మహారాజ ద్రప్సుడు , జరామాత ఆదేశాన్ని శిరసావహించి మహావీర కర్ణుని, భైరవాలయంలో సంధించడానికి సమ్మతించాడు. ఆ రోజు మంగళవారం, భైరవ దుర్గం దీపమాలికలతో అలంకరింపబడి కలకల లాడుతోంది ! నిండు చంద్రుడు తారాగణంతో ఆకాశ వీధిలో ప్రకాశిస్తున్నాడు. భైరవ దుర్గ ముఖద్వారం పైనున్న శాలలో మంగళ తూర్యారావం వీనుల విందు చేస్తోంది. కోట చుట్టూ ఆశ్విక దళం అప్రమత్తతతో కాపలా కాస్తోంది. భైరవాలయ గోపురం దీపమాలికలతో దేదీప్యమానంగా ఉంది ! రెండు మదపుటేనుగులు కోట సింహ ద్వారానికి రెండు వైపులా నిలబడి ఉన్నాయి. భేరీ కాహళ ధ్వనులు మిన్నుముట్టాయి, కారణం ? మహారాజాధిరాజ రాజ పరమేశ్వర ద్రప్స భట్టారకుల వారు సింధూరారుణ కాంతి గల అశ్వరాజంపై, కోటకు వేంచేస్తున్నాడు ! మహారాజును పరివేష్టించి రెండు వందల మంది రౌతులు వస్తున్నారు. కోట సింహద్వారం తలుపులు బాహాటంగా తెరువబడ్డాయి. మహారాజ ద్రప్సుడు లోనికి ప్రవేశించాడు.అంగరక్షక దళం కూడ లోపలికి ప్రవేశించింది.
కొంత సేపటికి ఒక నల్లని గుర్రం బాణంవలె దూసుకొని వస్తూంది. తిరుగ భేరీ కాహళ ధ్వనులు చెలరేగాయి ! అతిరథ శ్రేష్ఠుడైన వృషాకపి కోటలోనికి చొచ్చుకొని వెళ్లాడు. భైరవ దుర్గ సింహద్వారపు తలుపులు మూయబడ్డాయి !
“ మహావీర మీకు మా ఘన స్వాగతం ! ” అని మహారాజ ద్రప్సుడు తన గుర్రాన్ని , కర్ణుని సమీపానికి నడిపించి చెప్పాడు..
“ మహారాజా! శత్రు మిత్ర భేదం పాటించక పదవిని గణన చేయక వీరపురుషులను సత్కరించే మీ ఔదార్యానికి మా స్వాగతం !” అని పలికాడు కర్ణుడు.
“భైరవ దుర్గంలో త్రిపుర భైరవీ మంటపంలో మనం మాట్లాడువచ్చును.”
“ మగధ రాజ్య రమా రమణా ! తథాస్తు !”
ఇద్దరూ గుర్రాలూ దిగి పాదచారులై భైరవీ మంటపంలో ప్రవేశించారు. వారిని అనుసరించి ఎవరూ వెళ్లలేదు. త్రిపుర భైరవి విగ్రహానికి దగ్గరగా ఎదురెదురుగా రెండు ‘ దంతపు గద్దెలు, పట్టు పరుపులతో సుఖోపవేశార్హాలై, అమర్చబడి ఉన్నాయి. మహారాజు త్రిపుర భైరవికి నమస్కరించాడు. విగ్రహ పాదపీఠం పైన తన కృపాణాన్ని, ధనుర్భాణాలనూ ఉంచాడు. కర్ణుడు కూడ దేవికి నమస్కరించి తన ఖడ్గాన్ని, ధనుర్భాణాలని ఉంచాడు. ఉభయులు ఆసనాలపై ఆసీనులయ్యారు.
“ మహాభాగ ! మన ఇద్దరి సంప్రదింపులలో వ్యక్తిగత విరోధం గాని, కౌటిల్య భావం గాని, ఉండరాదని నా కోరిక” అని ప్రసంగ ద్వారాన్ని తెరచాడు మహారాజు.
“ మహారాజ ! మహాప్రసాదం ! నేను నిర్మల చిత్తంతో సావధానంగా ఉన్నాను.”
“ నా కుమార్తె మాలినీ కుమారి నాతో చెప్పింది. మీరు కొన్ని షరతులని సూచిస్తారనిన్నీ, వాటికి నేను సమ్మతించ నప్పుడు నాపై యుధ్ధాన్ని ప్రకటించ బోతున్నారనీ, చెప్పింది, నిజమేనా ?”
“నిజమే ! నా కాని ఆ షరతులలో మీ కుమార్తె వరణ స్వాతంత్ర్యాన్ని భంగ పరచే సూచన మాత్రం లేదని మనవి చేసుకొంటున్నాను.”
మందహాసం చేసాడు మహారాజు
“ మహావీర ! నా కుమార్తె పాణి వీరపురుషుని సొత్తు ! అది వీర పణం. స్వయంవరం గౌణమే అవుతూంది.”
“ మహారాజ ! అలాంటప్పుడు ఆర్యావర్తం లోని వీర పురుషు లందరికీ మీరు అవకాశం కల్పించ వలసి ఉంది. ఆమె పాణి దుర్లభమై ఉండడం సమంజసంగా లేదు.”
“ ఆ విషయం ఆమే తన లేబ్రాయంలో ప్రతిఙ్ఞా పూర్వకంగా నిర్ణయించుకొన్న విషయం. దాంట్లో నా అనురోధం ఏ మాత్రం లేదు ! మాలినికి తన తండ్రిని మించిన వీరుడు లేడని నమ్మకం.”
“ నా సందేహాన్ని పోగొట్టినందుకు కృతఙ్ఞుణ్ని.”
“ మహావీర ! చిన్ననాడు నేను దుర్బలుణ్ని ! రసాయనాది క్రియా సాధనాలచే నన్ను పెంచి పెద్ద చేసి, వీరపురుషుణ్ణిగా రూపొందించింది ‘జరామాత’. నాకు మంత్రగురువై తాంత్రిక విద్యా ప్రవీణుణ్ని చేసి, నాకు ఆమె ఇలవేల్పు అయింది ! ఆమె వాక్యాన్ని ఉద్దేశించి మీతో సంప్రదించడానికి వచ్చాను. అంతేకాని, మీకు భయపడి గాని, నా కుమార్తె ముద్దు చెల్లించే నిమిత్తం గాని, నేను మీతో సంప్రదిస్తున్నానని అనుకోవద్దు“
“ చిత్తం ! నాకు ఆ విషయం తెలియనిది కాదు. సెలవియ్యండి.”
“ వృధ్ధుడైన మీ తండ్రిని, మీ స్నేహితుని మనుమరాలు రేవతినీ ఈ రోజే విడుదల చేస్తాను. మిమ్ములను మహా వీరుణ్నిగా గుర్తించి నా కుమార్తె మాలిని హస్తాన్ని మీకు సమర్పించుకొంటాను ! మీరు ఇప్పటి నుండి నాకు జామాత గాను, మిత్రుడు గాను ఉండాలని అర్థిస్తున్నాను. నాతో మీరు ముష్టియధ్ధం చేయ నవసరం లేదు. మీకు ఇష్టమైతే చెప్పండి. ఈ త్రిపుర భైరవీ సన్నిధానంలో మనం స్నేహ సూచకంగా కత్తులను మేళవించుకొందాం !”
“ మహారాజ ! మీ ఉదార ప్రకటనకు నా ధన్యవాదాలు. నాకు రాజ్యకాంక్ష గాని, స్త్రీవాంఛ గాని, లేదు ! మీ కుమార్తె మాలినీ కుమార్తెను, ఆమె ప్రతిఙ్ఞను నెరవేర్చక నేను వివాహమాడ జాలను ! నా ముఖ్యమైన షరతులు రెండు ఉన్నాయి. వాటిని మీరు పాటిస్తే చాలు, నేను స్నేహభావంతో కత్తి కలపగలను.”
“ ఏవి ఆ షరతులు ?”
“ నరబలి విధానానికి మీరు శాశ్వతంగా స్వస్తి చెప్పాలి ! ఇది వరలో మీచే బంధించబడిన వారినందరినీ ,మీరు విడుదల చేయాలి. ఇవే నా ముఖ్యమైన షరతులు ! ”
“ ఇవి నా గౌరవానికి భంగకరమైన షరతులు.”
“మహారాజా ! దేశ గౌరవానికే భంగకరమైన విధానాన్ని మీరు అవలంబించారు. మీ వ్యక్తిగతమైన గౌరవాన్ని దేశం ఒప్పుకోజాలదు ! మీరీ విషయాన్ని విశాల హృదయంతో ఆలోచించి చూచినట్లయితే మీరు స్వయంకృతమైన అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకొన్నట్లు గుర్తించగలరు !
“ నేను ఒప్పుకోనప్పుడు ?”
“ మీరు ఒప్పుకోనప్పుడు ఇప్పుడే ఈ దేవీ సన్నిధానంలోనే మీపై యుద్ధప్రకటన చేయక తప్పదు.”
“ మహావీర మీరు ఇప్పుడు సైన్యయుతమైన నా దుర్గంలో ఉన్నారు.”
“ తెలుసును, మీరు వీర మర్యాదను ఉల్లంఘించి నన్ను బంధించడానికి పూనుకోవచ్చును. అలా జరిగినప్పుడు వృషాకపి దానికి కూడా సంసిధ్ధుడై ఉంటాడు !”
మహారాజు కొంత సేపు ఆలోచింప సాగాడు. ఆలోచనకు అంతరాయం కలుగకుండా గంభీరమైన మౌనం పాటించాడు కర్ణుడు. మహారాజ గొప్ప చిక్కులో పడిపోయాడు ! జరామాత కర్ణునితో విరోధం పనికిరాదని ధృఢంగా చెప్పింది ! అలాగని తన గౌరవానికి భంగకరమైన షరతులని పాటించడానికి ఆ ఉధ్ధత వీరుని హృదయం ఒప్పుకోకుండా ఉంది.ఆఖరి సారిగా భిభీషికాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుని మనస్సుని చెదర గొట్టాలని తలంచి జరాసంధుడుగన్నాడు.
“మహావీర ! కుటిలమైన యుధ్ధనీతిని ద్రప్సుడు పాటిస్తాడని మీరు తలంచవద్దు ! దేవీ సన్నిధానంలో మన ఆయుధాలు ఉంచబడ్డాయి ! మీరు ఈ కోటలో ఉన్నంత కాలం మీకెట్టి అవరోధం సంభవించదు ! మీరు సూచించిన షరతులు నాకు మిక్కిలి అవమాన కరమైనవి ! మీరు యుధ్ధాన్ని ప్రకటిస్తామని అన్నారు ! మూడు అక్షౌహిణుల సైన్యంతో మీరు పోరాడవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాను ! ఇది దుస్సాహసమే అవుతుంది !! బాగా ఆలోచించండి. మన స్నేహాన్ని వాంఛించి నేను బంధితులను అందరినీ విడిచి పెడాతాను ! నా పూజా విధానాన్ని మీరు మన్నిస్తే చాలును ! ఇప్పుడే మనం కత్తులని కలుపుకొందాం ! ”
“ ఈ విషయంలో నా నిర్ణయం ఏమాత్రం సడలదని మనవి ! నేను ఒంటరిగానే మీతోను, మీ సైన్యంతోనూ ఎంత కఠినమైనా , ఎంత కాలమైనా యుధ్ధం చేయడానికే సంకల్పించాను.”
మహారాజ ద్రప్సుని అనునయ నీతి, బిభీషికా నీతి రెండున్నూ వ్యర్థమై పోయాయి. మహారాజు దీర్ఘంగా ఆలోచించి ఇలాగన్నాడు !
“ మహావీర ! ఇప్పటికి మన సమావేశం ముగిసింది. రేపు సాయంకాలం లోపుగా నా నిశ్చయాన్ని మీకు అందజేస్తాను !”
మహారాజు లేచి నిలబడ్డాడు.
“ సరే అలాగే చేయండి.” అని చెబుతూ కర్ణుడు లేచాడు.
ఇద్దరూ మౌనంగా తమ తమ ఆయుధాలను తీసుకొని దేవాలయాన్ని దాటి వెళ్లిపోయారు,
ఆ ఇద్దరు మహావీరుల సమావేశం ముగిసింది
*********************
భైరవ దేవాలయం లోని సమావేశానంతరం మహారాజ ద్రప్సుడు మర్నాడు ప్రాతః కాలం జరామాతను సందర్శించాడు,
మహారాజు చెప్పిన విషాయాన్నంతా విని, “ వత్సా ! ద్రప్సా ! దీర్ఘకాల తపస్సు వల్ల నాలో నూతన వికాసం ఉదయించింది ! తాంత్రిక విధానం వల్ల తత్కాలమైన కొన్ని ఐహిక కామ్య ములు సిధ్ధిస్తాయే కాని, శాశ్వతమైన అమృతత్వం సిధ్ధించదు ! దానికి ఆర్షజన సమ్మతమైన ఆధ్యాత్మిక సాధనమే ముఖ్యమై ఉంది ! కాబట్టి ఇదివరలో నీవు అవలంబిస్తున్న తాంత్రిక విధానానికి కొంత ఆర్ష సంప్రదాయ సిధ్ధమైన ఉపాసన జోడించుకొని, నరబలి విధానాన్ని ఆపు చేయాలని నేను ఆదేశిస్తున్నాను ! దానికి సరియైన సమయం ఇప్పుడు నీకు తటస్థించింది ! మల్ల యుధ్ధంలో ఓడించిన వానికి అంగరాజ్య యువరాణి మాలినీ కుమారిని మాలినీ కుమారిని ఇచ్చి వివాహం చేయడమే కాక, బంధితులని విడుదల చేసి, బలి విధానాన్ని ఆపు చేస్తానని ఒక ప్రకటన చెయ్యి ! అదే ఇప్పుడు చేయవలసిన పని.” అని ఉపదేశింది జరామాత.
మహారాజు ఏమిన్నీ చెప్పలేక పోయాడు. “ ఆఙ్ఞ ప్రకారం అలాగే చేస్తాను.” అని గొణిగి, అశోక వనం నుంచి వచ్చి వేసాడు.
*****************************
మహారాజ ద్రప్సుని ప్రకటన మగధ రాష్త్రమంతా ఘోషింపబడింది. మాలినీ పట్టణం అట్టుడికినట్లు ఉడికింది. మాలినీ పట్టణపు విశాలమైన మైదానంలో యుధ్ధరంగం తయారుచేయ బడింది.
రాణి వాసానికి ప్రత్యేకమైన విమానం నిర్మింప బడింది. ప్రజలందరూ కూర్చొని చూడడానికి అనుకూలంగా మైదానం చుట్టునూ, మెట్లు అమర్చబడ్డాయి ! శాంతి భద్రతలను కాపాడడానికి , అశ్వారూడులైన సైనికులు మైదానం చుట్టును నియమితులయ్యారు.
పట్టణ ప్రాడ్వివాకుడు ద్వంద్వ యుధ్ధ నిబంధనలను పెద్ద కంచు బూరలతో అందరికి వినబడేట్లు ప్రకటిస్తున్నాడు. అంగ రాజ్య యువరాణి మాలినీ కుమారి ఉజ్వల భూషణాలంకృతయై మేనా మీద వేంచేసింది. బంధు జనుల యువతులు విమానంలో ఆసీనలయ్యారు ! ప్రజానీకం తండోపతండాలుగా వచ్చి, కర్ర బల్లలపై ఉపవిష్టులయ్యారు.
విమానం ప్రక్కగా తూర్పు దిశను చూస్తూ ఒక మణిఖచితమైన బంగారు సింహాసనం అమర్చబడి ఉంది. ఆసనం ఎర్రని పట్టు దిండ్లతో చూడ సొంపుగా ఉంది.
“ అంగరాజ్య యువరాణి, మహారాజ ద్రప్స భట్టారకుల వారి కుమార్తె , మాలినీ కుమారి సింహాసనాన్ని అలంకరించ వలసినదిగా ప్రార్థింప బడుతున్నది !” అని ప్రాడ్వివాకుడు ఘోషించాడు.
మాలినీ కుమారి విమానం నుంచి క్రిందకు దిగి, అందరికిని చేతులు జోడించి మంద మంద గమనంతో సఖీజన పరివృతయై వచ్చి మెట్లెక్కి ఆసనంలో ఠీవిగా కూర్చొంది. ఇద్దరు సఖులు ఇరు పార్శ్వములందును వింజామరలు వీస్తున్నారు.
నగారా ధ్వనులు మిన్ను ముట్టాయి. శంఖారావాలు దిక్కులు నిండాయి. శ్వేతాశ్వరూఢుడై మహారాజ ద్రప్సుడు రంగ మధ్యానికి వచ్చాడు.మహారాజు మల్ల యుధ్ధానికి అనువైన వేషాలంకరణతో ఇంద్రుని ఐరావతం వలె భీషణంగా ఉన్నాడు ! వంది మాగధులు అతని బిరుదావళుల్ని ఎలుగెత్తి పఠించారు. అతని వెంటనే కాలాభ్ర తుల్యమైన ప్రభతో మిలమిల మెరుస్తున్న నల్లని గుర్రాన్ని ఎక్కి ఠీవిగా స్వారి చేసుకుంటూ మహావీర కర్ణుడు రంగంలో ప్రవేశించాడు. వేలకొలది కండ్లు అతనిని ఆహ్వానించాయి ! కర్ణుడు కూడా మల్ల యుధ్ధానికి తగిన చర్మ వస్త్రాలను ధరించి ఉన్నాడు.
మహారాజ ద్రప్సుడు మదించిన ఏనుగు వలె ఉన్నాడు. మహావీర కర్ణుడు మహోన్నతమైన మృగరాజు వలె కన్పడ్డాడు. మహారాజు నాగాయుత బలుడు, కర్ణుడు సింహ సమాన లాఘవం కలవాడు, కఠిన తపో గణితమైన ఆత్మ శక్తి పూరిత విద్యుత్తేజః ప్రబలుడు ! ఈ ఇద్దరినీ తనివి తీర చూసారు ప్రజలు !
“ కర్ణుడు జయించుగాక ! ఈ బలి విధానమనే అత్యాచారం ఈ దేశం నుండి దూరమగు గాక !”అని జన సందోహం ఆశీస్సు మౌనంగా శబ్దించింది.
“ నా ప్రాణ నాథుడు జయించును గాక !” అని మాలినీ కుమారి దేవతా గణాల్ని లోలోన ప్రార్థించింది.
పోరు ఆరంభ మయింది !!
“ మహావీర ! కదన రంగంలో మీకు మా ఘన స్వాగతం !” అని చేయి చాచాడు మహావీర ద్రప్సుమహారాజు.
“ మగధ రాజ్య రమా రమణా ! వీర మర్యాదను పాటించడంలో సమస్త రాజన్య లోకానికిన్నీ ఆదర్శ పురుషులైన మీకు ఈ కదన రంగంలో మా ఘన స్వాగతం ! ” అని కర్ణుడు
మహారాజ గజశుండాలోపమ బాహువును పట్టి కరచాలనం చేసాడు.
మహారాజ ద్రప్సుడు తన మల్ల చరచి, యుధ్ధ ప్రకటన గావించాడు. ఆ ధ్వని ఉరుముతున్న మేఘ ధ్వనికి మించి అందరినీ గజగజా వణికించింది ! కర్ణుడు ఆహ్వానాన్ని స్వీకరిస్తూ తన మల్ల చరిచాడు. ధణాలుమని కంచు మ్రోగినట్లు తియ్యని నాదం. ఆ నాదం వెంటనే మెరుపు మెరిసినట్లు ఒక కాంతి కనిపించింది ! జనులందరు ఆశ్చర్యంతో చూచారు !
ప్రజానీకం ఆత్రం హెచ్చింది ! కర్ణుని లాఘవం విస్మయ జనకంగా కనిపించింది ! ద్రప్సుని భయంకరమైన పట్టునకు వాడు దొరకకున్నాడు, వాని పిడికిలి పోట్లు ప్రతీ క్షణం ద్రప్సుని అంగ సంధులను హడలుగొడుతున్నాయి.
పోరు రసవత్తరమైన ఘట్టానికి వచ్చింది ! ద్రప్సుడు కర్ణుని పట్టుకొని తన చంకలోఇముడ్చుకొని వలయాకారంగా తిరుగ సాగాడు. జనులందరూ సంభ్రమంత తమ తమ ఆసనాల నుండి లేచి నిలబడి పోయారు. ఇక కర్ణుని పని సరి ! అని బరువుగా నిట్టూర్పులు వదిలారు, వారిలో కొందరు అభిమానులు. కాని ఏమాశ్చర్యం ! కర్ణుడేడీ ? విద్యుద్వేగంతో కర్ణుడు, ద్రప్సుని పట్టుని తప్పించుకొని చెంగుమని నేలపై దుముకి మహారాజుని పట్టి మీదకు ఎత్తాడు !
జనులలో అలజడి, గుసగుసలు ! ఉస్సురౌమనే నిట్టూర్పులు, కర్ణుడు అదే వేగంతో గిరగిర తిరిగి ద్రప్సుని విసిరి వేసాడు. ఆ వేగాన్ని నిలద్రొక్కుకొని ద్రప్సుడు తిరిగి పోరుకు సమాయత్తమైనాడు ! నభోమణి అస్తాద్రికి చేరుకొంటున్నాడు, కోపం వల్ల కాబోలు అతని కిరణాలు ఎర్రబడ్డాయి ! వేలకొలది కాగడాలు యుధ్ధరంగం చుట్టును వెలిగించ బడ్డాయి. పోరు ఘోర రూపాన్ని దాల్చింది ! క్రమక్రమంగా ద్రప్సుడు అలసిపోతున్నాడు ! క్రమ క్రమంగా కర్ణుని పరాక్రమం శృతి మించి భయోత్పాదకమవుతోంది !
“మహావీర ! మెచ్చుకొన్నాను, ఓడింపబడ్డాను” అని అరిచాడు మహారాజు. ప్రళయకాల ఘోషతో సమానంగా ప్రజల చప్పట్లు మిన్ను ముట్టాయి ! ద్రప్సుడు కర్ణుని గాఢంగా కౌగలించుకొని గౌరవించాడు.
“ మహావీర కర్ణునికి జై !జై ! జై!” అనే జయధ్వానాలు పెల్లుబికాయి !
జగదేక సుందరి, మహావీర కన్య అంగరాజ్య యువరాణి మాలినీ కుమారి సింహాసనం మీదనుంది దిగివచ్చి, వృషాకపి కంఠ సీమను పుష్ప మాలికతో అలంకరించింది !
“ మహావీర కర్ణా ! ఇదుగో నీవు గెల్చుకొన్న వీరపణం ! ఈ పుష్పరాశిని అంగ రాజ్యంతో బాటు ఏలుకో ! ఈ రోజే బంధితులను విడుదల కావిస్తున్నాను. బలి విధానం నేటితో పరిసమాప్తమవుతుంది ! మీ దంపతులను భగవన్ ఇంద్రుడు సమస్త సౌభాగ్యాలతో రక్షించుగాక !” అని దీవించాడు ద్రప్సుడు.
భేరీ కాహళ ధ్వనులు ఘోషించాయి !
“ ధర్మ వీర, అతిరథ శ్ర్రేష్ట, వృషాకపికి జై, జై, జై!” అని జయగానం చేసారు ప్రజలు.
**********************
( సమాప్తం )
*******************
Very nice..
ReplyDeleteThank You & Welcome to kSheeraganga.
Deleteద్రప్సుని నుంచి అంగ రాజ్యం కర్ణునికి సంక్రమించినదా ? మరి దుర్యోధనుని నుంచి లభించిన అంగ రాజ్యం పేరు వేరా ఈ కథనంలోన..
ReplyDelete