వైభవ్!
ఎక్కడున్నావు, అసలు ఈ మంజీరని విడిచి ఎలా వెళ్లి పోయావు?
నువ్వు ‘కాటుక పిట్టలనీ, కలువల కొలనులనీ, పౌరుష సూదంటు రాళ్లని, గేలమేసి లాగ గలిగే ఆకర్షక అయస్కాంత యంత్రాలనీ, కటాక్షిస్తే ఆమనులనీ, వర్షిస్తే పయోధరాలనీ వర్ణించే నా కళ్లు’ నీ కోసం చూసి చూసి వేసారి, విసుగెత్తి, ‘ తేజస్సునీ, ఆకర్షణనీ, ఆర్ద్రతనీ’ కోల్పోయి కాయలు కాచాయి! త్వరగా వచ్చేయవూ?
నీ కోసం ఎదురు చూసే లవ్లీ మంజీర.
కేశవ్ గుప్త ఇంటిలో మంజీర గది లోంచి వచ్చిన కాగితాలలో ఒకదాన్ని, ‘తన లల్లీకి’ బిగ్గరగా చదివి వినిపించాడు సూర్య చరణ్.
శ్రీ లలిత, గమ్యానికి చేరని ఉత్తరం లోని ఆవేదనని విని, భావుకతకి లోనై కంటి వెంట కన్నీరు కార్చింది. ఆ కన్నీరు సూర్య చరణ్ బుగ్గల మీద పడింది, అలా పడక ఏం చేస్తుంది! అతనామె ఒడిలో పడుకొని
ఉన్నాడు మరి ! ఆ కన్నీటి తడికి చరణ్ ఎలర్ట్ అయ్యాడు. “ఏయ్, ఏమిటిది లల్లీ! నువ్వు కంట తడి పెట్టావా? అది కూడా ఈ చరణ్ నీ ఒడిలో సేద తీర్చుకోవడానికి విశ్రమించి ఉండగా! నో ఎందుకంత ఎమోషనల్ అవుతావు, మనకి సంబంధం లేని విషయాలలో!” అని అన్నాడు.
“సంబంధం లేని విషయం కాదు, చరణ్! మంజీర నన్ను ‘చెల్లీ ’ అని పిలిచింది, నా అక్కకి ‘ పతీ వియోగం బ్రతుకుని ఎంత దుర్భరం చేసింది? ” అంది శ్రీ లలిత. చరణ్ ఆమె కన్నీటిని తన పెదవులతో తుడిచాడు.
ఆ చర్యకి కూడా శ్రీ లలిత భావుకురాలు అయింది, “ నన్ను మరీ ఇంత హెచ్చుగా ప్రేమించకు చరణ్! నువ్వు ఏ కారణం చేతనైనా నాకు దురమవుతే నేను భరించ లేను” అంది.
“అంటే, నీ ఒడి లోంచి లేచి పొమ్మంటావా?”
“వద్దు చరణ్, వద్దు” అంటూ ముందుకు వంగి, చరణ్’ని బాహు బంధంలో గట్టిగా బిగించి, తన బుగ్గల మీద తారాడుతున్న అతని అధరాల్ని, తన అధరాలతో అందుకొని, జిహ్వతో జుహ్వని ముడివేసి,లోతైన ముద్దు పెట్టుకొంది శ్రీ లలిత. అలా కొన్ని మధుర క్షణాలు గడిచాక తెప్పరిల్లి ద్వంద్వ బంధాల నుండి వెలువడ్డారు ఇద్దరూ !
“లల్లీ! ఇక ఈ ఉత్తరాల్ని చదవను, పద! మనం మన పనుల్లో పడి, ‘శ్రమ దానం’ చేసుకొందాం” అన్నాడు.
“వద్దు చరణ్! ఉత్తరాలు చదివి వినిపించడం కూడా శ్రమ దానమే కదా, ఇలాగే బాగుంది! ముందు ఈ పనిని ముగించు.” అంది శ్రీ లలిత కిలకిలా నవ్వుతూ.
“అమ్మయ్య! ఇప్పటికి నీ నవ్వు పువ్వుల్ని చూసాను, మళ్ళీ స్పందనకి గురయి కన్నీరు పెట్టనంటే ఇంకో ఉత్తరం చదువుతాను”అని, చరణ్ ఆ పువ్వుల కోసం దోసిలి పట్టాడు. శ్రీ లలిత అతని అల్లరికి ముచ్చట పడి,చెట్టుని దులుపుతే పువ్వులు వర్షించినట్లు,‘ఉన్ముక్త హాస వల్లరిని’ కురిపించింది.
వైభవ్!
ఆ రోజు ఏం జరిగిందో జ్ఞాపకం ఉందా? నా నాసిక కోసం వజ్రాల బేసరిని తెచ్చావు. అంత ఖరీదయిన వజ్రం ఎందుకు అని అడిగితే, నా నాసిక విలక్షణమైనదని దేనితోనూ సరి పోల్చలేనిదని అన్నావు! వజ్రానికి, వజ్రమే తగినదని అన్నావు. అలా అయితే ముక్కుకి ఉపమానాలే లేదంటావా? అంటే, ‘ఏమిటా ఉపమా నాలు! ‘దుంపల మధ్య కాడెకు కట్టిన కోటేరుతో’,ముక్కుకి పోలిక ఏమిటి? అది ఎంత కఠినమైనది! అలాగే ‘గంధఫలితో’(సంపెంగ) పోలిక మాత్రం ఏం బాగుంది, అది ఎంత నాజుకైనది!’ అన్నావు. ఎవరూ నీలాగ చెప్పలేదని చాలా ఆనందించాను!
వెంటనే ఆ బేసరిని నా నాసికకి అలంకరించుకొని ‘ఎలా ఉంది?’ అని అడిగాను. నువ్వు జవాబివ్వ కుండా దానిని ముద్దాడేందుకు ఎగ బడ్డావు. అప్పుడు నీ కుడి కణతకి ఆ కఠిన వజ్రం తగిలి గాయం చేసింది. నీకు గాయం చేసిందనే బాధతో నేను దానిని వెంటనే తీసి పడేసాను.
అప్పుడేమన్నావో గుర్తుందా!‘మెత్తని రంగుల రాయిని’ తెచ్చి నా ముక్కుని అలంకరిస్తానని అన్నావు. మెత్తని రాళ్లు ఎక్కడ ఉంటాయి? అని నేను అడిగితే, ‘మనిషికి సాధ్యం కానిది ఏముంది? ఆభరణాల తయారీ దారులకి, పత్రికలో ప్రకటన ఇచ్చి అలాంటి రంగుల రాయితో నాసాభరణాన్ని తయారు చెయ్యమని అడుగుతాను. మంచి ‘రిమ్యునరేషణ్’ లభిస్తుందంటే ఎవరో ఒకరు ముందుకి వస్తారు’ అన్నావు.ఆ తరువాత రెండు రోజులకే 'ముత్యాల బేసరిని' తెచ్చి నవరత్నాలలో ముత్యమే మెత్తనైనది! దీనినే నీ నాసికకి అలంకరిస్తాను అన్నావు! అలాంటి, ‘ఓ నా వైభవ్!’ నన్ను హద్దులు మించి ప్రేమించిన నువ్వు ఎక్కడకి వెళ్లి పోయావు నేను నీ కోసం తపించి పోతున్నాను, నా ముక్కు కూడా నువ్వు అలంకరించ బోయే ముత్యాల బేసరి కోసం బేసరి కోసం, బోసిగా ఎదురు చూస్తోంది! త్వరగా వచ్చేయవా?
నీ లవ్లీ మంజీర.
ఒక విరహిణి మనో వ్యకులతకి అద్దం పట్టే ఆ ఉత్తరాన్నిచదివిన ‘దంపతులు’ కాసేపు మౌనం వహించారు.
“చరణ్! వైభవ్ జైలులో ఉన్నాడని మంజీరకి చెప్పక పోవడం తప్పు కదా, ఆ విషయం తెలిసి ఉంటే ఆమెకి ఇంత మనోవ్యధ ఉండేది కాదేమో!”
“అలా అని ఎలా చెప్పగలవ్,లల్లీ?”
“ఎక్కడ ఉన్నాడో తెలుస్తే, చూడడానికని వెళ్లి వచ్చేది, అదే విధంగా శిక్ష ఎంత కాలం పడిందో తెలుస్తే, ఎప్పుడూ తిరిగి రాబోయేది తెలిసేది, అంతు లేని నిరీక్షణ కన్నా అది మంచిది కదా?”
“నువ్వు చెప్పేది నిజమే! వైభవ్ ‘డ్రగ్ ట్రాఫికింగ్’ నేరం మీద,‘నార్కోటిక్ స్క్వాడ్’కి పట్టుబడి ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించేందుకు జైలుకి వెళ్లాడు. కాని రెండేళ్లకే ఏం జరిగిందో తెలుసా, అతనిని మరో జైలుకి తరలించేందుకు తీసుకొని వెళ్తూ ఉండగా, జైలు వేన్ దుర్ఘటనకి గురయి, వైభవ్ చని పోయాడు. ఈ విషయాన్ని కేశవ్ గుప్త , మంజీరకి ఎలా చెప్పగలడు ?”
“మీకు ఈ విషయం ఎలా తెలిసింది?”
“వైభవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ చిన్నదేమీ కాదు, పైపెచ్చు అతని సాఫ్ట్ వేర్ కంపెనీకే నేను మేనేజర్ని!”
“అంటే ట్రైన్లో కలియడానికి ముందే, మీకు ఆ అన్నాచెల్లెళ్లు తెలుసా?!” శ్రీ లలిత కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది.
“అన్నగారు తెలుసు, చెల్లెలు గారు మతి పోగొట్టుకొన్నారన్న విషయం తెలియదు.”
“దాని అర్థం చెల్లెలు గారు కూడా తెలుసును అని అనుకోవచ్చా?”
“నిజమే లల్లీ! ఈ విషయం ఏమంత సీరియస్ గనుక! నీతో షేర్ చేసుకోవడానికి?”
“మీరు ‘లల్లీ’ అంటూంటే నాకు ‘లవ్లీ’ అంటున్నట్లు ఉంది.” మూతి ముడుచుకోంది శ్రీ లలిత. ఆమె బుంగమూతి చందం చూసి చరణ్’కి నవ్వు వచ్చింది, ఇంకా ఉడికించాలని అనిపించింది.“ఈ లవ్లీ పదం కూడా బాగానే ఉందే! అలా అనిపిస్తే మాత్రం తప్పేముంది! నీకు బాగుంటే చెప్పు, చక్కగా అలాగే పిలుస్తాను.”
“వద్దు ‘లల్లీ’ అనే పిలుపు కేవలం నాకు మాత్రమే స్వంతం, ‘లవ్లీ’ అనేది మంజీరని వాళ్ల ఆయన పిలిచే ముద్దు పేరు! నాకు అలాంటి ఎంగిలి పిలుపులు నచ్చవు.”
“సరే, లల్లీ! నీకు నచ్చక పొతే వద్దు, మరో ఉత్తరం ఉంది చదవనా లేక విరమించుకోనా?”
“చదవండీ! ఇంటరెస్టింగ్’గా ఉంది” అతని నుదుటి మీద చిన్న ముద్దు పెట్టి అడిగింది శ్రీ లలిత. భార్య భర్త నుదుటి మీద అడపా తడపా ముద్దు పెట్టి మురిపెం చేస్తూ ఉంటే, భర్త వశంవదుడు అవుతాడని శాంతిసేన చెప్పింది. సిద్ధార్థని, శాంతి అదే ఫార్ములాతో తన గీటు దాటకుండా చేసుకొందట! తన థియరీని రుజువు చేసుకొనేందుకు ఒక కథ కూడా చెప్పింది. శ్రీ లలితకి ఆ కథ జ్ఞాపకానికి వచ్చింది.
పూర్వం ఒక వైశ్య కన్య ఉండేదట! ఆమెకి పన్నెండేళ్ల వయస్సు వచ్చేసరికి తల్లి చని పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకోన్నాడట! పన్నెండేళ్ల సవతి కూతుర్ని పాతికేళ్ల తన తమ్ముడికి కట్టబెట్టేటందుకు ఆ సవతి తల్లి ఒక పద్ధతి ప్రకారం భర్త నుదుటి మీద ముద్దులు పెట్టి మురిపాలు చేస్తూ, అతనిని తన వశం చేసుకొని తన తమ్మునితో, కూతురి పెళ్ళికి ఒప్పించిందట! అతను సరేనని పెళ్లి ఏర్పాట్లు చేసాడట. పాపం వైశ్య కన్యకి ఆ పెళ్లి ఇష్టం లేదు. తల్లి తండ్రులే అన్యాయం చేస్తూ ఉంటే ఇంక దిక్కెవరు? అని తలపోసి ఆ పిల్ల, సవతి తల్లికి తెలియకుండా కొంచెం గోధుమపిండి, బెల్లంతో రెండు అరిసెలు చేసి, ‘అమ్మవారి కోవెలకి’ వెళ్లి, నైవేద్యం పెట్టి తనని రక్షించమని కోరిందట! అంతే కాదు, తన కోరిక తీరేంత వరకు ఇంటికి వెళ్లనని భీష్మించుకొని అక్కడే కూర్చొందట. అలా కూర్చొని అలసి పోయి కునుకు కూడా తీసిందట. అమ్మవారు ఆమెకి కలలో కనబడి తన కోవెలకి యుక్త వయస్సు లోని ఒక రాకుమారుడు వస్తున్నాడని, అతనికి ఆకలి వేస్తుందని, తినడానికి ఏదైనా వెతుకుతాడని, అప్పుడు నాకు ప్రసాదంగా పెట్టిన అరిసెలు ఇయ్యమని, అతని వాటిని తిని, తనకి క్షుద్భాధ తీర్చినందుకు ఏదైనా కోరిక కోరుకొమ్మంటాడని, కేవలం అతని నుదుటి మీద ముద్దు పెట్టుకో నివ్వమని అడగమందట! అలా ముద్దుకి అనుమతిని ఇవ్వగానే నిశ్శంకో చంగా ముద్దు పెట్టుకోమని చెప్పిందట! నీ సవతి తల్లి కూడా అలా చేసే భర్తని లొంగ తిసుకొందని కూడా తెలియ జేసిందట! వైశ్య కన్య అలాగే చేసి, రాకుమారుని వెంట, పారి పోయి అతనినే పెళ్ళాడిందట!
నుదుట ముద్దు పెట్టాక మొగుడు మాట వినక ఏం చేస్తాడు! చరణ్ మూడో ఉత్తరాన్ని చదవ సాగాడు.
వైభవ్!
ఈ సృష్టిలో మన ముద్దును ఎవరూ ఊహించనంత గాఢంగా పెట్టుకోవాలని అన్నావు, అందుకు మంజీరధరాల సహకారం కావాలన్నావు గుర్తుందా!?
అదెలా అని నేను అడిగితే, ప్రేమ అనేది రెండు మనసుల భాష అనుకొంటే ముద్దు నాలుగు అధరాల లయ అవుత్మ్దని అన్నావు! ముద్దు లోని అనుభూతి చవి చూసేది పెదవులు మాత్రమే అనుకుంటే అది పొరపాటని , ముద్దుతో శరీరంలోని అణువణువూ పులకరించి పోతూ శరీరం లోని కణ కణమూ ఉత్తేజితమవుతూ ఉండే క్షణాలు కళ్ళముందు కదలాడుతుంటేనే మనసెంతగా తుళ్ళి పడుతుందో చూడు అన్నావు, అలా అంటూనే నా అధరాలు అందుకోన్నావు, నీ మాటల లోని మర్మమో లేక ముద్దులోని మహిమో గాని నాకు అంటే నా అరమోడ్పు కనులకు ఆ క్షణాలు ఎంతో మధురాతి మధురంగా తోచాయి. ఆ వేళ కోసం నా పెదవులు పడే విరహ వేదన రాస్తే అదో విరహ కావ్యమే అవుతుందేమో.
గుండె పగిలిపోతుందేమో అన్నంత అలజడిని నాలో కలిగించాయి కదా ఆ రోజు! మన ఇరువురి హృదయాల్లో కొత్త తలపులకి ఇంక ఖాళీ లేదేమో అన్నంతగా నా మనసు నిండి పోయిన వేళ అది! మన ఇద్దరి మనసుల ప్రేమలో నుండి పుట్టిన నాలుగు పెదవుల సంకీర్తనం ముద్దు.
నిజంగా ముద్దులాంటి ఓ చక్కని అనుభూతిని నాకు అందించినందుకు నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే కదూ...
ముద్దు ముద్దుగా నా నుండి ముద్దును దొంగిలించిన ఓ చక్కని అనుభూతి కోసం మాత్రమే కాదు. నీకు నా ప్రేమలోని రసానుభూతిని చూపించాలని విరహ వేదనతో తపించి పోతున్నను వైభవ్! నా కోసం త్వరగా వచ్చేయ్యవూ!
నీ లవ్లీ మంజీర.
ఆ ఉత్తరం చదివాక చరణ్ ఇంకే ఆలోచన చెయ్యకుండా మరే మాట మాట్లాడకుండా గభాలున శ్రీలలిత ఒడి లోంచి లేచి ఆమె అధరాలని అందుకొన్నాడు. శ్రీ లలిత కూడా అదే అనుభూతిని పొందాలనేకోరికతో, అతనిని పెనవేసుకొని తన అధరాలని అతనికి అందించింది. వాళ్ళిద్దరూ ఏ అనుభూతిని పొందారో వారికే తెలియాలి గాని, ఒక మాట మాత్రం నిజం! అక్కడ కాలం స్తంభించింది.
వాళ్లు అలా మధురాతి మధుర క్షణాలలో కాలం మరచి పోయి ఉండగా, రాక్షసిలాగ ‘కాలింగ్ బెల్’ మ్రోగి మూడ్ పాడు చేసింది.
Comments
Post a Comment