Skip to main content

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౫-- ద్రప్స నందిని--౨



సాయంకాల సంధ్యారుణిమ కాంతులు, ‘భైరవ దుర్గంపై’ ప్రసరించి నలుపుతో కలిసిన ఎరుపు శోభను ప్రసాదిస్తున్నాయి. భైరవ దుర్గం నల్ల సానరాతితో కట్టబడి ఉంది. చంద్ర వంకతో కలిసిన ఎర్రని త్రిశూల పతాక నీరెండలో ప్రకాశిస్తూంది. కోటలోని భైరవ దేవాలయంలో సాయంకాల పూజా చిహ్నంగా గంటలు మ్రోగుతున్నాయి. కర్ణుడు అశ్వారూఢుడై దుర్గపు సింహద్వారాన్ని సమీపించాడు. సింహద్వారాన్ని బలిష్ఠులైన యోధులు కాపలా కాస్తున్నారు. కాపలాదార్లను ప్రతిఘటిస్తే తప్ప దుర్గం లోకి వెళ్లడానికకి వీలుండదు ! ప్రతిఘటన వల్ల లాభం కన్న నష్టమే అధికంగా ఉండవచ్చు! కర్ణుడు తీవ్రంగా ఆలోచించి తుదకొక తీర్మానానికి వచ్చాడు. కర్ణుడు తన గుర్రాన్ని దుర్గ సమీపంలో చెట్ల గుంపు మధ్యన కట్టాడు. నందా భగవతి తనకు ప్రసాదించిన మణిని నోట్లో వేసుకొని పాదచారిగా సింహద్వారాన్ని దాటి దుర్గ ప్రవేశం చేసాడు.

కర్ణుని ప్రవేశాన్ని ఎవరును గమనించినట్లు లేదు. అప్పుడు పూర్తిగా నభోమణి అస్తాద్రి మరుగు జొచ్చాడు. చంద్రోదయ మయింది తారాగణం ముసుగు తొలగించుకొంది. ఆకాశం నీలిపట్టు చాందినీ వలె రమణీయంగా కన్పడుతూంది. చల్లని మందమారుతం దుర్గంలో నందనవన పుష్ప సౌరభాన్ని వెదజిమ్ముతూంది.

ఒక మనోహర దృశ్యం ! కర్ణుని కండ్లు ఆనందించే తాండవించాయి. ఒక నవయౌవనాంగి కంచు కాగడతో ముందు నడుస్తూంది. ఆమెని అంటి రెండు వరుసలుగా – వరుసకి పండ్రెండుగురు చొప్పున సుందర కన్యామణులు కంచు కాగడలతో వయ్యారంగా మంద మంద గమనంతో నడుస్తున్నారు. వారి మధ్యన ఒకర్తె హంస గమనంతో నడుస్తూంది.
ఆమెకు ముత్యాల జాలర్లతో కూడిన శ్వేతఛ్ఛత్రాన్ని పట్టి ఒక ముగ్ధ నడుస్తూంది. ఇరువైపుల ఇద్దరు మోహనాంగులు వింజామరలు వేస్తూ నడుస్తున్నారు.

“ ఈ పుష్ప సుకుమారులు ఎచ్చటికి వెళ్లుతున్నారు ?” అని తనలో తాను తర్కించుకొంటూ కర్ణుడు వారిని   అనుసరించాడు. భైరవాలయ గోపురం గగన చుంబితమై కన్పడింది. గోపుర ద్వారం దగ్గర లోహ కవచధారులై ఇద్దరు యోధులున్నారు. స్త్రీ సమూహాగ్ర గామిని  సుందరికి ముందరికి దారి ఇచ్చారు ద్వారపాలకులు. ఆమె చేతిలోని కంచు కాగడాను ద్వారవలయానికి గ్రుచ్చి లోనికి వెళ్లింది. తతిమ్మా కన్యలందరూ ద్వారం దగ్గర ఆగిపోయారు. స్వేతఛ్ఛత్రమ్ క్రీదకి దించబడింది. వింజామర గ్రాహిణులు నిలబడి పోయారు.
మగధ సామ్రాజ్య సమ్రాట్ కుమార్తె , యువరాణి ‘ మాలినీ కుమారికి’ అభివాదన చేసారు ద్వారపాలకులు. ఆమె లోనికి ప్రవేశించింది. కర్ణుడు కూడ ఆమెను అనుసరించి లోపలికి వెళ్ళాడు. ద్వారపాలకులు తలుపులు బంధించారు.

భైరవ దేవాలయంలో గర్భ గృహానికి ముందుగా పదహారు స్తంభాల మంటపం ఉంది. ఆ స్తంభాలని పరిశీలనగా చూసాడు కర్ణుడు. ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క కళా రూపిణియైన దేవీ మూర్తి చిత్రితమై ఉంది. పరాశక్తిని ‘షోఢశ కళల’ రూపంతో ఆరాధించే విధానానికి మూల పురుషుడు, మగధ సామ్రాట్ ద్రప్సుడు.తుషారాత్మక చంద్ర తేజోంశ రూపుడు ద్రప్సుడని ‘నిగమ ప్రసిధ్ధి’ . ఇతడే ‘ జరాసంధుదని’  భారతేతిహాసం చెప్తోంది ! ఈ రెండు పేర్లకూ సాదృశ్యం కలదు.‘ జరయా వృధ్ధా వస్థయా సన్ధీయత ఇతి జరాసంధః’ అనగా చంద్రుడనే తాత్పర్యం ద్యోతకం అవుతుంది ! చంద్రుని వృధ్ధావస్థ పౌర్ణమే కదా ! చంద్రుడే పితృలోకమంటారు. పితృలోకాధిపతి ‘యముడు’. అతడే భైరవాపర పర్యాయుడు.! ఇది ద్రప్సుడు భైరవోపాసకుడనే ఐతిహాసిక ప్రసిధ్ధికి మూలం !

ప్రకృతాన్ని అనుసరిద్దాం. ఇద్దరు యవతులున్ను మంటపాన్ని ప్రదక్షిణంగా తిరిగి వచ్చారు. వారిని యథాతథంగా అనుసరించాడు కర్ణుడు. ఇద్దరు సుందర కన్యామణులు మంటపం లోనికి వెళ్లారు.

మంటపంలో ఒక శిల్ప ఖండం ! అది పాలరాతి విగ్రహం. అది అష్ట భుజా త్రిపుర భైరవీ విగ్రహం ! సహస్ర విధ పరికరాల్తో విధి విరామం లేక చెక్కిన శిల్పమా ఇది—అన్న భ్రాంతిని కల్పిస్తూందా విగ్రహం. ఆ శిల్పం ప్రతి అంగమున్నూ దైవిక రూప సంపత్తి కలిగి య్థా శాస్త్రోపేతంగా అమరి శోభిస్తున్నాయి. “ మనోహరం” అనే ఒకానొక అవ్యక్త నిర్గుణ రూప బ్రహ్మం ఆ శిల్పంలో ఇమిడి సారూప్య భావాన్ని పొంది భాసించింది. ఆ రూప ఖండంలో గాంభీర్యం, సౌందర్యం, వీరత్వం ఇత్యాది కళలు శరీరంలో లావణ్య ఝురివలె ప్రవహిస్తున్నాయి. ఇన్ని కళలతో పుంజీభవించిన ఆ మూర్తిలో సౌమ్యత, ప్రేమ, మాతృత్వం ఒక్క కన్నుల జంటలోనే ఇమిడ్చాడు. మహాశిల్పి.

కర్ణుడు ఆ విగ్రహాన్ని చూచి అక్కడ ఉన్న స్తంభం వలె నిలబడి పోయాడు కొంత్ సేపటికి మాలినీ కుమారి చేతులు జోడించి ఇట్లు బహిరంగంగా ప్రార్థించింది !

“ జగజ్జననీ ! సమస్త చరాచర జీవరాసులకిన్నీ మాతృమూర్తివి నువ్వు ! నీ సన్నిధానంలో నా హృదయాన్ని విప్పి చెప్పుకోవాలని కోరికతో వచ్చాను. నా తల్లి నన్ను కన్నదే గాని నా తండ్రే నన్ను నన్ను పెంచి పెద్దచేసారు. నా తండ్రి నీ ఏకాంత భక్తుడు – వీరత్వారాధకుడు ! అతనికి సౌందర్యారాధన ఉపాంగమే గాని, ప్రధానం కాదు. కాబట్టి నేను వీరత్వ వాతావరణంలో పెరిగాను. ఎటు చూచినా శస్త్రాస్త్రాలే కంటికి కన్పడే విధంగా నా బాల్యాన్ని పోషించాడు నా తండ్రి.నన్ను ఒక మహోత్కృష్ట  వీర బాలికనిగా గావించి, ఒక మహావీర పురుషునికి ఇల్లాలుగా జత కూర్చాలని నా తండ్రి ఆశయం ! నా ఆశయం కూడ అదే –తల్లీ ! నేనొక మహావీర భర్తనుగా పొందే భాగ్యాన్ని ప్రసాదించు.’’

ఆశ్చర్యం , త్రిపుర బైరవీ విగ్రహ కంఠ  ప్రసూన మాలలో నుంచి ఒక పువ్వు జారి క్రింద పడింది !మాలిని ముఖం ప్రఫుల్లమయింది. కాని అంతలోనే ఒక విషాద సఘటన జరిగింది ! ఆ పుష్పం వెంటనే మాయమయింది. మాలిని హృదయంలో ఆందోళన పుట్టింది. ఆ పుష్పం అదృశ్య రూపుడై ఉన్న కర్ణుని చేతిలో చిక్కిందని , ద్రప్స నందిని ఎట్లు ఊహించ గలదు ?

“చెలీ ! చంచలా ! జనని ప్రసాదించిన పుష్పం మాయం కావడానికి కారణం ఏమి ? అది అమంగళ సూచన కాదు గదా?” అని మాలిని ప్రశ్నించింది.

“ భర్తృదారికా ! పశ్పం క్రిందకి జారడం మంగళ సూచకం. అదృశ్యం కావడానికి ఏదో కారణం ఉండవచ్చు భర్తృదారిక ఏమాత్రం కలత చెంద వద్దని మనవి.”

“ చెలీ ! ఇక మనం భైరవ మూర్తి దర్శనం కావించుకొని ఇంటికి పోదాం.”

మాలిని త్రిపుర భైరవికి మరొకమారు నమస్కరించి తన చెలికత్తెతో వెనుతిరిగింది. ఏమాశ్చర్యం ! ఒక పుష్పం తన వక్షోజ భగం పైన సూటిగా వచ్చి పడింది. విగ్రహం నుండి పడిన పుష్పమే అది ! మాలిని ముఖం సహస్ర తామరసం వలె వికసించింది.

“ చెలీ ! చూసావా ? దేవి ప్రసాదించిన పుష్పం !”

చంచల మందహాసం చేసింది. “ భర్తృదారికా ! మొదట దేవి మీకుమ్పుశ్పాన్ని ప్రసాదించింది. ఇప్పుడదే పుష్పాన్ని నీ ప్రియుడు విరజిమ్మాడేమో !”అని నవ్వింది .

“ పోవే, చంచలా ! దేవీ సన్నిధానంలో పరిహాసమా ? పోతుటీగ కూడ చొరరాని ఈ దేవాలయం లోకి ఎవరు రాగలరు ? ” అని చెప్పిందే గాని ఆమె శరీరం సిగ్గు దొంతర్లచే పూచి మనోహరంగా కన్పడింది !

మంటపాన్ని విడిచి ఆ స్త్రీలు ఇరువురూ గర్భగుడి లోనికి ప్రవేశించారు. వారి వెనుకనే కర్ణుడు కూడ ప్రవేశించాడు.

గర్భగుడిలో నల్ల సానరాతితో మలచ బడిన ఆరడుగుల భీకరమైన విగ్రహం కనబడింది. వ్రేలాడుతున్న ఎర్రని నాలుక, కోరలు కలిగి ఆ విగ్రహం మహాభీకరంగా ఉంది ! చూడగానే భయాన్ని పుట్టించే ఎర్రని పుష్పాల మాలికలు, పుర్రెల మాలలు ఆ విగ్రహ కంఠ సీమని ఆక్రమించుకొని విగ్రహానికి మరింత భీకరత్వాన్ని ఆపాదిస్తున్నాయి. విగ్రహం పదహారు చేతులలో, పదహారు విధాలైన ఆయుధాలు చక్కగా మలచ బడి ఉన్నాయి. విగ్రహానికి ముందుగా పెద్ద త్రిశూలం కుంకుమ లిప్తమై నాటబడి ఉంది. మాలినీ కుమారి, చంచల ఇద్దరూ విగ్రహానికి ఎదురుగా నిలబడి చేతులు జోడించారు.కర్ణుడు విగ్రహాన్ని చూసాడు. దాని ఆకృతి వానికి జుగుప్సను కలిగించింది, నమస్కరించ మనసు పుట్టలేదు. చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

విగ్రహం కండ్ల లోంచి ఎర్రని కాంతి బయలు దేరింది. గర్భగుడిలోని దీపాలు నిష్ప్రభగా వెల్గుతున్నాయి. ప్రదేశమంతా సింధూరారుణమయింది. వీర భైరవ మూర్తికి ఆగ్రహం కల్గిందా ఏమి ? మాలినీ కుమారి కంపించి పోయింది ! చంచలా కుమారి భీతిచే మ్రాన్పడి పోయింది.

‘‘ భగవన్ ! ఏం అపరాధం జరిగింది ? సదా నిన్నే నమ్మి కొలుస్తున్న నాపై నీకు ఆగ్రహం కల్గిందా ? నన్ను క్షమించు, ప్రభో ! శాంతించు.” అని బిగ్గరగా వేడుకొంది మాలినీ కుమారి.

“ఇంద్రత్వోతాన ఆ వయం వజ్రం ఘనా
దధీమహి, జయేమ సం యుధి స్పృథః”

అనే ఆర్షం వైశ్వామిత్ర మధుఛ్ఛంధస్సుని వెనుక ప్రక్క నుంచి గంభీర నినదంతో వినబడింది. మాలినీ కుమారి వెనుతిరిగి చూసింది. ఆ చూపులో ఆందోళన ప్రతిఫలించింది. చంచల కూడ భీత హరిణం లాగు వెనుతిరిగి చూసింది. వారిద్దరూ విగ్రహాన్ని చూచారు. ఇప్పుడా విగ్రహంలో మార్పు కలిగింది. కండ్ల లోని ఎరుపు కాంతి అణగారింది.

“చెలీ !.ఎవడో మనల్ని అదృశ్య రూపంలో వెన్నంటి వచ్చాడు. కాబట్టే భైరవ మూర్తికి ఆగ్రహం కలిగింది. పద పోదాం. ఈ అఙ్ఞాత వ్యక్తికి ద్రప్స నందిని ఏమాత్రమూ భయపడదు. వాడెవడో, ---నిజమైన వీరుడే అయితే – నా కంటికి కన్పించు గాక ! భీరువే అయితే తోక ముడుచుకొని వళ్లిపోనీ ! మాకేమీ చింత లేదు.” అని కోపఘూర్ణిత నేత్రాలతో పల్కింది మాలిని.

“ సుందరీ ! కోపంతో నీ ముఖమండలం అరుణ రాగ రంజితమయి శోభాయమానంగా ఉంది ! చూడతగ్గదాన్ని చూసి ఆనందించాను.”

“ ఓయీ , అఙ్ఞాతమూర్తీ ! నీ సరసమైన వ్యాఖ్యాన్నాన్ని విని ద్రప్స నందిని ఆనందించ నేరదు. నీ వెట్టి ఘోరమైన అపచారం కావించావో ఊహించలేకున్నావు. అంతః పుర స్త్రీ జనాన్ని అఙ్ఞాతంగా వెంబడించడం మహాపరాధం ! ఎవరు కూడ చొరరాని సింహం గుహలో చొరబడ్డావు. నీ మదాన్ని అణచడానికి మహారాజ ద్రప్సుడు అవసరం లేదు. ఈ మాలిని చాలును ! వీరుడవైతే కంటికి కనిపించు, లెదంటివా పారిపో !” అని బదులిచ్చింది మాలినీ కుమారి.

గలగలమని నవ్వాడు కర్ణుడు. ఆ హాసం గర్భగుడిలో ప్రతిధ్వనించింది. నందా భగవతి తనకిచ్చిన ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని తన దుడుసుతనానికి తానే నొచ్చుకొన్నాడు.

“సుందరీ ! నన్ను క్షమించు, నేనొక పేద తపస్విని. ఈ క్ఫ్టలోని భైరవాలయాన్ని చూడాలని వచ్చాను. చూడతగ్గదాన్ని చూసాను కూడ ! నాకెట్టి దురుద్దేశం లేదని మనవి చేసుకొంటున్నాను. మరొకప్పుడు భర్తృదారికను కలుసుకోగలను.” అని చెప్పాడు.

“వెర్రి తాపసీ ! నీ మాటల వైఖరి తాపసత్వాన్ని చూపజాలకుంది ! నీవు పచ్చి దొంగలా కన్పిస్తున్నావు ! నీ మాటపై నాకు విశ్వాసం లేదు, ఈ పవిత్ర దేవతా సన్నిధానంలో అసత్యం చెప్పరాదు.”

కర్ణునికి నవ్వు ఆగింది కాదు. మాలిని ఎత్తిపొడుపుకి వానిలో రోషానికి బదులు హాసమే పుట్టింది. వాడు బిగ్గరగా నవ్వేసాడు.

“ చెలీ,పోదాం పద ! వీడు మర్యాద తెలియని పశువులాగ ఉన్నాడు . పిరికి పంద కూడాను ! ” అని పలికి మాలిని పలికి, చంచలతో కలసి గర్భగుడిని దాటి బయటికి వచ్చింది.

బయట—ఆజానులంబిత బాహుడు, విశాలోరస్కుడు, ఆకర్ణాంత విశల నయనుడు, సింహ పరాక్రముడైన వృషాకపి , మాలినీ కుమారి ముందర ప్రత్యక్షమయ్యాడు. సహజ కవచ కుండల ధారియైన ఆ మహావీరుడు చూచువారి హృదాయాలను ఆకర్షించ కలిగి ఉన్నాడు. ఆ దర్శనోత్సవంలో మాలినీ కుమారి తన్మయుతాలయింది ! కర్ణుని  మహోజ్వల  రూపం ఆ సుందరి హృదయంలో లోతుగా చొచ్చచుకు పోయింది. ఆ సంభవం ఆ వీరనారి జీవితంలో పరాభవ ఘట్టమనే చెప్పాలి !

“ మహాత్మా ! నమస్కారం. నా వాచాలతను క్షమించాలి---” అని వినయంగా చెప్పింది మాలిని.

“ అది వాచాలత కాదు సుందరీ , తత్కాలోచిత ప్రసంగమే అవుతుంది ! కాబట్టి నేను క్షమించ వలసిన పని లేదు. నేను దుడుసుతనంగా ప్రవర్తించినదానికి నీవే నన్ను క్షమించాలి.”

 “ మహాత్మా, నా చెలి ఒక సామ్రాట్టు కుమార్తె ! గౌరవ సంబోధనకు అర్హురాలని మనవి,” అని చెప్పింది చంచల.

“ తథాస్తు, నీ సూచనను సంతోషంతో స్వీకరిస్తున్నాను.” అన్నాడు కర్ణుడు.

“ సఖీ ! తపస్సంపన్నులైన మహాత్ములు ఎట్లు సంబోధించినా బాధ ఉండదు. వారు సర్వ తంత్ర స్వతంత్రులు కదా !” అని చెప్పింది మాలిని.

“ మీ ఇద్దరి స్వతంత్ర సంభావనలకు నా అంతరాయం దేనికి ! భర్తృదారికా, నేను తప్పుక్పొంటాను.” అని చమత్కరించింది చంచల.

 మాలినీ కర్ణులిద్దరూ మందహాస మిళిత దృక్కులతో ఒకరినొకరు చూసుకొన్నారు.

కించిత్పరుషంగా “ చంచలా ! నీ చమత్కార  ప్రసంగానికి వేళాపాళా ఉండదా ? అధిక ప్రసంగీ !” అని మందలించింది మాలిని.

చంచల నవ్వుతూ – “ మహాభాగ ! మీరు చెప్పండి, నేనా అధిక ప్రసంగం చేసాను ?” అని అన్నది.

“ నిజమే ! చంచలా కుమారీ ! అధిక ప్రసంగం చేసిన వాణ్ని నేనే ! భర్తృదారిక పరోక్షంగా నన్నే మందలించి ఉంటారు. ‘ ‘పరోక్ష ప్రియావహి దేవాః’  అని అంటారు కదా పెద్దలు !” అని అన్నాడు కర్ణుడు.

మాలినీ కుమారి చంచల చెవిలో ఏదో గుసగుస లాడింది ! చంచలా కుమారి కర్ణుని ఉద్దేశించి – “ మహాత్మా ! మా చెలి మీ శుభ నామధేయాన్ని తెలుసుకోవాలని కోరుతోంది, అనుగ్రహించండి.” అని కోరింది.

“ భద్రే ! నా తల్లి నన్ను ‘ కర్ణా’ అని పిలుస్తుంది. నా వీర యువక మిత్రులు నన్ను ‘ శుష్ణ ; తూర్వయాణ నామాలతో ’ సంబోధిస్తారు. భగవన్ వైకుంఠుని పట్టమహిషి ,‘ ఇంద్రాణి’  నన్ను ‘ వృషాకపి’ అని దూషణగా పిలుస్తుంది. ముని బృందం నన్ను ‘ శుక్రవసు; అశుష; సూర; గౌ’ ఇత్యాది నామాలతో పిలుస్తారు. ఇట్లు నా గుణాలను బట్టి నేను బహునామకుణ్నిగా అయ్యాను. వీటిలో నాకు ప్రియమైనవి ‘ వృషాకపి; కర్ణ’ నామధేయాలు ! నన్ను కన్న జననీ జనకులు నాకు తెలియదు, నన్నొక పుణ్య దంపతులు పెంచి పెద్ద చేసారు. నన్ను పెంచిన తండ్రి రాజ్య భ్రష్టుడైన ఒకానొక రాజు.” అన్నాడు కర్ణుడు.

“ మీరే పని మీద ఈ ప్రాంతానికి వచ్చారు ?”

“ అది నా స్వవిషయం ! నేను ఈ అరణ్య ప్రాంతంలో కొంత కాలం ఉండడానికి సంకల్పించాను.”

“ సఖీ ! ఈ మహావీరునికి మన నాగ వనంలో బస ఏర్పాటు చేయాలి.” అని ఆఙ్ఞా స్వరంతో చెప్పింది మాలిని.

“ భర్తృదారికా ! సామ్రాట్ ---”

“ చాలించు సఖీ ! అదేదో నేను చూసుకొంటాను.”

“ సుముఖులారా ! నాగవనం ఎక్కడ ఉంది ?” ప్రశ్నించాడు కర్ణుడు.

“ ఇక్కడే దగ్గరగా క్రోసెడు దూరంలో ఉంది. దానికి ఈ కోటలో నుంది సొరంగ మార్గం కూడ ఉంది. అది భర్తృదారిక క్రీడోద్యాన వనం !”

కొంత సేపు మౌనం. మాలినీ చంచలలు ఇద్దరూ రహస్యంగా మెల్లని గొంతుకతో మాట్లాడుకొన్నారు. కర్ణుడు పరధ్యానం నటిస్తూ గోపురాగ్రాన్ని చూస్తున్నాడు.

“ మహాత్మా ! మీరు మాతో అఙ్ఞాతంగానే రండి. మిమ్ములను నేను సొరంగ మార్గంగా నాగ వనానికి తీసుకొని వెళ్తాను,;” అని చెప్పింది చంచల.

“ మహాప్రసాదం. నాకొక గుర్రం ఉంది. ‘ కాళీ’ అని పిలుస్తే దగ్గరకు వస్తుంది. ఈ కోట వెనకాలే కట్టాను.”

“ ఆ విషయం ముఖ్యంగా గమనించ బడుతుంది. మీరీ ప్రాంతంలో ఉన్నంత వరకు మీ గుర్రం మా కోటలో అతిథిగా సత్కరించ బడుతుంది. ” అని నవ్వుతూ చెప్పింది చంచల.

వారందరూ అక్కడ నుండి కదిలారు. కర్ణుడు మణిని నోట్లో వేసుకొని అఙ్ఞాతంగా వారిని అనుసరించాడు.

****************

 ద్రప్సుడు బోనులో సింహం వలె తన అభ్యంతర మందిరంలో అపచారు చేస్తున్నాడు. ద్రప్సుడు మహోన్నతమైన శరీరం కలవాడు. అతడు నాగాయుత బలుడని ఇతిహాసంలో చెప్పబడి ఉంది. అతడు పరాక్రమ ప్రియుడు. జయాన్ని, ఓటమిని సమ భావంతో అనుభవించునట్టి మహోదార ప్రకృతి గలవాడు. ‘భైరవారాధన, నరబలి’ --- వీటిచే అతడు అసురుడైనప్పటికీ , వ్యక్తిగతంగా అతడు ఆర్య రాజుగా కీర్తింప బడ్డాడు ! ముఖ్యంగా ఆర్యుల యుధ్ధ నీతిని పాటించడంలో అతడు ఆ కాలపు ఆర్య రాజులకు తలమానికమైన వాడు.

“ దారుకా, దారుకా !” అని గర్జించాడు మహారాజ ద్రప్సుడు.

స్వర్ణ కంచుకి దారుకుడు సంభ్రమంతో మహారాజు ముందర నిలిచాడు. “ దారుకా ! మాలినీ కుమారిని నేను శీఘ్రంగా చూడాలి, వెళ్లు.”

రాజపుత్రి  మాలినీ కుమారి తండ్రి మ్రోల వచ్చి నిలిచింది.

“ మాలినీ ! ఆ గద్దెపై కూర్చో !” అన్నాడు మహారాజు.

మాలిని మారు మాట్లాడకుండ కూర్చొంది.

“ మాలినీ ! నేను అడిగే నిజమైన జవాబులు చెబుతావా ?”

“ మహాప్రభో ! సత్యవ్రతం మీ బిడ్డ సహజ గుణం.”

“ బలే , కుమారీ ! నీ తల్లి సుమాలినికి తగిన కుమార్తెవని అనిపించుకొన్నావు ! నీ తల్లి దానవ కన్య అయినా సత్య సంధురాలు ! స్వప్నంలో కూడా అబధ్ధం ఆడి ఎరుగని పరమ సాధ్వి.  నీ తాత వింధ్యాద్రిలో ఏలుబడి కావిస్తున్న రోజులలో నేను అక్కడకు వెళ్లడం జరిగింది. అప్పుడే మీ అమ్మను మొదటి సారిగా చూచాను. ఆమె నా పరాక్రమాన్ని ప్రేమించింది. నేనామె మధురములైన గుణాల్ని ప్రేమించాను ! నీ తాత నీ తల్లిని సూటిగా మా ప్రణయాన్ని గురించి ప్రశ్నించాడు. ఆమె నిర్భయంగా నన్ను వలచినట్లు చెప్పింది.ఆ దానవుడు ఒక షరతు పెట్టాడు. అదేమిటో తెలుసా, ద్వంద్వ యుధ్ధంలో అతనిని నేను ఓడించి సుమాలినిని పరిణయమాడ వచ్చును అని ! మాకిద్దరికీ ఘోరమైన యుధ్ధం చాలకాలం జరిగింది. ఆ యుధ్ధాన్ని తలచుకొంటే ఇప్పటికీ నాకు రోమాంచితమవుతుంది ! నేనే గెలిచాని. నీ తల్లిని గాంధర్వ విధిని వివాహం చేసుకొన్నాను.ఈ కథ నీకు అఙ్ఞాతం కాదు ! అయినా నిన్ను హెచ్చరించడానికి నీకు చెప్పాను.”

“ అడగండి నాన్నగారూ ! నా ప్రాణానికి ముప్పు వచ్చినా నేను అబధ్దం ఆడను.”

“ సరే ! గత మంగళ వారం నీవు భైరవ దుర్గం లోని ఆలయానికి వెళ్లావా ?”

“ వెళ్లాను నాన్నగారూ !”

“ అక్కడ జరిగిన సంభవాన్ని చెప్పు.”

“ అక్కడ నేనొక మహావీరుణ్ని కలుసుకొన్నాను.”

“ అతనికి నీవే ప్రవేశాన్ని కలుగ జేసావా ?”

“లేదు, నాన్నగారూ ! అతడు అదృశ్యకరణి విద్య ప్రభావం వల్ల క్ఫ్ట లోనికి రాగలిగాడు.”

“ అతనెవరు?”

“ అతనికి చాల పేర్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి రెండు--- వృషాకపి, కర్ణుడు.”

“ స్వశ్వుని కుమారుడు కర్ణుడేనా ?”

“ నాకు అతని తండ్రి పేరు తెలియదు ! కాని, ఒక విషయం మాత్రం తెలుసు. అతడు పెంపకానికి వచ్చిన వాడట ! అసలుతల్లి తండ్రులు తెలియరట !”

మహారాజ ద్రప్సుడు ఆందోళనా పూరిత హృదయంతో లేచి పచారు చేయసాగాడు. తండ్రి ముఖ కవళికలను గమనించి మాలిని చాల దిగులు చెందింది. మహారాజు పచారు ఆపుచేసి ఇలాగన్నాడు.

“కుమారీ ! పెంపకపు తండ్రిని గురించి అతడు మరేమన్నా చెప్పాడా ?”

మాలిని రెండు క్షణాలు తటపటాయించింది. ఆమె కర్ణుని మనసార ప్రేమించింది. తన  మూలంగా తన ప్రియునికి ఆపద సంబవిస్తుందేమోనని భయపడింది.

“ నాన్నగారూ ! ---” మాలిని కంఠ స్వరం వణికింది. పైన చెప్పలేక పోయింది.

“కుమారీ ! అబద్ధం చెప్పనని వాగ్దానం చేశావు.”

“ అతడు రాజ్యభ్రష్టుడు కావింపబడ్డాడట !. అంత కంటె వివరాలు నాకు తెలియవు.”

మహారాజు మళ్లా పచారు సాగించాడు. వాని అడుగులు బలంగా పడి చప్పుడు చేస్తున్నాయి. గుభీలుమని ఆగి, “ మాలినీ ! నీవు వాణ్ని ప్రేమిస్తున్నావా ?” అని అడిగాడు.

ఈ ప్రశ్న మాలిని గుండెల్లో బాణం వలె గ్రుచ్చుకొంది. ఆమె శరీరంపై శ్వేద బిందువులు, చిరు ముత్యాల వలె మెరిసాయి. ఆమె ఎట్టి బదులు చెప్పలేక తల దించుకొంది.

“ కుమారీ ! నిన్ను ఆదర్శ వీర మహిళనుగా చేయాలని తలంచాను. అన్ని ఆయుధాల లోనూ ప్రవీణురాలినిగా చేసాను. ఎంత చేసి ఏం లాభం తల్లీ ! కొసకు స్త్రీ జన సహజమైన ప్రేమకి దాసురాలివి అయిపోయావు ! హా ! భైరవా ! ఇప్పుడు నా కర్తవ్యమేమిటి ?”

మాలిని లేచి నిలబడి ధైర్యంగా ఇలా చెప్పింది.

“ నాన్నగారూ ! నన్ను వీరనారినిగా చేయడం లోని మీ ఉద్దేశాన్ని సరిగా గ్రహించ లేక, నేను ప్రేమకి లొంగి పోయాను. ఒక మహా వీరుణ్ని ప్రేమించి వివాహం చేసుకోవడం మీకు సమ్మతి అని పొరబడ్డాను! నేను ఒక వీర పణమని విర్రవీగాను. అయినా ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండి పోతాను !”

మహారాజ ద్రప్సుడు కుమార్తెను సమీపించి , భుజంపై చేయి వేసి, -- “ కుమారీ ! ఆవేశపడ వద్దు. నీవు వీర పత్నివి కావడమే నా సంకల్పం ! ఈ కాలంలో అందరూ వీరులమని తొడ కొట్టు కొంటారమ్మా ! నీ ప్రేమ సరైన స్థానంలో నిక్షిప్త మయిందని ఎలా చెప్పగలవు ? అదిన్నీ కాక నీవు ప్రేమించిన యువకుడు, నాకు పరమ శతృవు ! అతని తండ్రిని రాజ్య భ్రష్టుణ్ని చేసింది నేనే ! నాచే నిర్మితమైన మాలినీ నగరం అతని రాజ్యభాగం లోనిదే !”

మాలినికి తన తండ్రి స్వభావం ఎట్టిదో పూర్తిగా తెలుసు ! నిర్భయంగా అభిప్రాయాలని జంకు కొంకు లేక వెల్లడి చేసిన వారిపై అతడెల్లపుడూ సుముఖుడై ఉంటాడు. ప్రథమంలో కొంత కఠనంగా కనిపించినా ,సహేతుకమైన వాదనకు లొంగిపోయే సరళ స్వభావం కలవాడు అతడు ! కాబట్టి మాలిని నిర్భయంగా ఇట్లు పలికింది.

“నాన్నగారూ ! మీ రాజకీయ కారణాలు , విరోధాలు నా వరణ స్వాతంత్ర్యానికి  అడ్డంకిగా ఉండడం శోచనీయం ! అతనికి నా మనసిచ్చాను, నా ప్రతిఙ్ఞను నెరవేర్చే ప్రతాపం అతనిలో ఉందని నాకు నమ్మకముంది ! మీకు ఇష్టమయిందా సరే, లేనప్పుడు నాకు ఈ జన్మలో కన్యాత్వమే శరణ్యం ! మీ ఇష్టానికి నేనెప్పుడూ వ్యతిరేకురాలిని కాజాలను !”

మహారాజు కుమార్తెను మందహాసంతో చూసి, “ కుమారీ ! నీ వరణ స్వాతంత్ర్యాన్ని అపహరించేంత నీచున్ని కాదమ్మా నేను ! నీవు ప్రేమించిన యువకుడు వీరత్వాన్ని పరీక్షించి గాని, నేను నా సమ్మతిని నీకు ఇవ్వజాలను. నిన్ను వరించిన వానికి నా భాగానికి వచ్చిన అంగ రాజ్యాన్ని ఇవ్వడంలో గొప్ప చిక్కేమీ లేదు ! కాని, కుమారీ ఒక మాట --!” అన్నాడు

“చెప్పండి నాన్నగారూ !”

“ నీ ప్రియ వీర యువకుడు ఇదివరలో తన హృదయాన్ని మరొక సుందర యువతికి ధారాదత్తం చేసి ఉన్నాడు. ఈ విషయం నీకు అఙ్ఞాతంగానే ఉందని నా నమ్మకం !”

“ ఆ విషయం నాకు తెలియదు , నాన్నగారూ ! మధుకరుడు అనేక పుష్పాలని చవి చూస్తాడు ! అప్పుడొక పువ్వు మరొక పువ్వుతో తగవులాడుతుందా ? మీ విషయాన్నే ఎత్తి చూపెట్టినప్పుడు నన్ను మీరు క్షమిస్తారనే నా నమ్మకం ! మీరొక్క స్త్రీకే మీ ప్రేమని పంచిపెట్టారా చెప్పండి ? నాకు ఆ విషయంలో అసూయాభావం లేదు నాన్నగారూ !”

“ సరేనమ్మా ! రేపు నేనొక బహిరంగ ప్రకటన చేయ దలచుకొన్నాను. ఆ ప్రకటనని విని నీ ప్రియుడు నిజమైన వీరుడే అయితే తప్పక నన్ను సంధించగలడు ! అంతా భైరవుని ఇఛ్ఛ !”

మాలిని శాంతియుత వాతావరణం లోనే తండ్రిని వదిలి వెళ్లింది. ఆమె మనసు మాత్రం బరువుగానే ఉంది ! తండ్రి కావించే ప్రకటన ఎట్టిదిగా ఉంటుందోనని ఆమె దిగులు చెందింది.

***************
( సశేషం )

*************



Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ