(నిన్నటి టపాలో జరిగిన కథ---- మ్యూజియం వెళ్లిన ఇనస్పెక్టర్ గోపాల్రావు అక్కడ వాట్సన్ దొర ఉండడం చూసి ఆశ్చర్య పోతాడు. అతను ఒక తామ్ర శాసనాన్ని ఫొటోలు తీయడం చూస్తాడు. అంతే కాదు ఎంకన్నని పొడిచిన చోట, రబ్బరు మేట్ మార్చబడి ఉండడం గమనిస్తాడు. వాట్సన్ అతనితో వాదనకి దిగుతాడు తరువాత కోపంతో వెళ్లిపోతాడు. గోపాల్రావుకి వాట్సన్ మీద అనుమానం వస్తుంది. ఆ తరువాత కరీం ఖాన్’ని ప్రశ్నలతో తికమక పెట్టి , దానయ్య మీద హత్యానేరం మోపబడిందనీ, అసలు హంతకుడు వేరే ఉన్నాడని తెలుసుకొంటాడు---ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం ---22
“ అదేమిటి, అలా అంటున్నారు? ఎంకన్న చనిపోయిన సంగతి అప్పుడే తెలిసి పోయిందా ?”
“ వాట్సన్ దొరగారికి మీరు లోపల చెప్పారట కదా, హతను నాకీ చెప్పారు.”
‘ ఓహో, దొరకీ నీకూ ఇంత ఇంటిమసీ ఉందా, లోపల చెప్పిన విషయం అప్పుడే బయటికి వెళ్లిందే !’ అనుకొని, “ అవును ఖాన్ సాహెబ్ , దానయ్యని అరెస్టు చేసాను. వాణ్ని బొక్కలోకి తోయించి నేరుగా ఇక్కడికే వచ్చాను. దానయ్య చొక్కా జేబులో కొన్ని కరెన్సీ నోట్లు దొరికాయి. వాటిని మీరు ఇచ్చారని చెప్పాడు—”
“ లేదు ఠానేదార్ సాహెబ్ ! హంతా జూఠ్ ! ఆ డబ్బు ఆ సైతాన్దే, ఆంజనేయుడి బొమ్మా కోసం నాకీ లంచం హియ్యడాన్కి వచ్చాడు.”
“ అలాగా, మీరు తిరస్కరించారు అవునా ?”
“ హవును సార్ ! హరామ్ డబ్బు, అలాంటిది నేను ముట్టను !”
“ దానయ్య ఆ డబ్బు ఆచారి కళ్ల ముందే మీకు ఇచ్చాడా ?”
కరీం తడబడ్డాడు, ఏం చెప్పాలో తోచలేదు, అయినా ఒక అబధ్ధం చెప్పాక మరొకటి చెప్పక తప్పదు. అనుకొని, “ నాకే కాదు సార్, ఆచారికీ కూడా ఇవ్వ బోయాడు. ’ అని అన్నాడు.
“ ఆచారికి ఎందుకు ఇవ్వ బోయాడు ?”
“ గనిలో దొరికిన బొమ్మలు, ఇవరాలు చెప్పామని హివ్వాబోయాడు.”
“ ఆచారి కూడా తీసుకోలేదా ?” అమాయకంగా అడిగాడు గోపాల్రావు.
“ లేదు, అప్పుడు రెండు కత్తులు తీసి, మాకీ బెదిరించి, మ్యూజియం లోపలికీ తీసుకా హెళ్లి కట్టి పడేసాడు.”
“ మరి ఎంకన్నని ఎప్పుడు పొడిచాడు ?”
“ మాకీ కట్టేయ్యడం చూసి, హెంకన్న మ్యూజియం బయటకి వెళ్లి, ‘ హెల్ప్, హెల్ప్ ’ అని అరిచాడు. అప్పుడు ఆ సైతాను అక్కడి కక్కడే హెంకన్నని పొడిచేసాడు.”
“ అంటే ఎంకన్నని మ్యూజియం బయటే పోడిచాడా ?”
“ హవును, ఠానేదార్ సాహెబ్ !”
“ మీ ఇద్దరినీ లోపల కట్టి పడేసాడు కదా, మీరు ఎంకన్నని పొడిచెయ్యడం ఎలా చూసారు ?”
కరీం గతుక్కుమన్నాడు. “ కళ్లతో చూడలేదు సార్ ! ‘దిల్ సే’ అదే మనసుతో చూసాను.”
“ సరే , అర్థమయింది, ఎంకన్నకి ఏమయిందో మీ ఇద్దరిలో ఎవరికీ తెలియదు. తర్వాత జరిగిన దానిని బట్టి, ఊహించారు అంతేనా ?”
“ హవును సాబ్ ! అదే సమజ్ అవుతోంది కదా ?”
“ సరే, మరి బొమ్మలు ఎప్పుడు దొంగలించాడు ?”
“ హెంకన్నని పొడిచేసి వచ్చి ,మ్యూజియంలో ఉన్నబొమ్మలన్నీ హెత్తుకా పోయాడు , సైతాను.”
“ అంటే దానయ్య బొమ్మలు దొంగలించడం మీరు, అదే మీరిద్దరూ చూసారన్నమాట ?”
“ హవును సార్ !”
“ రేపు కోర్టులో కూడ ఇలాగే చెప్పండి, ఖాన్ సాబ్ ! ఎందుకంటే మన మాటలన్నీ నా సెల్ ఫోనులో రికార్డు చేసాను.” అన్నాడు ఇనస్పెక్టర్.
కరీం ఖాన్ కి ఏం చెప్పాలో తోచలేదు. అంతలోనే ఇనస్పెక్టర్ మరో ప్రశ్న వేసాడు. “ ఖాన్ సాహెబ్ ! డబ్బు దానయ్యదే అయినప్పుడు ఆ డబ్బును ఎంకన్నని పొడిచేసిన తరువాత అక్కడ ఎందుకు వెదజల్లాడు ?”
“ నాకీ తెల్వాదు సార్ ! నేను లోపలా బంద్ అయిపోయాను కదా !”
ఇంతలో జీపు హారన్ వినిపిస్తుంది. మురుగన్ చెప్పిన పని చేసేసి ఉంటాడని ఇనస్పెక్టర్కి అర్థమయిపోయింది, వెంటనే జీపు దగ్గరకి వెళ్లాడు.
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment