Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా! --12 (చిలక రథంలో సరదా షికారు-- పార్టు 2 )


పినాక పాణి , మీనాక్షమ్మ ఆ మరుచటి రోజే అక్కడకి వచ్చారు. వాళ్ళెవరూ  సూర్య చరణ్’ని తప్పు పట్ట లేదు. సాగర్ ప్రోత్సాహంతో, కేశవ్ గుప్త మీద, సూర్య చరణ్ అపహరణ నేరాన్ని మోపుతూ పోలీసులకి ఫిర్యాదు చేసారు.

అది ‘హై ప్రొఫైల్’ వ్యక్తులు చేసిన నేరమని, పోలీసులు ఏక్టివ్’గా పరిశోధన చేయరని సాగర్’కి తెలుసు! ఒక క్రిమినల్  లాయరుగా అతనికి కొంత మంది పోలీసు ఇనస్పెక్తర్ల తోనూ, మరికొంత మంది ప్రైవేటుడిటెక్టివ్’ల తోనూ పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలని పురస్కరించుకొని అతను సూర్య చరణ్ కేసుని తనంత తనే పరిశోధన చేయడానికి నడుం కట్టాడు.  

ముందుగా సూర్య చరణ్ తల్లి తండ్రుల వివరాలు సేకరించడానికి అతను పినాక పాణి గారిని ప్రశ్నించాడు. “మామయ్యా! సూర్య చరణ్’ పేరెంట్స్ గురించి మీకు ఏవైనా వివరాలు తెలిస్తే చెప్పండి. అతను కనబడని విషయం వాళ్లకి కూడా చెప్పాలి కదా!” అని.

“ఏం చెప్పమంటావురా! సూర్య చరణ్ తల్లి తండ్రులు విమాన ప్రమాదంలో చని పోయారట!”
“అతనికి అన్నా చెల్లెళ్ళు ఎవరూ లేరా?”

“ఒకే ఒక్క ట్విన్ సోదరుడు ఉన్నట్లు చెప్పాడురా, అతను కూడా ఆ విమాన దుర్ఘటన లోనే పోయాడట ఏ బాదర బందీ లేని సంబంధం అని అప్పట్లో సరదా పడ్డామురా సాగర్! ఇప్పుడు ఎంత పొరపాటు చేసామో తెలుస్తోంది.”

“ విమాన దుర్ఘటన ఎప్పుడూ జరిగిందో తెలుసా మామయ్యా?”

“తెలియదురా! వాళ్లు బెంగుళూరులో ఉండే వారనీ, బెంగుళూరు నుండి అట్లాంటా వెళ్ళడానికి విమానం ఎక్కారని అది టెక్ ఓవర్ అయిన కొన్ని క్షణాల లోనే క్రిందకి  కూలిందనీ చెప్పాడురా!”

“ఆ ఎక్సిడెంటు ఎప్పుడూ జరిగిందో అంటే ఆ తెదీ ఏమిటో తెలుసా మామయ్యా?”

“తెలియదు, శ్రీ లలిత పెళ్ళి స్వస్తి శ్రీ చంద్ర మాన సర్వధారి నామ సంవత్సర వైశాఖ శుక్ల తదియ మృగశిరా నక్షత్ర యుత గురువారం నాడు (అదే రోజు అక్షయ తృతీయ కూడా పడింది) జరిగింది. తేదీ 08.05.2008,ఆ పెళ్ళికి మగ పెళ్లి వారి తరఫున అతని కజిన్ అయిన మహేశ్వరి, ఆమె భర్త శంకర రావు గార్లు వచ్చారు.వాళ్ళే అతనికి అక్కా బావల స్థానంలో నిలిచి ఒప్పలు  అందుకొన్నారు!”

“వాళ్ళ అడ్రెస్సు తెలుసా మామయ్యా, ఎందుకంటే విమాన ప్రమాదం ఎప్పుడు జరిగిందో వాళ్లకి తెలిసి ఉండవచ్చు కదా?”

“అవును, వాళ్లకి మొదటి శుభ లేఖ పంపడానికి చిరునామా నోట్ చేసి ఉంచాను, అది నా డైరీలో ఉంది, ఉండు తెస్తాను” అంటూ పినాక పాణి తన సూటుకేసు నుండి డైరీ తీసి, సాగర్’కి చూపించాడు. అది జయ నగరం అడ్రేస్సే కావడంతో సాగర్ దానిని నోట్ చేసుకొన్నాడు.

వెంటనే ఆ చిరునామా ప్రకారం  కొత్త పేట లోని కల్పలత ఎపార్ట్’మెంటుకి వెళ్లి మహేశ్వరీ, శంకర రావులని కలసాడు సాగర్. వాళ్ళు జరిగినది తెలుసుకొని చాలా విచారించారు. శ్రీ లలితకి తోడుగా ఉంటామని ప్రామిస్ చేసారు. సూర్య చరణ్ వాళ్ళ చిన్నన్న గారి అబ్బాయట! అతను ‘వైభవ్ చరణ్’ కవలలు! విమాన ప్రమాదం పెళ్ళికి ఏడాది ముందు తెదీ 25.01.2007  నాడు, బెంగళూరు విమానా శ్రయంలో  జరిగింది. ఆ కుటుంబంతో వాళ్లకి ఎలాంటి సంబంధాలుండేవి కావు! సూర్యచరణ్  రిక్వెస్టు వల్ల, కేవలం పెళ్లి పెద్దలుగా నిలబడెందుకు అంగీకరించి వాళ్ళు ఆ పెళ్ళికి వచ్చారు!” అదీ వాళ్ల ద్వారా దొరికిన సమాచారం!

సూర్య చరణ్’కి ఒక ‘ట్విన్’సోదరుడు ఉండడం అతని పేరు వైభవ్ చరణ్ కావడం, కేశవ్ గుప్తా చెప్పిన మంజీర కథకి బలం చేకూర్చాయి. విమాన ప్రమాదంలో చని పోయినది ఎవరెవరో తెలిస్తే కొంత వరకు ఈ మిస్టరీ విడుతుంది అని ఆలోచించిన సాగర్ ఒక ప్రైవేటు డిటెక్టివ్’ని ఆశ్రయించాడు.

ఆ డిటెక్టివ్ పేరు ‘వనమాలి’ అతను డిఫెన్సులో మేజర్’గా పని చేసి రిటైరు అయిన వ్యక్తి, సరదా కోసం ఈ వృత్తిని చేపట్టిన  కారణంగా ఎక్కువ ఫీజు తీసుకోడు. సాగర్ జూనియర్’గా పని చేసే హైకోర్టు లాయరుకి అతను ఎన్నో కేసులకి సంబంధించి వివరాలు పరిశోధించి తెలియ జేశాడు. విషయాన్ని విన్నవెంటనే వనమాలి, రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదాన్ని గురించి వివరాలు రాబట్టడానికి బయలు దేరాడు.అతను బెంగుళూరు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండడం వల్ల ఆ పనికి అతను ప్రత్యేకంగా చార్జి చెయ్యనని  అన్నాడు!

సాగర్ చెప్పిన విషయాలు విన్న తరువాత పినాక పాణి ,మీనాక్షమ్మ, శ్రీ లలితలు, కేశవ్ గుప్తనే తప్పు పట్టారు. విమాన ప్రమాదంలో వైభవ్ చరణ్ చనిపోయి ఉంటాడని, అతని స్థానంలో సూర్య చరణ్’ని నిలబెట్టడానికే అపహరణ జరిగిందని అభిప్రాయ పడ్డారు. అయితే, వైభవ్ పేరు మీద ‘నార్కోటిక్ కేసు, జైలు శిక్ష’ విషయం ఏమిటి అని ప్రశ్నించిన సాగర్’కి  సంతృప్తికరమైన జవాబు లభించ లేదు! ఆ కేసు ఎప్పుడు నడిచింది, వైభవ్’ని ఏ జైలులో పెట్టారు అనే వివరాలు రాబట్టితే గాని కొన్ని సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి! అందుకని సాగర్ తన పోలీసు మిత్రులని ఆశ్రయించాడు.

మర్నాడే రెండు మహత్వపూర్ణమైన, సందేశాలు అందాయి. మొదటిది బెంగుళూరు నుండి డిటెక్టివ్ వనమాలి దగ్గర నుండి, తెదీ 25.01.2007 నాడు జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయినది, ‘బెంగుళూరు నుండి అట్లాంటా’ వెళ్తున్న ‘సూర్య నారాయణ, వైభవ లక్ష్మీ’ అనే దంపతులు, ఇంకా వారి అబ్బాయి ‘సూర్య చరణ్’ అనే పేరు గల వాడు అని !! తాను రికార్డు స్వయంగా చెక్ చేసానని, వాటిలో ‘సూర్య చరణ్’ పేరు మాత్రమే నమోదు అయిందని, అందులో ఎలాంటి సందేహం లేదని, డిటెక్టివ్ వనమాలి కన్’ఫర్మ్’గా చెప్పాడు. ఇక రెండవది పోలీసు మిత్రుని దగ్గర నుంచి, వైభవ్ చరణ్ పైన ‘నార్లోటిక్ డ్రగ్స్ ట్రాఫికింగ్’  కేసు 19.06.2004 నుండి, 31.07.2005 వరకు నడిచిందనీ, 7 ఏళ్ల జైలు శిక్ష తేదీ  03.08.2005 నాడు పడిందని !

ఒకదాని తరువాత వచ్చిన ఈ రెండు వర్తమానాలు, చనిపోయినది ‘సూర్య చరణ్’ అనీ, కేసు నడిచి  శిక్ష పడినది, ‘వైభవ్ చరణ్’ మీద అనీ తెలియ జేసాయి!

సూర్య చరణ్  తెదీ 25.01.2007 నాడు చనిపోతే, తేదీ 08.05.2008 అక్షయ తృతీయ నాడు శ్రీలలితని పెళ్లి చేసుకొన్నది ఎవరు? ఒక వేళ వైభవ్ చరణ్, మారు పేరుతో అలా చేసాడని అనుకొంటే, 03.08.2005 నుండి 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న వైభవ్ ఆ తేదీ నాడు పెళ్ళికి ఎలా హాజరు కాగలిగాడు!! ఈ చిక్కు ప్రశ్నలు అందరినీ విస్మయంలో ముంచి చేష్టలు ఉడిగేలా చేసాయి.

అప్పుడు శ్రీ లలితకి, తనకీ సూర్య చరణ్’కీ మధ్య నడిచిన ఒకనాటి సంభాషణ జ్ఞాపకం వచ్చింది.దానిని ఆమె పూస గ్రుచ్చినట్లుగా అందరికీ వివరించి చెప్పింది. అదేమిటంటే----

“చరణ్! వైభవ్ జైలులో ఉన్నాడని మంజీరకి చెప్పక పోవడం తప్పు కదా, ఆ విషయం తెలిసి ఉంటే ఆమెకి ఇంత మనోవ్యధ ఉండేది కాదేమో!”

“అలా అని ఎలా చెప్పగలవ్,లల్లీ?”

“ఎక్కడ ఉన్నాడో తెలుస్తే, చూడడానికని వెళ్లి వచ్చేది, అదే విధంగా శిక్ష ఎంత కాలం పడిందో తెలుస్తే,  ఎప్పుడు తిరిగి రాబోయేది తెలిసేది, అంతు లేని నిరీక్షణ కన్నా అది మంచిది కదా?” 

“నువ్వు చెప్పేది నిజమే! వైభవ్ ‘డ్రగ్ ట్రాఫికింగ్’ నేరం మీద,‘నార్కోటిక్ స్క్వాడ్’కి పట్టుబడి ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించేందుకు జైలుకి వెళ్లాడు. కాని రెండేళ్లకే ఏం జరిగిందో తెలుసా, అతనిని మరో  జైలుకి తరలించేందుకు తీసుకొని వెళ్తూ ఉండగా, జైలు వేన్ దుర్ఘటనకి గురయి, వైభవ్ చని పోయాడు. ఈ విషయాన్ని కేశవ్ గుప్త , మంజీరకి ఎలా చెప్పగలడు ?”

“మీకు ఈ విషయం ఎలా తెలిసింది?”

“వైభవ్ గ్రూప్ ఆఫ్ కంపెనిస్’ చిన్నదేమీ కాదు, పైపెచ్చు అతని సాఫ్ట్ వేర్ కంపెనీకే నేను మేనేజర్ని!”

“అంటే ట్రైన్లో కలియడానికి ముందే, మీకు ఆ అన్నాచెల్లెళ్లు తెలుసా?!” శ్రీ లలిత కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది.

“అన్నగారు తెలుసు, చెల్లెలు గారు మతి పోగొట్టుకొన్నారన్న విషయం తెలియదు.”

“దాని అర్థం చెల్లెలు గారు కూడా తెలుసును అని అనుకోవచ్చా?”

అదీ మా మధ్య నడిచిన సంభాషణ అంది శ్రీ లలిత.

   
శ్రీ లలిత చెప్పిన మాటలు విన్నాక సూర్య చరణ్ మీద వారందరికీ ఉన్న అభిమానం, దూది పింజలాగ ఎగిరి పోయింది! మోసగాడు వైభవ్ చరణ్ అని, కేశవ్ గుప్త కాదని స్పష్టం అయింది!

“ఇన్ని వివరాలు తెలిసినా, ఇంకా ఒక విషయం అయోమయంగానే ఉండి  పోయింది!” అన్నాడు పినాక పాణి. “వైభవ్ చరణ్, సూర్య చరణ్ అనే పేరుతో శ్రీ లలితని పెళ్లి ఎందుకు చేసుకొన్నట్లు? తన భార్య మంజీరతో హాయిగా కాలం గడప వచ్చుకదా?”అని తన సందేహాన్నిబయట పెట్టాడు.

సాగర్’ లాయర్ కాబట్టి ఆ ప్రశ్నకి జవాబు చెప్పాడు. “వైభవ్ చని పోయాడని పోలీసు రికార్డుల లోకి ఎక్కినా, అతను తన పేరుతో ధైర్యంగా జీవితం గడప లేడు! ఎందుకంటే ఎప్పటికైనా పట్టుబడి పోతాడు కాబట్టి !! పట్టుబడితే శిక్ష ఇంకా ఎక్కువగా పడుతుంది కాబట్టి! అందు వల్ల అతను తన కవల సోదరుడైన సూర్య చరణ్ పేరుని వాడుకొన్నాడు. ఇద్దరి రూపాలు ఒక లాగే ఉన్నందు వల్ల, ఇద్దరి తల్లి తండ్రులు ఒకరే అయినందు వల్ల, వారిద్దరూ  ఒకే కాలేజిలో చదువు కొన్నందు వల్ల, అతనికి అలాచేసే అవసరం, అవకాశం దొరికాయి! ఇక మంజీరని తెచ్చి, తనతో ఉంచుకొంటే, తన ‘ఫాల్స్ ఐ.డి’, తన రహస్య జీవితం బయట పడుతాయి. అలాకాకుండా ఉండాలంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంసార జీవితం గడపాలి!! అందుకే సూర్య చరణ్’గా తన కంపెనీలోనే మేనేజరుగా జాయన్ అయి, పెళ్లి  కొడుకుగా తయారయి మన అరటి పాడుకు, అక్షయ తృతీయ నాడు వచ్చి శ్రీ లలిత మెడలో మూడు ముళ్లు వేసాడు. అయితే మంజీరని అతను, అతనిని మంజీర మరచి పోలేక పోయారు. ఆమెని కలసు కోవడానికి ఈ నాటకం ఆడ వలసి వచ్చింది. చివరికి అతను శ్రీ లలిత అడ్డుని తొలగించుకొని  బహుశా విదేశాలకి పారి పోయాడు!!”  

“సాగర్! ఇప్పుడు మనం ఏం చేయాలి?” మీనాక్షమ్మ అడిగింది.

“అత్తయ్యా! ముందుగా మనం తెలుసుకొన్న విషయాలు పోలీసులకి తెలియ జేసి, వైభవ్ చరణ్ పైన చీటింగ్, మోసం,లాంటి నేరాల మీద ఎఫ్.ఐ.ఆర్. రిజిష్టర్ చేయించాలి. ఆ ఎఫ్.ఐ.ఆర్. కాపీని కోర్టులో చూపించి మోసంతో చేసుకొన్న పెళ్లి, ‘పెళ్లి కాదు’ కాబట్టి, శ్రీ లలిత పెళ్లిని రద్దు చేయమని అపీల్ చేయాలి.”

“ అందు వల్ల మనకి ఏమి ఒరుగుతుంది బాబూ!”

“ఈ విషయంలో లాభా లాభాల ప్రసక్తి లేదు అత్తయ్యా! వైభవ్ చరణ్ తాను  చేసిన మోసానికి గాను మళ్లీ శిక్ష అనుభవించాలి! శ్రీ లలిత పెళ్లి రద్దు అయ్యాక మరొక మంచి వరుణ్ణి చూసి ఆమెకి పెళ్లి చేసి,ఆమె బ్రతుకు బాగు చెయ్యాలి.” ఆవేశంతో అన్నాడు సాగర్. అతని మాటలలో శ్రీ లలిత పట్ల  జరిగిన అన్యా యానికి కోపం, ప్రతీకారం చోటు చేసుకొన్నాయి.

సాగర్ మాటలు ఆ వృద్ధ దంపతులకి మ్రింగుడు పడ లేదు! వాళ్ళు శ్రీ లలిత వంక చూసారు. శ్రీ లలిత రాతి బొమ్మ లాగ నిశ్చలంగా, మౌనంగా ఉండి పోయింది. సాగర్ దృష్టి కూడా ఆమె మీద పడింది, ఆ రాతి బొమ్మను తిరిగి సజీవ మూర్తిగా మార్చడానికి ఎంత సమయమైనా వేచి, ఎంత ప్రయత్నమైనా, ఎంత త్యాగమైనా చేసి, ఎంత ధనమైనా వెచ్చించడానికి అతను ఆ క్షణానే నిశ్చయించు కొన్నాడు.

శ్రీ లలితకి కళ్లు తిరిగినట్లయింది, ఆమె ఉన్నట్లుండి నేల మీద కుప్పలా కూలి పోయింది! సాగర్, పినాక పాణి దంపతులు ఆమె దగ్గరకి వచ్చి,“ఏమమ్మా, లలితా! నీకేం జరిగింది?” అని అడగ సాగారు, సాగర్ ఒక గ్లాసులో మంచి నీళ్ళు తెచ్చి ఆమె ముఖం మీద, చిలకరించాడు.

శ్రీ లలిత కళ్లు తెరచింది. “అమ్మా! ఒంట్లో నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఆహారం సయించడం లేదు."అంది.

సాగర్ అప్పటికే ఒక లేడీ డాక్టర్’కి ఫోను చేసి, పిలిచాడు.

డాక్టర్ వచ్చే లోపల ఆమెని మంచం మీద పడుకో బెట్టి, ఫేన్ వేసారు. మీనాక్షమ్మ వంటింటిలోకి వెళ్లి గ్లూకోజ్ నీళ్ళు కలిపి తేవడానికి వెళ్ళింది. ఆమెకి మనసులో ఏదో అనుమానం లీలగా మెదలింది. దాక్తరమ్మ వచ్చి, శ్రీ లలితని పరీక్ష చేసి, మీనాక్షమ్మ అనుమానాన్ని నిజం చేసింది. “ అమ్మగారూ! శుభ వార్త! మీఅమ్మాయి తల్లి కాబోతోంది!” అని.

సమయం ఎన్ని మార్పులు చేయగలదో ఎవరికెరుక! అదే వార్త వారం రోజుల క్రిందట అయితే, ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు పూయించేది! ఈ క్షణాన అది శుభ వార్తలాగ అనిపించ లేదు! వాళ్ళలో ఎవరి ముఖాల లోను సంతోష చాయలు లేవు! కాల సర్పం కాటు వేసినట్లు అనిపించింది పినాక పాణి గారికి! తన గారాల కూతురు ఏం పాపం చేసింది? ఆమెకి ఇన్ని కష్టాలు దేనికి? అసలు ఆమె ఈ తుఫానుని తట్టుకొని నిలబడ గలదా! వరుని కుటుంబం గురించి ఏ వివరాలు పూర్తిగా తెలుసుకో కుండా తొందరపాటుతో, తనే ఆమె పెళ్లి చేసి పొరపాటు చేసాడా?”

మీనాక్షమ్మ మనసులో కూడా అవే ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘తను ఏదయితే కాకూడదని అనుకొందో, అదే జరిగి పోయింది! భగవంతుడా! తన కూతురు ఇంత లేత వయసు నుండే భర్త చేత త్యజింప బడి, పరిత్యక్తలా, పరివ్రాజిక  బ్రతుకు గడప వలసినదేనా? ఈ సంతానం ఆమెకి ప్రతిబంధకం అవుతుందేమో! ఏమయినా తాను శ్రీ లలితని వదలి పెట్టదు, తన తోనే ఉంచుకొంటుంది!’

సాగర్ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి.‘ ఇది మంచికే జరిగింది! శ్రీ లలిత పోరాటానికి ఒక క్రొత్త ఆయుధం దొరికింది! పుట్ట బోయే సంతానం డి.ఎన్.ఎ. వైభవ్ చేసిన అన్యాయాన్ని బహిర్గతం చేయ గలదు, అతని వైభవానికి చిల్లులు పొడవ గలదు’ అనుకొన్నాడు.

శ్రీ లలిత భావ శూన్య అయింది. ఆమె నెత్తిన పిడుగు పడినట్లు అయింది. ‘తొలి సారి తల్లి అవుతున్న సందర్భంలో సంతోషించాలో, విచారించాలో అర్థం కాలేదు ఆమెకి! ఈ సంతానమే గాని అడ్డురాకుండా ఉంటే ఆత్మహత్య చేసుకొని ఉండేదేమో!’    

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద