Skip to main content

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--27)



(నిన్నటి టపాలో జరిగిన కథ--- వీరన్నతో ట్రాన్స్’మిషన్ సిస్టం తెచ్చి ఇస్తానని చెప్పిన ఇన్స్పెక్టర్ గోపాల్రావు దాని కోసం చిత్తూరు లోని ‘మోటరోలా’ కంపెనీ అసిస్టెంటు మేనేజరు, తన స్నేహితుడు అయిన ‘తేజాకి’ ఫోన్ చేస్తాడు. తేజా తాను అరగంట క్రితమే ఒక సిస్టంని ‘వాట్సన్’ దొరకి అమ్మానని, మరొకటి తనతోనే ఉందనీ, తాని మైన్ రోడ్డు మీదనే ఉన్ననని, అక్కడే ఆగి నిరీక్షిస్తానని చెప్తాడు, ఇనస్పెక్టర్ , మురుగన్’తో పాటు జీపులో వెళ్లి, తేజాని కలుస్తాడు. ఆ ట్రేన్స్ మిషన్ సిస్టంని కొనడానికి, నిబంధనలు అడ్డు వస్తాయని అంటాడు.--- ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం----27

“ నాకు ఈ గవర్నమెంటు  ఆర్డర్ల  సంగతి  తెలుసు. నీ లెవల్లో దీన్ని కొనడం  జరగదని కూడా తెలుసు. అందుకని  దీన్నిఅప్పుగా ఇస్తాను. పని అయిపోగానే  వెంటనే  తిరిగి ఇస్తే  చాలు.”.
“ లేదు, అలాగ  తీసుకోవడం  కూడా రూల్సుకి విరుధ్ధమే ! అందుకు  ఒక  ఉపాయం ఉంది,” అన్నాడు గోపాల్రావు.
“ ఏమిటది ?” అని తేజా  అడుగుతూ  ఉండగానే, ఇనస్పెక్టర్  సైగని అర్థం  చేసుకొన్న మురుగన్ , తేజా  చేతిలోని ‘కిట్’ని బలవంతంగా లాగుకొని , రోడ్డు దిగి  పొదల  మాటుకి  పరుగెత్తాడు.
“ ఏమిటిది, ఏం జరుగుతోంది ?”
“ నీ వైర్ లెస్  ట్రాన్స్ మిషన్  కిట్ ని ఎవరో  దొంగలించారు, ఈ ఏరియా  నా  పోలీసు స్టేషను పరిథి లోకి వస్తుంది కాబట్టి, నువ్వు  నా  స్టేషనుకి వచ్చి, కంప్లయింటు  ఇయ్యి. నేను పరిశోధన చేసి, అది దొరికాక , నీ కంపెనీకి వచ్చి అందిస్తాను,” గోపాల్రావు.
“ అంటే నాటకం ఆడాలంటావు.?”.
“ నా కోసం అది తప్పదు తేజా !”
“ సరే పద, అయితే  స్టేషనుకి.”
“ అవసరం లేదు, ఒక కాగితం మీద  కంప్లెయింట్  ఇక్కడే  వ్రాసి ఇయ్యి. నేను దాన్ని తీసుకొని పోతాను. ఒక కాపీ మీద  సంతకం చేసి  నీకిస్తాను.”
తేజా కారులోని  తన  ఎటాచీ  తీసి, అందులోంచి పేడ్ తీసి, కాగితం క్రింద కార్బన్ పెట్టీ, తన కంప్లయింటు వ్రాసి ఇచ్చాడు. గోపాల్రావు  దాని మీద ‘ రిసీవ్ డ్’ అని వ్రాసి, సంతకం పెట్టి, తేజాకి ఇచ్చాడు తేజా  దానిని తన  ఎటాచీలో  పెట్టి కారులో  పెట్టెసాడు.
తేజా  కంప్లయింటు వ్రాస్తూ  ఉండగానే , మురుగన్ వచ్చి, జీపులో  కూర్చొన్నాడు. తరువాత గోపాల్రావు కూడా వచ్చి కూర్చొన్నాడు. తేజా  తన కారు ఎక్కబోతూ, ఏదో  విషయం ఙ్ఞాపకం వచ్చి, “ గోపాల్ ! చిన్నమాట ! ” అంటూ పిలిచాడు. గోపాల్రావు అతని దగ్గరకు వెళ్లాడు.
“ మరేం లేదు, వాట్సన్ దొర  ఇంట్లో, నేను  చూసిన  దృశ్యం  అనుమానాస్పదంగా  ఉంది. నీకు ఏదైనా  పనికొస్తుందేమోనని---”
“ చెప్పు అక్కడ ఏం చూసావు ?”
“ ఇద్దరు  వ్యక్తులు, ‘ కత్తుల  రత్తయ్య,’ ‘ బత్తుల  భీమయ్య’ లాంటీ  శాల్తీలు  వాట్సన్ తో కలిసి మందు కొట్టడం చూసాను. నేను గమనించిన విషయం  తెలుసుకొన్న  దొర, వాళ్లని కసురుకొంటే  వాళ్ళు ఇంటి  లోపలికి వెళ్లి  పోయారు. రౌడీ షిట్టర్ల లాంటి  మనుషులు, ఒక సీనియర్ ఇంజనీయరు  ఇంటికి వెళ్లి, అతనితో  కలిసి, మందు పార్టీలో  కూర్చోవడం, అసమంజసంగా  ఉంది.” అన్నాడు తేజ.
“ వాళ్లు ముగ్గురేనా ? ఇంకా  ఎవరైనా  ఉన్నారా  ఆ పార్టీలో ?”
“ లేరు, వాళ్లు ముగ్గురే  ఉన్నారు. ఆ ఇద్దరూ  కూడా, దొర  చేత  చీవాట్ల  తిని, అక్కడున్న  రెండు బాటిల్సు తీసుకొని  ఇంటి  లోపలికి  పారి పోయారు.”
“ గుడ్, మంచి సమాచారమే ఇచ్చావు.’ “ సరే,గుడ్ నైట్ !”అంటూ తేజ తన కారు స్టార్టు చేసాడు.
గోపాల్రావు తిరిగి తన జీపులో  కూర్చొంటూ  అన్నాడు. “ మురుగన్ ! విన్నావా  తేజా  మాటలు ! కత్తుల  రత్తయ్య, బత్తుల  భీమయ్య  లాంటి  వారు  ఎవరో---“’
“ విన్నాను సారూ!వాళ్ల అసలు పేర్లు,సుందరం,చిదంబరం.బాడీ ఫేక్టరీలో సెక్యూరిటీ’ గార్డులు.”
“ అలాగా, చాలా  ఇంటరెస్టింగుగా  ఉంది. వాళ్లు  అక్కడ  ఎందుకు ఉన్నట్లు ?”
“ ఇది  అనుమానించ దగ్గ  విషయమే బాబూ ! ఎందుకంటే  వాళ్లిద్దరూ నాలుగు రోజులుగా  కనిపించడం  లేదు.”
“ నాలుగు రోజుల నుంచా ! అంటే  పదమూడో  తారీఖు  నుంచి, అంటే  మ్యూజియంలో  దొంగలు  పడిన  రోజు నుంచి అన్నమాట !”
“ అవును సారూ ! ఆ విషయం  నాకు తట్టనే లేదు, అయితే—” గోపాల్రావు  ముఖం చూసి ఆగి పోయాడు.
“ మాట పూర్తి చెయ్యి మురుగన్ ! నీ అనుమానం ఏమిటి ?”
“ మరేం లేదు సార్ ! వాట్సన్ దొర దొంగతనం  చెయ్యలేదు, చేయించి ఉంటాడు.ఆరోజు ఎంకన్నను  పొడిచి  మ్యూజియంలోని బొమ్మలని  దొంగలు ఎత్తుకు  పోయారు. ఇదాంతా  ఆలోచిస్తే  ఆ దొంగలు వీళ్లు ఇద్దరే అని అనుమానంగా ఉంది. వాళ్లని దొర తన ఇంట్లోనే  దాచేసాడు, అంటే వాళ్లని పంపించినది  ఆ దొరేనని  తెలుస్తోంది.”
“ మురుగన్ ! నీ బుర్ర నిజంగా పోలీసు బుర్ర ! పోలీసు ఇన్ ఫార్మర్ వి అనిపించుకున్నావు. నువ్వు  అన్న  మాటలు  నూరు శాతం  నిజంలాగ  ఉన్నాయి. ”
“ ఇదంతా  ఇంద్రనీల్ బాబుగారి ట్రయినింగండీ ! ‘పురుగు నుండి  పాము వరకు’ అన్న అతని మాటలు  నాకు ఎప్పుడూ  ఙ్ఞాపకం  ఉంటాయి. ”
“ ఇంద్రనీల్ అంటే ఆ మాజీ  ఇనస్పెక్టరేనా ?”
“ అవును సార్ ! ” అంటూ జీపు అద్దాల లోంచి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి, మురుగన్  అవాక్కయ్యాడు.
ఇనస్పెక్టరు కూడా , మురుగన్  పరిస్థితి చూసి , అటువైపు తన  దృష్టి  సారించాడు.
దూరంగా, ఒక  తెల్లని అంబాసిడర్  కారు  రోడ్డుకి  వారగా వెళ్తూ  ఆగింది. దాని తలుపులు విసురుగా  తెరచుకొన్నాయి. ఆ కారు  నుండి, ఏదో  ‘పరుపు చుట్ట ’ లాంటి  వస్తువుని  రోడ్డుకి  అవతల గిరాటు వేసి, ఇద్దరు మనుష్యులు  తిరిగి  కారులోకి  ఎక్కారు. ఆ తరువాత  ఆ కారు స్టార్టు  అయి వెళ్లి పోయింది.  అంత వరకు ఆర్పేసి  ఉన్న  జీపు హెడ్ లైట్లను  వెలిగించి, గోపాల్రావు  ఆ కారు నెంబరుని చూడ బోయాడు. కాని అప్పటికే  కదిలి  పోయిన, ఆ కారు  వెనక  భాగం ,నెంబరు ప్లేటు లోని  అంకెలు  మసక  మసకగా  కనిపించి  దూరమయ్యాయి. “ మురుగన్ ! అంబాసిడర్  కారు నెంబరుని  చూసావా ?” అని అడిగాడు.
“ చూసేను సార్ ! ‘ గన్, టేక్సీ, ముక్కాలి పీట , లైటు స్విచ్చు,” అన్నాడు మురుగన్.
“ మధ్యలో అవేమిటి ?”
“ మా  ఇంద్రనీల్ సారు, కారు లేక  టాక్సీ  నెంబర్లు  ఙ్ఞాపకం పెట్టుకొనే  చిట్కా  చెప్పారు సార్ ! ఆరు బుల్లెట్లు ఉండే  గన్ను  అంటే  ఆరు, నాలుగు చక్రాలుండే  టేక్సీ అంటే నాలుగు, ముక్కాలి పీట అంటే  మూడు, రెండు పొజిషన్లు ఉండే లైటు స్విచ్చు అంటే రెండు, అన్నీ  కలిపితే  6432  సార్ ! ”
“ బాగుంది, ఇంద్రనీల్ గారు ఇంకా  ఏమేమి చెప్పారు ?”
అన్నీ వివరంగా చెప్తాను సార్ ! ముందు ఆ మూట ఏమిటో  చూద్దామా ?” అడిగాడు మురుగన్ . గోపాల్రావు  సరేనన్నాడు.  
తరువాత  జీపుని  అక్కడి  దాకా  తీసుకిని వెళ్లి, ఆ వస్తువును  దగ్గరగా చూసారు ,అది  పరుపు చుట్ట  కాదు  !
ఒక స్త్రీ  శరీరం !!!
 ఇద్దరూ  ఆతృతతో  ఆ శరీరం దగ్గరకి వెళ్లి  చూసారు. ఆమె  అదే ఆ శరీరం, ఇంకా  కొన  ఊపిరితో ఉంది ! బాగా  గాయపడి, అలసి సొలసి  ఉంది !! గోపాల్రావు  మురుగన్  సాయంతో ఆమెను జీపు  వెనక  సీటులో  పడుకోబెట్టి,  ఆస్పత్రి  వైపు  బయలు దేరాడు.
గవర్నమెంటు  ఆస్పత్రిలో  ఆమెను  జాయన్  చేసాక,  గోపాల్రావు  మురుగన్ను , బాడీ  ఫేక్టరీకి  కొంత దూరంలో దింపేసాడు. “ మురుగన్ !  వైర్ లెస్  కిట్ ని  వీరన్న  చేతికి  రహస్యంగా  ఇయ్యి. బహుశా  వాట్సన్ సెట్  కూడ  ఇప్పటికే  అక్కడకి  చేరి ఉంటుంది.  సెట్లు  మారిపోకుండా జాగ్రత్త  పడమని చెప్పు. ”
మురుగన్,“అలాగే  సార్ ! ” అంటూ  చీకటిలో  కలిసి పోయాడు. గోపాల్రావు తన ఇంటికి వెళ్లాడు.
గోపాల్రావుకి  ఇంటి గుమ్మంలోనే  ఎదురయింది  ప్రియంవద . “ ఏమండీ ! పినాక పాణి  గారు  మరో  ఈమెయిల్  పంపించారు,”అంది.
“ అలాగా, మెయిల్ ఓపెన్  అయిందా?’
“ అయిందండీ ”  అంది ప్రియంవద.
“ అలాగయితే రెండు కప్పులు కాపీ చేసి పట్టుకు రా ! త్రాగుతూ అందులో విషయాలు చూద్దాం !  “ అలాగే” అంటూ వంటింట్లోకి వెళ్లింది ఆమె.గోపాల్రావు ఫ్రెష్  అయేందుకు బాత్ రూముకి వెళ్లాడు. కాఫీ  త్రాగుతూ  ఉండగా గోపాల్రావు  మొబైలు ఫోను రింగయింది., “ హలో, గోపాల్రావు స్పీకింగ్ !” అన్నాడు దానిని తీసి.
“ హలో సార్ ! గణప వరం  ఇనస్పెక్టరుని  మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన  తెల్ల  అంబాసిడర్  కారు,  నెంబరు 6432  చెక్ పోస్టు దగ్గర  పట్టుకొన్నాం సార్ ! అందులో  ఇద్దరు వ్యక్తులు  ఉన్నారు.”
“ అలాగా, వాళ్లని  కస్టడీ లోకి తీసుకొన్నారా ?”
“ తీసుకొన్నాం సార్ ! ఆ కారుని కూడా  మా  ఠాణాకి తీసుకెళ్ళాం.”
“ సరే ! వాళ్ల పేర్లు,వివరాలు ఏవైనా  తెలిసాయా ?”
“ చెప్పారు సార్ !  ఒకడి పేరు సుందరం, మరొకడి పేరు చిదంబరం. ఇద్దరూ  బాడీ  ఫేక్టరీ  సెక్యూరిటీ  గార్డులుగా  పని చేస్తున్నారట !వాళ్ల దగ్గర  కేష్  కూడా  ఉంది. కంపెనీ  పని మీద ఆ కేషుని   డెలివరీ  చెయ్యడానికి  వెళ్తున్నామనీ, తమ కారులో ఎలాంటి అమ్మాయినీ  తీసుకొని రాలేదనీ  చెప్పారు.”
“ వాళ్లు ఒక అమ్మాయిని  ప్రాణాపాయ  స్థితిలో ,రోడ్డు బయటకు  విసిరి వేయడం నా  కళ్లారా  చూసాను. ఆ  అమ్మాయి  ఇంకా  కోలుకోలేదు. ఆమె  స్టేటుమెంటు  ఇచ్చేవరకు , వాళ్లని  లాకప్పులోనే  ఉంచండి. భాడీ  ఫేక్టరీ  ప్రొప్రయిటర్ కి  ఫోను చేసారా ?”
“ చేసాం  సార్ ! ఆ ఫేక్టరీ  ప్రొప్రయిటర్  సత్యనారాయణ  గారు, అలాంటి పేరు గల , సెక్యూరిటి  గార్డులెవరూ  తమ దగ్గర  పని చేయడం లేదని  చెప్పారు . అయినా సెక్యూరిటీ  వాళ్ల  చేత  కేషు  పంపించే  అలవాటు  తనకి లేదని చెప్పారు. సార్ !”
“ నిజమే  అయి ఉంటుంది ! సత్యనారాయణ గారు  ఎప్పుడూ  సత్యాన్నే  పలుకుతారు. ఆ కారు నెంబరుని బట్టి, అదెవరిదో  ట్రేసు  చేసారా ?’’
“ చేసాం  సార్ ! ఆ కారు,‘తులజా  భవాని ’ అనే  అమ్మాయిది. ఆవిడ పెద్ద  సోషల్ వర్కర్  అట !  తక్కిన  వివరాలని సేకరించడానికి  నేను  మనుష్యులని  పంపించాను., తెలియగానే  మీకు చెప్తాను.”
(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద