(నిన్నటి టపాలో జరిగిన కథ====వాట్సన్ దొర వినాయకుని విగ్రహం సంగతి తనకి ఒక దానయ్య ద్వారా తెలిసిందని. దానిని ఆచారి తీసి బస్తాలో దాచడం తాను చూసానని చెప్తాడు. ఆ బొమ్మని గవర్నమెంటుకి అప్పజెప్పాలని, దానిని తానే కనిపెట్టినట్లు చెప్పాలని అంటాడు. ఇంతలో ట్రక్కు వస్తుంది. ఎంకన్న మరో ముగ్గురు కూలీలతో వస్తాడు. వాళ్లు టెంటులోని బస్తాలు , దానయ్య శవం ఉన్నది తప్ప ట్రక్కులోకి ఎక్కిస్తారు. అప్పుడు ఎంకన్న , దానయ్య దొడ్డిచెంబుని చూసి , అది తన మామదని చెప్తాడు. దొర ఎంకన్నని దెయ్యమని భ్రమపడి, వెళ్లిపోతాడు. ఆ తరువాత బస్తాలని తీసుకొని ట్రక్కు కూడా బయలుగేరుతుంది. అది వెళ్లాక దానయ్య శవాన్ని కాల్చేయాలని ఆచారి, మురుగన్’తో కలిసి టెంటు లోపలికి వెళ్తారు=== ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం---12
మొసలి కొలను గ్రామంలో లిగ్నైటు త్రవ్వకాలు మొదలయి, దాదాపు సంవత్సరం గడిచింది.
ఈ సంవత్సర కాలంలో ఆ గ్రామంలో చాలా మార్పులు జరిగాయి. ముచ్చటగా మూడు ఫేక్టరీల నిర్మాణం జరిగింది. ఒక్ ఫేక్టరీ , గని లోని ముడి సరకు నుండి, లిగ్నైటుని వేరు చేయడానికి , మరొక ఫేక్టరీ ఆ ముడి సరకు నుండి, బాల్ క్లేని వేరు చేయడానికి, ఇంకొకటి ‘జీడి పప్పు ఫేక్టరీ’ ! ఈ ఫేక్టరీల నిర్మాణం వల్ల ఆ గ్రామం కాస్త తన రూపు రేఖలని, మార్చుకొని, చిన్న బస్తీ అయింది .
ఆ బస్తీలో చూడ ముచ్చటగా ఉండే ఒక ‘మ్యూజియం ’ నిర్మించింది ప్రభుత్వ పురాతత్వ శాఖ. వాట్సన్ దొర ఇచ్చిన వినాయక విగ్రహం పూర్వా పరాలు పరిశీలించిన ఆ శాఖ ఇద్దరు ప్రతినిధులని , ఆ త్రవ్వకాలని పర్యవేక్షించడానికి పంపించింది. వారు ఆ బొమ్మలకి చారిత్రిక ప్రాధాన్యత ఉందని తేల్చిన తరువాత, గనుల త్రవ్వకం పనులు , తాత్కాలికంగా నిలిపి వేయ బడ్డాయి.
గనుల త్రవ్వకం యొక్క టెండరు, ‘ ట్రెజర్స్ & మైన్స్ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్ ’ వారికి ఇవ్వడం వలన, పురాతత్వ శాఖకి అవసర మయే విధంగా, నేర్పుగా త్రవ్వకాలని నిర్వహించే పని కూడా ఆ కంపెనీకే ఇవ్వడం జరిగింది. తమ ప్రతినిధుల పర్యవేక్షణలో త్రవ్వకాలు నెమ్మదిగా పురాతన వస్తువులు పాడయి పోకుండా, జరపడానికి, అంగీకరించి ఆ కంపెనీ రెండు విధాలుగా లాభ పడింది. మొదటిది ‘ బాల్ క్లే’ విషయం పూర్తిగా మరుగున పడింది. రెండవది , ఆ సైటులో మాత్రమే నెమ్మదిగా త్రవ్వే భాద్యత చేపట్టి మరికొంత సొమ్ము చేసుకొంది. మిగతా సైట్లలో ‘లిగ్నైటు’ యథావిధిగా త్రవ్వుకో సాగింది.
గత చరిత్ర వైభవానికి అద్దం పట్టే విగ్రహాలు, తదితర కళా ఖండాలని ప్రదర్శించే నిమిత్తం, ‘మ్యూజియం’ నిర్మించి , ఒక సీనియర్ ఇనస్పెక్టర్ని ( పర్యవేక్షకుణ్ని ) ప్రభుత్వం నియమించింది. ఆ విధంగా ‘ కరీం ఖాన్’ మ్యూజియంలో రంగ ప్రవేశం చేసాడు.
ఆ రోజు కరీం ఖాన్ మ్యూజియం లోని ‘ఎగ్జిబిట్లని’ సూచిక ప్రకారం సరి చూస్తూ, వాటి వివరాలని, లావు పాటి, లెడ్జరు లోకి ఎక్కిస్తూ, పనిలో నిమగ్నమయి పోయి, తనలో తాను మాట్లాడుతూ ఉండగా ఆచారి మ్యూజియం లోకి వచ్చాడు.
కరీం ఖాన్ సూచిక లోని వస్తువులని బయటికే చదువుతూ, లెడ్జరు లోకి ఎక్కిస్తున్నాడు. ‘ ఎగ్జిబిట్ నెంబర్ ముఫ్పది రెండు , ఏడు ఆకుల అరటి చెట్టు’, ఎత్తు మూడ వందల అరువది రెండు మిల్లి మీటర్లు, హాకు వెడల్పు ఇరువది ఆరు మిల్లీ మీటర్లు , ‘ ఎగ్జబిట్ నెంబరు ముఫ్పది మూడు , ముఫ్పది నాలుగు, ముప్పది అయిదు దీపం సెమ్మాలు ---”
ఆచారి అక్కడికి వచ్చి, కరీం ఖాన్ లిస్టు పూర్తి చేస్తాడు. “ ఎగ్జిబిట్ నెంబరు ముఫ్పది ఆరు ఆంజ నేయుడి విగ్రహం , ఎత్తు రెండు వందల ఇరవై అయిదు మిల్లీ మీటర్లు వెడల్పు డెభ్బై రెండు మిల్లీ మీటర్లు --”
ఆచారి మాటలు విని, కరం ఖాన్ కళ్లజోడు సరి చేసుకొని అతని వైపు పరీక్షగా చూసి, “ హెవరు నువ్వు, ముఫ్పది ఆరో నెంబరు గురించి, నీకు హెల్లా తెలుసు ?” అని ప్రశ్నించాడు.
“ నేను నీ చిన్న తమ్ముణ్ని కరీం ఖాన్ ! నువ్వు పెద్ద మున్షీవయితే , నేను చిన్న గుమాస్తాను ! నువ్వూ నేనూ ఒకే చెట్టు కొమ్మలం, ఒకే గూటి పిట్టలం ఒకే పిట్ట ఈకలం---”
“ ఠైరో ! నీ హీకల్ సోది కట్టి పెట్టు. హెవరు నువ్వు, అంటే పేరు చెప్పాలి.”
“ చెప్తాను, చెప్తాను ‘ చల్లకి వచ్చి, ముంత ఎందుకు దాచుతాను ’ నా పేరు గోవర్ధనాచారి ! మైన్సు & ట్రెజర్సు రీసెర్చి కంపెనీ గుమాస్తాని. మీ మ్యూజియంలో ఎగ్జిబిట్లు మేము గోతుల లోంచి త్రవ్వి తీసినవే ఖాన్ సాహెబ్ ! అందుకే వాటి గురించి నాకు బాగా తెలుసు. ఏం కరీం ఖాన్ సాహెబ్, ఈ వివరాలు చాలా, ఇంకా చెప్పాలా ?”
“ ఠైరో ! హేమ్టీ అన్నావ్ ! మైన్సు అండ్ రీసెర్చి కంపెనీవా , ఆ ! హిప్పుడు యాదొచ్చింది. ఏడాది క్రిందట , మీ కంపెనీ త్రవ్వకాలలో ‘ హిన్నాయకుడి’ బొమ్మ ఒకటి, దొర్కింది హవునా ?”
“ బాగా సెలవిచ్చారు, ఖాన్ సాహెబ్ ! హిన్నాయకుడి బొమ్మ అన్నారు , హిరణ్య కశిపుడి బొమ్మ అనకుండా , మీ మెమొరీ పవరు చాలా గట్టిది.”
“ పాపం ! మీది కంపెనీకి అక్కడ లిగ్నైటు తగినంతగా దొరకా లేదు కదా ?”
“ ఇందులో విచారించ వలసింది ఏముంది ఖాన్ సాహెబ్ ! మా కంపెనీకి అది అలవాటే ! త్రవ్విన ప్రతీ చోటా నిధులు దొరికితే, ఇంకేం కావాలి ? అయినా మీ ఆర్కియాలజీ డిపార్టుమెంటు ఆ భూములని, మెల్లిగా త్రవ్వేందుకు రెట్టింపు ధర ఇచ్చి, త్రవ్వించింది కదా, నష్టమేమీ లేదు లెండి.”
“ మాకీ ముందు మీదీ కంపెనీ , లిగ్నైటూ కోసం ఈ జమీన్ త్రవ్వింది, లిగ్నైటు దొర్కాలేదు, దొర్కింది—”
“ వినాయకుడి బొమ్మ !”
“ హవును హిన్నాయకుడి బొమ్మ ! బొమ్మ దొర్కీనాక మాదీ డిపార్టుమెంటు , మీది జమీన్ స్లోగా త్రవ్వింది, హేమ్టీ దొరికింది ?”
“ ఇదిగో ఈ మ్యూజియం పట్టేటన్ని, అరుదైన కళా ఖండాలు దొరికాయి. కొన్ని కంప రాయల కాలం నాటివి ! –”
“ కొన్నిహాడి అన్న ప్రోలయ వేముని కాలం నాటివి.హందులో ముఫ్పది ఆరో నెంబరు బొమ్మ ---”
“ పంచముఖి ఆంజనేయుడిది.”
“ హా ! హది ఆంజనేయుడి దని నీకు హెల్లా తెలిసింది.! పోనీ చూసావనుకొందాం దానీ కొల్తలు హెల్లా తెల్సినాయి. పోనీ తెల్సాయనే అనుకొందాం, నాకీ హెంద్కీ చెప్పాల్సి వచ్చింది. ? నీది వాటం చూస్తే , నాకీ హనుమానంగా ఉండాది, చెప్పు హెంద్కీ వచ్చినావ్ ?”
“ అమ్మమ్మ ! నా మీద అనుమానమా ? ఖాన్ సాహెబ్ ! సరిగా ఙ్ఞాపకం తెచ్చుకోండి. మా కంపెనీ త్రవ్వకాలలో దొరికిన వినాయకుడి బొమ్మని మీ డిపార్టుమెంటుకి, అప్పగించింది. నేను నా మీదా అనుమానం ?”
“ కాదు, హది ఇచ్చిన మనిషీ పేరు వాట్సన్ దొర , మీదీ కంపెనీకి సీనియర్ ఇంజనీయరు.”
“ ఆహా , ఆహా ! ఏమి ఙ్ఞాపక శక్తి మీది ! కరీం ఖాన్ సాహెబ్ ! మీకూ ఖుదా తావీజ్ !”
“ కాదు, ఖుదా హఫీజ్ !”
“ అదే, అదే ! హేట్స్ ఆఫ్ టు యువర్ ! ఙ్ఞాపక శక్తి ! కరీం ఖాన్ సాహెబ్, రికార్డులో దొర పేరు ఉన్నా, దాన్ని కనిపెట్టిన వాణ్ని నేనే ! నేను ముందుగా దాన్ని చూసి, దొరకి అప్పగించాను .దొర—”
“ దొర తనదీ పేరు మీదా చెలామణీ చేసాడంటావ్ ?”
`` సెంటు పర్సంట్ కరక్ట్ ఖాన్ సాహెబ్ ! ఎంతైనా మీరీ ఉద్యోగ నిర్వహణలో మీరు చాల సమర్థులు. నాకు తప్పకుండా పెద్దన్నయ్య అవుతారు . మీరూ, నేనూ ఒకే చెట్టు కొమ్మలం, ఒకే గూటి పిట్టలం, ఒకే పిట్ట ఈకలం ---”
“ ఒకే తల్లి పిల్లలం---”
“ ఖాన్ సాహెబ్ డైలాగు ఆచారికి ,ముల్లులా గ్రుచ్చుకొంది. ‘ గురువాయూరప్పా ! ఈ ఖానూ, నేనూ ఒకే తల్లి పిల్లలమా ! వీడి ముఖం ఈడ్చ! ’ అని మనసు లోనే అనుకొని,“నిజంగానా ఖాన్ సాహెబ్ ! ఎంత మాట సెలవిచ్చారు !” అన్నాడు.
“ చిన్నా భాయి ! హేమీ పని మీదా వచ్చీనావ్ ? హీకల్ పీకడానికా ?”
“ ఈకలా, పెద్దా భాయీ ?”
“ అదే, నువ్వు చెప్పిందే ! మనం మనం ఒకే పిట్ట హీకలం ! ”
“ బలే, బలే ! మీలో మంచి చమత్కారం ఉంది. నేను హీకలు పీకడానికి కాదు, రెక్కలు అతికించడానికి వచ్చాను. ఈ గాడిద చాకిరీ విడిచి పెట్టీ, ఆ రెక్కలతో, మీరు గంధర్వ లోకానికి అదే ‘ జన్నత్కి ఎగిరి పోవచ్చు !”
“ హతికించుకొన్న రెక్కల్తో, హుట్టీకే ఎగరలేము , జన్నత్ దాకా హెంద్కీ చెప్తావ్ చిన్నాభాయి !”
“ అబ్బే ! నేను తెచ్చినవి, సరాసరి విమానం రెక్కలు, చూడండి కావలస్తే ,” అంటూ తన జేబులోంచి నోట్ల కట్టలు తీసి, విసని కర్రలా విడదీసి, చూపిస్తూ, ఉంచండి మీ జేబులో ” అని తోసాడు.
జేబులో నోట్ల కట్ట పడగానే , కరీం ఖాన్ ముఖం వికసిస్తుంది. “ చిన్నా భాయి ! హేమి పని మీదా వచ్చావ్ ?” అని అడిగాడు..
“ చెప్తాను ముందీ బేగులోకి చూడండి, ” అంటూ తను తెచ్చిన ఫోలియో బేగు జిప్ తీసి చూపిస్తాడు.. కరీం ఖాన్ కళ్లజోడు సర్దుకొని చూసి, “ చిన్నాభాయి ! హిది--?!”
“ ఎగ్జిబిట్ నెంబరు ముఫ్పది ఆరు , పంచముఖి ఆంజనేయుడి బొమ్మ , ఎత్తు రెండు వందల ఇరవై ఐదు మిల్లీమీటర్లు, వెడల్పు డెభ్బై రెండు మిల్లీ మీటర్లు ---”
“ హవును, నీదీ బేగులోకి హెల్లా వచ్చింది ?”
“ ఇది ఒరిజనల్ కాదు, మీ మ్యూజియంలో ఉన్న ఎగ్జిబిట్ నెంబరు ముఫ్ప్ది ఆరుకి, నకలు, ఫరక్ లేదు, అదే బొమ్మ ”’ అంటూ జిప్ మూసేస్తాడు. కరీం ఖాన్ కళ్ల జోడు, సర్దుకొని ఆచారి వంక ఆశ్చర్యంతో చూస్తాడు, “ చిన్నా భాయి ! హేం చెయ్యాలని తెచ్చావు ?”
“ పెద్దా భాయి ! మీది చాలా గట్టి బుర్ర ! ఎందుకు తెచ్చానో తెలియకే అడుగుతున్నారా ?” అని అడిగాడు ఆచారి, ,కరీం ఖాన్ వంక భావ గర్భితంగా చూస్తూ.
“చిన్నాభాయి ! సమజ్ గయా ! ” అని ఆచారి బేగుమీద కొట్టీ, ,“ నకిలీది లోపల పెట్టీ, హసల్ది, తెచ్చి ఇమ్మంటావ్ –” అన్నాడు కరీం ఖాన్ .
“ అంతే ! అలా చేస్తే ఈ నిండు జేబు మీది అవుతుంది, లేక పోతే మీ ఖాళీ జేబు మీకు ఉండిపోతుంది. ” అంటూ , కరీం ఖాన్ జేబు మీద చెయ్యి వేస్తాడు ఆచారి. కరీం ఖాన్ ఆచారి చేతిని క్రిందకి దించి, షేక్ హేండ్ ఇచ్చి, అంటాడు.“ చిన్నా భాయి ! మనం మనం ఒకే తల్లి పిల్లలం ---”
“ ఒకే చెట్టు కొమ్మలం ---”
“ ఒకే గూటిపిట్టలం, ఒకే పిట్ట హీకలం ”అని, ఇద్దరూ కలిసి కట్టుగా చెప్పుకొని నవ్వుకొంటారు.
“ పెద్దా భాయి ! నా పని ఇంత సులువుగా అవుతుందనుకో లేదు.”
“ చిన్నా భాయి ! జరా ఠైరో ! వాచ్ మేన్ని పిలిచి , బయటికి పంపించేస్తాను.” అంటూ తన టేబిలు మీద నున్న బెల్ నొక్కాడు కరీం ఖాన్.
వాచ్ మెన్ ఎంకన్న మ్యూజియం లోంచి బయటికి వస్తాడు. చేతిలో చిన్న నిచ్చెన, రెండో చేతిలో బాల్చీ,, బాల్చీ లోపల ధూళి దులిపే నెమలి ఫింఛం బ్రష్ ఉంటాయి. ఎంకన్న బయట నున్న ఆచారిని చూసి, “ దండాలు బాబూ !” అన్నాడు. ఆచారి ఆశ్చర్యంతో ఎంకన్నని చూసి, “ ఎంకన్నా ! నువ్వు మ్యూజియం వాచ్మెన్ వా ?” అని అడిగాడు.
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment