( నిన్నటి టపాలో జరిగిన కథ==== ‘ కేసులు పురుగు నుండి పాము వరకు ఇంకా పూల నుండి హారం వరకు జయప్రదంగా పరిశోధించినా , బాధితులకి న్యాయం జరగక పోవడం వల్ల ఇంద్రనీల్ సంతాపానికి లోనవుతాడు. కాకీ బట్టలతో న్యాయం చేయలేనని అనిపించి ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొంటాడు. కానిస్టేబిల్ ౨౦౩కి ట్రాన్స్;ఫర్ అవుతుంది. .ముకబీర్ మురుగన్ కూడా వాచ్;మెన్ ఉద్యోగం వెతుక్కొంటాడు. ఇంద్రనీల్ ముందురోజు వర్షం నాటి రాత్రి తన ఇంటీకి వచ్చిన ఒక పిచ్చివాని మాటలు విని ప్రభావితుడవుతాడు--- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం 6
‘ మొసలి కొలను’ చిత్తూరు జిల్లాలోని ఒక కుగ్రామం ! వంద గడపలు కూడా లేని ఊరు. కొండ చరియల క్రింద , ప్రకృతి మాత ఒడిలో , అనాఘ్రాత కుసుమంలా ఒదిగి పోయి, ప్రశాంతతకి మారు పేరులాగ ఉంటుంది. ఒకప్పుడు చంద్రగిరిని పరిపాలించిన విజయనగర చక్రవర్తుల కాలంలో , ఆ ప్రాంతం ఒక సూక్ష్మ బుధ్ధి అయిన ‘నియోగి మంత్రికి దానంగా ఇవ్వబడింది. అతని తన పరివారంతో పాటు, కులవృత్తినే నమ్ముకొన్న నాలుగు కులాల వారిని చేరదీసి, ఆశ్రయ మిచ్చి, అక్కడ ఒక ఆదర్శ గ్రామాన్ని స్థాపింఛాడు . అలాంటి ప్రశాంతమైన గ్రామం , హఠాత్పరిణామానికి గురి అయి అతలాకుతల మయింది.
దానికి కారణం, ఆ గ్రామం ‘ భూతత్వ విఙ్ఞాన పరిశోధక సంస్థ ’ ( జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ) వారి దృష్టిలో పడింది. ప్రాథమిక పరిశీలనలో అక్కడ , ‘ లిగ్నైట్ గనులు’ ఉంద వచ్చని వాళ్లు ధృవీకరించి , ఆ వివరాలు ప్రభుత్వ పరం చేసారు. అయితే ఆ ఖనిజాన్ని త్రవ్వి తీయడం చాల ఖర్చుతో కూడిన పని అని , ప్రభుత్వ ఆర్థిక బృందం ‘ససేమిరా’ అనేసింది.. అందుకని ఉభయ తారకమైన ఉపాయం ఆలోచించి, ప్రైవేటు భాగస్వామ్యానికి, టెండరు పిలవడం జరిగింది. ఆ టెండర్ని పశ్చిమ భారత దేశనికి చెందిన , ‘ ట్రెజర్స్ & మైన్స్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ’ దక్కించుకొంది. త్రవ్వకాలలో లభ్యమయే ముప్ఫయి శాతం ఖనిజం ప్రభుత్వానికి ఇవ్వడానికి , మరో ఇరవై అయిదు శాతం చవక ధరలో ప్రభుత్వ సంస్థకే అమ్మడానికి, తక్కిన నలభై అయిదు శాతం ఓపెన్ మార్కెట్టులో లాభాలతో అమ్ముకోవ డానికి ఒప్పుకొని, ఆ కంపెనీ ప్రభుత్వంతో ఎం ఓ,యు చేసుకొంది.
కొన్ని రోజుల త్రవ్వకంలోనే అక్కడ లిగ్నైటుతో పాటు ‘, ‘ బాల్ క్లే’ కూడా లభించ గలదని ఆ కంపెనీ కని పెట్టింది. ఆ అన్వేషణ ప్రభుత్వ ప్రతినిధులకి తెలిసినా , అవినీతికి అమ్ముడు పోయిన వాళ్లుమౌనం వహించారు. దాంతో ఆ కంపెనీ ,‘ బాల క్లే ’ త్రవ్వకానికి రంగం సిద్ధం చేసుకొంది. చూడడానికి అది స్టోరేజీ స్థలంలా కనిపించే లాగ జాగ్రత్తలు వహించింది.
మురుగన్ ఇప్పుడు ఆ స్థలానికే , వాచ్ మేన్ గా పని చేయడానికి వెళ్లేందుకు ఇంద్రనీల్ పర్మిషన్ అడిగాడు.
“ మురుగన్ ! సంవత్సరం పాటు రెగ్యులర్ గా హాజరీ ఇచ్చావు. నీ మీద ‘ శిక్షాంతర ఖైదీ పునరావాస కేంద్రం కార్యదర్శి’ ‘ అమృత గారు’’ కూడా మంచి రిపోర్టుని ఇచ్చారు. అందు వలన ఇక మీద ప్రతీ రోజూ వచ్చి, హాజరీ ఇవ్వ వలసిన అవసరం లేదు. వాచ్ మెన్ ఉద్యోగం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నీ కుటుంబాన్ని ఇక్కడే ఉంచుతావు కాబట్టి, రెస్టు రోజున వచ్చి, ఆరు నెలల పాటు హాజరీ ఇస్తే చాలు ! ఆ తరువాత నువ్వు స్వతంత్రుడివి అయిపోతావు. నీ పునరావాసాన్ని నువ్వే స్వయంగా ఏర్పరచుకొన్నట్లు అవుతుంది. ఒక్ వేళ నీ ఉద్యోగం పోయినా, ఆ సంస్థ కార్యదర్శి అమృత గారు నీకు ఉద్యోగం కల్పిస్తారు.”
ఇంద్రనీల్ మాటలు మురుగన్కి సంతోషాన్నీ, ఆశ్చర్యాన్నీ కూడా కలిగించాయి. తనని వారం పది రోజులకి ఒకసారి వచ్చి కలిసే ‘ అమృతా మేడం’ ఒక సామాజిక సంస్థ కార్యదర్శి అని, అతనికి ఇంతవరకు తెలియదు ! తన పిల్లల కోసం ఏదో అభిమానంతో బిస్కెట్లు, పెన్సిళ్లు లాంటివి తెస్తోందని అనుకొన్నాడు. “ నీకు నిద్ర బాగా పడుతోందా , నిద్రలో కలలు వస్తాయా, వస్తే ఎలాంటి కలలు వస్తాయి, సారాయి త్రాగుతావా, పెళ్లాన్ని ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్టావా ?” ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేసేది, తన ప్రవర్తనని, తనలోని మార్పుని కనిపెట్టడానికే అన్నమాట ! ఈ ఇంద్రనీల్ సారు ఎంత మంచివాడు ! తనకి చెప్పకుండానే తనమీద నిఘా పెట్టించి, అమృతా మేడం చేత తన భార్యకి ఉపాధి కల్పించి, తన పూర్తి స్వాతంత్రానికి వీలు కల్పించాడు !
మురుగన్ భక్తితో, ఇంద్రనీల్ కి రెండు చేతులూ ఎత్తి, జోడింఛాడు. ఇంద్రనీల్ అతని భావాన్ని అర్థం చేసుకొని , అతని భుజాన్ని తట్టాడు. “ మురుగన్ ! నువ్వు నాకేమీ ధన్యవాదాలు చెప్ప నవసరం లేదు. నేను నా డ్యూటీ చేసానంతే ! నువ్వు పని చేయబోయే ,‘ మొసలి కొలను’ ఇకమీద మన, ‘టూనాట్ త్రీ ’ పరిథిలో ఉంటుంది. అంటే అతను ట్రేన్స్ ఫర్ అక్కడి దగ్గర్లో ఉన్న టౌనుకే అయింది. ఆ రకంగా మీ రిద్దరూ ఈ పోలీసు ఠాణాకి దూరమవుతున్నారు.”
“ మీరు కూడా ఉద్యోగానికి రాజీనామా ఇస్తారని –”
“ విన్నావా, అవును నిజమే ! ఈ వృత్తిలో నేను ఆశించే ఆత్మానందం, ఎడారిలో ఎండమావి లాంటి దని తెలిసి పోయింది. అంతె కాక, రెండు రోజుల క్రిందట వర్షంలో తడిసి, వణికి పోతూ, నా పంచన నిలబడిన ఒక ఉన్మాది మాటల ద్వారా నేను ఎన్నో జీవిత సత్యాలు నేర్చుకొన్నాను. అతని ‘ బాల శివయోగీంద్ర గారి ప్రకృతి చికిత్సాశ్రమంలో’ చెర్పించి, అతని ఉన్మాదాన్ని బాగు చేయించాలి ! ఆ పని అయ్యాక నేను నా రాజీనామా ఇచ్చి వెళ్లిపోతాను.”
“ ఎక్కడికి వెళ్తారు బాబూ ?” టూ నాట్ త్రీ ,మురుగన్ ఇద్దరూ ఒకేసారి అడిగారు.
“ ఎక్కడికి వెళ్లాలో నాకే తెలియదు, ఏ పని చేపట్టాలో కూడా తెలియదు ! మిమ్మల్ని కలిసే అవకాశం వస్తే తప్పక కలుస్తాను. అంత వరకు ఆ పిచ్చివాడే నాకు మార్గదర్శి !”
(తరువాయి భాగం రేపటి టపాలో )
శ్రీధర్ గారు వరసగా రోజూ చదువుతున్నా.
ReplyDeleteసంతోషం కలిగిందండీ. మీకు నచ్చిన సన్నివేశం వచ్చినప్పుడు మళ్లీ కామెంట్ పెట్టండి. అలాగే ఇంకొకరికి చెప్పి చదివించండి.---శ్రీధర్.ఎ
Delete