(నిన్నటి టపాలో జరిగిన కథ=== స్వార్థం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరనీ భావించే ఆలోచనా సరళి లొనే లోపం ఉందని, డిఫరెంట్’గా ఆలోచిస్తే తానెవరో తెలుస్తుందని అంటాడు దానయ్య. అలా అంటూనే ఏ స్వార్థం లేకుండా , మేలు చేసిన ‘అమర్ సింగ్’ కథ చెప్తాడు దానయ్య. --ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం----34
“ బదరీ బాదరాయణ సంబంధం లాగ ఉంది, కురుక్షేత్రానికి దగ్గరగా ఉండబట్టి అలా అనుకొని ఉంటారు.” అన్నాడు ఇనస్పెక్టరు.
“ కావచ్చు !”
“ రామా రామ ! దుర్యోధనుడు ప్రాణాలు కాపాడుకోవడానికి జలస్తంభన చేసింది కూడా ఆ చెరువులోనే కాబోలు !”
“ చూసారా, మీకు కూడా నమ్మకం కలుగుతోంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఏ స్వార్థాన్ని ఆశించి ,అమర్ సింగు ఆ నేలని త్రవ్వాడు అని.?”
“ రామా రామ ! మీకు కూడా అమర్ సింగికి వచ్చినట్లే ఈ బొమ్మలు ఇక్కడున్నట్లు కల వచ్చిందా సార్ ?”
“ నిజమే ! ఆ బొమ్మలు నాకు కలలోనే కనిపించాయి. కాని ఆ స్థలమేదో తెలియ లేదు.”
“ రామా రామ ! మరి ఆ స్థలాన్ని ఎలా కనిపెట్టారు ?”
“ బొమ్మల పనితనం దక్షిణ భారత దేశానిది లాగ అనిపించింది. వెంటనే పుస్తకాలు వెతికాను. ఆ పరిశోధనలో ఉన్న నాకు, పధ్నాలుగు నెలల క్రిందట , దానయ్యతో పరిచయం అయింది ! కుండ పోతగా కురుస్తున్న వర్షంలో తల దాచుకోవడాని కని నా పంచన చేరిన అతన్ని లోపలికి పిలిచి, మాటల్లో దించాను. అతని పిచ్చి వాగుడు నాకు కావలసిన సమాచారం ఇచ్చింది ! దానయ్యకి తొమ్మిది తరాల ముందు మనిషి, ప్రోలయ నాయకుని కొలువులో పని చేసేవాడట ! దనంజయ నాయకుడు చేసిన కంచు బొమ్మలు అతను చూసాడట ! వెంటనే ఆ దానయ్యని----”
ఇనస్పెక్టరు అలర్టు అవుతాడు, “ చెప్పండి, ఆ దానయ్యని ఏం చేసారు ?”
“ పిచ్చి నయమయేందుకు , ‘ బాల శివ యోగీంద్ర గారి ప్రకృతి చికిత్సాశ్రమంలో ’ చేర్పించాను. దానయ్య ఇప్పటికీ చికిత్స తీసుకొంటూనే ఉన్నాడు.”
“ గుడ్ గాడ్ ! తరువాత మీరు దానయ్య వేషంలో ,మొసలి కొలను’ చేరుకొన్నారు, అవునా ?”
“ ఆ బొమ్మలని త్రవ్వి తీయడానికి, పిచ్చి దానయ్యగా, మారిపోవడమే మంచిదనుకొన్నాను. కాని నేను ఇక్కడికి వచ్చేటప్పటికే ---”
“ రామా రామ ! ఇక్కడ ‘ట్రెజర్సు & మైన్స్ కంపెనీ ’ ట్రెజర్ హంట్ ’ చేయడం మొదలు పెట్టింది, అంతేనా, రామా రామ ?”
“ ఆ కంపెనీ త్రవ్వకాలలో ‘వినాయడి బొమ్మ ’ బయటపడి, ఈ మ్యూజియం స్థాపనకి ముందడుగు పడింది.”
“ రామా రామ ! మొదటి అడుగు నుండి చివరి అడుగు వరకు చేరుకొన్నా, మీరెవరో ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలి పోయారు ?”
“ ఇనస్పక్టరు గారూ ! టు నాట్ త్రీ గారూ ! ఇదుగో నా విజిటింగు కార్డు,” అని రెండు కార్డులు తన షరాయి బొందు లోంచి తీసి, వాళ్లకిచ్చాడు,“దీన్ని మీ దగ్గర ఉంచుకొని, నన్నిక రిలీజు చేయండి” అని, వాళ్లిద్దరికీ నమస్కారం చేసి, కటకటాల తలుపు తెరచుకొని బయట పడ్డాడు అతను !
టు నాట్ త్రీ ఆ కార్డును బిగ్గరగా చదివాడు, ‘ ఇంద్రనీల్. కె. పినాక పాణి’, ‘ రీసెర్చి స్టూడెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ’ అని ఉందా కార్డులో’ .
ఆ కార్డుని చదివిన ట నాట్ త్రీ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టి ,” రామా రామ ! సారూ ! మీ దగ్గర పది నెలలు పని చేసినా మిమ్మల్నే పోల్చలేక పోయాను సారూ ! ” అంటూ వాపోయాడు.
“ టు నాట్ త్రీ ! ఇతను ఆ మాజీ ఇనస్పెక్టరేనా ?!”
“ అవును సార్ ! కాని రామా రామ ! నాకో చిన్న అనుమానం ఉండి పోయింది, ఇతను మాజీ ఇనస్పెక్టరు ఇంద్రనీల్ గారు అయినప్పుడు, కంసాలి లచ్చన్న ముందు కంచు కరిగించి బొమ్మలు ఎలా తయారు చేసి ఉంటాడు ?”
“ ఎన్నో డూప్లికేటింగు మిషన్లు ఉన్న ఈ రోజుల్లో, అసలుకి సిసలైన నకలు తీయడం పెద్ద పనేమీ కాదు ! మందు జాగ్రత్త కోసం ముందుగానే మ్యూజియం అధికారులతో మాట్లాడి, కొన్ని బొమ్మలకి నకళ్లని మిషన్ ద్వారా చేయించి ఉంటాడు, కంసాలి లచ్చన్నకి ఎదురుగా కరిగించింది కంచు మాత్రమే ! ”
“ రామా రామ ! ఇంకో చిన్న సందేహం, సొంత కూతురికి తెలియకుండా దానయ్య పాత్ర ఎలా పోషించాడో ?”
“ ధనంజయ నాయకునిలాగ నటించి మనని నమ్మించ లేదూ ! అయినా పిచ్చివాడిలాగ నటించడం పెద్ద చిక్కేమీ కాదు.”
“ నిజమే, రామా రామ ! కాని, అతనలా వెళ్లిపోతూంటే చూస్తూ ఊరుకుండి పోయారేం ?”
(తరువాత భాగం రేపటి టపాలో)
Comments
Post a Comment