Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా! --3 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2)

పై బెర్తు మీద కలవరపాటుకి (సూర్య చరణ్’కి) కలత నిద్రే గతి అయింది!

అలా రాత్రి మూడు గంటలు అయింది. రైలు బండి ఏదో ‘నేలబారు స్టేషన్లో’ నిలిచి పోయింది. చరణ్ లేచి,
క్రిందకి దిగాడు. దిగుతూనే యాంత్రికంగా ‘అటు వైపు’ చూసాడు. మృగ నయన నల్లని శాలువా కప్పుకొని ఒక వైపు ఒత్తిగిలి పడుకొని ఉంది. నిద్ర పోయిందో లేదో తెలియడం లేదు! ‘ఛ, ఏం చేస్తున్నాను నేను! ఆమె ఊసు నాకు ఎందుకు?’ అని తనని తాను మందలించుకొని, టాయిలెట్ బ్లాకుకి వెళ్లాడు. అక్కడ ముఖం కడుగుకొని, బండి ఏ స్టేషన్లో ఆగిందో చూసేందుకు తలుపు తెరచాడు.

ప్లాట్ ఫారం మీద గుంపుగా జనం కనిపించారు, గొడవ గొడవగా మాట్లాడు కొంటున్నారు!

“ఏమయింది?” అని సూర్య చరణ్ అటు వైపు నుండి వస్తున్న ‘ట్రైన్ సూప రెండెంటు అయిన గార్డుని’ పిలిచి అడిగాడు.

“రైల్వే ట్రాక్ పైన ‘ఫిష్ ప్లేట్లు’ ఎవరో తీసేసారు. డ్రైవరు జాగ్రత్త వల్ల ప్రమాదం తప్పింది! కంట్రోల్’కి ఫోను చేసాము, ఇంజనీరింగ్ పనివారు వచ్చి ట్రాక్ రిపేరు చేసాక, బండి కదులుతుంది”అని చెప్పాడు అతను.

“ఎంత సమయం పడుతుంది?”
“మరో గంట, గంటన్నర పట్టవచ్చు!” అంటూ తన పెట్టె వైపు వెళ్లి పోయాడతను.

చరణ్ ఏమీ తోచక క్రిందకి దిగి, ప్లాట్ ఫారం మీద నుండి నడుచుకొంటూ ఇంజను వైపు వెళ్లాడు. ఇంజను ప్రక్క  లైనులో ‘రిలీఫ్ ట్రైను’ నిలబడి ఉంది. రిలీఫ్ ట్రైను నుండి ‘డీజల్ జనరేటర్’ ద్వారా ‘ఫ్లడ్ లైట్లు’ వెలిగించబడ్డాయి. ఆ వెలుగులో ‘పర్మనెంటు వే ఇనస్పెక్టర్’ సిబ్బంది ట్రాక్ బాగు చేస్తూ కనిపించారు.

అటు వైపే చూస్తూ నిలబడి ఉన్న చరణ్ భుజం మీద, ఒక పల్లవాంగన సుతి మెత్తని చెయ్యి, గాజులు గలగలా చప్పుడు చేస్తూ వచ్చి పడింది! ‘ఆ చెయ్యి లల్లిది కానే కాదు, లల్లి చెయ్యి అంత సున్నితంగా తనని స్పృశించదు, అధికారికంగా అదిమి పడుతుంది అంతే కాదు ప్రేమతో నిమురుతుంది, మరి ఈ చెయ్యి ఎవరిది చెప్మా?’ అనుకొంటూ, చరణ్ వెనక్కి తిరిగి చూసాడు.            

ఆమె!.. ఆమె!! తనని ఇంత వరకు కలవార పాటుకి గురి చేసిన వనిత!!!

“వైభవ్! నీ కోసం చూసి కళ్లు కాయలు కాచి పోయాయి. ఇన్నాళ్ళూ ఎక్కడకి పోయావు వైభవ్?”అని పలకరించింది.

చరణ్ నిర్ఘంత పోయాడు. తనని చూపులతో వెంటాడడమే కాక, తన కదలికల్ని కూడా వెంటాడి, ఇంత దూరం వచ్చి, ఏదో తెలియని పరిచయం లేని పేరుతో తనని పలకరించిన ఆ మెరుపు తీగ లాంటి అందమైన యువతిని చూసి!!

“నేను వైభవ్’ని కాదు, నా పేరు సూర్య చరణ్! ఇంతకీ మీరు ఎవరు?”

“ఆ! వైభవ్’వి కాదా! కాదు, అలా అనకు, నేను నీ మంజీరను! నన్ను పోల్చుకొనే లేదా?”అంటూ ఆమె
 వెక్కి, వెక్కి ఏడవ సాగింది, ముఖాన్ని రెండూ చేతుల లోనూ దాచుకొని.

“మంజీరా!”అంటూ పరుగెత్తుకొని వచ్చాడు ఒక నడి వయసు వ్యక్తి అక్కడకి! “మంజీరా! ఇదేమిటి బండి దిగి పరుగెత్తుకొని వచ్చావు!”అంటూ.

“అన్నయ్యా!” భోరుమని ఏడుస్తూ అంది మంజీర. “వైభవ్ నన్ను మరచి పోయాడు అన్నయ్యా!”అంటూ
అతని భుజం మీద తల వాల్చింది.

అతను చరణ్ వంక చూసాడు,”సారి సర్! నాపేరు కేశవ గుప్త, నా చెల్లెలు మంజీర మిమ్మల్ని బాగాఇబ్బంది పెట్టినట్లుంది”అని, మంజీరతో పాటు ట్రైను వైపు నడిచాడు.”ఇతను మన వైభవ్ కాడు మంజీరా!ఇతని పేరు సూర్య చరణ్ అట! నీతో అతను చెప్పారు కదా?”

ఆమె వెక్కి వెక్కి ఏడవ సాగింది, కేశవ్ గుప్తా ఆమెని అలాగే పొదివి పట్టుకొని తమ కంపార్ట్మెంటు దగ్గరకి నడి పించుకొని తీసుకొని వచ్చాడు.

కంపార్టుమెంటు తలుపు తెరచుకొనే ఉంది, ఆ తలుపు దగ్గర శ్రీలలిత నిలబడి ఉంది. “ఏమయిందండీ? ఎక్కడకి వెళ్లారు చెప్పా పెట్టకుండా!”అంటూ అడిగింది చరణ్’ని.

“బండి అకస్మాత్తుగా ఆగిపోతే కారణం కనుక్కొందామని వెళ్ళాను”అంటూ పైకి ఎక్కాడు. అతని వెనకాలే మంజీర, ఆమెని పొదవి పట్టుకొని కేశవ్ గుప్త  కూడా ఎక్కారు. బండి ఎక్కగానే తిరిగి, చరణ్’ని చెయ్యి పట్టుకొని ఆపింది మంజీర. “వైభవ్, నా వైభవ్!”అంటూ. శ్రీలలిత కనుబొమలు ముడిపడ్డాయి.

“రా, మంజీరా! నా మాట విను, అతను మన వైభవ్ కాడు”అంటూ కేశవ్ గుప్త ఆమెని లోపలి తీసుకొని వచ్చి ఆమె బెర్తు మీద కూర్చో బెట్టాడు.

మంజీర మళ్ళీ బావురుమంది. “వైభవ్! నన్ను వదలి ఎందుకు వెళ్లి పోయావు వైభవ్! నాకు తెలుసు, నువ్వే నా వైభవ్’వి!” అలా అంటూనే తన బెర్తు వదలి, చరణ్ వద్దకు వచ్చి అతని చెయ్యి పట్టుకొంది.
శ్రీ లలిత ఆమె చెయ్యి విసరి కొట్టి, “ఇదుగో అమ్మాయ్! పిచ్చిదాని లాగ ఉన్నావు, అతను వైభవ్’ కాదని అంతే వినిపించుకోవేం? ఈయన నా భర్త, ఆయన పేరు సూర్య చరణ్ గారు!మాది జయనగరం అక్కడకే వెళ్తున్నాము”అంటూ కసిరింది.

“అమ్మా!శ్రీలలిత గారూ! మీరు కూడా నా చెల్లెలు మంజీర లాంటి వారే!దానిని అపార్థం చేసుకోకండి, మీ
భర్త సూర్య చరణ్ గారు నిజంగానే వైభవ్ లాగ ఉన్నారు! వైభవ్’ని మంజీర పిచ్చిగా ప్రేమించింది. అతను ఆమెను మోసం చేసి విదేశాలకి పారిపోయాడు. అప్పటి నుంచి మంజీర మానసిక స్థితి బాగు లేదు. వైభవ్ కోసం కన్నీరు మున్నిరుగా ఏడుస్తోంది! బండి ఎక్కినప్పటి నుండి సుర్యచరణ్  గారినే చూస్తోంది! అతనే తన వైభవ్ అని భ్రాంతి పడుతోంది.”

“అలాగా, సారీ కేశవ గుప్తా గారూ! నాకీ విషయం తెలియక, నా భర్తని పట్టుకొని ఇబ్బంది పెడుతోందని కాస్త దురుసుగా ప్రవర్తించాను”అంది శ్రీలలిత.

“ఫరవాలేదమ్మా!నేను మీ ఫీలింగ్స్ కూడా అర్థంచేసుకోగలను”అంటూ ఇలారండమ్మా మీ ఇద్దరూ! కాసేపు నా బెర్తు మీద కూర్చోండి. మీకు మంజీర పరిస్థితి వివరించి చెప్తాను”అన్నాడు కేశవ గుప్త.

శ్రీ లలితా సూర్య చరణ్’లు  అతని మాటలకి చలించి, మంజరి పైన జాలితోను, ఆమె చరిత్ర తెలుసు
 కోవాలనే  ఉత్సుకత తోనూ, అతను చూపించిన బెర్తు మీద కూర్చొన్నారు.      

కేశవ గుప్త తన దగ్గరనున్న ‘మెడికల్ కిట్’తీసాడు. “సూర్య చరణ్ గారూ! వృత్తి రీత్యా నేను డాక్టర్ని, అంతే కాక ‘సైక్రియాట్రీస్టుని! అయిన నా చిట్టి చెల్లెలు మంజీరకి స్వస్థత చేకూర్చ లేక పోతున్నాను. మంజీర మనో వాక్కాయ కర్మల చేత వైభవ్’ని ప్రేమించింది. తన తనువునీ, సౌందర్యాన్నీ, యవ్వన లావణ్యాలనీ, అన్నిటికీ మించి మనసునీ అతనికి అర్పించింది. వైభవ్ ఆమెతో బాగానే మసలుకొనే వాడు! ఆమెని పెళ్లి కూడా చేసుకొన్నాడు. మంజీరని విడిచి పెట్ట లేని నేను, వైభవ్’ని మా ఇంట్లోనే ఉండమన్నాను. పైత్రుకమైన ఆస్థి నాకూ, మంజీరకు చాలా ఉంది! మేము జయ నగరం లోనే ఉంటున్నాము. నేను వైభవ్’ను బిజినె స్సులో పెట్టాను, అతను కూడా శ్రద్ధగా పని చేసి, అపారమైన సంపదని ప్రోగుచేసాడు.‘వైభవ్ ఎంటర్ ప్రైసెస్’ అనే పేరుతో పెద్ద ‘బిజినెస్ చైన్’ ఏర్పాటు చేసి దానికి యజమాని అయ్యాడు”    
“బిజినెస్సుని అంతగా డెవలప్ చేసారంటే అతనికి పట్టుదల, కార్య దీక్ష ఉన్నాయని స్పష్టమవుతోంది.
అలాంటి మనిషి, మంజీరను ఎందుకు వదిలేసాడు?” అని అడిగాడు చరణ్.

“వైభవ్ బిజినెస్సులో నేను కలగజేసుకో లేదు. అతనికి నేను అతని పేరు మీద ‘వైభవ్ టూర్స్ &ట్రావెల్స్’
అనే రవాణా వ్యవస్థని అప్పగించాను. దానిని అతను ఎంపైర్’గా చేసాడు. చాలా బిజినెస్సులు చేపట్టి నడప సాగాడు. హోటల్సు, రిసార్టులు,క్లబ్బులు, పబ్బులు, రియల్ ఎస్టేట్ రంగాలలో రాణించాడు. అదంతా న్యాయ సమ్మతమైన ఆర్జనే అని నేను నమ్మాను” అంటూ కేశవగుప్త మెడికల్ కిట్ లోంచి ఒక ఇంజక్షన్ బాటిల్ తీసి, దానిలో మందుని సిరెంజ్ లోకి ఎక్కించాడు. “అమ్మా, మంజీరా!” అంటూ ఆమె జబ్బ
పట్టుకొన్నాడు.

“వద్దు అన్నయ్యా! వద్దు..”అంటూ మంజీర గింజుకొంది.కేశవ్ గుప్త బలవంతంగా ఆమె జబ్బ లోకి ఇంజక్షన్ ఇచ్చేసాడు. మరి కొన్ని నిముషాల లోనే ఆమె కనురెప్పలు మూసి, మత్తు లోకి జారుకొంది. ఆమెకి కంబలి కప్పి, సూర్య చరణ్ వైపు చూసాడు అతను.

“సూర్య చరణ్ గారూ! ఒక వ్యక్తి స్వల్ప వ్యవధిలో విస్తారమైన ధనం సంపాదించాడంటే, అది సక్రమార్జన ఎంత మాత్రమూ అవదు. నేను ఆ విషయాన్ని గమనించ లేక పోయాను. వైభవ్ అండర్ గ్రౌండ్ వ్యాపారాలు చేసాడు. తన ట్రావెల్ సంస్థని, హోటల్, రిసార్టులని, క్లబ్బులని, పబ్బులని ఆ వ్యాపారాలకి అనుబంధ సంస్థ లుగా చేసుకొన్నాడు. చివరికి చెరసాల పాలు అయ్యాడు. మంజీరకి ఆ విషయం తెలియదు, తను విదేశా లకు వెళ్ళాడని అనుకొంటోంది!”

“అలాగా!” అన్నారు శ్రోతలుగా మారిన దంపతులు.

“మంజీర ప్రగాఢ నిద్రలో మునిగి పోయింది, మీరు ఇక మీ బెర్తుల పైన విశ్రాంతి తీసుకోండి” అని కేశవ్’ అన గానే వాళ్లిద్దరూ తమ తమ బెర్తుల పైకి చేరుకొని కళ్లు మూసుకొన్నారు. ఇంతలో ట్రాక్ బాగయింది కాబోలు రైలు బండి కదిలింది.

జయ నగరం గంటన్నర ఆలస్యంగా చేరుకొంది. శ్రీ లలిత, చరణ్’లు, కేశవా గుప్తకి వీడ్కోలు చెప్పి బండి
 దిగారు. మంజీర ఇంకా పడుకొనే ఉంది.

ఇంటికి చేరాక శ్రీ లలిత గృహ కృత్యాల లోనూ, సూర్య చరణ్ ఆఫీస్ పనుల లోనూ, నిమగ్నులై రైలుబండి లోనడిచిన మంజీర ప్రకరణాన్నిదాదాపు మరచి పోయారు.వారిద్దరూ కలసి గడిపిన  సమయాలు, ప్రణయ కలహాలు, ముద్దు మురిపాలు సరస సల్లాపాలు, కథాకాలక్షేపాలతో కరిగి పోతూ, వారి దాంపత్య జీవితం ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’ లాగ పరిఢవిల్ల సాగింది!

***************************          

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద