Skip to main content

మొసలి కొలను మ్యూజియం(హాస్య్ రోమాంచ దైనందిన ధారావాహిక----32)


(నిన్నటి టపాలో జరిగిన కథ--- మ్యూజియం లోని బొమ్మల అసలు దోంగను పట్టించింది, కావలసిన సాక్ష్యాలు ప్రోగు చేసి తనకి సహకరించినదీ, దానయ్యేనని గ్రహించిన గోపాల్రావు దానయ్య దగ్గరకు వెళ్లి ,ఆ పని చేసినందుకు అతనికి గల లాభమేమిటని ప్రశ్నిస్తాడు. కాని దానయ్య సరిగా జవాబివ్వడు ఏవేవో మాట్లాడుతాడు, దాన్తో టూ.నాట్ త్రీకి అనుమానం వచ్చి, దానయ్య శరీరంలో ఏదో ఆత్మ ప్రవేశించిందని, అదంతా ఆత్మ పలుకేలేనని, ఆత్మతో మాట్లాడించేందుకు , తులశీ దళాలు, మర్రి చిగుళ్లు, వేప మందలూ పట్టుకొచ్చి, మహంకాళి దండకం చదువుతూ, దానయ్యని వేప మందలతో కొట్టి నిజం చెప్పమంటాడు. ఆత్మ తాను ధనంజయ నాయకుణ్నని చెప్తుంది---ఇక చదవండి)

మొసలి కొలని మ్యూజియం--32

“ దానయ్య జవాబు విని , ఇనస్పెక్టరు  ఆశ్చర్యంతో  అతని వంక  చూస్తాడు, “ ఏమిటీ ! నువ్వు  ధనంజయ నాయకుడివా !”

“ అవును, నేనే !”

“ మ్యూజియం లోని బొమ్మలను చేసిన ప్రోలయ వేముని  కాలం నాటి  ధనంజయ నాయకుడివా నువ్వు ?”  గోపాల్రావు  ప్రశ్నిస్తాడు, కాని దానయ్య  మాట్లాడడు. టు నాట్ త్రీ  కల్పించుకొని  “ ఏయ్ ! చెప్పు, అడిగిందానికి  చెప్పు, చెప్పక  పోతే  తప్పదు  ముప్పు” అంటూ  వేప మండలతో కొడతాడు.

“ అబ్బ ! మర్దించకు , చెప్పెదనుండు ”  

దానయ్య  జవాబు విని గోపాల్రావు తిరిగి అడుగుతాడు, “ప్రోలయ  వేముని  కాలం నాటి  కాంస్య శిల్పి ధనంజయ  నాయకుడివా నువ్వు ?”

“ అవును.”

“ ఇప్పుడు తెలిసింది నువ్వు  అదే  శిల్పివి  కనుకనే ,పాత ఆంజనేయుడి బొమ్మకి కొన్ని గంటల  లోనే  నకలు  తయారు  చేయ  గలిగావు  రెండు  బొమ్మలు, రూపు రేఖలు  కొలతల లోనే కాదు,  బరువులో  కూడ సరి సమానంగా  ఉన్నాయంటే  వాటిని  చేసిన  శిల్పి, ఒకరే  అయి  ఉండాలని   అనుకొన్నాను. నా అనుమానం నిజమయింది. నువ్వు  ధనంజయ  నాయకుని  ఆత్మవేనా ?’’

“ అవును.”

“ నీ  విగ్రహాలు  తిరిగి  ఇంత  కాలానికి  బయట  పడి, పడీ  పడక  ముందే, దొంగల  పాలు  కావడం  చూడలేక, ఆ దొంగలను  పట్టివ్వడానికి  ఈ దానయ్య  శరీరంలో  దూరావు, అవునా ?”

“ అవును”

“ దానికీ  దానయ్య  శరీరాన్నే  ఎందుకు  వాడుకొన్నావు ?”

“ దానయ్య  మాట్లాడడు, ఇనస్పెక్టరు  నిస్సహాయంగా  టు నాట్ త్రీ  వంక  చూస్తాడు. టు నాట్ త్రీ  తిరిగి  దానయ్యని  వేప  మండలతో  కొడతాడు.

“ అబ్బబ్బ ! మర్దించకు,మర్దించకు ”

“ రామా  రామ ! మర్దించను, మర్రి  పాలు  చెవుల్లో  పోస్తాను, అడిగన  దానికి  జవాబు  చెప్పు.”

“ దానయ్య  ఊరు  కూడా  మొసలి  కొలనే ! పైగా  కూలీ  ఎంకన్న, కంసాలి  లచ్చన్న, వాచ్ మెన్  మురుగన్లతో  అతనికి  చుట్టరికం  ఉంది. అందువలన---”

“ గుడ్ ! సూదిలో  దారంలా, సరైన  చోట  దూరావు ! ఎన్నాళ్ల  క్రితం  దూరావ్ ?”

“ శ్రీ  సర్వధారి  నామ  సంవత్సర  ఆశ్వియిజ  శుధ్ధ  ద్వాదశి  గురువాసరము  నాడు ”

“ ఏమిటో అంతా అయోమయంగా ఉంది టు నాట్ త్రీ  తెలుగు సంవత్సరంలో ఈ రోజు తెలుసా ?”

“ అవన్నీ  తరువాత  చూసుకోవచ్చు సార్ ! ముందు  మాట్లాడ  నివ్వండి.ఏయ్ ,ఎన్నాళ్ల  క్రితం దూరావో  చెప్పు.”

“ చతుర్దశ మాసముల క్రిందట !”

“ రామా  రామ ! అంటే  పోయన  పద్నాలుగు  నెలలుగా , నీ  ఆత్మ  దానయ్య శరీరాన్ని ఆశ్రయించి  బ్రతికిందన్న  మాట ! కాని  ధనంజయ  గారూ ! చిన్న  సందేహం ! ఒకే  ఒరలో రెండు  కత్తులూ, ఒకే  ఇంటిలో  రెండు  కొప్పులూ  ---” 

“ టు నాట్ త్రీ ! ఈ  కప్పులూ,  కొప్పులూ  ఏమిటోయ్  ?”

“  రామా  రామ !  తెలియదండీ  కప్పు  అంటే  ఇల్లు, కొప్పు  అంటే  ఇల్లాలు  అనే అర్థంలో  వాడానండి.”

“ ఇంక  చాల్లే ! అర్థమయింది, మరయితే  ధనంజయ గారూ ! ఒకే  ఒరలో రెండు  కత్తులూ, ఒకే  ఇంటిలో  రెండు  కొప్పులూ ఉండలేనట్లే---”

“ ఒకే  శరీరమందు  రెండు  ఆత్మలు  నివసింప  జాలవు,” అంటాడు  దానయ్య.

“ రామా రామ ! అదీ  లా  పాయింటు !  దీనికి  మీ  సమాధానం  ఏమిటి,  మీ  ఆత్మ  దానయ్య  శరీరంలో  ఉంటే, మరి  దానయ్య  ఆత్మ  ఏమయింది ?”

“ పితృ లోకమున  ఉన్నది.”

“ రామా  రామ ! అదండీ  ఇనస్పెక్టరు గారు , ఆత్మల  మ్యూచువల్  ట్రాన్సుఫర్  అయింది.”

“ అదెలా  వీలవుతుంది, టు నాట్ త్రీ ! చావు  వస్తేనే  కదా   ఆత్మ  శరీరాన్ని  విడిచి పెట్టేది ?”

“ రామా  రామ ! ధనంజయ గారూ, జవాబు చెప్పండి, దానయ్య శరీరం బ్రతికే  ఉండగా, మీ మ్యూచువల్  ట్రాన్సుఫర్  మీద  ముద్ర  ఎలా  పడింది ?”
దానయ్యకి  వాళ్ల  మాటలు  ఉడుకెత్తించాయి.“ మూర్ఖులారా ! జడులారా ! మందబుధ్ధులారా !” అన్నాడు.

“రామా  రామ ! ఏంటన్నావు ! నాది మంద  బుధ్ధా !  మనిషినే  మందంగా  లేను, బుధ్ధి ఎలా మందగిస్తుంది ? ఇంకా  ప్రేలావంటే  చెవుల్లో మర్రి పాలు  పోసేయ  గలను  జాగ్రత్త !”

“ ట నాట్ త్రీ ! నువ్వూరుకో, ధనంజయ  గారిని  చెప్పనీయి ! ”

“ రామా  రామ ! అలాగేనండి ”

“ దానయ్య  మరణించిన పిమ్మటనే  నేనీ  శరీరమను ఆశ్రయించితిని,” దానయ్య  కీర్తిశేషుడు అయినాడు.”

“అంటే  పద్నాలుగు  నెలల  క్రిందట  దానయ్య అనబడే  వ్యక్తి  మరణించాడు, ఇతను  అతని  శరీరాన్ని  ఆశ్రయించాడు, అవునా ---?”

``  అవును గృహోన్ముఖుడై పయనమయి,మొసలి కొలను సమీపమున  మార్గాయాసము  తీర్చు కొనుటకు,ఒక వటవృక్ష ఛాయలో,విశ్రమించిన వేళ, హఠాత్తుగా హృదయ చలన మాగి, దానయ్య కీర్తి  శేషుడయినాడు.”

“ రామా  రామ ! అంతా  అయోమయం , అగమ్య గోచరంగా ఉంది, ఇనస్పెక్టరు గారూ ! ”

“ ఇంటికి  తిరిగి  వస్తూ, ఊరి  చివర  మర్రి చెట్టు క్రింద  రెస్టు  తీసుకొంటున్నప్పుడు , హార్టు  ఎటాక్  వచ్చి,  దానయ్య  చచ్చి పోయాడు,” వాడుక  భాషలో  చెప్పాడు  ఇనస్పెక్టరు.

“ రామా   రామ ! అర్థం  కానిది  తెలుగు  భాష కాదండీ !”

“ మరేమిటి ?

“ ఆ దానయ్య  చచ్చిపోతే, మరి  ఇక్కడున్న  శాల్తీ  ఎవరు ?’

“ ఈయన  ఆ కట్టెను  ఆశ్రయించన  శిల్పి ధనంజయ నాయకుల వారు! అంటే పరకాయ  ప్రవేశం చేసిన  పెద్దమనిషి !”

“ రామా  రామ ! బాగుంది, పరకాయ  ప్రవేశం  కేసుని , పోలీసు  స్టేషనులో  రికార్డు  చేయవలసి  వస్తోంది ! ఇనస్పెక్టరు గారూ , కొంపదీసి  మనిద్దరం  కూడ, ప్రోలయ  వేముని  కాలంలో, అదే  1300  ఎ.డి.లో  ఆత్మలం  కాదు గదా ?”.

“ టు.నాట్ త్రీ  మాటలకి, దానయ్య బిగ్గరగా నవ్వి,“ శాన బాగా సెప్పినావు  టు నాట్ త్రీ !” అన్నాడు

“ ఉన్నట్లుండి  ఈయన  కేమయింది టు నాట్ త్రీ ?”

“ రామా  రామ ! మళ్లీ  ఆత్మల  మ్యూచువల్ ట్రాన్సుఫర్  అయినట్లుంది. ”

దానయ్య  లేచి  నిలబడతాడు , వాళ్లిద్దరూ  ఆశ్చర్యంతో. చూస్తూ  ఉండగా, దూర దూరంగా అడుగులు  వేస్తూ , బెంఛీ  దగ్గరకు వెళ్లి  కూర్చొంటాడు.” మిస్టర్  ఇనస్పెక్టర్ గోపాల్రావ్ ! టు నాట్ త్రీ ! మీరిద్దరూ , మర్రి చిగుళ్లు , వేప మండలు , తులసీ దళాలు , చెరసాల లోకి తెచ్చి, ఖైదీల  ఇంటరాగేషన్లో  కొత్త  రికార్డు  సృష్టించారు ,” అన్నాడు వాడుక  భాషలో,  అది  దానయ్య  భాషా  కాదు, ధనంజయుని  భాషా  కాదు ! దానయ్య  మెచ్చికోలుకి , టు నాట్ త్రీ  గర్వంగా కాలరు  సర్దుకొంటాడు. “ థాంక్స్  సార్ ! మీరైనా  మెచ్చుకొన్నారు, ” అన్నాడు.

“నేను వచ్చిన పని అయింది ,మీకు కావలసిన  వివరాలు  తెలిసినట్లే కద !” అన్నాడు దానయ్య.

“ రామా  రామ ! ఈ దానయ్యేమిటి ,ఇలా  వాడుక  భాష  మాట్లాడేస్తున్నాడు,”

“ టు నాట్ త్రీ ! ఆత్మలు ఏ భాషలోనైనా  మాట్లాడగలవు ”

“ రామా  రామ ! అలాగా !” 

దానయ్య  వాళ్లు చూస్తూ ఉండగానే  బల్ల మీద నిటారుగా పడుకొంటాడు., “ ఇక నేను వెళ్లి వస్తాను,” అంటూ.

గోపాల్రావు  అతని  దగ్గరగా  వెళ్లి,  “ ధనంజయ  గారూ ! నాదొక  చిన్న  మనవి,” అన్నాడు.

“ దానయ్య  లేచి  కూర్చొని, “ ఏమిటది ?” అని అడిగాడు.

“ ఇంత  కాలం  ఈ కాయాన్ని  అంటి పెట్టుకొని  లోక  కళ్యాణం  చేసారు. మరికొన్నాళ్లు , అంటే  ఈ  కోర్టు ప్రొసీడింగ్సు  అయిపోయేంత వరకు  బతికితే  బాగుంటుంది ! ఈ  కేసులో  మీరే  ఇంపార్టెంటు  విట్నెస్  కదా, అందుకని  అడుగుతున్నాను.

“ అంటే  నేను  పోతే, మీ  ముఖ్య  సాక్ష్యం  పోతుందన్న  మాట !”

“ రామా  రామ ! అంతేనండి, మీరు  మాకు  ఇప్పుడు  వి.ఐ. పిలు , మీరీ  చెరసాలలో  ఉండ నక్కర  లేదు. మా డిపార్టుమెంటు  అతిథులుగా  హాయిగా, ఐ.జి. గారి  రెస్టు హౌసు లోనే  ఉండవఛ్ఛు !”

“ హు ! అందితే  జుట్టు, అందకపోతే  కాళ్లు అన్న సామెత  మీ  డిపార్టుమెంటుకి  చక్కగా  అతుకుతుంది ! నెను  మీ కోసం  వెయిట్  చెయ్యలేను, నాకు సెలవయింది.” అని తిరిగి  బెంచీ  మీద  పడుకొంటాడు  దానయ్య.

“ ధనంజయ గారూ ! మరొక్కసారి  ఆలోచించండి. మీరు  మా  కోసం  కాదు, ప్రజల  కోసం  ఉండండి. ఈ  వెళ్లిపోయే ,‘ షోని’ కోర్టు  విట్నెస్  బాక్సులో  చేస్తే, జడ్జిగారు , లాయర్లు, ప్రజలు  అంతా  నమ్ముతారు.
“ రామా  రామ ! అంతేకాదు, ఈ  ఆత్మలకి  సంబంధించిన  చిక్కు  లెక్కలు  విడిపోయి, ఒక  కొత్త ‘ ఇజం’ ఏర్పడుతుంది !”
“ అదుగో  మళ్లీ  ఇజం ! ఉహు, నాకీ  ఇజాలంటే  తల్నొప్పి!”అని తిరిగి  పడుకొంటాడు దానయ్య.
“ ధనంజయ గారూ ! మీరు పోతానంటే  మేము  మిమ్మల్ని  ఆపలేము. కాని  ఒక్క  విషయం  ఆలోచించండి. మీరిప్పుడు  వెళ్లిపోతే , ఈరు  ఆడిన  నాటకాన్ని, మేమ  కోర్టులో  ఎలా  ఋజువు చేయ గలం ! మీ శ్రమ ఫలితమైన కళాఖండాల్ని దొంగలించిన దొంగలు, వాట్సన్, ఆచారి, కరీం ఖాన్, తదితరులని  కోర్టు  ఎలా  శిక్షించ  గలుగుతుంది ?”

“ ఇనస్పెక్టర్ ! మీరా  దోషుల్ని  సిన్సియర్ గా  శిక్షించాలనే  అనుకొంటున్నారా ?”
“ అవును ”  
“ అయితే  నేను పోతే  మాత్రం వచ్చిన చిక్కేమిటి ? ఈ శరీరం బెంచీ మీదనే  ఉంటుంది కదా ! ”
“ రామా  రామ ! ఆ డెడ్  బాడీని  మేమేం  చేసుకొంటాం  సార్ ?”

“ పోస్టు మార్టంకి పంపించండి !ఈ శవం పధ్నాలుగు  మాసాల  క్రిందట  చచ్చిందని , మీ ఆధునిక  విఙ్ఞానం  తప్పకుండా  ఋజువు  చేస్తుంది  కదా ?”

“ధనంజయ  గారూ ! మీ  లాజిక్  నాకు  అర్థమయింది, పధ్నాలుగు  నెలల  క్రిందట, చని  పోయిన  దానయ్య  ఎలా  వచ్చి, ఈ దొంగతనానికి  అడ్దుపడ్డాడు  అన్న  ప్రశ్న  తలెత్తి,  అది  ఆత్మ  ప్రవేశం  వల్లనే  అన్న  విషయాన్ని కోర్టు నమ్మ  వలసి  వస్తుంది, గుడ్ !”

“ అయితే  ఇక  వెళ్లమంటారా ?”

“ అమ్మమ్మ ! , ఎంత  మాట, మీ ఇష్టం.” అన్నాడు  గోపాల్రావు

దానయ్య  పడుకొంటాడు. పడుకొన్న  దానయ్య  దగ్గరకి  ఇనస్పెక్టరు, టు నాట్ త్రీ , వెళ్లి  శ్వాస, నాడి, హార్ట్  బీటు  చూస్తారు. “ టు నాట్ త్రీ ! ఇది  నిజంగానే  డెడ్  బాడీ ! జరిగినదంతా కల  లాగుంది ”

“ ఆ రోజు  హాస్పిటల్  బెంచీ  మీద  కూడ ఇలాగే  జరిగింది.  చెప్తే  మీరు  నమ్మలేదు .”
   
ఇనస్పెక్టరు, టు నాట్ త్రీ  మాట్లాడుతూ  ఉండగా, దానయ్య  గభాలున  లేచి, తెరిచి  ఉన్న  కటకటాల  తలుపుల  లోంఛి  పారిపోబోయాడు !  వాళ్లిద్దరూ  పరుగున  వెళ్లి  దానయ్య  చెరో  రెక్కా  పట్టుకొంటారు. “ ధనంజయ  గారూ ! ఏమిటిది, మీ  పలాయనం? –”

(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద