3 వ ప్రకరణము:
మన కథకు సంబంధించిన కొన్ని గత చరిత్రాంశాలను ఇక్కడ
ఉదహరిస్తున్నా.
కౌండిన్య గోత్ర సంభవుడైన కమలేశ్వరుడనే వానికి ముగ్గురు
పిల్లలు.. పర్వత స్వామి, మేఘ
స్వామి, సౌదామిని.. కుత్స గోత్ర సంభవుడైన
శివనాథుడు సౌదామిని భర్త.
పర్వత స్వామి తపోబలం వల్ల దివ్య క్షాత్రతేజాన్ని పొంది, జ్వలించాడు. ఆంధ్రేశ్వరుడైన కాకుల
నాగేంద్రుడును,
చిత్రకూటేశ్వరుడైన మందనాథ
నాగేంద్రుడును,
మగధ రాజ మహాపద్మనందునిచే
ఓడింపబడిన పిమ్మట ఆంధ్ర చిత్రకూట రాష్ట్రాలను మగధుల నుండి లాగుకొని, క్రొత్త రాజవంశాన్ని స్థాపించాడు పర్వత స్వామి. ఈ
కార్యంలో వానికి మేఘ స్వామి , శివనాధుడు
సహాయం చేసారు.
పర్వత స్వామి ఆంధ్ర సింహాసనాన్ని
అధిష్టించాడు. తన తమ్ముడు మేఘ
స్వామిని చిత్రకూట రాష్ట్రంలో
మాండలిక రాజుగా నిలిపాడు. ఈ కాలపు పశ్చిమ గోదావరి , కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, జిల్లాలే అప్పుడు పర్వత స్వామి
వశపరచుకొన్న ఆంధ్ర రాజ్యం. దాని రాజధాని కృష్ణాతీరం లోని శ్రీకాకుళ నగరం.
దానిని కట్టించిన వాడు కాకుళుడు కాబట్టి దానికా పేరు వచ్చింది.
ఈ కాలపు బస్తరు, జయపుర
సంస్థానాలే ఇంచుమించుగా అప్పటి చిత్రకూట రాష్ట్రం. ఇంద్రావతీ నదీతీరం లోని చిత్రకూట
నగరం దానికి రాజధాని. రాజధాని నామం చేత రాష్ట్ర నామం ప్రసిధ్ధికి వచ్చింది.
పర్వత స్వామికి తన ఏలుబడి కడపటి రోజుల్లో, కుంతలేశ్వరుడైన అనంత సేనునితో ఘోర
యుధ్ధం తటస్థించింది. ఆ సంగ్రామంలో అనంత సేనుడు ఓడిపోయి సంధి చేసుకొన్నాడు. ఆ సంధి
ప్రకారంగా పర్వత స్వామికి తన
రాజ్యంలో కొంత
భాగం ఇచ్చుకోవలసి వచ్చింది.
ఇంచుమించుగా ఇప్పటి రాయలసీమయే ఆ ప్రదేశంగా ఉండింది. ఆ ప్రదేశాన్ని ఒక మాండలిక
రాజ్యంగా చేసి,
తన భగినీపతి శివనాథుని
మాండలిక రాజుగా స్థాపించాడు పర్వత స్వామి.
మన కథాకాలంలో శివనాధ పుత్రుడు సత్యకర్మ అచ్చట
మహామండలేశ్వరునిగా,
మహానంది పురంలో ఉన్నాడు.
పర్వత స్వామి ఇరువది
సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యం చేసి, కీర్తి
శేషుడయ్యాడు.వాని అనంతరం వాని
ఏకైక పుత్రుడు సుచంద్రుడు ఆంధ్ర సామ్రాజ్య సింహాసనాన్ని అలంకరించాడు. అతనికి
తండ్రి కూర్చిన
భార్య – సేనాపతి వాధూల రణంధరుని కొమారితె చారుమతి.
పట్టాభిషేకానంతరం
తాను ప్రేమించి పెండ్లియాడిన రమణి, గౌతమ సునందుని కూతురు లీలావతి. శక్తిధరుడను
కుమారుడు, రథినీ అను కుమారియును
సుచంద్రునికి చారుమతి యందు కలిగినారు. లీలావతి వడసిన పుత్రుడు భోగనాధుడు.
వాడు శక్తిధరుని కన్న కొన్ని మాసములే పెద్ద. రథిని శక్తిధరుని కంటె రెండేళ్లు
చిన్నది. మన కథాకాలానికి రథిని పదునెనిమిది సంవత్సరాల ప్రౌఢ.
చారుమతీ దేవి శైశవ ప్రాయం లోనే గతించింది. పార్థివుని
అనుమతిచే చారుమతి పిల్లలను మాతామహ దంపతులు పెంచారు. మన కథారంభ కాలంలో రాజ
ప్రసాదానికి వచ్చేసాడు. రథినీ కుమారి మాత్రం ఇంకా తాత గారింటి లోనే ఉంది.ఆ విషయంలో
రణంధరుని అనురోధమే కారణం కాని సుచంద్రుని ఉపేక్ష ఏమియు లేదు.
మేఘ స్వామికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సూర్యప్రభ, చిన్న భార్య చంద్రప్రభ. సూర్యప్రభ
కనిన కూతురు శాంతి సేన. చంద్రప్రభ పెంచిన అపవిధ్ధ పుత్రుడు వీరేశ్వరుడు. లీలావతీ దేవి
చెల్లెలు పద్మావతి వీరేశ్వరుని భార్య. ఆంగీరస విమలుడు శాంతి సేన భర్త. ఇతడు మహా
వీరుడే గాని ఎట్టి రాజ వంశానికిని చెందినవాడు కాడు.
మన కథారంభ కాలంలో వీరేశ్వరుడు చిత్రకూట మండలేశ్వరునిగా
ఉన్నాడు. అతని కుమారుడు రణేశ్వరుడు శ్రీకాకుళంలో రాజకీయ సేన యందు దండ నాయకునిగా
పని చేస్తున్నాడు.
మేఘస్వామి అనంతరం తన నుల్లంఘించి, అతని అపవిధ్ధ పుత్రునికి
సింహాసనాన్ని ఇచ్చివేసినందున అలిగి శాంతిసేన తన భర్తతో కూడా రాజధాని విడిచి పరారి
అయింది. ఆమెకు విదేశంలో పూర్ణ అను ఒక కుమార్తె కలిగిందట. శాంతిసేనా విమలులు రాజధానిని విడిచినది మొదలు
ఎచ్చట ఉన్నదీ ఎవరికీ తెలియదు. వారి పిల్ల పూర్ణను గురించి కూడా తెలియలేదు. ఆ
మువ్వురి గురించి కల్పిత కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి.
మహారాజ సుచంద్రునికి లీలావతీ దేవిపై అనురాగం ఎక్కువ. ఆ
అవకాశాన్ని ఆమె తీసుకొని రాజకార్యాల్లో హస్తక్షేపం చేస్తూండేది. ప్రేమ వశంవదుడయిన నరపతి తన ప్రేయసి కెదురాడలేక ఆమె
మతాన్ని అనుసరించే ప్రాయికంగా రాజ కార్యాలను చేస్తూ ఉన్నాడు. లీలావతీ దేవి తండ్రి
సునందుడే మహామంత్రి కాబట్టి, రాజకీయ
నిబంధనం ఆమె చర్యలకు అడ్డుపడ జాలకుండెను.
ఆ రాజకీయ నిబంధనం ఎట్టిది? మహారాజును, మహామంత్రియు, నిర్ధారణీయ విషయ శాఖా మంత్రియు
చేరిన మువ్వురి సభకి రాజకులం అని పేరు. రాజకులమే కార్యనిర్వాహక ప్రభుత్వము
రాజకులంలో ఇద్దరు మంత్రులు ఐకమత్యంతో చేసిన సూచనను మహారాజు తిరస్కరించ గూడదు. కాని మంత్రులు
భిన్నాభిప్రాయులయి నప్పుడు మహారాజు తనకు సమ్మతమైన మంత్రి మతంతో
ఏకీభవించి
కార్యాన్ని అమలు పరచ
వచ్చును. మహారాజ
మహామంత్రులు తన వశ
వర్తులైనందున
లీలావతి చెప్పినట్లు
ప్రభుత్వం ఆడుతూ ఉండేది.
సుచంద్రుని రెండవ రాజ్య వర్షమున మేఘస్వామి
స్వర్గస్థు డయ్యాడు. కాబట్టి చిత్రకూట రాష్ట్ర సింహాసనోత్త రాధికారి సమస్య ప్రభుత్వ దృష్టికి వచ్చింది. శాఖా మంత్రి
మహాప్రాడ్వివాక హరీత సత్యవ్రతుడు, శాంతిసేనయే
ఉత్తరాధికారిణి అని వాదించాడు. మహారాజు లీలావతి ప్రేరితుడై మహామంత్రి
మతంతో ఏకీభవించి,
అపవిధ్ధ పుత్రునికి
అనుకూలంగా నిర్ణయం చేసాడు! అపవిధ్ధ పుత్రుడు లీలావతీ దేవి చెల్లెలి భర్త అన్న విషయం పాఠకులు గ్రహించాలి!
సుచంద్రునికి అయిదవ రాజ్య
వర్షంలో చారుమతీ వియోగం తటస్థించింది. ఆ
దుఃఖము ఆరిపోక ముందే కళింగేశ్వరుడు శృతసేనుడు ఆంధ్రరాష్ట్రంపై
దండెత్తాడు. సుచంద్రుడు నిర్భయంగా ఆ దండయాత్రను ఎదుర్కొన్నాడు. ఆ యుధ్ధంలో
సుచంద్రుడే జయించాడు. ఆ జయం వల్ల ఆంధ్ర చిత్రకూట రాష్ట్రముల సంధిలో ఉన్న వన
ప్రదేశాలు సుచంద్రుని వశమయ్యాయి. అవి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకో బడ్డాయి. క్రొత్తగా
చేరిన ఆ కొండల ప్రాంతానికి పార్వతీయ ప్రాంతమని పేరు పెట్టబడింది.
పర్వత స్వామి కాలమందు స్థాపించబడిన శస్త్ర శాస్త్ర విద్యా గురుకులాలు రెండును సుచంద్రుని సాదర పోషణ క్రింద మిక్కిలి అభివృధ్ధి పొందాయి.
కౌండిన్య విషమ సిధ్ధి శస్త్ర
విద్యా గురుకులానికిని, భారద్వాజ
భావనంది శస్త్ర విద్యా గురుకులానికిని ఆచార్యులుగా ఉన్నారు.
తక్కిన సుచంద్రుని రాజకీయ చరిత్రలో ఏ పుటను చూసినా లీలావత్యారాధనా విశేషాలే కనిపిస్తాయి.శ్రీకాకుళ నగర సంస్కరణ , అంతః
పుర వైభవాతిశయం , అనేక రమణీయోద్యాన ప్రతిష్ట, స్త్రీ విద్యా గురుకుల స్థాపనం లీలావతి ఏలుబడిలో ప్రశంసింప
తగినవి. సుచందుని కాలంలో పర్వతస్వామి
కాలం నాటి కంటె
ప్రజలపై ఎక్కువ
పన్నులు వేయబడ్డాయి.ఈ పన్నుల వల్ల వచ్చే ఆదాయం చేతనే నగర సంస్కరణాది కార్యాలు చేయ బడ్డాయి.కార్యానంతరం
రాజు పన్నులు తగ్గించ వలసి వున్నది. కాని రాణి లీలావతీ దేవి దానికడ్డుపడి కానిచ్చింది కాదు. అందువలన సాధారణ ప్రజలు సుచంద్రుని
పరిపాలనాన్ని
అంతగా మెచ్చుకోలేక పోయారు.
ప్రేమ పరతంత్రుడైన ఆ రాజేంద్రుని రాజకీయ చరిత్ర ఎలాగున్నా
వ్యక్తిగత చరిత్ర మాత్రం నిర్దుష్టం ! నిర్దుష్టమే కాక ఉదారం కూడ !
రాజ దంపతులు స్థాపించిన స్త్రీ విద్యా గురుకులానికి
పరివ్రాజిక శుభ్రాంగి ఆచార్యురాలు.
ఈమె భర్తృ వియోగా నంతరం పరివ్రాజిక అయింది. ఆమె కుమారుడు ఇప్పుడు బ్రహ్మ కుల
పరిషత్పతిగా ఉన్నాడు, అతని
పేరు ధర్మ పాలుడు.
మన కథారంభ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో పరంతప సంఘమనే విప్లవ
సంఘము ఉదయించింది. నిశుంభుడనే నాగేంద్రుడు ఆ సంఘానికి అధినేతగా ఉన్నాడని
వినికిడి.వాడు గత
చిత్రకూటేశ్వరుడైన
మంథనాధుని పౌత్రుడు ! ఆ సంఘము భయంకర చోర కృత్యాదులచే రాష్ట్రంలోని శ్రీమంతులకు నిత్య
భయదాయకంగా ఉంది.సంఘ సేన సంఖ్య దిన దిన ప్రవర్థమానంగా ఉందని వదంతి. ఆ
సంఘస్ఠులు ప్రాయికంగా నాగులు., రాజ్యాక్రమణమే వారి ఉద్దేశము !
ఇంచు మించుగా పరంతప సంఘోత్పత్తి కాలం లోనే, శివంకర సంఘమనే ఒక దేశాభిమాన సంఘం
రాష్ట్రంలో పుట్టింది. అది విప్లవ చేష్టలు చేయక పోయినా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ
రాజ్యంలో ఆందోళన లేవ దీసింది.దానిలో అధిక సంఖ్యాకులు బ్రాహ్మణులు. వారిలో చాలమంది
వీరులు కూడా ఉన్నారు. ఆ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్య క్షత్రియులు అరుదు బ్రాహ్మణులలో చాల మంది శస్త్ర విద్యలను అభ్యసించి , వీరులై రాష్ట్రంలో ఆర్యుల
పురాతన వీర కీర్తిని పోషించు చున్నారు. ప్రభుత్వాన్ని సంస్కరించడమే శివంకర
సంఘ లక్ష్యం. గజ వీరుడనే బ్రాహ్మణ వీరుడు సివంకర సంఘ నేతగా ఉన్నాడని వదంతి. అతనిని
చూసిన వారు మాత్రం ఎవరునూ లేరు.శివంకర సంఘాన్ని కూడా ప్రభుత్వం విప్లవ సంఘంగా
ప్రకటించింది.
4 వ ప్రకరణం
సత్యప్రభ వీరసింహుని పొడిచిన
నాటి రాత్రి మహారాజు సుచంద్రుని సన్నిధానంలో సచివుడు (అంతరంగ మంత్రి) రూప
చంద్రుడు, పార్థివుని పేర వచ్చిన మూడు జాబులను చదివి వినిపించాడు. మహామంత్రి
సునందుడు కూడా సన్నిహితుడై ఉన్నాడు.
అది ప్రాసాదావరణ లోని సప్త భూమిక విమానం పంచమ భూమిక.
అక్కడే రాజకులం కూడుతుంది. ఆ భూమికలో పడమరన పుస్తకాలయం ఉంది. మధ్య శాలలో మధ్యభాగము
నందు పర్వత స్వామి భట్టారకుల శిలా
విగ్రహం కలదు. తక్కిన భాగమంతా వ్యాఘ్ర చర్మాస్తరణముతో భీషణంగా
కనిపిస్తుంది. తూర్పు గది ఆలోచనా మందిరం. అందు మూడు సమున్నతాసనములు ఉన్నాయి.
మహారాజు కూర్చుండు కనకాసనం ఉత్తర ముఖంగా ఉంది. దాని కెదురుగా ఇరువైపులా రెండు
రజతాసనములు ఉన్నాయి. దక్షిణ పార్శ్వమున పశ్చిమాభిముఖంగా
మహామంత్రి
ఆసనముంది. వామ పార్శ్వమున పూర్వాభిముఖంగా శాఖా
మంత్రి ఆసనముంది. ఆసనములన్నీ పట్టు పరుపుల తోను, పట్టు దిండ్లతోను సుఖోపవేశనార్హములై శోభిస్తునాయి. నేలంతా రత్న కంబళం
పరచి ఉన్నది. రాజాసనము దిగువున పాద పీఠం కలదు.
మహారాజు సుచంద్రుడు సుమారేబదేండ్ల వయసు కలవాడు. సర్వకృష్ణ
కేశుడై, పటిష్ట కాయుడై, యువకుని వలె కన్పడుతున్నాడు.
వ్యక్తి పక్షపాతంచే కాబోలు సౌందర్య కళ
అతనిని విడువ కుండ ఉంది. అతడు సార్థక నాముడై ధవళ ప్రభతో వెలుగుతున్నాడు. అతడు
తండ్రికి సమానమైన రాజనీత్యభిఙ్ఞుడు కాకపోయినా, తండ్రిని మించిన మహా వీరుడు. అతనికి పరమ శత్రువైన కుంతలాశ్మక, దక్షిణ కోసల, కళింగేశ్వరులు సీమోల్లంఘన చేయజాల కుండుట అతని పరాక్రమానికి
భయపడినందు వలన అని చెప్పవచ్చు. కాంతా ప్రీతి, జీవ
కారుణ్యము -ఇవే ఆ నరపతి లోపాలని నయవేత్తలలో అగ్రగణ్యుడైన దూత సామంతుడు
(విదేశాంగ మంత్రి) భార్గవ విశాలాక్షుడు చెప్పడం కద్దు. వృధా రక్త పాతం
కూడదనే, అతడు జైత్ర యాత్రలకు పూనుకోలేదు.
మహామంత్రి అరవై అయిదు సంవత్సరాల వృధ్ధుడు. సర్వ పలిత కేశుడు, సువర్ణ కాయుడు. అతడు తన కుమార్తె
లీలావతీ దేవి చేతి కీలుబొమ్మగా ఉన్నప్పటికీ, ఆమె మతాన్ని రాజకులంలో సాధించడానికి కావలసిన యుక్తి ప్రయుక్తులను
అల్లడంలో అసాధ్యుడే అగును. పరోపకార గంధ వర్జితుడైనా, గర్వ వర్జితుడు. మహా సంపన్నుడైనా నిరాడంబరుడు.
శౌర్యమావంతయు లేని కార్యవాది, పేరు
పడ్డ ద్రవ్య రక్షకుడు.
సచివుడు రూపచంద్రుడు రాజాంతఃకరణ ఎరింగి నడుచు కొనడంలో, మహా నిపుణుడు. అతని తండ్రి
గవల్గణుడు పర్వత స్వామి భట్టారకుని యొద్దను, సుచంద్ర
భట్టారకుని సన్నిధానం లోను, అనేక
సంవత్సరాలు పని చేసి, మిక్కిలి
పేరు సంపాదించుకొన్న రాజనీతిఙ్ఞుడు. రూపచంద్రుడు కూడ తండ్రితో సమానుడు. కులంలో వీరు
సూతులు. సూత జాతీయులను అంతరంగ మంత్రులుగా ఉంచుకొనడం
ప్రాచీన నరపతుల ఆచారం కాబోలు. దశరథుని అంతరంగ మంత్రి సుమంత్రుడును, ధృతరాష్ట్రుని అంతరంగ మంత్రి సంజయుడును సూతులే కదా! రూపచంద్రుని వయస్సు ముఫ్ఫై అయిదు సంవత్సరాలు.
రూపంలో ఇతడు అన్వర్థ నాముడు.
మహారాజు మహామంత్రులు కూర్చొని ఉన్నారు. సచివుడు లేచి
జాబులు చదువుతున్నాడు.
మొదటి జాబు.
“మహారాజ
కౌండిన్య సుచంద్రునకు-
పరంతప సంఘ నాయకుడు కార్కోటక నిశంభువు స్నేహ పూర్వకంగా వ్రాసుకొన్న లేఖ,
మా పితామహుడు మహారాజ మందనాథుడును, మా మేనత్త భర్త
మహారాజ కాకులుడును శతృ వశీకృతులై ఉండిన ఛిద్రంలో మీ
తండ్రి పర్వత స్వామి వారి రాష్ట్రాలను ఆక్రమించుకొన్నాడు. ఆ నష్ట రాజ్యాలను తిరిగి
సంపాదించుకోవడానికి,
నేనున్నూ, కాకుల మహారాజ వంశంలో పరిశిష్టయై నిలిచి ఉన్న అతని
దౌహిత్రి ఇరావతిన్నీ, కలిసి పరంతప సంఘాన్ని
స్థాపించితిమి. ఆ నష్ట రాజ్యాలను
పొందడానికి తగిన బలం మాకుందని ఋజువు పరచడానికి మేమిద్దరం సిధ్ధంగా ఉన్నారము.
అయినప్పటికిని సర్వ జాతులకును సమాన పూజ్యుడైన భగవాన్ జటాముని “సుచంద్రునితో నీవు సంధి చేసుకో” అని నన్నాఙ్ఞాపించారు కాబట్టి, మేము మా లక్ష్యాల్లో నుంచి చాల వరకు
తగ్గి ఆచరణ సాధ్యమైన సంధిమార్గాన్ని మీ
ప్రభుత్వానికి సూచించుతున్నాము. మేము ఈ క్రింది సంధి షరతులను సూచించు చున్నాము.
౧. మా మాతామహుని చిత్రకూట రాష్ట్రాన్ని నాకు తిరిగి స్వతంత్రంగా ఇచ్చివేయవలెను.
౨. మీరు కళింగుల నుండి జయించిన పార్వతీయ ప్రాంతాన్ని కాకుల
దౌహిత్రి ఇరావతీ కుమారికి స్వతంత్ర రాష్ట్రంగా ఇచ్చివేయవలెను.
౩. ఆంధ్ర రాష్ట్రంలో
మీ తండ్రిగారి కాలం నాటి కంటె మీరు
అధికంగా వేసిన పన్నులను తీసివేయవలెను.
ఈ సంధి నియమాలను మీరు అంగీకరించినప్పుడు మేము మీతో సంపూర్ణముగా
విరోధాన్ని విడిచి మిత్రులుగా ఉందగల వారము. మా సంధి సూచనలను తిరస్కరించునెడల భయంకరమైన మా శత్రుత్వానికి కుండినుల ప్రభుత్వం గురి కాగలదు.
శ్రీ జటాముని శిష్యురాలైన యోగీశ్వరి ధవళాక్షి ఈ సంధి
రాయబారంలో ఉభయ పక్షాలకు దూతగా ఉండడానికి అంగీకరించింది. కాబట్టి మీ ప్రత్యుత్తరాన్ని
ఆమెకు అందజేస్తే మాకు మీ అభిప్రాయం తెలుస్తుంది.
చిత్తగించవలెను.
విజయ సంవత్సర జ్యేష్ట
శుధ్ధ పంచమీ భానువారము.
కార్కోటక నిశంభువు వ్రాలు.”
రెండవ జాబు.
“మహారాజ
పరమేశ్వర శ్రీ కౌండిన సుచంద్ర భట్టారకుల వారి దివ్య సన్నిధికి –
శివంకర సంఘ నాయకుడు ఆంగీరస గజవీరుడు వినయ పూర్వకంగా
వ్రాసుకొన్న విఙ్ఞప్తి. శ్రీవారు స్వయంగా రాజకార్యాల పట్ల తగినంత శ్రధ్ధ తీసుకొనక
పోవడం వల్ల, మహామంత్రి రాష్ట్రాన్ని నిరంకుశంగా
ఏలుతున్నాడు. స్వార్థపరుడున్నూ, ప్రజాహిత
చింత లేని వాడున్నూ,
లంచగొండిన్నీ అయిన అతని
ఏలుబడిలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని సహింపకయే శ్రీవారి దయగల
శ్రోత్రాలకి ఎక్కునట్లు సక్రమాందోళన చేయడానికి దేశం పైనా, కుండిన వంశాధికారం పైనా భక్తి గల
ఆంధ్ర యువకులచే మా శివంకర సంఘం స్థాపించబడింది.
మహామంత్రి అట్టి సంఘాన్ని విప్లవ సంఘంగా ప్రకటింప
చేసినాడు. ఇప్పుడు మా సంఘస్థులు ఎలాంటి నేరాలను చేయక పోయినప్పటికిన్నీ, మమ్మల్ని కనిపెట్టి మా ప్రాణాలను
ఉరికంబాలకు అప్పగించడానికి, మహామంత్రి
కుమారుడు రాష్ట్రీయుడు (పోలీసు మంత్రి) వీరనందుడు సర్వ విధములచే ప్రయత్నించు చున్నాడు. ఆ ప్రయత్నంలో
ఎప్పుడైనా సంఘర్షణ ఏర్పడ వచ్చును. అప్పుడు
మేము మా ఆత్మ రక్షణ కొరకు అవలంబింప బోవు
ప్రతిఘటన వలన శ్రీవారి రక్షక జనులకు గాని నష్టం ఏమైనా కలిగే పక్షంలో దానికి మేము భాద్యులము
కాజాలం. మా మొరలను ఆలకించడానికి శ్రీవారి దయగల చిత్తానికి ఇష్టమున్నచో, శ్రీవారిచే ఆఙ్ఞాపించబడు స్థలానికి
మా ప్రతినిథిని నిరాయుధునిగా పంపగలం. ఈ విషయంలో మా పక్షానికి దూతగా ఉండడానికి కాణ్వ
శుకనాసుడు అంగీకరించినాడు. కాన శ్రీవారు మా ప్రతినిధితో మాట్లాడడానికి అంగీకారం
ఉన్నదీ లేనిదీ తెలియ జేయ గోరుతున్నారము.
చిత్తగించ వలెను.
విజయ సంవత్సర జ్యేష్ట
శుధ్ధ పంచమీ భానువారము.
ఆంగీరస గజవీరుడు వ్రాలు.”
మూడవ జాబు.
“మహారాజ
పరమేశ్వర శ్రీ కౌండిన్య సుచంద్ర భట్టరకుల
వారి భ్రాతృ చరణ సన్నిధికి,
చెల్లెలు కీర్తిశేష మహామండలేశ్వర
శ్రీ కౌండిన్య మేఘస్వామి భట్టారకుల వారి కుమార్తె శాంతిసేన నమస్కార పూర్వకంగా వ్రాయు విఙ్ఞాపనము.
తమ ప్రభుత్వం నన్నుల్లంఘించి
మా పినతల్లి చంద్రప్రభా దేవి పెంచిన అపవిధ్ధ పుత్రునికి సింహాసన మిప్పించి
వేసింది. అది అన్యాయమనే నా అంతరాత్మ చెప్పుతున్నప్పటికీ
నా పూజ్య సోదరి ఆఙ్ఞను ఉల్లంఘించ నేరక వీరేశ్వరుని
దారి నుండి తొలగి పోయాను. గౌతముల ఇంటి పిల్ల (సునంద పుత్రి) చిత్రకూట ప్రాసాదంలో తన అక్కయ్య విజయ పతాక వలె ఆడుతున్నది. కుండినుల
ఇంటి పిల్ల తన అన్నయ్య చేతగాని తనానికి దృష్టాంత భూతురాలై
అతని యశోంధకార మధ్యలో ప్రఛ్ఛన్నయై కూలబడి ఉంది.
ఆమరణాంతం ఎవరికిని తెలియకుండా తన ఆయుశ్శేషాన్ని గడపాలని ఉద్దేశించింది. కాని ఈ
మధ్య ఒక సమాచారం తెలిసింది. కాబట్టి
ఉండబట్టలేక తిరిగి రాజకీయ రంగంలో దూకింది.
పరమ భట్టారక! ఆ సమాచారాన్ని మీ చరణ సన్నిధిలో నివేదించుట
యుక్తమని నేను తలంచాను. మా పినతల్లి పెంచిన
కుమారుడు వాస్తవంగా దయాపాత్రుడైన అపవిధ్ధుడు కాదట! చంద్రప్రభా దేవి ప్రేరణ వల్ల
ఆమె చెల్లెలు చంద్రముఖి తనకప్పుడే జన్మించివున్న శిశువుని ఒకచోట పారవేసిందట! ఆ శిశువుని చూచి
దయార్ద్ర హృదయ భావాన్ని నటిస్తూ, తాను
(చంద్రప్రభా దేవి) తన భర్త మనసును కరిగించి, ఆ మగ
శిశువును అపవిధ్ధ పుత్రునిగా పెంచుకొన్నాదట! ఈ గూఢమైన మోసాన్ని రుజువు పరచుకోతగ్గ ఆధారాలు మాకున్నాయి. కాబట్టి శ్రీవారు న్యాయం పట్ల పక్షపాతం వహించి, ఈ విషయాన్ని పునః న్యాయస్థానంలో
విచారణ చేసి, నాకు న్యాయం కలుగ జేస్తారని, ఆశిస్తున్నాను. తమరు గాని మా
విన్నపాన్ని పెడచెవిని పెట్టినప్పుడు, కుండినుల
కులపుత్రి శాంతిసేన ఊరకుండుటకు నిశ్చయించుకొన లేదు.
మోసగత్తె అయిన సవతి తల్లి రహస్యముగ తీసుకొని
వచ్చిన కుమారుని తన తల్లి తండ్రుల ఇంటికి గెంటివేయుటకు నా భర్త తోను, రాజభక్తులగు చిత్రకూట రాష్ట్ర
వీరులతోను కలసి,
నేను ప్రయత్నించి తీరెదను.
అనంతరము జయించిన మా కత్తులతో మేము మా సార్వభౌమునికి సేవచేయగల
వారము!
అన్నయ్యా! శ్రీవారి
కొక మేనకోడలున్నది. ఆ పిల్ల నమస్కారాలు నా ద్వారా తన మామయ్యకు అందజేయ
బడుతున్నది.
అన్నయ్య పంపవలసిన సందేశమును బ్రహ్మకుల పరిషత్పతి కౌండిన్య ధర్మపాలుని వద్దకు పంపిన నా కందును.
చిత్తగించ వలెను.
విజయ సంవత్సర జ్యేష్ట
శుధ్ధ పంచమీ భానువారము.
ఆంగీరస్సుల కులస్నుష శాంతిసేన వ్రాలు.”
Comments
Post a Comment