(నిన్నటి టపాలో జరిగిన కథ-- ఇనస్పెక్టర్ గోపాల్రావు ఈ మెయిల్ ద్వారా ధనంజయ, అనితల్లుల కథ, మ్యూజియం లోని విగ్రహాల విలువ తెలుసుకొంటాడు. అంతలో టెలిఫోన్లో అతనిని , అమర జీవి ఆస్పత్రికి రమ్మని టూనాట్ త్రీ పిలుస్తాడు.అక్కడకి వెళ్లిన గోపాల్రావుకి టూనాట్ త్రీ చేతిలో గొడుగు, దాని హుక్కుకి వ్రేలాడుతూ ఉన్న చొక్కా కనిపిస్తాయి --- ఇక చదవండి.)
మొసలి కొలను మ్యూజియం --18
టు నాట్ త్రీ అలా నిలబడే జవాబు చెప్తాడు, “ రామా రామ ! దానయ్య శరీరాని దండి.”
“ మాట మాటకీ ఆ రామా రామ అనవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాలి ?”
“ రామా రామ ! రామనామం అనడంలో తప్పేముందండీ ?”
“ తప్పా, తప్పున్నరా ? ఏదీ -- ముష్టిముండా కొడకా, అను.”
“ రామా రామ ! ముష్టిముండా కొడకా,” అనేసి నాలిక కరచు కొంటాడు.
“ అదుగో చూసావా, అందుకే అనవద్దని అన్నాను, ముందు లెంపలేసుకో !”
“ రామా రామ !” అంటూ లెంపలేసు కొంటాడు టు నాట్ త్రీ. సంకలో గొడుగు కూడా క్రింద పడుతుంది ! ఇనస్పెక్టరు వంగి, గొడుగునీ. చొక్కానీ చేతిలోకి తీసుకొంటాడు. “ అదుగో కుక్కకైనా గట్టిగా చెప్తే, దాని తోక సరి చేసుకొంటుందేమో గాని, నీ నోరు మాత్రం , ఆంవా ఆంవా అంటూ వంకరలు తిరగక మానదు,” అంటూ చేతిలోని చొక్కా జేబులో చెయ్యి పెట్టి, లోపలున్న కొన్ని కరెన్సీ నోట్లు తీసి, వాటి వైపు చూస్తూ, “ ఏయ్.”,
టు నాట్ త్రీ ! ఈ చొక్కా ఎవరిది ?” అని అడుగుతాడు.
టు నాట్ త్రీ ఆశతో నోట్ల వంక చూస్తూ, “ ఆయ్ ! నాదేనండి,” అన్నాడు.
“ ఇందాకల ఎవరిదో శరీరానిదన్నావ్ ?”
“ రామా రామ ! అనేసానేంటండి, నా ఖర్మండీ !”
“ ఏయ్ ! నిజం చెప్పు, ఇది ఎవరిదో దానయ్యది, అవునా ?”
“ రామా రామ ! అవునండి.”
“ ఎవడా దానయ్య ! ఏమా కథ ?”
“ రామా రామ ! కథ బోలుడుందండి, పిత్రులోకం నుంచి వచ్చిన ఒక ఆత్మ, దానయ్య అనబడే శరీరం లోకి ప్రవేశించి, నాతో పావు గంట క్రితం మాట్లాడిందండి.”
“ ఏమిటా పిచ్చి వాగుడు, దానయ్య అంటే ఎవరు, ఆ బొమ్మల దొంగేనా ?”
“ రామా రామ ! అవునండి, సొంత చేతులతో అల్లుణ్ని పొడిచేసి, మళ్లీ వాడెలా ఉన్నాడో తెలుసుకోవాలని వచ్చాడండి. ”,
“ వాట్ టు నాట్ త్రీ ! వాడినెందుకు పోనిచ్చావ్ , పట్టి స్టేషన్కి తీసుకు రాకుండా ?”
“ రామా రామ ! పట్టుకోవాలనే కదండీ, గొడుగుతో గేలం వేసింది. ఆ గేలానికి ఈ చొక్కావే తగిలిందండి. తగలగానే చొక్కా విప్పేసుకొని శరీరం పారి పోయిందండి.. పోతే ఫోయిందండీ, దొరికిన చొక్కానైనా సద్వినియోగం చేసుకోలేక పోయానండి.”
“ బాగుంది వరస ! చేతికి చిక్కిన దొంగని వదిలేసి, వాడి సొమ్మైనా దక్క లేదని ఏడ్పు మొదలు పెట్టావు, వెళ్లు, ఇమీడియట్గా వెళ్లి ఆ దానయ్యని పట్రా ! లేకపోతే నీ కాన్ఫిడెన్షియల్ కూతురు పెద్దమనిషి అయిపోతుంది. జాగ్రత్త ! ”
“ రామా రామ ! నాకున్న ఇద్దరు పిల్లలూ మగేనండి, ఆ రాముని తోడు, పెళ్లాం కూడ ఒక్కర్తేనండి. మీరన్న కాన్ఫిడెన్షియల్ కూతురు --- ”
“ అది కాదోయ్ ! కాన్ఫిడెన్షియల్ కూతురు అంటే కాన్ఫిడెన్షియల్ ఫైలు అని అర్థం.”
“ రామా రామ ! ఫైలు పెద్దమనిషి అయిపోవడమేంటండి ?”
“ ఎర్ర సిరాతో రిమార్కు పడితే మరేమవుతుంది ?”
“ రామా రామ ! అంత పని చేయకండి, వెళ్లి ఆ దానయ్యతోనే వస్తానండి.” అంటూ సెల్యూటు చేసి, గొడుగు చేతిలో పట్టుకొని వెళ్లి పోతాడు. ఇనస్పెక్టరు కరన్సీ నోట్లని దానయ్య చొక్కా జేబులో పెట్టి , మడత పెడతాడు. అంతలో టెలిపోను రింగవుతుంది. ఇనస్పెక్టరు వెల్లి టెలిఫోను రిసీవరు తీస్తాడు.అటు వైపు నుండి, డాక్టరు మాట్లాడుతాడు.
“ హలో ! ఒ.టి. నుండి డాక్టర్ని మాట్లాడుతున్నాను , కానిస్టేబుల్ టునాట్ త్రీయే కదా ?”
“ నేను ఇన్స్పెక్టని మాట్లాడుతన్నాను డాక్టర్ ! చెప్పండి, ఎంకన్నకి స్పృహ వచ్చిందా ?”
“ లేదు, సారీ ఇన్స్పెక్టర్ ! ఎంకన్న నో మోర్ !’’
‘ ఎంకన్న చని పోయాడా డాక్టర్! ఐ పిటీ ఫర్ హిం ! స్టేటుమెంటు ఇవ్వకుండానే చనిపోయాడు.”
“ శవాన్ని తీసుకెళ్తారా ఇనస్పెక్టర్ ?”
“ మీరా శవాన్ని ‘డెత్ సెల్’లోనే పెట్టండి డాక్టర్! అది మరొక ఆపరేషన్ టేబుల్ ఎక్కాలి కదా ?’’
“ మరో ఆపరేషన్ టేబిలా ?”
“ అదే డాక్టర్ ! ఎంకన్న మరణంతో ఇది మర్డర్ కేసు అయిపోయింది కదా ! అతని శవం పోస్ట్ మార్టం కోసం, ఇంకో ఆపరేషన్ టేబుల్ ఎక్కాలని అంటున్నాను.”
“ సరే, ఇనస్పెక్టర్.! శవాన్ని మీరే మార్గూకి తీసుకెళ్లే ఏర్పాట్లు చెయ్యండి. ”
“ థాంక్స్ డాక్టర్ ! మీరు ఫోను పెట్టేయండి, నేను కంట్రోల్ రూంకి ఫోను చేసి, ఆ ఏర్పాట్లు చూస్తాను. ” అంటూ క్రెడిల్ నొక్కి, మరో నెంబరుకి డయిల్ చేసాడు గోపాల్రావు. “ హలో గొపాల్రావ్ స్పీకింగ్ ! గుడ్ మార్నింగ్, వెంటనే అమర జీవి మెమోరియల్ హాస్పిటల్ కి, ఒక వేన్ ని పంపించండి., రెండు పెద్ద ఐస్ క్యూబ్సుతో సహా, ఆస్పత్రిలో ఉన్న ఎంకన్న శవాన్ని మార్చురీకి తరలించాలి”.
“ ఎనీ మోర్ ఇనస్పెక్టర్ ?”
“ యస్ ! ఆ మర్డరర్ దానయ్య, కొన్ని క్షణాల క్రితమే హాస్పిటల్కి వచ్చాడు. మన టు నాట్ త్రీ అతన్ని నేరోలీ మిస్ అయ్యాడు. వెతకడానికి పంపించాను, వెంటనే ఆ—ఆ-- దానయ్య డిస్ప్రిప్షన్ తెలుసు కదా, అన్ని సెంటర్లకీ ఫోను చేసి, వెతికే ఏర్పాట్లు చేయించండి. ”
“ అతను హాస్పిటల్ బిల్డింగు విడిచిపెట్టాడా ?’’
“ పావుగంట క్రితం ఆస్పత్రి లోనే ఉన్నాడు. ఎంతో దూరం పోయి ఉండడు. హాస్పిటల్లో కూడా సెర్చి చేయించాలి. మరో ‘ఇంపార్టెంట్ క్లూ’ అతని ఒంటి మీద చొక్కా లేదు, దగ్గర కేష్ కూడా లేదు.”
“ ఈజ్ ఇట్ ఓవర్ ?”
“ యస్,ఓవర్ ! ” ఫోను క్రెడిల్ మీద పెట్టి, ఇనస్పెక్టర్ వెనక్కు తిరుగుతాడు. అదే సమయానికి సెంత్రీ మురుగన్ అక్కడికి వచ్చి, అతనికి దండాలు పెడతాడు. “ దండాలు బాబయ్యా ! ” అంటూ.
(తరువాత భాగం రేపటి టపాలో )
Comments
Post a Comment