Skip to main content

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ ధారావాహిక---29)


(నిన్నటి టపాలో జరిగిన కథ---- పినాక పాణి ఈ-మెయిల్ ద్వారా, ఇనస్పెక్టర్ గోపాల్రావుకి ఇంద్రనీల్, తులజల ప్రేమ గాధ తెలుస్తుంది. ఇద్దరి కిద్దరూ మొసలి కొలను వచ్చారనీ, మ్యూజియంలో దొంగతనం జరిగాక వారిలో ఎవరికీ కనబడకుండా పోయారనీ తెలుస్తుంది.  ఆస్పత్రిలో కోలుకొన్న తులజ స్టేట్ మెంట్ ఇస్తుంది. ఇంద్రనీల్ కోసం ఆ ఊరు వచ్చిన తనని వాట్సన్ చూసాడనీ, తను హై క్లాస్ కాల్ గర్ల్ కావడం వల్ల తన సెవలు ఉపయోగించుకోవడనికి తన భవనం లోకి తీసుకొని వెల్లాడని, అక్కడ సుందరం, చిదంబరంల కోర్కె తీర్చమని చెప్పాడనీ అంది. వాళ్లు తనని బంధించి, చిత్రహింసలు పెట్టారనీ, చివరికి తన కారులోనే స్పృహ తప్పించి తీసుకెళ్లారని చెప్తుంది. పట్టుబడిన సుందరం చిదంబరంలు తాము మ్యూజియంలో బొమ్మల దొంగతనం వాట్సన్ దొర చెప్పడం వల్ల చెసామని, ఆ బొమ్మల కోసమే వాచ్ మెన్ ఎంకన్నను గాత పరచామని ఒప్పుకొంటారు. తలజను ఆ దొరే  కొన్నాళ్లు వాడుకోమన్నాడనీ, చివరకి కొంత డబ్బు ఇచ్చి ఆమె కారులోన్ పారిపోమన్నాడనీ చెప్తారు. ఈ లోగా రిఫ్రిజరేటర్లో దాచి షిఫ్ మెంట్ చెసిన బొమ్మలు ఆఖరి నిముషంలో పట్టుబడ్డాయని వార్త తెలుస్తుంది.కంసాలి లచ్చన్నని కానిస్టేబిల్ టూ.నాట్.త్రీ తీసుకొని వస్తాడు--- ఇక చదవండి )

మొసలి కొలను మ్యూజియం----29

    పోలీసు  స్టేషను  లాకప్  సెల్లో  దానయ్య  కూర్చొని  ఉన్నాడు. పాత  గొంగళి  కప్పుకొని , తల  మీద  సత్తు  కంచం  పెట్టుకొని  దాని  మీద  ఒక  సత్తు  గ్లాసు  బోర్లించుకొని, బాసింపట్టు  వేసుకొని  ఉన్నాడు . ఇనస్పెక్టరు  గోపాల్రావు  చేతిలో  ఒక్  బెత్తం పట్టుకొని , సెల్  లోపలికి  వచ్చి, బెత్తంతో  వెనకనుంచి  దానయ్య  వీపు  మీద  ఒక్కటి  వేస్తాడు. పళ్లెం  గ్లాసు  క్రింద  పడ్తాయి. దానయ్య  వాటిని   తిరిగి తల మీద  పెట్టుకొన్నాడు . ఇనస్పెక్టర్  వాటిని  మరో దెబ్బ వేసి  పడగొట్టాడు .

    దానయ్య వెంటనే, “ఇనస్పెక్టరు బాబూ ! దండాలండి ,” అన్నాడు.

    “ నేనే  వచ్చానని  ఎలా  తెలుసు ?” అడిగాడు  గోపాల్రావు.

    “ జైల్లోని  ఖైదీని  కొట్టేవోడు  ఇనస్పెక్టరు  కాక  ఇంకొకడు  ఎలాగవుతాడండీ ?”

    “ అంటే  ఖైదీలను  కొట్టడం  తప్ప మాకు  మరో  పని  తెలియదంటావు , అంతేనా ?”

    “ అంతేనండి ఆడ ఖైదీలను సెరిసి, మగ  ఖైదీల  కళ్లు, గోళ్లు,వేళ్లు తీసేసి , ఇనోదించడమే  కదండి  మీ  పోలీసోళ్ల  పని !’’

    “ దానయ్యా  పొరపాటు  మాటలాడుతున్నావు , నిన్నిప్పుడు  చితకగొడితే  ఏం చేస్తావు ?”

    “ నానేటీ  సేయలేనండి,  మీరు  మాత్రం  నా  మాటల్ని, నిజం  సేసినోళ్లు  అవుతారండి .”

    “ నీ  మాటల్ని  వింటూంటే  మొట్టాలనే  ఉంది .’’

    “ మెత్తటోళ్లని  మొట్టాలనే  ఉంటాదండి .అదంతేనండి.  దూది మెత్తటిదే  కదండి, దానిని నలిపి ,ఒత్తులు  సేసి , నూనెలో  ముంచి , దీపం  ఎలిగించడం  లేదేంటండి ?” 

    “ గుడ్, వెరీ  గుడ్ ! మీరు  నలగడం, సమాజ  కళ్యాణానికే  అయినప్పుడు  , నలపడంలో గాని, నలగడంలో  గాని, తప్పేముంది ?”

    “ నలగడమో, నలపడమో  సమాజం   కోసం  అయితే  పర్లేదండి. కాని  ఏదో  నలుగురి  కోసం
  అయతే అన్నాయమేనండి .”

    “ ఏంటీ  నలుగురి  కోసమా ?”

    “ అవునండి, నూరుమందిని  సమాజం అనుకొంటే , అందులో  నలుగురే  బుగతలు,  తక్కినోళ్లు బారికోళ్లే నండి . ఈ దూదిలాంటి  బారికోళ్లందరూ, ఒత్తుల్లా నలిగి ,రక్తాన్నిసమురు సేసుకొని  కాల్తేనే  కదండి , ఆ బుగలింట్లో  దీపాలెలిగేవి ! అదే  సమాజ  కల్యాన  మనుకొంటే , ఆ నలుగురికి  సాయపడే  మీరూ, మీ  సట్టాలు, అన్నేయానికి  సుట్టాలే  కదండి ?”

    గోపాల్రావు  ఆ మాటలకి కోపంతో , దానయ్య పిర్ర  మీద  లాఠీతో  ఒక్క దెబ్బ  వేస్తాడు. దానయ్య  లేచి  నిలబడతాడు. కంబళి  క్రింద  పడుతుంది. గోపాల్రావు  ,దానయ్య  చొక్కా  కాలరు  పట్టుకొని , గుంజుతూ, “ నిజం  చెప్పు  నువ్వెరివో ? నిన్ను  ఇన్నాళ్లూ  సి.ఐ.డి  అనుకొని  గౌరవమిచ్చాను. నీ  పొటోలు  తీయించి, సెంట్రల్  ఇంటలిజెన్సుకి  పంపి  కూపీ  తీసాను, నువ్వు  సి.ఐ.డివి  కావు.”

    “ దానయ్య  నవ్వుతాడు, “ వాతలెట్టుకొన్నంత  మాత్రాన  నక్క  పులినాగ , సీర  సుట్టినంత  మాత్రాన , కొజ్జావోడు  ఆడదాన్లాగ, మారిపోతారేటండి ?” అంటూ  ఇనస్పెక్టరు  పట్టు  విడిపించుకోవడానికి  ప్రయత్నం  చేస్తాడు.
    అతని ప్రయత్నం చూసి ,గోపాల్రావు దానయ్య చొక్కాని వదిలేసి,“అయితే నువ్వెరివి ?” అన్నాడు

     .“ నాను దానయ్యనేనండి, ఎంకన్నకి  సొయాన  పిల్లనిచ్చిన  మావనండి.”

    “ కాదు నువ్వు దానయ్యవి  కావు !  దానయ్య  ఉత్త  పల్లెటూరి  రైతు. చదువు  రాని మొద్దు, ఎప్పుడూ  తనలో  తాను  గొణుగు  కొంటూ, అప్పుడప్పుడు  ఇల్లు విడిచి  పెట్టి, దేశాలు  తిరిగే  మతి  స్థిరం  లేని మనిషి ! నిజం చెప్పు” అంటూ  తిరిగి  చొక్కా  కాలరు  పట్టుకొని గుంజి, “ నీ  మాటలు  నువ్వు ‘ నక్షలైటువని’ చెప్పక  చెప్తున్నాయి. నిజం చెప్పు, నీదే  ఇజమో ?” అని  ప్రశ్నించాడు.

    దానయ్య  ఇనస్పెక్టరు  పట్టు  బలవంతంగా  విడిపించుకొని , “ ఇనస్పెట్టరు  బాబూ ! ఈ సొక్కా  గవర్నెమెంటోడిదండి ! సిరిగితే  మీకే  నట్టవండి ! అయినా  అదట్టుకోంటేనే  గాని, కైదీని బెదిరిస్తేనే  గాని, నిజం  రాదనుకోడం ఉత్త  బ్రెవేనండి ! మీ పోలీసోళ్ల  కాళ్లు , ఇదుగో ఇక్కడే  పప్పులో పడుతుంటాయండి.” అని అన్నాడు.

    ఇనస్పెక్టరు గోపాల్రావు  కోపంతో  పళ్లు నూరుతాడు. ఒక  చేతి  అరచేతిని  రెండో  చేతి  పిడికిలితో
  కొట్టుకొంటూ  ఇక  రౌండు  పచారు  చేసి, “ సరే ! నువ్వా బెంచీ  మీద  స్థిమితంగా  కూర్చొని , అడిగిన  వాటికి  నిదానంగా నిజం  చెప్పు! ”

    దానయ్య ,గోపాల్రావు చూపించిన బెంచీని లాగి,సరి చేసి, పద్మాసనం వేసుకొని , నిటారుగా కూర్చొంటాడు.“అడగండి, బాబయ్యా !” అంటూ.

    “ చెప్పు దానయ్యా ! నీదే  ఇజం , లెనినిజమా, మావోయిజమా ?”

    దానయ్య నవ్వి,” ఈ నిజాలన్నీ‘ఇప్ప పూల సారా’ లాంటి వండి, తాగిన కొద్దీ నిసానిస్తాయండి ! నేను – నేను తాగుబోతుని  కానండి,” అన్నాడు.

    “ తిరకాసుగా  మాట్లాడకు, నువ్విప్పుడు  బుగతలు, బారికోళ్లు  అంటూ  కూసావే, ఆ  కూత  కమ్యూనిజంది !”

    “  కాదు  బాబయ్యా ! ఆ కూత  ఏ ఇజానికీ  సొంతం  కాదండి  అది  నిజవండి ! నిజాలు  ఇజాల  సెప్పు  సేతుల్లో  వుండవండి  బాబయ్యా ! ఆ కూత పీడిత  జెనాలదండి. బతుకు  దారి  మూసుకు  పోయిన  బతక  లేని  బతుకులవండి ! తెల్లోల్లు  మన్నేలిన  రోజుల్లో  గాంధీయిజం  ఇలాగే  కూసిందండి, ఆ కూసినోల్లని  జైల్లలో  పెట్టి, మీ  పోలీసు  లిలాగే  కుల్ల  బొడిసారండి. సివరకేటయిండండి ! ఆ కూత పెరిగి  తెల్లోల్ల  గుండెలదరి,  సొరాజ్జం  వచ్చి, గాంధీయిజం  గద్దెక్కిందండి ! ఇనస్పెట్టరు  బాబూ , ఏ  ఇజమైనా  పెడతోవ  పడితేనే, మరో  ఇజం  తలెత్తుదాదండి ! ఇప్పుడీ  కూత  కమ్యూనిజందని  మీరంటే  తప్పు  ఇజాలది  కాదండి ! దాన్ని  తెప్ప సేసుకొని, ఏరు దాటి, తగలేసిన  మన  నాయకులదండి !”

    “ అయితే  ఈ  ఇజాలు  చెప్పేవన్నీ  ఒకటేనంటావు ?”

    “ అవునండి, బయటికెన్ని చెప్పినా , గద్దెక్కి  జెండా  నెగరేసుకోడమే ఆటి అసలు ఆశయ మండి. అందుకని  బాబయ్యా !  నీదే  ఇజమని  ఎవురినీ  అడగ  బోకండి, పూలదండలో  దాగుండే  దారం  లాగ  ఆటన్నిటికీ  ఒకటే  సూత్రవండి.”

    “ ఏమిటో  ఆ సూత్రం ?”

    “ ఆశండి --- అది  కనబడకుండా , ఆదర్శాలనే  రంగురంగుల  పూలెట్టు కొంటారండి.--  డిఫరెన్సు  ఆ పూలలోనే  ఉంటుందండి !”

     దానయ్య  ఆవేశంతో  అన్నాడు, “ నవ్వండి  బాబయ్యా ! నవ్వండి , ఆశలేనోడు  ఉన్నాడంటే ,
 ఏడ్రా  ఆ  అవతార  పురుషుడు   అని ఎతికి, గోసి  ఇప్పేసే  రోజులండీ  ఇయి. అంతేగాని  ఆడితో  కలిసి  దేశబక్తి  గీతాన్ని  పాడేవోడెవడండి ?”

    “ దేశభక్తి  గీతమా , ఏ దేశభక్తి  గీతం ?”
    “ గురజాడ  వారిదండి,  ముత్యాల  సరాల  గీతవండి,
    1. దేశమును ప్రేమించుమన్నా, మంఛి యన్నది పెంచుమన్నా,
        వొట్టి  మాటలు  కట్టి  పెట్టోయ్,  గట్టి  మేల్  తల  పెట్టవోయ్ !
    2.  పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువు పాటుపడవోయ్,
         తిండి  కలిగితె  కండ  కలదోయ్, కండ  కలవాడేను  మనిషోయ్ !
    3.  దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్,
        పూని  యేదైనాను  ఓక  మేల్,  కూర్చి  జనులకు  చూపవోయ్ !
    4.  సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి సాయపడవోయ్.
         దేశమంటే  మట్టి  కాదోయ్, దేశమంటే  మనుషులోయ్ !
    5 చెట్టపట్టాల్ పట్టుకొని, దేశస్థులంతా నడవ వలెనోయ్,
       అన్న  దమ్ముల  వలెను  జాతులు, మతములన్నీ  మెలగ  వలెనోయ్ !

అని  పాడేవోడెవడండి ?”

    అదే సమయంలో,కటకటాల తలపులు తెరచుకొని, టు నాట్ త్రీ వచ్చాడు. వస్తూనే ఇన్స్పెక్టరుకి సెల్యూటు  చేసి,  “సార్ !”  అన్నాడు.

    “ ఏమిటోయ్ ?”  ఇనస్పెక్టర్  అడిగాడు.

    “ రామా,రామ ! మొసలి  కొలను నుంచి కంసాలి లచ్చన్న,గోవా నుండి  టెలిఫోను వచ్చాయండి.”

    “  ఏంటి ? మొసలి  కొలను, కంసాలి  లచ్చన్న, గోవా  నుంచి  టెలిఫోను  చేసాడా ?”

    “ రామా రామ ! కంసాలి  లచ్చన్న  మీతో  ఏదో  చెప్పాలని స్వయంగా  నడిచి వచ్చాడండి, పోతే  టెలిఫోను ---”

    “ ఇక్కడకు  రాదు  కాబట్టి, మనమే  టెలిఫోను దగ్గరకు  వెళ్లాలంటావు ?”

    “ రామా  రామ ! మనం కాదండి, మీరు  వెళ్లాలండి.”

    “ నాకు  తెలుసు  లేవోయ్ ! నువ్వు  కూడా  పద, ఆ లచ్చన్నని  చూపిద్దువు  గాని –”బయటికి  వచ్చి  సెల్  తలుపులు  వేసేస్తాడు.

    టు నాట్ త్రీ, కంసాలి లచ్చన్నని  చూపిస్తాడు. ఇనస్పెక్టరు ముందుగా టెలిపోను తీసి, మాట్లాడు తాడు.” హలో ! ఇనస్పెక్టర్  గోపాల్రావ్  స్పీకింగ్ ! ”                 “ ---- ”

    “ ఏమిటీ ! మొసలి కొలను  మ్యూజియంల  ఎగ్జిబిట్లు , గోవాలో  షిప్పింగు  అవుతూ  ఉండగా , దొరికాయా ? వెరీ  ఇంటరెస్టింగ్ న్యూస్ ! ఎందులో  దొరికాయి ?”            “ ------ ”

    “ రిఫ్రిజరేటర్లో  రహస్యమైన  సొరలు  చేయించి, వాటిలో  దాచారా , దాన్ని  లగేజిలో  బుకింగు  చేసిందెవరు ?”                                 “ ------ ”

    “ మై  గాడ్ ! వాట్సన్ దొర  పర్సనల్  లగేజా ?”             “ -------- ”

    “ వాట్సన్  ఏమంటున్నాడు ?”                     “-------- ”

    “ తనకి  తెలియదనే  అంటాడు  లెండి, ఆతన్ని  రిమాండులో  ఉంచండి, నేను  రేపు  బయలుదేరి  వచ్చి  ఛార్జి  తీసుకొంటాను.”                         “ -------- ”

    “ అలాగే, రేపే  బయలు  దేరుతున్నాను, థేంక్స్ !” అంటూ  గోపాల్రావు  టెలిఫోను  పెట్టేసి,  టు నాట్ త్రీ  వంక  చూసాడు. “ టు నాట్ త్రీ  ఎవరో  కంసాలి  లచ్చన్న  అన్నావు ?”

    “  ఇదుగో  ఈ వ్యక్తే  కంసాలి  లచ్చన్న ! రామా  రామ ! ఏదో  ‘గోవా’ , ‘షిప్పు’  అంటున్నారు, ఏమయింది సార్ ?”
(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద