(నిన్నటి టపాలో జరిగిన కథ----- గాయపడిన ఎంకన్నను ఆస్పత్రిలో చేర్పించిన ఇనస్పెక్టర్ గోపాల్రావు తనకి వచ్చిన ఈ మెయిల్ చూస్తాడు. ఎవరో పినాకపాణి అనే వ్యక్తి పంపిన మెయిల్ అది. దానిలో మ్యూజియంలో దొంగతనం అయిన బొమ్మల గురించి వాస్తవాలు తెలుసుకోవాలంటే ఆ మెయిల్ని చదవాలని వ్రాసి ఉంటుంది. ఇనస్పెక్టర్ గోపాల్రావు దానిని చదువుతాడు. దక్షిణాపథాన్ని తురుష్కుల చేతినుండి తప్పించడానికి ప్రోలయ వేముని నాయకత్వంలో నాయక రాజుల కూటమి ఏర్పాడుతుంది. వారిలో ధనంజయ నాయకుడు ఒకడు. అతడు కాంస్య శిల్పి కూడా. తన సంపదని తురుష్కుల బారి నుండి కాపాడుకోవడనికి అనితల్లి అనే దేవదాసి ధనంజయుని దగ్గరకు వస్తుంది. వారిరువురికీ ప్రేమ ఏర్పడుతుంది--- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం--15
అందానికి నిర్వచనమే అనితల్లి, ఆమె కడకంటి చూపులే మన్మధ శరాలు, నడుము వంపులే నాట్య విన్యాసాలు, బింబాధర చుంబనమే అమృత రసాస్వాదనము, గాఢమైన కౌగిలే స్వర్గమని తలచాడు ధనంజయుడు. ఆమె చెప్పిన దానిని ఎంతో తత్పరతతో నెరవేర్చాడు. రకరకాల కంచు బొమ్మలు, కళా కృతులు, ఆమె ప్రతి బింబాలలా చేసాడు. అనితల్లి అతని సాంగత్యంలో సంపాదన మాట మరచి, సంసారిక విషయాల పట్ల ఆసక్తి చూపించింది. ఈత, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, సాము, గరిడీలు నేర్చుకొంది. ధనంజయుని దగ్గర. కాని ఆ ప్రేమిక మిథునం యొక్క ఆనందం ఎంతో కాలం నిలువ లేదు !
అనితల్లి సౌందర్య ప్రశంస , ‘ సముద్ర దొంగ అయిన , నరసింహ సంబువ రాయలు ’ చెవిన పడింది. ఆమెను ప్రత్యక్షంగా చూడడానకి, ‘ తుంగ భద్ర ’ నదిలో తన పడవను తెచ్చిన సంబువ రాయలికి, ఆ నదీమ తల్లి ప్రవాహంలో ఈత కొడుతున్న, అనితల్లి కంట పడింది, జలకీడ లాడుతూ, తడిసిన మేనితో, అప్సరసలని దిక్కరించే అంద చందాలతో, కనబడి అతనికి మత్తెక్కించింది. సంబువ రాయలు మదన తాపానికి తట్టుకోలేక పోయాడు.
సంబువ రాయలు వార్థక్యపు ఒడ్డున నిలిచిన మనిషి. అతని వయసు అరవై అయిదు సంవత్సరాలు. ఆరుగురు భార్యలున్నా సంతానం పొందలేని నిర్భాగ్యుడు. సంతాన లేమి అన్న విషయం ప్రక్కన పెడితే, సంపాదనలో అతను చక్రవర్తి తుల్యుడు. కరుణ జాలి లాంటి, పదాల అర్థం తెలియని, క్రూరాతి క్రూరుడైన గజదొంగ. అతని నాయకత్వంలో సుశిక్షుతు లైన అయిదు వందల మంది, దొంగలు, శస్త్రాస్త్రాలు ధరించి, నిరంతరము అతని కనుసన్నల నుండి వెలువడే ఆదేశాలను అమలు పరిచేందుకు సంసిద్ధమయి ఉండేవారు.
అనితల్లికి స్ర్తీ సహజమైన , ‘ రూప, హయ, వినయ, క్షమల, ’లాంటి సరళమైన సౌమ్యగుణాలే కాక, ‘ధావన, అశ్వారోహణ , ఖడ్గ చాలన’ లాంటి, పౌరుష గుణాలు కూడా ఉండడం అతనికి ఎంతగానో నచ్చింది. సంతానాన్ని పొందితే, అది ‘అనితల్లి,’ దగ్గరే పొందాలని, ఆమె మాత్రమే తన లోటుని నింపగల సామర్థ్యం గల వనిత అని, సంబువ రాయలు అభిప్రాయ పడ్డాడు.
అంతే ! కనుసన్నలలో మెలిగే తన అనుచరులకి, ఆదేశాలు అందాయి. మోసంతో కపటంతో, దొంగల లాగే, ఆమెని, ఆమె ప్రియునితో సహా, అపహరించమని ఆఙ్ఞని ఇచ్చాడు. ప్రియుడెందుకు, అని అడిగిన తమ్మునితో, ప్రియుడు బయట ఉంటే, ఆమెని విడిపింఛే ప్రయత్నం చేస్తాడనీ, ఆమెతో పాటు తన దగ్గరే ఉంటే, అతని ఉనికి కోసమైనా, తన మాట వింటుందనీ, అంతే కాక, ఆ ప్రియుని ద్వారా, సంపద రక్షించుకొనే పనులు చేయించుకో వచ్చనీ, వాడిని బానిసలా వాడుకోవచ్చనీ చెప్పాడు.
సంబువ రాయిని పథకం పారింది. ఒక వెన్నెల రాత్రి, మేడ మీద ప్రణయ లీలలలో మునిగి తేలి, గాఢమైన నిద్రాదేవి పరిష్వంగంలో, పూర్తిగా, మునిగి పోయిన ఆ ప్రేమిక మిథునాన్ని, త్రాళ్లతో కట్టి, బంధించి, పడవ లోకి ఎక్కించారు ఆ సముద్రపు దొంగలు. అలా వారిద్దరినీ బంధించి తెచ్చి, తమ నాయకుని దగ్గర ఈనాములు పొందారా ముష్కరులు !
అనితల్లికి, సంబువ రాయలు లాంటి, అరవై అయిదేళ్ల రసికులు క్రొత్త కాదు. కాని జీవితంలో తొలిసారి ప్రేమలోని మాధుర్యాన్ని, చవి చూసిన ఆమె యీ అపహరణని భరించ లేక పోయింది ధనంజయుని తాను ప్రేమించాననీ, తామిద్దరూ వివాహితులనీ, తన గర్భంలో అతని ప్రేమ ఫలం పెరుగుతోందనీ, చెప్పి, తన సంపద నంతా తీసుకొని, తనని ప్రియునితో పాటు,.వదిలి వేయమనీ చెప్పి, కన్నీరు మున్నీరుగా విలపించింది.
సంబువ రాయుని గుండె ‘రాయి కాదు, రాయి అయితే’ కరిగి ఉండేదే ! అది కంచు కంటె కఠినమైనది. అనితల్లి దీనాలాపాలకి, అతనికి నవ్వు వచ్చింది. “ ఏమన్నావు ? నిన్ను వదిలెయ్యాలా ! అది కూడా ప్రియినితో పాటు !! దానికి బదులుగా నీ సంపాదన అంతా ఇచ్చేస్తావా ? ! ఈ సంబువ రాయినికి దానమిచ్చినది తీసుకోవడం తెలియదు, అడగడం అంత కన్నా తెలియదు. నీ సంపదను నువ్విచ్చేదేమిటి ? నేను అదెప్పుడో దోచుకొన్నాను, ఇక నీ దగ్గర మిగిలింది నీ రూప సంపద మాత్రమే ! దాన్ని కూడ దోచుకోగలను, కాని అది నువ్విస్తేనే బాగుంటుంది ! అందుకు నీ గర్భం లోని ప్రేమ ఫలం అడ్డని చెప్తున్నావు ! ఆ ఫలాన్ని తీసేస్తే, నీ ప్రియుని ఙ్ఞాపకాలు, పోతాయి. ముందుగా ఆ పనిని, చేయనియ్యి.! అంటూ తన భార్యలకి ఆఙ్ఞనిచ్చాడు.
ఫలితం ! అనితల్లి, తన గర్భస్థ పిండాన్ని పోగొట్టుకొని, అయిదారు వారాల లోనే, తిరిగి తన జవసత్వాలను పుంజుకొంది. మొదటిసారిగా పురుషుని క్రౌర్యాన్ని చవి చూసిన, అనితల్లికి ప్రతిఘటన చేసి ఫలితం లేదనీ, సమయం కోసం ఎదురు చూడడమే మంచిదని, అర్థం చేసుకొంది. సంబువ రాయునికి లొంగి పోయింది.
సంబువ రాయుడు, ధనంజయునికి సంకెలలు తగిలించాడు. పడవ నడిపే కళాసుల మధ్య, కూర్చోబెట్టి, కొరడాలతో కొట్టించాడు. పడవని వాళ్లతో పాటు తెడ్లు వేసి నడిపిస్తూ ఉండమని ఆదేశాలు జారీ చేసాడు.
ధనంజయునికి, తన పరిస్థితి, అనితల్లి పరిస్థితి అర్థమయింది. సరి అయిన సమయం వచ్చే వరకు ఆత్మ సమర్పణ తప్పదని నిశ్చయించుకొని, కళాసులతో పాటు తెడ్డు వేసాడు. వారందరి తోనూ కలిసి పోయి, పని తప్ప మరేమీ ఎరుగని వారికి, కథలు, చాటువులు, చెప్పాడు. పాటలు పాడి పశంసలు పొందాడు. క్రమంగా వారికి నాయకుడు అయ్యాడు !
అలా ఆరు నెలలు గడిచింది.
ఆ ఆరు నెలలలో అనితల్లిని , ఒక్క రాత్రి కూడ వదలక అనుభవించినా, సంబువ రాయుడు ఆమెను తల్లిని చెయ్యలేక పోయాడు, సంతానాన్ని ఇస్తుందనుకొన్న ,‘అనితల్లి’కూడా నిరాశ పరిచే సరికి, సంబువ రాయునికి మొదటిసారిగా విషాదం కలిగింది. ! ‘నాకు వారసుడెలా కలుగుతాడు, అందుకేమి చేయాలి ?’
దొంగల గురువైన, ‘ వల్లభుని’ దగ్గరకు వెళ్లాడు సంబువ రాయుడు.అనితల్లిని కూడా తీసుకొని. వల్లభుడు అతని సమస్యనంతా విన్నాడు. “ అనితల్లి గర్భ విఛ్ఛిత్తి చేసి, భ్రూణ హత్యని చేసావ్ ! సంతానాన్ని, కనలేక పోవడం నీ స్త్రీల తప్పు కాదని, నీ కెందుకు అర్థం కాదు ! లోపం నీ లోనే ఉంది ! నీ వయసు కూడా ఉడిగి పోతోంది, అందుకని ఎవరినైనా తెచ్చి, పెంచుకో ! అనితల్లినే గాని బిడ్డని కననిచ్చి ఉంటే, ఆ బిడ్డ నిన్ను నాన్నా అనే పిలిచేవాడు కదా ! ఆ అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకొన్నావు !” అని మందలించాడు.
(తరువాయి భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment