఆపదలే సంబవిస్తాయి ! కాబట్టి ఈ రణ ప్రస్థానంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ నమ్మకు. అందులో కుత్సితలైన యాచకులను ఏనాడూ నమ్మవద్దు. అదిగో రేవతి ప్రాణ సమానమైన కాలాశ్వం ! అది అత్యుత్తమమైన జాతికి చెందిన గుర్రం ! ‘కాళి’ అని పిలుస్తే పలుకుతుంది. దాన్ని తీసుకొని వెళ్లు.” అని చెప్పాడు సోమశ్రవుడు .

సోమశ్రవుడు  గంధర్వుడు. వేదకాలంలో అశ్వ పాలకులని గంధర్వులని వ్యవహరించేవారు ! ఇది వృత్తికి సంబంధించిన పేరు గాని  జాతి పరం కాదు. అతడు పశువైద్యంలో ప్రసిధ్ధుడు, అశ్వశాస్త్రంలో దిట్ట ! ఇతని మనుమరాలే రేవతి. ఆమె చిన్నతనంలోనే తల్లి తండ్రులని పోగొట్టుకొంది. పితామహుని పోషణలో ప్రౌఢ కన్యకయై పార్థ్యమాన పాణియై రాణించింది.

రేవతి  చిన్నప్పటి నుంచి రెండే వస్తువులని  ప్రేమించింది ! ఒకటి,మహావీర కర్ణుడు, రెండవది  కాళి అని పిలువబడే అశ్వం ! అది కాలాభ్రజధరం వలె మిలమిల మెరుస్తూ , రేవతి హృదయ రాణిగా విలసిల్లింది.

“ తాతగారూ ! మీరేమీ చింతించకండి. శీఘ్ర కాలంలోనే మీ మనుమరాలిని తీసుకొని వచ్చి మీకు అప్పగించే పూచీ నాది ! గుర్రాన్ని సర్వాయుధాలతోనూ సజ్జితం  చెయ్యండి. గోధూళికా సమయంలో ప్రయాణం నిశ్చయించు కొన్నాను.”అని చెప్పాడు కర్ణుడు.

“ శుభం నీ మీద నాకు పూర్ణమైన విశ్వాసం ఉంది. నీ తల్లి యోగక్షేమాలని నేను గమనించుకొంటాను, నీవు యువరాజు దుర్యోణుని  కలుసుకొంటే మంచిది, లేదా ప్రాగ్జ్యోతిషాధిపతి సోమప్రియుని కలుసుకొని మాట్లాడినా మంచిదే  !”

“ తాతగారూ ! దుర్యోణుని  సంధించడం విలంబానికి దారి తీస్తుంది. మహారజ సోమ ప్రియుడు పిరికిపంద. వానికి ద్రప్సుడంటే సింహస్వప్నం ! నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు. ఒంటరిగానే కార్యాన్ని సాధించుకోగలను !”

సోమశ్రవుడు మరేమీ మాట్లాడలేదు. కర్ణుడు తన ఆశ్రమానికి వచ్చాడు.

ఆ రాత్రి కర్ణునికి నిద్ర పట్టలేదు, హృత్పలకంలో  ప్రేమమూర్తి రేవతీ విగ్రహం మాటిమాటికీ దీన దృక్కులతో ప్రత్యక్షమయింది. ఆలోచనా తరంగితమైన మెదడులో రాత్రిని వెల్లబుచ్చాడు కర్ణుడు.

సువర్చల దర్భ మొనల్ని నెమరు వేస్తూ చంచల దృక్కులతో అటు, ఇటూ చూస్తూ కర్ణునితో సమంగా జాగరణ చేసింది ! కర్ణమాత దుఃఖంతో అలసి పోయి మగత నిద్రలో రాత్రిని వెల్లబుచ్చింది.

ఉషాదేవి తన చీరమడతలలో బాలార్కుని దాచుకొని ప్రవేశించింది. సమస్త జీవరాశుల చైతన్యాన్ని జోకొట్టుతూ చల్లని మారుతం నదీ శీకర వహిని అయి వోస్తోంది. కర్ణుడు లేచాడు. నిత్య విధుల్ని తీర్చుకొనే నిమిత్తం నది వైపునకు వెళ్లాడు. వాని వెంట సువర్చల కూడ బయలు దేరింది. నదిలో స్నానం చేసి ప్రాతః సంధ్యోపస్థాన మంత్రాల్ని పఠించాడు. ప్రయాణోచితమైన దుస్తుల్ని ధరించి కర్ణుడు, తన తల్లి వద్దకు వచ్చి పాదాలను పట్టుకొని నమస్కరించాడు.

`` నాయనా , కర్ణా ! మన కులపెద్దలు, దేవతలు నిన్ను యుద్ధరంగంలో అజేయుణ్నిగా చెయుదురు గాక ! అజేయమైన ఇంద్రుని వజ్రధార నీ కృపాణంలో ఆవాహితమౌగాక ! ఇదిగో ఈ గోక్షీరాన్ని త్రాగి వెళ్లు. నీ తండ్రిని, నీ ప్రియురాలిని తీసుకొని వచ్చి  నీ తల్లికి నేత్రపర్వం కావించు. ” అని కర్ణమాత  అతనిని ఆశీర్వదించింది.

కర్ణుడు మాత్రుదత్తమైన గోక్షీరాన్ని త్రాగి సువర్చలను గాఢంగా కౌగలించుకొని మేను నిమిరాడు.ఇంతలో సోమశ్రవుడు, కాళినివెంట పెట్టుకొని వచ్చాడు. కర్ణుడు మరొకమారు తల్లికి నమస్కరించి, పూజ్యుడైన సోమశ్రవునికి ప్రణమిల్లి , ఆశ్రమాన్న వదిలి, అశ్వారూఢుడై వెళ్లాడు. సోమశ్రవుడు, కర్ణమాత, సువర్చల కండ్ల నీరు క్రుక్కుకొని గుర్రము వెళ్లిన దిక్కునే చూస్తూ నిలుచుండి పోయారు.

****************

“ యో---మే—జయతి---సంగ్రామే”

గీతికా నాదం చాల మనోహరంగా ధ్వనించింది. అది ఎంత మనోహరమో అంతే ఉత్తేజకరంగా ఉంది .వీరోన్మాదులను రేకెత్తించే నాదమది !

‘‘ యో—మే --- జయతి –సంగ్రామే”

తిరుగ అదే నాదం, దానిలోని పటుత్వం, గంభీరత ప్రఫుల్లములై, గగన వీధిలో పయనించింది. అనంతాకాశంలో లీనమై ఉన్న భగవాన్ ఇంద్రుని సంగ్రామ శక్తి సవాలు చేస్తున్నట్లు గంభీరంగా సుళ్లు తిరిగి వ్యాపించింది.

“యో—మే –దర్పం ---వ్యపోహతి.”

హెచ్చు స్థాయిలో వెడలింది నాదం ! అది మధురాతి మధురంగా ఉన్నా, కాఠిన్యం ప్రస్ఫూటమవుతూంది. దర్పం !! లోకం లోని దర్పంగల వారినందరినీ ఎత్తి పొడుస్తోంది ! వ్యపోహతి-- ??  ప్రశ్న వేస్తున్నట్లు వంపు తిరిగింది నాదం ! పోగొట్ట గలవా ? లేక పోగొట్టుకొంటావా ? అని వీరులను ప్రశ్నిస్తూంది ఆ నాదం !

“యో—మే—ప్రతిబలే –లోకే,
స ! మే – భర్తా ! --- భవిష్యతి !!”

మదించిన వీరులని కదిలిస్తూంది నాదం !

కర్ణుడు గుర్రాన్ని నిలబెట్టాడు. చుట్టు ప్రక్కల కలయ చూచాడు. వానిమ్కంటికి సాంద్రమైన అరణ్యం, అరణ్యాన్ని ఆక్రమించుకొని  విచ్చలవిడిగా  సంచరిస్తున్న చీకటి, చీకట్లో వినబడుతతున్న వివిధ జంతువుల అరుపులు, అటూ ఇటూ పరుగెడుతున్న మృగాలు, దుప్పులు, కుందేల్లు కనిపించాయి. గుర్రం సకిలించింది.

“ కాళీ ! నీకేమైనా కన్పిస్తోందా ?”

గుర్రం తన యజమానిని అర్థం చేసుకొంది. బలంగా సకిలించి ముందరి కాళ్లను ఎత్తింది.

“ ఓ అఙ్ఞాత సుందరీ ! నీది వట్టి అరణ్య రోదనమే ! నీ మదాన్ని అణచగల వీరుడు అరణ్యంలోనా ఉంటాడు ? నీ సవాలు అర్థం లేనిది !” అన్నాడు కర్ణుడు ఉఛ్ఛస్వరంతో..

“ పక పక పక” మని  హాసధ్వని ఆ మహా వీరుని కర్ణ కుహరాలలో పడి రోషాన్ని పుట్టించింది. కర్ణుడు తన ‘ ఘోషణ’  శంఖాన్ని  ఎత్తి అరణ్యమంతా దద్దరిల్లేటట్లు  పూరించాడు. ఆ శంఖ నాదానికి భయపడి అడవి లోని జంతువులు నలుమూలలూ పరుగెత్తాయి ! ఆ నాదానికి సవాలుగా వెంటనే మరొక శంఖారావం  దిక్కుల్ని చీల్చుకొంటూ వచ్చింది. అది అమానుషం ! అప్రతిహతం ! అకుంఠిత గమనం కలది ! అది ( నాదం) తెరలు తెరలుగా నింగిని దొర్లుతున్న ఉరుములను పోలి ఉంది !

శంఖ నాదం శాంతించింది. ఆ వెంటనే కర్ణుని ముందర వెన్నెల పోక కనిపించింది ! క్రమంగా ఆ వెన్నెల స్త్రీ మూర్తిని దాల్చింది. ఆ స్త్రీ ధవళ శరీర కాంతిచే అరణ్యమంతా కాంతివంత మయింది ! ఆ తన్వంగి అర్థ నగ్న శరీర ! ఆమె స్తన మండలాన్ని వ్యాఘ్ర చర్మం కప్పి తనలో బిగువుగా దాచుకొంది ! పిరుందుల వరకు నారచీర కుచ్చెళ్లు జీరాడుతున్నాయి. ఆమె కచ భరం కవులు వర్ణించే ఆళి సమూహం కాదు, పుటంలో క్రాగుతున్న బంగారు కాంతిని మించి, ఆమె కేశ పాశం బంగారపు అలలతో కూడిన మహా సముద్రంలాగ ఉంది !

ఆమె కాటుక కళ్లలోని ధాలధళ్యం నిరుపమానం, ఆమె అంగముల ప్రౌఢత్వం, స్త్రీత్వం, పరాకాష్టని పొంది, అతిలోక మాన్యమై, రాణస్తూంది. ఆమె కెట్టి ఆభరణాలు లేవు ! ఒక్కొక్క అంగం ఒక్కొక్క ఆభరణమై జెఅలిస్తోంది. ఆమె చేతిలో భయంకర నగ్న కృపాణం మెరుస్తోంది. ఆమె సౌందర్యం త్రిభువన పతిని కూడ స్తంభింప చేయదగి మహోజ్వలంగా ప్రకాశిస్తోంది !

కర్ణుడు దిగ్భ్రమ చెందినవాడి వలె  ఆమెనే రెప్పవాల్చక  చూస్తున్నాడు. “ అరె నీవా వృషా ! ప్చ్ ! నా జోడీ నన్ను ఆహ్వానించాడని భ్రమ చెందాను. నీ శంఖ ధ్వనిలో వీరత్వం ఉందని ఒప్పుకొంటున్నాను.”అని కిలకిలమని నవ్వింది ఆ యువతి.

ఆ హాసధ్వని వెయ్యి వీణలు ఒకే మారు మీటినలుంది ! కర్ణుడు చకితుడై ఇలాగన్నాడు, “ భద్రే ! నీ వీరాలాపం అర్థ రహితంగా ఉంది. అరణ్యంలో నీకు తగిన వీరుడు దొరుకుతాడా ?”

“ నీ వింకా బాల్యావస్థలోనే ఉన్నావు వృషా ! నన్ను జయించ గల వీరుడు మానవులలో లేడు. వాడు అతిలోక మాన్యుడు. వానినే నేను ఆహ్వానిస్తున్నాను. నీలో నిజమైన వీరత్వం ఉంది కాబట్టే నీకు ప్రత్యక్షమయ్యాను , వృషాకపీ ! నా సవాలును స్వీకరించడానికి నీకు యోగ్యత లేదు !

“ కారణాన్ని నేను వినవచ్చునా ?”

“నేను వైకుంఠుని చెల్లెలిని !”

వృషాకపి నవ్వుకొన్నాడు. ఈ సమాధానం వానికి నచ్చలేదు.

“బాలిశుడా! నీ నవ్వునాకు అర్థం అయింది. నీకు నా సమాధానం అర్థంకానేరదు, కాని అదే నిజమైన సమాధానం !”

“ భద్రే ! సకల చరాచర నాథుడైన మహేంద్రుని పూర్ణావతారంగా కీర్తినందుతున్న శౌరదేవుని చెల్లెలువా నీవు? ఆశ్చర్యం ! వైకుంఠుని వంటి వాని చెల్లెలు దిక్కలేని దాని వలె, అరణ్యంలో వరుణ్ని వెతుక్కొనే దురవస్థ పట్టిన దానికి చింతిస్తున్నాను. ”

“అరె  వైకుంఠుని చెల్లెలిని పరిహసిస్తున్నావా ? అయినా, నేను నిన్ను క్షమిస్తున్నాను. కారణం ఏమంటే , నీపై నాకు పుత్ర వాత్సల్యం కలదు.”

“ మాతా ! ధన్యుణ్ని ! ఆ పవిత్ర  భావానికి జోహారు ! వృషాకపి నుండి నీకెట్టి భయం ఉండదు. నీ భవ్య నామాన్ని నేను వినగోరుతున్నాను.”

“ బాలిశా ! నీవు వీరుడవే కాని గర్విష్టివి ! నీ గర్వమే నీకుమృత్యువుగా పరిణమిస్తుంది ! బుద్ధిమంతుడవై  నా మాటను పాటించి దానిని త్యజించు. నీకు శుభం కలుగుతుంది !”

కర్ణుడు సాక్షేపంగా నవ్వి ఇలాగన్నాడు ! “ మాతృ వాత్సల్యంచే నువ్వు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించడానికి ప్రయత్నిస్తాను. నీ భవ్య నామాన్ని చెప్పావు కాదు !”

“ వినవయ్యా , నా పేరు ‘ నంద . నీవు వెళ్లి నీ ప్రేయసిని కాపాడుకో ! ద్రప్సుడు మాయావి ! వానితో యుధ్దం నీకు తెమిలే పని కాదు. నీ గర్వాన్ని త్యజించి నా సలహాని పాటించు.”

కర్ణుడు ఆశ్చర్యం పొందాడు. ‘ ఈమె త్రికాలఙ్ఞురాలిగా ఉంది. ’ అని తలంచాడు.

“ అంబా ! నీ ఉపాయాన్ని తప్పక పాటిస్తాను.”

“ అయితే విను, ద్రప్సుడు క్రూరుడే గాని వీర మర్యాదని  పాటించడంలో మహోదారుడు. పరాక్రమ ప్రియుడు. వనికొక చక్కని చుక్క  బుగువైన వీరకన్యక ,‘ మాలిని’ అనే కుమార్తె కలదు. ఆమె పేరుతోనే మాలినీ నగరాన్ని నిర్మించాడు ద్రప్సుడు. మాలినీ నగరోపాంతంలో  ద్రప్సకారణ్యం అనే గహనమైన అడవి ఉంది. నీవు తిన్నగా అక్కడికే వెళ్లు. ప్రతీ మంగళ వారం వీరనారి మాలిని భైరవారాధన కొరకు దుర్గానికి వస్తుంది. ఉపాయంచే  నీవు ఆమెని సంధించు. ఆమె నిన్ను తప్పక ప్రేమిస్తుంది ! ఆమె సహాయంతో నీవు ద్రప్సుని వశం చేసుకొని నీ ప్రేయసిని విడిపించుకో ! ఇదిగో ఈ నీలమణిని తీసుకో ! దీన్ని నోట్లో వేసుకొన్నచో నీవు ఎవరికీ కనపడవు. నీకిది పనికి వస్తుంది. శుభం వెళ్లిరా ” అనిచెప్పి నందా భగవతి కర్ణుని నుండి బదులలు అపేక్షించక అదృశ్యురాలయింది.

(సశేషం)

***********

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద