(నిన్నటి టపాలో జరిగిన కథ=== మొసలి కొలను గ్రామంలో లిగ్నైట్ గనులు లభ్యమవుతాయి. వాటిని త్రవ్వి తీయడానికి ఒక ప్రైవేట్ కంపెనీతో ఎమ్.ఒ.యు కుదుర్చుకొంటుంది ప్రభుత్వం. కాని లిగ్నైట్’తో పాటు అక్కడ ‘బాలక్లే’ కూడా దొరుకుతుంది. ఆ కంపెనీ రహస్యాన్ని దాచిపెట్టి , బాల్’క్లేని సొమ్ము చేసుకోవాలని పథకం వేస్తుంది. అక్కడికే మురుగన్ వాచ్;మెన్’గా వెళ్తాడు---- ఇక చదవండి )
మొసలి కొలను మ్యూజియం-- 7
అమావాస్య రాత్రి, ‘ మొసలి కొలను సర్వే కేంపుని’ చీకటిలో ముంచి, నల్లని దుప్పటి కప్పింది. ఆ కేంపులో ఎలక్ట్రిక్ దీపాలు ఇంకా తాత్కాలికంగా నైనా ఏర్పాటు చెయ్యలేదు. రహస్యాలు దాగేది చీకటి లోనే కదా మరి ! టెంటు దగ్గరున్న టేబులు మీద పెట్రోమాక్సు లైటు వెలుగుతోంది. వాచ్ మెన్ కోసం ఒక లాంతరు , ఇంకొక టార్చిలైటు మాత్రం ఉన్నాయి. మినుకు మినుకు మనే లాంతరు వెలుగులో ,‘ మురుగన్’ సర్వే కేంపు చుట్టూ పహరా కాస్తున్నాడు.
అదే సమయంలో టార్చి లైటు వెలుగు మురుగన్ మీద పడింది. “ ఎవరు, ఎవరది ?” బిగ్గరగా అరిచాడు మురుగన్.
“ నేనేన్రా మురుగా ! గాభరా పడకు,” అంటూ ఆచారి ,కేంపు లోపలికి వచ్చాడు. ఆచారి ఆ సర్వేకేంపు గుమాస్తా . నుదుటి మీద మూడూ నిలువు నాఅమాలు , తల వెనుక గోష్పాద మంత పిలక, పొట్టిగా, తెల్లగా, స్థూలంగా ఉంటాడు.
“ మీరా ఆచారి బాబూ ! సెంత్రీని కాబట్టి , రాత్రి డ్యూటీ నాకెలాగూ తప్పదు, మీ కెందుకు బాబూ,యీ కంత్రీ జాగరణ ! హాయిగా ఇంటి దగ్గర మరదల్తో తొంగోకుండా ?” అడిగాడు మురుగన్.
“ ఏమన్నావ్ , మరదలితోనా ?” ప్రశ్నించాడు ఆచారి.
“ అదేనండి బాబూ ! మేము పెళ్లాల్ని మరదల్లనే పిలుస్తాం. మేము వాళ్లకి బావలం, మాకు వాళ్లు మరదళ్లు.”
“ ఓహో ! విటులందరూ వెలయాలికి బావలే అయినట్లు—”
“ ఏమన్నారు ఆచారి బాబూ ! మళ్లీ చెప్పండి.
“ ఉన్న మాటే అన్నాను, సాని దానికి సరసుడు, సరసునికి సానిది బావా మరదళ్ల వరస కాదేంటి ?”
“ ఆచారి మాటలకి, మురుగన్కి కోపం వచ్చింది. చొక్కా చేతులు పైకి ముడిచి, “ ఆచారీ !” అంటూ అరిచాడు.
“ ఆమా ! ఏం చేస్తావేంటి అప్పా ! కొడతావా ?” అని అడిగి, టెంటు దగ్గరున్న ఒక్ కుర్చీని లాగుకొని కూర్చొన్నాడు ఆచారి.
“ మురుగన్ చొక్కా చేతులు తిరిగి మడత విప్పేస్తూ, “ ఏం చేస్తానేమిటి, ఏమీ చెయ్యను, నీ నుదుటి మీద నున్న మూడు నామాలు చూసి ఊరుకోవలసి వస్తోంది.” అన్నాడు.
“ ఆమా ! అంతే మరి ! ఆ నామాలకి ఉన్న విలువ అలాంటిది మరి !”
“ అదేం కాదు అప్పా ! ఆ నామాలు మా బాబువి కనుక –”
“ నా నుదుటి నామాలు నీవి ఎలాగవుతాయి ?” అడిగాడు ఆచారి, “ అందులోనూ నీ బాబువి ?”
“ మా బాబు పేరు వెంకట సామి కదా ! ఆ నామాలు వెంకటేశ్వర స్వామివి కనుక , మా బాబు గుర్తుకొచ్చాడు”
“ అయితే ఏంటప్పా ?”
“ ఆ ఎంకన్న నామాలు నువ్వెట్టుకొన్నావు కాబట్టి , బ్రతికి పోయావు. లేక పోతే పిల్లిని కొట్టినట్లు కొట్టెవోణ్ని.”
“ మాటేసి కొడితే పిల్లి కూడా పులి అవుతాది., మురుగప్పా ! ఇంతకీ నేనెందుకు వచ్చానని అనుకొంటున్నావు ? నీ కాపలా చూడడానికి !”
“ నా కాపలాకి ఏమయింది , బాగానే చేస్తున్నానుగా ?”
“ నువ్వు అర్థరాత్రి , అంటే జీరో హవర్కి విజిల్ వేయడం మానేసావు. నువ్వు కాపలా కాస్తున్నదీ , లేనిదీ మాకు తెలియాలంటే నువ్వు గంట గంటకీ విజిల్ వెయ్యాలి. ఆ సంగతి నీకు చెప్పడం జరిగింది.”
“ అంటే, నేను విజిల్ వేస్తున్నదీ లేనిదీ చూడడానికి మీరున్నారా ?”
“ అవునప్పా !”
“ అంటే , ఆచారి బాబూ ! నువ్వ సెంత్రీ మీద సెంత్రీవి అన్న మాట !”
“ అలాగే అనుకో అప్పా! నువ్వు అర్థరాత్రి విజిల్ వెయ్యలేదు ఇంక ఒంటి గంటకి, రెండు గంటలకీ వరసగా విజిల్ వెయ్యక పోతే , ---”
“ వెయ్యక పోతే ఏంటవుతుందప్పా ?”
“ నువ్వు వరసగా మూడు విజిల్లు వెయ్యక పోతే , మన సీనియర్ ఇంజనీయర్ ‘వాట్సన్ దొర’ ఇక్కడకి వచ్చేస్తాడు.
“ ఎందుకని ?”
“ నువ్వు బ్రతికి ఉన్నావో లేదో చూడడానికి.”
“ అంటే వాట్సన్ దొర సెంత్రీ మీద, సెంత్రి మీద , సెంత్రీ అన్న మాట ! బలే, నేను విజిల్ వెయ్యక పోతే మీరొచ్చి వేస్తారు, అప్పుడు కూడ వెయ్యక పోతే వాట్సన్ దొర వచ్చి వేసే స్తాడన్న మాట ?”
“ అన్న మాటే అప్పా ! విజిల్ కాదు, నీ ఉద్యోగానికే అలారం వాయించేస్తారు, తెలిసిందా అప్పా?”
ఆచారి మాటలకి మురుగన్ ఆందోళన పడ్డాడు. అయినా తన భావాలని బయట పడనీయ కుండా ,మొండి ధైర్యంతో ఆచారి కూర్చొన్న కుర్చీ దగ్గరకి వచ్చి,తన భుజం మీద తువ్వాలుని గట్టిగా దులిపి టేబిలు మీద పరిచి, “ అలాగయితే ,ఆచారి బాబూ ! నేను ఈ టేబులు మీద పడుకొంటాను . తుమ్మితే ఊడే ముక్కు ఎంత కాలం ఉంటుంది గనుక ! ” అన్నాడు.
ఆచారి కాసేపు మురుగన్ నిశితంగా చూసి, అన్నాడు, “ అయితే ఇక్కడెందుకు మురుగప్పా! వెళ్లి టి.బి. రెస్టుహౌసులోనే పడుకో ! తెల్లారి నాలుగు గంటలకి ట్రక్కు ఎలాగూ అట్నుంచే వస్తుంది కదా , దాంట్లో వచ్చి, లోడింగు చేయించు” అంటూ.
“ మరి విజిల్ సంగతి ఎలాగప్పా ?”
“ దాన్ని నా మొహాన పడేయ్ ! దాని పని నేను చూసుకొంటాను. తెల్లారి కాఫీ త్రాగడానికి డబ్బు లిచ్చి వెళ్లు.” అన్నాడు ఆచారి.
“ అంటే కాఫీ డబ్బులతో నిద్దర కొనుక్కోమంటావు !”
“ అంతే మరి ! ముక్కే కావాలి, పడిశెం వద్దు అంటే ఎట్లా ?”
“ ఆ డబ్బులేవో నువ్వే పడేసి పోయి తొంగో !”
“ ఆమా ! నాకేమవసరం ! నేను డ్యూటీలో లేను కదా ?”
“ అద్గదీ ఇక్కడే ఉందేదో మడత పేచీ ! డ్యూటీలో ఉన్నోడిని ,లేనోడు వచ్చి తోంగోమన్నాడంటే, ఏదో ఇశేషికం ఉందన్న మాట ! అంతేనా అప్పా ?”
“ ఏమిటో ఆ విశేషం ?”
“ ఇంకేముంది సెంత్రీని తోలేసి, టెంట్లో ఉన్న మట్టి బస్తాలు మోసేస్తావన్న మాట !”
( తరువాయి భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment