(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇన్స్పెక్టర్ గోపాల్రావు దానయ్యను లాకప్పులోనే ప్రశ్నిసాడు. దానయ్య ఏవేవో సమాధానాలు చెప్తాడు. దానయ్య ఎవరో , ఆ బొమ్మల పట్ల అతనికి గల ఇంతరెస్టు ఏమిటో గోపాల్రావుకి అంతు పట్టదు. దాంతో దానయ్యను వదలి ,కంసాలి లచ్చన్నని ప్రశ్నించడం మొదలు పెడతాడు--- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం--30
“ టు నాట్ త్రీ ! ఒక శుభవార్త ! మ్యూజియంలో దొంగలించిన బొమ్మలు , గోవాలో, ‘ వాట్సన్ దొర’ పర్సనల్ లగేజిలో అంటే , రిఫ్రిజిరేటర్లో , షిప్పు ఎక్కుతూ పట్టుబడ్డాయి.కస్టం వాళ్లు పట్టుకొన్నారు, అసలు దొంగ --- ”
“ ఆ దొరేనండి !”
“ రామా రామ ! అనకుండా టు నాట్ త్రీయేనా ఆ మాటలన్నది ! అని ఆశ్చర్య పోతూ, ఆ మాటలు వినబడిన వైపు చూసాడు ఇనస్పెక్టర్ , అవి కంసాలి లచ్చన్న అన్న మాటలని గ్రహించి , ఆశ్చర్యంతో, అతని వైపు దృష్టి నిలిపి, “ ఎవరు నువ్వు, నీ కెలా తెలుసు ?” అని అడిగాడు.
“ నేను మా ఊరి కంసాలినండి ! పేరు లక్ష్మణాచారి, అండి. అందరూ లచ్చన్న అంటారండి.”
“ రామా రామ ! లచ్చన్నా, నువ్వు ఏ ఊరి కంసాలివి ?”
“ మా ఊరి కంసాలినండి.”
“ రామా రామ ! మీ ఊరి పేరు మా ఊరా ?”
“ కాదండి, మొసలి కొలనండి.”
“ రామా రామ ! మరి మాఊరని ఎందుకంటావ్ ?”
“ మొసలి కొలను మా ఊరే కదండి !”
వాళ్ల సంభాషణ పెడదారి పడుతోందని గ్రహించిన గోపాల్రావు , మధ్యలో కలగ జేసుకొని, “ స్టాపిట్ ! లచ్చన్నా , నీ ఊరేదో, నాకు అర్థమయింది. వృత్తి కూడా తెలిసింది., ఫోతే వాట్సన్ దొరే మ్యూజియం లోని బొమ్మల దొంగ అని నీ కెలా తెలుసు ?”
“ ఖచ్చితంగా తెల్దండి, అనుకొన్నానండి.”
“ ఎందుకలా అనుకొన్నావు ?”
“ ఎందుకేటండి ! మ్యూజియం లోని ఆంజనేయులోరి బొమ్మకి --- ”
ఇనస్పెక్టరు మాట మధ్యలో కలగ జేసుకొని,“నకిలీ చేసింది నువ్వేనన్నమాట ?”అని అడిగాడు.
“ కంచు కరిగించి కంచాలు మాత్రమే చేసేవోన్నండి, దానికి నకలు నేనెలా తీయ గలనండి. ”
“ చేసింది నువ్వు కాదన్నమాట ! నువ్వేనేమో అనుకొన్నాను.”
“ అవునండి, కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్నండి. ఆ దొర కూడా మీలాగే అనుకొని, ఇదుగో దాని కొల్తలు, ఫొటోలు ఇచ్చాడండి,” అంటూ కంసాలి లచ్చన్న ఒక కవరు ఇనస్పెక్టరు చేతికి ఇచ్చాడు.
ఇనస్పెక్టరు కవరు లోని ఫొటోలు, చూసి, టు నాట్ త్రీ చేతికి ఇచ్చాడు, “ టు నాట్ త్రీ ! ఇది మ్యూజియం లోని ఎగ్జిబిట్ నెంబరు ముప్పది ఆరు ఫొటోలు ! రకరకాల ఏంగిల్సులో తీసినవి. ఆ కాగితాల మీద దాని కొలతలు ఉన్నాయి. వీటిని జాగ్రత్త చెయ్యి.”
“ రామా రామ ! ఫొటోలోని ఆంజనేయ మూర్తి ఎంత బాగుందండి ! రామా రామ అంటున్న ట్లుంది.” అంటూ ఒక ఫైలు తీసి దాంట్లో పెడతాడు.
“ అయితే లచ్చన్నా ! వాట్సన్ దొర, నువ్వు ఆంజనేయుడి బొమ్మకి , నకల తీయగలవని అనుకొని, వీటిని నీకు ఇచ్చాడంటావు !”
“ అవునండి, కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్నండి. –”
“ స్టాపిట్ ! ఈ టు నాట్ త్రీ , రామా రామతోనే వేగలేక పోతున్నాను నువ్వు మాటి మాటికీ కంఛు కరిగించి కంఛాలు చేసావంటే, దాన్ని కాస్త చెవుల్లో పోసుకొని సీలు చేసుకోక తప్పదు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు., తెలిసిందా ?”
“ సిత్తం అలాగేనండి, కంఛు కరిగించి కంఛాలు --- ” అని ఇనస్పెక్టరు ముఖాన్నీ, అతని ముఖ కవళికల్నీ చూసి ఆగిపోయాడు లచ్చన్న .
“ లచ్చన్నా ! నువ్వు కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్నండి. అన్న డైలాగు ఆ దొరతో చెప్పలేక పోయావా ?”
“ సిత్తం సెప్పేవోన్నేనండి, కాని దానయ్య సెప్పొద్దన్నాడండి. అప్పటికీ నోరు జారి కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్నని. రెండు సార్లు సెప్పేసానండి , కాని ఆ దొరకి అర్థం కాలేదండి.”
“ కంసాలి లచ్చన్న చెప్పిన మాటలు విని, ఇనస్పెక్టరు,టు నాట్ త్రీ ఇద్దరూ ఆశ్చర్య పోయారు. టు నాట్ త్రీ అయితే నోరు వెళ్లబెట్టి ,“ రామా రామ ! ఎంత ఆశ్చర్యం! ”అని కూడా అన్నాడు. ఇనస్పెక్టరు కాసేపటికి తేరుకొని, “ లచ్చన్నా ! దానయ్య అలాగని నీతో చెప్పమన్నాడా ?” అని అడిగాడు.
“ అవునండి, ఆ దానయ్యే లేకపోతే, ఆ దొర దగ్గరకి వెళ్లి బొమ్మలమ్మడానికి నాకు దయిర్యం ఎక్కడిదండి ? నేను కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్ని కదండి.”
“ గోపాల్రావు రెండు చెవులూ మూసుకొంటాడు, “ ఓహో , నీ కంచు కరిగించడం ఆపుతావా లేదా ?” అంటూ బెత్తం తీసి బెదిరిస్తాడు.
“ సిత్తం ! మరి కరిగించనండి.”
“ ఏయ్ ! టు నాట్ త్రీ ! ఈ లచ్చన్న మళ్లీ కంచాలు చేయడం మొదలు పెడితే, ఈ బెత్తంతో తగిలిస్తూ ఉండు,” అని ఆ బెత్తాన్ని అతని చేతికి ఇస్తాడు, గోపాల్రావు.
“ రామా రామ ! అలాగేనండి.”
“ లచ్చన్నా ! నువ్వు ఆ దొర దగ్గరకి ఎలా వెళ్లావో, ఆ దొర ఏం చేసాడో , దానయ్య నీతో ఏం చెప్పాడో, మొదటి నుండి టూకీగా చెప్పు, అర్థమయిందా, కంచు కరిగించకుండా చెప్పు.”
“ సిత్తం దానయ్య, నేను ఒక ఊరి వాళ్లమేనండి, నేను కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్నండి.—”
“ రామా రామ! మళ్లీ మొదలెట్టావు .” అంటూ టు నాట్ త్రీ లచ్చన్నపిర్రమీద దెబ్బ వేస్తాడు. కంసాలి లచ్చన్న పిర్ర తడుముకొంటూ, చెప్తాడు, “ ఒక రోజు దానయ్య నా కాడికొచ్చి, కొన్ని కంచు బొమ్మలు ఇచ్చాడండి. ఆటి నట్టుకెళ్లి , దొర బంగళాకి వెళ్లి అమ్మమన్నాడండి. ”
“ ఏం బొమ్మలు ?”
“ ఏడాకుల అరటి చెట్టు, మూడు దీపం సెమ్మాలండి .”
“ అంటే మ్యూజియంలో ఉన్న లాంటి బొమ్మలేనా ?”
“ ఏవో నాకు తెల్దండి, ఆ బొమ్మలు నాను సూళ్లేదు కదండి .”
“ సరే, తరువాత ఏం జరిగిందో చెప్పు.”
“ ఆ దొర మారు బేరం లేకుండా ఆటిని కొనేసి, మల్లీ మర్నాడు రమ్మన్నానండి.”
“ నువ్వు మర్నాడు వెళ్లేసరికి, ఈ ఆంజనేయిడి ఫొటోలు, కొల్తలు ఇచ్చి, ఇలాంటిది చేసి తీసుకొని రమ్మన్నాడు ! అంతేనా ?”
“ అవునండి, అప్పటికీ సెప్పానండి, నేను కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్ని—”
“ రామా రామ !” అంటూ బెత్తంతో మళ్లీ లచ్చన్న పిర్ర మీద ఇకటి వేస్తాడు టు నాట్ త్రీ.
లచ్చన్న పిర్ర తడుముకొంటూ, “ ఆ ఫొటోలు, కాగితాలు తెచ్చి, దానయ్యకి ఇచ్చానండి. దానయ్య ---- కంచు – ” అంటూ , ఆగిపోయి టు నాట్ త్రీ పరధ్యానంలో ఉండడం చూసి, బెత్తం అతని చేతిలోంచి లాగేసుకొని, “ దానయ్య ఎంటనే కంఛు కరిగించి బొమ్మ సేసేసాడండి ! ”
“ మై గాడ్ ! పంచముఖి ఆంజనేయు ప్రతిమకి నకలు తీసిన వాడు దానయ్యా !!”
“ అవునండి,” అంటూ చేతిలో బెత్తాన్ని ముద్దు పెట్టుకొంటూ, “ నేను కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేసేవోన్నండి. ” అని టు నాట్ త్రీ వంక గర్వంగా చూసి, “ దానికి నకలు చేయడం నా వల్ల ఎలాగవుద్దండి ?” అన్నాడు లచ్చన్న.
“ లచ్చన్నా ! ఆ తరువాత ఆ బొమ్మని పట్టుకెళ్లి దొరకి అమ్మావా ?”
“ మారు బేరం లేకుండా అమ్మేసానండి ! కంఛు కరిగించి కంఛాలు సేసి అమ్మినా అన్ని డబ్బులు రావండి ! అంతా ఆ దానయ్య సలవండి .”
“ ఆ దొర నీకు ఎంత డబ్బిచ్చాడేంటి ?''
“ అయిదు వేలు ఇచ్చాడండి, ఎన్ని కంచాలు సెస్తే ---”
“ స్టాపిట్ ! అయిదు వందల కరెన్సీ నోట్లు ఇచ్చాడు కదూ !”
“ అవునండి, మీకెలా తెల్సండి ?”
“ నాకు తెలుసు అంతే కాదు,ఆ నోట్లుకూడా నాకు చూపించమని దానయ్య చెప్పి ఉంటాడు ”
“ నిజవేనండి, కాని ఒకటే తెచ్చానండి, సూసి ఇచ్చేస్తారు కదండి, మిగతా వాటితో, కంచు కొని కరిగించి కంచాలు – ” అంటూ ఉండగా, టు నాట్ త్రీ, లచ్చన్న చేతిలోని బెత్తాన్ని లాగేసుకొని , “ రామా రామ !. నీ కంచు కరిగించడం ఆపుతావా లేదా ?” అంటూ పిర్ర మీద దెబ్బ వేస్తాడు.
“ లచ్చన్నా ! నువ్వు తెచ్చిన నోటు చూపించు !”
లచ్చన్న తన దగ్గరున్న నోటు ఇనస్పెక్టరు చేతికి ఇస్తాడు. అతను దాని చూసి, “ టు నాట్ త్రీ, దానయ్య చొక్కా జేబులో దొరికిన నెంబర్లేమిటి ?”
టు నాట్ త్రీ ఫైలు తెరచి చూస్తాడు, “ రామా రామ ! వాటి నెంబర్లు , సీరీసు నెంబరు కూడాకలుస్తున్నాయండి.” అన్నాడు.
“ అవి ఏ బేంకులో డ్రా అయ్యాయి ?”
“ ఆంధ్రా బ్యాంకులో , మార్చి ఏడవ తారీఖున డ్రా అయ్యాయండి. ఏబది వేల చెక్కుకి మారుగా చెక్ మీద వాట్సన్ దొర సంతకమే ఉందండి.”
“ అంటే ఆంజనేయుడి బొమ్మ నకలు తీయించడానికి, దానిని అసలు బొమ్మతో మార్చేయ డానికి కూడా, వాట్సన్ దొర తన సొంత ఎకౌంటు లోని డబ్బుని వాడడన్న మాట !”
“ రామా రామ ! మ్యూజియం గేటు దగ్గర, ఎంకన్న దెబ్బ తిని పడి పోయిన చోట, దొరికిన నోట్లు, దానయ్య చొక్కా జేబులోని నోట్లు, లచ్చన్న ఇచ్చిన నోటు , నెంబర్లు ఒకే సీరీసులోవి కావడం అది దొర సొంత ఎకౌంటు లోని డబ్బు కావడం-- అతని నేరాన్ని ఋజువు చేస్తున్నాయండి.”
“ ఈ నోట్ల సాక్ష్యంతో మనం, వాట్సన్ ని మాట్లాడించ వచ్చును, ఏమంటావ్ ?”
`` లచ్చన్నా ! నువ్వే పని చేస్తుంటావు ?”
లచ్చన్న మాట్లాడడు, టు నాట్ త్రీ బెత్తం వంక చూపిస్తాడు.
“ ఫరవాలేదులే, ఆ బెత్తం నిన్నేమీ చెయ్యదులే ! భయం లేకుండా చెప్పు.”
“కంఛు కరిగించి కంఛాలు మాత్రమే చేస్తానండి. ”
“ ఆ కంచాలేవో మీ ఊరికి పోయి చేసుకో, పో !”
“ అలాగేనండి, నా నోటు ఇచ్చేస్తే ఎల్లిపోతానండి.”
“టు నాట్ త్రీ! నువ్వు లచ్చన్నని తీసుకొని వెళ్లి, ఈ నోటు అచ్చన్న దగ్గర తీసుకొన్నట్లు రశిదు ఇచ్చి పంపించు.’’
“ బాబూ ! మరయితే నా నోటు దొరకదేమిటండి ?’’
“దొరుకుతుంది, కేసంతా అయపోయాక రశీదు చూపించి పట్టుకుపోవచ్చు,”అన్నాడు ఇనస్పెక్టరు.
“ అయ్య బాబోయ్ ! అయితే కంచాలెలా చేయాలండి ?’’
“ రామా రామ ! అందాకా రశీదు చూపించి, , అప్పు తీసుకొని , కంచు కొని కరిగిస్తూ ఉండు, పద బయటికి ,” అంటూ బెత్తంతో బెదిరిస్తాడు టు నాట్ త్రీ
లచ్చన్న అయిష్టంగానే , స్టేషను బయటికి పోతాడు.
లచ్చన్న వెళ్లి పోగానే , ఇనస్పెక్టర్ కటకటాల తలుపులు తెరచుకొని, దానయ్య సెల్ లోకి వెళ్తాడు. దానయ్య బెంచీ మీద పడుకొని ఉంటాడు.
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment