( నిన్నటి టపాలో జరిగిన కథ---- మొసలి కొలని మ్యూజియంలో ఉన్న పంచముఖి ఆంజనేయుని విగ్రహానికి నకలు తయారు చేయించి, దానిని అసలుతో మార్చి వేసేందుకు ఆచారి,ఆ మ్యూజియం పర్యవేక్షక గుమాస్తా కరీఖాన్తో కలసి లోపలికి వెళ్టాడు. అప్పుడే హనుమాన్ చాలీసా వినిపిస్తుంది. దానిని పాడుతున్న దానయ్య వస్తాడు .అతన్ని చూసిన ఆచారి కోపంతో ఊగిపోతాడు. కరీంఖాన్ దానయ్యని పీక పిసికి చంపెయ్యాలని ప్రయత్నిస్తాడు. అదే సమయానికి దానయ్య అల్లుడు ఎంకన్న వస్తాడు. ఆచారినీ, ఖాన్’నీ కత్తితో బెదిరించి ,విగ్రహం లోపల పెట్టించేందుకు తీసుకొని వెళ్తాడు. దానయ్య ఆచారి తెచ్చిన సూట్’కేసులోని డబ్బుని లెక్కపెడుతూ ఉంటాడు. అదే సమయంలో ఎవరో ముష్కరులు ఎంకన్నని పొడిచి, ఆచారినీ ఖాన్;నీ బంధించి , మ్యూజిఅయం లోని విగ్రహాలని తీసుకొని పారిపోతారు. విషయం తెలుసుకొన్న దానయ్య ఆ విగ్రహాలని తలచుకొని విచారిస్తాడు --- ఇక చదవండి )
మొసలి కొలని మ్యూజియం---14
“ ఏటన్నావు మావా ! ఏటని పిల్సినావ్, ఓరల్లుడా అనా ! ఎవురు మావ, ఎవురు అల్లుడు, -- నీకా, పేనం లేని బొమ్మల్ మీదున్న ఇది, పేనం పోతున్న మడుసుల మీదుండదా ? అమ్మా ! దాహం , నోరెండి పోతున్నాది, దాహమిచ్చినావా ? ఆ ! అసలు నువ్వు నా మావవేనా ? –కాదు,నా మావ సదువు లేనోడు, బొమ్మల గట్టితనం తప్ప, కమ్మదనం తెలీనోడు ! – ఆడు నువ్వు కాదు, నువ్వు ఆడు కాదు, -- అమ్మా !” అంటూ మగత లోకి జారి పోయాడు ఎంకన్న.
అప్పుడు పోలీసు విజిల్ వినిపిస్తుంది. దానయ్య ఆ విజిల్ విని ఎలర్ట్ అవుతాడు.
“ ఒరే ఎంకన్నా ! నన్ను సెమించరా, నిన్ను ఈ మగతలో దేవుడి మీద భారం వేసి, పోలీసోల్లకి అప్పసెప్పి, ఎల్తన్నాను. నన్నేటీ సెయ్యమంటవురా ? నేను ఇప్పుడిప్పుడే ఆల్ల కంటికి కనపడ కూడదు. నీ మావకి మమకారం తప్ప, మరొకటి లేదన్నావు. బొమ్మల గట్టితనం తప్ప, కమ్మదనం తెలీదన్నావు ! నిజమేన్రా, నేను నీ మావ దానయ్యని కానురా ! నాకు-- నాకీ -- బొమ్మలే పేనంరా ! కారనం ఏటని అడక్కొరే, ఈ మడుసుల్లో కసాయి తనం తప్ప, కమ్మ తనం కనిపించక, నేనీ బొమ్మలెనక పడ్డాను. ఒరేయ్ ఎంకన్నా ! నీ మావ దానయ్యకీ, ఈ దానయ్యకీ అదెన్రా తేడా ! నన్ను సెమించరా !” అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకొంటాడు. పోలీసు విజిల్ దగ్గరగా వినిపిస్తుంది, దాంతో దానయ్య గాభరాతో, గేటు దాటి, పారి పోతాడు,
దానయ్య మ్యూజియం బయట పడగానే, పోలీసులు మ్యూజియం లోకి ప్రవేశిస్తారు. ఇనస్పెక్టర్ గోపాల్రావు , కానిస్టేబిల్ టు నాట్ త్రీ, ఎంకన్నని చూసి, కొన ఊపిరి ఉందని నిర్ధారణ చేసి, ఆ స్థలాన్ని ఫొటోలు తీసి, నోట్ల్ నన్నిటినీ ఏరి కట్ట కట్టి, అక్కడున్న ప్రొపర్టీసు అన్నీ, స్వాధీనం చేసుకొంటారు. ఎంకన్నని ఆస్పత్రికి పంపిస్తారు.
‘ పురావస్తు గత చరిత్ర ’ అనే సబ్జెక్టుతో, ‘ పినాక పాణి ’ అనే అతను పంపిన ‘ ఈ మెయల్’ వంక కుతూహలంతో చూసాడు ఇనస్పెక్టరు గోపాల్రావు.
‘ మ్యూజియంలో దొంగలింప బడిన వస్తువుల ఆచూకీ తెలుసుకోవా లంటే , ఆ వస్తువులకి సంబంధించిన గత చరిత్రాంశాలు కొంత వరకు అధ్యయనం చేయడం ముఖ్యం. ప్రధానంగా వినాయక విగ్రహం, ఏడు ఆకుల అరటి చెట్టు, మూడు దీపపు సెమ్మాలు, పంచ ముఖ ఆంజనేయుని విగ్రహం వాటిలో కొన్ని!. అవి ఎవరు తయారు చేసారు ? వాటి విలువ ఎంత వరకు ఉండ వచ్చు ?
పై ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే , దీనితో పాటు ఎటాచ్ చేసిన ఫైలు తెరచి చూడండి,’ అని ఉందా మెయిల్లో ! ఇనస్పెక్టరు గోపాల్రావు కాసేపు ఆ ‘ మెయిల్ ’ వంక చూస్తూ, చదివిందే చదువుతూ, ఉండి పోయాడు. ‘ మొసలి కొలను ’ మ్యూజియంలో , వాచ్ మెన్ ఎంకన్నను తీవ్రంగా గాయ పరచి, తస్కరించిన వస్తువులలో, అందులో ( ఆ ఈ మెయిల్లో ) వ్రాసిన వస్తువులే ఉన్నాయి. పైగా అది తనకి పంపించారంటే, ఉద్దేశ పూర్వకంగానే, పంపించి ఉంటారు. పంపిన వ్యక్తి, ‘ పినాక పాణి ’ అనేది నిజమైన పేరు అయి ఉండదు. ఇంతకీ ‘ దాని వెనుక దాగి ఉన్నది’ చూడాలా ,వద్దా.? అన్న మీమాంసలో పడి, చివరికి చూడడమే సబబు అన్న నిర్ణయానికి వచ్చి, ‘ మౌసుతో’ ఆ ఫైలుని తెరిచాడు గోపాల్రావు.
అవి ‘కాకతీయ సామ్రాజ్యం అంతరించిన రోజులు. క్రీ : శ : 1325 నుండి, 1335 ల మధ్య కాలం. దక్షిణాపథం ( దక్ లన్ ) దక్షిణ ( తమిళ ) దేశం; ఢిల్లీ సుల్తాను సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. వీటిని ‘ దేవ గిరి; తిల్లింగ్ ( తెలంగాణా ) ; కంపిలి; ద్వార సముద్రం; మాబర్ ( మధుర ) అనే అయిదు రాష్ట్రాలుగా విభజించి, ఢిల్లీ సుల్తాను పరిపాలించాడని ముస్లిం చరిత్ర కారులు చెప్తారు.
ఆ రోజులలో అరాజక పరిస్థితి ద్రవిడ దేశంలో ఏర్పడింది. కొన్ని తామ్ర శాసనాల కథనం ప్రకారం, దేశం తురుష్కుల వశం అయిన తరువాత ధనవంతులు , ధన నిమిత్తం పీడించ బడినారనీ. ద్విజులు తమ యఙ్ఞ కర్మలను వదులు కోవలసిన వారైనారనీ, దేవ ప్రతిమలు సమస్తం, భగ్నమై పోయాయని, తెలుపుతోంది. అంతేగాక, అగ్రహారాలన్నీ అపహరింప బడినాయనీ, తురుష్కులు పంట, పర్యాయాలన్నీ బలాత్కారంగా లాగు కోవడం వల్ల, దరిద్రులు , ధనికులు అనే భేధం లేకుండా పోయిందనీ, రైతు కుటుంబాలు నాశన మయాయనీ, చెప్తూంది. ఇంకా, ‘ఆ మహా విపత్కాలంలో ధనం, భార్య మొదలైన వేటితోనూ, ప్రజలకు స్వాయత్తతా భావం ( ఇది నాది అనే భావం ) పోయింది.’
‘కల్లు త్రాగ వలెను, ఆవు మాంసం తిన వలెను, స్వచ్ఛంధ విహారం చేయ వలెను, బ్రాహ్మణు లను చంప వలెను’, ఇదీ పాలకుల నీతి !! వారి వ్యాపార మిట్లున్నప్పుడు , భూమి మీద ప్రాణి కోటి బ్రతికేదెట్లు ? త్రిలింగ దేశాన్ని రక్షించే దెవరు ? అనే విషయం మనస్సునకు కూడ తట్టక, కార్చిచ్చు చుట్టుకొన్న అడవి వలె, సంతాపించి పోయింది. అని ‘విలస్’ తామ్ర శాసనం, నాడు ఆంధ్ర దేశంలో సంఘాన్ని ఛిన్నా భిన్నం చేసిన ఒక దారుణ పరిస్థితిని వివరించింది.
ద్రావిడ దేశం పరిస్థితి ఇంత కన్న శోచనీయంగా ఉన్నట్లు ‘ మధురా విజయం ’ అనే గ్రంధం వల్ల తెలుస్తోంది. అక్కడ పూజా పురస్కారాలు నిలిచి పోయి, దేవాలయాలు పాడు పడి పోయాయని, అగ్రహారాలు నాశనం కావింప బడ్డాయని, మనుష్య కపాల మాలికలు, ఎక్కడ చూసినా వ్రేలాడు తున్నాయనీ, గోవుల రక్తం వల్ల ‘ తామ్స పల్లి’ నీరు ఎర్రనై పారుతున్నదనీ, ఆ గ్రంధం వర్ణించింది. ‘ వేదం విస్మరింప బడింది, ధర్మం దాగింది, న్యాయ ఔదార్యాలు భూమిలో ఎక్కడా కనుపించవు. దిక్కు లేని ద్రావిడల ముఖాలలో నిరాశ నెలకొంది’ అని మథురా విజయ గ్రంధకర్త ‘ గంగా దేవి’ కళ్ళకు కట్టినట్లు వర్ణించింది.
ఇలా అరాచక స్థితికి లోనైన దక్షిణ భారత దేశానికి ముస్లిం దురాక్రమణ నుంచి, విముక్తి కలిగించడానికి, ‘ కాకతి ప్రతాప రుద్రుని సేనాను లయిన తెలుగు నాయకులు, ఆంధ్ర దేశం లోను , కర్ణాటక పాలకుడైన మూడవ బళ్లాలుడు ద్రావిడ, కర్ణాటక దేశాల లోను విముక్తి ఉద్యమాలను నడిపారు.
ఆంధ్ర దేశంలో, కాకతీయ ప్రతాప రుద్రుని సేనాధిపతులలో , రాజకీయోద్యోగులలో, పెక్కురు దండయాత్రలలో మరణించగా మిగిలిన ఆంధ్ర నాయకులు, దేశానికి మహమ్మదీయ పాలన నుంచి విముక్తి కలిగించాలనే ఏకైక లక్ష్యంతో , ఏకమై ఒక విధమైన రాజకీయ సమాఖ్యగా ఏర్పడినారు. వీరికి ‘ ముసునూరు ప్రోలయ నాయకుడు, అతని పిన తండ్రి కొడుకైన కాపయ నాయకుడు నాయకత్వం వహించారు. ప్రతాప రుద్రుని సేవలో ఉండిన డైభ్బై అయిదు నాయకుల సంతతిలో కొందరు, మంచికొండ గణపతి నాయకుడు, మొదలైన కమ్మ నాయకులు , అద్దంకి వేమారెడ్డి వంటి రెడ్డి నాయకులు, ఈ లక్ష్య సాధనలో, ప్రోలయ నాయకునికి బాసటగా నిలిచారు.
ఈ ఆంధ్ర దేశ విమోచనోద్యమము యొక్క వివరాలు , కథలు, వంశావళులు, గేయ గాధలు, చాటువులు, స్థానిక చరిత్రల, కడతెలు, తామ్ర శాసనాలు, ముస్లిం చరిత్ర కారులు , కైఫియతు ద్వారా తెలుస్తోంది.
అలా ఏర్పడిన రాజకీయ సమాఖ్యలో తొలుత సభ్యుడుగా , ఆ తరువాత నాయకుడిగా కీలక పాత్ర పోషంచిన వ్యక్తి ,కాంస్య శిల్పి దనంజయ నాయకుడు.
దనంజయుడు శిల్పము, నాట్యము, చిత్ర లేఖనము, లాంట లలత కళలలో పాటు అతడు
అశ్వారోహణము, గజారోహణము, ఖడ్గ చాలనము, మల్ల యుద్ధము, వంటి సమర కళలను కూడా అభ్యసించాడు.
ధనికులు దోపిడీకి గురవుతున్న ఆ రోజులలో, తమ సంపదను దాచుకొనే మార్గం తెలియక కొట్టు మిట్టాడుతున్న సమయంలో , కంచు బొమ్మలు తయారు చేసి, ఎన్నికైన వాటిలో రహస్యమైన అరలు ఏర్పాటు చేసి, రహస్యమైన సంకేతంతో అవి తెరచుకొనే ఏర్పాటు చేసి, ఆ అరలలో రత్నాలు, మణులు, వజ్రాలు, దాచి, దోపిడీ దొంగల బాధనుండి తప్పించుకోగల ఉపాయం కనిపెట్టి, దానిని అమలు పరచాడు అతను ! ఏడాకుల అరటి చెట్టులో ,ఆకుకి మూడు చొప్పున ఇరవై ఒక్క మణులు, అదే విధంగా పంచ ముఖి ఆంజనేయుని విగ్రహంలో, ముఖానికొక వజ్రాన్ని, దీపపు సెమ్మాలలో ముత్యాలు, పగడాలు, లాంటి రత్నాలని దాచే వాడు. దోపిడీ దార్లు బంగారు , వెండి, కాసులు మాత్రమే దోచుకొని పోయేవారు. కాని కంచు బొమ్మలు పట్టూకు పోయే వారు కాదు. కాబట్టి ధనంజయుని యుక్తి ఫలంచి అతనికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.
అలా ధనంజయుని సహాయం పొందిన వారిలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె పేరు ‘ అని తల్లి.’ అనితల్లి అపురూప సౌందర్యవతి. చంద్ర బింబము లాంటి ముఖము, కలువల కొలను లాంటి కళ్లు, ధనస్సు లాంటి కనుబొమలు, సంపెంగ మొగ్గ లాంటి నాసిక, శ్రీకారాల లాంటి చెవులు, లక్క పిడత లాంటి నోరు, ఎర్రని బింబాధరాలు, తెల్లని ముత్యాల లాంటి పలు వరస, నవ్వితే సొట్టలు పడే బూరి బుగ్గలు, శంఖం లాంటి మెడ, ఉన్నతమైన కుచ కుంభాలు, , సింహ మధ్యమం లాంటి నడుము, రంభా స్తంభాల లాంటి తొడలు, లోతైన నాభి, అరటి దవ్వల వంటి చేతులు కలిగి సర్వజన నయన మాదకమైన సౌదర్య ప్రదర్శన శాల వలె ఉండేది.
అనితల్లి దేవదాసి !.బాల్యం లోనే ఆమె ముఖ కవళికలను గుర్తించి ఆమె గొప్ప సౌందర్యవతి కాగలదని అంచనా వేసిన రసిక జనాగ్రేసరుడయిన ఆ ఊరి మునసబు, పేదవారైన ఆమె తల్లి తండ్రులను ఒప్పించి, వెండి చెప్పుతో మర్దించి, ఎనిమిదేళ్ల వయసులోనే, ఆమెని, ప్రౌఢత్వం నుండి, వార్థక్యం లోకి జారుకొంటున్న ఆ ఊరి దేవాలయ జోగినికి ( దేవదాసికి ) ఆమెను తెచ్చి అప్పగించాడు. జోగిని తనకి తెలిసిన ఆట పాట అనితల్లికి నేర్పించి, ఆ పైన సాంప్రదాయ నాట్యం నేర్పేందుకు గురువుల దగ్గరకి పంపించింది. ఆమె జోగిని కానున్నదన్న విషయం తెలిసిన గ్రామ పెద్దలు, అమెకి కన్నెరికం చేసేందుకు పోటీలు పడ్డారు. ముందుగా గజ్జె పూజ చేసి, దేవాలయ ప్రాంగణంలో తన నృత్య విన్యాసాలు ప్రదర్శించి, భక్తిని రక్తిని కలబోసి నర్తించి, ప్రథమంగా గురువుకే తన కన్నెరికాన్ని సమర్పించింది ఆమె. ఆ పైన తక్కిన వారు ఆమెను ఎగరేసుకొని పోయి అందలా లెక్కించారు.
రసికులు ఇనప గజ్జెల తల్లి కౌగిట చేరిన కారణంగా, అనితల్లి సంపాదన నిల్చి పోయింది కూడ బెట్టిన సంపదని కంచు బొమ్మలలో దాచేందుకు , ధనంజయుని దగ్గరకి వచ్చింది అనితల్లి. అతని చూసిన ఆమె, ఆమెని చూసిన అతను, ఒకరి కోసమే ఒకరు అన్నంత తాదాత్మ్యతను చెంది, గాఢ పరిష్వంగంలో ఏకమై, ఆనందానుభూతిని పొందారు. అందని దూరంలో ఉండేదే అందం ! అందల మెక్కించ గల వాడే రసికుడు! అన్న భావన నుండి దూరమై, నచ్చిన నాయకునికి నివేదన చేసేదే అందము ! దరి చేరిన నాయికను ప్రణయ పరష్వంగంలో ముంచెత్తి, కామ క్రీడలలో ఓల లాడించ గల వాడే రసికుడు అన్న వాస్తవాన్ని తెలుసుకొంది అనితల్లి.
( తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment