Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా--2 !(చిలక రథంలో సరదా షికారు--పార్టు 2

ఆ హాస్యానికి శ్రీ లలిత ఉగ్రురాలు అయింది. మీకు సరసానికి వేళా పాళా లేదేమిటి అని అప్పడాల కర్ర చరణ్’కి చూపించింది. చరణ్ తప్పయింది అంటూ చెవులు పట్టుకొన్నాడు.   

అదే ఆ శ్రమదాన సన్నివేశం!! దానిని గుర్తు చేసుకొని ఇద్దరూ నవ్వుకొన్నారు.

అలా ముసి ముసిగా నవ్వుకొంటూనే వాళ్లు ప్రస్తుతం లోకి పడ్డారు.“చూపుల పురాణం చెప్పుకోవడానికి ఇంటికి వెళ్లేంత వరకూ ఎదురు చూపులు తప్పవంటావా?” ఒక పూరీ ముక్క త్రుంచి నోటిలో పెట్టుకొంటూ అడిగాడు చరణ్.

“తప్పదు కాక తప్పదు” అంటూ, తను కూడా పూరీ ముక్కని నములుతూ, అతని కళ్ళ లోకి చూసి నవ్వింది శ్రీలలిత. అలా చూడడంలో ఆమె సోగ కళ్లు కొంటెతనంతో కుంచించుకు పోయాయి.

“నీ కళ్లకి ఏం అయింది, నలుసు గాని పడిందా?”
“లేదే!”
“మరి అవి అలా చిన్నబోయా యేమిటి ?”

“కను రెప్పలు అరమోడ్పులు అయితే, కళ్లు చిన్నవిగానే కనిపిస్తాయి. అల్లరి ఆపి ముందు పూరీలని ఆరగించండి. మనం రైలు పెట్టెలో ఉన్నాము. ఎంత పరదా మాటున ఉన్నా, మన మాటలు అందరూ వింటారు. పరాయి మనుషులు, పరిసరాలు గుర్తు ఉంచుకోండి” అంది శ్రీలలిత కోపంతో. కోపం వల్ల ఆమె కళ్లు వెడల్పయి కెందామరాలు అయ్యాయి.

“అమ్మయ్య! ఇప్పటికీ నా అనుమానం తీరింది, నీ కళ్లు పెద్దవే, వాటికేం కాలేదు.”
“పొండి!” అంటూ శ్రీలలిత ఒక పూరీని అతని మీదకి విసిరి కళ్లు మూసుకుంది.
“సరే! టాపిక్ మారుస్తాను, 1969 లో వచ్చిన, ‘చిరాగ్’ అనే హిందీ సినిమాలో సునీల్ దత్, ఆశా పరేఖ్ తో ఏమన్నాడో తెలుసా?”

“ఏమన్నాడు?” సంభాషణ మరో దారి పట్టినందుకు సంతోషిస్తూ నిట్టూర్పు వదిలింది శ్రీలలిత, పూరీని నమిలి దాని రుచిని ఆస్వాదిస్తూ.

“తెరే ఆంఖోంకె సివా, ఇస్ దునియామే రఖా క్యాహై?వో ఉఠె సుబహ్ చలే, వో ఝుకే సాంఝ్ డలే!” అని అన్నాడు.

“అంటే, అర్థం ఏమిటి?”

“నీ కళ్లు తప్ప ప్రపంచంలో ఇంకేమున్నాయ్! అవి తెరచుకొంటే తెల్లవారి, ముడుచుకొంటే రాత్రి అవుతాయి అని అర్థం”

“ఆశా పరేఖ్ కళ్లు అలాంటివే గాని, వాటిని పొగిడింది సునీల్ దత్ కాదు, మజరూహ్ సుల్తాన్ పురీ తన వర్ణనకి, మదన్ మోహన్ చేత వరస కట్టించి, మహమ్మద్ రఫీ గొంతుతో వినిపించాడు”

“ఆశా పరేఖ్ కళ్లు అలాంటివన్న మాట గతం! ఇప్పటి వాస్తవ మేమిటో తెలుసా?”
“తెలుసు, ఐశ్వర్యా రాయ్ కళ్లు !”
“కావు”
“కావా?”
“ముమ్మాటికి కావు”
“మరయితే ఎవరివి?”
“శ్రీ లలితా సూర్య చరణ్’వి!!”

చుట్టూ తిరిగి మళ్ళీ ప్రసంగం  తన దగ్గరకే వచ్చే సరికి శ్రీ లలిత సిగ్గు పడింది.ఆమె బుగ్గలలో గులాబీలు
పూసాయి! సూర్య చరణ్ వాటి పైన చిటికేసి,తన సీటు మీద నుండి లేచి,చెయ్యి కడుక్కొని రావడానికి
టాయిలెట్ వైపు వెళ్ళాడు.

ప్రక్క కూపేలో క్రింద బెర్తు మీద కూర్చొని, తమ బెర్తుల పైనే రెప్ప వాల్చకుండా చూస్తూ, తమ మాటలనే చెవులు రిక్కించి వింటున్న, ఒక మెరుపు తీగను చూసాడు.   

ఆమె కూడా అతనిని చూసింది, ఆశ్చర్యంతో విప్పారిన తెల్ల తామరల లాంటి ఆమె కళ్లు, చరణ్ భావుక హృదయాన్ని చలింప చేసాయి.

చరణ్ మరు క్షణం లోనే తేరుకొని, వడి వడిగా అడుగులు వేసుకొంటూ ఆమెను దాటాడు. ఆమె తన చూపులని అతని వైపే మరల్చింది. ఆమె చూపులు తనని గ్రుచ్చుతున్నాయని తెలిసినా, వెను తిరిగి చూడకుండా స్వింగ్ డోర్ తెరచుకొని, టాయిలెట్ బ్లాక్ వైపు నడిచాడు.

శ్రీ లలిత టిఫిన్ ప్లేట్లు సంచిలో సర్దేసి బెర్తుని శుభ్రం చేసి, చరణ్ రాక కోసం ఎదురు చూడ సాగింది. అతను రాగానే తను కూడా వెళ్లి ఫ్రెష్ అయి రావడానికి.       

కాసేపట్లో చరణ్ వచ్చాడు.శ్రీలలిత అటు వైపు వెళ్లింది.చరణ్ బెర్తు మీద కూర్చొని మెరుపు తీగ వైపు చూడ కూడదని అనుకొంటూనే చూసాడు. తనని వెంటాడిన కళ్లు ఇప్పుడు వేటాడుతున్నట్లు కనిపించాయి! వాటి తాకిడికి తట్టుకో లేక, పరదా వెనక కనుమరుగు అయ్యాడు.

శ్రీ లలిత వచ్చి అతని ప్రక్కనే కూర్చోంది. “శ్రీ వారూ! మీరు పై బెర్తు మీదకి వెళ్తారా, లేక ఇంకా ఏవైనా కపిత్వాలు  మిగిలి ఉన్నాయా?” అని అడిగింది.

చరణ్ ఆమెకి జవాబివ్వ లేదు. మౌనంగా లేచి, పైబెర్తు మీదకి ఎక్కి, అక్కడ పరదాని  లాగేసుకొన్నాడు.

‘ఇతనికి అలక వచ్చినట్లుంది’ అనుకొంది శ్రీలలిత తనలో తను నవ్వుకొంటూ! ఆమెకి ‘గుండమ్మ కథ’
సినిమాలో సావిత్రి, ఎం.టి.ఆర్ ఉడుక్కొన్నప్పుడు పాడిన , ‘అలిగిన వేళనే చూడాలి, గోకుల కృష్ణుని
అందాలు’ అన్న పాట గుర్తుకి వచ్చింది. ఆ అందాలు చూడాలనే ఉన్నా, మనసుని అరికట్టి, తన బెర్తు
మీద నడుము వాల్చింది.


అతనిది అలక కాదని, మృగ నయనాల రమణి, చూపులతో గ్రుచ్చిన తూపుల కలవరపాటని ఆమెకి ఎలా తెలుస్తుంది! ‘తెల్లవారితే జయ నగరం వచ్చేస్తుంది, ఇంటికి వెళ్లేసరికల్లా ఎనిమిది దాటుతుంది, దారి లోనే పాల పేకెట్టు కొని పట్టుకొని పొతే, కాఫీలు త్రాగేసి, పనులు చూసుకోవచ్చు! కాసేపు బండి లోనే నిద్రపోతే అలసట తీరి ఉత్సాహంగా ఉంటుంది. రెండు ఖర్జూరపు పలుకులు నోటిలో వేసుకొని, చరణ్ చేసే అల్లరినీ కూడా ఎదుర్కొ వచ్చు!’ అని అనుకొంటూ, ఆ అల్లరిని తలచుకొని మురిసి పోతూ కళ్లు మూసుకొని నిశ్చింతగా నిద్ర పోయింది శ్రీలలిత.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద