(నిన్నటి టపాలో జరిగిన కథ==== లిగ్నైట్ త్రవ్వకాలలో దొరికిన ‘వినాయక విగ్రహం గురించి దానయ్య భావుకత్వంతో మాట్లాడుతాడు. దానిని అమ్మి సొమ్ము చేసుకోవద్దని ‘ గవర్నమెంట్ వారికి ఈ విషయం తెలుయజేయమని, ఇంకా ఎన్నో బొమ్మలు దొరికే అవకాశం ఉందని అంటాడు. ఆచారి మురుగన్తో కలిసి దానయ్యని కొట్టి హత్య చేస్తాడు. తరువాత దానయ్య శవాన్ని ఒక బస్తాలో క్రుక్కి టెంటులో పెడాతాడు. ఆ సమయానికే ‘వాట్సన్ దొర’ అక్కడకు వస్తాడు. వాట్సన్ దొర వినాయక విగ్రహాన్ని చేజిక్కించుకొంటాడు=== ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం---11
“ అలా చూస్తూ నిలబడకండి, టెంటులో బస్తాలున్నాయి, ట్రక్ లో లోడు చేయండి.”
ఆచారి ఆర్డర్ విని, కూలీలు టెంటులోకి వెళ్లారు. ఆచారి వెంటనే మురుగన్ ని పిలిచి, “ మురుగప్పా ! దగ్గరుండి జాగ్రత్తగా చూసి, ఏభయి బస్తాలు లోడు చేయంచు, తెలిసిందా, అప్పా !” అంటాడు.
“ అలాగే ఆచారి బాబూ ! ” అంటూ మురుగన్ కూడ టెంటు లోకి వెళ్లాడు. అతను వెళ్లాక, వాట్సన్ దొర ఆచారిని పిలుస్తాడు, “ మిస్టర్ ఆచారీ !” అంటూ.
ఆచారి వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడు. “య స్, సార్ !” అంటూ.
“ ఈ ఐడొల్ని , ఇంకా ఎవ్ రూ, ఎవ్ రూ చుస్ నార్ ?”
‘వాట్సన్ దొర ప్రశ్నకి ఆచారికి చిర్రెత్తు కొచ్చింది.“ ఇంకెక్కడి‘ చూస్ నా ’సార్ ! ‘ దేఖ్ నావే’ మిగిలింది ” అన్నాడు వ్యంగ్యంగా.
“ మిస్ట్ర్ ఆచారీ ! ఆన్సర్ టు ది పాయింట్ ! ఇన్ కా ఎవ్ వరు చూసార్ ?”
“ ఇంకెవ్వరు తమరే ‘చూస్ నార్’ సార్ !”
“ నాక్ కు మున్ దుగ్గా మిర్ చుస్ నార్ , మీక్ మున్దుగ్ గా ఎవ్ రు చుస్ నార్ ?”
“ మీరు, నేను, ఇంకా మీ మాటల్ని బట్టి, ‘దానయ్య’ అనే వ్యక్తి చూసారు సార్ !”
“ దానయ్య , థర్డ్ పర్సన్ ! మన డిపార్టుమెంటుకి కనెక్షన్ లేద్ దు. రేప్ పు ఎవ్ వరైనా రిపోర్టర్సు అడిగితే, ఇద్ ది మున్ దుగ్ గా నేన్ ను చూసినట్టు, తరువాత మీక్ కు దాచ్ చి పెట్టమన్ ని ఇచ్ చి నట్టు చెప్ పాలి. ! అండర్ స్టేండ్ !”
“ ఫలాన్ని మీరు ‘చూస్ నాక’ , గింజల్ని నేను దాచినట్లు చెప్పి, లాభం ఏమిటి సార్ ?”
“ మిస్ట్ర్ ఆచారీ ! వ్హాట్ డు యూ మీన్ ? ఫలమ్, జింజల్ ఏమి టి ?”
“ ఫలం అంటే ఫ్రూట్ , గింజలు అంటే సీడ్స్ సార్ ”
“ మిస్ట్ర్ ఆచారీ ! దేర్ ఈజ్ ఎ ప్రోవెర్బ్ ! ‘ జింజ నాట్ టండి, అండ్ రేప్ ది గ్రేప్స్ !” అని.
“ అవును సార్ ! నేను గింజ నాటాను, మీరు గ్రేప్స్ ని రేప్ చేయండి. ”
“ మిస్టర్ ఆచారీ ! కమ్ టుది పాయింట్ ! నేను చెప్ పిన్ ది మీక్ కు అర్థమయిన్ దా ?”
“ అర్థమయింది సార్ ! ముందుగా మీరే చూసి, దానిని దాచమని నాకు ఇచ్చారని, తరువాత రాత్రంతా చరిత్ర గ్రంధాలు తిరగేసి, దాని రహస్యం కనిపెట్టారని చెప్తాను.”
“ రైట్ దట్స్ గుడ్ !” అని వాట్సన్ ఆచారిని మెచ్చుకొంటూ ఉండగా, టెంటు లోంచి కూలీ‘ ఎంకన్న’ వస్తాడు. వాట్సన్ దొర ఎంకన్నని చూసి, “ బేగ్సు లోడ్ అయ్యాయా ” అని అడిగాడు.
“ సిత్తం దొరా !” అన్నాడు ఎంకన్న.
“ ఎన్ని బస్తాలు లోడు చేయించాడు మురుగన్, ఏభయి బస్తాలేనా ?”అడిగాడు ఆచారి గాభరాతో.
“ ఒక్కటి తప్ప అన్నీ లోడు సేయించినా రండి.” అన్నాడు ఎంకన్న.
“ ఒరేయ్ ఎంకన్నా ! అడిగిందానికి జవాబు చెప్పు, ట్రక్కు లో ఎక్కించిన బస్తాలెన్ని, యాభయేనా ?”
“ అవునండి, ” నసుగుతూ నిలబడతాడు ఎంకన్న.
“ మరైతే ట్రక్కులో కూర్చోక ఇక్కడి కెందుకు వచ్చావు ? వెళ్లు, అంతా రెడీ అయితే , డ్రైవరుని స్టార్ట్ చెయ్యమను.”
“ సిత్తం ! అలాగేనండీ, మరి ---” అంటూ, బుర్ర గోకుకొంటూ అక్కడే నిలబడి ఉంటాడు ఎంకన్న.
“ ఏంట్రా ! బెల్లం కొట్టిన రాయిలా , అలా నిలబడి పోయావేంటి ?”
“ సిత్తం ! నాకు తెల్వక అడుగుతాను గానీండి, ఈ నిలబడి పోయిన రాళ్లన్నీ బెల్లం కొట్టినవే నేటండీ ?”
“ ఆ సామెతకి అర్థం అది కాదురా జడ్డి ముఖమా ! రాయికి చలనం ఉంటుందా , చెప్పు ?”
“ కదలదండి”
“ ఆ రాయితో బెల్లాన్ని కొట్టి పడేస్తే, బెల్లం కోసం, చీమలు చేరుతాయా కదా, చేరినవి కాస్తా, చిటుకు పొటుకు మంటూ ఆ రాయిని కదపక మాన్తాయా ! అలా చీమలు చేరి కదిపినా , కదలని రాళ్లని ‘బెల్లం కొట్టిన రాయిలాగ ’ అనే సామెతతో పిలుస్తారు., అర్థమయిందా ?”
“ అలాగనే ఎందుకనాలండి, సీమలు సేరినా కదలని రాయంటే నా లాంటి వాడికి కూడా అరద మవుతాది కదండీ !”
“ ఎందుకన కూడదు , తప్పకుండా అనవచ్చు, ఇన్నాళ్లకి మీ నోళ్లకి కూతలొచ్చాయి కదా,తెలుగు భాషలో కొత్త కొత్త సామెతలు ఆ కూతల వెంబడే రావాలి. ఇంతకీ నీ సంగతేమిటి ? సీమలు సేరినా కదలని రాయిలాగ అలా నిలబడి పోయావేం ?”
“ సిత్తం ! రాయి కాదండి, ” బుర్ర గోకు కున్నాడు ఎంకన్న. “ ముంతండీ !”
“ ముంతేమిట్రా ! – కల్లు ముంత కొట్టి వచ్చావేంటి ?”
“ అబ్బెబ్బే ! నీ తోడు, ఇంకా ముట్టలేదండీ !”
“ అంటే ఇప్పుడు ముట్తావా?”
“ అవునండి, కల్లు ముంత కాదండి, -- దొడ్డి సెంబండి, ” అంటూ, దూరంగా పడిపోయి ఉన్న దొడ్డి చెంబు చూపిస్తాడు ఎంకన్న.ఆచారి, వాట్సన్ ఇద్దరూ ఆ దాని వంక చూస్తారు. దొర్ కుర్చీలోంచి లేచి, చెంబు చేతిలోకి తీసుకొని, పరీక్షగా చూసి, “ మిస్టర్ ఆచారీ ! ఇదీ కూడ్ డా డ్రిల్లింగులో దొరికిందేనా ?” అని అడుగుతాడు. దొర ప్రశ్నకి ఆచారి లోపల్లోపల కోపంతో కుమిలి పోతాడు. ‘ కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు’ అన్నట్లు , నీకీ పిచ్చి బాగా పట్టీంది. చూసిందల్లా, బొక్కలో దొరికిందేనా అని, అడుగుతున్నావు , పెద్ద పరిశోధన చేసినట్లు !’ అనుకొంటూ మౌనం వహిస్తాడు.
“ వాట్ మిస్టర్ ఆచారీ ! ఇద్ ది కూడ్ డా డ్రిల్లింగులో దొరికిందేనా ?”
“ యస్ సార్ ! ఇది కూడా అక్కడే దొరికింది ”
ఎంకన్న దొరకి దండం పెట్టి, “ దండాలు దొరా ! కసింత ఆ సెంబు సూపిత్తరేటి,? తొలి బస్తా ఎత్తిన కాడి నుండీ, టెంటు లోంచి దాన్నే సూస్తన్నాను, సూసిన కొద్దీ ఏదో ‘బమ’ పీకుతున్నాది.”
“ నీ పేర్ రు ఏమ్ టీ ?” అడిగాడు దొర.
“ ఎంకన్న దొరా !”
“ వాట్సన్ ఎంకన్నకి, చెంబుని చూపిస్తూ.,“ వాటీజ్ దిస్ ?” అని ప్రశ్నిస్తాడు.
“ దొడ్డి సెంబండీ !”
“ దొడ్ డి చెంబు అంటే ?”
“ అదేంటి దొరా, దొడ్డి సెంబంటే తెలీదేంటండి ?”
“ దొడ్డి చెంబు సంగతి దొరలకి ఎలా తెలుస్తుందిరా, ఎంకన్నా? వాళ్లు తుడుచుకొనే బాపతు కదా !”
“ మిస్టర్ ఆచారీ ! వ్హాటీజ్ దిస్ ? దొడ్ డి చెమ్ బు అంటే ?”
“ అంటే టాయిలెట్ , అదే లేవాటరీకి వెల్లేటప్పుడు యూజ్ చేసే చెంబండి !”
“ మై గాడ్ ! హౌ వండార్ ఫుల్ ! కింగ్ ప్రోలయ నాయక దీన్ ని టాయిలట్ కి యూజ్ చేసే వార్ రా, ? వాట్ ఏ ఫెంటాస్టిక్ లిటిల్ టాయిలెట్ పేన్ !!”
“ ఆచారి ‘ఖర్మ’ అంటూ చేతితో నెత్తి కొట్టుకొంటాడు. వాట్సన్ దొర చెంబుని త్రిప్పి త్రిప్పి చూస్తూ, అన్నాడు, “ వండర్ ఫుల్ లిటిల్ టాయిలెట్ పేన్ ! ఎంకంనా , --యూ వాంట్ టూ సీ ఇట్ ! చూడ్ డు !” అంటూ ఎంకన్న చేతికి చెంబుని ఇచ్చాడు దొర.
ఎంకన్న కూడా చెంబుని త్రిప్పి, త్రిప్పి, చూస్తాడు. ,“ బాబూ ! ఇది మా మవ దొడ్డి సెంబండి ! ప్రోలయ్యలోర్ది కాదండీ ! ” అన్నాడు.
“ ఎంకంనా ! వాట్ డూ యూ సే ? ఇద్ ది మీ మాందా ?”
“ అవును దొరా ! టెంటు లోంచి దీన్ని సుసిన కాడి నుంచి, అనుమానవే నండి. ఇది సొయాన నాకు పిల్ల నిచ్చిన మావదేనండి.”
“ ఎం కం నా ! నీక్ కు పింలానిచ్ చిన మామ్ ప్రోలయ నాయక కాల్ ఆమ్ వాడ్ డా ?”
“ దొరా ! మా మావ యీ కాలమ్ నాటి వాడే నండి. ప్రోలయ్యోరంటే , పోలయ్య రెడ్డి ఏంటండి ! మా మావకి పోలయ్య రెడ్డి అనే దోస్త్ ఉన్నాడండి.”.
“ మిస్టర్ ఆచారీ ! ఎం కం నకి , అత్ నికి పిల్లానిచ్ చిన మామ్ కి, జెనరేషన్ గెప్ ఎంత ?”
“ పిల్లనిచ్చిన మామ అంటే ‘ఫాదర్ ఇన్ లా’ సార్ !”
‘‘ వాట్ ! ఏమ్ ఐ టాకింగ్ విత్ ఘోస్ట్ ! మిస్టర్ ఆచారీ, ఈ ఎంకంన -- ఎంకంన -- దెయ్ యమ్—మై గాడ్ ! ఈజ్ ఇట్ ఎ ఘోస్ట్ !!” అంటూ ఎంకన్న వైపు భయంతో చూసి, వెంటనే సర్వే కేంపు దగ్గరున్న తన బైకుని ఎక్కి, స్టార్టు చేస్తాడు. వెళ్లేటప్పుడు, దొడ్డి చెంబునీ, వినాయక విగ్రహాన్నీ, పట్టుకొనే వెళ్తాడు. ఎంకన్న దొర వెళ్లిన వైపే చూస్తూ, “ ఆ దొర మా మావ సెంబు పట్టుకు పోయిండు బాబూ !” అంటూ విలపిస్తాడు
“ నా వినాయక విగ్రహం కూడా పట్టుకు పోయాడు.”
“ ఇనాయకు లోరి బొమ్మ మీదేటండి ?”
“ నాకు దొరికింది నాది కాక ఇంకెవరిది అవుతుంది ? ”
“ దొరికినయన్నీ మన సొత్తు అయిపోవండి. సెట్టు క్రింద రాలిందే అయినా, దాని కాయని సొంతం సేసేసుకుంటే, , దాని మాలి ఊరుకొంటాడేటండి ! ”
“ చాల్లేరా, చెప్పొచ్చేవు ! ఆ మాత్రం నాకూ తెలుసు. కాయ రాలిందే అయినా, చెట్టు నాటింది మాలి కాబట్టి , దండించే హక్కు మాలికి ఉంటుంది. ఈ కేసు అలాంటిది కాదు. నాకిది నేల క్రింద గోతిలో దొరికింది.దీని మీద ఎవరికీ హక్కు భుక్తాలు లేవు.”
“ అంటే మా మావ సెంబు గోతిలోనే దొరికిందేటండి ?”
ఆచారి ఎంకన్న ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలియక, “ అవును” అంటాడు.
“ అయ్య బాబోయ్ ! మావోయ్ ! ” ఏడుపు లంకించు కొంటాడు ఎంకన్న.
“ ఎందుకురా అలా శోకాలు పెడతావు ?”
“ అదేటండి, సెంబు గోతిలో దొరికితే , మా మావ గట్టు మీద ఎలాగుంటాడండి ! ఆడు కూడా—”
“ ఇదెక్కడి రూలురా ఎంకన్నా ! మీ మామ చెంబు గోతిలో దొరికితే, అతను గోతిలో ఉన్నట్లు, నూతిలో దొరికితే , అతను నూతిలో ఉన్నట్లు అనుమానిస్తావేంరా ! ”
“ మీకేం పోయింది బాబయ్యా ! మీ మామ అయితే అర్థం అయ్యేది ? ఇంతకీ ఆ సెంబు కూడా మీకే దొరికొందేటండి.?”
“ లేదు, లేదు, అది ఆ దొరకే దొరికింది. ” తడబడుతూ జవాబిచ్చేడు ఆచారి.
“ అయితే మా మావ సంగతి ఆ దొరగారికే తెలిసుంటది ! ఎల్లి ఆరినే అడుగుతాను.”
“ వద్దురా ఎంకన్నా ! నువ్వు వెళ్ల వద్దు , ఆ దొర నిన్ను దెయ్యమనుకొని భయంతో పారి పోయాడు. మళ్లీ నువ్వు ఆయన ఇంటికి వెళ్లి, కనిపిస్తే, గడప దాటకుండానే ,‘గన్ను’ పెట్టి కాల్చేస్తాడు.”
“ అయ్య బాబోయ్ ! అయితే ఎల్లనండి, కాని దుక్క లాంటి సెంబండి ! జరగని నాడు అమ్ముకొంటే నాలుగు డబ్బులు వచ్చేవండి.”
“అంతే కదా, ఆ చెంబేదో ఇప్పుడే అమ్మేసావనుకో ! ఇంద , ఈ అయిదు రూపాయలూ తీసుకొని, దాని సంగతి మరచి పో ! మరెక్కడా దాని ఊసెత్తకు ! ” అంటూ ఎంకన్నని బయటికి సాగనంపి, వెళ్లే వరకు చూసి , మురుగన్ని, పిలిచాడు ఆచారి. మురుగన్ ఆచారి ఎదురుగా వచ్చి, “ ఏం పని ఆచారి బాబూ ?” అని అడిగాడు.
“ మురుగప్పా ! మరచి పోయావా , ఆ బస్తా పని పట్టాలి.”
సరే నంటూ, మురుగన్ , ఆ వెనకే ఆచారి టేంటులోకి వెళ్లారు.
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment