(నిన్నటి టపాలో జరిగిన కథ--- దానయ్య శరీరంలో పవేశించిన ఆత్మ తన కథను చెప్తుంది. ఇనస్పెక్టర్ గోపాల్రావు. కానిస్టేబిల్ టూ.నాట్ త్రీ అతని మాటలను నమ్మేస్తారు. ఆత్మ నాటకం ఆడిన దానయ్య పారిపోబోతాడూ. గోపాల్రావు అతనిని ఆపి, అతని అసలు పేరు అడుగుతాడు---ఇక చదవండి )
మొసలి కొలను మ్యూజియం--33
“ రామా రామ ! పితృ లోకానికి కాకపోతే ---”
“ మరెక్కడికో మాకు చెప్పి వెళ్లండి.”
దానయ్య చేతులు విడిపించుకొని బిగ్గరగా నవ్వి, “ ఇనస్పెక్టర్ , మీరు – మీరీ ఆత్మకథని నమ్మేసారా ఇనస్పెక్టర్ ! ఐ.పిటీ. అపాన్ బోత్ ఆఫ్ యూ ! ” అన్నాడు. వాళ్లిద్దరూ అతని వంక తెల్లబోయి చూస్తారు.
“ మీరీ మర్రి చిగిళ్లు, వేప మండలు, తులసీ దళాలు తీసుకొని రావడంతో నాకు కూడా సరదా వేసి ఒక ఆత్మగా నాటకం ఆడాను ! మీరు ఆ నాటకాన్ని నమ్మేసారు కదూ ! హు ! అయినా మిమ్మల్ని అని ఏం లాభం ! ఈ దేశన్నేలే నాయకులు, చిన్న ఎం.ఎల్.ఏల నుండి, ప్రధాన మంత్రుల వరకు, తాంత్రిక శక్తులని నమ్మి, తాంత్రికులని ఆశ్రయిస్తున్నారు ! ప్రజలకు దారి చూపాల్సిన మేధావులైన రచయితలు , క్షుద్ర సాహిత్యంతో పేజీలు నింపి, పొట్టలు పెంఛుకొంటున్నారు ! ఇందాకల మీ టు నాట్ త్రీ అన్నట్లు, మనం ఇరవై శతాబ్దంలో కాదు, ప్రోలయ వేముని కాలంలో ఉన్నాము ! ”
“ మిస్టర్, మరి మీరు ?”
“ దానయ్యని కాను! ధనంజయని అంత కన్నాకాను ! సి.ఐ,డిని కూడా కాను ! ఇంకెవరినని కదూ మీ అనుమానం ! ఏ స్వార్థంతో నేనీ నాటకం నడిపించానని కదూ మీ సందేహం ?”
“ అవును,దానికి జవాబు చెప్పాల్సిన భాద్యత మీకు, తెలుసుకో వలసిన అవసరం నాకు ఉన్నాయి.”
“ మరి కాస్త ఊహిస్తే నేనెవరినో మీకే తెలుస్తుంది.”
“ నేను అన్ని కోణాలనుంచి ఆలోచించి చూసాను, మీరెవరో నాకు అర్థం కాలేదు !”
“ ఎలా అర్థం అవుతుంది ఇనస్పెక్టర్ ! మీ ఆలోచనా సరళిలోనే లోపం ఉంటే !”
“ ఏమిటా లోపం ?”
“ స్వార్థం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరని మీరు నమ్ముతున్నారు, అవునా ?”
“ నేనే కాదు అది జగమెరిగిన సత్యం !”
ఇనస్పెక్టరు గోపాల్రావు మాటలకి దానయ్యకి కోపం వస్తుంది. “ అక్కడే పొరబడుతున్నారు మీరందరూ ! ఈ బొమ్మల దొంగలని పట్టి ఇవ్వడంలో నాకేదో స్వార్థం ఉందని మీరు నమ్మారు.”
“ అవును, ఆ స్వార్థం ఒక సి.ఐ.డికి గాని ---”
“ ఇనస్పెక్టరు మాటలకి అర్థోక్తిలోనే అడ్డుపడ్డాడు టు.నాట్ త్రీ .“లేదా, పూర్వకాలం లోని ,రామా రామ! వాటిని చేసిన ధనంజయ నాయకునికి గాని, --”
“ ఈ సారి టు నాట్ త్రీ మాటలని ఖండించాడు దానయ్య. “ అంతే గాని, మరొకరికి లేదు గనుక నేను వారిలో ఒకరినని నమ్మారు. కాని సమాజంలో బ్రతికే ఒక మామూలు వ్యక్తినని, ఆలోచించ లేక పోయారు.”
“ రామా రామ ! దానికి కారణం ఏమిటంటే ?---”
“ స్వార్థం ! అది లేనిదే ఎవరూ ఏదీ చేయరన్న నమ్మకం !”
“ రామా రామ ! అదీ లా పాయింటు ! ఏదీ, స్వార్థం లేకుండా ఇలాంటి పని చేసిన , ఒకే ఒక మనిషి పేరు చెప్పండి చూద్దాం !”
“ ఎందుకు లేరు, చౌదరి అమర్ సింగ్ పేరు విన్నారా ?”
“ రామా రామ ! ఏం చేసాడేమిటి ?”
“ ఒక రోజు రాత్రి కలలో, అమర్ సింగ్ కి, నేల దాని అడుగున ఉన్న, పెద్ద చెరువు, అది ఉన్న స్థలం కనిపించాయి ! ‘కల ’ అని, కొట్టి పారేయకుండా, ఆ నేలని త్రవ్వి చూడాలనుకొన్నాడు ! నలుగురు దగ్గరికీ వెళ్లి సహాయం అడిగితే, ‘ నేల’ అడుగున చెరువేమిటి ? అని అందరూ నవ్వి పొమ్మన్నారు. అయినా అతను నిరాశ పడక , పాపం ! తానొక్కడే ఆ నేలని ఎనిమిది అడుగుల లోతు వరకు త్రవ్వి ,అడుగున ఉన్న చెరువు తాలూకు ఒక గట్టుని కనిపెట్ట గలిగాడు. ఆ సంగతి తెలిసాక గ్రామస్థు లందరూ వచ్చి, అతనికి సాయం చేసారు.”
“ ఎక్కడ, ఏ ఊర్లో ?” అడిగాడు గోపాల్రావు.
“ కురుక్షేత్రానికి నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న, ‘ సునాయ్’ అనే గ్రామానికి దగ్గరలో !
“ మీరు చెప్పేది , ‘ సతాయుజ్ సరోవర్ ’ సంగతేనా ?”
“ రామా రామ ! సతాయుజ్ సరోవరా ! ఆ పేరు వినలేదే ?”
“ అవును,మూడు వందల పొడవు, ఎనభై అడుగుల వెడల్పు ఉన్న ఆ చెరువుకి ,గవర్నమెంటు పెట్టిన పేరు, ‘ సతాయుజ్ సరోవర్ ’! అయినా గ్రామస్థుల నమ్మకంలో అది పాండవుల కొలను అనే పేరుతో నిల్చిపోయింది. ”
“ రామా రామ ! పాండవులకీ, దానికీ ఏమిటో ఆ సంబంధం !”
“ ఆ చెరువు గట్టుకున్న ఒక్కొక్క ఇటిక బరువు 35 నుండి 40 కిలోల వరకు ఉంది. వాటి మీద మనిషి పాదం గుర్తులు ఉన్నాయి. అవి మామూలు మనిషి పాదం గుర్తులకి రెండింతలు ఉంటుంది ! అది ‘ భీమ పాదం ’ అని ప్రజల అనుమానం !”
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment