(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇనస్పెక్టర్ గోపాల్రావు ఇంట్లో అత్ను, ప్రియంవద, మురుగన్, వీరన్న ఇంకా గంగ సమావేశ మవుతారు. వాట్సన్ దొర స్పెషల్ వర్క్ ఆర్డర్ ద్వారా ఒక రిఫ్రిజిరేటర్ బాడీని తమ వర్క్ షాపులో తయారు చేయమన్నాడనీ, అయితే అది సాధారణ ఫ్రిజ్ కాదనీ, అలా కనబడే రహస్యమైన అల్మైరా అనీ, దాన్లో బేటరీతో నడిచే ఒక ట్రేన్ష్ మిషన్ సిస్టంని , అమర్చమన్నాడనీ తాను ఆ పనిలోనే ఉన్నాడనీ ,వీరన్న చెప్తాడు. ఆ అరేంజ్ మెంట్ బొమ్మలని స్మగ్లింగ్ చేయడానికేనని గోపాల్రావు అనుమానిస్తాడు. తాను మరొక ట్రేన్స్ మిషన్ సిస్టంని తెచ్చి ఇస్తానని, దానిని కూడా వారెవర్కీ తెలియకుండా, అమర్చమని అంటాడు ఇనస్పెక్టరు. దానిని ఆ రోజు రాత్రికే తెచ్చి ఇమ్మంటాడు వీరన్న ---- ఇక చదవండి)
మొసలి కొలని మ్యూజియం--- 26
“ చేస్తాను బాబూ ! కాని మీరు ఇస్తానన్న ట్రాన్సిమిషన్ సిస్టంని నాకు ఈ రాత్రికే అంద జేయాలి. ఎందుకంటే ఆ బాడీని రేపే డెలివరీ చేయాలి. అంతేకాదు బాబూ ---” అంటూ నసిగాడు వీరన్న.
“ చెప్పు వీరన్నా , ఇంకా ఏం కావాలి ?”
“ ఈ పని అయ్యాక, నేను మళ్లీ అక్కడ పని చేయలేను బాబూ ! నా ఉద్యోగం --- ”
“ నీకా భయం అక్కర లేదు. రమేష్ చంద్ర గారితో, నేను నీ విషయం మాట్లాడాను.నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు యీ బాడీ ఫేక్టరీ విడిచి పెట్టి, అక్కడకి వెళ్లి, జాయన్ అవవచ్చు. నీకు క్వార్టరు, మెడికల్ ట్రీట్ మెంటు అక్కడ ఫ్రీగా ఇస్తారు.జీతం కాక, రకరకాల ఎలవన్సులు ఉంటయి.”
“ అలాగే బాబూ ! మరి మేము వెళ్లి రామా ?”
“ వీరన్నా ! ఈ రాత్రి ఏదో ఒక సమయంలో నీకు ట్రాన్సిమిషన్ సిస్టంని మురుగన్ ద్వారా పంపిస్తాను. నువ్వు దానికోసం ముందుగానే ‘అర’ తయారు చేసి ఉంచు. నేను నీతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోను. మన మధ్య మురుగన్ సంధాన కర్తగా ఉంటాడు, సరేనా ?”
“ అయితే మేము బయలు దేరుతాము బాబూ,!”
“ ఒక్క అయిదు నిమిషాలు ఉండు, నేను గంగని కూడా కొన్ని వివరాలు అడిగాలి.”
“ నాతో ఏం మాటలుంటాయి బాబూ ?” అడిగింది గంగ. అమాయకంగా.
“ నువ్వు చాల ముఖ్యమయిన సమాచారం ఇవ్వాలి., వీరన్నకంటె కూడా, --” గోపాల్రావు మాట పూర్తి కాకుండానే, గంగ వీరన్న వైపు గర్వంగా చూసింది, ఆ పైన అడిగింది , “ నా మొగుడికైతే ఉద్యోగం ఇస్తారు, నా కేమి ఇస్తారు బాబూ ?” అంటూ మేల మాడింది.
“గంగా! నువ్వు ఊరు విడిచి వళ్లేటప్పుడు ,మా ఇంటికి రా, నీకు పసుపు కుంకుమలతో పాటు, చక్కటి పట్టు చీర కూడా పెడతాను,” అంది ప్రియంవద.
ఆమె అభిమానానికి గంగ కళ్లలో నీళ్లు తిరిగాయి.“ఊరకనే అన్నాను అమ్మగారూ! నాకు మీరు పింగాణీ కప్పుతో ఇచ్చిన టీ, చాలు తల్లీ ! మీ ఇద్దరి ఆశీర్వాదాల పదివేలు ”
అంటూ చీర కొంగుతో కళ్లు తుడుచుకని, “ అడగండి బాబూ ! ఏమడగుతారో ?” అంది గోపాల్రావుతో .
“ గంగా ! నువ్వు మ్యూజియంలో పనికి కుదురుకొన్నావు కదా ?”
“ అవును బాబూ ! నిన్నటి నుంచే పని మొదలు పెట్టాను.”
“ అక్కడ ఏం చేస్తూంటావు ?”
“ మ్యూజియం నేలంతా తుడిచి, తడిగుడ్డతో వ్రాయాలి బాబూ ! ఆ పని అయపోయాక , బొమ్మలు పెట్టే బాక్సులు, ఇంకా గట్లు మీద ధూళి తుడిచి శుభ్రం చెయ్యాలి.”
“ అయితే ఈ విషయం చెప్పు, ఒక గాజుపెట్టెలో.‘ తామ్ర శాసనం’ అంటే రాగిరేకు ఉండాలి, చూసావా ?”
“ అవును బాబూ, ఉంది చూసాను.”
“ ఎప్పుడు చూసావ్ ?”
“ నిన్ననే చూసాను, ఈ రోజు ఉదయం కూడ చూసాను. ”
“ ఆ రాగిరేకు చాలా ముఖ్యమైనది. దొంగలు దానిని పొరపాటున వదిలేసి వెళ్లిపోయారు. అందులో ,అంటే ఆ అనితల్లి శాసనంలో , కంఛు బొమ్మల గర్భంలో దాగిన వజ్రాలని వెతికి పట్టుకొనే రహస్యం వాసి ఉంది. అందుకనే వాట్సన్ దొర దానికోసం ప్రత్యేకంగా మ్యూజియంకి వచ్చాడు. అంతే కదా మురుగన్ ?”
“ అవును సార్ ! సరిగా అదే సమయానికి మీరు అక్కడికి వెళ్లడం వల్ల అది ఇంకా సురక్షితంగా ఉంది. లేకపోతే ఆ దొర దానిని చేజిక్కించుకొనే వాడు.” అన్నాడు మురగన్.
“ కరెక్ట్ ! గంగా, ఆ దొర మళ్లీ మ్యూజియం లోకి రావడం చూసావా ?”
“ రావడమే కాదు బాబూ ! ఎప్పుడూ ఆ రాగిరేకు దగ్గర ఫొటోలు ఉంటారు బాబూ , ఆ దొరగారు ! ఈ రోజు కూడా అక్కడ నిల్చొని బోలెడు ఫొటోలు తీసారు బాబూ !”
“ నిజంగానా ? అయితే నా ఊహ నిజమేనన్న మాట ! గంగా, నువ్విచ్చిన సమాచారం చాలా విలువైనది. సరే , మీరిద్దరూ వెళ్లి రండి,నే నింకా వీరన్న కోసం ట్రాన్సుమిషన్ సిస్టంని ఏర్పాటు చెయ్యాలి.” అన్నాడు గోపాల్రావు.
వీరన్న గంగ ఇద్దరూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లి పోగానే ఇనస్పెక్టరు మురుగన్ తో చెప్పాడు, “మనం అర్జంటుగా చిత్తూరు మైను రోడ్డు మీద జీపులో వెళ్లాలి. ట్రాన్సుమిషన్ సిస్టం కోసం ,చిత్తూరు లోని ‘ మోటరోలా కంపెనీకి’ ఫోను చేసి, దానిని ఎలాగైనా సంపాదించి, రాత్రి తెల్లవారే లోగా, వీరన్నకి ఇవ్వాలి. పద, బయలు దేరుదాం,” అంటూ జీపు దగ్గరకు నడిచాడు గోపాల్రావు.
జీపులో కూర్చొన్నాక మురుగన్ అడిగాడు, “సారూ ! చిత్తూరు నుండి సామాను తీసుకొని రాత్రి తెల్లవారే లోగా, వచ్చేయ గలమా , సారూ ?” అని.
“ ఏం ఆ సందేహం నీ కెందుకు వచ్చింది ?”
“ సారూ , చిత్తూరు చేరడానికి రాత్రి పదకొండు గంటలు అవుతుంది. ఆ కంపెనీ తెరచి ఉండాలి, మీకు సిస్టం ఇవ్వాలి. అప్పుడు కదా తిరిగి రావడం అంటూ జరిగేది ?”
“ నిజమే, నా ఫ్రెండు అక్కడ అసిస్టెంటు మేనేజరు ! వాడికి ఫోను చేస్తే సిస్టం తెచ్చిఇంట్లో పెడతాడు. మైన్ రోడ్డు మీదకి వెళ్లాక ఫోను చేస్తాను, సరేనా ?”
“ అలాగే సారూ !” అన్నాడు మురుగన్ .
“ జీపు చిత్తూరు రోడ్డు మీదకి వచ్చింది. దానిని ఒక వారగా పార్కు చేసి, మొబైలులో నెంబరు సెర్చి చేసి, ఆన్ చేసాడు గోపాల్రావు.. అటునుండి, ‘ హలో ’ అని వినబడగానే “ తేజా ! నేనురా గోపాల్ని మాట్లాడుతున్నాను, మొసలి కొలని నుంచే ! నీతో అర్జెంటు పని పడింది.”
“ నేను అరగంట క్రితం మొసలి కొలనులో ఉన్నాను. ”
“ అలాగా, ఇప్పుడెక్కడ ఉన్నావు ?”
“ చిత్తూరు మైను రోడ్డు లోనే ! ఇంతకీ నాతో ఏం పని ?”
“ ఒక ట్రాన్సుమిషన్ సిస్టం కావాలి, చాలా అర్జెంట్.”
” నీకు కావలసింది అదే అయితే నువ్వు చాలా లక్కీ ! నేను రెండు సిస్టంలను మొసలి కొలను తెచ్చాను. ఇక్కడ ఒక వ్యక్తికి అమ్మడానికి , ఒకటి అమ్మి, రెండవది వాపసు తీసుకొని పోతూ ఉండగా, నువ్వు అడిగావు.”
“ అలాగా ! థేంక్స్ గాడ్ ! .ఇంతకీ ఆ సిస్టంని మా ఊర్లో ఎవరికి అమ్మావు ?”
“ ఎమ్. & టి .ఆర్. ఇన్ స్టిట్యూట్ ఇంజనీయరు మిస్టర్ వాట్సన్ కి !!”
జీపు నల్లని తారు రోడ్డు మీద , నల్లేరు మీద బండిలాగ సాగి పోతోంది. “ మురుగన్ ! ఎర్రని టాటా ఇండికా కారు, దారిలో ఎక్కడో ఆగి ఉంటుంది, గమనించు,” అన్నాడు గోపాల్రావు.
“ అలాగే సారూ ! ఆ ‘మోటరోలా ’ బాబు, అర గంట క్రితమే బయలు దేరి ఉంటే, మనం ఇరవై కిలో మీటర్ల కన్న ఎక్కువ దూరం వెళ్లనక్కర లేదు.మరో పావు గంటకి ఆ కారు మనకి కనిపిస్తుంది”
పావు గంట గడిచింది.
రోడ్డు ప్రక్కన ఒక వారగా పార్క్ చేసి ఉన్న. ఎర్ర్రని టాటా ఇండికా కారు కనపించింది. ఆ కారు ప్రక్కనే ఉన్నాడు ఒక వ్యక్తి, చక్కని సూటు, బూటు, టై కట్టుకొని స్మార్టుగా ఉన్నాడు. అతనే ‘తేజా’ అని గుర్తు పట్టాడు గోపాల్రావు. తన జీపుని ఆ కారు వెనకాల ఆపాడు. జీపు ఆగగానే, తేజా వచ్చి, “ హలో గోపాల్ !” అని పలకరించాడు..
“ హాయ్ ! తేజా ! నిన్ను ఇలా చూడ గలగడం హర్ష మూ, ఆశ్చర్యమూ రెండూ కలగించాయి’’ అన్నాడు గోపాల్రావు.
“ నాకూ అలాగే ఉంది. ఇంతకీ ఒక పోలీసు ఇనస్పెక్టరుకి , ‘ట్రేన్సుమిషన్ కిట్’ దేనికి ?”
“ దొంగ సామాన్లని ట్రేస్ చెయ్యడానికి.”
“ దొంగ సామానా, ఏమిటవి, ఎక్కడున్నాయి ?”
“ చెప్తాను, ముందు ఇది చెప్పు, ఆ వాట్సన్ దొరకి ఇలాంటి కిట్ నే అమ్మావా ?”
“ అవును, కలర్,ఫంక్షన్ రెండూ ఒకటే, మోడల్ లోనే చిన్నతేడా ఉంది. ”
“ ఏమిటా తేడా ?”
” వాట్సన్ దొరకి ఇచ్చిన సెట్ , ఆటోమేటిక్ ‘ కట్ ఆఫ్’ సౌకర్యం కలిగి ఉంది. అంటే ఏ సబ్జెక్టుకి అది తగిలించినా, దాని మూమెంటు అంటే కదిలినప్పుడు మాత్రమే అది సిగ్నెల్ ఇస్తుంది. సబ్జెక్టు లేక ఆబ్జెక్టు ఆగిపోయినప్పుడు దానిమ్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఈ విధంగా బేటరీ అదా అవుతుంది.”
“ అలాగా, మరి ఈ మోడల్ కిట్లో ఆ ఆప్షన్ లేదా ?”
“ లేదు, ఇది అన్ని వేళలా సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. సిగ్నల్ రావడం లేదు అంటే బేటరీ అయిపోయినట్లు లేదా ఏదో అవాంతరం వచ్చినట్లే !”
“ సరే, నాకు కావలసింది ఇదే ! దీని ఖరీదు ఎంత ఉంటుంది ?”
“ ముఫ్ఫైరెండు వేలు , వాట్సన్ కి ఇచ్చినది మరో రెండు వేలు ఎక్కువ ! ”
“ అంత సొమ్ము నేను నీకు అంద జేయాలంటే చాల రోజులు పడుతుంది. దీని అవసరం గురించి కొనుగోలు ఎంత ముఖ్యమో వివరించేలా, నోటు వ్రాసి, డిప్యూటీ పర్మిషన్ కోసం పంపాలి. అది అతను అంగీకరించినట్లయితే, కనీసం మూడు కంపెనీల కొటేషన్లు తెప్పించి, వాటిలో నీ కంపెనీదే తక్కువ ధరలో దొరుకుతుందని నిరూపించి అతనికి పంపించాలి అప్పుడు మీ కంపెనీ పేరు మీద ’పే ఆర్డర్ ’ తయారు అవుతుంది. అప్పటికి గాని నీకు పేమెంటు దొరకదు.”
(తరువాత భాగం రేపటి టపాలో)
Episode 25 is not showing up on my browser. Please check. Your story is coming up alive with interesting turns and twists. Please use a copyright notification at the bottom of every episode and try to put it as a book when you end the story. Thanks
ReplyDeleteThanks for your comments& concern.unfortunately episode25 was published with out label, so the inconvenience I wanted to correct it but in vain, I will try again.
Delete