Skip to main content

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౫—ద్రప్స నందిని—౩



మహారాజ ద్రప్సుని అధికారయుత ప్రకటన అన్ని దేశాల లోనూ ఘోషింప బడింది. ఆర్యావర్తం లోని మహావీరులలో సంచలనం ఏర్పడింది. మాలిని అసాధారణ రూపవతి ! బంగారానికి తావి అబ్బినట్లు ఆమెలో యువతీ జన దుర్లభమైన శస్త్రాస్త్ర పాండిత్యం కూడ కలదు. వీర యువకు లందరి హృదయాల లోనూ అట్టి ఉత్తమ నారీమణిని చేపట్టాలనే వాంఛ ప్రబలింది.

కాని, ఆ ప్రకటనలోని ప్రధాన విషయం అనేక మందిని నిరుత్సాహ పరచింది , అదేది ? నాగాయుత బలుడును, శరీర బలంలో దీటులేని పోటు మానిసియగు మహా బలవంతుడైన ద్రప్సుని ముష్టి యుధ్ధంలో ఓడించిన వాడే , సర్వోత్కృష్ట వీరసుందరి యైన మాలినిని చేపట్ట గలడట !

ఆ పని అసాధ్యమని అనెక మంది నిరుత్సాహ పడ్డారు. ద్రప్సుని ఎదిరించి నిలువగల మహావీరులు ఆర్యావర్తంలో చాల తక్కువ !  పృథా పుత్రుడు భయమానుడు (కుంతీ పుత్రుడు భీముడు) , పర్శు పుత్రుడు దుర్యోణుడు ( గాంధారీ పుత్రుడు దుర్యోధనుడు) , తుగ్ర పుత్రుడు స్మధిభుడు (ద్రోణ పుత్రుడు అశ్వథ్థామ) స్వశ్వ పుత్రుడు వృషాకపి ( కర్ణుడు), వికుంఠా సుతుడు వైకుంఠుడు ( దేవకీ పుత్రుడు శ్రీకృష్ణుడు) – వీరే ద్రప్సుని ఎదిరించి పోరగల యోధులు ! వీరిలో స్మధిభుడు బ్రహ్మచర్య వ్రతం పూనిన తపస్వి, కాబట్టి స్వయంవరానికి వెళ్లడు. వైకంఠుడు ద్రప్సుని జన్మ విరోధి. భయమానుడు వైకుంఠుని ఆప్త వర్గం లోని వాడు, వీరిద్దరును స్వయంవరానికి వెళ్లరు ! ఇక మిగిలిన వారు దుర్యోణ వృషాకపులు.
ఈ ప్రకటన సమయంలో ‘వార్షాగిరులు’( పాండవులు) ఏకచక్ర పురంలో ఉన్నారు. వారక్కద అఙ్ఞాతంగా ఉన్నారు. వారు కూడ ఈ ప్రకటనని విన్నారు. భయమానుడు యుధ్ధ ప్రియుడు ! తాను స్వయంవరానికి వెళ్లాలని ఉబలాట పడ్డాడు.

“ భయమానా !  ద్రప్సునితో బాంధవ్యం మనకు పనికి రాదు. వానితో బాంధవ్యం పాటిస్తే మనం ఒక విధంగా దుర్యోణునికి లొంగి పోయిన వారము అవుతాం ! అదిన్నీ కాక మనకన్ని విధాల అందదందగా ఉన్న వైకుంఠునికి  మనస్తాపం కలిగించిన వారమి అవుతాం ! కాబట్టి ఈ స్వయంవరానికి నీవు వెళ్లడం ఉచితం కాదు. ” అని చెప్పాడు అంబరీషుడు. (ధర్మరాజు ).

“కక్షీవతుని (ద్రుపదుని) కుమార్తె  ‘ ఘోషాకుమారి’ (ద్రౌపది) స్వయంవర ప్రకటన కూడ వింటున్నాం ! మనం అక్కడికి వెళ్లడమే మంచిది ” అన్నాడు ఋజ్రాశ్వుడు ( అర్జునుడు ).

అంతటితో ఆ ప్రసంగం నిలిచి పోయింది.

నిగమంలో వార్షాగిరులని, పాండవుల ప్రసిధ్ధ నామం ! ఈ వార్షాగిరులు శ్విత్ర పుత్రులని నిగమం చెప్తోంది ! ఈ శ్విత్ర శబ్దాన్నే జయేతిహాసకారుడు తీసుకొన్నాడు. ఈ శబ్దాన్ని తత్ సదృశమైన పాండు శబ్దంతో భారతేతిహాస కారుడు పాండవులన్నాడు. ప్రకృతమనుసరిద్దాం !

******************

 తండ్రిని సంధించిన మరునాడే మాలినీ కుమారి తన చెలికత్తె చంచలతో కలసి, నాగవనానికి బయలు దేరింది. నాగవనంలో కర్ణూడు రెండు మాసాలుగా ఉంటున్నాడు.

 అతని సౌకర్యాలకు లోపం లేకుండా, చెలికత్తె చంచల అన్ని ఏర్పాట్లు చేసింది. భైరవాలయంలో సంధించిన తరువాత మాలిని నాగవనంలో కర్ణుని సంధించ లేదు. మాలిని కర్ణుని
ప్రథమ పరిచయంలోనే ప్రేమించింది. కాని, తన ప్రేమకు బాహాటంగా వెల్లడించుకోవడానికి , ఆ అభిమానవతి ఇష్టపడ లేదు. ప్రేమాంధతలో తన గౌరవాన్ని పోగొట్టుకోవడం ఆమె తన వీర ప్రతిఙ్ఞకు భంగకరమని తలంచింది.

మాలిని తన సఖితో కలసి నాగవనంలో అడుగు పెట్టింది. అప్పుడామె కంటి ముందర కర్ణుని సుందర విగ్రహం పొడగట్టింది. ‘ఆహా ! సౌందర్యం, వీరత్వం, తపోనుభవం, నిర్మలత—ఇవన్నీ మూర్తీభవించి కర్ణుని రూపంగా రూపొందింది ’ అని తలచిందా సుందర వీర యువతి. ఆమె శరీరం ఆనందంతో వణికింది. పాదాలు తడబడ్డాయి.శరీరంపై స్వేద కణాలు అలముకొన్నాయి.

ఇద్దరూ ఆశ్రమం లోనికి వెళ్లి చూసారు. అక్కడ కర్ణుడు కనబడ లేదు.

“ భర్తృదారికా ! అతను కనబడ లేదు” అని చెప్పింది చంచల.

“ అదృశ్యకరణి విద్యచే మనల్ని మోసపుచ్చుతున్నారేమో !” అని సందేహాన్ని వెల్లడించింది మాలిని.

చంచల తోటంతా కలయ చూసింది. కాని కర్ణుని జాడ లేదు ! “ మహాభాగ, మహాభాగ ! రాజకుమారి తమ దర్శనార్థం వచ్చింది” అని బిగ్గరగా కేక వేసింది చంచల, కాని ఎట్టి ప్రత్యుత్తరం రాలేదు.

చంచల కర్ణుడు కూర్చొన్న ఆసనం దగ్గరకి వెళ్లి చూసింది. అక్కడ కృష్ణాజినం క్రింద పైకి కన్పిస్తూ ఒక భూర్జ పత్రం కన్పించింది. చంచల భూర్జ పత్రాన్ని తీసి మాలిని చేతికి ఇచ్చింది.

 మాలిని ఆత్రంతో పత్రాన్ని ఈ క్రింది విధంగా చదివింది.

“ మహారాజ ద్రప్స భట్టారకుల కుమార్తె మాలినీ కుమారికి స్వశ్వ పుత్రుడు కర్ణుడు వ్రాసుకొన్న లేఖ.

మీ హృదయంలో భావం నాకు స్పష్టపడింది.అట్టి భావం మీకు నాపై కలగడం నా అదృష్టమనే చెప్పాలి.

కర్తవ్య నిర్వహణలో ముందర, ప్రేమ రెండవ పక్షమనే నా తలంపు ! అదిన్నీ కాక చిన్ననాటి నుంచి నేను ఒక యువతిని ప్రేమించాను. కాబట్టి మీ అమూల్యమైన ప్రేమ అపాత్ర మందు నిక్షిప్తమయిందని నా భయం ! నా ప్రేయసిని మీ జనకుడు బంధించి ఉన్నాడు. నా తండ్రిని కూడ బంధించాడు. ఈ కారణం చేత నేను మీ శతృకోటి లోని వానినై ఉన్నాను. ఈ కారణాలని బట్టి, మీ పథం లోంచి తప్పుకొంటున్నాను.

ఇన్నాళ్లు మీరిచ్చిన ఆతిథ్యానికి నా కృతఙ్ఞతను వెల్లడించుకొంటున్నాను. ఇక—నేను మీ జనకుని ఉదార ప్రకటనని విన్నాను.అది నాలోని వీర మర్యాదను తట్టి లేపింది ! వీర రేఖాలంకృతమైన మీ సుందర శరీరం వీర పణం కావడం లోంచి నా ఆనందం పెల్లుబుకింది. కాని ఆ సవాలుని స్వీకరించుటా, లేక మానుకొనుటా అనే గట్టి చిక్కు సమస్యలో  పడిపోయాను.

ఒక వేళ స్వీకరించినా నా ప్రయోజనం సిధ్ధించదు ! నా ప్రేయసీ జనకుల బంధనను తొలగించే షరతును మీ జనకునికి ఈ సందర్భంలో సూచించ జాలను. కారణం ఏమంటే నేను నా భుజబలాన్ని చూపించి, నా ప్రేయసిని ,జనకుని విడుదల చేసుకోవాలే గాని, నా ప్రతిస్పర్థిని యాచన చేసి కాదు !

ఈ సవాలు మాటను అటుంచి కొద్ది కద్ది రోజులలో నేను మీ జనకునిపై యుధ్ధ ప్రకటనను చేయదలంచి ఉన్నాను. ఇది వరలో మీ జనకులు బంధించి ఉన్న యువతీ యువకుల నందరినీ సగౌరవంగా విడిచి పెట్టాలి. అట్లు కానప్పుడు నేను సమస్తమైన మగధ రాజ్యాన్ని ఎదిరించి పోరాడగలను. ఈ నా ప్రతిఙ్ఞలో అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు ! నా ప్రతాపాన్ని  శీఘ్రకాలం లోనే మగధ సామ్రాట్టు చవి చూడగలడు !

ఈ ఉత్తరాన్ని మీరు మీ జనకునికి చూపించ వచ్చును.

ఇట్లు మీ శ్రేయోభిలాషి – కర్ణుడు.

మాలిని ఉత్తరాన్ని చదివి ముగించింది. మహోదార భావాన్ని వ్యక్త పరుస్తున్న ఆ మహావీరుని ఉత్తరం ఆమెలో ఉత్పన్నమైన ప్రేమను మరింత ధృఢమూలం కావించింది. ‘ ప్రాణాన్నైనా త్యజిస్తాను గాని, అతని ప్రేమను విడనాడ జాలను’ అని లోలోపలే అనుకొంది.

చెమ్మగిల్లిన తన కండ్లను చీర చెరగుతో ఒత్తుకొని, “ సఖీ ! చంచలా ! ఈ ద్రప్సకారణ్యంలోనే అతడు ఉంటాడు ! నీవు నీ చార చక్షువులని వినియోగించి అతని వాస స్థలాన్ని కనిపెట్టు. ఏ మాత్రం అశ్రధ్ద చేయరాదు సుమా ! అతనితో నేను మాట్లాడాలి” అని చెప్పింది మాలినీ కుమారి.

“ ఇదెంత పని ? ఒకటి రెండు రోజులలో భర్తృదారికకు అతని ఉనికిని కనిపెట్టి చెప్పగలను” అంది చంచల.

“ చంచలా ! ఇతడు మగధ సామ్రాట్టుపై యుధ్ధాన్ని ప్రకటిస్తానని వ్రాసి ఉన్నాడు. మూడు అక్షౌహిణుల సైన్యానికి అధినాయకుడైన మహారాజుపై యుధ్ద ప్రకటన హాస్యాస్పదం కాదా ? అతనికి నచ్చజెప్పి అతణ్ని మహా సాహసం నుండి తప్పించాలి !” అని చెప్పింది మాలిని.

అటు తన ప్రాణం కంటె అధికంగా ప్రేమించిన  ప్రియుడు, ఇటు తనకు జన్మనిచ్చిన పితృదేవుడు – వీరిద్దరి మధ్య ఏర్పడిన ‘మృత్యగహ్వరం’వంటి భయంకర అగాధం ! ఈ భయంకర అగాధానికి వంతెన వేసి, వారి మధ్య సామరస్యాన్ని ఏ విధంగా సమకూర్చాలి ? ఈ క్లిష్టమైన సమస్యతతో ఆ వీరబాల హృదయం తల్లడిల్లి పోయింది !

****************

అర్థరాత్రి. నభోవితానం నిర్మలంగా ఉంది. నక్షత్ర గణంతో పూర్ణ చంద్రుడు నిండు కొలువు తీర్చి ఉన్నాడు. మందమారుతం ప్రకృతి మాతకు చామర గ్రాహి వలె మనోహరంగా వీస్తోంది. అశోక వనం వెన్నెట్లో నవ్వుతున్నట్లు ప్రకాశిస్తోంది. క్రూర మృగాల అలజడి ఏమాత్రం లేదు. మహారాజ ద్రప్సుడు అశోక వనాన్ని మాలినీ నగరానికి క్రోసుడు దూరంలో నిర్మించాడు. అది దేవోద్యానం వలె మనోహరంగా ఉంది. ఆ వనంలో అనుదిన  తపో వృత్తిలో నిమగ్నురాలై ఉంది కులయోగిని ‘జరామాత’.

జరామాత ద్రప్సుని ఇలవేల్పు వంటిది. ఆమెయే ద్రప్సుని మంత్ర గురువు. ఆమె ఇష్టానికి విరుధ్ధంగా నడువడు మహారాజు. ఆ వనం లోనికి ఎవరికీ ప్రవేశం లేదు. మహారాజ ద్రప్సుడు కూడ అనుమతి లేనిదే లోనికి వెళ్లడు ! వనం చుట్టును ఆరడుగుల బలమైన గోడ నిర్మింప బడింది. ముఖ ద్వారం వద్ద బలమైన కాపలా ఉంది. రెండు గుర్రాలు అశోకవన ముఖద్వారం వద్ద వచ్చి నిలబడ్డాయి. గుర్రాలపై నుండి ఇద్దరు వ్యక్తులు క్రిందకు దిగారు.

“ ఎవరు మీరు ?” అని కాపలాదారు సహస్రపతి పవితేజుడు ప్రశ్నించాడు. పొడుగుపాటి  వ్యక్తి తన మేలి ముసుగును తొలగించింది.

వెంటనే సహస్రపతి అభివాదన చేసి ఇలాగన్నాడు. “భర్తృదారుక ఇంత రాత్రి వేళ ---”

“ సహస్రపతీ ! భగవతిని దర్శింప వలసిన ఆవశ్యకత ఏర్పడింది. నా రాక భగవతికి నివేదించగోరుతున్నాను.” అని మాట మధ్యలో చెప్పింది మాలిని.

“ యువరాణి ఇక్కడ కొంత సేపు విశ్రమించాలి. నేను లోపలికి వెల్లి భగవతి ఆదేశాన్ని తీస్కొని వస్తాను.”’

క్షణాలు గడియ వలె బరువుగా దొర్లిపోయాయి. సుమారు అరఘడియ తరువాత పవితేజుడు అక్కడకు వచ్చాడు. “ భర్తృదారిక లోపలికి వెళ్లవచ్చును.మీతో వచ్చినవారు  ఇచ్చటనే ఉండిపోవలసి వస్తుంది.”

చంచల అక్కడే ఉండి పోయింది. మాలినీ కుమారి అశోక వనంలో ప్రవేశించింది.

****************

“బిడ్డా ! ఇలా రా, నా దగ్గరగా కూర్చో ! నన్ను చూడవలసిన అవసరం ఏల కలిగింది ?” అని ఆప్యాయంగా ప్రశ్నించింది. జరామాత.

“ జననీ ! నేను చాల ఆపదలో పడిపోయాను. నన్ను మీరే రక్షించాలి.”

జరామాత మాలినీ కుమారిని కౌగలించుకొని కురులను నిమిరి చెక్కిలి ముద్దాడి ఇలాగంది. “ అమ్మడూ ! అమేయ ప్రతాపుడు ద్రప్సుని కుమార్తెకేనా ఆపద సంభవించింది ? నిజమే ! ప్రేమ గుండం లోంచి బయటికి రావడం చాల కష్టం. నా వల్ల నీకేం సహాయం చేయాలో చెప్పమ్మా !”

మాలిని సిగ్గుతో తల వంచుకొంది.జరామాత మందహాసం చేసి ఇలాగంది.“ బిడ్డా ! నేనంతా గ్రహించాను. దైవ నిర్ణయం నీకు అనుకూలంగా ఉంది !  నీ వేమీ భయపడ వలసిన పని లేదు.”

“ పరిస్థితి విపరీతంగా ఉంది తల్లీ ! కాబట్టి భయంగానే ఉంది.”

“ నీవు ప్రేమించిన యువకుడు సాధారణ వీరుడు కాదు. వానితో సంధి చేసుకోవడమే నీ తండ్రికి మంచిది. సాక్షాత్ భైరవుడు కూడ దాన్ని ఆపలేడు.”

మాలిని బాధగా నిట్టూర్పు వదిలింది.

“ అమ్మా ! రెండు విధాలుగాను నేను నిర్భాగ్యురాలిని.”

“ భయపడకమ్మా ! నేనీ రాత్రి నీ తండ్రిని ఆహ్వానించి మాట్లాడుతాను. నీవు నిశ్చింతగా వెళ్లి నిద్రపో !”

“ అమ్మా ,నేను నా ---” అని మాలిని పైన చెప్పలేక పోయింది.

“ నీవు ఇప్పుడే వెళ్లి నీ ప్రియుణ్ని చూడవచ్చును. అతణి స్వయంగా మహారాజుని సందర్శించమను ! అతడు విధించే షరతులు నాకు తెలుసు. నేను తండ్రిని వాటికి అంగీకరింప చేస్తాను.”

మాలినీ కుమారి జరామాతకి నమస్కరించి లేచి నిల్చొంది.

“ మాలినీ ! పవితేజుని నన్ను చూడవలసినదిగా చెప్పి వెళ్లు.”

మాలిని వెళ్లిపోయింది.

******************

మాలినీ కుమారి, చంచల – ఇద్దరూ గుర్రాలపై తిన్నగా ద్రప్సకారణ్యం వంక దౌడు తీసారు.

“ భర్తృదారికా ! అదిగో ఆ దీపం కనిపిస్తోందే, అదే అతని ఆశ్రమం !’

“ఇతనికి ఆశ్రమం ఎవరు కట్టి ఇచ్చారే ?”

“ అతడే స్వయంగా కట్టుకొన్నాడు.”

“ సరే ! మనం గుర్రాలను ఇక్కడే వదిలి పెట్టి  కాలినడకతో వెళ్లుదాం.” గుర్రాల్ని చెట్ల గుంపు దగ్గర కట్టి, పాదచారులై వారిద్దరూ ఆశ్రమాన్ని సమీపించారు. ఆశ్రమానికి తలుపులు లేవు ! లోపల చిన్న దీపం వెలుగుతూంది. కర్ణుడు తెలిసే ఉన్నాడు. మాలినీ కుమారి చంచల లోపల ప్రవేశించారు.

“ ఎవరు, మిత్రులా, లేక శత్రువులా ? ఇరు తెగల వారికి వృషాకపి స్వాగతం ఇవ్వగలడు” అన్నాడు కర్ణుడు.

మాలినీ కుమారి తన మేలి ముసుగును తొలగించింది. చంద్ర శదృశమైన  ఆమె ముఖాన్ని చూసి కర్ణుడు మందహాసం చేసాడు.

“భర్తృదారికా ! ఈ పేదవాని ఆశ్రమానికి ఇంత రాత్రివేళ వచ్చుటకు కారణమేమి ? నేనే విధంగా భర్తృదారికకు సహాయ పడగలను !”

“మహాత్మా ! మీరు రాసి పెట్టిన జాబుని చూసి , మా భర్తృదారిక మిక్కిలి ఆందోళన చెందారు. మీతో కలిసి మాట్లాడడానికి వచ్చారు.” అంది చంచల.

అందరూ నేలపై కూర్చొన్నారు. కర్ణుడే మొదట మాట్లాడాడు. “ భర్తృదారికను తగు విధానంలో సత్కరించలేక పోయాను. ఆశ్రమమైతే కట్టుకో గలిగాను కాని ఇంకా నేలని చదును చేసుకోలేదు. సుఖాస్తరణాల లోపం బహుళంగా ఉంది.”

“ దానికేం ఫరవాలేదు.”

“ భర్తృదారిక ఇక నిర్భయంగా ముచ్చటించవచ్చును.”

“ మీరు మగధ సమ్రాట్టుపై యుధ్దాన్ని ప్రకటిస్తానని వ్రాసారు ! ఆ విషయంగా తొందరపడ వద్దని మా భర్తృదారిక కోరుతున్నారు. ”

చంచల వచ్చిన పనిని చూచాయగా స్పష్ట పరచింది.కర్ణుడు కొంతసేపు మౌనం వహించాడు.

మాలిని అవనత వదనయై కడగంటి చూపులతో చూచింది. ఆ చూపులోని మాధుర్యం ఎంతటి  ధీరోదాత్తుణ్నైనా కలచేదిగా ఉంది. ఆమె పరిపుష్ట భోగ క్షమాంగకాలు ఎంతటి ధర్మవీరుని హృదయాన్ని అయినా సంక్షోభ పెట్టగలవిగా ఉన్నాయి !

మాలిని అభిసారిక ! కర్ణుని వలచి తానే స్వయంగా ప్రేమ భిక్షను యాచించడానికి వచ్చింది. తన ప్రియునికి లేశమైనా కష్టాన్ని చూచి ఓర్వలేక స్వయంగా హెచ్చరించడానికి వచ్చింది.

 కర్ణుడు మాలిని వైపు దయనీయ దృష్టితో చూసాడు. వాని మనస్సు ఇట్లు స్పందించింది !

‘ భజతి యంస్వయంవరవధూరియం
అపి గతో భువం జయతివా దివం !’

కర్ణుడు తనను చాల అదృష్టవంతునిగా తలంచాడు. నిరుపమాన లావణ్యవతి, నిర్మల తేజః పూరిత, సద్గుణోపేత, వీరవనిత మాలిని తనను కోరి స్వయంగా వచ్చి ఉంది !

యాచక కల్పతరుడైన కర్ణుడు ఆ ప్రేమ భిక్షుకిని తిరస్కరించ గలడా ?”

“ చంచలా ! నా స్థితి విషమంగా చాల మారిపోయింది.భర్తృదారిక నాపై అవ్యాజానురాగం చూపుతున్నందుకు నేను ఆమెకు కృతఙ్ఞుణ్ని ! ప్రజలను బిడ్డల వలె పాలించ వలసిన రాజు ఒక కుటుంబం శాంత జీవనంలో చిచ్చుపెట్టడం సహించరాని అపరాధం ! మగధ సమ్రాట్ చేసిన పని ఏ మాత్రం క్షంతవ్యం కానిది. ఆర్యావర్త ప్రజానీకం పైన అతడు చూపెట్టిన పారపక్షం ఊహించ శక్యం కాదు. ప్రాగ్జ్యోతిషాధిపతి నేత  వట్టి పిరికి పంద కాబట్టి , మహారాజ ద్రప్సుడు తన ప్రజల పట్ల కావించిన అత్యాచారానికి గడ్డి తిని మౌనం వహించాడు..నేను ఆ దేశం సామాన్య పౌరుణ్నే అయినా సహింప లేక పోయాను. నేను రేపటి ఉదయమే నా ‘ఘోషణ శంఖాన్ని’ పూరించి యధ్ద ప్రకటన చేయ సంకల్పించాను  భైరవ దుర్గాన్ని భైరవాలయాన్ని నేల మట్టం చేసే వరకు నా శస్త్రం విశ్రమించ నేరదు ! ఆర్య విరుధ్ధమైనదియు, అతి నీచ మైనదియు అగు నరబలి విధానానికి స్వస్తి చెప్పేంచే వరకు వృషాకపి శస్త్రాన్ని క్రిందకు దించడు. మొదటేమో నా ప్రేయసిని, తండ్రిని చెర విడిపించుకొని పోదామనే తలంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మహారాజుచే అనేకమంది యువతీ యువకులు బంధితులైనారని విన్నది మొదలు నా ఉద్దేశంలో మార్పు జరిగింది. ఈ విషయంలో ప్రేమ మొదలైన భావాలకి నేను స్వస్తి చెప్పవలసి ఉంది. నీ భర్తృదారిక వంటి ,ఉత్తమ వీరనారి ప్రేమకు పాత్రమగుటలో నాకెంతో గర్వం కలిగింది ! ఇప్పుడామెను అదే నిర్మల ప్రేమ భావంతో అర్థిస్తున్నాను. లోక కళ్యాణానికై , ఆమె తన ప్రేమకు అనుకూల పరిస్థితులు సమకూరేవరకు విశ్రాంతి ఇవ్వాలని నా ప్రార్థన ! వీరనారియైన మాలినీ కుమారి నా ప్రార్థనను సహృదయంతో పరిశీలించ గలదని నా విశ్వాసం.”

మాలిని వంచిన తల ఎత్తలేదు. ఆర్ద్రములైన తన నయనాలను ఆమె తన ప్రియునికి చూపడానికి సిగ్గు పడింది. చంచలే తిరుగు మాట్లాడింది.

“ మహాత్మా ! మీ ప్రస్తుత  పరిస్థితి మా భర్తృదారికకు అర్థమయింది. దాన్ని ఉద్దేశించే మా చెలి ఇప్పుడు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు. ఈ చిక్కును మీకు అనుకూలంగా విడదీయడమే  మా భర్తృదారిక ఉద్దేశం ! దానికి తగిన విధానాన్ని సూచించడానికే ఆమె వచ్చారు. తాము దయగల చిత్తంతో చిత్తగించాలని కోరుతున్నారు.”

కర్ణుడు మందహాసం చెసి ఇలాగన్నాడు. “ చంచలా ! కర్ణుని స్వభావం తెలియక పోవడం వల్ల మీరు వచ్చారు, చెబుతాను వినండి. భర్తృదారిక స్వయంవర ప్రకటనను విన్నాను. మాహారాజుతో ముష్టి యుద్ధం చేయగలవారు ఆర్యావర్తంలో ఒకరిద్దరే ఉన్నారు ! భయమాన దుర్యోణులు ఈ స్వయంవరానికి రాజాలరు ! నేను పోరగలను, కాని నేను స్వయంవర ఆహ్వానాన్ని మన్నించ లేక పోతున్నాను. ముష్టి యుధ్ధ పర్యవసానంగా నాకు మీ చెలి అమూల్యమైన పాణిన్నీ , అంగరాజ్యమున్నూ సిధ్దిస్తాయి ! నా ధ్యేయం అది కాదు. మీ చెలి కోరిక అదే అయితే నేను అంగీకరంచలేనందుకు చింతిస్తున్నాను. మీ చెలి పుష్ప సుకుమార హస్తం అమృతం కన్న కమనీయమయిందే ! కాని కర్ణుడు ధర్మాన్ని పరిత్యజించి తన స్వార్థాన్ని చూచుకోలేడు.”

మాలిని తన ఆర్ద్ర నయనాలను ఎత్తి కర్ణుని చూచింది. ఆ చూపులోని దైన్యం కర్ణుని హృదయంలో లోతుగా చొరబడింది. ఆమె మొదటిసారిగా ఇలాగంది !

“ ఆర్యా !--- ” ఆమె గొంతుక తడబడి స్తంభించిపోయింది.

“ మాలినీ ! కర్ణుని ముందర నిర్భయంగా మాట్లాడవచ్చును. జంకువద్దు. నా హృదాయాపహర్త్రీ --- నీవు --- నన్ను శాసింప వచ్చును. అలాగని నీ ప్రియుణ్ని అధర్మ మార్గంలో త్రిప్పడానికి పూనుకోవద్దు.”

“ ఆర్యా ! ధన్యురాలిని. నన్ను మీరు ప్రేమించినట్లు చెప్పుతే చాలు, నాకు అదే తృప్తి ! ఇప్పుడు నేను మరణాన్ని కూడ తృప్తిగా ఎదుర్కోగలను ! ---”

మాలిని కంట కన్నీరు ధార కట్టింది. కర్ణుడు చలించిపోయాడు.

“ భద్రే ! నీవు ఇష్టపడితే చెప్పు, నిన్ను రాక్షస విధానంగా తీసుకొని వెళ్లి వివాహమాడ గలను. పదివేల రప్సులు వచ్చినా నిన్ను నానుండి వేరు చేయజాలరు.”
వెల్లడించండి. అతడు అనుకూలుడైతే మంచిది. లేనప్పుడు మీరు యుధ్ధాన్ని ప్రకటించండి. ఆ యుద్ధంలో మీ ప్రేయసి ఈ మాలిని తన కృపాణంతో మీకు సహాయపడుతుంది.”
సంతోష తాండవిత దృక్కులతో మాలినిని అర్చిస్తూ కర్ణుడన్నాడు. “ ప్రేయసీ !  నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. నీవు నీ జనకునితో  రేపు సాయంకాలం కర్ణుడు, భైరవాలయంలో సంధించి మాట్లాడడానికి ఒప్పుకొన్నాడని చెప్పు.”

మాలిని  అంగీకార సూచకంగా తల ఆడించి లేచి నిల్చొంది. కర్ణుడు కూడ లేచి నిల్చొన్నాడు. వారిని అనుసరించింది చంచల.

మాలిని దరహాసిత వదనంతో తన కిసలయ పాణిని కర్ణికి అందించింది. కర్ణుడు అందుకొని మెల్లగా ముద్దు పెట్టుకొన్నాడు. ఆవీర పేమిక మిథునాన్ని చూచి ఆనంద భాష్పాలు రాల్చింది చంచల.

****************
( సశేషం )

******************

Comments

  1. అధ్భుతం గా ఉంది ఈ కథనం. ధన్యవాదాలు. ఈ కథ నిజముగా భారతం లో ఉన్నదా?

    ReplyDelete
  2. గౌరవనీయులు కిరణ్ గారికి,
    క్షీరగంగకి స్వాగతం ! ద్రప్స నణ్దిని కథ మీకు నచ్చినందుకు సంతోషం ! ఈ కథ మహాభారతంలో లేదు. భారతంలో కర్ణుని పాత్ర చాల నిమ్న స్థాయిలో చిత్రీకరించ బడింది. కారణాలు ఆ యా మహాభారత కథకులకే తెలియాలి. ఈ కథ ఋగ్వేదంలోనిది. వేదంలో భారత కథ గుప్తనామాలతో గౌణంగా ఉంది. వేదకాలంలో భారత కథా పాత్రలు మంత్ర ద్రష్టలు ! అయితే వారి పేర్లు వేరే విధంగా చెప్పబడ్డాయి.
    ఉదాహరణకి భారతంలో ధర్మరాజు పాత్రని వేదంలో అంబరీషుడని పిలిచేవారు. భీముణ్ని -- భయమానుడనీ, అర్జుణున్ని ఋజ్రాశ్వుడనీ పిలిచేవారు. నకుల ,సహదేవులని , అశ్వినీ దేవతా కుమారులుగానే వ్యవహరించేవారు. ద్రౌపది పేరు ‘ ఘోషా కుమారి’ . మన కథానాయకునడు , కర్ణుని పేరు వృషాకపి . ఆ పేర్లు కథలో వ్రాయడం జరిగింది. ఈ మహాభారత కథా రహస్యాలని , కీ.శే . శ్రీ వాసిష్ఠ కావ్యకంఠ గణపతి ముని గారు , తమ అసంపూర్ణ గ్రంథంలో ( భారత చరిత్ర పరీక్ష ) లో , ప్రామాణిక మైన రీతిలో అంటే మూలమైన ఋగ్వేద ఋక్కులతో సహా వెల్లడించారు. ఆ గ్రంధం పూర్తి అయి ఉంటే , మహాభారతం యొక్క అసలు కథ బయటపడి ఉండేది. ప్రస్తుత కథని ,శ్రీ గణపతి ముని కుమారులు అయిన కీ.శే . వాశిష్ఠ ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు ) వ్రాసారు. అది ఆంధ్ర ప్రభ లో పడింది. ఆ వివరాలు మొదటి బాగంలో ఇచ్చాను . ఈ కథని యథా తథంగా చదివి ఆనందించండి. మహాభారత కథతో పోల్చి చూడవద్దని మనవి !---ఎ.శ్రీధర్.

    ReplyDelete
  3. గౌరవనీయులు శ్రీధర్ గారికి,

    క్షణ క్షణానికీ క్రొత్త క్రొత్తగా మైమరిపింపజేస్తున్న ఈ కథనం లోని మాధుర్యం పాఠకులని వేరు కథలతో పోల్చనివ్వగలదా!
    కర్ణుడి యొక్క ఉన్నత వ్యక్తిత్వం పుస్తకాల ద్వారా, టీవీ ధారావాహికా కథనాల ద్వారా తెలుసుకొని ఉంటిమి. మీరేమో నిమ్న స్థాయిలో చూపబడింది అన్నారు. మీ ఉద్దేశ్యం ఆతని గురించిన కథనం ఎక్కువగా (పూర్తిగా) ప్రస్థావించకపోవటమా?, లేక మరేదైనా ఉందా ?

    నమస్కారాలు.

    ReplyDelete
  4. మిగతా భాగం కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాము.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద