(నిన్నటి టపాలో జరిగిన కథ=== బాలరాజుని మోసం చేసి గొలుసు చేజిక్కించుకొన్న పెద్ద మనిషిని , ఇనస్పెక్టర్ ఇంద్రనీల్ పట్టుకొంటాడు, అతని వద్ద ఇరవై అయిదు వేల రూపాయలు దొరుకుతాయి. చివరికి డి.వై.ఎస్.పి జోక్యంతో ఆ డబ్బే బాలరాజుకి దక్కుతుంది ! పై అధికారి చర్య ఇంద్రనీల్’కి అసహనీయమవుతుంది. ----ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం--5
కానిస్టేబిల్ టూ నాట్ త్రీ ఠాణా లోపలికి వచ్చి, “ రామా రామ ! గుడ్ మార్నింగు సార్ !” అన్నాడు.
ఇంద్రనీల్ అతని వంక చిరునవ్వుతో చూసి, “‘ వెరీ గుడ్ మార్నింగ్ టూ నాట్ త్రీ ! నీ కొక శుభ వార్త.! నువ్వు పెట్టుకొన్న ట్రాన్స్ ఫర్ అపీలుని అధికారులు ఆమోద ముద్ర వేసి, ఆర్డర్సు పంపించారు. ” అన్నాడు.
“ రామా రామ ! నాకు నిన్న రాత్రే తెలిసింది సార్ ! ఇదంతా మీ చలవే ! నా భార్య అక్కడ టీచరుగా పని చేస్తోంది. రామా రామ ! నే నిక్కడ పోలీసు ఠాణాలో ! ఇక ఎప్పటికీ మేము కలియడం జరగదేమో అని నిరాశ చెందిన సమయంలో, మీరు ఈ ఠాణాకి ఇనస్పెక్టరుగా రావడం జరిగింది. నా గోడు వినిపించు కొనే వారు అది వరకు ఎవరూ లేక పోయినా , రామా రామ ! అలవాటు కొద్దీ మీతో చెప్పుకొన్నాను. మీరు సానుభూతితో విని, అర్థం చేసుకొని ,నా కోసం అపీలు వ్రాయడమే కాక, పై ఆఫీసర్లతో మాట్లాడి, రామా రామ!, వారు అంగీకరించేలా చేసారు. ఉదయాన్నే లేచి, మీ ఇంటికి వచ్చి, కృతఙ్ఞతలు చెప్పుదామని అనుకొన్నాను. మీరు ఠాణాకి వచ్చారని తెలిసింది. మీ ఇంటి బయట వరండాలో ఎవరో పెద్దాయన కనిపించారు. వెనక నుంచి చూసాను. రామా రామ ! ఒడ్డూ పొడవూ అంతా మీ లాగే ఉన్నారు., మీ నాన్నగారా సార్ ?” అని అడిగాడు టూ నాట్ త్రీ.
“ కాదు టూ నాట్ త్రీ ! నాకు అంత అదృష్టం లేదు. మీ ఊరి మనిషే ! దారి తప్పి ఇలా వచ్చాడు. నిన్న రాత్రి కురిసిన వర్షంలో తడిసి, చలికి తట్టుకోలేక, వణికి పోతూ, నా ఇంటి వరండాలో తల దాచు కోవడానికి వచ్చాడు. నేను లోపలికి పిల్చి, పొడి బట్టలు ఇచ్చి, కట్టుకోమని చెప్పాను. బట్టలు కట్టుకొన్నాక ఆకలిగా ఉందన్నాడు.నేను వేడిగా నాలుగు బ్రెడ్ పీసులు కాల్చి ఇచ్చి, టీతో పాటు సర్వ్ చేసాను. ఆప్యాయంగా ఆరగించాడు. ”
“ రామా రామ ! మా ఊరి మనిషి అన్నారు, పేరేమిటి సార్ ?”
“ పేరు నేనింకా అడగ లేదు టూ నాట్ త్రీ ! చూడబోతే అతనికి మతి స్థిమితం ఉన్నట్లు లేదు. తనలో తనే పిచ్చి వాగుడు వాగుతున్నాడు. రెండు రోజులు ఆశ్రయ మిచ్చి,వివరంగా అన్నీ, తెలుసు కోవచ్చునని ఆగాను.”
“ రామా రామ ! మీది చాలా మంచి మనసు సార్ ! ఈ పోలీసు ఉద్యోగం మీరు చెయ్యాల్సింది కాదు.”
“నేను అదే అభిప్రాయానికి వచ్చాను .ఈ ఉద్యోగం ఇచ్చే అధికారంతో, సమాజ సేవ చేయాలని అనుకొన్నాను. కాని అనుభవం నేర్పింది, ఈ యూనిఫారంకీ, సమాజ సేవకీ చాలా దూరమని ! అందుకే ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.”
“ రామా రామ ! రాజీనామా చేస్తారా సార్ ? కాని—”
“ ఏం ? పొట్ట ఎలా గడుస్తుందనా, నీ అనుమానం ? నాకు కుటుంబం అంటూ ఎవరూ లేరు. నా ఒక్కడి పొట్ట ఏం చేసినా నిండుతుంది. అయినా ఎం. ఏ హిస్టరీ చదివాను . ఆ చదువుకి ఉండే ఉద్యోగ అవకాశాలు నాకూ ఉన్నాయి. ఏదీ దొరకక పోతే ట్యూషన్లు చెప్పుకొని అయినా , పై చదువులు చదువుతాను.”
“ రామా రామ ! మీరు నిర్ణయం తీసుకొన్నారంటే అది మంచికే అయి ఉంటుంది. సార్ ! మీ దగ్గర పని చేసిన రోజులు నాకు ఙ్ఞాపకం ఉండి పోతాయి.”
“ సరే, టూ నాట్ త్రీ ! ఇద్దరం కలిసి, మార్కెట్ సెంటర్ వెళ్లి, ఇరానీ టీ త్రాగుదాం పద !”
“ ఆ టీ ఇక్కడికే తెప్పించండి సార్ ! ముగ్గురం కలిసి త్రాగుదాం,” అంటూ లోపలికి వచ్చాడు మురుగన్ .
“ పని మీద వచ్చావా మురుగన్ ?” అడిగాడు ఇంద్రనీల్.
“ అవును సార్ ! నాకు టెంపరరీ ఉద్యోగం ఒకటి దొరికింది. మీరు దయచేసి అనుమతిస్తే చేస్తాను,” అన్నాడు మురుగన్.
ఇంద్రనీల్ మురుగన్ వంక ప్రశ్నార్థకంగా చూసాడు
“ వాచ్ మెన్ ఉద్యోగం సార్ ! రాత్రి పూట పని –”
“ ఎక్కడ సంపాదింఛావు మురుగన్ ?”
“ మొసలి కొలను గ్రామం శివార్లలో సార్ !”
“ మొసలి కొలను గ్రామమా ! అది నా పరిథిలో లేదే !”
“ నిజమే సార్ ! ఒక రాత్రికి వంద రూపాయలు చొప్పున ఎన్ని రాత్రులు పని చేస్తే అన్ని వందలు దొరుకుతాయి సారూ ! పెళ్లాం పిల్లలు ఉన్న వాణ్ని, అనుమతించండి సార్ !”
“ మొసలి కొలను చాలా దూరంలో ఉంది.రాత్రి పని చేసి,ఉదయాన్నేవచ్చి,హాజరు ఇవ్వగలవా ?”
“ అలా వీలవదు సార్ ! వారానికి ఒకరోజు సెలవు ఇస్తారంట ! ఆ రోజు వచ్చి హాజరీ ఇస్తానండి, దయ ఉంఛండి సారూ ! నా పెళ్లాం పిల్లలని ఇక్కడే ఉంచి వెళ్తాను.ఉద్యోగం రెండు మూడు నెలల కన్న ఎక్కువ ఉండదు, అనుమతించండి సార్ ! పెళ్లాం పిల్లలు కలవాణ్ని—”
“ నీ పెళ్లాం పిల్లలని మాటి మాటికీ మాటల మధ్య దూర్చకు . వాళ్లని ఈ ఊర్లోనే ఉంచి, వారం రోజులకి ఒక సారి ఖచ్చితంగా , వచ్చి హాజరీ ఇవ్వాలి తెలిసిందా ?”
“ తెలిసిందండి ”
“ అవసరమయినప్పుడు నేను పిలుస్తే , వచ్చి వాలాలి.”
“ అలాగే సారూ !”
“ ఇప్పుడు చెప్పు, అక్కడ ఏం జరుగుతోంది ? వాచ్ మెన్ అవసరం ఎవరికి ఉంది ? ఏవైనా ఇళ్లు, మేడలు, లాంటి కట్టడాలు కట్టుతున్నారా ?”
“ కట్టడాలు కాదు సారూ ! నేలలో సొరంగాలు త్రవ్వుతున్నారు .”
ఇంద్రనీల్ ఆశ్చర్యంతో మురుగన్ వంక చూసాడు. మురుగన్ చెప్పసాగాడు.
( తరువాయి భాగం రేపటి టపాలో )
Comments
Post a Comment