Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా!---13 (చిలక రథంలో సరదా షికారు --పార్టు 2 )


ఇంతలో ఒక ‘కొరియర్ బాయ్’ వచ్చి, “శ్రీ లలిత గారికి ఒక కవరు ఉంది!” అన్నాడు.

సాగర్ దాన్ని అందుకొన్నాడు. కొరియర్ అతని సంతకం తీసుకొని వెళ్లి పోయాడు.ఆ కవరుని శ్రీలలితకి ఇచ్చాడు అతను. “నువ్వే చదువు బావా!” అని ఆమె అనగానే, సాగర్ కవరు విప్పాడు, లోపల ఇంకొక కవరు ఉంది. ఆ లోపలి కవరు మీద ‘పర్సనల్ & కాంఫిడేన్షియల్’ అని ఉంది. దానిని శ్రీ లలితకే ఇచ్చి “ఇది పర్సనల్ అట! నువ్వే చూడు” అని అన్నాడు.

శ్రీ లలిత లోపలి కవరుని విప్పింది. అందులో ఒక ఉత్తరం ఉంది! దానిని చరణ్ వ్రాసాడు! ఆమె ఉత్సుకతతో దానిని చూసింది.

“ఎక్కడ నుంచి వచ్చిందే, ఉత్తరం? ” అడిగింది మీనాక్షమ్మ.

“ఆయన వ్రాసారమ్మా!”

“అలాగా! చదివి విశేషాలు ఏవైనా ఉంటే చెప్పు.”

శ్రీ లలిత ఉత్తరాన్ని తన మనసులోనే చదువుకుంది! చరణ్ ఉత్తరాలు ఎలా ఉంటాయో ఆమెకి తెలుసు!

డియర్ లల్లీ!

ఈ పాటికి నీకు కొన్ని వాస్తవాలు తెలిసే ఉంటాయి! నిన్ను పెళ్ళాడింది, నీతో సంసారం చేసింది, సూర్య చరణ్ కాదని, వైభవ్ చరణ్ అని ! అయినా పేరులో ఏముంది లల్లీ, నేనేగా నీ చరణ్’ని!

లల్లీ! నే ప్రేమ ఎంత గాఢమైనదో  నాకు తెలుసు! అలాగే నా ప్రేమ కూడా అంతే లోతైనది డియర్! మన ఇద్దరిదీ అంటే నీది, నాదీ వెరశి, ‘అమర ప్రేమ’ లల్లీ! ఇలా వ్రాయడానికి నాకు సిగ్గు లేదని అనుకొంటున్నావా? నాకు తెలుసు, అలాగే భావిస్తున్నావు! కానినేను నిన్ను వదులుకో లేదని, అలాంటి ఉద్దేశం నాకు లేదని స్పష్టం చేస్తున్నాను. నువ్వు నమ్మినా, నమ్మక పోయినా సరే!  

మంజీర అనుభవించిన నరకం, ఆమె మానసిక స్థితి అబద్ధం కాదు డియర్! అది పదహారణాల నిజం. ఆమె నా విరహాన్ని 4 ఏళ్లు భరించింది! నువ్వు నాలుగు రోజులు కూడా భరించలేవేమో డియర్ !

అందుకే నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నువ్వు, నేను వేరు వేరుగా ఇలా విరహాన్ని అనుభవిస్తూ ఉండ వలసిన అవసరం లేదు!

శ్రీ లలిత, చరణ్, మంజీర కలసి, చిన్న రాజీ మార్గాన్ని అవలంబించి, హాయిగా కాలం గడిపే అవకాశం లేదంటావా? నేను, మంజీర దానికి సిద్ధమే! నీ నిర్ణయమే మహత్వపూర్ణమయినది! ఏమంటావు లల్లీ! నేను ద్రోహిని కాననీ రుజువు చేసుకొనే అవకాశం నాకు ఇవ్వవూ!

ఇంతకీ నేను చేసిన తప్పేమిటి? వ్యాపారంలో చిన్న అజాగ్రత్త వల్ల జైలు పాలు అయ్యాను! నా తల్లి, తండ్రి, అన్న విమాన ప్రమాదంలో పోయారు! విధి ఆడిన వికృత నాటకానికి బలి అయి పోయాను. నన్ను మరొక జైలుకి తరలించే ప్రయత్నంలో వెహికల్ డ్రైవరు అజాగ్రత్త వల్ల, లోయలో పడి పోలీసు డైరీలో చచ్చి, నిజ జీవితంలో బ్రతికాను! అలా బ్రతికి బయట పడ్డాక , క్రొత్త జీవితం మీద ఆశ పడడం తప్పంటావా? కేశవ్ నేను చని పోయాననే అనుకొన్నాడు, మంజీర ‘ఇప్పటి నీలాగే’ పారి పోయానని అనుకొంది! అలా అనుకొని వ్యసన పడి, మతి కోల్పోయింది!

నా పరిస్థితి ఆలోచించి చూడు డియర్! మతి తప్పిన భార్యని వెళ్లి ఓదార్చ లేను! నా రహస్య జీవితాన్ని నిజం చేసుకొనేందుకు ఆమె దరి చేరలేను! పోలీసుల నాగుపాము నీడ నుండి తప్పించు కోవాలంటే  మరొక సంసారాన్ని ఏర్పరుచుకోవాలి! అందుకే నిన్ను పెళ్లి చేసుకొన్నాను.

లల్లీ! నువ్వు నీ అపారమైన  నిష్కల్మషమైన ప్రేమతో నన్ను జయించావు. నా బ్రతుకులో వెన్నెలలు కురిపించావు. నా ఇంటిని అమరావతిని చేసావు. నా మనసుని రాగ రంజితం చేసావు. నీ తల్లి తండ్రులు నా తల్లి తండ్రులని మరపించారు. ఇక నీ అత్తలు, నీ బాబాయిలు అందరికందరూ నన్ను అభిమానంతో ఆదరించారు! ఇవన్నీ ఎలా మరచి పోగలను, ఎలా వారి ఋణం తీర్చుకోగలను!

నేను మోసగాన్ని కాను లల్లీ! అలోచించి చూస్తే నీకే తెలుస్తుంది. నాది మోసం కాదు, బ్రతుకు మీద ఆశ, నా మీద ఆశలు పెంచుకొని పిచ్చిదయిన ఒక స్త్రీని బ్రతికించాలనే ఆశ, నీతోను నీ బంధువులు అందరి తోనూ కలసి జీవించాలనే ఆశ!

లల్లీ! కాలం అన్ని గాయాలని మరిపిస్తుందని అంటారు. అది నా పట్ల , మంజీర పట్ల నిజమయింది! కాని దాని కోసం నేను, నీ ప్రేమ అనే అమూల్య సంపదని మూల్యంగా చెల్లించ వలసి వచ్చింది! కాని లల్లీ! ఇంతటితో కాలం ఆగి పోదు, నీకు కూడా న్యాయాన్ని అంద జేస్తుంది. కేవలం ఒక రాజీ మార్గం లల్లీ! ఆలోచంచి నిర్ణయం తీసుకో! అంతా మేలే జరుగుతుంది.

నేను సూర్య చరణ్ పేరుతోనే జీవిస్తున్నాను. అధికారికంగా నాభార్యవి నువ్వే లల్లీ! ఇందులో ఏ సందేహం లేదు! మంజీర కేవలం నా మాజీ ప్రియురాలు, పిచ్చిది! దానిపై దయ తలచు!

నువ్వు జవాబు ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తరువాత తెలుయజేస్తాను. ఈ ఉత్తరాన్ని నీ ఆయుధంగా వాడుకోవాలని చూడకు, ఎందుకంటే దీనిని నేను టైపు చేసాను, సంతకం చేయ లేదు!

నీ లాయరు చుట్టం, అతని పోలీసు, డిటెక్టివ్ మిత్రులు నన్నేమీ చేయలేరని తెలుసుకో! నేను ‘అండర్ గ్రౌండ్ డాన్’ని! నాకు మాఫియా మిత్రులు చాలా మంది ఉన్నారు. నేను కనుసైగ చేస్తే చాలు, ఎవరి నైనా హతమార్చ గలరు!

లల్లీ! ఇప్పుడు నీ దగ్గర మూడే ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది, రాజీ మార్గం! రెండవది సైలంట్ అయి పోయి, పరిత్యక్త లాగ కాలం గడపడం! మూడవది  అయిన  ప్రతీకారం అదే, నా మీద పగ తీర్చుకోవడం అనే దానిని మరచి పో! ఎందుకంటే అది సాధ్య పడదు!

ఎప్పటికీ నీ వాడే అయిన చరణ్!

“ఏం వ్రాసాడే, నీ మొగుడు?” అడిగింది మీనాక్షమ్మ.

“అమ్మా! మంజీరతో కలసి బ్రతకడానికి రాజీ పడమని వ్రాసారమ్మా!”

“ఏం చేస్తావే!ఎక్కడికో వెళ్లి, సవతితో రాజీ పడి, అబద్ధపు మనిషితో మోసపు బ్రతుకు బ్రతుకుతావా?”

“నన్ను ఆలోచించుకోనియ్యి!”
       
చరణ్ లేఖ చదివిన తరువాత, శ్రీ లలితలో మార్పు రావడం సాగర్ స్పష్టంగా గమనించాడు. ఆమె చెప్తుందేమో అని వేచి, చివరికి తనే అడిగాడు.“లలితా! ఉత్తరంలో ఏమి వ్రాసి ఉంది? అది చదవగానే ఆలోచనలో పడిపోయావు !”

“అదేమిటి బావా! నువ్వు ఆలోచనల్ని చదవగలవు కదా!”

“చదవగలను గాని...”

“చెప్తాను బావా! నీకు ఆ ఉత్తరాన్నే ఇస్తాను, చదవడానికి! కాని నాకు ఒక మాట ఇవ్వాలి.”

“ఏమిటి లలితా! ఆ మాట?”

“నువ్వు కొన్ని అతీంద్రియ శక్తులు నేర్చుకోన్నావు కదా? వాటిని నాకు నేర్పు!”

“చాలా సంతోషం లలితా! విద్యలు నేర్చుకొంటానని అన్నందుకు! భర్తతో వియోగం నిన్ను కృంగదీస్తుందని భయ పడ్డాను! ఏ విషయాన్ని అయినా నేర్చుకోవాలనే తపన, దుఃఖం పోగొడుతుంది. అందుకని తప్పక నేర్పుతాను, కాని ఎందుకో చెప్పలేదు!”

“ఇదుగో ఈ ఉత్తరం చదువు, ఇదే నన్ను నీ దగ్గర ఉన్న శక్తులని నేర్చుకోవడానికి ప్రేరేపించింది.” అంటూ ఆ ఉత్తరాన్ని సాగర్ చేతికి ఇచ్చింది శ్రీ లలిత.

సాగర్ దానిని చదివాడు, చదవగానే అతని కనుబొమలు ముడి పడ్డాయి. “చరణ్, చాలా తెలివైన వాడు లలితా! తన తప్పుని ఎలా సమర్థించుకొన్నాడో  గమనించావా?”

“గమనించాను, అసలు తన తప్పేమీ లేదన్నట్లు, తనని తాను డిఫెండ్ చేసుకొన్నాడు! అతను సూచిం చిన మూడో ఆప్షన్ నాకు నచ్చింది! ఇలాంటి వారికి గుణపాఠం నేర్పడమే సరి అయిన పద్ధతి”

“బ్రేవో! లలితా! మంచి నిర్ణయం తీసుకొన్నావు, మంజీర లాగ వేదనతో, విరహంతో క్రుంగి కృశించి పోకుండా గుణపాఠం నేర్పాలనే ఆలోచన కలిగినందుకు నిన్ను మెచ్చుకోవాలి! అయితే ఎలా ప్రొసీడ్ అవాలని భావిస్తున్నావు?”

“అతని దగ్గరకి వెళ్లి పోతాను! మొదటి ఆప్షన్ ఎంచుకొన్నట్లు అతనిని నమ్మిస్తాను. నీకు తెలిసిందే కదా నమ్మించి గొంతుక కోయడం అన్నిటి కన్న సులువైన పని అని! అదే చేయదలచుకొన్నాను. అమ్మా  నాన్నలకు ఈ విషయం చెప్పకు, వాళ్ళు నన్ను కదల నివ్వరు! ఆ పథకంలో భాగం గానే నీ దగ్గర అతీంద్రియ శక్తులు నేర్చుకొంటానని  అన్నాను.”

“గుడ్! నేను నేర్పుతాను, కాని  నీ దగ్గర పరిమిత సమయం ఉంది. మళ్లీ అతను పిలిచే లోగానే నువ్వు వాటిని నేర్చుకోవాలి!”

“రోజుకి నాలుగు గంటలు నిద్ర పొతే చాలు కదా బావా! నేను అలాగే నిద్రించి తక్కిన సమయం విద్యా భ్యాసం చేస్తాను.”

“అలాగే లలితా! ఎప్పుడూ మొదలు పెట్టమంటావు?”

“దానికి ఏమైనా ముహూర్తం కావాలా, బావా?”

సాగర్’కి శ్రీ లలిత అభిప్రాయం అర్థమయింది! “పద, దేవుణ్ని తలచుకొని సుఖాసనంలో కూర్చో! ఇప్పటికీ ఇప్పుడే మొదలు పెడతాను” అన్నాడు.

***********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద