(నిన్నటి టపాలో జరిగిన కథ--- మొసలి కొలను మ్యూజియం పరివేక్షక గుమాస్తా కరీంఖాన్ దగ్గరకి , ఆచారి ఒక ‘పంచముఖి ఆంజనేయుని విగ్రహం’ తీసుకొని వచ్చి, అది నకిలీదని , దానిని లోపల పెట్టి, అసలు విగ్రహాన్ని తనకి ఇచ్చెయ్యమని అంటూ ఆ పని కోసం నోట్ల కట్టలని ఇస్తాడు. కరీంఖాన్ డబ్బుకి ఆశపడి వాచ్’మెన్ ఎంకన్నని బయటికి పంపించి వేయడానికి అతనిని పిలుస్తాడు. ఎంకన్నని చూసి ఆచారి ఆశ్చర్యపోతాడు--- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం ---13
“ అవును బాబయ్యా ! అంతా ‘ ఇనాయకు లోరి దయ’ గవర్నమెంటోళ్ల తవ్వకంలో, రోజు కూలీ పన్జేసినా, తవ్వకాలు పూర్తయి, మ్యూజియం కట్టగానే , నన్ను వాచ్మెన్ గా పడేసినారండీ ! కాపలా కాయడం, కీనింగులు సెయ్యడం, అన్నీ నేనే నండి.”
“ మంఛిదే , అంతా కులాసాయే కదా ?”
“ సిత్తం బాబయ్యా ! ఆ రోజు దొరట్టు కెళ్లిన దొడ్డి సెంబు కూడా నాకు తోలేసినారండి. అది మా మావదే నంట ! ఎప్పటీదో పాతది కాదంట !”
“ దొడ్డి చెంబు మాట సరే , మీ మామ సంగతేమైనా తెలిసిందా ?”
“ ఎంకన్న ,చేతిలోని నిచ్చెన ,బాల్చీ,ఒకమూల పెడతాడు. ”ఏటో నండి , బాబయ్యా ! ఆడి సంగతే తెల్దండి. ఆ రోజు నుంచి పరారీ అయిపోయినాడండి.”అన్నాడు.
“ పోలీసు రిపోర్టు ఇవ్వలేదూ ?”
“ ఎందుకు బాబయ్యా ! అలా పరారీ అయిపోడం ఆడికి అలవాటే నండి, మల్లా ఏదో రోజు కొంపకి సేర్తాడండి. తలకి మాసినోడు.”
“ అంతే, అంతే ధైర్యంగా ఉండు,” అని ఆచారి ఎంకన్నకి ధైర్యం చెప్తాడు. కరీంఖాన్ కూడా ఎంకన్న భుజం తట్టి, “ చూడు హెంకన్నా ! నువ్వు మాదీ ఇంటికీ హెల్లి, నాదీ టిఫిన్ పట్రా ,” అని ఆర్డర్ వేస్తాడు.
“ అదేటి బాబయ్యా ! ఎలాగూ మధ్యాన్నం పూట సెలవే కదా ! సెలవు రోజు కూడా ఇక్కడే భోజనం చేస్తారేమిటి ?” అడిగాడు ఎంకన్న.
`` హవును బోలెడు పనీ హుండి పోయింది.”
“ ఇంత పెందరాలే పంపించేస్తున్నారు , వంట అయిపోద్దా ?”
“ హవకా పోతే, నీకీ చూసి, సురూ సేస్తార్లే ! హెల్లి, అంతా హయినాక పట్టీ తీస్కొని రా ! ”
“ అలాగే బాబుగారూ ! ” అంటూ ఎంకన్న బయటికి వెళ్తాడు.
గేటు బయట దానయ్య నిల్చొని ఉన్నాడు. నవ్వుతూ ఎంకన్నని చూసి, “ ఏమల్లుడూ .ఎంకన్నా ! ఆళ్ల మాటలని రికార్డు సేసినావా ? ” అని అడిగాడు.
“ సేసాను మావా ! ఇదుగో ఇనుకో !” అంటూ టేప్ రికార్డరుని ఆన్ చేసి, ఆచారి, కరీంఖాన్ ల సంభాషణా వినిపిస్తుంది. ఎంకన్న టేపు ఆఫ్ చేసి, “ ఈ పిట్టలని గూటితో పాటు, పట్టే వల అట్టుకు రావాల ! ఏంటంటావు మావా ? జై ఆంజనేయా !”
“ నిజమేన్రా ఆంజనేయా ! వాళ్లొచ్చే వేళయింది, నేను వెళ్లి కథ రక్తి కట్టిస్తాను, ” అంటూ, ‘ హనుమాన్ చాలీసా’ పాడుతూ లోపలికి వెళ్తాడు దానయ్య.
‘ జయ హనుమాన, ఙ్ఞానగుణ సాగర / జయ కపీశ ,తిహు లోక ఉజాగర
రామ దూత , అతులిత బలధామా / అంజనీ పుత్ర ,పవన సుత ధామా
మహా వీర, విక్రమ భజరంగీ / కుమతి నివార, సుమతికే సంగీ
జైజైజై హనుమాన గోసాయీ, / కృపాకరో గురు దేవ ,కీనాయీ”
మ్యూజియం లోపలి నుంచి, ఆచారి , కరీం ఖాన్ ఇద్దరూ ఫోలియొ బేగు హేండిల్సిని చేరో చేతి తోనూ పట్టుకొని, వస్తారు. హనుమాన్ చాలీసా విని , ఇద్దరూ ద్వారం దగ్గరే ఆగి పోతారు.
“ చిన్న భాయి ! హిదేం పాట ?’
“ అది పాట కాదు, గ్రహ పాటు ! మళ్లీ దాపరించాడు ఈ దిక్కుమాలిన దానయ్య !”
“ చిన్నా భాయి, దానయ్య హెవరు ?”
“ వాడా, వాడు మనిషి రూపంలో ఉన్న ఒక సైతాను .”
“ రానీయ్ ! ఆ సైతాన్ని, చేస్తాను కుర్ బానీ వాణ్ని”
కరీం ఖాన్ మాటలకి, అప్పుడే అక్కడకి వచ్చిన దానయ్య జవాబిచ్చాడు, “ మరే నండి, ఆ దానయ్య సైతానుని నేనేనండి. ఆచారి బాబూ , మీరు తలచుకోగానే వచ్చేసానండి. నాకు నూరేల్లు ఆయువు కదండీ !” అంటూ.
“ నూరేళ్ల మాటేమో గాని, నీ ఆయువు మాత్రం గట్టిదే ! ఆ రోజు మురుగన్ మాటలు నమ్మి, లాఠీ దెబ్బ పడక ముందే, గుండె ఆగి చచ్చావని అనుకొన్నాను. చచ్చావో లేదో సరిగా చూడక,”
“ మురుగన్ని ఎందుకలా ఆడిపోసుకోంటారు , నన్ను గోనెలో వేసి, మూట కట్టినప్పుడేనా సూడ లేక పోయారా ?”
“ చూసాన్రా తొత్తుకొడకా ! శ్వాస ఆడ లేదు కాబట్టే, గోనె మూతి బిగించి కట్టాను. ” అంటూనే ఆచారి, గోడకి ఆనించి ఉన్న నిచ్చెన దగ్గరకి అడుగు లేస్తాడు.
“ పల్లెటూరోన్నే అయినా, పేనాయమం తెలిసినోణ్నండి. పావు గంట సేపు ఊపరి బిగపెట్టేయ గలనండి. అలా బిగపెట్టే, మీకు సచ్చినాడిలా కనిపించేలా నాటక మాడేనండి. మీరు గోనె సంచిలో పడేసి కట్టేసినాక, బస్తాని కొరికేసి, సందు చేసుకొని పారిపోయానండి. ”
“ ఈ రోజు నీకా ఛాన్సు ఇవ్వను, నేనే బిగింఛేస్తానా ఊపిరిని.” అంటూ ఆచారి నిచ్చెనని రెండు చేతులతోనూ ఎత్తి, దాన్తో దానయ్యను కొట్టి, క్రింద పడేస్తాడు. క్రింద పడ్డ దానయ్యని తిరిగి లేవనీయకుండా నిచ్చెన రెండు కాళ్ల మధ్య అతని శరీరాన్ని బిగించి, గట్టిగా నొక్కుతాడు.“చూస్తారేం పెద్దా భాయి ! చేసెయ్యి ఈ సైతాన్ని కుర్ బానీ !” అని అరుస్తాడు. కరీం ఖాన్ బేగుని, కౌంటర్లోని టేబిలు మీద పెట్టి, కళ్లజోడు సర్దుకొని, రెండు చేతులూ గ్రద్ద గోళ్లలా విప్పి, దానయ్య మీదకి తెస్తాడు. “ ఒరేయ్ ! సైతాన్ కా బచ్చా ! ఈ చేతుల్తో ఎన్నో కోళ్లని బిస్మిల్లా సేస్తాన్రా ! ముసలీ వాన్నీ అయినా, ఇంకా ఆ పట్టు పోలేదురా-- నిన్నీ రోజు బిస్మిల్లా చేస్తాన్రా ! ” అంటూ దానయ్య పట్టుకొంటాడు.
అదే సమయంలో ఒక కెమేరా ‘ఫ్లాష్’, వాళ్ల మీద పడుతుంది. ఆ ఫ్లాష్ ని ఆచారి, కరీం ఖాన్ లు గమనించ లేదు. కాని దానయ్య మాత్రం, గమనిస్తాడు, వెంటనే “ ఒరేయ్ ! అల్లుడా, ఎంకన్నా ! ” అని అరిచాడు. ఎంకన్న మ్యూజియం లోకి, రెండు చేతుల లోనూ, రెండు, ‘ రామ్ పూరీ’ చాకులతో వస్తాడు. “ ఏయ్ ! ఖాన్ సాయిబూ ! ఎవరు ఎవరిని బిస్మిల్లా, సేస్తారో, సూద్దురు గాని, ముందా సేతులు రెండూ బయటికి తియ్యి,” అంటూ కరీం ఖాన్ని గుంజి, నిలబడతాడు. తర్వాత ఆచారి డోక్కలో కత్తి ఆనించి, “ ఆచారీ ! ఆ నిచ్చెన కింద పడేయ్ ,” అన్నాడు.
ఆచారి నిచ్చెన క్రింద పడేస్తాడు, దానయ్య లేచి నిలబడి కౌంటరు మీద నున్న బేగు చేతిలోకి తీసుకొంటాడు. ఎంకన్న ఆచారి, కరీంలని కత్తితో బెదిరిస్తూ, ఒక మూలకి నిల్చో బెడతాడు. “ మావా ! యీల్లిద్దరినీ కట్టి పడేసి, పోలీసుల్ని పిల్సీ మంటావా ?” అని అడుగుతాడు.
“ వద్దురా, ఎర్రెంకన్నా ! వద్దు , యీల్లని పోలీసులకి అప్పగిస్తే, ఏటొస్తదిరా ? ఆచారి సేత, బొమ్మలు బేరమాడించి నోణ్ని, అసలు బొమ్మలకి, నకిలీ తయారు చేసినోణ్ని, అదేన్రా, ఆ మూల విరాట్టుని అట్టుకోవాల ! ఆడిని పట్టాలంటే, యీల్లని ఇడిసి పెట్టాల,”
“ నీకూ నాకూ దేనికి మావా ! పోలీసోల్లకి సెప్తే, ఆల్లు సూసుకో రేంటి,?” అడిగాడు ఎంకన్న.
“ ఇయి ఉత్తుత్తి ఉత్సవ విగ్రహాలురా ఎంకన్నా ! ఈటిని ఊరేగించి, పోలీసు టేసను కాడికి తీసుకెళ్తే, గుడి కట్టుకు నున్న అసలు బొమ్మ గూడొదిలి పారిపోద్ది.”
“ అయితే ఏటి సేయాలంటావు ?”
“ ముందా ఇద్దర్నీ తీసుకెళ్లి, ఆంజనేయుల వోరి బొమ్మని దాని జాగాలో ఎట్టించి, నకిలీది అట్టుకు రా !”
“ సరే మావా ! ” అంటూ ఎంకన్న, ‘కరీంని’ మ్యూజియం వైపు తిప్పి, నిచ్చెన చేతికిచ్చి, దాని కాళ్లని పట్టుకో మంటాడు. నిచ్చెన రెండో కొసని, ఆచారి చేతి కిచ్చి అతనిని విపరీత దిశలో నిల్చోపెట్టి పట్టుకో మంటాడు. తాను నిచ్చెన మధ్యలో నిలబడి , ఇద్దరి వీపులకి కత్తులు ఆనించి, ఫోలియో బేగు భుజానికి తగిలించు కొంటాడు, “ పదండెహె ! నిచ్చెన జాగ్రత్తగా అట్టుకోండి! సేతినించి కిందికి జారిందా, కత్తి వీపులో దిగి పోద్ది” అంటూ బెదిరించాడు. అప్పుడు దానయ్య ఆచారి దగ్గరకు వచ్చి, “ ఆచారి బాబూ ! సేసిన సండాలపు పన్లు సాలు ! నకిలీ బొమ్మ తెచ్చి నీ చేతికిస్తాం, అదే అసలుదని సెప్పి, నిన్ను నడిపించి నోడితో , ఎవ్వారం నడిపించు. ఏం నాను సెప్పింది అర్దమయిందా ?” అని అడుగుతాడు.
“ అర్థమయింది” అన్నాడు ఆచారి. అతడు ప్లేటు మార్చాడని గ్రహించిన కరీం ఖాన్ ,దానయ్యతో ,“ దానయ్యా ! హిల్లా రా !” అని దగ్గరగా పిలుస్తాడు.
“ ఏం కరీం ఖాన్ సాహెబ్ ! ఏటి కత , కుర్ బానీ సేస్తవా ?”
“ కాదు, నీకీ సలాం సేస్తాను. హిదుగో , నాదీ జేబులో నోట్ల కట్ట ఉంది. ఆ నామాలోడే పెట్టాడు. అదేదో నువ్వే తీస్కొని నాదీ మీదకి హేదీ రాకుండా చూడు.” అంటూ కాళ్ల బేరానికి వస్తాడు. దానయ్య కరీం జేబులోంచి నోట్ల కట్ట తీస్తాడు, ఎంకన్న రథం మ్యూజియం లోకి వెళ్ల్తుంది. దానయ్య చేతనున్న నోట్ల కట్టని చూస్తూ, భావుకుడయి పోయి, తనలో తనే నవ్వుకొని అంటాడు.
“ హు ! ఈ డబ్బు కెంత పవరుంది ! దీని కోసం ఒక వైష్ణపోడు నియమాన్నిడిచి పెట్టి, వినాయకుణ్ని నెత్తికెక్కించు కొన్నాడు. ! మరో సాయబు మతాన్నవతలకి నెట్టి, ఆంజనేయుడి కాళ్ల నట్టుకొన్నాడు ! ఈ హిందూయిజం, ఇస్లామిజం, కమ్యూనిజం, సోసలిజం, ఇసాయిజం, ఇయ్యన్నీ ఇదుగో ఈటి ముందు గడ్డి కన్న, సులకనై ఎగిరి పోతయి ! ఎన్నెన్ని పెనాలికలు, ఎన్నెన్నో రిసెర్చీలు, మనిషి సుకం కోసం, మనోల్లు కనిపెడుతూనే ఉన్నా, -దీని మీద ఆశ సవ్వందే, ఆడేం బాగు పడతాడు !” అని నోట్ల కట్టని కౌంటరు మీద పెట్టి, దానికి దండాం పెడతాడు.“అమ్మా ,లచ్చిం తల్లీ ! నీకో దండమమ్మా, ” అంటూ నోట్లు లెక్క పెడతాడు.
దానయ్య నోట్లు లెక్క పెడుతున్న సమయం లోనే, మ్యూజియం లోపల ఒక దారుణం జరిగి పోతుంది. తల మీద ముసుగు వేసుకొన్న ఇద్దరు ముసుగు వీరులు, ఎంకన్న పైన దాడి చేసి, అతని కత్తులతోనే, అతన్ని పొడిచేస్తారు. ఆ తరువాత ఆ ముసుగు మనుషులు, ఆచారిని, కరీంని తాళ్లతో కట్టేస్తారు.
దానయ్యకి ఇవేమీ తెలియదు. అతను మ్యూజియం లోపల నుంచి మువ్వల చప్పుడు విని, అది లక్ష్మీదేవి గజ్జెల చప్పుడు అనుకొని, తిరిగి భావుకత్వంలో పడి పోతాడు.
“ ఏటిది, ఈ మువ్వల సప్పుడేటి ? ఓహో, లచ్చిందేవి గజ్జెల సప్పుడు కావాల!—పెలయం రావడానికి—ఎక్కడెక్కడో అగ్గి పర్వతాలు పేలిపోయి—సముద్రాలు పొంగి పోనక్కర లేదు ! ఇదుగో ఈ మువ్వల సప్పుడు సాలు ! సిటికెలో అంతా నాసనం, సేయడాన్కి.” అంటూ తిరిగి నోట్ళు లెక్క బెడతాడు, మ్యూజియం లోంఛి మళ్లీ మువ్వల చప్పుడు వినిపిస్తుంది, “ ఈ సప్పుడిని ఆపెయ్యాల ! ఈ సప్పుడు లోని గమ్మత్తైన మత్తుకి, యీ రోజు ‘ కిమ్మత్తు’ లేకుండా చేస్తాను.—’ అంటూ నోట్లకట్టని విడదీసి, ఎగర వేస్తాడు. మువ్వల చప్పుడు ఆగకుండా వినిపిస్తూనే ఉంటుంది. దానయ్య భావావేశంతో క్రింద పడ్డ నోట్లని మళ్లీ ఎగర వేస్తూ ఉంటాడు. మువ్వలు మ్రోగుతూనే ఉంటాయి. దానయ్య నోట్లని ఎగుర వేస్తూనే ఉంటాడు.
అదే సమయానికి మ్యూజియం లోంచి , ఎంకన్న పడుతూ, లేస్తూ, చేత్తో గుండెల దగ్గర అదుముకుంటూ వస్తాడు. ఎంకన్న చొక్కా రక్త శిక్త మయి ఉంటుంది. బాధతో “మావా !” అని పిలుస్తాడు. అతని పిలుపుకి దానయ్య తెప్పరిల్లి, ఎంకన్న వైపు చూసి,,“ ఎంకన్నా ! అల్లుడూ, ఏమయిందిరా, ఏరి రా ,ఆల్లిద్దరూ, ఏరీ ?” అంటూ ఎంకన్నని పట్టుకొని కూర్చో పెడతాడు. ఎంకన్న మ్యూజియం లోపల జరిగింది చెప్తాడు.
“ మావా ! ఏటి సెప్పమంటావు మావా ! ఆల్లిద్దరినీ తోలుకొని లోపలి కెల్లేసరికి, ఎవురో ముసుగులు వేసుకొన్నోళ్లు, ఎనక నుండి, నా మీదే ఇరుసుకి పడి , నా కత్తులు నాకే గుచ్చేసారు మావా ! ఆల్లిద్దరూ , ఆల్ల తోటే కల్సి పారి పోయినారు కావాల ! మావా, కళ్లు తిరుగుతున్నాయి. మావా, అంతా మసక మసకగా ఉంది, దాహం దాహం ! నోరెండి పోతోంది., మావా నీళ్లియ్యి--- ”
“ ఒద్దురా ఎంకన్నా ! విప్పుడు నీళ్లు తాగొద్దు, చిటం పోయాక తాగుదువు గాని, సూడు – సూడొరే ! నా కల్లలోకి సూసి చెప్పు, --- నిన్ను పొడిసిందెవరు, సెప్పు, సెప్పరా ? పొడిసి నందుకు ఆడికి రేపు పొద్దు పొడవనీకుండా సేస్తాను—”
“ మావా ! కత్తి తగిలి, కింద కొరిగి పోతూ సూసాను.వాడి బుర్రకి ముసుగుంది, ఆడేవుడో ఎలా సెప్పమంటావ్ ? ఆ ! మావా ! ఆడి కాళ్లకి గజ్జెలునాయి గావాల ! పారి పొతుంటే ఒకటే మువ్వల సప్పుడు ---”
“ గజ్జెలా ! గజ్జెలా ! మువ్వలా !! ఓరి దేవుడో ఎంత మోసపోనాను నేను ! ఓరి ఎంకన్నా, అది గజ్జెల సప్పుడు కాదురా, అది మువ్వల మోత కాదురా ఎంకన్నా ! అదొక మీటరు సప్పుడురా ! ఆ మీటరుని బొమ్మల కానించి, మీట నొక్కుతే సాను , కంచు కొత్తదైతే అలారం లాగ, కొంచెం పాతదైతే గంట లాగ, ఎంతో పాతవైతేనే మువ్వల్లాగ సప్పుడొస్తదిరా ! ఓరి దేవుడో !” అని నెత్తి బాదుకొంటూ “ నే నెంత మోసపోనాను ! ఆ సప్పున్నేటో అనుకొని , పిచ్చోడిలా ఏటేటో పేలాను. ఆ దొంగెదెవ నిన్ను పొడిచేసి, మ్యూజియం లోని ఇలవైన పాత బొమ్మలన్నీ దోచుకు పోయాడు కావాల ! – ఎంకన్నా , ఆడిని కసింతైనా సూడలేక పోనావా ?” అంటూ ఎంకన్నని తట్టి, “ ఒరే ఎంకన్నా ! అల్లుడూ నీకేటయిందిరా ? ఎలాగున్నాది ?” అని అడిగాడు.
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment