మొసలి కొలను మ్యూజియం--- 35 (ఆఖరు భాగం)
“ కేసు పరిశోధన పూర్తయి పోయింది , టు నాట్ త్రీ ! వాట్సన్ తిరుగు లేని సాక్ష్యాలతో పట్టుబడ్డాడు. విదేశాలలో అతనికి ఇంకెవరైనా స్పాన్సర్లు ఉన్నారేమో కనిపెట్టాలని, ఆ లగేజీని షిప్పింగు పోర్టు దగ్గర పట్టుకొన్నాం ! అది ఇంకెవరి పేరా కాక, తన పర్సనల్ లగేజ్ గా తన చిరునామాకే పంపడం వల్ల ఈ దోపిడీకి పూర్తి భాద్యత తనదేనని ఋజువయింది ! వాట్సన్ దొంగతనం కోసం నియమించిన ఏజెంట్లు కూడ, పట్టుబడ్డారు. ఎంకన్నను పొడిచినట్లు, బొమ్మలను ఎత్తుకు పోయినట్లు అంగీకరింఛారు.ఇంద్ర నీల్ కూడా ఇనస్పెక్టరే గనుక ఎన్నో విలువైన సాక్ష్యాలను ఇచ్చాడు. అందుకే ఊరుకొన్నాను. అంతే కాక, ఇంద్ర నీల్ ఎంతో ఆతృతతో వెళ్ల వలసిన చోటు ఒకటుంది ! అక్కడకే వెళ్లి ఉంటాడు,” అన్నాడు గోపాల్రావు.
“ రామా రామ ! ఎక్కడికి వెళ్లాడు సార్ ?”
“ ఆస్పత్రికి, వీలయినంత త్వరగా వెళ్లి, ‘ తులజని’ కలియడానికనే అనుకొంటున్నాను. అతని ఆతృత అలాంటిది మరి ! మనం అక్కడే అతనిని కలవ వచ్చు.”
“ రామా రామ ! అయితే రేపు మీరు గోవా వెళ్లడం లేదా ?”
“ తప్పకుండా వెళ్తాను, వాట్సన్ ని, లాకరు లోని బొమ్మలతో సహా ఇంత కష్టపడి వల పన్ని పట్టుకొన్నాక అలా ఉత్తినే ఎందుకు వదిలి పెడతాను ! రేపే వెళ్తాను !”
ఆస్పత్రిలో తులజని కలిసాడు ఇంద్ర నీల్.
తులజ, ఇంద్ర నీల్ ని కలిసి ఆశ్చర్య పోయింది ! గాభరా కూడా పడింది. “ ఇంద్ర నీల్ నీ కోసం, మొసలి కొలనుకి ---”
“ అర్థోక్తిలోనే ఆమెని ఆపాడు అతను. “ ఇక్కడ మొసళ్ల నోటికి చిక్కావు , ఆ విషయం ఇక మరచి పో ! తులజా !!”
“ ఎలా మరచి పోమంటావు ! నా జీవిత పుస్తకంలో ఈ అత్యాచారాల పుటలు తప్ప, మరేమీ మిగల లేదు ! ” అంటూ తులజ విలపించింది.
“ ఊరుకో తులజా ! ఆ జీవిత పుస్తకంలో నేను కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతాను. ప్రేమ అనే మధురాక్షరాలు నింపి, వింతలతో, విడ్డూరాలతో, సుఖ సంతోషాలతో క్రొత్త పుటలను వ్రాస్తాను
.
“ ఇంద్ర నీల్ ! ఇంత జరిగినా కూడా ---“
“ తులజా ! ఇక ఆ విషయం ఎత్తావంటే నా మీద ఒట్టే ! ” అంటూ ఆమె చేతిని, తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కాడు.
తులజ అతని గుండెపై వాలిపోయి, వెక్కి వెక్కి ఏడ్చింది !
“ ఏమండీ !” అంటూ పిలిచింది ప్రియంవద , గోపాల్రావుని !
“ ఏమిటి ?” అడిగాడు అతను.
“ ఇంద్ర నీల్ .కె. పినాక పాణి ఇచ్చిన మొదటి మెయిల్కీ, చివరి మెయిల్కీ మధ్యనున్న పోలికలు కనిపెట్టారా ?”
“ లేదు, ఏమున్నాయి అలాంటి పోలికలు ?”
“అనితల్లి, ధనంజయుల ప్రేమ కథ ; తులజా ఇంద్ర నీల్ ల ప్రేమ కథ, రెండూ ఒక లాగే లేవూ ? మారిందల్లా సమయ సందర్భాలు మాత్రమే !!”
“ అవును సుమా ! నిజమే ! నేను గమనించనే లేదు, ఇంతకీ ఏమంటావ్ ?”
“ ఈ జన్మలో ప్రేమికులయిన తులజా ఇంద్ర నీల్ లే, పూర్వ జన్మలో అనితల్లి ,ధనంజయులని నా అనుమానం ! ఆలోచించండి.”
“ ఆలోచనా ? అమ్మో ! పునర్జన్మల గురించి పొరపాటున కూడ మాట్లాడ వద్దు !ఇంద్ర నీల్ కి తెలిస్తే, మన ఇద్దరికీ, బ్రైన్ వాష్ చేసేస్తాడు.”
ఆ మాటలకి ప్రియంవద కిలకిలా నవ్వింది.
****************
(సమాప్తం)
Comments
Post a Comment