(నిన్నటి టపాలో జరిగిన కథ---- అనితల్లి ధనంజయ నాయకుల ప్రణయం ఎంతో కాలం సాగలేదు . కారణం సముద్ర దొంగ అయిన సంబువ రాయుడు అనితల్లి మీద మోజుపడి వాళ్లిద్దరినీ మోసంతో అపహరించడమే ! సంబువ రాయుడు ధనంజయుని బంధించి అనితల్లిని వివాహమాడాడు. ఆమె గత్యంతరం లేక ఒప్పుకొంది. సంబువ రాయుడు అనితల్లి గర్భాన్ని విచ్చిత్తి చేసి, ఆరు నెలల పాటు ఆమెతో కాపురం చేసినా సంతతి కలగక పోవడంతో తన గురువు వల్లభుని దగ్గరకు సలహా కోసం వెళ్తాడు. వల్లభుడు ఆమె గర్భాన్ని పోగొట్టినందుకు అతనిని మందలిస్తాడు.---- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం ---16
“ గురు దేవా ! ఇంకేదైనా మార్గం చూపించండి.”
“ ఒకే ఒక మార్గం ఉంది. నీ రాణులలో, ఈ అనితల్లి మాత్రమే గర్భధారణ చేసే వయసులో ఉంది. ఇది వరకు గర్భం ధరించింది కాబట్టి, ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు ! అయితే ఆమెకు గర్భాదానం చేసే సామర్థ్యం నీలో లేదు ! కేవలం భోగ్య వస్తువుగా అనుభవించే మగతనమే నీకు ఉంది.. అందుకని నీవు ఒక పని చెయ్యి. న్యాయాన్యాయ విచక్షణ,, ఉచితానుచిత విచక్షలని ప్రక్కకి నెట్టి, సంతాన భాగ్యాన్ని పొందడం కోసం, దోపిడీ చెయ్యి, అది నీకు అలవాటు కదా ?!”
“ మీ మాటలు నాకు అర్థం కాలేదు గురువర్యా , ఎక్కడ దోపిడీ చెయ్యాలి ?!”
“ దోపిడీ చెయ్యాల్సింది సంపదని కాదు, సంతానోత్పత్తి చేయగల పురుష బీజాన్ని ! దానిని తెచ్చి, అనితల్లి గర్భంలో దాచాలి ! అప్పుడే నీ సంతానేచ్చ తీరుతుంది. ”
“ అదెలా సాధ్యం గురుదేవా ?”
“ అది కూడా వివరంగా చెప్పాలా ? అనితల్లికి ఇంకొక పురుషునితో గర్భాదానం చేయించు. నీవు పవిత్రుడివి ఎలా కావో, అలాగే,‘ అది ’ కూడా పతివ్రత కాదు ! అందుకని సందేహించ వద్దు. అది వినా మరో మార్గం లేదు,” అని కుండ బద్దలు కొట్టినట్లు నిష్ఠూరమైన నిజాన్ని చెప్పాడు వల్లభుడు.
“ నా తమ్మునితో చేయించ మంటారా ?”
“ వాడితో చేయిస్తే అది తల్లి కాగలదన్న,నమ్మకం ఏమిటి ? వాడికీ ఉన్నారు ఇద్దరు రాణులు ! కాని సంతానం ఎక్కడ ? ఇంతకీ నీది, నీ తమ్మునిదీ జన్మ రహస్యాల వైనం నీకు తెలుసా ?” అని అడిగాడు వల్లభ గురువు..
“గురుదేవా!శాంతించండి, నా కోటలో గాని ,నా పడవలో గాని,‘దీనిని’తల్లిని చేయగల యోగ్యుడైన పురుషుడు ఎవరున్నారు ? మీకు అంతా తెలుసు, అందరూ తెలుసు, మీరే సెలవియ్యండి ”
“ నేనేం చెప్పగలను ? ఉత్తమ సంతానం కోసం, ఒక పురుషోత్తముణ్ని ఎంచి తీసుకు రావలసిన భాద్యత నీది ! అందుకే దోపీడీ చేయమన్నాను !”
వారిద్దరి సంభాషణ అనితల్లి వింటూనే ఉంది. ఆమెకి ఆ సంభాషణ వినోదంగానే ఉంది !చివరికి గురుదేవుడన్న పురుషోత్తముడన్న వ్యాఖ్య విన్న తరువాత, ఆమెకి ధనంజయుడు గుర్తుకి వచ్చాడు. ఆ తరువాత సంబువ రాయుడి ప్రశ్న, “గురుదేవా ! శాంతించండి, నా కోటలో గాని , నా పడవలో గాని, ‘ దీనిని’ తల్లిని చేయగల పురుషుడు యోగ్యుడైన పురుషుడు ఎవరున్నారు ? మీకు అంతా తెలుసు, అందరూ తెలుసు, మీరే సెలవియ్యండి ” అన్న అభ్యర్థన గుర్తుకి వచ్చింది. వెంటనే వచ్చిన అవకాశాన్ని వదులుకో కూడదని అనుకొంది. సిగ్గు విడిచి నోరు విప్పింది, “ గురుదేవా ! ఈ సమస్యకి నా దగ్గర ఒక ప్రస్తావన ఉంది, మీరు అనుమతి నిస్తే ---” అంటూ ఆగింది.
“ చెప్పు అనితల్లీ ! సందేహించకు !” అన్నాడు వల్లభుడు.
“ మా పడవ లోనే మీరన్న యోగ్యతలు గల పురుషుడున్నాడు.”
అనితల్లి మాటలు, సంబువ రాయునికి ఆశ్చర్యం కలిగించింది. ! ‘ ఎంత నిర్భయంగా మాట్లాడు తోంది ! తన తక్కిన రాణులకు ,ఈమెకీ ఎంతో తేడా ఉంది ! ఇంతటి ఉత్తమ లక్షణాలు గల నాయికకి పుట్టే సంతానం తప్పక రాజు కాగలడు !!’ అనుకొన్నాడు. ప్రకాశంగా, “ ఎవడు వాడు ? నా పడవ లోనే ఉంటూ, నాకు తెలియని వ్యక్తిత్వం గల ఆ పురుషుడు ఎవ్వడు ?” అని అడిగాడు.
“ ధనంజయుడు” నిర్భయంగా చెప్పింది, అనితల్లి.
“ ఆ బానిసా ?”
ఈ సారి వల్లభ గురుడు కల్పించు కొన్నాడు. “ ఆమె చెప్పిన మాట నిజమే ! అతనిని బానిసని చేసింది నువ్వు ! పుట్టుక తోనే అతను బానిస కాడు. ‘ శిల్పం, చిత్రలేఖనం, నాట్యం, గుర్రపు స్వారీ, ఈత, కత్తి యుధ్ధం ’ అన్నీ తెలిసిన వాడు, నాయక వంశంలో పుట్టిన నాయకుడు ! వాడు ఒక్కడే నీకు అందుబాటులో ఉన్న పురుషుడు !!”
“ గురుదేవా ! మీరు సలహాని ఇచ్చాక , ఆచరించ కుండా ఎలాగుండ గలను ? మీరు అన్నట్లు అదేమీ పతివ్రత కాదు గదా, అలాగే చేస్తాను,” అన్నాడు సంబువ రాయుడు.
వల్లభుడు పంచాంగం చూసి శోభన ముహూర్తం పెట్టాడు. “ విను సంబువ రాయా ! ఈ ముహూర్తానికి , నీ పడవ లోనే సంధానం చేయించు. మూడు పగళ్లు, మూడు రాత్రులు వారిద్దరినీ ఏకాంతంలో ఉంచు. నువ్వు పడవ బయట, కోటలో ఉండు. నువ్వు దగ్గరగా ఉంటే వారిద్దరూ భయ పడతారు, సంకోచిస్తారు. ఆ కార్యానికి కావలసిన సంతోషం, స్వచ్చంధ వాతావరణం లభించదు. అర్థమయిందా ? బీజారోపణకి ఆ మాత్రం సమయం వాతావరణం కావాలి.”
“ అర్థమయింది గురుదేవా !” అంటూ అక్కడి నుంచి బయలు దేరాడు సంబువ రాయుడు.
అనుకోని విధంగా వచ్చిన అవకాశం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఆ ప్రేమికులకి !!
ఆ రాత్రి వారు నిద్ర పోలేదు, అలాగని ‘రతికేళిలో’ ములిగి సమయాన్ని వ్యర్థం చేయలేదు. ఒకరి ఒడిలో మరొకరు ఒదిగి, ఆ బంధన నుండి, విముక్తి మార్గం వెతికారు. దాని గురించి రాత్రంతా చర్చించుకొని, ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, పడుకొని నిద్ర పోయారు.
మరునాటి సాయంత్రం ఆ పడవలో నృత్య ప్రదర్శన జరిగింది. అనితల్లి మనోహరంగా అలంకరణ చేసుకొంది. అలా చేసుకొని అద్భుతంగా నృత్యం చేసింది. ధనంజయుడు దానికి తగ్గట్లు ‘గాన కచేరీ’ చేసాడు. ప్రేక్షకులైన దొంగలందరూ, మస్తుగా సారాయి త్రాగారు. మత్తుతో, నాట్యాన్ని తిలకించారు. గమ్మత్తైన గానాన్ని విన్నారు, అంతకన్న గమ్మత్తైన నిద్ర మత్తు లోనికి జారుకొన్నారు. సారాయిలో కలిపిన మత్తు మందు వారందరి పైన ప్రభావాన్ని చూపింది.
ఆ వాతావరణంలో అక్కడున్న దృశ్యం మారి పోయింది. దొంగలు బందీలై కళాసులై పోయారు. కళాసులు బంధ విముక్తులై, ధనంజయ సేనగా మారారు. పడవ లంగరు తెంపుకొని జల ప్రవాహం లోకి పోయింది. ప్రేమ పావురాలు ఎగిరిపోయి, బంధ విముక్తు లయిన సేనతో సహా, ‘రాజకీయ సమాఖ్య ’ నాయకుడైన , ప్రోలయ నాయకుని శరణు జొచ్చారు. !!
ప్రోలయ నాయకుడు, తన సేనతో పాటు, ధనంజయుని సేనని కూడా కలుపుకొని, అదే పడవలో కోట, (అదే సంబువ రాయుని కోట ) ముట్టడికి బయలు దేరాడు. పడవ లోని దొంగలని కారాగారంలో కట్టడి చేసే వెళ్లారు.
ఎదురు చూడని ఆకస్మిక దాడికి. సంబువ రాయుడు అవాక్కయి పోయాడు.! అయినా వీరోచితంగా పోరాడి, చివరికి ధనంజయుని కరవాలానికి బలి పశువు అయ్యాడు.
ప్రోలయ నాయకునికి ఆ కోటలో అపార ధన సంపద లభ్యమయింది ! ఆంధ్ర దేశ విమోచనోద్యమం సంబువ రాయుని దుర్గ పతనం తోనే మొదలయిందని చెప్ప వచ్చు. ఆ కోట పట్టడంతో ప్రోలయ నాయకుని మీద విశ్వాసం పెరిగిన, ఏరువని పాలిస్తూండిన తెలుగు చోడ భక్తిరాజు వారితో సహకరించాడు.
ఆ తరువాత గొదావరీ తీరం లోని ‘ రేకపల్లి’ కేంద్రంగా ప్రోలయ నాయకుడు, విముక్తి ఉద్యమాన్ని నడిపాడు. అతడు వేంగీ విషయ వాసి అయిన ప్రోచియ నాయకుని పుత్రుడు. ఈ విముక్తి ఉద్యమం చాలా పటిష్టంగా జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగా తీరాంధ్ర దేశం, కాకతీయ సామ్రాజ్య అస్తమయం తరువాత, మూడు నాలుగు ఏండ్ల లోనే అంటే, క్రీ: శ : 1326 నాటికే విముక్తి పొందినట్లు తెలుస్తోంది. అంటే క్రీ: శ: 1325 అక్టోబరు నాటి ఒక శాసనంలో ప్రోలయ నాయకుడు (ప్రోలయ వేమారెడ్డి ) ‘ మ్లేఛ్చాబ్ధి కుంభోద్భవుడు’ అని కీర్తింప బడ్డాడు. అయితే ఆ ఉద్యమం పూర్తికాక ముందే ప్రోలయ నాయకుడు చనిపోవడంతో క్రీస్తు శకం 1330లో , అతని పినతండ్రి కుమారు డైన కాపయ నాయకుడు ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
కాపయ నాయకుడు తెలంగాణాను, మ్లేచ్ఛ పాలన నుండి, విముక్తి చేసాడు. ఓరుగల్లు పాలకుడైన , ‘ నాయబ్ వజీర్ మలిక్ మక్బూల్ ’ యుధ్ధంలో ఓడి పారి పోయాడు. దాంతో ఆంధ్ర దేశానికి తిరిగి ‘ ఓరుగల్లు ’ రాజధాని అయింది. పూర్వం కాకతీయులు పాలించిన రాజ్యంలో చాల భాగం కాపయ నాయకుని అధికారం లోకి వచ్చింది. అయితే ఈ ఉద్యమ చరిత్రలో చిన్న అపశృతి కూడా దొర్లక పోలేదు !
అదే స్వతంత్రమైన ‘ కంపిలి’ రాజ్యాన్ని ‘ ఢిల్లీ సుల్తాను’ తన వశం చేసుకొన్నాడు. ఓరుగల్లులో ప్రతాప రుద్రునితో చేసిన యుద్ధంలో ఓడిపోయి, పారి పోయిన ‘హరి హర బుక్కరాయల’ వంటి వారికి ఆశ్రయ మివ్వడమే , కంపిలి పాలకుడు, ‘ కంపిలి దేవుని’ పొరపాటుగా ముస్లిం చరిత్ర కారులు పేర్కొన్నారు ! కంపిలి రాజ్యం శిధిలాల నుంచే, దక్షిణ భారత దేశంలో, మహోన్నతమైన హిందూ సామ్రాజ్యం అదే ‘విజయ నగర సామ్రాజ్యం’ , హరిహర బుక్కరాయల ఆధ్వర్యంలో ఏర్పడింది.
టెలిఫోన్ బెల్ ‘ట్రింగ్ ట్రింగ్’ మంటూ మ్రోగడంతో, ఇనస్పెక్టరు గోపాల్రావు ఉలిక్కి పడి రిసీవరు అందుకొన్నాడు.“ హలో సార్ ! నేను ట నాట్ త్రీని, రామా రామ , మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఆస్పత్రికి రావాలి.’’
అది ‘అమర జీవి మెమరియల్ హాస్పెటల్ ’ ఆపరేషన్ థియేటర్కి ఎదురుగా ఉన్న బెంచీ మీద, కానిస్టేబిల్ టూ నాట్ త్రీ, అనంత శయనం ఫోజులో పడుకొని ఉన్నాడు, స్వగతంలో ఏదో గొణుగుకొంటూ.“ రామా రామ ! ఈ ఆపరేషన్ ఎప్పటికి ముగుస్తుందో ! ఈ పడిగాపు ఎప్పటికి కడుతుందో ! రామా రామ !” అని ఆవలిస్తూ చిటికె వేసాడు.
అదే సమయానికి దానయ్య అక్కడికి వచ్చాడు. వస్తూనే కనిస్టేబుల్ టూ నాట్ త్రీకి సెల్యూటు చేసి, “ దండాలు బాబయ్యా ! మన్దే ఊరండీ ?” అని అడిగాడు.
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment