స్వస్తి శ్రీ నందన నామ సంవత్సర కార్తీక బహుళ అష్టమి గురువారం తేదీ 06.12 2012 , విజయనగరం జిల్లా , బొబ్బిలి మండలం లోని , `కలువరాయి’ గ్రామంలో , ఇంకా తెల్లవారి కాక ముందే , `ఔషసి విచ్చుకోక ముందే , క్రొత్తగా నిర్మించిన `అరుణాచల రమణ ఆశ్రమం ‘దగ్గర , `వెల్లువలా’ పోటెత్తిన జనం , గొప్ప కోలాహలంతో ,`జయనాదాలు ‘ చేస్తూ , తమ గ్రామంలోనే 133 సంవత్సరాల క్రిందట , అంటే శ్రీ బహుధాన్య నామ సంవత్సర బహుళ అష్టమి భానువారం నాడు జన్మించి , ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతి తెచ్చిన ఒక మహానుభావుని విగ్రహాన్ని , అతని గురుదేవుల విగ్రహంతో పాటు స్థాపించారు.
విగ్రహాలు రెండింటి స్థాపన జరిగాక , ఆనంద పారవశ్యంతో చెమ్మగిల్లిన కన్నులు తుడుచుకొంటూ ఉండగా ఒక అపరిచిత వ్యక్తి హస్త స్పర్శ నా భుజంపై పడింది. నేను వెనుతిరిగి చూసాను.
``నమస్కారమండి ! నా పేరు చైతన్య , బొబ్బిలి నుండి వచ్చాను , `ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాను . విగ్రహ స్థాపన సమయంలో మీ స్పందనను చూసాక , ఆ మహర్షులు ఎవరో మీకు బాగా తెలుసునని అనిపిస్తోంది ! విగ్రహ రూపం లోని ఆ మహర్షులు ఎవరు , వారి చరిత్రలు ఏమిటి ?’’
``నిజమేనండి నాకు ఆ పుణ్య శ్లోకుల చరిత్రలు తెలుసు , కాని మీకు చెప్పేంత వ్యవధి లేదు. ఇప్పటికిప్పుడు బొబ్బిలి వెళ్లి , అక్కడి నుండి తిరుగు ప్రయాణం చేసేందుకు ట్రైను పట్టుకోవాలి . అయినా ఆ మహనీయుల జీవిత చరిత్రలు , వివిధ భాషలలో పుస్తకాలుగా ప్రచురింపబడ్డాయి.! మీరు ఉపాధ్యాయులు కాబట్టి , వాటిని సంపాదించి చదవడం మీకు కష్టం కానేరదు ! ‘’
``నేను బొబ్బిలికే వెళ్తున్నాను , మిమ్మల్ని రైల్వే స్టేషను వరకు దిగబెడతాను . దారిలో ఆ మహానుభావుల చరిత్రలను వీలయినంత క్లుప్తంగా పరిచయం చేయండి. వివరంగా తెలుసుకోవాలని అనిపిస్తే , పుస్తకాలను ఆశ్రయిస్తాను.’’
శ్రీ రమణ గణపతుల తెలుసుకోవాలనే అతని జిజ్ఞాసని ఎలా కాదనగలను ! ``సరే , పదండి ! `పుణ్య శ్లోకస్య చరిత ముదాహరణ మర్హతి’’ అన్నది ఆర్యోక్తి ! ఎంతో భాగీరధ ప్రయత్నం చేస్తేనే గాని , `గణపతి’ చరిత్ర క్లుప్తంగా చెప్పడం జరగదు ! అయినా ఎంతో కుతూహలంతో అడుగుతున్నారు కాబట్టి తప్పక చెప్తాను. ‘’అన్నాను. `ఎలా మొదలు పెట్టాలి ?’ అని మననం చేసుకొంటూ
.
*****************************
`పరిపూర్ణ , ఆవేశ , అంశ, కళావతారములని , ఋషి ముని , ప్రచారక , కుమార అవతారములని , పలు రకాల అవతార పురుషులు ఈ భువిలో జన్మించారు . వారి జన్మకి ముందు అవతార సూచకమగు సంఘటనలు జరుగుతాయి.
శ్రీ గణపతి ముని విషయంలో కూడా ఇటువంటి విశేషములు ముందుగానే కనిపించాయి !
శ్రీకాకుళ నగరానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న `అరసవల్లిలో’ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉంది . `మాఘ పౌర్ణమి నాడు ‘ ఆ క్షేత్రానికి పర్వదినం !
అది ఈశ్వర నామ సంవత్సర మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి `1878) అరసవల్లికి 50 మైళ్ళ దూరంలో ఉన్న ,`కలువరాయి‘ గ్రామం నుండి , ఒక బ్రాహ్మణ కుటుంబం , తమ పుత్రుని `పుట్టు జుత్తుల ‘ మ్రొక్కుబడి తీర్చుకోవడానికి అక్కడకి వచ్చారు . కలువరాయి నివాసి అయిన ఆ విప్రుని పేరు , `అయలసోమయాజుల నరసింహ శాస్త్రి ‘ , అతని భార్య పేరు ,` నరసమాంబ ‘ , వారి కుమారుడు 4 ఏళ్ల వాడు , పేరు `భీమ శాస్త్రి’ , తాతగారి పేరే పెట్టారు .
ఆ రాత్రి వారు అక్కడే నిద్రించారు. ఉదయ వేళలో నరసమాంబ ఒక స్వప్నం చూసింది . ఆదిత్యుని విగ్రహం నుండి ఒక దేవత , `అగ్ని కలశంతో ‘ బయటికి వచ్చి , ఆ కలశను నరసమాంబ చేతికి ఇచ్చింది ! స్వప్న వృత్తాంతం విన్న నరసింహ శాస్రి , ``భయ పడకు నరసమాంబా ! నీకు సూర్య తేజం గల కుమారుడు పుట్టగలడు ’’ అని అన్నాడు.
అతని వాణి నిజమైంది . తిరిగి వచ్చిన తరువాత నరసమాంబ గర్భం దాల్చింది ! భార్యను ప్రసవం కోసం పుట్టింట వదలి , నరసింహ శాస్త్రి , కాశీ యాత్రకి బయలు దేరాడు. కాశీ క్షేత్రంలో , `డుండి గణపతి ‘ సన్నిధానంలో , `నవాక్షర గణపతి మంత్రం’ దీక్షగా జపం చేస్తున్న , నరసింహ శాస్త్రికి , ఆ గణపతి విగ్రహం నుండి , ఒక బాలుడు వెలువడి , పాకురుకొంటూ వచ్చి తన తొడ మీదకు ఎక్కినట్లు అనిపించింది. కళ్ళు వొప్పి చూస్తే ఎవరూ లేరు ! `పుత్రోదయం ‘ అయి ఉంటుందని అతను తలచాడు !
ఆ విధంగా అవతార సూచక కారణాలతో జన్మించిన బాలునికి , వారు `సూర్య గణపతి ‘ అని నామకరణం చేసారు ఆ దంపతులు .అయితే వరప్రసాది అయిన `సూర్య గణపతికి’ ఆరేళ్ళ వయస్సు వచ్చినా , మాటలు రాలేదు ! `అమ్మా , అనరా !’ అంటే అనడు.ఆట పాటల మీద , ఆహార విహారాల పైన ధ్యాస ఉండేది కాదు ! నిరంతర ధ్యాన చింతనుడై కనిపించే వాడు . అతనిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించేవి కావు ! చివరకి `నాడీ శుద్ధికై ‘,వైద్య శాస్త్రంలో చెప్పిన చికిత్స ప్రారంభించాడు , నరసింహ శాస్త్రి . పసుపు కొమ్ముని కాల్చి , కుడి కణతపై, `అమృత నాడీ పైన చురక వేసాడు . అలా కొన్ని రోజులు చెయ్యగానే , అంతర్గత శక్తి పెల్లుబికిందో ఏమో ! బాలుడు ``అమ్మా!’’ అని అరిచాడు! అతనియందలి వాని , అతి స్పష్టమై , `నవరసాలు’ గుత్తులు గుత్తులుగా , సాహిత్య శైలిలో రావడం మొదలుపెట్టాయి !
బాల గణపతికి , ఉపనయనం చేసి , ద్వాదశ మంత్ర దీక్షని ఇచ్చాడు నరసింహ శాస్త్రి . ఆ తరువాత తన తమ్ముడైన `ప్రకాశ శాస్త్రి’ దగ్గర , సంస్కృత , ఆంధ్ర భాషల అధ్యయనానికి శ్రీకారం చుట్టించాడు .
గణపతి ఏక సంథా గ్రాహి ! ఒకసారి చదివిన విషయాన్ని వెంటనే వప్ప చెప్పేవాడు. ఎనిమిదవ ఏడు రాక ముందే ,`అమరము , బాల రామాయణం , శివ సహస్రము, ‘ కంథస్థం చేసాడు ! పదేళ్ళ ప్రాయమునకే కావ్యములను పఠించడం , గణిత శాస్త్ర గ్రంధములను చేసుకొని, `పంచాంగ శుద్ది ప్రకరణము’ అనునొక పథకమును రచించి , గురువునకే గురువయ్యాడు !
ఆ రోజు సర్వధారి సంవత్సర ఆశ్వయిజ శుద్ధ అష్టమి (12.10.1988) ఇంటి లోని లోవసారాలో నరసమాంబ , భోజనానికి విస్తర్లు కుడుతోంది . గణపతి కూడ అక్కడే కూర్చొని పుస్తకం చదువుకొంటున్నాడు . ఆవిడ నిండు గర్భిణి , పురుటి రోజులు దగ్గరయ్యాయి! చాల బడలికగా ఉంది. `పురుడు వచ్చేలాగ ఉంది’, అనుకొండి, ``నాయనా ! సూర్యం !’’ అని పిలిచింది.
``ఏమమ్మా ? ‘’అడిగాడు గణపతి.
``ఈ రోజు పురుడు వస్తే ఎలాగుంటుంది రా ?’’
``పురుడు వస్తే , కవల పిల్లలు పుడతారు. తల్లీ పిల్లలు ముగ్గురు కూడా చని పోతారు. ‘’ అని చెప్పాడు గణపతి.
నరసమాంబ తన కుమారుని పాండిత్యానికీ , పారలౌకిక దృష్టికీ సంతోషించింది . `బాల వాక్కు బ్రహ్మవాక్కు అయింది ! ఆ సాయంత్రమే , కవల పిల్లలకి జన్మనిచ్చి, పిల్లలతో పాటు నరసమాంబ స్వర్గస్థురాలు అయింది !
హాహాకారాలు మిన్నుముట్టాయి . వాటి మధ్య గణపతికి , `అమ్మ ఇక లేదు’ అనే శోకం కన్న , `మరణం ఇంత ఘోరమా ! మరణించు వారు ఎవ్వరు ?’ అనే ప్రశ్న పరంపర జిజ్ఞాస కలిగించింది . అతడు తిరిగి మౌనాన్ని ఆశ్రయించాడు !
ఆ సంఘటన గణపతికి మేలుకొలుపు అయింది !
*******************************
బంధువుల వత్తిడి వల్ల నరసింహ శాస్త్రి , గణపతికి 12వ ఏటనే, 8 ఏళ్ళు నిండని ,`విశాలాక్షిని ఇచ్చి వివాహం చేసాడు. గణపతి భార్యని ఉద్దేశించి, `మేఘదూతమును’ అనుకరిస్తూ `భ్రుంగ దూతము ‘ అను కావ్యాన్ని రచించాడు. కాని కాళిదాసు కవిత్వమునకు అది చాల తక్కువగా ఉన్నదని చించి వేసాడు . 18 ఏళ్ళు వచ్చేసరికి గణపతి వ్యాకరణ , అలంకార శాస్త్రములను సాధించుచు , రామాయణ, భారతాది పురాణేతిహాసాలము లందు పారంగతుడు అయ్యాడు. కోడలిని కాపురమునకు తెచ్చుటకు ,తండ్రి ప్రయత్నిస్తూ ఉండగా, అతడు ఒక నిబంధనముపై అందుకు అంగీకారం తెలిపాడు.` ఆరు మాసములు ఇంటి దగ్గర ఉండి సంసారము చేయుటకు , మిగిలిన ఆరు మాసములు తపో యాత్రకు పోవుటకు ,తన భార్య అంగీకరింప వలసినదేనని పట్టు బట్టాడు. విశాలాక్షి కూడా తనకు ఒకరిద్దరు సంతానము కలిగాక తానూ కూడా తపస్సు చేయుటకు భర్త అంగీకరింప వలసినదేనని షరతు పెట్టింది. ఇద్దరూ సరి ఉజ్జీలుగా ఉన్నారని అందరూ సంతోషించారు . అత్తవారింటికి వచ్చిన విశాలాక్షి భర్త వద్దనే మహాగణపతి మంత్రమును , శ్రీ విద్యా దీక్షను తీసుకొంది .
గణపతి సాహితీ వైభవానికి , నవద్వీప పండిత సభా విజయం ఒక మచ్చుతునకగా చెప్పవచ్చు . అక్కడ పూరించిన ఒక సమస్య ఎంతో ప్రసిద్ది పొందింది ! ఆ సమస్య ఏమిటంటే ---
``స్తన వస్త్రం పరిత్యజ్య వధూ శ్వసుర మిచ్చతి -----!’’ అనేది.
ఆ సమస్యను గణపతి ఇలా పూరించాడట !
``హిడింబా భీమ దయితా , నిదాఘే ఘర్మ పీడితా
స్తన వస్త్రం పరిత్యజ్య , వధూ శ్వసుర మిచ్చతి ‘’
భీముని భార్య రాక్షస స్త్రీ అయిన హిడింబ , వేసవి తాపాన్ని భరించ లేక ,పైటని జార విడిచి , మామగారైన వాయువుని ఆహ్వానిస్తున్నది ! అని అర్థం వచ్చేలాగ పూరించిన సమస్య అది ! ఆ సభ గణపతికి ,`కావ్యకంఠ ‘ అని బిరుదుని ఇచ్చి సత్కరించింది. ఆ విధంగా ,`సూర్య గణపతి ‘ కాస్తా కావ్యకంఠ గణపతి ‘ అయినాడు !
అయినా ఈ సాహితీ సత్కారాలు ఎవీ అతనికి రుచించేవి కావు ! తపస్సుతో శక్తిని పొంది దేశానికి సమాజానికి ,భాషకి సేవలు చేయాలన్నదే అంతర్గత అభిలాష !
మన పురాణాలలో `సురులు’, `అసురులు;’ తపస్సు చేసినట్లు ఉంది . వారి వారి తపస్సుల వెనుక కోరికలు ఉండేవి ! అది మంచిదైనా కావచ్చు , లేక చెడైనా కావచ్చును ! వారి తపస్సు ఫలించేది ! మంచి – చెడు అనే తులాభారంపై తూగే , ఈ తపస్సులు – నిజమైన తపస్సులేనా ! అనేది ప్రశ్న ? లోతుగా ఆలోచిస్తే ఇది `యాతన’ అవుతుంది గాని తపస్సు కానేరదు !!
గణపతి యాతన ,` ధనము , భార్య ,’ గురించి కానే కాదు ! తన `కీర్తి ప్రతిష్టల ‘గురించి కూడా కాదు !! మాతృ దేశ దాస్యము , సమాజం లోని కులాల తారతమ్యాలు , తద్వారా చెలరేగుతున్న వైషమ్యాలు సమసి పోవాలని తపస్సు చేసిన మహా మనీషి ఆయన ! తపస్సుతో అతను అలరించిన దేవి – దేవతా శక్తులు లెక్కలేనన్ని !! `గణపతి, శివుడు, రేణుక, తార, భువనేశ్వరి , సిద్ధులు వాటిలో కొన్ని ! కాని ఆ సిద్ధులు అతను ఆశించినవి కావు . అతని తపో యాత్రలో అవి అక్కడక్కడ గుర్తించుకోదగిన `మైలురాళ్ళు !!
అందుకే సరియైన `తపోమార్గము ‘ అతని నిత్య చింతన అయింది. మార్గదర్శి కోసం అతను అన్వేషణ సాగించాడు . తపస్సు యొక్క అంతరార్థం అతనికి తెలియ జేసిన గురువు --`అరుణాచల మౌన స్వామిగా ‘ ప్రసిద్ధిగాంచిన ,`వెంకట రామన్ ‘ అనే అవధూత !
వెంకటరామన్ తన పదిహేడవ ఏటనే , గృహ త్యాగం చేసి , అరుణాచలేశ్వరుని పిలుపు మేరకి, అరుణాచలం వచ్చి అక్కడే తపస్సు చేస్తూ ఉండి పోయాడు !ఏ కాంక్షా లేని తపస్సు అతనిది ! గణపతి ఆ మౌన స్వామియే తనకి మార్గదర్శనం చేయగలడని తలంచాడు .
``స్వామీ ! ఉత్తమములైన పెక్కు మంత్రములతో గాఢమైన తపస్సు చేసితిని .నేను పండితుడనైనను నా సాధనలో ఏమి లోపమున్నదో తెలుసుకొన లేకున్నాను !తపస్సు యొక్క స్వరూపమును తెలుసుకొనుటకు , మిమ్ము శరణు పొందుచున్నాను , అనుగ్రహింపుడు.‘’
స్వామి ఈ ప్రార్థనని విని కరుణార్ద్ర దృష్టితో కొంతసేపు చూసి, మెల్లగా `తమిళమున ‘ ఇట్లనెను .``నేను అను స్ఫురణం ఎచట నుండి వచ్చుచున్నదో విచారించినచొ మనస్సు అందే లీనమగును, అదియే తపస్సు ! జపము చేయునప్పుడు `మంత్రనాదము ‘ ఎందు ఉదయించుచున్నదో పరికించినచో , `పరికించు మనస్సు ‘అందు లీనమగును , అదియే తపము !!’’
అరుణాచలేశ్వరుని ,బ్రహ్మోత్సవములో , అష్టమి దినమున , కార్తిక శుద్ధ చతుర్దశి యందు (18.11.1907) ఈ ఉపదేశము జరిగెను.ఇది విన్నంతనే సకల వేదాంతముల సారము ఇదియే యని గ్రహించి , అమృతమును రుచి చూసిన వాని వలె సంతోషమును , మరల గురువునకు సాష్టాంగముగా ప్రణమిల్లి , ఈ ఉపదేశమును అనుసరించి మీ పాద సన్నిధిలో కొంత సేపు తపస్సు చేయుటకు అనుజ్ఞను ఇయ్యండి. ‘’అని ప్రార్థించాడు గణపతి
.
గుహ లోపల కూర్చొని ధ్యానింపుడు ‘’ అని స్వామి అనుమతి ఇచ్చారు. అదివరకు ఎన్నడూ గణపతి , గుహలో తపస్సు చేయలేడు. గురు కటాక్షము చేత , గుహలో ప్రవేశించుట కూడా సంభవించెనని ఆయన సంతసించి గుహలో కూర్చొని , `నేను అను స్ఫురణము ‘ ఎందు నుండి వచ్చుచున్నదని విచారింప సాగెను . ఎట్టి ఆలోచనని రానీయక , ఆలోచన వచ్చిన వెంటనే దానిని అణచుట , ఈ సాధనము యొక్క పద్ధతి ! నేను అను స్ఫురణములో రెండు భాగములున్నవి , మొదటిది –కర్తృత్వము : రెండవది – మనస్సు యొక్క ప్రసరణము , దీనినే `వృత్తి’ యందురు ! కర్తృత్వము –చేతనము:మనోవృత్తి --జడము ఆలోచనని అరికట్టి , `నేను’ యొక్క మూలమునే పరికించుచున్నచో మనోవృత్తి లయమై , `నేను’ శుద్ధ చైతన్యముగా భాసించును . శుద్ధ చేతనమైన ,`నేను’ అను స్ఫూర్తియే `ఆత్మ’! నేను శుద్ధ ముగా గోచరించుటయే ,`ఆత్మ సాక్షాత్కారము !!
ఇలా విచారిస్తూ , గణపతి మనస్సుని అంతర్ముఖం కావించి , దాని మూలమును పొంద లేక పోయినను , దాని యొక్క సమీపమున సుఖ స్థితి పొంది, సుమారు ఒక గంట సేపు ధ్యాన మగ్నుడు అయినాడు. ఆ స్థితి తొలగినంతనే , `ఇప్పటి వరకు మరుగున పడియున్న తపో విధానమును పునరుద్ధరణ చేయుటకై భగవంతుడే ఈ కాలమునకు తగిన మహర్షిగా , ఈ స్వామి రూపమున అవతరించెనని నిశ్చయించుకున్నాడు వెంటనే ఆ గురు వరేన్యుని `భగవాన్ శ్రీ రమణ మహర్షి ‘ అని పేర్కొనుట ఉచితమని తలచి, `శ్రీ రమణ పంచకమను’ అయిదు శ్లోకములు రచించి ,స్వామి వద్ద చదివి, దాని అర్థము ను వివరించగా , ఆ శ్లోక రత్న మాలికను గురు దక్షిణగా స్వీకరించి ,``సరే నాయనా !’’ (తమిళంలో నాయన అనే పదానికి గణపతి అనే అర్థం ఉందట !) అని స్వామి పలికేరు.
ఆ విధంగా `కావ్య కంఠ గణపతి శాస్త్రి , గుహలో తపస్సు చేస్తూ ఉండగా , నాయన తల యందు శక్తి ప్రవాహ ఝురి అత్యంత అధికమై `కపాల మోక్ష సిద్ధికి ‘దారి తీసినది.ఆ విధంగా`కావ్య కంఠ గణపతి శాస్త్రి , `నాయనగా’ తరువాత గణపతి మునిగా కూడా నామంతరం చెందారు.
ఆ నాటి అనుభవాన్ని గణపతి ముని స్వయంగా తన పినతండ్రి యైన ప్రకాశ శాస్త్రికి స్వయంగా , లేఖ ద్వారా వివరించి యున్నారు. ఆ లేఖ యిది------
గొప్ప సువార్త----- `కపాల మోక్షము’.-----
తిరువన్నామలై –మంగళ వారం –తేదీ-22.8.22.
తండ్రీ !
నీ లేఖ చేరినది. ఆదివారం పగలు 3 గంటలు మొదలు రాత్రి వరకు కుండలినీ శక్తి ఉద్రేకించి , సహస్రారమును పూరింప జేసి , విద్యుచ్ఛక్తి సముద్రంలో ముంచి వేసినది. నాకేమియు తోచలేదు.శరీరము నిలుచునని ధైర్యము లేక పోయినది.
మాట్లాడుటకు కూడా శక్తి లేక పోయినది.ఇట్లుండ రాత్రి 8 గంటలకు గుహలో శిరః – కపాలములు రెండు పాక బలముచే కొంచెము సందు ఇచ్చినట్లు పట్టులో ``లూజు’’అయి పోయినది , బ్రద్దలు అయినట్లు చెప్పిననూ చెప్పవచ్చును.ఇదియే కపాల మోక్షము . ఇది యొక గ్రంధి భేదము.ఇదియే చిన్నమస్తా తత్వమని తలచెదను. తరువాత శక్తిధార ``గ్యాసు’’ వలె శిరస్సు నుండి బయటకు మూడు నిముషముల వరకు వచ్చినది , స్వస్థత చెందితిని. ఇప్పుడు విద్యుత్ చ్చక్తి ధారాళముగా త్యాగ గతులు చేయుచున్నది .తల వద్ద మీదుగా తగలకుండా చేయి ఉంచిన శక్తి ప్రవాహము ``గ్యాసు’’ వలె తెలియుచున్నది . భౌతిక విద్యుచ్చక్తి శారీరిక విద్యుచ్చక్తితో కలసినది.
నాయన ----
ఆ గురు శిష్యుల విగ్రహాలనే , కలువరాయి గ్రామంలో నిర్మించిన ,`అరుణాచల రమణ గణపతి ఆశ్రమంలో ‘ స్థాపించడం జరిగింది.
*******************************
ట్రైను వచ్చే సంకేతం అయింది. నా కథ అక్కడితో పూర్తి చేసాను.
``గణపతి ముని చేసిన రచనలు ఎన్ని ?’’అడిగాడు చైతన్య.
``ఆయన దాదాపు 76 గ్రంధాలు సంస్కృతంలో వ్రాసారు.`ఉమా సహస్రము,ఇంద్రాణి సప్తశతి , విశ్వమీమాంస’ మొదలైనవి వాటిలో ప్రముఖమైనవి ! రమణ గీత ,మహర్షి తాత్విక సందేశాన్ని తెలియ జేసిన గ్రంధం. భగవద్గీత – కృష్ణార్జున సంవాద రూపంలో ఉన్నట్లే, రమణ గీత –భగవాన్ , వారి పృచ్చకుల సంవాద రూపంలో లిఖించ బడింది . ఆ పృచ్చకులు అందరూ రమణాశ్రమానికి వచ్చి సందేహ నివృత్తి చేసుకొన్న వారే కావడం విశేషం !
``ఆ రమణాశ్రమం ఎక్కడ ఉంది?’’
``అరుణాచలం (తిరువన్నామలై) లో ఉంది.మహర్షి అక్కడకి ఒంటరిగా వచ్చారు. ఒకే చోట తన జీవిత కాలమంతా గడిపారు, చిన్న విట్టుని నాటి , పెంచి పోషించిన వట వ్రుక్షంలాగ ఆ ఆశ్రమం విస్తరించింది.ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చాక , మహర్షి తల్లి, తమ్ముడు ఆశ్రమానికి వచ్చారు. వారిరువురికీ `నాయన గారే’ సన్యాస దిక్షని ఇచ్చారు.సన్యాసం స్వీకరించాక మహర్షి తమ్ముడు `నిరంజనానంద అనే పేరుతో ఆశ్రమ కార్య కలాపాలు తన హస్తగతం చేసుకొని , దానికి ఆర్థిక వనరులు సేకరించి అభివృద్ది చేసారు.’’
``నాయనగారికి ఇంకెక్కడా ఆశ్రమాలు లేవా ?’’
``నాయన గారు తపో కాంక్షతో దేశమంతా తిరిగారు.వారు నివసించిన ప్రతీ స్థలమూ అతని ఆశ్రమమే అయింది ! అతను వదలి వెళ్ళిన తరువాత అవి కూడా అంతరించి పోయేవి ! అలాంటి తాత్కాలిక ఆశ్రమాలకి ఆర్థిక వనరులు ఎలా సమకూరుతాయి ? పైపెచ్చు ఆ ఖర్చునంతా నాయన గారే పెట్టుకొనేవారు ! ఆ విధంగా అతని పైతృకం అంతా అప్పులతోనే హరించి పోయింది.
`` ఈ విషయాలు మీకెలా తెలుసు ? మీరు అతని రక్త సంబంధీకులా ?’’
``అవును ! నాయన గారికి ఇద్దరే సంతానం , ఒక కొడుకు , ఒక కూతురు . కొడుకు పేరు `మహాదేవ శాస్త్రి ‘`వాసిష్ట ‘అనే కలం పేరుతో తెలుగు కథా సాహిత్యానికి మహాదేవ శాస్త్రి గారి సేవ గుర్తుంచుకోదగినది అతను కూడా కీర్తిశేషులు అయ్యారు. నేను మహాదేవ శాస్త్రి గారి మూడవ పుత్రుణ్ణి .’’
``అలాగా , చాల సంతోషం ! ఆ విషయం నేను ఉహించాను లెండి ! అయితే నాయన గారు ఎలాంటి వట వృక్షాలనీ నాతలేదని అంటారా ?’’
``ఎందుకు నాటలేదు ! ఆయన నాటినవి `సాహిత్య బీజాలు ‘!’ అవి ఒక్కొక్కటి ఫల వృక్షాలుగా రూపొందాయి. సాహితీ పిపాసులకి ,తాత్వికులకి నవరసాలు అందిస్తూ అలరిస్తూనే ఉన్నాయి ! వాటి భౌతిక ఫలాలైన `రాయల్టి ‘ కూడా నాయన గారు , తన తొలి పుస్తకం అచ్చు వేసిన , `నందిని ప్రెస్ శిరసి ‘ వారికి ఇచ్చేసారు! అవి వారిని సుసంపన్ను లను చేసాయి !’’
``అంటే నాయన గారు ధనాపేక్ష లేని వ్యక్తి అన్నమాట ?’’
``ధనము,భార్య , కుటుంబము , అన్నింటి పట్ల ఆయన తటస్థ భావాన్నే ప్రదర్శించారు . ధనార్జన పట్ల నిరాసక్తత కనబరచారు. దేశం పట్ల, సమాజం పట్ల , భాష పట్ల , కల మక్కువను సాహితీ సేవ ద్వారా తీర్చుకొన్నారు . తన మట్టుకి తాను అహం మూలాన్వేషణలో ‘ గడపి, 21.07.1936 నాడు ,`ఖరగ్ పూరు ‘లోని తాత్కాలిక ఆశ్రమంలో , భౌతిక దేహాన్ని వీడి , అంతకు పూర్వమే సిద్ధమై ఉన్న తన దివ్యామృతమయ శరీరమును వహించి , `అనామయ పథమును పొందారు.’’
ఇంతలో రైలు బండి వచ్చేసింది . నేను చైతన్య నుండి వీడ్కోలు తీసుకొని రైలు ఎక్కాను. సీటులో కూర్చొన్న తరువాత ,చాల సేపటికి జ్జాపకం వచ్చింది ! `చైతన్యకి , నాయన గారి చేతివ్రాతను చూపిస్తూ , కొన్ని ఉత్తరాలు ఉన్న ఫైలును కూర్చొన్న చోటనే మరచిపోయి వదిలేసినట్లు ! చైతన్య వాటిని చూసే ఉంటాడా! ఇప్పుడెం చేయాలి ?’
ఇంతలో నా మొబైలు ఫోను రింగయింది , తీసి చూసాను .ఎవరిదో పరిచయం లేని నెంబరు ! ఆన్ చేసి ``ఎవరు ?’’ అని అడిగాను.
``నేనేనండి , చైతన్యని మాట్లాడుతున్నాను . ఆశ్రమానికి ఫోను చేసి మీ నెంబరు సంపాదించాను ---‘’
``చైతన్య గారూ ! నాయన గారి ఉత్తరాల ఫైలు -----‘’
``నా దగ్గర సురక్షితంగా ఉంది.అందుకోసమే చేసాను .మీ అడ్రెసు చెపితే ,పార్శిల్ చేస్తాను.’’
నేను క్షణం సేపు ఆలోచించి , `` చైతన్య గారూ ! ఆ ఫైలును ఆశ్రమానికే ఇచ్చెయ్యండి . అది అక్కడ ఉండడమే సముచితం !’’అన్నాను .
*******************************
జయతు భరతు క్షోణి ఖంఢమ్ , విషాద వివర్జితం/ జయతు గణపతిస్తస్య క్షేమం విధాతు మనా మునిః
జయతు రమణస్తస్యాచార్యో మహర్షి కులాచలః / జయతుచ తయోర్మాతా పూతా మహేశ విలాసినీ .
(భరత ఖంఢము విషాద వివర్జితమై జయమునొండు గాక ! దానికి క్షేమము కలిగించ వలెనని తలచుచున్న గణపతి జయమును పొందు గాక ! ఆచార్యుడును , మహర్షి కులాచలుడును అయిన రమణుడు జయము నొందును గాక ! వారిద్దరి తల్లియైన మహేశ విలాసిని ఉమాదేవి జయించు గాక !!)
*******************************
Comments
Post a Comment