Skip to main content

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---31)



(నిన్నటి పోస్టులో జరిగిన కథ----కంసాలి లచ్చన్న స్టేట్’మెంట్ ప్రకారం, మ్యూజియం లోని పంచముఖి ఆంజనేయుని బొమ్మకి నకలు తీసిన వాడు దానయ్యేనని తెలుసుకొంటాడు ఇనస్పెక్టర్. అంతే కాదు ఆ బొమ్మను వాట్సన్ దొరకి చూపించి దానిని అలాంటివి ఇంకా చాలా నకళ్లు చేయగలనని చెప్పమంటాడు. వాట్సన్ దొర ఆ బొమ్మకి డబ్బులు ఇచ్చి కొంటాడు. అతనిచ్చిన నోటూని చూపిస్తాడు లచ్చన్న . ఆ నోటూ, మ్యూజియంలో ఎంకన్న గాయపడి పడిపోయిన చోట కనిపించిన నోట్లు, దానయ్య చొక్కా జేబులో దొరికిన నోట్లు అన్నీ ఒకే బండిల్ లోని నోట్లని గోపాల్రావు గ్రహిస్తాడు. దానయ్య అంతా పథకం ప్రకారం చేస్తున్నాడనీ తెలుసుకొంటాడు.---- ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం--31



“ దానయ్యా !” అని  పిలుస్తాడు,  ఇనస్పెక్టరు.  దానయ్య  లేచి కూర్చొంటాడు. “ దానయ్యా ! నీకో  గుడ్ న్యూస్ !  బొమ్మలు  వాట్సన్ దొర, గోవాలో  దొరికి  పోయాడు. నువ్వు  కంసాలి  లచ్చన్న  చేత  పంపిన  ఫొటోలు ,లచ్చన్న చెప్పిన సాక్ష్యం  , ఇంకా  గంగ, వీరన్నల  సాక్ష్యాలు  అతని నేరాన్ని  ఋజువు  చేస్తున్నాయి.కేసు  టర్నంగు  పాయింటు  ఇలా  ఉంటుందని  నను  ఊహించ  లేదు. ”


“ అయితే  నన్నింక  ఇడిసి  పెట్టేస్తారేంటండి ?”


“ అవును, ఈ  క్షణమే  విడిచి  పెడతాను. కాని  కొన్ని  విషయాలకి  నీ  నుండి  సరి అయిన జవాబులు  కావాలి. ఈ డ్రామాలో  నీ  పాత్ర  ఎక్కడ  పెడితే అక్కడ  ఫిట్  అవుతోంది ! అంతా  ఒక  ప్లాను  ప్రకారం  చేసినట్లు అర్థమవుతోంది.! బొమ్మల  దొంగతనం  ఆపడానికి, మురుగన్ , ఎంకన్న , కంసాలి  లచ్చన్నలని  నీ ఏజెంట్లుగా చక్కగా వాడుకొన్నావు. ఎక్కడి  కక్కడ సాక్ష్యాలు  ప్రోగు  చేసి అప్పజెప్పావు.. కాని  ఒక్కటే  సందేహం ! నువ్వెరివి ?  ఈ బొమ్మల  మీద  నీకు  ఉన్న ఇంటరెస్ట్  ఏమిటి ? ఎందుకిలా  అఙ్ఞాత  వాసం  చేస్తున్నావు ?”


“ నానెవరినో  సెప్పందే  యీ  నాటకానికి  తెర  పడదేంటండి.  అయినా  ఇనస్పెక్టరు  బాబూ !  ఏ పనైనా  ఏదో  లాభం  సూసుకొనే  సేయాలేటండి ?”


“ పోనీ, లాభం సంగతి  వెదిలెయ్యి. బొమ్మల దొంగతనం  జరిగితే  నీకు వచ్చే  నష్టం  ఏమిటి ?”


“ అయి  దొంగల  సొమ్మయి  పోతే, మీకు  మాత్రం  వచ్చే  నట్టం  ఏముందండి ?”


“ ఇక్కడ లాభ నష్టాల  ప్రసక్తి  లేదు. ఒక  పోలీసు  ఆఫీసరుగా  అది  నా  భాద్యత !”


“ అయి  మనందరి  సొమ్మండి, మీరు  అన్నట్లు  ఇక్కడ, ‘  లాభ నష్టాల’ మాట  లేదండి ! అయిపోతే  పోయేది  దేశ  గౌరవమండి !”


“ గుడ్, గుడ్ ! జాతీయ  సంపత్తిని  రక్షించే  భాద్యత  ఒక్క  పోలీసు  వాళ్లదే  కాదంటావ్ !’’


“ అది  యీ  బూవి  మీద  బతకే  పెతీ  ఒక్కడిదీనండి !”


“ ఇందాకలంతా  పోలీసులని  దుయ్యబట్టావు, ఇప్పుడు  పొగిడేస్తున్నావు, ఏంటి  సంగతి ?”


“ బొమ్మలు, దొంగలు  రెండింటినీ  పట్టేసినారు  కాదేటండి !”


గోపాల్రావుకి  నవ్వు వస్తుంది. “ అదా  సంగతి ! గడుసు  వాడివే !  ఇంతకీ  ఈ పని  చెయ్యడంలో  నీకు  ఎలాంటి  స్వార్థం  లేదంటావు !”


దానయ్య ఇనస్పక్టరు  ప్రశ్నకి  జవాబవ్వకుండా, పిచ్చివాడిలా  పాట  అందుకొంటాడు.


సొంత   లాభం  కొంత  మానుకు, పొరగ వాడికి  తోడుపడవోయ్,

దేశమంటే  మట్టి  కాదోయ్, దేశమంటే  మనుషులోయ్ !


అదే సమయానికి  కటకటాల  తలుపులు  తోసుకొని  టు నాట్ త్రీ  చేతిలో  ఒక ప్లాస్టిక్  బుట్టను పట్టుకొని  వచ్చాడు. వస్తూనే  పాట  పాడుతున్న  దానయ్యని  చూసి, “ రామా  రామ ! వాడెందుకు  చెబుతాడండీ ! చెప్పడానికి  పర్మిషన్  ఉండొద్దూ ?” అని  అంటాడు.


ఇన్స్పెక్టర్ గోపాల్రావు  ఆశ్చర్యంతో , టు నాట్ త్రీ వంక  చూసి, “ పర్మిషనా ! ఎవరిది, ఎందుకు ?” అని ప్రశ్నిస్తాడు.


“ రామా రామ ! ఈ దానయ్య  శరీరంలో  ఉన్నది, పితృలోకం నండి  వచ్చిన  ఆత్మ కదండి ! ఆత్మలు అన్ని విషయాలూ  చెప్పవండి, చెప్పడానికి వాటికి పర్మిషను ఉండదండీ ”


“ ఎవరి పర్మిషను, యమ ధర్మరాజుదా, ?”


“ ధర్మరాజుదో, లేక దెయ్యాల  రాజుదో  నా కేం  తెలుస్తుంది ? అదుగో  ఆ శరీరాన్ని  అడగండి.”


“ అన్ని ఏంగిల్సు  నుండి  అడిగి  అడిగి  అలసి  పోయాను, నువ్వన్నట్లు  ‘అది’  ఆత్మే గనుక  అయితే  ఎలా అడగాలో  ---”


“ రామా రామ ! నాకు వదిలేయండి. మీరా  బెంఛీ  మీద  కూర్చొని  చూస్తూ  ఉండండి.”


ఇనస్పెక్టరు  వెళ్లి  బెంచీ  మీద  కూర్చొంటాడు.


టు నాట్ త్రీ , దానయ్యకి  ఎదరుగా  వెళ్లి, దానయ్యతో  సైగ చేసి మాట్లాడుతాడు ,“ఇదుగో  ఏయ్ ! రామా  రామ ! నిన్నే ఇలా చూడు.”


దానయ్య  మిడిగుడ్లు  పెట్టి,  టు నాట్ త్రీ  వైపు  చూస్తాడు.


“ రామా రామ ! నిన్నే కాదు, నీ జేజెమ్మలాంటి  ఆత్మలతో  కూడ  మాట్లాడించడం నాకు తెలుసు. నే నడిగిన  ప్రశ్నలకి  జవాబు  చెప్తావా, లేక---”

దానయ్య  మాట్లాడడు, నేల  మీద  పద్మాసనం  వేసుకొని  కూర్చొంటాడు. అలా దానయ్యని  చూసిన  టు నాట్ త్రీకి  చిర్రెత్తుకొస్తుంది. “ రామా రామ !  నువ్వలా  మాట్లాడవ్ ! ” అంటూ , తను  తెచ్చిన  బుట్టలో  నుంచి, దూప కరండిక, గుగ్గిలం తీస్తాడు. దూప కరండికలో  నిప్పు రాజేసి , ధూపం  వేసి, దానయ్య  ముఖం  మీదికి  తెస్తాడు, “ హు చెప్పు, చెప్పక  పోయావా, చెప్పు  క్రింద  తేలులా  నలిపి  పప్పు  పప్పు  చేస్తాను. ఏమనుకొన్నావో ! చెప్పు,” అంటూ  దానయ్య ముఖం  మీదకి  ధూపం తెస్తాడు..దానయ్య  మాట్లాడడు. టు నాట్ త్రీ  చిర్రెత్తి  పోతాడు. “ రామా  రామ ! ఈ ఆత్మ  భరతం పడితేనే  గాని, భరత  వాక్యం  పలికేలా  లేదు ! ” అని  బుట్టలోంచి, మర్రి చిగుళ్లు,  తీస్తాడు,

“  ఇనస్పెక్టరు  గారూ ! ఈ మర్రి  చిగిళ్లు  వాడి  చెవిలో  దోపి, గట్టిగా  పట్టుకోండి,” అంటూ ఇనస్పెక్టర్ని  పిలుస్తాడు.
ఇనస్పెక్టరు  కుతూహలంతో, బెంచీని  దానయ్య  వెనకకి  జరిపి, దాని  మీద  కూర్చొని, దానయ్య  చెవుల్లో  మర్రి  చిగుళ్లు  దోపి, గట్టిగా  పట్టుకొంటాడు.

టు నాట్ త్రీ  బుట్టలోంచి  ఈ సారి  వేపమండలు  తీసి, ధూప  కరండిక  చుట్టూరా  త్రిప్పుతూ , వేప మండలతో మధ్య మధ్య  ప్రహారం  చేస్తూ, ‘కాళీ  దండకం ’ చదువుతాడు.


“ శ్రీ మన్మహా  కాళి ! రుద్రాణి ! కళ్యాణి ! ఓంకార  వాచ్యా ! మహామౌని  ఆత్మేందు  భాసా !

సదా దేవ పూజ్యా ! సదా  భక్త తోషా ! మహా  రాక్షసానీక , దావాగ్నిపాపౌఘ చండాంశు మాలీ !

మహా ఘోర రూపా!భవత్పాద పంకేరుహంబే శరణ్యం బంచు నమ్ము , దీనాళి రక్షించు కారుణ్య  మూర్తీ !

సదా  శబ్ద  రుపా ! సదా  రుద్ర రూపా ! సదానంద  రూపా ! మనుష్యాంత  రంగంబు నందు,

విచిత్రంబుగా  నిల్చి, కామంబు, కోధంబు, మోహంబు, రేకెత్తు  పంచేంద్రియాకార రూపంబుతో 

నాటకం  బాడి, లోకాల  నన్నింటి  భూతాల  రూపంబుతో  గ్రీడ నాట్యంబు  కావింతువో  యమ్మ !

అన్నింట  సూక్ష్మంబుగా  నిల్చి, బ్రహ్మాండ  దేహంబు  స్థూలంబుగా దాల్చి, ఆకాశమందున్  మహా శబ్దమై 

నిల్చి, విద్యుత్తుగా మారి, వర్షంబుగా జారి, భూమిన్ జలాన్నంబులింపొందగా జేతువో  యంబ !

 లోకాన  చింతించి  బంధంబు  వీడంగ , నీ రూపు , నీ శక్తి , యోగీంద్రు  లేకాంత  చిత్తంబుతో  చూచినారమ్మ !

నా  కేది  యా  శక్తి ! నీ  పాద పద్మంబులే  నాకు  దిక్కంచు  ఘోషింతు,  నా దిక్కు  నీ  చూపు  ద్రిప్పంగ ,

 నే  నిన్ను ప్రార్థింతు ,ఈ  రోజు యీ  ఆత్మ నెరుగంగ  నే నిన్నుయర్థింతు! నీ దివ్య నామంబు  కీర్తింతు!

నీ దివ్య రూపంబు నూహింతు తల్లీ ! మహాదేవ హృత్తేజ రూపా ! నమస్తే,నమస్తే, నమః !! ”


టు నాట్ త్రీ  దండకం  చదువుతూ , పాటకి అనుగుణంగా  డాన్సు  చేస్తూ, మధ్య మధ్య  వేప మండలతో  దానయ్యని  ప్రహరిస్తూ, దందకం చదవడం ముగిస్తాడు. అయినా  దానయ్య  పలకడు !         “ రామా రామ ! నువ్వు  పలకవన్న  మాట ! సరే, ఎలా  పలకవో  చూస్తాను, ఇనస్పెక్టరు గారూ ! మీరా  మర్రి చిగుళ్లని  మరికొంచెం చెవుల్లో  తొయ్యండి, నేను  వీడి  నోట్లో  తులసి  తీర్థం  పోస్తాను !” అంటూ  తులసీ  దళాలు  తీసి నలిపి , తీర్థంలో  పోసి, దానయ్య  నోట్లో  బలవంతాన  పోస్తాడు.

దానయ్య  ఉక్కిరి  బిక్కిరయి  గింజుకొంటాడు


“ చూసారా  తడాఖా ! ఇనస్పెక్టరు  గారూ ! మీరా  మర్రి చిగుళ్లు  గట్టిగా  పట్టుకోండి. అని  వేప మండలతో  కొడుతూ, “ రామా  రామ ! చెప్పు,  ఎవరు  నువ్వు ?”


“ నేనే ! –” అంటాడు   దానయ్య.


“ రామా  రామ ! నేనే  అంటే, నీ  బాబిక్కడ  ఉన్నాడేంటి, పోల్చడానికి , నీ పేరేంటో  చెప్పు ?”


“ మదీయ నామము  ‘ ధనంజయ  నాయకుడు.”


(తరువాయి భాగము రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద