(నిన్నటి టపాలో జరిగిన కథ==== బాలరాజు చెప్పిన క్లూ ప్రకారం ఇనస్పెక్టర్ ఇంద్రనీల్ వాడిని మోసం చేసి గొలుసు కాజేసిన ఆర్ట్ డైరక్టర్ సుగ్రీవని పట్టుకొంటాడు. --- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం--4
రామ్ మహమ్మద్ జేమ్స్ దగ్గర , పాతిక వేల రూపాయలు దొరికాయి. వాటిని ఒక కవరులో పెట్టి సీలు చేసాడు ఇంద్రనీల్. టు నాట్ త్రీని పూల రంగరాజు దగ్గరకి వెళ్లి, ఎఫ్ . ఐ. ఆర్ వ్రాయించి పట్టుకు రమ్మన్నాడు.
టూ నాట్ త్రీ ,‘రామా రామ’ అని, వెళ్తూ ఉండగానే , పోలీసు స్టేషను ముందు, ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు లోంచి ‘డిప్యూటీ సూపరెండెంటు ఆఫ్ పోలిస్ ’, కాక ఇంకో పెద్ద మనిషి ఉన్నారు.
డిప్యూటీని చూసి ,టు నాట్ త్రీ , ఇనస్పెక్టర్ అతనికి సెల్యూట్ చేసారు. అతనితో పాటు వచ్చిన పెద్ద మనిషిని చూసి, మేనేజరు లేచి నిలబడి సెల్యూట్ చేసాడు. మేనేజరు చర్య చూసిన ఇంద్రనీల్ వచ్చిన పెద్ద మనిషి , ఆ గోల్డు కంపెనీ యజమాని అయి ఉంటాడని ఊహింఛాడు.
డిప్యూటీ కుర్చీలో కూర్చొంటూనే అన్నాడు. “ఇంద్రనీల్ నువ్వు అరెస్టు చేసిన పెద్ద మనిషి నిజంగానే ఒక ఫిలిం కంపెనీలో ఆర్టు డైరక్టరు , పేరు సుగ్రీవ్ ! నువ్వు అనుమానిస్తున్నట్లు గొలుసుని అతను దొంగలించ లేదు. గొలుసుని తాకట్టు పట్టినది అతను కానే కాదు ! ఇంతకీ అతని స్టేటుమెంటు తీసుకొన్నావా ?” అని అడిగాడు.
ఇంద్రనీల్ జవాబు చెప్పబోయే లోగానే,సుగ్రీవ్ నోరు విప్పాడు.“ సార్ ! ఈ ఇనస్పెక్టర్ నాతో చాలా రేషుగా బిహేవు చేసాడు. నేను ఈ కుర్రవాడు బాలరాజుని నిజంగానే సెలూన్కి తీసుకెళ్లాను. అక్కడ నుంచి షూటింగు సైటుకు తీసుకెళ్దామనుకొన్నాను. సెలూన్లో బాలరాజు నా చేతికి గొలుసు ఇచ్చిన మాట నిజమే ! నేను నా పేంటు జేబులో పెట్టుకొన్నాను. బాలరాజు క్రాఫింగుకి ఇంకా టైము పడుతుందని తెలిసి, వాడికి రెడీ మేడ్ డ్రస్సు కొనడానికి, ఎదురుగా ఉన్న షాపుకే వెళ్లాను. ఒక డ్రెస్ ఎంచి కుర్రవాడు వచ్చి, ‘ట్రైల్’ చేసాక డబ్బు ఇచ్చేస్తానని షాపు ఓనరుకి, చెప్పాను. సెలూనులో పని ఇంకా పూర్తి కాలేదు గనుక, ఈ లోగా పెద్ద చెరువు గట్టు దగ్గర బెస్తవాళ్ల దగ్గర మందు కొనడానికి వెళ్లాను. వీళ్లు వచ్చి నన్ను ఛార్జి చేసే వరకు, గొలుసు విషయం నాకు గుర్తుకే రాలేదు. అది బహుశా రెడీమేడ్ షాపులో పడి పోయి ఉంటంది. సార్ ! అది దొరికి , చేజిక్కించుకొన్న వ్యక్తి---”
“ అర్థమయింది సుగ్రీవు గారూ ! ఇంక మీరేమీ చెప్ప నవసరం లేదు. విన్నావా, ఇంద్రనీల్ ! ఇంకా ఇతన్ని అనుమానిస్తున్నావా ?” అని అడిగాడు డిప్యూటీ.
“ సర్ ! ముత్తు ఫైనాన్సు కంపెనీ మేనేజరు –”
“ ఇనస్పెక్టరు గారూ ! ” డిప్యూటీతో పాటు వచ్చిన పెద్ద మనిషి ఇంద్రనీల్ మాటలకి అడ్డుపడ్డాడు. “ నా పేరు ముత్తు రామన్ ! ముత్తు ఫైనాన్సు కంపెనీ ప్రొప్రయిటర్ని. మీరు అనుమానిస్తున్న గొలుసు తాలూకు డీల్ చేసింది నా మేనేజరు కాదు, నేనే చేసాను. నా మేనేజరుకి ఏమీ తెలియదు, “ ఏమంటావు మేనేజర్ ?” అంటూ తన మేనేజరుని అడిగాడు ముత్తురామన్.
మేనేజరుకి ముచ్చెమటలు పోసాయి.అతను తన యజమాని మాటలని ఎలా ఖండించ గలడు ! “ అవును సార్ ! నేను ఆ విషయం చెప్దామని అనుకొంటూ ఉండగానే , అతను నన్ను పోలీసు స్టేషనుకి తీసుకొని వచ్చాడు. సార్ !” అన్నాడు.
ఇంద్రనీల్ తన కళ్ల ముందే , ఉక్కు లాంటి కేసు, మంచు ముక్కలాగ కరిగి పోవడం గమనించాడు. ఒక ఫిలిం కంపెనీ కళా దర్శకుడి పరువు ప్రతిష్టల కోసం ,పసి బాలుడైన ‘బాలరాజుని’ పణం పెట్టడం, అదీ డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్, పెద్ద వ్యాపార వేత్త, అయిన ముత్తు రామన్ల జోక్యం ద్వారా జరగడం అతనికి ఆశ్చర్యాన్నీ, దుఃఖాన్నీ,రోషాన్నీ, కలిగించి మంచు గడ్డతో మొత్తినట్లయింది. ఇంద్రనీల్ ధైర్యం చేసి అన్నాడు.,
“ సార్ ! పదమూడేళ్ల పసి బాలుడైన బాలరాజు గొలుసు –”
“ ఇంద్రనీల్ ! నాకు ఆ విషయం తెలియదని అనుకొన్నావా, బాలరాజు పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది!తన జేబులోంచి జారిపోయి పడి పోయిన గొలుసుని పాపం ! సుగ్రీవు గారు ఎక్కడ నుండి తెచ్చిఇస్తారు? నువ్వు సీలు చేసిన పాతిక వేల రూపాయలు అతని పాకట్ మనీ కావడం వల్ల ఆ సొమ్ముని ఇచ్చేయమని నే నెలా చెప్ప గలను? ” అంటూ సుగ్రీవు వంక చూసాడు డిప్యూటీ.
“ సార్ ! మంచి సలహా సూచింఛారు సార్ ! బాలరాజు గొలుసుకి నష్ట పరిహారం క్రింద ఆ పాతిక వేలు ఇప్పించండి సార్ ! నా చేతులారా జారి పోయిన గొలుసు కోసం , ఆ మాత్రం శిక్ష నాకు పడాల్సిందే !”
“ వెరీ గుడ్ సుగ్రీవు గారూ ! ఏయ్, టూ నాట్ త్రీ నువ్వు బాలరాజునీ, పాతిక వేల రూపాయలనీ , పువ్వుల రంగరాజు గారికి అప్పగించి, కేసు విషయంలో ఇంకే ఎఫ్. ఐ..ఆర్ దాఖలు చేయవద్దని చెప్పు. ఇంద్రనీల్ ! ‘ హారాన్ని’ ముత్తు ఫైనాన్సు కంపెనీ మేనజరు గారికి ఇచ్చేయి. అసలు దొంగ ఎవరో నీ చేతికి చిక్కక పోడు , అప్పుడు కావాలంటే కేసు ఓపెన్ చెయ్యవచ్చు., పెద్ద మనుష్యుల్ని అనవసరంగా ఇబ్బంది పాలు చెయ్యకు. అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నన్ను కన్సల్టు చేయి. ” అని ఇంద్రనీల్ని మెత్తగా చీవాట్లు పెట్టి, అసలు కేసే లేకుండా చేసి, కారెక్కాడు డిప్యూటీ ! అతనితో పాటు ముత్తురామన్ , అతని మేనేజరు కూడా గొలుసు తీసుకొని వెళ్లి పోయారు. టూ నాత్ త్రీ , బాలరాజునీ, వాళ్లిచ్చిన నష్ట పరిహార ధనాన్నీ, తీసుకొని, పూల రంగడి దుకాణానికి పోలీసు జీపులో వెళ్ళాడు.
ఇంద్రనీల్ ఒంటరిగా కూర్చొని, ఆ పోలీసు ఠాణాలో ,చీకటి గదిలో చిరు దీపంలాగ మిగిలి పోయాడు.
మరునాడు ఇంద్రనీల్ తన డయిరీలో ఇలా వ్రాసుకొన్నాడు.
కేసుపేరు ‘పువ్వుల నుండి హారం వరకు’
నేరం ‘బంగారు గొలుసు మోసంతో అపహరణ’
విక్టిం ‘పాపం బాలరాజు’ ముఫ్ఫయి అయిదు వేలు ఖరీదు చేసే హారానికి పాతిక వేలు నష్ట పరిహారం పొందిన అమాయకుడు.
నేరస్థుడు ‘ రామ్ మహమ్మద్ జేమ్స్’ అలియాస్ సుగ్రీవ్.
బ్రెయిన్ ‘డి.వై.ఎస్.పి , ముత్తురామన్ అండ్ అఫ్ కోర్స్ సుగ్రీవ్ !’
కేసు ఉపసంహారం ‘ఎఫ్ ఐ ఆర్ కూడా దాఖలు కాకుండా మంచులా కరిగి పోయింది.’
శిక్ష పొందిన వాడు ఇనస్పెక్టర్ ఇంద్రనీల్, హ హ హ ! హి హి హి !
( తరువాయి భాగం రేపటి టపాలో )
Comments
Post a Comment