(నిన్నటి టపాలో జరిగిన కథ---- ముకబీరు మురుగన్ , ఇనస్పెక్టర్ గోపాల్రావుకి, మ్యూజియం దొంగతనం గురించి చెప్తాడు. కొన్ని ఫొటోలు, ఆడియో కేసట్టు ఇస్తాడు. దానయ్య చొక్క జేబులో దొరికిన నోట్లు, ఎంకన్న గాయపడి స్పృహ తప్పి పడిపోయిన చోట పోలీసులకి దొరికిన నోట్లు ఒకే దస్త్రం లోనివని చెప్తాడు. గోపాల్రావు దానయ్య విషయంలో ఆలోచనలో పడతాడు --- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం---20
“ ఐసీ ! అయితే దానయ్య ఈ నోట్లని, చొక్కానీ కావాలనే టూ నాట్ త్రీ గేలానికి తగిలించి వెళ్లాడన్న మాట ! ” అని ఇనస్పెక్టర్ అంటూ ఉండగానే, టూ నాట్ త్రీ దానయ్యని తీసుకొని అక్కడకి వస్తాడు. దానయ్య చేతులు రెండూ గట్టిగా ఆస్పత్రి బేండేజీతో కట్టేసి ఉంటాయి. టు నాట్ త్రీ గొడుగు హుక్కుని ఆ బేండేజీ కట్లలో దోపి, రెండో కొసని తన భుజం మీదుగా పట్టుకొని తీసుకొని వస్తాడు. ఇనస్పెక్టర్ గోపాల్రావు ఆ దృశ్యాన్ని చూస్తాడు.
దానయ్య పారిపోవాలను కొంటే ఆ బేండేజీ అతనినేమీ చెయ్యలేదని, కావాలని పట్టు బడ్డాడనీ అర్థమవుతూనే ఉంది.
“ రామా రామ ! ఇదుగోనండి ఆ దానయ్య ! పట్టి బంధించి తెచ్చానండి,” అంటూ గర్వంగా చూసాడు, ఇనస్పెక్టర్. వంక టు నాట్ త్రీ.
“ టు నాట్ త్రీ ! ఇతను నీకెక్కడ దొరకాడు.’’
“రామా రామ ! దొరకక ఏం చేస్తాడండి ! ఒంటి మీద చొక్కా లేదు కదండి, ఎంతో దూరం పోయి ఉండడని ఆలోచించి, ఆస్పత్రిలోనే వెతికానండి. రూము నెంబరు పదిహేడులో బెడ్ నెంబరు ఎనిమిది మీద, ముఖం మీద దుప్పటి ముసుగు వేసుకుని, తొంగున్నాడండి అసలా బెడ్డు కూడ దాటి పోయే వాడినే నండి ! సిస్టరు వచ్చి,జబ్బ మీద ఇంజక్షన్ సూది గ్రుచ్చడంతో ,లేచి కూర్చొన్నాడండి. కత్తితో మనుషులని పొడిచే కసాయి వెధవ, సూది నొప్పికే విల విల లాడిపోయాడండి ! ఆ సూదిని గన్నులాగ చూపించి, నర్సమ్మ వాణ్ని కదలనీయకుండా చేసిందండి. నేను గట్టిగా కట్టేసి, తెచ్చానండి.” అన్నాడు టు నాట్ త్రీ.
“ బలే ! మొత్తం మీద ప్రాణాలకి తెగించి, పట్టుకొన్నావన్న మాట ! ” ప్రశంసించాడు ఇనస్పెక్టరు.
“ మరే , లేకపోతే నా కాన్ఫిడెన్షియల్ కూతురు పెద్ద మనిషి అయిపోయి, కడుపు కూడ చేసేసుకొంటుంది కదండి !”
“ ఇప్పుడు మాత్రం చేసేసుకోదన్న గ్యారంటీ ఏమిటి ?”
“ చేసుకొన్నా రామా రామ ! నాకు తెలియకుండా, కాన్ఫిడెన్సులో చేసుకుంటుందండి.”
“ ఇనస్పెక్టరు దానయ్య వంక చూస్తాడు, “ దానయ్యా ! యూ ఆర్ అండర్ అరెస్ట్ ! ఎంకన్న హత్యా నేరం మీద నిన్ను అరెస్టు చేస్తున్నాను.”అన్నాడు
“ఎంకన్న సచ్చిపోయేడేంటండి ?’’అన్న దానయ్య ప్రశ్నకి, అక్కడే ఉన్న మురుగన్, బొంగురు పోయిన కంఠంతో జవాబిస్తాడు. “ అవును మామా ! ఇప్పుడే ఇనస్పెక్టరు గారు చెప్పారు”.
దానయ్య ఏడుస్తాడు. “ ఒరే ఎంకన్నా ! అల్లుడూ ! ” అంటూ , ఆనక బేండేజీ కట్టిన చేతులతోనే తుడుచుకొంటాడు. “ మురుగప్పా ! ఎంకన్నా శవం కోసం ,‘ లచ్చితో’ కాయితం పెట్టించు. ” అని ఇనస్పెక్టరుతో, “ బాబూ ! సితికి నిప్పెట్టడానికి ఆడికొక కొడుకు ఏడేళ్ల వాడు ఉన్నాడండి, మీరు దయ ఉంచి, ఆడి శవాన్ని ఆళ్లకిప్పించాలండి.”
“ అలాగే దానయ్యా,! ఏయ్ టు నాట్ త్రీ !”
“ రామా రామ ! యస్ సార్ !”
“ నువ్వు దానయ్యను పోలీసు స్టేషనుకి తీసుకెళ్లు.”
“ రామా రామ ! జాగరత్తగా తీసుకెళ్లి లాకప్పలో పెడతాను సార్ ! ”
‘‘తరువాత ఈ నోట్లని తీసుకెళ్లి, వీటి మీద నెంబర్లని బట్టి, ఏ బేంకు నుంచి డ్రా అయ్యాయో ఎన్ క్వయిరీ చెయ్యి, బేంకు బేంకుకీ వెళ్లు, నెళ్లాళ్ల వరకు రికార్డులు చెక్ చెయ్యి, వెళ్లు,” అని దానయ్య చొక్కా జేబులొని నోట్లని టూ నాట్ త్ర్రీకి ఇచ్చాడు గోపాల్రావు.
“ రామా రామ ! అలాగే సార్ !’ అని నోట్లు జేబులో పెట్టుకొని దానయ్యని తోసుకొంటూ వెళ్తాడు టు నాట్ త్రీ. అతను వెళ్లి పోయాక ఇనస్పెక్టర్ , మరుగన్తో “ మురుగన్ ! నువ్వు నాతో రా ! మీ ఊరికి వెళ్లి, అక్కడి మ్యూజియం లోని అంగుళం, అంగుళం గాలించాలి. తరువాత ఆంజనేయుడి విగ్రహానికి నకలు తీసిందెవరో తెలుసుకోవాలి, పద ! అవి సాధారణమైన బొమ్మలు కావు, కొన్ని కోట్లు విలువగల వజ్రాలను రహస్యమైన అరలో దాచుకొన్న బొమ్మలు ! ” అన్నాడు ఆవేశంతో.
“ మురుగన్ ఆశ్చర్యపోతూ , ఇనస్పెక్టర్ ని చూస్తాడు, “ ఏమంటున్నారు సార్ ! బొమ్మలలో వజ్రాలు దాగి ఉన్నాయా ?” అని అడిగాడు . ఇనస్పెక్టర్ మౌనం వహించడం చూసి, “ పదండి సార్ !” అంటూ ముందడుగు వేస్తాడు.
(తరువాయి భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment