ఇంతలో “ ఏయ్,శ్రీ లలితా!” అంటూ ఎవరో పలకరించే సరికి తలెత్తి అటు వైపు చూసింది ఆమె, తన సీటు ప్రక్కనే నిలబడి తన వైపే చూస్తూ పిలిచాడు అతను! శ్రీ లలితకి కొంత సేపటి వరకు మైండ్ బ్లాంక్ అయి అతనెవరో జ్ఞాపకానికి రాలేదు, తరువాత క్విక్’గా రికవరీ అయి,“ సాగర్ బావా! అదేమిటి అలా నిలబడి పోయావు? రా కూర్చో”అంటూ తను మరి కాస్త విండో వైపు జరిగి, అతనికి సీటు ఆఫర్ చేసింది సాగర్ ఆమె ప్రక్కనే కూర్చొన్నాడు.
సాగర్ శ్రీ లలిత 3 వ మేనత్త కొడుకు, జయనగరం లోనే ఉంటున్నాడు. ‘లా’ చదివి, పెద్ద హైకోర్టు క్రిమినల్ లాయరు దగ్గర, జూనియర్’గా పని చేస్తున్నాడు. వాళ్ళ ఊరు కూడా అరటి పాడే! అతను శ్రీలలిత కన్నా కేవలం 3 నెలలే పెద్ద! ఆమెని సాగర్ బావకి ఇచ్చి చేద్దామనే అనుకొన్నారు గాని వయసులో మరీ తక్కువ తేడా ఉండడం వల్ల పినాక పాణి గారు బయట సంబంధం చేసారు ఆమెకి!
“సాగర్ బావా! ఎక్కడకి, అరటి పాడుకేనా?” అడిగింది శ్రీ లలిత.
“అదే ప్రశ్న నిన్ను కూడా అడుగుదామనే అనుకొన్నాను గాని...” అంటూ ఆగాడు సాగర్.
“ఎందుకని అడగ లేదంటే మన ఇద్దరి సమాధానం ఒక్కటే కాబట్టి, అంతేనా బావా!” మాట పూర్తి చేసింది శ్రీ లలిత. ఇద్దరు పకపకా నవ్వుకొన్నారు.
“శ్రీ లలితా! అన్నయ్య గారు నీకు బై బై చెప్తూ ఉండగా చూసాను, కాని పలకరించ లేక పోయాను..”
“ఎందుకంటే అప్పటికే నువ్వు బస్సులో ఉన్నావు కాబట్టి, అంతేనా బావా?”
“చిన్నప్పుడు నా అల్లరి, చిలిపి ప్రశ్నలు నాకే రిపీట్ చేస్తున్నావన్న మాట! అంతేనా శ్రీ లలితా?”
మరోసారి నవ్వుల పువ్వులు పూసాయి.“సాగర్ బావా! అమ్మకి ఒంట్లో బాగు లేదని ‘ఫాక్స్ మెసేజ్’ వచ్చింది, అతను నన్ను బస్సుకి దిగబెట్టి ముఖ్యమైన పని చూసుకొనేందుకు ఉండి పోయారు.”
“అదేమిటి నిన్ననే అత్తయ్యతో మాట్లాడాను, ఆమె బాగానే ఉన్న ట్లు అనిపించింది. ఇంతలో ఏం జరిగింది, నువ్వు మీ అమ్మగారితో మాట్లాడావా?”
“లేదు బావా! మొబైలు ఇంట్లోనే మరచి పోయాను. అందుకే...” అంటూ సాగర్ కేసి చూసి నవ్వింది.
సాగర్ కూడా తమ సంభాషణ తలచుకొని చిరునవ్వు నవ్వాడు. “నా మొబైలుతో మాట్లాడు.”అంటూ దానిని ఇచ్చాడు.
శ్రీ లలిత, సాగర్ మొబైలు తీసుకొని నేరుగా అమ్మ నెంబరుకే డయల్ చేసింది. ఫోనుని మీనాక్షమ్మ గారే ఎత్తారు, “సాగర్! బాగున్నావా బాబూ!”అంటూ.
“ సాగర్ బావ కాదమ్మా మాట్లాతున్నది, నేను నీ లలితని! నువ్వెలా ఉన్నావ్, నీకు ఒంట్లో బాగు లేదని ఈ రోజే ఫాక్స్ మెసేజ్ వచ్చింది...”
“నాకేమీ కాలేదే! నిక్షేపంలాగ ఉన్నాను. నాన్నగారు ఏ మెసేజు పంపించ లేదే! అయినా నువ్వు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు, ఇంటి దగ్గర నుంచేనా?”
“కాదమ్మా, బస్సులో కూర్చొని మాట్లాడుతున్నాను, సాగర్ బావ కూడా అరటి పాడు వస్తున్నాడు, నిన్ను త్వరగా చూసి రమ్మని, మీ అల్లుడు గారు నన్ను బస్సు ఎక్కించి తాను ఉండి పోయారు.”
“అదేమిటే, చోద్యం! బస్సు ఎక్కే ముందే నాకు ఫోను చేసి ఉంటే విషయం తెలిసి ఉండేది కదా, పోన్లే! పుట్టింటికే వస్తున్నావు కదా, నీకు స్వాగతం, అల్లుడు గారు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది!”
“చేసానే తల్లీ! ఫోను కలియ లేదు, ఆదరా బాదర పెరుగెత్తి వస్తున్నాను. ఆ గాభరాలో నా మొబైలు ఫోను ఇంట్లోనే మరచి పోయాను. బస్సులో బావ కనిపించాడు, వాడి మొబైలుతో మాట్లాడుతున్నాను.”
“అలాగా! సాగర్’కి ఏవో పెళ్లి సంబంధాలు చూస్తున్నారే! అందుకే పిలిపించి ఉంటుంది మీ అత్త !”
“అదా సంగతి! సరే నేను బావ, రేపటి కల్లా అరటి పాడు వచ్చేస్తున్నాం, బావకి కాబోయే పెళ్లి కూతుర్ని చూసే ఛాన్స్ దక్కింది. ఇంకేమిటమ్మా విశేషాలు! నాన్నగారు బాగున్నారా?”
“బాగానే ఉన్నారే! ఇక్కడ అంతా బాగున్నారు, మేమంతా పంచారామ యాత్ర గురించి, అల్లుడు గారు చెప్పిన కథల గురించే మాట్లాడు కొంటూ ఉంటామే!
“సరేనమ్మా, ఇప్పుడా కబుర్లన్నీ ఎందుకు, నేను పెట్టేస్తాను.” అంటూ ఫోను ఆఫ్ చేసి సాగర్ చేతికి ఇచ్చింది శ్రీ లలిత.
“అత్తయ్యకి బాగానే ఉందా?” అడిగాడు సాగర్.
“బాగానే ఉంది బావా! కాని ఒక విషయం అర్థం కావడం లేదు, ఫాక్స్ ఎవరు పంపించి ఉంటారు?”
“ఎవరు పంపినా, దాని ఉద్దేశం నిన్ను మీ ఇంటి నుంచి, అన్నయ్య గారి దగ్గర నుండి, దూరం చెయ్యడానికే అయి ఉంటుంది! ”
సాగర్ మాటలు ఆమెలో ఆలోచనలు రేపాయి. ‘బావ నిజమే చెప్తున్నాడు, తనని చరణ్ నుండి దూరం చేయడమే ఈ ‘మెసేజు’ ఉద్దేశం! దాని అవసరం ఒక్క కేశవ్ గుప్తకే ఉంది! మంజీర వచ్చే వేళకి ఆ హవేలీ నుండి, చరణ్ నుండి తనని దూరం చేస్తేనే గాని, చరణ్ ఆమెతో క్లోజుగా మసల లేడు, భర్తగా ఆమెతో నటించాలి కదా మరి! ఇదంతా కలిపి ఆలోచిస్తే , తన కిడ్నాప్, అత్యాచార ప్రయత్నం, సమయానికి ఆపద్భాందవుడులా వచ్చి రక్షించడం, అన్నీ నాటకమే కాబోలు!’ అనుకొంది ఆమె మనసులోనే!
“నిజమే శ్రీ లలితా! అవన్నీ నాటకాలే!” అన్నాడు సాగర్.
శ్రీ లలిత త్రుళ్ళి పడింది. “ఏమన్నావు బావా?” అని అడిగింది.
“నువ్వు అనుకొంటున్నది నిజమే అని అన్నాను”
“నేను ఏమనుకొంటున్నాను! ”
“ఏదో కాన్స్పిరసీ లేదా నాటకం గురించి ఆలోచిస్తున్నావు.” చాలా కామ్’గా జవాబిచ్చాడు సాగర్.
“అది నీకు ఎలా తెలిసింది!”
“ముందు నిజమవునో కాదో చెప్పు, ఎలా తెలిసిందో తరువాత చెప్తాను.”
“నిజమే బావా! కొన్ని అనూహ్య సంఘటనలు నా జీవితంలో స్వల్ప వ్యవధిలోచోటు చేసుకొన్నాయి. వాటి అంతరార్థం ఏమిటో తెలియడం లేదు. ఇంతకీ నా ఆలోచనలు నీకు ఎలా తెలిసాయి.”
“నాకు ‘ టేలిపతి’ వచ్చు.”
“ఏం వచ్చు?”
“టేలిపతివచ్చు.”
“అంటే?”
“అది మనసులో ఆలోచనలు తెలుసుకో గల శాస్త్రం!”
“అలాంటి శాస్త్రాలు కూడా ఉన్నాయా?”
“ఉన్నాయి, వీటినే ‘ఎక్సట్రా సెన్సువరీ పెర్సే ప్షన్ ’ శాస్త్రాలు అంటారు.”
“అలాగా! అవేమిటో వివరంగా చెప్పు బావా!”
“చెప్తాను, ముందు నీ సమస్య ఏమిటో చెప్పు.”
శ్రీ లలిత ఆలోచనలో పడింది, ‘చెప్పాలా వద్దా’ అని, చెప్పక పోయినా బావ తెలుసుకొంటాడు, అందుకే చెప్పేస్తాను’ అనుకొంది.
“అందుకే చెప్పెసేయి.” అన్నాడు సాగర్.
శ్రీ లలిత ఆశ్చర్యంతో కళ్లు విప్పార్చి చూసింది. “చెప్తాను ముందస్తుగా నువ్వు ఈ శాస్త్రాలు ఎక్కడ నేర్చావో చెప్పు”
“సరే! చెప్తాను, ‘మన జ్ఞానేంద్రియాలకి ఉన్న చూచుట, వినుట, ఆఘ్రానించుట, స్ప్రుశించుట, చివరగా ఆలోచనలని తెలుసుకొనుట మొదలైన శక్తులను, పరిమితులని దాటి అదనంగా పెంచుకొని, తద్వారా దూర దృష్టి, దూర శ్రవణము, దూర ఆఘ్రాణ శక్తి, దూర స్పర్శ శక్తి, ఇంకా టేలిపతీ లాంటి జ్ఞానాలను పొందడమే, ‘ఎక్సట్రా సెన్సువరీ పేర్సేప్షన్స్’అని అంటారు. నేను ఈ శక్తులని ‘సత్యార్థి అరవింద సహస్ర బుద్ది’ అనే ఒక మరాఠీ మేధావి దగ్గర ముంబయిలో నేర్చుకొన్నాను. ఎంత వరకు నేర్చుకొన్నాను, ఎన్ని సాధించాను లాంటి ప్రశ్నలు అడగకు, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. నీ సమస్య ఏమిటో చెప్పు, నేను నా శాయ శక్తులా దానిని తీర్చేందుకు ప్రయత్నిస్తాను.”
శ్రీ లలిత ఆశక్తితో సాగర్ బావ మాటలు వింది. ‘ఈ సాగర్ బావ ఎంత వాడయ్యాడు!’ అనుకొంటూ.
“సాగర్ బావ ఎంత వాడయ్యాడో నీకెందుకు శ్రీ లలితా?నిన్ను బాధిస్తున్నసమస్య ఏమిటి? కిడ్నాప్, అత్యాచారమనే నాటకాలు నీ పట్ల ఎప్పుడు జరిగాయి, వాటి గురించి అన్నయ్యగారికి తెలుసా?”
“అయ్యో బావా, అతనే నా సమస్య!” అంటూ శ్రీ లలిత పూస గ్రుచ్చినట్లు, ఆ రోజు ట్రైన్ ఎక్కినప్పటి నుండి ఇంత వరకు జరిగిన ఘటనలు అన్నీ చెప్పింది.
సాగర్ అన్నీ శ్రద్ధగా విన్నాడు. ‘శ్రీ లలిత, చరణ్’ని గ్రుడ్డిగా నమ్మింది! జరిగిన వాటిలో చరణ్’కి తెలియకుండా ఏది జరిగి ఉండదు!’ అని అభిప్ర్రాయ పడ్డాడు. ‘తన అనుమానాన్ని బయట పెట్టినా భర్తని శంకించడం, అన్నది ఆమె కలలో కూడా చెయ్యలేదు. దానిని ఆమె అనుభవ పూర్వకంగా తెలుసుకొనే వరకు చరణ్ గురించి నెగిటివ్’గా చెప్ప కూడదు’ అని భావించాడు.
“శ్రీ లలితా! నువ్వు చెప్పిన దంతా విన్న తరువాత చరణ్ నీకు దూరం కావడం త్వరలోనే జరుగనుంది అని అనుమానించ వలసి వస్తోంది.”
శ్రీ లలితకి అప్పటి వరకు ఆపుకొన్న కన్నీరు మున్నీరుగా మారింది. కొంత సేపటికి ఆమె తేరుకొని ముఖం తుడుచుకొంది. తన బాధని పంచుకొనేందుకు ఒక ఆత్మీయుడు దొరకడం ఆమెకి కాస్త రిలీఫ్ ఇచ్చింది.
**********************
Comments
Post a Comment