అలా అహ్లాదానుభూతిలో మైమరిచి పోయిన ఆ కుటుంబ సభ్యులని విడదీస్తూ,
రైలు బండి ‘కెవ్వుకేక’ పెట్టి ఫ్లాట్ ఫారం నుంచి కదలింది. అందరూ చేయెత్తి లలితా
చరణులకి ‘బై,బై’ చెప్పారు. వాళ్లు కూడా తలుపు దగ్గరే నిలబడి, ‘బై,బై’ చెప్తూ,
కంపార్ట్మెంట్ లోపలికి వచ్చారు.
ఇద్దరి మనస్సుల లోనూ ఉత్సాహం ఉరకలు వేయ సాగింది. తమ ప్రయాణం
సరదాగా, సంతోషంగా, అర్థవం తంగా ముగిసినందుకు,ఇద్దరికిద్దరూ మురిసి పోతూ, ‘ఎలాట్’
అయిన సైడు బెర్తు మీద ఎదురెదురుగా కూర్చొని, ఒకరి నొకరు మురిపెంగా చూసుకొన్నారు.
శ్రీలలిత కళ్లల్లో చరణ్ పట్ల ఆరాధన, ప్రశంస, సూర్య చరణ్
కళ్లల్లో శ్రీలలిత పట్ల మక్కువ, అనురాగం వెల్లివిరిసాయి.
శ్రీలలిత కళ్లు ద్రించుకొంది.
“లల్లీ! చూపులు ఎందుకు దిగ జార్చావు?”
“ఏమో, బాబూ! నాకు సిగ్గేస్తోంది.”
“సిగ్గు పడాల్సిన పని ఏం చేసాను నేను?”
“కళ్ళతో కళ్లు కలిపి చూడ లేదా ?”
“ఆ పని నువ్వు కూడా చేసావు కదా?”
“నిజమే! మీవి కొంటె చూపులు, వాటి నిండా చిలిపితనమే! అవి కవ్వించి
గిలిగింతలు పెట్టేస్తున్నాయి”
“అలాగా, మరి నీ చూపులలో ఏమున్నాయి?”
“ఏమో! నా చూపులని నేను చూసుకోలేను కదా? మీ చూపుల లోని
భావాలు బాగానే అర్థం అవుతాయి” అని చేతి సంచీ లోంచి పూరీల పొట్లం తీసింది శ్రీలలిత.
ఆ పూరీలని వాళ్ళిద్దరూ కలసి, సామర్ల కోట లోని చక్రపాణి
గారింట్లో తయారు చేసారు. శ్రీలలిత పూరీలు ఒత్తుతూ ఉంటే, సూర్య చరణ్ వాటిని మరిగిన
డాల్డాలో వేయించాడు. ఆ విధంగా వారిద్దరి శ్రమ దానం వాటి తయారీలో ఉంది. జయనగరం లోని
వాళ్ల సొంత ఇంట్లో కూడా, అదే విధంగా పనులు పంచుకొని ఉమ్మడి శ్రమతో కావలసిన వాటిని
సమకూర్చుకొని సరస సామరస్యాలతో దాంపత్య యాత్రలో పాల్గొంటా రు వాళ్లు. అలాంటిది
ఇందులో ఏముంది, ఇది కేవలం సరదా యాత్ర!
“ఈ పూరీలు తినేసి, ‘రాముడు బుద్ది మంతుడు’ కైవడి, పై బెర్తు
మీదకి ఎక్కి పడుకోండి.రేపు మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తరువాత చూపుల పురాణం చెప్పుకో
వచ్చు”అంటూ ఒక ప్లేటులో కొన్ని పూరీలు తీసి, వాటి మధ్య ప్రత్యేకంగా అతనికి
ఇష్టమయిన వంటకం,‘చింత చిగురు చేర్చి వండిన అరటి కాయ కూర’ పెట్టి, అతని చేతికి
ఆప్యాయతతో ఇచ్చింది శ్రీలలిత. ఆ వంట చేసుకోవడానికి తమ ఇద్దరికీ లభించిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకొన్నారు వాళ్లు, చక్రపాణి గారి ఇంట్లో.
పూరీల ప్లేటు అందుకొంటూ అతను, ఇస్తూ ఆమె, ఆ అపురూప
మయిన ‘శ్రమదాన సన్నివేశాన్ని’ నెమరు
వేసుకొన్నారు.
పూరీలకి పిండి కలుపుతూ ఉంటే ఆమె చేతికి మైదా అంటుకొంది. అప్పటికే
తలంటు పోసుకొని జుట్టు ఆర బెట్టుకొందేమో, శ్రీలలిత జడ వేసుకోలేదు. ఆచ్చాదన లేక వదులుగా ఉన్న ఆమె
కేశ రాశి,విప్పారి వదులుగా పరచుకొని వీపు మీద పరచుకొంది.
విశాలమైన మెత్తని పాలరాతిని తలపింప చేసే శ్రీలలిత వీపు, పాలరాళ్లలో మెత్తదనం కూడా
ఉంటుందా అనే అనుమానాన్ని రేకెత్తిస్తూ, దానిని
స్పృశించి, నిమిరి, ఒత్తి సందేహాన్ని తీర్చుకోవాలనే
ఆర్తిని కలిగి స్తున్నా,ఆచ్చాదన లేని ‘ఆ కేశ రాశి’, పిండి కలపడ మనే క్రియలో బుజాల
మీదుగా జారిపోయి, తమ ప్రయత్నంలో విఫలమయి ఆమెని చికాకు పెట్టింది! పిండి అంటుకొన్న చేతులతో
ఆమె ఆ జుత్తుని ఎలా సరిచేసి మందలిస్తుంది!
అందు వల్ల ఆ సువర్ణావకాశం సూర్య చరణునికి దక్కింది! నవ
జవ్వనితో సల్లాపాలకి అవకాశం దొరకాలే గాని, దానిని వదులుకొనే మూర్ఖులు కూడా ఉంటారా!
చరణ్ ఆ కేశ రాశిని తన చేతులతో సరిచేసి రిబ్బన్తో బిగిస్తూ, మెడ మీద ముద్దులు
కురిపించి, వెనుక నుండి తన కౌగిలి బంధాన్ని కూడా బిగించాడు.
పాపం శ్రీలలిత! ‘అటు కేశ పాశాన్ని దండించ లేదు, ఇటు తన మనో
విభునినీ మందలించ లేదు’! “ఇలాగ
యితే నేను ఈ పూరీలని చెయ్యనంతే!” అని విసుక్కుంది. దాంతో
చరణ్ తన బంధాన్ని సడలించి,
ఆమెని ప్రసన్నం చేసుకొనేందుకు “లల్లీ! ఈ కేశరాశి చేసిన
అల్లరి, ఉత్పాతాల గురించి ఒక కథ చెప్పనా?”
“కేశరాశి పైన కూడా సరసమైన కథలు ఉన్నాయా ?”
“ఈ కథ ప్రత్యేకమైనది, ఇందులో సరసం విరసం రెండూ ఉన్నాయి.”
“పనులు చేసుకొంటూ కథ చెప్పుకొందాం అలాగయితే ఇబ్బంది ఉండదు”
అంది శ్రీలలిత.
సూర్య చరణ్ చెప్పసాగాడు.
కేరళలో శుచీంద్రమనే పుణ్య క్షేత్రం ఉంది. అక్కడ చాల మంది
పూజారులు ఉన్నారు. వారిలో నంబూద్రి మహా శివ భక్తుడు. శివ భక్తుడైన కారణం వల్లనేమో
గర్భ దరిద్రుడు. పూట గడపడమే కష్టంగా ఉండేది. ఒక రోజు పాండ్య రాజు దాతృత్వాన్ని,
పండిత సత్కారాన్ని గురించి విని అతను ఆ మహారాజు సభకి వెళ్లి దానం అడగడానికి తీర్మానించాడు.
ఆ పూజారికి వైదిక పూజా విధానం తప్ప, సాహిత్య పరిచయం గాని
ప్రవేశం గాని లేవు. అందు వల్ల అతను శీవునినే తనకి ఏదైనా ఒక తరుణోపాయం చెప్పమని
ప్రార్థిస్తూ నిద్ర పోయాడు.
శివుడు ఆ సమయంలో పార్వతి దేవి కురులతో ఆడుకొంటున్నాడు.
భక్తుని అసమయ ప్రార్థన అతనికి చిరాకునే కలిగించినా, భక్త సులభుడైన కారణంగా, తను
ప్రేమతో సవరిస్తున్న పార్వతి దేవి కురుల యొక్క సుగంధాన్ని ఆస్వాదిస్తూ, “సింధుర వదనా ధమిల్ల
బంధంబు సహజ గంధంబు”అని వర్ణించి, ఆ వర్ణననే పాండ్య రాజుకి చెప్పమని ఆదేశించాడు.
“ఆ మాటలకి ఏమిటండీ అర్థం?” అడిగింది శ్రీలలిత.
“ఆ మాటలలో చాలా గుప్తమైన అర్థం ఉంది. సింధురము అంతే కుంకుమ
లేదా ఎర్రని అని అర్థం, పార్వతి దేవి ముఖం ఎర్రనిదని శివుడు అన్నాడని అనుకొంటే అది
తప్పుడు అర్థం అవుతుంది! సింధురము అంటే ‘ఏనుగు’ అని కూడా అర్థం ఉంది, కాని ఆ అర్థం
ఇక్కడ సరిపోలదు! ఆ పదం యొక్క అసలైన అర్థం, ‘కణతల నుండి మద జలాన్ని స్రవించునది’
అనగా ఏనుగు అని అర్థం చెప్పుకోవాలి. అలా చెప్పుకొంటే ‘ఎర్రని ముఖము గల పార్వతి
దేవి యొక్క,కణతల నుంచి స్రవించే మదజలం కురులలో చేరి సువాసనలు వెదజల్లుతున్నది’ అనే
అర్థాన్ని చెప్పుకొంటే గాని ఆ మాటకి సహజము, సమంజసము అవదు! శివుడు ఎంతటి ప్రేమ
పూర్వకమైన వర్ణన చేసాడో తెలుసుకొన్నావు కదా, ఇక అది ఎలా అపహాస్యం పాలు అయిందో
విను!”
“ముందుగా ఈ విషయం చెప్పండి, కణతల నుండి మదజలం స్రవించడ
మనేది జరుగుతుందా?”
“కావచ్చు, కాకనూ పోవచ్చు, అది ఒక అందమైన కల్పన మాత్రమే
అయినా అవ వచ్చు! కాని ఒక విషయం మాత్రం నిజం! ‘కామ కేంద్రం’ కణతల దగ్గరే ఉంటుంది !
ఆ కామ కేంద్రం ఉత్తేజితము కాక పొతే రతి
క్రియలో సంతోషం కలగదు! మహా యోగులు తమ కుండలినీ శక్తిని,కణతల దగ్గర ఉండే కామ కేంద్రానికి పంపి అద్భుతమూ, అపురూపమూ అయిన ఆనందాన్ని పొందుతారు. ఆ విధంగా జీవాత్మ
పరమాత్మల సంయోగ క్రియని సాధిస్తారు. ఈ విషయాన్ని ‘ఓషో రజనీష్ గారు’ చాల స్పష్టంగా
చెప్పడమే కాక దాని సాధనా మార్గాన్ని కూడా తెలియజేసారు.”
“ఈ కామ కేంద్రం ఉత్తేజితమవడం అనే క్రియ స్త్రీ పురుషులు
ఇద్దరికీ సరి సమానమేనా?”
“అదేమి ప్రశ్న! అది అందరికీ సమానమే!”
“అలాంటప్పుడు మదజల స్రావం ఇద్దరికీ కలగాలి కదా?”
“చాలా చిక్కు ప్రశ్న వేసావు, స్త్రీలో పరాకాష్ట కలిగించే
తృప్తి ఆలస్యంగా నెరవేరి చాలా సేపు నిలుస్తుంది, అందు వల్ల స్రవించడ మనే క్రియ
నిజంగానే జరిగే అవకాశం ఉంది! పురుషునిలో అదే తృప్తి త్వరగా నెరవేరి అంతే శీఘ్రంగా పోతుంది, కాబట్టి
అది క్షణికం అవుతుంది! శివునికి పార్వతీ దేవి పద మంజీర శింజినీ నాదమే చాలట ఆ
తృప్తి పొందేందుకు! అర్థమయిందా?”
“శ్రీ లలితా దేవి చరణ మంజీర నాదం నుండే ప్రేమ పుట్టిందని
అర్థమయింది, మరీ అంత వివరించాల్సిన అవసరం లేదు !”
ఆమె సమాధానంలో చమత్కారానికి చరణ్ ఆశ్చర్య చకితుడు అయ్యాడు! “ఏమో
అనుకొన్నాను, లల్లీ! నీలో కూడా చాలా కళలు ఉన్నాయి సుమా!!”అన్నాడు.
“అవునండీ! పదహారు కళలూ ఉన్నాయి” అని నాలుక కరచుకొని “అలా
అని మీరే అన్నట్లు గుర్తు!” అని సర్దుకొంది. తరువాత “కథ మధ్యలో ఆపేశారు, ఆ భక్తుడు
ఏం చేసాడు? శివుని వర్ణన అపహాస్యం ఎలా అయింది?” అని సంభాషణని మలుపు త్రిప్పింది.
అమాయకుడైన ఆ భక్తుడు ఆ వర్ణన లోని సాధ్యా సాధ్యాలు విచారించక,
తనకి కలలో వినిపించినవాక్యాలని మననం చేసుకొంటూ, రాజ సభకి చేరుకొన్నాడు.
పాండ్య రాజు సభలో ఒక సరస్వతీ పీఠం ఉంది. పండితులైన వారు ఎంత
మంది దానిని అధిరోహించినా, ఇంకొకరికి అందులో చోటు ఉంటూనే ఉంటుందట! ఆ సభలో ‘నత్కీ
రుడు’ అనే మహాకవి ఉండేవాడు. ఆ సరస్వతీ పీఠంలో అతనిదే ప్రథమ స్థానం! కవి నత్కీరుడు
ఆ మాటలు విని ఎగతాళి చేసాడు. “కణతల నుండి కారేది
మదజలం కాదు, స్వేద జలం! అది స్రవించడం వల్ల కురులకి దుర్వాసన కలుగుతుందే
గాని, సువాసనలు ఎలా వస్తాయి?” అని
సభా సదులందరు నత్కీ రుని మాటలకి నవ్వారు. ‘కురులకి సహజ గంధం ఎలాగుంటుంది, ఏమిటీ వర్ణన అని ఆ భక్తుణ్ణి
మేలమాడారు’. అతను కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. సభా సదులకి నిజం చెప్పే సాడు.
తాను ఆ మాటలని స్వప్నంలో విన్నానని.
వాటిని శంకరుడే చెప్పాడని భావించానని అన్నాడు. ఆ మాటలకి అందరూ గొల్లుమని నవ్వారు.
శివునికి తన భక్తుని దురవస్థ చూసి కోపం వచ్చింది.
వెంటనే ఆశరీర వాణి రూపంలో, “ఆ మాటలని అన్నది
తానేనని,మానవ కాంతల కురులతో పార్వతి దేవి కురులని పోల్చి చూడడం తగని పని” అని
పలికాడు. అపహాస్యం చేసిన నత్కీ రుని కుష్టు రోగివి కమ్మని శాపం ఇచ్చాడు.
విషయం విక్రుత రూపం దాల్చింది. కవి నత్కీరిడు వెంటనే శివ
స్తుతి చేసి, రాజ సభని త్యజించాడు. తన రోగ విముక్తికై ఎన్నెన్నో పుణ్య తిర్తాలని దర్శించి స్నాన
మాడాడు, చివరకి శివుని కరుణ వల్ల రోగ
విముక్తిని పొందాడు.
ఇదీ కురులకి
సంబంధించిన కథ! తలంటి స్నాన మాడి , సాంబ్రాణి
పొగ పట్టించడం వల్ల నీ కురులు
సువాసనలు వెదజల్లుతున్నాయి. నలుగుతో రుద్దడం వల్ల ముఖం కూడా
సింధుర వర్ణం దాల్చింది. అందికే ఈ కథ జ్ఞాపకం వచ్చింది!! నీ పేరు కూడా శ్రీ లలితే
కదా మరి, కాక పొతే మద జల స్రావమే జరగ లేదు మరి !
Comments
Post a Comment