అరటి పాడు వెళ్ళిన తరువాత శ్రీ లలిత, తల్లి తండ్రులని చూసిన ఆనందంలో తన సమస్యని తాత్కా లికంగా మరచి పోయింది. పినాక పాణి, మహాలక్ష్మమ్మల దృష్టిలో శ్రీ లలిత, సూర్య చరణ్ లాంటి భర్తని పొందిన అదృష్టవంతు రాలు! ఎందుకంటే అల్లుడు గారు అద్వితీయులు! అతనికి సాటి ఎవరూ లేరు!’ అలాంటి అభిప్రాయం ఉన్న వారికి ‘తన భర్త అంగీకరించిన పని నచ్చక పోవచ్చు! అయిన అతనా పని ఒప్పుకోవడానికి తన బాధ్యత కూడా ఉంది కదా, అలాంటప్పుడు ఎలా చెప్తుంది?’ అందుకే ఆమెచెప్ప లేదు, సాగర్ బావని కూడా చెప్పవద్దని అంది.
సాగర్ విషయం పూర్తిగా తెలిసేంత వరకూ, పాజిటివ్ గానే ఆలోచించమని చెప్పాడు. బహుశా చరణ్ అమాయకుడు కావచ్చు! శ్రీ లలితని వంచించి నట్లే అతనిని కూడా తమ నాటకానికి పావుగా వాడుకొం టున్నారేమో, కేశవ్ గుప్త లాంటి స్వార్థ పరులు! అందు వల్ల చరణ్’కి కొంత సమయం ఇవ్వడమే మంచిది . ఎలాగూ శ్రీ లలిత పుట్టింటికి వచ్చింది కాబట్టి, కొన్ని రోజులు అక్కడే ఉండి తరువాత ఇంటికి వెళ్ళడమే సరి అయిన నిర్ణయం అవుతుంది. ఈ లోగా చరణ్ తన పని పూర్తి చేసుకొని వచ్చినా రావచ్చు కదా! అని అన్నాడు.
వారికి అర్థం కానిదల్లా చరణ్ మొబైలులో మాట్లాడడం మానేసాడెందుకు, అనేదే! అతని మొబైలు నెంబరు అస్థిత్వంలో లేదని చెప్తున్నారు మొబైలు ఆపరేటర్లు! అదెలా జరుగుతుంది, మొబైలు లోంచి సిమ్ముని తీసేస్తే అలా జరిగే అవకాశం ఉంది!
“బహుశా చరణ్ మొబైల్ని ఎవరైనా దొంగలించారేమో!” అంది శ్రీ లలిత. చివరికి ఆమె కొన్ని రోజులు వేచి చూడడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది.
ఆ తరువాత చరణ్ గురించి ఆమె ఇంకెవ్వరి తోనూ మాట్లాడ లేదు, సాగర్’తో కూడా!
సాగర్ నిజంగానే పెళ్లి చూపులకి వచ్చాడు, తనకి ఆడ పిల్లలు ఎవరూ లేని కారణంగా, శ్రీ లలితని ఆడపడు చుగా పెళ్లి చూపులకి రమ్మని బలవంతం చేసింది ఆమె చిన్నత్తయ్య! తల్లి తండ్రులు దానినిసమర్థించారు. ఫలితంగా వారితో పాటు ‘పాలకొల్లు’ బయలు దేరింది శ్రీ లలిత.
పాలకొల్లులో పెళ్లి కూతురు తల్లి తండ్రులు మంచి పొజిషన్’లో ఉన్న భూస్వాములు! ఆస్తి పాస్తులకి కొదవు లేదు. వచ్చిన వారిని ఎంతో మర్యాదగా రాబట్టుకొన్నారు. కాఫీ టిఫిన్లు అయ్యాక పెళ్లి కూతుర్నితీసుకొని వచ్చారు. అ అమ్మాయి పేరు సువర్ణ.
సువర్ణ పేరుకి తగినట్లే బాగుంది, ఎకనామిక్సులో డిగ్రీ చేసింది. తండ్రి బిజినెస్సులో ఆమెదే, నిర్ణయాధికారమని కొద్ది సేపట్లోనే అందరికీ తెలిసి పోయింది. పెళ్లి కొడుకు లాయరు కావడం సువర్ణకు నచ్చని అంశం.
లాయర్ల ఆదాయం ఎంత అని ప్రశ్నించింది. ఆమె! గంటకి ఇంత అని బిల్ చేస్తారా, లేక మొత్తాన్ని ఒకేసారి కాంట్రాక్టు చేస్తారా అని అడిగింది.
సాగర్ దానికి, “నేను ప్రస్తుతం జూనియర్ లాయర్ని! నా సీనియర్ గంటకి ఇంత అని బిల్ చేస్తారు, ఆ ఎమౌంటులో 60 శాతం, అతను తీసుకొంటాడు, 40 శాతం మాకు, అంటే నాతో పాటు అతని క్రింద పని చేసే తక్కిన జూనియర్ లాయర్లకి లభిస్తుంది” అని బదులు ఇచ్చాడు.
“మీరే స్వతంత్రంగా పని చేయ వచ్చు కదా?”
“పని చేయ వచ్చు. కాని దానికి చాల సమయం, మంచి ‘గుడ్ విల్’ కావాలి.”
“ఎంత సమయం పడుతుంది?”
“చెప్పలేను” అన్నాడు సాగర్. దానితో ఆమె ప్రశ్నలకి సమాధానం లభించింది. ఆమె డబ్బుకి కొదవ లేకుండా పెరిగింది. పైగా అందంగా ఉంటుంది! ‘బిజినెస్సు, రాజకీయాలు, సినిమా, లేదా బూరోక్రాట్స్’ ఈ మూడు వర్గాల లోని వారే ధన సంచయం చేయ గలరని, తన అభిప్రాయం తెలిపింది. దానితో అందరికీ రిజల్టు తెలిసి పోయింది! అమ్మాయి తరఫు నుండి సాగర్ రిజక్టు అయ్యాడు!
అరటి పాడుకి తిరిగి వచ్చిన మర్నాడే సాగర్ ప్రయాణం కట్టాడు, తనతో పాటు శ్రీ లలిత కూడా వస్తుందని చెప్పాడు. అదే విధంగా ఆమె తల్లి తండ్రులు పెట్టిన ‘సారెని’ తీసుకొని సాగర్’తో పాటు బయలు దేరింది.
జయనగరంలో సాగర్, శ్రీ లలిత ఇంటికే వచ్చాడు. ఇద్దరూ కాల కృత్యాలు తీర్చుకొని, చరణ్’ని కలసేం దుకు కేశవ్ గుప్త హవేలీకి వెళ్లారు!
ఆశ్చర్యం! ఆ హవేలీ వైభవ్ విల్లా కాదు! అలా వ్రాసి ఉన్న పాలరాతి పలక అక్కడ లేదు! తోటమాలి, రంగమ్మ, తదితర పని వాళ్ళు ఎవరూ కనబడ లేదు.
అది అద్దెకి దొరికే హవేలీ అని,సినిమా షూటింగులకి, పోష్ వెడ్డింగ్’లకి ‘రెంట్’ తీసుకొని ఉపయోగించుకో నిచ్చే భవనమని తెలిసింది!
అక్కడ నుంచి, వాళ్లు కె.జీ.వి మ్యూజిక్ & మిరకేల్స్ స్టూడియోకి వెళ్లారు. అది కూడా అక్కడ లేదు. దాని స్థానంలో ఇంకొక ఆఫీసు ఉంది. స్టూడియో ఖాళీ అయి పోయిందని చెప్పారు వాళ్లు!
ఇక మిగిలింది ఒకే ఒక ఆశ! అదే సూర్య చరణ్ పని చేస్తున్న ‘సాప్ట్ వేర్’ కంపెనీ! అక్కడ కూడా వారికి చుక్క ఎదుర యింది! సూర్య చరణ్ గారు 6 నెలల సెలవు మీద వెళ్ళారని, అతని స్థానంలో ఇంకొక మేనేజరు ఉన్నారని తెలిసింది.
ఆ విషయం తెల్సినదే గనుక శ్రీ లలితకి విస్మయం కలగ లేదు! కేశవ్ గుప్త మోసంతో అతనిని కిడ్నాప్ చేసి ఉంటాడని, శ్రీ లలిత నమ్మింది!
సూర్య చరణ్ మోసం చేసాడని, సాగర్ అభిప్రాయ పడ్డాడు! అయినా ఆ విషయం మీద పూర్తి సాక్ష్యాధారాలు లభించే వరకు శ్రీ లలిత నమ్మదని అతనికి తెలుసు! మొత్తం మీద వాళ్ళు సూర్య చరణ్’ని ఏ విధంగానూ, కాంటాక్ట్ చేయ లేక తిరిగి ఇంటికి వచ్చారు!
శ్రీ లలిత వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెకి సూర్య చరణ్ మోసగాడు అని ఇంకా అనుమానం కలుగ లేదు! కేశవ్ గుప్త తన చెల్లెలు కోసం అతనిని ఎత్తుకొని పోయాడని నమ్మింది.
సాగర్ చరణ్ మోసాన్ని గుర్తించాడు, కాని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణం (మోటివ్) అర్థం కాలేదు. మరి కొంత పరిశోధన చేస్తేనే గాని నిజాలు బయట పడవని తలచాడు. శ్రీ లలితని ఓదార్చి, ఆ సాయంత్రమే అరటి పాడుకి కబురు పెట్టాడు.
*****************
Comments
Post a Comment