(నిన్నటి టపాలో జరిగిన కథ--- సంబువ రాయుడు తన గురువు ఆదేశం ప్రకారం , అనితల్లి నుండి యోగ్యమైన సంతానాన్ని పొందడం కోసం ఆమెను, ధనంజయుణ్నీ తన పడవలో మూడు రోజులు మూడు రాత్రులు స్వేచ్ఛగా వదుల్తాడు. ఆ మిథునం అందిన అవకాశాన్ని వినియోగించుకొని, సైనికులకి మత్తుమందు ఇచ్చి, వారిని బందీలుగా చెస్తారు. పడవ లోని కళాసులు సైనికులు అవుతారు, ధనంజయుడు ఆ పదవను తీసుకెళ్లి , ప్రోలయ వేమారెడ్డి దగ్గరకు వెళ్లి అతని విమోచనోద్యమానికి సహాయ పడతాడు, ఈ మెయిల్ ద్వారా ఆ కథని చదివిన ఇనస్పెక్టర్ గోపాల్రావు టెలిఫోన్ రింగు అవడంతో దానిని తీస్తాడు కానిస్టేబిల్ 203 అతనిని అర్జెంతుగా రమ్మని పిలుసాడు. ---ఇక చదవండి )
మొసలి కొలను మ్యూజియం---17
“ రామా రామ ! ఎవడ్రా నువ్వు ? లాయరు ముద్దాయి నడిగి నట్లు, డబుల్ మీనింగులో ఊరి పేరు అడిగేస్తున్నావు ? మన్ది అంటే ఎవరిది, నీదా, లేక నాదా లేకా ఇద్దరిదీనా ?”
“ మా ఊరి సంగతులు మీకేటి తెలుస్తయి గాని, నే నడిగిన ఊసులు తమరి ఊరియేనండి.”
“ రామా రామ ! ముందు ఊరి పేరు అడిగావు. ఇప్పుడా ఊరి ఊసులు అడుగుతున్నావు, చెప్పడానికి నేనంత తీరుబడిగా లేను, వెళ్లెల్లు,” అని టూ నాట్ త్రీ కాళ్లు చాపుకొని పడుకొంటాడు.
“ మీ ఊరూ వద్దు, మా ఊరూ వద్దు, మొసలి కొలను సంగతులు సెప్పండి.” అంటూ జేబులోంచి బీడీ, అగ్గిపెట్టె తీసి, “ కావాలేంటండి,” అని వాటిని టూ నాట్ త్రీ ముందు పెడతాడు.టూ నాట్ త్రీ లేచి కూర్చొని బీడీ వెలిగించుకొని, “ రామా రామ ! ఇప్పుడడిగావ్, సరైన మాట !” అంటూ
దమ్ము తీసి,“ రామా రామ ! మొసలి కొలనులో గవర్నమెంటు మ్యూజయం ఒకటుంది. దాని వాచ్ మెన్ ఎంకన్నని పొడిచి, గుమాస్తా కరీం ఖాన్ నీ, చూడడానికి వచ్చిన మరో నామాల ఆచారినీ ఒక మూల కట్టి పడేసి, చాల విలువైన కళాఖండాల్ని ఎత్తుకు పోయాడొక దొంగెధవ !” అన్నాడు.
“ ఎంత గోరం జరిగి పోనాదండి, ఆ ఎంకన్న ఎలా ఉన్నాడండి ?”
“ రామా రామ ! ఆ రెడ్ బల్బు చూసావా ?”
“ సిత్తం”
“ దాని వెనక నున్న ఆపరేషన్ థియేటరులో, రామా రామ ! బెడ్డు మీద ప్రాణాలతో కుస్తీ పడుతున్నాడు. ఇద్దర డాక్టర్లు, మరో నలుగురు సిస్టర్లు దానికి దగ్గరుండి సాయం చేస్తున్నారు.”
“ ఏటవుద్దండీ ! ఆసున్నదుంటారా ?”
“ రామా రామ ! ఈ బీడీ చూసావా, ” అని దమ్ము తీసి, “ దీని పొగ గాలి లోకి, నుసి ధూళి లోకి కలుస్తోందా లేదా ?” అని దులుపుతాడు.
“ సిత్తం, నిజవేనండి.”
“ అలాగే ఎంకన్న ప్రాణాలు గాలి లోకి, శరీరం ధూలి లోకి కలియడానికి, రామా రామ ! ఎంతో సేపు లేదు, ఆ కొసనున్న నిప్పు ఈ కొసకి రావాలంతే !”
“ అంటే ఏటండి ? బీడీ కాలేటంతలో సచ్చిపోతాడేంటండీ ?”
“ రామా రామ ! బొత్తిగా బుర్ర లేని వాడివిలాగున్నావ్ ! నిప్పు ఆ కొస నుంచి, ఈ కొసకి రావడానికి, కొంత టైమ్ పడుతుందా లేదా—అలాగే ఎంకన్న చావు కూడా ! రామా రామ ! జస్ట్ ఎ మేటర్ ఆఫ్ టైమ్ ! అంతే, ఇంతకీ రామా రామ ! ఎంకన్న నీకేంటవుతాడు ?”
“ మీరన్నట్లు జరిగితే, మరి కాసేపటికి మావోడయి పోతాడండి.”
“ రామా రామ ! ఇప్పుడు కాడా ?”
“ కాడండి.”
“ చచ్చిన తరువాత, రామా రామ ! మీవాడయి పోతాడన్నమాట !”
“ అంతేనండి.”
“ రామా రామ ! చిత్రంగా ఉందే , నువ్వు--- నువ్వు చచ్చినోడివా ?”
“ అవునండి.”
“ రామా రామ ! ”అంటూ,టునాట్ త్రీ దానయ్య వంక ఆశ్చర్యంతో చూసాడు, “ నీదే ఊరన్నావ్ ?”
“ ఇంకేటన్లేదండి, అదిక్కడకి శానా దూరవండి, పితురులోకవని పిలుస్తారండి.”
“ రామా రామ ! నువ్వు పితృలోకం నుండి, వచ్చావన్న మాట ! ఏంటోయ్, మీ ఊర్లో ఋణదాతలు అప్పిచ్చేవాళ్లు ఉన్నారా ?”
“ అక్కడున్నోళ్లందరూ రునం తీరనోళ్లేనండి, రునం తీరినాక, అక్కడేవ్వరూ ఉండరండి, ఇంకా పై లోకాలకి పోతారండి.”
“ అంటే అంతా అప్పారావులు, అప్పల స్వాములూ, అప్ప కవులే ఉంటారన్న మాట ! రామా రామ ! ఋణదాతలు శూన్యం, మరి వైద్యుడో ?”
“ ఆల్లతో మాకేం పనండీ, మాకు ఆకలి రోగాలు తప్ప మరే రోగాలు రావండి.”
“ రామా రామ ! మీ లోకంలో కూడా , ఆకలి రోగాలు ఉన్నాయా ?”
“ ఉండవేటండి, అక్కడేవుందండి, పంటా, పాడా ? మీ లోకపు వాళ్లు, పిండా కూడెడితే , మా పొట్టలు నిండుతాయండి, ఈ మద్దిన అయి ఎట్టడం మానేసారు కదండి, అందుకని మా లోకపోల్లకి ఆకలి రోగాలట్టు కున్నాయండి.’’
“ అయితే అప్పిచ్చువాడు, వైద్యుడు ఇద్దరూ లేరు. రామా రామ ! పోనీ ఎప్పుడూ ఎడతెగక పారే ఏరు, ‘జీవనది’ ఉందా ?”
“ ఉన్నాదండి, దానికెప్పుడూ వరదలేనండి. ఎండిపోవడం అంటూ ఉండదండి. కాని అందులో ఉండేది నీర కాదండి, చీవూ, నెత్తురూ ఉంటాయండి, ‘ వైతరిణి ’ అంటారండి.”
“ రామారామ !అయితే మీ లోకం కన్నా,మాదే నయం, పోనీ లాస్టు అయిటం,బ్రాహ్మడున్నాడా ?”
“ మాలో కులాలు లేవండి, అంతా ఒకటే కులవండి, అసలు కులాల దాకా ఎందుకండి, మగ ఆడ తేడాలు కూడా లేవండి.”
“ రామా రామ ! లింగ భేధం కూడా లేదన్నమాట ! అయితే ఇంకేం మజా ఉంది !” అంటూ , టూ నాట్ త్రీ పద్యం చదువుతాడు.
“ అప్పిచ్చువాడు, వైద్యుడు / ఎప్పుడు నెడ తెగక పారు, నేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము / చొప్పడ కున్నట్టి యూర చొరకుము సుమతీ.”
అని సుమతీ శతక కారుడన్నట్లు, రామా రామ ! మీ ఊరికి చచ్చినా రాను పో !”
“ సచ్చిం తరువాత రాకేం చేస్తారండి ?”
“ ఋణం తీరని వాళ్లే అక్కడకి వస్తారన్నావ్ కదూ ! రామా రామ ! నాకా ప్రాబ్లం లేదు, నేను ఋణ కర్ణున్నే గాని, అప్పుల అప్పారావుని కాను. అలాగని అప్పడగ బోయావ్ ! రామా రామ ! నీ పప్పులు నా దగ్గర ఊడకవు !”
“ నాకు అప్పక్కర లేదండి, మీరే నా దగ్గర బీడీ తీసుకొని, రున పడి పోయినారండి.”
“ రామా రామ ! బీడీ నేను అడిగి తీసుకోలేదు, నువ్వే ఏ జన్మలోనే ఋణపడి ఉన్నావ్, ఇప్పుడు తీర్చేసావ్, అయినా చెప్పిన చరిత్ర చాలు గాని, అసలు సంగతి విప్పు, ఎందుకొచ్చావు ?”
“ సెప్పింది చరిత్ర కాదండి, నిజవే నండి, నానొచ్చింది పితురు లోకం నుండే నండి.”
“ రామా రామ ! పితృలోకం నుండో, పిచ్చాసుపత్రి నుంచో, నువ్వెక్కడి నుంచి వచ్చావో నాకు దేనికి గాని, ఏం పని మీద వచ్చావ్ ?”
“ అన్నేయాన్ని అరికట్టడానికి.”
“ రామా రామ ! అరి కట్టడానికా, హరి కథలు చెప్పడానికా, పోనీ, ఏదయితేనేం ! ఎంకన్నకి చావు లేకుండా చేయ గలవా ? అలా చేస్తే నీకు బోలెడు పుణ్యం వస్తుంది, ఋణం తీరి ఇంకా పై లోకాలకి పోవచ్చు. నా పని కూడ, అదే వాడి స్టేట్ మెంట్ తీసుకోవడం కూడా తేలికవుతుంది.”
“ ఎంకన్న పేన సంకటం, నిజానికి అన్నేయపు సెలగాటమే నండి, కాని, సావుని నేనెలా ఆపగలనండి !”
“ మరేం చేయగలవు, రామా రామ ! పిండా కూడు పీకల మొయ్యా మెక్కగలవా ?”
“ నా పేనానికి, పేనమైన బొమ్మలని, దొంగలు సొమ్ము సెసుకుంటూ ఉంటే సూడలేక ---”
“ టు నాట్ త్రీ దానయ్య మాటలకి అడ్డుపడి,“చూడలేక పితృలోకం నుంచి ఊడి పడ్డానంటావ్ ! హు ! రామా రామ ! నేల మీద నిలబడి గాలి కబుర్లు చెప్పేవాళ్లంటే నాకు అసహ్యం ! రామా రామ ! ఆ దొంగెదవ పేరు చెప్తాను, చేతనయితే పట్టుకొచ్చి నాకు అప్పచెప్పు.”
“ అయితే ఆ దొంగ ఎవురో మీకు తెల్సిపోనాదేటండి ? సెప్పండి బాబయ్యా ! సిటికెలో అట్టుకొస్తాను, కాని రుజూలెన్నో పోగేసి, జాగర్ తగ కేసు నడపాలండి, ఆ దొంగెదెవ ---”
“ రామా రామ ! ఆపు నీ సొది ! వాడి పేరు దానయ్య, ఎంకన్నకి స్వయాన పిల్లనిచ్చిన మామ ! డబ్బు కోసం అల్లుణ్నే పొడిచేసిన కిరాతకుడు. ”
“ బాబూ ! బొమ్మలెత్తుకు పోయినోడు దానయ్యా ! ఎవురు సెప్పారండి ?”
“ స్వయంగా తన కళ్లతో చూసిన సాక్షులు చెప్పారు, రామా రామ ! ఒకటి రెండూ కాదు, నాలుగు కళ్లు ! కరీం ఖాన్ కళ్లజోడు కూడా కలుపుకొంటే ఆరు ‘ ఐ’ల విట్నెస్ ఉంది ! అందు చేత రామా రామ ! కేసు పోతుందన్న భయం లేదు. వెళ్లు, వెళ్లు వెళ్లి ఆ దానయ్యని వెతికి పట్రా !”
దానయ్య అతని మాటలు విని విస్తు పోయాడు, ‘ చివరకి ఆచారి, కరీమ్ ఖాన్ కలిసి ప్లేటు నిలా ఫిరాయించారన్న మాట !’ అనుకొని, “ బాబూ, పోలీసు బాబూ ! ఎంకన్న ఇంకా సాచ్చికం సెప్పలేదేంటండి ?” అని అడిగాడు.
“ రామా రామ ! వాడి కింకా స్పృహే రాలేదు, వచ్చి కాస్త మాట్లాడ గలిగితే, స్టేట్ మెంట్ తీసుకోవాలి, దానికే నేనీ తలుపు చాటున రామా రామ ! ఈ పడిగాపులు పడుతున్నాను. ”
“ బాబయ్యా ! నా మాటలు ఇనుకోండి, దొంగ దానయ్య కాదండి.”
“ రామా రామ ! నీ కెలా తెలుసు ?”
“సెప్పాను కదండి, నాను పై లోకం నుండి ఎవ్వారాలన్నీ కని పెడతానే ఉన్నానండి.”
“ రామా రామ ! ఏదో అనుకొన్నాను, నీకీ పిచ్చి బాగానే ముదిరింది ! ఒక ఆస్పత్రికి బదులు మరో అస్పత్రికి వచ్చినట్లున్నావు !”
“ నేదు బాబయ్యా ! పితిరు లోకం నుండే—”
“ వచ్చావని రామా రామ ! ఋజువేంటి ?”
“ రుజూ సెయ్యాలేటండి ?”
“ రామా రామ ! చేసి చూపించు.”
“ దానయ్య మౌనంగా వెళ్లి బెంచీ మీద పడుకొంటాడు. “ ఇదో పోలీసు బాబయ్యా ! నాను నా లోకానికి ఎల్లిపోతున్నానండి. నా నెల్లిం తరువాత, ఇక్కడ కట్టెలాంటి దానయ్య శవమే మిగుల్తుందండి. సూసుకోండి కావలస్తే,” అని కళ్లు మూసుకొంటాడు.
“ రామా రామ ! ఆ వెళ్లేదేదో పెందరాళే వెళ్లు,” అని నాలుక కరచుకొంటాడు, “ ఏంటన్నావ్ ! కట్టె లాంటి దానయ్య శవమా ! నువ్వేనా ఆ దానయ్యవి ?”
దానయ్య బెంచీ మీద కాళ్లు చాపుకొని పడుకొని ఉంటాడు. కళ్లు మూసుకొనే అంటాడు. “ నేను-- కాదు నేను అంటిపెట్టుకొన్న యీ శరీరం దానయ్యది,” అని.
“ రామా రామ ! మొసలి కొలను మ్యూజియం బొమ్మల దొంగ, దానయ్యవి నువ్వేనన్న మాట !” కన్ ఫర్ మేషన్ కోసం అడుగుతాడు టునాట్ త్రీ.
దానయ్య పలకడు, టూ నాట్ త్రీ , దానయ్య దగ్గరగా వెళ్లి చూస్తాడు. దానయ్యలో చలనం ఉండదు ! టూ నాట్ త్రీ అతని శ్వాస చూస్తాడు, శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తుంది. గుండెకి చెవి ఆనించి, అలికిడి వింటాడు, గుండె చప్పుడు వినిపించదు ! తరువాత చేయి పట్టుకొని నాడి చూస్తాడు, నాడి కదులుతున్నట్లు అనిపించదు, టు నాట్ త్రీ ఆశ్చర్య పోతాడు !! “ రామా రామ ! ఇదేం ఖర్మ ! వీడు నిజంగానే పైకి వెళ్లిపోయాడు. ఇప్పుడేం చేయాలి ?” అని ఆలోచించి, ‘ముందు ఇనస్పెక్టరు గోపాల్రావు గారికి ఫోను చేసి చెప్పాలి ఆ తరువాత ముందిది శవమేనని డాక్టర్ చేత సర్టిఫై చేయించాలి ’ అనుకొని “ రామా రామ ! ఇదేం తలనొప్పి !” అంటూ టెలిఫోను దగ్గరకి వెళ్లి, ఇనస్పెక్టరు గోపాల్రావుకి రింగు చేసి, గాభరా గాభరాగా చెప్తాడు, “ నేను టూ నాట్ త్రీని మాట్లాడు తున్నాను సార్ ! రామా రామ ! అర్జెంటుగా ఆస్పత్రికి వచ్చెయ్యండి”, అంటూ, అలా మాట్లాడుతూనే దానయ్య వైపు చూస్తాడు.
దానయ్య లేచి నిల్చొని పారిపోతాడు. టూ నాట్ త్రీ రిసీవరుని పెట్టేసి, ఒక్క అంగలో బెంచీ మీదనున్న ఒక గొడుగు తీసి, “ రామా రామ ! దొంగెధవా ! ఎక్కడికి పారి పోతావ్ ?” అంటూ గొడుగుతో దానయ్య చొక్కా కాలర్ని పట్టుకొంటాడు. దానయ్య చొక్కా విప్పేసుకొని పారి పోతాడు.
టు నాట్ త్రీ చేతిలో గొడుగు దాని హుక్కుకి వ్రేలాడుతున్న చొక్కాతో క్షణ కాలం స్టేట్యూలా నిలబడి పోయి, మరుక్షణం తేరుకొని, వినిపిస్తుంది. ఇనస్పెక్టరు గోపాల్రావు విజిల్ వేసుకొంటూ వచ్చి, టు నాట్ త్రీని ప్రశ్నిస్తాడు, “ ఏమిటిది ? చేతిలో గొడుగు, దానికి ఉరేసుకొన్నట్లు వ్రేలాడుతున్న చొక్కా ! ఏమిటిది, ఎవరిదిది ?” అని.
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment