( నిన్నటి టపాలో జరిగిన కథ==== మొసలి కొలను గ్రామంలో లిగ్నైట్’తో పాటు ‘బాల’క్లే’ కూడా దొరుకుతుంది. దానిని రహస్యంగా సొమ్ము చేసుకోవడానికి ఆ కంపెనీ ప్రయత్నం ముదలుపెట్టింది. వాటికి కాపలాగా మురుగన్’ని నియమించింది. అమావాస్య నాటి రాత్రి పన్నెండు గంటలు దాటాక ఆ కంపెనీ గుమాస్తా ‘ఆచారి’ , సైటుకి వచ్చి మురుగన్’ని కాపలా పని నుంచి తప్పించాలని చూస్తాడు. వెళ్లి పడుకోమని మురుగన్;కి సలహా చెప్తాడు. మురుగన్ ఆచారి మాటల్ని నమ్మక అతనితో వాగ్వాదం పెట్టుకొంటాడు=== ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం --8
“ పిలిచి పిల్లనిస్తా నంటే కాలొంకర అన్నాడట నీలాంటి వాడే ! ఆ లిగ్నైటు బస్తాలు తెల్లారి ట్రక్కులో లోడయి, లేబరేటరీకి వెళ్తాయి. వాటిని నేనేం చేసుకొంటాను ?”
“ ఆచారి బాబూ ! నా సెంత్రీ డ్యూటీలో , ఫస్టునైటు, సెకండు నైటులే చూసాను గాని, లింగనైటు చూడ లేదు.”
“ లింగనైటు కాదప్పా, లిగ్నైటు.”
“ అంటే ?”
“ అదొక రకం బొగ్గు.”
“ ఏంటీ బొగ్గా ! పొయ్యిలో వేసి, అగ్గి చూపించి, అన్నం వండుకోవచ్చా ?”
“ ఆహా ! దివ్యంగా చేసుకోవచ్చు. వంట చెరుకుగానే కాదు, లిగ్నైటుని చిన్న చిన్న ఫౌండరీలకీ, కమ్మరి కొలిమిలకీ, ఇంకా థర్మల్ ప్లాంటులకీ బొగ్గుకి మారుగా వాడుకోవచ్చు,”
“ ఏమిటీ , తెల్ల తెల్లని మచ్చలతో, బూడిద రంగులో ఉన్న ఆ మన్ను బొగ్గులా కాల్తుందా ?”
“ చక్కగా కాలుతుంది. రాను రాను బొగ్గు నిల్వలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో, లిగ్నైటుకి మంచి డిమాండు ఉంది. నువ్వు తెల్లని మచ్చలన్నావే అవి మచ్చలు కావు, ”
“ మరేంటి ?”
“ అది ‘ బాల్ క్లే ’ అంటే ఒక రకం ప్లాస్టిక్ అన్నమాట ! దానితో మన కాఫీ త్రాగే కప్పులే కాదు, కంది పప్పు డబ్బాలు , ఇంకా పరిశ్రమలో పనికి వచ్చే చాలా వస్తువులు చేయవచ్చు.”
“ అంటే ఈ మన్నులాంటి దానితో పొయ్యి రాజేసి, దాని మచ్చల లాంటి దానితో కప్పులు చేసుకొని, కాఫీ త్రాగేయవచ్చంటావ్ !”
“ అన్నమాటే !”
“ అద్గదీ ఇప్పుడు తెలిసింది నీ ప్లాను ! ఈ సెకెండు నైటు డ్యూటీలో , ఆ లిగ్నైటు బస్తాలు నాలుగు ఇంట్లో పడేసుకోవాలని వచ్చావు. దానికీ సెంత్రీ మురుగప్ప పానకంలో పుడక లాగున్నాడు—”
“ ఓరి వెర్రి ముగమా ! అదింకా లిగ్నైటు కాదురా, దాని ముడి సరుకు !”
“ ఏంటో, నీ ముళ్లలోని కుళ్లు నాకు అంతు పట్టడం లేదు.”
“ ఏం తెలిసినా, తెలియక పోయినా , ఉన్న తెలివంతా కూపీలు లాగడానికి, టోపీలు వెయ్యడానికి సరిపోతోంది.”
మురుగన్ కోపంతో బుంగ మూతి పెట్టి, “ ఆచారి బాబూ ! ” అని ఆగి పోయాడు. ఆచారి అది చూసి నవ్వుతూ, “ చెరువు మీద అలిగిన అదేదో దాని లాగ, ఆ ముఖం ఎందుకలా పెట్టావు ? తెలుసుకోవాలంటే నేను చెప్పేది విను. మన ట్రెజర్స్ & మైన్స్ కంపెనీ పరిశీలనలో ఇక్కడ లిగ్నైటే కాక, బాల్ క్లే కూడా దొరుకుతుందని తెలిసింది. దాంతో సర్వేకేంపు పెట్టి, కొంత వరకు మట్టి త్రవ్వి తీసారు. దాన్ని బస్తాలకి ఎక్కించి, లేబరేటరీ పరీక్షకి పంపిస్తున్నారు. ఆ పరీక్షలలో ఇక్కడ ఏయే ఖనిజం ఎంత నిష్పత్తిలో దొరుకుతుందో తెలుస్తుంది . ”
. “ ఉంటే ఏమవుతుంది ?” అడిగాడు మురుగన్ .
“ వెంటనే ఇక్కడ గనుల త్రవ్వకం మొదలవుతుంది.”
“ నేల క్రింద సొరంగాలు త్రవ్వుతారన్న మాట !”
“ అబ్బే సొరంగాలు త్రవ్వరు.”
“ బొగ్గు మరి సొరంగాల లోనే కదా దొరికేది ?”
“ నిజమే , అది బొగ్గు విషయంలో, లిగ్నైటు కోసం సొరంగాలు త్రవ్వ నక్కర లేదు. లిగ్నైటు గనులని ఓపెన్ మైన్సు అంటారు.”
“ అంటే చెరువుని త్రవ్వినట్లు త్రవ్వుతారా ?”
“ అవును,చెరువుని త్రవ్వినట్లే త్రవ్వుతారు. ”
“ చెరువులో పడినట్లు నీళ్లు పడితే ?”
“ నీళ్లు ఎలాగూ పడతాయి. వాటిని పంపు పెట్టి తీసేస్తారు.”
“ ఆనక లిగ్నైటు దొరుకుతుందా ?”
“ లిగ్నైటు కాదు దాని ముడి సరుకు దొరుకుతుంది. దాని నుంచి లిగ్నైటుని వేరు చేసి తీయడానికి, ఒక ఫేక్టరీ పెడతారు.”
“ ఈ చెరువులో లిగ్నైటు ఎంత దొరుకుతుందేమిటి ?”
“ కొన్ని వేల టన్నులు దొరుకుతుంది.”
“ అవి అయి పోయాక ఈ ఫాక్టరీ ఏమవుతుంది ?”
“ మళ్లీ మరి కొంత మేర దాని ప్రక్కనే త్రవ్వుతారు. అదయ్యాక ఇంకో చోట త్రవ్వుతారు. అలా ఈ నేలంతా ఆ లిగ్నైటు ముడి సరుకే ఉందన్న మాట !”
“ మరి ఆ పాత చెరువులని ఏం చేస్తారు, కప్పేస్తారా ?”
“ ఉత్తనే కప్పెయ్యరు, జీడి మామిడి చెట్లు నాటి కప్పేస్తారు. ఆ నేలలో జీడి మామిల్లు బాగా ఎదిగి తయారవుతాయి. ” ఆచారి , మురుగన్లు అలా మాట్లాడుకొంటున్నప్పుడే, అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక దొడ్డి చెంబు ఉంది. అతను వాళ్లిద్దరినీ చూసి, “ దండాలు బాబయ్యా !” అన్నాడు.
“ ఎవడ్రా నువ్వు ?” కోపంగా అడిగాడు ఆచారి.
“ దానయ్యనండి” జవాబిచ్చాడతను.
“ దానయ్యవైతే నీ దారిన నువ్వు పోక ఇక్కడికి ఎందుకు వచ్చావు ?”
“ నేను దారిన పోయే దానయ్యనండి, అన్ని దార్లూ నాయే నండి !”
“ ఈ దారి మాత్రం నీది కాదు, ఇది ప్రొహిబిటెడ్ ప్లేసు తెల్సా ?”
“ తెలీదండి, అయినా అంత చాటు ఎవ్వారం ఇక్కడేవుందండి ?”
“ షటప్ ! మురుగన్, ఈ దానయ్యకి దారి చూపించు.”
మురుగన్ సెంత్రీ పోస్టు దగ్గరున్న లాఠీ తీసి, “ పదవయ్యా ! దానయ్యా , బయటకు నడు,” అని బెదిరిస్తాడు.
“ కాసేపు ఉండవయ్యా , కొంపలేవీ కూలిపోవు ! ” అని మురుగన్తో అని, దానయ్య, ఆచారితో, “ బాబయ్యా ! నా నుత్తినే రాలేదండి,” అన్నాడు. ఆచారికి కోపం నసాలానికి అంటింది. “ తెలుస్తూనే ఉంది, దొడ్డి చెంబుతో సహా వచ్చావు,” అన్నాడు విసుగుగా.
“ అదేనండి, దొడ్డికెళ్లడానికే వచ్చానండి---”
“ దానయ్య మాటలకి మురుగన్ అడ్డుపడ్డాడు, “ ఇక్కడే కుర్చొంటావేంటి , ఖర్మ ! వెళ్లు బయటికి” అని గద్దించాడు.
“ నువ్వుండేస్ ! కాపలా కాసేవోడివి కాపలా కాసే వాడి లాగుండు ! నేనా పెద్ద మడిసితో ఎవ్వారం మాటాడడానికని వచ్చినాను.” అని ఆచారితో, “ బాబయ్యా ! నాను సెప్పేది కుసింత ఇనుకోండి,” అన్నాడు.
“ ఆచారి , మురుగన్ని ఆపి, “ మురుగప్పా ! కాసేపు ఆగు, ఈ దానయ్య ఏం చెప్తాడో విందాం,” అని, “ ఏంటయ్యా, నువ్వు చెప్పేది, ” అంటూ దానయ్యని ప్రశ్నించాడు.
“ అదేనండి, నాకు జీడిపప్పు అంటే సాన ఇట్టవండి !”
“ పిచ్చి మాలోకం లాగున్నావు, ఇక్కడ జీడిపప్పు ఎక్కడిది ?”
“ అదేంటండి, జీడి తోట ఏసేసినారు కదండీ !”
“ ఓహో ! జీడి పప్పు తేరగా తినడానికి వచ్చావా ? ఇదేం నీ బాబుగారి సొత్తు అనుకొన్నావా ?”
“ మీ బాబుగారి సొమ్ము కూడా కాదండి.”
“ ఏం కూసావ్ ?”
“ కూయడానికి నేనేమీ గాడిదను కానండి, నా మాట వినుకోకుండా మీరే కూసేస్తున్నారండి.”
“ అంటే మేము కూసే గాడిదలం అంటావు !”
“ అంతేనండి, మేసేవోరయితే , ఈ పాటికి తోట , మేసెయ్యరేటండి !”
“ నువ్వు మేసెయ్యడానికి వచ్చావా ?”
“ అవునండి, పప్పు బేరవాడి కొని మారు బేరానికి అమ్మి ,సొమ్ము సెసుకోడానికి వచ్చేనండి,” ఆ మాటలు విని మురుగన్కి నవ్వు వచ్చింది. మరి కాస్త ఆట పట్టించి వినోదం చూడాలనుకొని, “ డబ్బులు తెచ్చావా దానయ్యా ?” అని అడిగాడు.
(తరువాత భాగం రేపటి టపాలో )
నడిపించండి
ReplyDeleteఇప్పుడిప్పుడే రస కందాయంలో పడుతోంది. గమనించండి==== శ్రీధర్.ఎ
Delete